రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, మే 2014, గురువారం

రివ్యూ..

రీమేకు – రీజనింగ్
ఏం చెప్పాలనుకున్నారో మిస్టరీ!


రచన- దర్శకత్వం : శేఖర్  కమ్ముల
తారాగణం : నయనతార, వైభవ, పశుపతి, హర్షవర్ధన్ రాణే ,నరేష్ తదితరులు
సంగీతం : ఎం ఎం కీరవాణి,  ఛాయాగ్రహణం : విజయ్ సి. కుమార్,  ఎడిటింగ్ : మార్తాండ్ కే. వెంకటేష్
బ్యానర్ : వయాకాం 18, లాగ్ లైన్ ప్రొడక్షన్స్
విడుదల : మే 1, 2014      సెన్సార్ : U/A
***
సొంత రచన కాస్సేపాపి, 2012 లో హిందీలో  విజయవంతమైన ‘కహానీ’ మీద ఎనలేని మక్కువ పెంచుకుని శేఖర్ కమ్ముల తెలుగులో రీమేక్ చేసిన ‘అనామిక’ ఎట్టకేలకు విడుదలైంది. రీమేకు నిర్వచనాన్నే తిరగరాస్తూ, ఒరిజినల్ చూసి వున్న ప్రేక్షకులకి సైతం సరికొత్త అనుభూతులనిచ్చే   ‘కహానీ’ చెప్పాలన్న తపనతో కమ్ముల  పాల్పడిన సృజనాత్మక స్వేచ్చ ఎంత శోభ నిచ్చిందో, కళాత్మకంగా తనదైన ముద్ర వేయడంలోనూ అంతే సొగసుగా నిల్చింది. ఫీల్ గుడ్ సినిమా రధసారధి కాస్తా తనదికాని మిస్టరీ/సస్పెన్స్ థ్రిల్లర్ ప్రాంగణంలోకి తొలిసారిగా అడుగెట్టి నిరూపించుకోవాలనుకున్న ప్రతిభ ఏ మేరకు ప్రభవించిందో, చెప్పాలనుకున్న విషయం ఆ మేరా అంతే ప్రకాశించింది. అసలే కురచ కాన్సెప్ట్ తో  ఎలాగో బాక్సాఫీసు గట్టెక్కగల్గిన ‘కహానీ’ కథని తిరగరాసి కొత్త బాక్సాఫీసు మంత్రానికి ఎలా వూపిరులూదాలనుకున్నారో, అలా తెలుగు ప్రేక్షకుల మనోభావాలనీ శాసించీ కూర్చోబెట్టాలనుకున్నారు.

సింపుల్ గా చెప్పాలంటే ఏ తెలుగు ప్రేక్షకుల సువిశాల అప్పీల్ నిమిత్తం అనుకుంటూ  నయనతార పాత్ర  చిత్రణని మార్చేశారో, అదే చివరికి యాంటీ సెంటిమెంటల్ వురితాడు కి వేలాడాల్సి వచ్చింది!

ఇకపోతే, టెర్రరిజం మీద తెలుగులో వచ్చే సినిమాలన్నీ విశ్వసనీయత లేని అపరిపక్వ చిత్రీకరణలుగా ఎందుకుంటు న్నాయో ఎవరికి  వాళ్ళే ప్రశ్నించుకోవాలి.  ఈ సినిమా ఒరిజినల్ లో లేని టెర్రరిజం  నేపధ్యాన్ని తెలుగులో ఇంత గందరగోళంగా చూపించనవసరం లేదేమో!

2. ఆమె మానవతా దృక్పథం అమోఘమే కానీ..
విదేశాలనుంచి ఒక వివాహిత వస్తుంది. పేరు అనామిక (నయనతార). ఓల్డ్ సిటీ లోని ఓ పోలీస్ స్టేషన్ కెళ్ళి భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. నగరంలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే)  రెండువారాలుగా రెస్పాండ్ కావడం లేదని పోలీసులకి చెప్తుంది. ఓల్డ్ సిటీలోనే గెలాక్సీ హోటల్లో వుండే వాడని వివరాలందిస్తుంది. ఏఎస్సై  పార్ధసారధి (వైభవ్) కేసు తీసుకుని ఆమెతో కలిసి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అదే గెలాక్సీ హోటల్లో దిగుతుందామె. సారధితో కలిసి భర్తని అన్వేషిస్తూంటే, ఈమె కలిసిన వ్యక్తులు ఒకరొకరే హత్యకి గురవుతూంటారు.  ఒక మౌలానా, ఇంకో సర్కిల్ ఇన్స్ పెక్టరూ  చనిపోతారు. హంతకుడు ఈమె మీద కూడా హత్యాయత్నం చేస్తాడు. అతణ్ణి కాల్చేస్తుందామె.  అతని దగ్గర దొరికిన ఒక హార్డ్ డిస్కు దాచేస్తుంది. ఆ డిస్కులో ఏముంది? దాని కోసం ఇంకో పోలీసు అధికారి అమ్జద్ అలీ ఖాన్ (పశుపతి) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? దాంతో హోం మంత్రి (నరేష్) కి సంబంధ మేమిటి? ఇంతకీ అనామిక వెతుకుతున్న భర్త అజయ్, తొమ్మిది నెలల క్రితం నగరంలో బాంబులు పేల్చి  వందలమంది చావుకి కారకుడైన మిలింద్ దామ్జీ పోలికలతో ఎందుకున్నాడు? ఇప్పుడేం చేసింది  అనామిక?

ఇదీ కథ. ఈమె ఏం చేసిందనేది చెప్పుకోవాల్సి వస్తే, గొప్ప మానవతా దృక్పథాన్నే ప్రదర్శించింది. వందలమంది ప్రాణాల్ని బలిగొన్న ‘టెర్రరిస్టు’ని  పట్టుకుని శిక్షించాలన్న విశాల దృక్పథంతో వచ్చి పని పూర్తి చేసింది. హిందీ ఒరిజినల్ లోని హీరోయిన్ కి లేని విశాల దృక్పథ మిది. అయితే... అయితే...ఈ క్రమంలో తాను  దర్శకుడి తెచ్చి పెట్టుకున్న విజన్ కి  బందీ అయిపోవడంవల్ల బాక్సాఫీసు అప్పీల్ కి కూడని పని చేసేసింది. దీనిగురించి ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో విపులంగా తెలుసుకుందాం.

సాంకేతికాల  సరిగమలు..

అనామిక  పాత్రలో నయనతార ఎప్పుడూ సీరియస్ గానే కన్పించడంతో డార్క్ మూడ్ క్రియేటయ్యే అగత్యమేర్పడింది. ‘కహానీ’లో విద్యా బాలన్ పోషించినలాంటి రిలీఫ్ ఓరియెంటెడ్ క్యారక్టర్ కాదిది. ఇక్కడ గమనించాల్సిన దర్శకుడి ముఖ్యమైన క్రియేటివ్ పంథా ఏమిటంటే, నేపధ్య  వాతావరణంలో కథ తాలూకు డార్క్ మూడ్ విష్పష్టంగా వ్యక్త మయ్యేందుకు  ఎక్కడా కృత్రిమ లైటింగ్ వాడని  స్కీముతో కెమెరా పనితనం వుంటుంది. ఈ  బ్యాక్ డ్రాప్ లో  మసిలే  విద్యాబాలన్ పాత్ర మాత్రం సరదాగా వుంటుంది. దేనికది ఈ వైరుధ్యాల ఉన్నతీకరణల  వల్ల ప్రేక్షకుల వీక్షణానుభవం బాగా ద్విగుణీకృతమయ్యే అవకాశ మేర్పడింది.

‘అనామిక’లో ఈ  క్రియేటివ్ పంథా తిరగబడి - కథలో ఉత్పన్నమయ్యే డార్క్ మూడ్ ప్రభావం చిత్రీకరణలో లోపించి- రసోత్పత్తికి వ్యతిరేకంగా కృత్రిమ లైటింగ్ తో వైభవోపేతంగా దృశ్యాలు వెలిగిపోతూంటే, నయనతార పాత్ర విషాద ముద్రతో కన్పిస్తుంది. ప్రేక్షకులతో సైకలాజికల్ కనెక్షన్ ని ఏమాత్రం లక్ష్యపెట్టని  కెమెరా పనితనమనొచ్చు దీన్ని. ‘నేనొక్కడినే’ లో మహేష్ బాబు సీరియస్ నెస్ బాక్సాఫీసుకి ఏ మాత్రం లాభించిందో,   ‘అనామిక’ లో నయనతార విషాదవదనమూ అంతే పనికొచ్చింది.

 విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహణం ఎందుకనో శేఖర్ కమ్ముల ముద్రకి కూడా దూరంగా ఉండిపోయింది. ‘కహానీ’ దర్శకుడు సుజయ్ ఘోష్ – ‘కోల్ కతా  లో పుట్టి పెరిగిన వాణ్ణి గనుక ఆ నగరపు  ఆత్మని దృశ్యాల్లో అంతబాగా పట్టుకోగాలిగా’ నని చెప్పుకున్నాడు. ఛాయాగ్రాహకుడు సేతు నిర్వహించిన  కెమెరాపనితనంలో కృత్రిమత్వం వుండదు. ప్రయోగాత్మకంగా  అతి తక్కువ సహజ లైటింగ్ తోనే  కోల్ కతా  నగరపు లోలోతుల్లోకి లాక్కెళ్ళాడు.  ఈ ఫలితాలు రాబట్టడానికి పనిగట్టుకుని టెక్నికల్ గా ‘గెరిల్లా ఫిలిం మేకింగ్’ కి పాల్పడ్డాడు. దీంతో అన్నీ రియల్ లొకేషన్సే అత్యంత సహజత్వం ఉట్టిపడుతూ కనువిందు చేస్తాయి. తెలుగులో మాత్రం ఓ ఓల్డ్ సిటీ వీధి  సెట్ వేసి చిత్రీకరించారు. ఎక్కడా హైదరబాద్ ఆత్మనే పట్టుకోలేక పోయారు.

దర్శకుడు ఘోష్ తాను  కొన్ని సత్యజిత్ రే సినిమాల్లోని దృశ్యాల్ని యధాతధంగా వాడుకున్నానని  నిజాయితీగా చెప్పుకున్నాడు. లాడ్జిలో వేణ్ణీళ్ళు  రాని సీను సత్యజిత్ రే- ‘జోయ్ బాబా ఫెలూ నాథ్’ సినిమాలోదని ‘టెలిగ్రాఫ్’ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. తెలుగులో ఇది మక్కీకి మక్కీగా వుంది. అలాంటప్పుడు ఇది తెలుగు నేటివిటీ ఎలా అవుతుంది? ఏ బాపు సినిమాలోదో వాడుకుంటే తెలుగు నేటివిటీ అయ్యేదేమో?

అసలా లాడ్జి రూమే ‘రే’ తీసిన ‘చారులత’ లో పోలిన రూము అనికూడా స్పష్టం చేశాడు ఘోష్. లాడ్జి కోసం వాడుకున్న మోనాలిసా గెస్ట్ హౌస్ సినిమా విడుదలయ్యాక కోల్ కతా లో ఎంత పాపులర్ అయ్యిందంటే, కుతూహలం కొద్దీ వచ్చి చూసే జనంతో అదొక యాత్రా స్థలంలా  కిటకిటలాడిపోయింది!

 ‘రే ‘ దృశ్యీకరించిన కోల్ కతా నగరమంతా ‘మహానగర్’ సినిమాలో బాగా నిక్షిప్తమై ఉందనీ, దాన్నుంచి స్ఫూర్తి పొంది తాను కోల్ కతా నగర దృశ్యాల చిత్రీకరణకి సాహసించా నని కూడా వెల్లడించాడు ఘోష్. అంతే గాదు, విద్యాబాలన్ కీ ఏఎస్సైకీ మధ్య సంక్లిష్ట ఎమోషన్స్ కి సంబంధించి అనుసరించిన విధానమంతా కూడా ‘రే’ తీసిన ‘నాయక్’ లోనిదని చెప్పాడు!

కారులో విద్యాబాలన్ ప్రయాణించే దృశ్యాల్ని కూడా సత్యజిత్ రే తీసిన ‘ అరణ్యేర్ దిన్ రాత్రి’ నుంచి స్ఫూర్తిపొంది తీశాడు ఘోష్. ఆ సినిమాలో కారులో ప్రయాణించే నాలుగు పాత్రలతో బాటే ప్రేక్షకులూ ప్రయాణిస్తునట్టుండే చిత్రీకరణ వుంది. దాన్ని విద్యాబాలన్ కారులో ప్రయాణించే సీనుకి వాడుకున్నాడు.

సత్యేజిత్  రే సినిమాలే గాకుండా, 1970-80 లలో వచ్చిన విజువల్ గా కొట్టొచ్చి నట్టుండే ‘దీవార్’ లాంటి సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇక దృశ్యాల కలర్ స్కీము విషయానికొస్తే, 1915 లో బెంగాలీ చిత్రకారుడు గగనేంద్ర నాథ్ ఠాగూర్  వేసిన ‘ప్రతిమా విసర్జన్’ అనే పెయింటింగ్ లోని వాటర్ కలర్స్ కి నకలుగా తీసుకున్నాడు.

పాటలు లేని ‘అనామిక’ లో  కీరవాణి నేపధ్య సంగీతం చెప్పుకోదగ్గది. చాలా నెమ్మదిగా సాగే కథనం పరుగులు పెడుతున్న ఫీల్ ని కల్గించింది ఈ సంగీతమే. అయితే రీమేక్ ని కమ్ముల తన శైలిలోకి మార్చుకుని తీయడమంటే ఒరిజినల్లోని కళాత్మక విలువల్ని  బుల్ డోజ్ చేసుకుంటూ పోవడం కాదు కదా? దృశ్య సంగీత నేపధ్యమంతా కోల్ కతా నగరపు సంస్కృతీ- నేటివిటీ ఉట్టిపడే  కహానీ లోని కథమీద మాత్రమే సొంత నమ్మకాలు రుద్దడం గాకుండా, మిగతా మేకింగ్ లోనూ కాస్త కవిభావాన్ని కూడా  అర్ధం జేసుకుని వుంటే,  ఇది ఒరిజినలంతటి కళాఖండ మయ్యేది తప్పకుండా.
హిందీ కి సంగీతం సమకూర్చిన విశాల్-శేఖర్ లు ఆ  నేపధ్య సంగీతానికి ఆర్డీ బర్మన్ స్వరపరచిన హిందీ- బెంగాలీ బాణీలు వాడుకున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో హైదరాబాద్ నేటివిటీకి ఈ సృష్టే జరగలేదు. అంతా రొటీన్ హాలీవుడ్ తరహా కంపోజిషనే.
రిమేక్ అంటే కథ మాత్రమే  కాదు, ఇంకా చాలా వుంటాయి. ‘కహానీ’ మేకింగ్ లో ఇంతటి పరిశీలన, పరిశోధనా, పరిశ్రమా వున్నాయి. ఈ ఈస్థటిక్స్ ని అర్ధంజేసుకోకుండా ప్రయత్నిస్తే అది రీమేకింగ్ అవదు, ‘మాకింగ్’ అవుతుంది.

ఇతర నటులు..
ఇతర నటుల  విషయానికొస్తే, ఏఎస్సై గా నటించిన వైభవ్, టాస్క్ ఫోర్స్ అధికారిగా నటించిన పశుపతి, హోం మంత్రిగా నటించిన నరేష్ సైతం మూస ఫార్ములా సినిమాల్లో వుండే వేషభాషలు, శారీరక భాషలతోనే సరిపుచ్చేశారు. ఏమాత్రం  నలగని యూనీఫాం, క్రాఫు, మేకప్ లతో వైభవ్ యమ నీటుగా కన్పిస్తే, పశుపతీ ఇందుకేం తీసిపోలేదు. ఇక నరేష్ సరేసరి.

కహానీ లో నిత్యజీవితంలో  మనకి కన్పించే సామాన్య ప్రజల ఆహార్య వ్యవహారాల సరళిని ప్రతిబిం బించే  నటులు కన్పిస్తారు.
పరమ్ బ్రతా ఛటోపాధ్యాయ 
 నిజానికి ఏఎస్సై పాత్ర వేయడానికి పరమ్ బ్రతా  ఛటోపాధ్యాయ చాలా భయపడ్డాడు. తాను నగరంలో పుట్టి పెరిగిన వాడు, పాత్రేమో పల్లెటూరి నేపధ్యం గలది. ఎలా సాధ్యం? ఈ అనుకరణని, బజార్లో మనకి కన్పించే సామాన్య పోలీసు వేషభాషలతో సహా సుసాధ్యం చేసి చూపించి మరపురాని నటుడిగా నిలచిపోయాడు. స్వయంగా కొన్ని పోలీస్ స్టేషన్లు సందర్శించి, పోలీసుల పనితీరుగురించి, వాళ్ళ మనస్తత్వాల గురించీ కొంత రీసెర్చి చేశాడు.

ఇక ఐబీ  ఉన్నతాధికారిగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ అప్పటికి మూడు సినిమాల నటుడే. బక్కపలచగా సగటు జీవిలా వుండే ఇతను ఐబీ ఉన్నతాధికారిగా పాత్రకి ఎంత సహజత్వాన్ని తీసుకొచ్చాడో తెలిసిందే. చవకబారు సిగరెట్ తాగడం, పచ్చిగా మాట్లాడడం, ఇట్టే జనసమూహంలో కలిసిపోయి కన్నింగ్ గా ఆపరేషన్లు నిర్వహించడం అచ్చంగా నిఘా విభాగం ఉద్యోగి లక్షణాలే.


నవాజుద్దీన్ సిద్దిఖీ 
ఇక బాన కడుపు కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ పాత్ర పోషించిన శాశ్వతా ఛటర్జీ అయితే ఏకంగా ఆ పాత్రని అజరామరం చేసిపెట్టాడు. ‘నోమోష్కార్...ఆమి బాబ్ బిశ్వాస్..ఏక్ మినట్?’ అని పలికి సునాయాసంగా మర్డర్లు చేసే ఈ పాత్ర ఎంతగా పండిందంటే, ఇంటర్నెట్ లో దీని మీద సెటైర్ల దాకా వెళ్ళింది. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లో బాబ్ బిస్వాస్ జోకులంటూ కూడా హడావిడి చేశారు ఈ  పాత్ర అభిమానులు. ఒక గ్రాఫిక్ నవల, ఇంకో టీవీ షో ఈ పాత్రమీద ప్లాన్ కూడా చేశారు! ఈ పాత్ర ‘ముత్యాల ముగ్గు’లో రావుగోపాలరావు పాత్రలా కల్ట్ ఫిగరై పోయింది. ఈ కిరాయి హంతకుడి  పాత్రకి కలర్ ఫుల్ కాంట్రాస్ట్ ఏమిటంటే,  ఇతను లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ కూడా! శేఖర్ కమ్ముల సినిమాలో జీవంతో తొణికిసలాడే ఇలాటి ద్వంద్వాల పాటింపు మచ్చుకి కన్పించదు!
శాశ్వతా ఛటర్జీ 

కోల్ కతా నేపధ్యపు కథ కాబట్టి సాధ్యమైనంతవరకూ బెంగాలీ నటుల్నే తీసుకున్నాడు దర్శకుడు సుజయ్ ఘోష్. విద్యాబాలన్ పాత్ర భర్తకి కూడా బెంగాలీ  నటుడే కన్పిస్తాడు. ‘అనామిక’ ని తమిళంలో కూడా తీయడం వల్ల ఈ నేటివిటీ కూడా కొందరు నటుల విషయంలో సాధ్యపడలేదు సరిగదా, కాంట్రాస్ట్ లు కూడా కొరవడి రొటీన్ ఫార్ములా  సినిమా నటనలతో  అసంతృప్తి కల్గిస్తాయి.
తెలుగు సినిమాకింతే, తెలుగు ప్రేక్షకుల టేస్టు ఇంతకన్నా బెటర్ గా ఉండదు- అని భావించుకుని ఓ  రీమేక్ చేసేస్తే ఎవరూ కాదనడానికి లేదు. కానీ ఇది జీవితాల్లోంచి పుట్టిన చాలా కళాత్మక విలువలున్న, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ పొందిన కల్ట్ మూవీకి రీమేక్ అయ్యింది. అ కల్ట్ మూవీ పార్స్వాల్ని తడమకుండా పైపైన ‘అనామిక సమీక్ష’  చేసేసి తప్పో గొప్పో ప్రేక్షకుల నిర్ణయానికి వదలడం సాధ్యం కాదు!

3. స్క్రీన్ ప్లే సంగతులు!
ఇంతకీ ఈ కథ మిస్టరీ తరగతికి చెందిందా, లేక సస్పెన్స్ థ్రిల్లర్ కోవకి చెందుతుందా?

ఈ స్పష్టత లేకపోతే కథా  నిర్వహణ కనాకష్టమై పోతుంది. ఆ గజిబిజిని జీర్ణించుకోవడం కష్టమైపోతుంది.

మిస్టరీకీ, సస్పెన్స్ కీ తేడా ఏమిటంటే- ఉదాహరణకు-ఒక ప్రముఖ రాజకీయనాయకుడి హత్యోదంతాన్ని కథగా తీసుకుంటే, మిస్టరీలో అయితే ఆ రాజకీయనాయకుడి హత్య కథా ప్రారంభంలోనే జరిగిపోతుంది. ఆతర్వాత కథంతా హంతకుల్ని కనుగొనేందుకు దర్యాప్తు/పరిశోధనలతో సాగి, చివర్లో హంతకుల్ని పట్టేసుకుంటారు. అంతవరకూ హంతకులేవరనేది రహస్యంగా వుంటుంది. అందుకే అది మిస్టరీ.

అదే సస్పెన్స్ థ్రిల్లర్ లోనైతే  ప్రారంభంలో-ఫలానా రాజకీయనాయకుడ్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని సమాచారం అందుతుంది. కుట్రదారులెవరో ప్రేక్షకులకి/పాఠకులకి ముందే తెలిసిపోతుంది. పోలీసులకి కథాక్రమంలో తెలుస్తుంది. హత్యని ఆపేందుకు పోలీసులూ- హత్య చేసేందుకు కుట్ర దారులూ ఆడే ఓపెన్ గేమ్ గా కథనం వుంటుంది. అందుకే ఇది సస్పెన్స్ థ్రిల్లర్.

సస్పెన్స్ జరగబోయే నేరాన్ని ఆపేందుకు ద్విముఖ డ్రామా ని సృష్టిస్తే, మిస్టరీ జరిగిపోయిన నేరాన్ని పరిష్కరించేందుకు ఏకోన్ముఖ సంఘర్షణని క్రియేట్ చేస్తుంది.

మిస్టరీ ది ఎండ్ సస్పెన్స్ కథా ప్రక్రియ అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ ది సీన్-టు సీన్ సస్పెన్స్ కథా విన్యాసం. మిస్టరీది విలన్ కన్పించని ఏకపక్ష గొడవ అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ ది విలన్ కూడా కన్పించే వైరిపక్షాల సిగపట్లు. చివరిదాకా విలన్ కన్పించని ‘మిస్టరీ’ సినిమా ప్రేక్షకులకి సహన పరీక్ష అని ఎప్పుడో హాలీవుడ్ తేల్చేసి, వాటి జోలికి పోకుండా వుంటే, ఇండియాలో ఇంకా పనిగట్టుకుని  ‘ఆ ఒక్కడు’, భద్రం’, ‘సామ్రాట్ అండ్ కో’ లాంటి మిస్టరీ లు తీస్తూ  చేతులు కాల్చు కుంటున్నారు. మిస్టరీ నవలకి బావుంటుంది, సస్పెన్స్ సినిమాకి ప్లస్ అవుతుంది.

ఈ పూర్వరంగంలో ‘కహానీ’ ఏమిటి - దీని రీమేక్ అయిన ‘అనామిక’ ఏమిటి –అని చూస్తే, ‘కహానీ’ స్పష్టాతి స్పష్ట మైన మిస్టరీ! ‘అనామిక’ మిస్టరీయో సస్పెన్స్ థ్రిల్లరో స్పష్టత లేని కాక్ టెయిల్! మరి పైన చెప్పుకున్నదాని ప్రకారం మిస్టరీ ‘కహానీ’ హిట్ కాకూడదుగా, ఎందుకు హిట్టయ్యింది?

ఎందుకంటే అందులో సినిమాకి నష్టదాయకమైన ఎండ్ సస్పెన్స్ ప్రక్రియని కాచుకునే మరో ఎండ్ సస్పెన్స్  వుంది గనుక! అది గర్భం అనే అతిముఖ్యమైన ప్లాట్ డివైస్ గనుక! ఈ గర్భం అనేపాయింటుతో అంతవరకూ ప్రేక్షకులకి తెలియని ఎండ్ సస్పెన్స్ తో షాకిచ్చాక, ఎదురుచూస్తున్న పాయింటుతో (అదృశ్యమైన భర్త) ఎండ్ సస్పెన్స్ బాధ ప్రేక్షకులు ఫీలవలేరు గనుక!

ఒక సమస్య తాలూకు విసుగు నుంచి దృష్టి మళ్లించాలంటే, ఇంకో పాయింటు ని ఓపెన్ చేసి షాకివ్వాలన్న స్క్రిప్టింగ్ మెళకువ మత్రమే ఇది!

It’s all nothing but a psychological  game played beautifully  with the audiences’  perception, as was done similarly  by the deft hand of Sri K. Balachander  in ‘Maro Charitra’ ,   where as he pulled off  the impending danger of dullness successfully,  with plot climax  instead of  the anticipated story climax! Got it ?

కహానీ v/s అనామిక !
రచయిత్రి అద్వైతా కళా 
ఇది జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డుపొందిన రచన. దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ కథని నవలా రచయిత్రి ( ‘ఆల్ మోస్ట్ సింగిల్’ ఫేమ్ ) అద్వైతా కళా కి చెప్పాడు. ఆమెకి 1999 లో తన బాయ్ ఫ్రెండ్ అన్వేషణలో కోల్ కతా నగరంలో అనుభవమైన సంఘటనలు మెదిలాయి. నగరానికి తను పరాయిది. ఇక్కడి కోలాహలమైన జీవన పరిస్థితులు, పేదరికం, గందరగోళం ఎలావున్నప్పటికీ, ఇక్కడి ప్రజల మెత్తని హృదయాలు ఆమెని కట్టి పడేశాయి. కథా రచనకి ఇవన్నీ సాధనాలుగా పెట్టుకుని, మరో వైపు ఇంటలిజెన్స్ వ్యవహారాల మీద రీసెర్చి చేసింది. భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ (raw- ‘రా’) మాజీ జాయింట్ సెక్రెటరీ మేజర్ జనరల్ వీకే సింగ్ రాసిన ‘ఇండియాస్ ఎక్స్ టర్నల్ ఇంటలిజెన్స్: సీక్రేట్స్ ఆఫ్ రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్’ గ్రంధంతో బాటు, ఇదే అంశం పై ఇతరులు రాసిన కొన్ని గ్రంథాలూ ఏంతో తోడ్పడ్డాయి. వీటన్నిటి ఆధారంగా 185 పేజీల కథరాసి ఘోష్ కి అందిస్తే అతను దానికి స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నాడు.

నిజానికి టెర్రర్ దాడులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ ) పరిధి లోకొస్తాయి. రాష్ట్రాల టాస్క్ ఫోర్సులకీ, హోం మంత్రులకీ ఎలాంటి సంబంధమూ  వుండదు. ఆయా రాష్ట్రాల అనుమతుల అవసరం లేకుండానే ఈ సంస్థ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. 2008 ముంబాయి టెర్రర్ దాడుల దరిమిలా కొత్తగా ఈ సంస్థ ఏర్పాటయింది. ఇందుకే ‘కహానీ’ లో ‘టెర్రర్’ దాడికి తీసిపోని కేసుకి సంబంధించిన కథనం కోసం ఇంటలిజెన్స్ బ్యూరో వ్యవహారాలూ, ఆ పాత్రలూ  అవసరమయ్యాయి. రియలిస్టిక్ సినిమా కథనం అన్నాక  లాజిక్కే కదా మానమూ, ప్రాణమూ?

టూకీగా ఈ కథేమిటో చూద్దాం...
కోల్ కతా మెట్రో రైల్లో ఓ రోజు  విషవాయువు దాడిజరిగి అనేక మంది చనిపోతారు. ఇది టెర్రరిస్టు దాడి కాదు. ఇంటలిజెన్స్ బ్యూరో లో తిరుగుబాటు ఉద్యోగి ఒకడు మిలన్ దామ్జీ - డిపార్ట్ మెంట్ మీద కక్ష సాధించేందుకు ఈ దుశ్చర్యకి పాల్పడతాడు. రెండేళ్ళ తర్వాత లండన్లో ఉంటున్న విద్యాబాలన్ భర్తని వెతుక్కుంటూ వచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఈమె గర్భవతి. ఇలా భర్తని వెతికే క్రమంలో కొన్ని ఘటనలు జరిగి, మిలన్ దామ్జీ ని పట్టుకుని హతమారుస్తుంది. తీరా చూస్తే గర్భవతి కాదు. అలా నటించింది. ఆనాడు మెట్రో ట్రైన్లో జరిగిన జీవాయుధ దాడిలో మృతి చెందిన వాళ్ళలో తనభర్త కూడా వున్నాడు. రెండేళ్ళు గడిచినా ఆ మిలన్ దామ్జీ ని పోలీసులు పట్టుకోక పోవడంతో తనే ఇలా నటిస్తూ వచ్చి ప్రతీకారం తీర్చుకుందన్న మాట.

తెలుగులో నగరంలోని పీపుల్స్ ప్లాజాలో బాంబు  దాడి జరిగి అనేక మంది చనిపోతారు. ఇది పక్కా టెర్రరిస్టు దాడే. ఆ దొరకని టెర్రరిస్టు పేరు మిలింద్ దామ్జీ. తొమ్మిది నెలలతర్వాత, విదేశాలనుంచి నయనతార భర్తని వెతుక్కుంటూ వచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఈమె గర్భవతికాదు. భర్తని వెతికే క్రమంలో కొన్ని ఘటనలు జరిగి మిలింద్ దామ్జీని పట్టుకుని చంపేస్తుంది. అతను తన భర్తే. అతనే ఉగ్రవాది! ఈ కథకి విలన్.

ముందుగా ముగింపు విషయానికొస్తే, ఇది హిందీకి భిన్నమైన  యాంటీ సెంటిమెంటల్ ముగింపు . హిందీలో సుఖాంతమైతే, తెలుగులో అదే డార్క్ మూడ్ తో నెగెటివ్ ముగింపునే ఇచ్చారు. గతంలో బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ హిందీ రీమేక్ కి ముగింపు మార్చాలంటూ చాలా వొత్తిడి వచ్చింది. బాలచందర్ ఒప్పుకోలేదు. తెలుగు ముగింపు తో అలాగే  హిందీ తీశారు. సూపర్ హిట్టయ్యింది !

శాడ్ గా మొదలయ్యే కథలు హేపీగా ఎండ్ అవడం, హేపీగా మొదలయ్యే కథలు శాడ్ గా ఎండ్ అవడం అతి పురాతన ప్రాథమిక సూత్రమే.  హేపీగా మొదలయ్యే కథ హేపీగా ఎండ్ అయితే ఏ ప్రమాదమూ లేదు, కానీ ‘అనామిక’ లోలాగా శాడ్ గా మొదలయ్యి శాడ్ గానే ముగిస్తేనే మునుగుతుంది కొంప!

‘కహానీ’లో శాడ్ గా మొదలయ్యింది, భర్త మరణానికి కారకుడైన వాణ్ణి మట్టుబెట్టడంతో హేపీ ఫీల్ తో ఎండ్ అయింది.

ఇక ఝాన్ర్ విషయానికొస్తే, ‘కహానీ’లాగే ‘అనామిక’ మౌలికంగా మిస్టరీయే అయినప్పటికీ హీరోయిన్ని శక్తిమంతురాలిగా చూపించాలన్న మార్పు జరగడంతో, ఆమె ఫీలవుతున్న మహిళా శక్తికి తగ్గట్టుగా సస్పెన్స్ థ్రిల్లర్ లక్షణాలూ వచ్చి చొరబడ్డాయి. ‘కహానీ’లో ఎండ్ సస్పెన్స్ ఫీల్ కి సేఫ్టీ వాల్వ్ గా ఉపయోగించుకున్న ‘గర్భం’ అనే ప్లాట్ డివైస్ ని కూడా  ‘అనామిక’ లో తీసేయడంవల్ల,  ఆ సేఫ్టీ వాల్వ్ లేక ఆసాంతమూ ఎండ్ సస్పెన్స్ తో విసిగిన  ప్రేక్షకులు సహజంగానే ఈ సినిమాని తిరస్కరించారు. ఈ సేఫ్టీ వాల్వ్ ఉండుంటే ఎంత మిస్టరీ/సస్పెన్స్ ల కన్ఫూజుడు ఝాన్ర్ అయినా  ప్రేక్షకుల్ని మరపించేదేమో.

ఇక కాన్సెప్ట్ విషయానికొస్తే, హిందీలో అది టెర్రరిజంతో సంబంధం లేని  ‘తిరుగుబాటు పోలీసు’ దాడి కాబట్టే అతను మెజారిటీ వర్గపు మిలన్ దామ్జీ అయ్యాడు. తెలుగులో పక్కా టెర్రరిస్టు దాడి అయినప్పుడు అతను అదే మెజారిటీ వర్గపు మిలింద్ దామ్జీ ఎలా అవుతాడు? ఇతను ఓల్డ్ సిటీలో మైనారిటీ వర్గపు టెర్రరిస్టు గ్రూపులో ఎలా చేరాడు? వాళ్ళని సమర్ధి స్తున్నాడా, లేకపోతే కోవర్టా? ఇంకా లేకపోతే, దేశంలో కొన్ని దాడులు చేసినట్టు  రైట్ వింగ్ టెర్రరిజానికి ప్రతినిధా?

ఇందులోకి హోం మంత్రీ, టాస్క్ ఫోర్స్ అధికారీ ఎలా వచ్చారు? టెర్రరిజం కేసు వాళ్ళ అధికార పరిధిలోదా? తెలుగు ప్రేక్షకులు అర్ధవంతమైన కథా కథనాలు కోరుకోరా?

హీరోయిన్ తన భర్త మిస్సింగ్ కేసు తీసుకున్న పోలీసులకి భర్త ఫోటో లందిస్తే అది టెర్రర్ కేసులో నిందితుడుగా వున్న  మిలింద్ దామ్జీయే నని ఎందుకు గుర్తుపట్టరు పోలీసులు? గుర్తుపట్టి ఆమెని ఎందుకు వెంటనే అరెస్టు చెయ్యరు? ఆమె అంత ఫూలిష్ గా పోలీసుల దగ్గరికి వచ్చి టెర్రరిస్టు భర్త ఫోటో లందించి సహాయం కోరుతుందా? హిందీ సినిమాలో టెర్రరిజం తో సంబంధం లేని భర్త వివరాలివ్వడంలో అర్ధముంది- తెలుగులో ఈ కథ మారిందే?

చివరికి సీఐ హత్య జరిగినా అతడి ఇంట్లో పరిశోధన చేయకుండా వదిలేసిన కథనం కథా సౌలభ్యం కోసం వున్నట్టుందే తప్ప, ప్రొఫెషనలిజంలా లేదు.

లాడ్జి పిల్లాడు అర్ధరాత్రిపూట మసక చీకట్లో దుండగుల రూపురేఖలు ఎలా చూడగల్గుతాడు? వాడెలా విట్నెస్ అవుతాడు? ఓ పెళ్ళికి వస్తున్న అనుమానితుల్ని గుర్తు పట్టేందుకు వాణ్ని తీసుకెళ్ళిన హీరోయినూ, ఏఎస్సయ్యీ అక్కడిం కేదో గొడవలో పడి వచ్చిన అంత ముఖ్యమైన పని వదిలేసి ఎలా వెళ్ళిపోతారు?

ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాటింగ్ లోపాలు, పేఆఫ్ కాని సెటప్స్ చాలావున్నాయి. డిటెయిల్ మేనేజిమెంటు లేదు.

ఇవి ‘కహానీ’లోనూ బోలెడు కన్పిస్తాయి. ఇంకా రిటెన్ ఫైళ్ళల్లో రహస్యాలుండడం, మాజీ ఐబీ అధికారిని ముందు కెప్టెన్ అని పరిచయం చేసి, తర్వాతంతా కల్నల్  అంటూ సంబోధించడం లాంటి వి...అతిపెద్ద లొసుగు ఏమిటంటే, రెండేళ్లుగా నిందితుణ్ణి ఏ వ్యవస్థా పట్టుకోలేక పోవడం, హీరోయిన్ మాత్రం వచ్చి దేవీనవరాత్రుల పదిరోజుల్లోనే పట్టేసుకోవడం! అసలు ఏ ఏర్ పోర్టు చెకింగ్ లోనూ దొరక్కుండా పెరిగిన పొట్ట ( కృత్రిమ గర్భం) తో స్వదేశానికి రావడం!

స్క్రిప్టింగ్ సమస్యలు
‘అనామిక’  చూసిన ప్రతివాళ్ళూ ఫిర్యాదు చేస్తున్న  ‘ఫస్టాఫ్ బోరు’ ప్రాబ్లం ఎందుకొచ్చిందంటే, అంకాల్ని, అంక విభజననీ దృష్టిలో పెట్టుకోకుండా రచన చేయడం వల్ల!  హిందీ మాతృకలో  స్పష్టంగా 40 వ నిమిషంలో  దామ్జీ ఫైలుకోసం జరుగుతున్న ప్రయత్నాలు ఢిల్లీలో ఐబీ చీఫ్ దృష్టి కొచ్చి – ఇద్దరు ఐబీ అధికారుల్ని కోల్ కతా పంపడంతో మొదటి అంకం ముగిసి రెండో అంకంలో పడుతుంది కథ.

ఈ మజిలీలో స్పష్టంగా ఎష్టాబ్లిష్ చేసిన ఛేంజ్ ఓవర్ ఏమిటంటే, భర్త కోసం హీరోయిన్ సాగిస్తున్న అన్వేషణ పైన చెప్పిన విధంగా బ్యూరోక్రటిక్  టర్న్ తీసుకోవడం.  హీరోయిన్ వ్యక్తిగత సమస్య కాస్తా ఉన్నట్టుండీ  ప్రభుత్వ సమస్యగా మలుపు తీసుకోవడం! కథనానికి కొత్త అధ్యాయం తెరవడం!


ఇలాటి టర్నింగ్ తో కొత్త మూడ్ ని క్రియేట్ చేయలేకపోయారు  ‘అనామిక’ లో...అంకాల్ని దృష్టిలో పెట్టుకుని కథా పథకాన్ని నిర్వహించినట్టు గోచరించదు.  హోం మంత్రి టాస్క్ ఫోర్స్ అధికారిని చనిపోయిన సీ ఐ స్థానంలో పంపడంతో- కథకి ఓ  మలుపుని ఎష్టాబ్లిష్ చేసేందుకు అవకాశమిస్తున్న  కీలక అంశం  దామ్జీ హార్డ్ డిస్క్ ప్రస్తావన మిస్సయి, అతను అనవసరంగా హీరోయిన్ తో వాదన పెట్టుకుని నిస్సిగ్గుగా లొంగిపోతాడు. ఇదంతా హీరోయిన్ని పవర్ఫుల్ గా చూపించేందుకు టైం వేస్టు చేసుకున్న సీను. లేకపోతే ఆ అధికారి ఇందుకు బదులుగా నేరుగా చనిపోయిన ఆ సీఐ ఇంటికెళ్ళిపోయి  హార్డ్ డిస్క్ కోసం  సోదాజరిపేసేవాడు- అక్కడ  హీరోయిన్ తో, కిరాయి కిల్లర్ తో అవాంతరం సృష్టించి వుంటే – అది అంక విభజనకి బాట వేసి,  అక్కడ్నించీ  డిస్క్ కోసం మూడు వర్గాల వేటతో టెంపో పెరిగి  రెండో అంకంలో పడేది కథ! 


అంకాల్ని బట్టి కథ నడిచి వుంటే ఇంటర్వెల్ సీను కూడా చప్పబడేది కాదు. రెండో అంకం ఎప్పుడూ సంఘర్షణ తీవ్రతని పెంచుకుంటూ పోయేదే. హిందీలో  రెండో అంకం ఇంటర్వెల్ దగ్గర సీను వెన్ను జలదరింప జేస్తుంది...రైల్వే ప్లాట్ ఫాం మీద నిలబడి చూస్తున్న హీరోయిన్ని -హఠాత్తుగా అప్పుడే వస్తున్న రైలు ముందుకు తోసేస్తాడు కిరాయి కిల్లర్!

తెలుగులో ఈ ఇంటర్వెల్ లేదు, ఎందుకంటే కథ మార్చారు కాబట్టి ఇక్కడ హీరోయిన్ కి రైళ్లతో సంబంధంలేదు. అందుకని డైలాగులతో నీరసంగా  విశ్రాంతి తీసుకున్నారు.


4.పాత్రోచితానుచితాలు

హిందీలోలాగా హీరోయిన్ని గర్భవతిని చేసి చుట్టూ బోలెడు సానుభూతిని ప్రోది చేసుకునేలా చూపడం బలహీన స్త్రీ పాత్రవుతుందని అభ్యంతరపడి, అబలని కాక సబలని చూపాలన్న ధ్యేయంతో గర్భం పాయింటుని తీసేసినట్టు దర్శకుడి వివరణ. ఒక స్త్రీ ఒంటరిగా వస్తే సమాజంలో చుట్టూ ఏం జరుగుతుందో, వాటినామె  ఎలా ఎదుర్కొంటుందో చూపాలనుకున్నారు పనిలోపనిగా . ఇదే రసభంగమంటే. అసలే మిస్టరీ ఝాన్ర్ కి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో విఘాతం కలిగిందనుకుంటే- మహిళాశక్తి ప్రదర్శన ఒకటి. 

ఈ మిస్టరీ- పోనీ-సస్పెన్స్ కథ ఆమె స్త్రీత్వంగురించికాదు, భర్త జాడ గురించి! ఏకసూత్రత పాటించకుండా ఒక తరహా కథని ఇంకో తరహా కథగా చెప్పలేరు. సామాజిక సమస్యలు/ పరిస్థితులు -  మిస్టరీ/సస్పెన్స్ కథలకి పట్టవు. వాటిని వేరే సినిమాగా తీసుకోవాలి. రియలిస్టిక్ సినిమా గాకుండా మూస ఫార్ములా తీయాలనుకుంటే అన్నీ కలిపి కొట్టొచ్చు! 

‘అనామిక’ కాస్సేపు రియలిస్టిక్ అన్పిస్తుంది, కాస్సేపు కొన్ని మూస పాత్రలతో పాత మూస ఫార్ములా అన్పిస్తుంది. కాసేపు మిస్టరీగా,  మరికాసేపు సస్పెన్స్ థ్రిల్లర్ గా తోస్తుంది. అసలు ఏది తీయాలనుకున్నారు?

మహిళా శక్తిని కూడా చూపాలనుకుంటే, సారంలో ఏం తేలింది? ఆమె బలహీనురాలిగా , అతి తెలివి హీనురాలిగా తేలింది. భర్త టెర్రరిస్టని తను అమెరికాలో ఉండగానే తెలిసివుంటే, వారం క్రితం వరకూ అతను హైదరాబాద్ లో ఫోన్ కాంటాక్టు లోనే వుంటే ఏం చేస్తూ వుండి  పోయింది? అతను మిస్సయ్యాక రావడమేమిటి?  అందులోనూ పోలీస్ స్టేషన్ కి వెళ్లడమేమిటి? వాళ్లకి టెర్రరిస్టు భర్త ఫోటో నే ఇవ్వడమేమిటి? హిందీలో హీరోయిన్ కథ, ఈమె కథా  ఒకటి కాదుగా? ఆమెలా ఈమె ఎలా ప్రవర్తిస్తుంది?

రాత్రిపూట ఎవడుపడితే వాడొచ్చి తలుపు కొడుతూంటే గాభారపడిపోయి వాళ్ళ సందేహాలు తీర్చడమేమిటి?

ఆమెకి గర్భం పాయింటు తీసేయడంవల్ల పోలీసులు నీచంగా మాట్లాడి, ఆమెని వాడుకుందామని చూసే సీన్లు విచ్చలవిడిగా  వేసుకోవడానికి మార్గం ఏర్పడి నట్టయ్యింది.



ఒరిజినల్లో ఈ మహిళా శక్తి ప్రదర్శన లేదని ఎలా అంటాం? చాలా తెలివిగా, పరోక్షంగా వుంది. తను మామూలుగా వచ్చి  భర్తకోసం వేధిస్తే పోలీసులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆమెకి తెల్సు. అందుకని తెలివిగా ప్లాన్ చేసి, అలాటి పోలీసుల్ని బుట్టలో వేసుకోవాలంటే గర్భవతిగా నటించాలని నిర్ణయించుకుంది. కింది నుంచీ పైదాకా పోలీసులు అయ్యోపాపమని అనుకుని సహకరించే వాళ్ళే  అయ్యారు. అలా తన డిగ్నిటీ కాపాడుకుంటూ, వాళ్లకి కహానీ ల మీద కహానీలు చెప్పి బురిడీ కొట్టించి- తన పని కానిచ్చేసుకుని బయటపడింది- వాళ్ళు తెల్లబోయేలా చేసింది- ఇదీ మహిళా శక్తంటే!

ఆమె వ్యక్తిత్వ  ప్రదర్శన  గర్భం ఆలంబనగా, సరదా సరదాగా,  పైకి చెప్పని సబ్ టెక్స్ట్ గా , అంతర్లీనంగా ఉన్నాక- ఏం తగ్గింది?
కాకపొతే, ముగింపులో సమస్యని పరిష్కరిస్తూ ఇద్దరూ-నేలబారుగా మిగిలిపోయారు.

విద్యాబాలన్ ది కేవలం భర్త చావుకి వ్యక్తిగత ప్రతీకారం.  భర్తతో బాటు మరెందరో చనిపోయిన నేపధ్యంలో వాళ్ళందరి ప్రతినిధి గానూ తానుండాలన్న స్పృహ లేకపోయింది. దీంతో ఆమె ఆశయం చాలా చిన్నదై జేమ్స్ బానెట్ వర్గీకరించే స్టోరీ వీల్  మెట్లలో అట్టడుగున- స్వవిషయమే తప్ప ఇంకేమీ పట్టని అట్టడుగు స్థాయి పాత్రగా- కథగా ఉండిపోయింది. ప్రారంభంలో చెప్పుకున్నట్టు కురచ కాన్సెప్ట్ అయ్యింది!

నయనతారది పైకి సామాజిక బాధ్యతలా అన్పించినా,  లోలోపల తనని మోసం చేశాడన్న కసి ఉందేమో ఎవరికితెలుసు? ఈ మీమాంస వల్ల  తనుకూడా డిట్టో!!


-సికిందర్



 










16, ఏప్రిల్ 2014, బుధవారం

రివ్యూ..
కథతో పనిలేని కహానీ!

స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సురేందర్ రెడ్డి
తారాగణం : అల్లు అర్జున్, శృతీ హాసన్, సలోనీ అశ్వని, శ్యామ్, రవికిషన్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, ఎమ్మెస్, అలీ తదితరులు.
కథ : వక్కంతం వంశీ*మాటలు : వేమారెడ్డి*సంగీతం : తమన్*ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస*యాక్షన్ : రామ్-లక్ష్మణ్, విజయ్*కూర్పు :గౌతమ్ రాజు*కళ : నారాయణ రెడ్డి
బ్యానర్ :  లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్*నిర్మాతలు : డా.వెంకటేశ్వరరావు, నల్లమలుపు శ్రీనివాస్, రంగరాజన్ జయప్రకాష్
విడుదల : ఏప్రెల్ 11, 2014 * సెన్సార్: U/A
***


ర్శకుడు సురేంద్రరెడ్డి దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే అది తెలుగు-యూరోపియన్ సినిమాల టెక్నిక్కులతో మిక్స్చర్ పొట్లమేనేమో. ఈ ధోరణి నుంచీ ఇప్పటికైనా కాస్తయినా పక్కకు తొలిగేది లేదని నిర్ణయించుకున్నట్టు తాజా నజరానా రేసుగుర్రంసైతం తెలియజేస్తోంది. దీనికి తోడు అల్లుఅర్జున్ తో సమకట్టిన ఈ యాక్షన్ కామెడీ ప్రక్రియ ఫార్ములాని కూడా తిరగరాయాలని ప్రయత్నించడం ఈ సారి తను బోనస్ గా అందిస్తున్న కానుక!


సురేంద్రరెడ్డి ప్రేక్షకులకిస్తున్నఈ బోనస్ తోపాటు, దీంతో రంజింప జేయడానికి రంగంలోకి దిగిన అల్లు అర్జున్ తో ఏమాత్రం ఈ ‘రేసుగుర్రం’ పరుగెత్తిందో ఈపాటికి ప్రేక్షకులకి తెలిసిపోయే వుంటుంది. లాజిక్, కామన్ సెన్స్, సరైన కథా, పద్ధతీ అని పట్టింపు ఉండని  ప్రేక్షకులకి  ఇది బ్రహ్మాండమైన ఎంటర్ టైనర్. యాభై కోట్ల స్టార్ సినిమాకదా అని కాస్త  నాణ్యమైన కథాకథనాలు, హాస్యం, నటనలు, లజిక్కూ, సాంకేతిక విలువలూ వగైరా ఆశించి వెళ్ళే  అభిరుచిగల ప్రేక్షకులకి మాత్రం పెదవి విరుపే!

ఈ ‘రేసుగుర్రం’ తో రేసెంత వుందో ఓసారి చూద్దాం..

అన్నదమ్ముల సవాల్- శత్రువు కమాల్!
ప్రధానంగా ఇద్దరన్నదమ్ముల కయ్యాల కథ ఇది. లక్ష్మణ్ అలియాస్ లక్కీ (అల్లు అర్జున్), రామ్ (శ్యామ్) లనే ఇద్దరన్న దమ్ములకి క్షణం పడదు. ప్రాణ శత్రువుల్లా కీచులాడుకుంటుంటారు. రామ్ ఏసీపీ. లక్కీ పనీపాటా లేకుండా తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు (తనికెళ్ళ- పవిత్రా లోకేష్) లు వీళ్ళతో పడలేక పోతూంటారు. లక్కీ స్పందన ( శృతీ హాసన్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈమె తండ్రి భీమ్ ప్రకాష్ (ప్రకాష్ రాజ్) బాగా డబ్బున్నవాడు. తన కూతుర్నుంచీ లక్కీని దూరం చేయలేక అల్లాడి పోతూంటాడు.

ఇంకోవైపు శివారెడ్డి (రవికిషన్) అనే రౌడీ షీటర్ రాజకీయపార్టీని బెదరింఛి టికెట్ పొంది నామినేషన్ కి సిద్ధమౌతూంటాడు. పార్టీ అధ్యక్షుడు వీడి నేరాల గురించి ఒక్క సాక్ష్యమైనా పట్టుకొస్తే నామినేషన్ ని అడ్డుకోవచ్చని ఏసీపీ రామ్ ని ఎగదోస్తాడు. ఈ విషయం శివారెడ్డికి తెలిసిపోయి, రామ్ ని చంపించేందుకు ప్లానేస్తాడు. సాక్ష్యాధారాలతో కార్లో పోతున్నది రామ్ అనుకుని అనుచరులు ఎటాక్ చేస్తారు. ఆ కార్లో రామ్ కాక లక్కీ ఉంటాడు. ఇతడికి అన్న మీద జరిగిన కుట్ర తెలిసిపోయి శివారెడ్డి ని పట్టుకుని చావబాదుతాడు. శివారెడ్డి నామినేషన్ వేయలేకపోతాడు.

ఇదీ కథ. తన రాజకీయ జీవితాన్ని పాడు చేసిన లక్కీ మీద పగతో శివారెడ్డి ఇక ఏం చేశాడన్నది ఇక్కడనుంచీ సాగే ద్వితీయార్ధంలో తెలుసుకోవచ్చు.


అల్లు అర్జున్ కిది కొత్త తరహా పాత్రేం కాదు, ఇలాటి బరువు బాధ్యతల్లేని అల్లరి పాత్రలు నటించి నటించి వున్నాడు. ఆ కోవలోనే ఈ నటనా వుంది. ఈ మాస్  పాత్రకి డైలాగుల బలం కూడా తోడ్పడాల్సింది. సన్నివేశాల్ని ఉద్విగ్నభరితం చేసే ఒక్క డైలాగూ పేలిన జాడలేకపోవడం విచారకరం. దీనిక్కారణమేమిటో  ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో తెలుసుకుందాం. ఇకపోతే, పాటల్లోనూ  అభిమానులు కేరింతలు కొట్టే ఒక్క డాన్సు మూవ్ మెంటు కూడా లేకపోవడం మరో లోటు! పోరాటాల్లో ఫర్వాలేదు, సినిమా సినిమాకీ వైవిధ్యం కనబర్చే యాక్షన్ డైరక్టర్లు రామ్-లక్ష్మణ్ లు, విజయ్ –అల్లుఅర్జున్ ని హైప్ చేస్తూ యాక్షన్ కోరియోగ్రఫీ చేశారు. ఐతే ఇంటర్వెల్ సీన్లో హింస ఎక్కువైపోయింది...

నటుడిగా అర్జున్ లో కొత్త కోణాలు బయటపడాలంటే అది హుందా తనంగల పాత్రల్లో నటిస్తేనే కుదురుతుంది. ఇక శృతీ హాసన్ పాత్ర ప్రవేశం నుంచీ కొన్ని దృశ్యాలవరకూ పాత్రతీరు కొత్త క్రియేటివిటీ అనొచ్చు. పైకి సున్నం కొట్టిన రాయిలా ఉంటూ భావోద్వేగాలన్నీ లోలోపలే అనుభవించే క్రేజీ క్యారెక్టరైజేషన్ నిజంగా పిచ్చెత్తించేదే. ఆతర్వాత షరామామూలు గ్లామర్ పాత్రలో ఒదిగిపోయింది. రెండో హీరో తమిళ నటుడు శ్యామ్ ఇలాటి పాత్రలకే పనికొస్తాడు. ఇతడి ప్రియురాలిగా నటించిన సలోనీ పరిచయ దృశ్యం లోని గ్రేస్ వదిలిపారేసి చిలిపితనాలతో దయనీయంగా తయారయ్యింది. తొలిసారిగా తెలుగుకి పరిచయమౌతూ విలన్ గా నటించిన భోజ్ పురి హీరో రవికిషన్ ప్రారంభ దృశ్యంలో ఆకట్టుకునే నటన కనబర్చినా, ఆ తర్వాత్తర్వాత  అది మితిమీరిన ఓవర్ యాక్షనై తలపోటు నటుడిగా మారిపోయాడు. చివర్లో వచ్చే బ్రహ్మానందం తుపాకులు పేలుస్తూ ఎంత ఉత్తుత్తి హడావిడి చేసినా, అది గేమ్ ఆడే పాత్ర అయివుంటే, క్లైమాక్స్ ని కొత్త మలుపు తిప్పివుంటే ఈ సినిమా దర్శకుడికి, రచయితలకి  మంచి పేరొచ్చేది.

తమన్ సంగీతంలోని పాటలు, మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం సినిమాకి ఆకర్షణే, కానీ బ్రహ్మానందం వచ్చాక యాక్షన్  దృశ్యా లకి కూర్చిన నేపధ్యసంగీతం చాలా చీప్ కామెడీ గా వుంది.

స్క్రీన్ ప్లే సంగతులు
ఇది ఇటీవల  విడుదలై ఫ్లాపయిన తమిళ డబ్బింగ్ ‘సిటిజెన్’ సినిమాని పోలిన  స్క్రీన్ ప్లే నడకతో వుంది ఈ సినిమా. ఇదే నడక  సురేంద్ర రెడ్డి గత పరాజయ సినిమా ‘ఊసరవెల్లి’ లలోనూ చూడొచ్చు. ‘సిటిజెన్’, ‘ఊసరవెల్లి’ లలోని తప్పుడు ఇంటర్వెల్ దృశ్యాలే మళ్ళీ ‘రేసుగుర్రం’ లోనూ చూడాల్సి వచ్చింది. ఇంటర్వెల్లో ఇలాటిదే  తప్పుడు ఇంటర్వెల్ దృశ్యం గండాన్ని ఇటీవల ‘లెజెండ్’ లో చాలా తెలివిగా దాటేసి, సెకండాఫ్ ని నిలబెట్ట గల్గారు. ఇక సురేందర్ రెడ్డి ఇంకో గత పరాజయ సినిమా అయిన ‘అశోక్’ పొరపాట్లు సైతం తిరిగి యధాతధంగా ప్రస్తుత ప్రయత్నంలోనూ దిగుమతి అవడం ఆశ్చర్యకరం.

సినిమాని ఇద్దరన్నదమ్ముల చిన్నప్పటి కథతో ప్రారంభించారు. నిజానికీ కథలేకపోయినా వచ్చే నష్టమేం లేదు. ప్రధాన కథలో అర్జున్-శ్యాం ల గొడవల్ని చూపిస్తున్నప్పుడు ఓ రెండు మాటల్లో బ్యాక్ స్టోరీ చెప్పేస్తే సరిపోయేది. ఇలా ప్రారంభమైన కథ అన్నదమ్ముల కీచులాటలతో, హీరోయిన్, విలన్ల పరిచయాలతో నడిచి..తన ప్రేమని చెడగొట్టిన అన్నకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో తమ్ముడు సిద్ధపడి, ఇంకో వైపు ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు విలన్ తయారై, మరో వైపు ఆ నామినేషన్ వేయకుండా తగిన అస్త్రాలతో అన్న పాత్ర రెడీ అవడంతో కథకి మొదటి మలుపు (సమస్య) ఏర్పడి, రెండో అంకంలో పడుతుంది. ఇప్పటికి సుమారు  గంట సమయం తీసుకుంటుంది. దీనితర్వాత పావుగంట సేపు ఇంటర్వెల్ వరకూ సాగే రెండో అంకం మొదటి భాగంలో- అన్న అనుకుని తమ్ముడి మీద విలన్ హత్యా యత్నం, విలన్ కుట్ర తెలుసుకున్న తమ్ముడు విలన్ని చావదన్ని బుద్ధి చెప్పడం, విలన్ నామినేషన్ వేయలేకపోవడం వగైరా  జరుగుతాయి.


దీంతో ఏమర్ధమౌతోంది? మొదటి మలుపు దగ్గర ఏర్పడ్డ సమస్య ఇంటర్వెల్ దగ్గర పరిష్కారమై పోయిందన్పించడం లేదూ?

అంటే కథ ముగిసిందన్న ఫీలింగ్ ఏర్పడ్డం లేదూ? హీరోకి సంబంధించినంతవరకూ విలన్ తో పనైపోయింది. అన్న మీద కుట్ర తో తను ఎదుర్కొన్న నైతిక సంక్షోభం కాస్తా  తీరిపోయి సుఖాంతమై పోయింది. ఇంకేం మిగిలింది?

‘సిటిజెన్’ లోనూ విలన్ తమ్ముడ్ని బంధించి, విలన్ మీద కక్ష తీర్చుకోవాలన్న హీరో లక్ష్యం ఇంటర్వెల్లో నె రవేరిపోవడంతో కథ ఇంకేం మిగల్లేదు!

కాకపొతే శత్రుశేషం మిగల్చకూడదన్న తెలివి  హీరోకి లోపించడంవల్ల ఈ రెండు సినిమాల్లోనూ ఆ తర్వాత సెకండాఫ్ లో విలన్ లేచివచ్చి మళ్ళీ హీరో మీద పడ్డాడు!

అంతే లక్ష్యం హీరోకి కాక రివర్స్ లో విలన్ కేర్పడిందన్న మాట..ఇందుకే సెకండాఫ్ లో విలన్ లేచి వచ్చేవరకూ హీరో ఏపనీ లేక పనికిరాని కథనాలు ఎత్తుకుని బోరుకొట్టిస్తాడు. అంటే ఇంకా చెప్పాలంటే, ఇంటర్వెల్లో ముగిసి పోయిన కథని మళ్ళీ ఎత్తుకోవడమంటే, అది సినిమాలకి పనికిరాని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ కి పాల్పడ్డ మన్నమాట.

 ‘ఊసరవెల్లి’ లోనూ హీరో ఎన్టీఆర్ ఇంటర్వెల్ దగ్గర విలన్ల గ్యాంగులో ప్రకాష్ రాజ్ ని మినహా మిగతా అందరు విలన్లనీ చంపేస్తాడు. ప్రకాష్ రాజ్ ని చంపకుండా వదిలెయ్యడం దర్శకుడు సెకండాఫ్ కథని కృత్రిమంగా నడపడానికే అన్నట్టు తయారయ్యింది!

‘లెజెండ్’ లో ఇంటర్వెల్ దగ్గర మొదటి బాలకృష్ణ మీద విలన్ జగపతిబాబు ఎటాక్ చేసి వెళ్ళిపోతాడు. కొన వూ పిరితో పడివున్న బాలకృష్ణ ని  కాపాడమని నానమ్మ  దేవుణ్ణి ప్రార్ధిస్తూంటే,  రెండో బాలకృష్ణ బీభత్స భరితంగా వచ్చేసి జగపతిబాబు అనుచరుల్ని సఫా చేస్తాడు.

ఇక్కడ రెండో బాలకృష్ణ దృష్టిలో లక్ష్యం అసంపూర్తిగా ఉండిపోయింది. ఇంటర్వెల్లో కథ ముగిసిపోలేదు. సెకండాఫ్ లో ఆ జగపతిబాబుని వెతికిపట్టుకుని చంపే లక్ష్యం మిగిలే వుంది!

ఇలకాక, ‘సిటిజెన్’ లో  హీరో బందీగా పట్టుకున్న విలన్ తమ్ముడ్ని,  ఆశయం నెరవేరాక  పోలీసులకి పట్టుబడేలా చెయ్యకపోవడం వల్ల, ఆ తమ్ముడే తర్వాత హీరోకి ఖర్మకాలి ప్రాణాంతకంగా మారాడు!

అలాగే  ’రేసుగుర్రం’ లోనూ అన్నమీద హత్యాయత్నం చేసిన అంత ప్రమాదకరమైన విలన్ని పోలీసులకి అప్పగించకుండా తెలివితక్కువగా హీరో వదిలెయ్యడంతో, ఆ విలన్ తిరిగి వచ్చి నానా తిప్పలు పెట్టాడు హీరోనీ, అతడి కుటుంబాన్నీ!

ఇలా దర్శకుడు సెకండాఫ్ లో కథ నడపడం కోసం విలన్ని సేఫ్ గా ఉంచేస్తున్నాడన్న మాట  - హీరో పాత్ర తెలివితేటల్ని  పణంగా పెట్టేసి!

అసలు ఇంటర్వెల్ పాయింటు ఉద్దేశమేమిటని చూస్తే, 1) అది కథ ఇంకో కొత్త మలుపు తీసుకుని ముందుకు దూసుకెళ్ళాడానికి  ఏర్పడే మజిలీ, అంతే గానీ కథ ముగిసినట్టు సర్దుబాట్లు జరిగే అడ్డాకాదు, 2) అది హీరోకి ఎదురుదెబ్బ తగిలి (‘లెజెండ్’ లోలాగా) అతణ్ణి కొత్తమార్గం పట్టించే చౌరాస్తా, అంతేగానీ కథ ముగిసిందని వెనక్కొచ్చే డెడ్ ఎండ్ కాదు, 3) అది కథని ఇంకా పై దశ పట్టిస్తూ హీరో కమిట్మెంట్ ని పెంచే కేంద్ర బిందువే తప్ప, ఆశయం నెరవేరిందని విశ్రమించే సత్రం కాదు. ఇంకా చెప్పాలంటే  ఫస్టాఫ్ లో మలుపునీ,  సెకండాఫ్ లో (క్లైమాక్స్ ) మలుపునీ బిగించి ఉంచే యాంకర్  లాంటిది మధ్యలో వచ్చే ఇంటర్వెల్ పాయింటు!

ఇదే సమస్య తో వుండే హాలీవుడ్ సినిమా ‘అరైవల్’ (1996) ఎలావుందో ఒకసారి  చూద్దాం..ఇందులో హీరోకి గ్రహాంతర వాసుల గురించి సమాచారం అంది, అడవిలో వాళ్లేర్పాటు చేసుకున్న రహస్య స్థావరానికి చేరుకుంటాడు. ఇది విశ్రాంతి దగ్గరే జరుగుతుంది. ఆతర్వాత నుంచీ కథలో ఆసక్తికరంగా ఏదీ జరగదు. కథ అయిపోయిందనే అర్ధాన్నే సూచిస్తుంది. హీరో ఆ స్థావరాన్ని చేరుకునే ఘట్టం మూడో అంకంలో ఏర్పాటు చేసివుంటే ఈ సమస్య ఏర్పడేది కాదని అంటూ ... ఒక హాలీవుడ్ స్క్రీన్ ప్లే నిపుణుడు ఇలా పేర్కొన్నాడు- It's a question of giving away too much in the middle and not holding enough back for the end. Worry about whether your story is taking too long to get off the ground, or if you're introducing new characters so fast we don't get to know them well enough. Worry about whether your middle drags, or gets too complicated, or if you are running out of complications and your hero is going to defeat his enemy too quickly and easily. Worry about whether your ending feels rushed, or if you've got more than one scene that feels like an ending...


పైన అండర్ లైన్ చేసిన పంక్తులన్నీ  ‘రేసుగుర్రంలో కన్పించే  లోపాలే. ఇంటర్వెల్ వరకూ పాయింటు(?)కి కథని లాక్కురావడానికి అల్లిన కథనంలో కథ కన్పించని విధంగా ఏవేవో దృశ్యాలు బలవంతంగా రుద్దుతున్నట్టు వచ్చిపోతుంటాయి. కొట్టొచ్చినట్టు కన్పించే తెలిసో తెలియకో పాల్పడిన ఈ విధానం ఏమిటంటే,  వెంటవెంటనే ఏదేదో చెప్పేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేయ్యాలనే తపన. స్క్రీన్ ప్లే పరిభాషలో  ‘too much, too soon syndrome’ అంటారు దీన్ని. ఆవారాగా తిరిగే హీరో అమెరికా వెళ్లేందుకు తందిని వేధించి ఆ డబ్బు తీసుకోవడం, ఆ డబ్బు హీరో తను మీద పడి తింటున్న హోటల్ యజమాని కొడుకు హాస్పిటల్ ఖర్చులకి పెట్టేయడం (హీరో అన్నాక ఆ ఖర్చు యాక్సిడెంట్ చేసిన వాడితో కక్కిం చాలిగా?), హాస్పిటల్లో పొలిటీషియన్ (పొసాని)కి ఆయాచితంగా క్రెడిట్ దక్కడం, ఈ ఋణం తీర్చుకుంటానని హీరోతో అనడం, బ్యాంకు దోపిడీ దృశ్యం, హీరో హీరోయిన్ తండ్రిని పిల్చి తనగురించి చెప్తున్నప్పుడు హఠాత్తుగా ఒక నాటు ముఠా ఎటాక్ చేసి రసభంగం కల్గించడం, మరోచోట  ఇదే హీరో అన్న హీరోయిన్ కి పెళ్లి తప్పించి తీసుకుపోతున్నప్పుడు  ఇమడని అకస్మాత్తుగా జరిగే ఇంకో ముఠా దాడి ..ఇలా చాలావుంటాయి.

సెకండాఫ్ ఓపెన్ చేస్తే (రెండో అంకం రెండో భాగం) కథలో హీరోకి పనిలేదు. అందుకని గతంలో ఎప్పుడో తనవల్ల దెబ్బ తిన్న అన్న ప్రేమకథని దారిలో పెట్టే  పనికి పూనుకుంటాడు. అన్నకి ఆ ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వగైరా ఓపెన్ వుతాయి. దీంతో సినిమా ఇంటరెస్ట్ గ్రాఫ్ పూర్తిగా డ్రాప్ అయింది. ఎందుకంటే ఇది రెండో అంకం లో రావాల్సిన అంశం కాదు. రెండో అంకంలో జరిగే స్క్రీన్ ప్లే బిజినెస్ కథ ముందుకెళ్ళి పోయిన దశలో, ప్రధాన సమస్యతో హీరో సంఘర్షణ తీవ్రతరం గావడమే. అన్న ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వగైరా మొదటి అంకంలో నే సర్దుబాటు చేయాల్సిన స్క్రీన్ ప్లే బిజినెస్. ఇంటర్వెల్ తర్వాత హీరోకి ప్రధాన సమస్య ఏదీ లేదుగాబట్టి ఈ అన్న ప్రేమకథ గొడవ తప్పలేదన్నమాట. దీనిపర్యవసానం ఇంటరెస్ట్ గ్రాఫ్ పాతాళానికి పతనమవడం!

ఇక సెకండాఫ్ లో ఏదో కొత్త టెక్నిక్ తో కథ చెప్తున్నట్టు అన్పించాలని ఫ్లాష్  ఫార్వర్డ్  ప్రక్రియని రెండు చోట్ల వాడారు. సడెన్ గా హీరో పోలీస్ అధికారి వేషంలో దర్శన మిస్తాడు. పోలీస్ ఎలా అయ్యాడనేదానికి వెంటనే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళి ఆ విధం చూపించుకొస్తారు. అలాగే హీరో అన్న పెళ్లి చూపులప్పుడూ ఫ్లాష్ ఫార్వర్డ్ తో ఓపెన్ చేసి పాత ప్రేయసి సడెన్ గా ఎలావచ్చిందో కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇదంతా ఫాలో అవడానికి చాలా కష్టంగా వుంటుంది. సీదాసాదాగా కథ ఎందుకు చెప్పకూడదు? కమర్షలియేతర యూరోపియన్ సినిమాలకి నప్పే ఈ కథన హననానికి పాల్పడ్డం ఎందుకు? సురేందర్ రెడ్డే తీసిన ‘అశోక్’ లో ఇష్టారాజ్యంగా ఇలాటి సీన్లేకదా వేసి కమర్షియల్ మాస్  సినిమా లుక్ కి విఘాతం కల్గించారు?

ఇక లాజిక్ విషయానికొస్తే, క్లైమాక్స్ లో హీరో పోలీసులా రావడానికి ఎలాటి లాజిక్కూ లేదు. అంతే కాదు దీనికి సపోర్టుగా ఎక్కడో ఫస్టాఫ్ లో పొలిటీషియన్ తో ఆ రుణపడి వుండే సీన్లన్నీ అనవసరమే. హీరోవల్ల పొలిటీషియన్ క్రెడిట్ పెరిగిందని పాయింటుని ‘సెటప్’ చేసేందుకు ఆ సీన్లు వేశారు. కథనంలో ప్రతీ ‘సెటప్’ కీ ఒక  ‘పేఆఫ్’ సీను వుంటుంది. మరి క్లైమాక్స్ లో ‘పే ఆఫ్’ సీను ఎలావుందంటే, హీరో పుణ్యాన హోమంత్రి అయిన పొలిటీషియన్ కి హీరో తనని ఒకరోజుకోసం పోలీసు అధికారిని చేయమంటాడు. ఆ హోం మంత్రి అలాగే చేసేసి, కొంత ఫోర్సుని కూడా హీరోకిచ్చేసి తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఈ లాజిక్ లేని మలుపుని లాజికల్ గా చూపించాలన్న తాపత్రయం ఎందుకు? దానికి పనిగట్టుకుని సెటప్పులూ పేఆఫ్ లూ ఎందుకు? అంత చలాకీ అయిన హీరో హోం మంత్రి ని అడుక్కోకుండా తనే పోలీసు వేషం వేసుకుని దొరక్కుండా హల్ చల్ చేస్తూ విలన్ ని ఫినిష్ చేయొచ్చుగా! ఆ చొరబడ్డ బ్రహ్మానందం పాత్రకూడా నకిలీ పోలీసే అయితే క్లైమాక్స్ కి మంచి బ్యాగ్ ఉండేదిగా?

అలాగే హీరో అన్న మిస్సయిన కారు కోసం దర్యాప్తు ప్రహసనం ఒకటి. ఇది మాస్ కమర్షియల్ సినిమా కథనంలో పోసగేది కాదు. ప్రత్యేకంగా క్రైం ఇన్వేస్టి గేషన్ ఝాన్ర్ సినిమాల్లో ఉండాల్సిన రసానుభూతి. దీన్ని తెచ్చి అరకొరగా ఇరికించడంతో కమర్షియల్ ఝాన్ర్ సినిమా అనుభూతిని పంటికింద రాయిలా దెబ్బతీసింది.


ఆమాటకొస్తే, నామినేషన్ వేయకుండా విలన్ని అడ్డుకోవడానికి హీరో అన్న సాక్ష్యాధారాలతో కలక్టర్ దగ్గరికి బయల్దేరడం హాస్యాస్పద మైనది. సాక్ష్యాధారాలే వుంటే అరెస్టు చేసి ఎఫ్ఫై ఆర్ నమోదు చేయాలి.

ఇక హీరో విలన్లూ విడతలవారీగా ఓ చెట్టుకి వేలాడదీసుకోవడం ‘అగ్నిపధ్’ లోనిదికదూ? ‘అగ్నిపధ్’ లో విలన్ ఇలాకాలోని ఆ మర్రి చెట్టు కూడా సినిమాలో ఓ పాత్రే. అది పాత్ర చాలించి అమాంతం వచ్చి అనామకంగా ‘రేసుగుర్రం’ లో ఏం ప్రభావం చూపించిందని?

మొదటి అంకం లో కథని ‘సెటప్’ చేయడంలో ఏమాత్రం వృత్తి తత్త్వం కనబర్చక పోవడంవల్ల- త్వరత్వరగా టూమచ్ ఇన్ఫర్మేషన్ తో నింపెయ్యడమనే అనర్ధం జరిగింది. తత్ఫలితంగా- పాత్రల్లో డెప్త్ గానీ, స్టోరీలైన్ లో తగిన బలమైన సంఘర్షణ గానీ లేకపోవడంతో,  విడివిడిగా ఏ సీనుకా సీను బలవంతపు కామెడీ ని రుద్దుతూ ఇదే సినిమా అన్పించారు!

పాత్రోచితానుచితాలు
కమర్షియల్ సినిమా కథ హీరోది తప్ప మరెవ్వరిదీ అవడానికి వీల్లేదు. కథని మలుపులు తిప్పేదీ, పాత్రలతో ఆడుకునేదీ అతనే. ఈ క్రమంలో కష్టాలేదుర్కొంటాడు, అనుకున్నది సాధించడానికి ఎంతదూరమైనా వెళ్తాడు. అంతేగానీ, విలన్ పాత్రవచ్చేసి హీరో చేతిలోంచి కథ లాక్కుని తానే కథానాయకుడు అవడం ఎక్కడా  జరగదు.  కేవలం తెలుగు సినిమాల్లోనే జరుగుతుంటుంది. వీటికే సినిమానిరక్షరాస్యులైన ప్రేక్షకులు అలవాతుపదిపోయారు.   ‘రేసుగుర్రం’లో హీరోది పూర్తిగా పసలేని పాసివ్ పాత్ర గా వున్న  వైనాన్ని రచయితలూ దర్శకుడూ గమనించినట్టు లేదు!

హీరోకి తన అన్న తనలాగా కాక, ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఎదిగాడన్న గౌరవభావం, భయభక్తులు ఏకోశానా లేకపోగా, అదే చిన్నప్పటి తుంటరి చేష్టలతో ఏడ్పి స్తూంటాడు. ఎదిగిన మెచ్యూర్డ్ వ్యక్తులుగా జీవితంపట్ల. లేదా వృత్తి వ్యాపకాలపట్లా ఏదైనా అర్ధవంతమైన  భిన్న దృక్పథాలతో విభేదించుకోవడం కాక, దిగజరుడుతనంతో దెబ్బలాడుకుంటూంటారు. అన్న సంపాదనమీద బ్రతికే హీరో నువ్వు లంచగొండివని నిందించడం హీరోయిజం అనుకుంటాడు. కష్టార్జితం అక్షరాలా ఆరులక్షలు అమెరికా వెళ్ళడానికి (ఏం చదివాడో, ఎందుకు వెళ్తున్నాడో మనకి తెలీదు, ఇంత  ఆవారా అమెరికా లో ఏం చేస్తాడో అంతకన్నా తెలీదు) తండ్రి ఇస్తే, ఎవరో పిల్లాడి ట్రీట్ మెంట్ కి అప్పనంగా ధారబోస్తే, ప్రేక్షకుల దృష్టిలో హీరో గొప్ప వాడెలా అవుతాడో అర్ధంగాదు!

అన్నని చంపడానికే ప్రయత్నించిన విలన్ని హీరో వదిలేస్తే, ఆ తర్వాత ఆ విలన్ అన్నకే ఎసరుపెట్టి, కొంప కూల్చేస్తే, అన్న హీరోకి ఇంట్లోంచి వెలివేస్తే, హీరో పట్ల ప్రేక్షకులకి సానుభూతిని ప్రోదిచేసే ప్రయత్నం దర్శకుడికి ఎందుకో అర్ధంగాదు. తెలివితక్కువ హీరోకి సానుభూతా?

తన ప్రేమ చెడగొట్టాడని అన్నమీద కక్ష గడతాడు హీరో. గతంలో అన్న ప్రేమని తనే చెడగొట్టానని  చల్లగా సెకండాఫ్ లో రివీల్ చేస్తాడు హీరో. ఇది ఎలాటి పాత్ర చిత్రణ? గతంలో అన్న ప్రేమని అన్నకి తెలీకుండా తనే చెడగొట్టి వుంటే, ఇప్పడు అన్న తన ప్రేమని చెడగొట్టాడని కక్షెందుకు? ఈ బూటకపు వ్యక్తిత్వంతో మొదటి అంకం మలుపుదగ్గర సమస్య ఏర్పాటుచేసి ప్రేక్షకుల్ని ఏమార్చడమేనా?

అనవసరంగా తనతో పెట్టుకోవద్దని వెళ్లి పెద్ద ఫ్యాక్షనిస్టు అయిన విలన్ తండ్రికి వార్నింగ్ ఇచ్చినంత పని చేస్తాడు. అప్పుడు అంతకి ముందు విలన్ గానీ, ఇప్పుడు విలన్ తండ్రిగానీ ఎందుకు కేర్ చేయాలి? హీరో ఏమైనా కరుడుగట్టిన మాఫియానా? విలన్ కంటే పెద్ద గ్యాంగ్ లీడరా? అతడి వెనుక ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తివున్నాడా? లాటి ఫాల్స్ బిల్దప్పులతో హీరోయిజాన్ని ఎలా స్థాపిస్తారు?

అసలు హీరో రేసు గుర్రమెలా అయ్యాడు? ఆ రకమైన క్యారక్టరైజేషన్ ఎక్కడుంది? ఎవరితో రేసు మొదలెట్టాడు? రేసు వద్దని విలన్ తో అనేవాడు రేసుగుర్రమెలా అవుతాడో మిలియన్ రీళ్ళు కాదు, చిప్స్ ప్రశ్న!

-సికిందర్




10, ఏప్రిల్ 2014, గురువారం

రివ్యూ..
అదే గాడ్ ఫాదరీయం!


మోహన్ బాబు, విష్ణు,శాన్వీ శ్రీవాస్తవ, జయసుధ, తనికెళ్ళ భరణి, బెనర్జీ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్,  ఛాయాగ్రహణం ; సతీష్ ముత్యాల    మాటలు : గంగోత్రి విశ్వనాథ్
బ్యానర్ : ఏవీ పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాతలు :  విజయ కుమార్, పి. గజేంద్ర బాబు, ఎం. పార్ధసారధి నాయుడు
రచన -దర్శకత్వం : రాంగోపాల్ వర్మ

విడుదల : 4.4.2014     సెన్సార్ : U/A
***
ఇంకా తెలుగు సినిమాని ఎక్కడేసిన గొంగళిలా వుంచేసేందుకు కృషిచేసే దర్శకుల కొరత తీర్చడానికా అన్నట్టు ప్రత్యేకంగా ముంబాయి నుంచి రాం గోపాల్ వర్మ కూడా వచ్చి ఓచేయి వేసినట్టుంది.  ‘గాడ్ ఫాదర్’ ని  అదేపనిగా తీసే డైరెక్టర్లు లేకపోవడంకూడా వర్మకి ఇచ్చగించ నట్టుంది. చర్వితచరణంగా తను ‘గాడ్ ఫాదర్’ నే తీస్తూ ఉండకపోతే ప్రపంచం ఏమనుకుంటుందో నన్న భయసందేహాలు కూడా వెన్నాడుతున్నట్టుంది. అదే పనిగా తీసే ఓకే తరహా సినిమాలకి సృజనాత్మకతతో పనేముంటుంది గనుక - ఇది ‘రౌడీ’ అనే టైటిల్ పెట్టడం దగ్గర కూడా రుజువవుతూ- గొప్ప విషాద దృశ్యాన్ని కళ్ళెదుట నిలబెడుతోంది...


శివ-సత్య-కంపెనీ-సర్కార్-నిశ్శబ్ద్ ల వంటి వేటికవి ఆలోచనాత్మక సినిమాలుగా తీసిన దర్శకుడు అమాంతం అరాచక సినిమాల సారధి కావడం, అంతకి మించి ఎదగక పోవడం పోటీ యుగంలో విచిత్రమే.  ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి సుతారమూ ఇష్టంలేని ఆ సినిమా సీక్వెల్స్ ని నిర్మాతల ప్రోద్బలంతో నే తీయాల్సి వచ్చిందట. వర్మ అదే ‘గాడ్ ఫాదర్ ‘తో  తరాలు మారుతున్న ప్రేక్షకుల్నీ ఆకట్టుకుకో గల్గుతాననుకోవడంలో తనకి మాత్రమే తెలిసిన సక్సెస్ ఫార్ములా ఇంకా ఏదో అందులో కన్పిస్తోందేమో.  కపోలా  తన 29 ఏళ్ల కుర్ర వయసులో వయసుమళ్ళిన దశలో కెరీర్ ప్రారంభిస్తున్నట్టు, ఓల్డర్ లుక్ గల ‘గాడ్ ఫాదర్’ తీయాల్సి వచ్చిందనీ, అదే ఇప్పుడు తన వయసుమళ్ళిన దశలో కుర్రాడిలా కెరీర్ ప్రారంభిస్తున్నట్టు,  యంగర్ లుక్ గల సినిమా తీస్తున్నాననీ ‘యూత్ వితౌట్ యూత్’ తీస్తున్న సందర్భంగా ఛలోక్తి విసిరాడు! ప్రేక్షకులు విసిగిపోయినా  ‘గాడ్ ఫాదర్’ నస తో  వర్మ కింకా వార్ధక్యం అనుభవం కావడం లేదేమో!
ఇలా వుంటే ఎంత బావుండేది!


ఇప్పుడు  లేని ఫ్యాక్షన్ గొడవల్ని  ‘గాడ్ ఫాదర్’ ఆలంబనగా తీయాల్సి వచ్చిన ఒక అవస్థ 'రౌడీ'. మేకప్ లేకుండా మోహన్ బాబు నటించాడన్న ఒక్క విశేషం తప్పితే ఏ కొత్తదనమూ లేని వన్ బై టూ కిచిడీ గా-  ప్రథమార్ధపు  వాస్తవిక ధోరణి కాస్తా సెకండాఫ్ లో మూస ఫార్ములా చిత్రీకరణకి ఫిరాయించిన దర్శకత్వపు తీరు.

నందవరం ప్రాజెక్టు ప్రహసనం

సమకాలీన రాజకీయం అన్పిస్తూ, గొడవెందుకన్నట్టు రాజీ పడినట్టనిపించే కాలక్షేప చిత్రణ ఇది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టూ దాని ముంపుగ్రామాల వివాదమూ ఇంకా రగులుతూ వుండగానే, ఈసినిమా ‘నందవరం’ ప్రాజెక్టూ దాని చుట్టూ కుట్రా అంటూ వేరేదారి పట్టిపోయింది . ‘రక్తచరిత్ర’ లాంటి డేరింగ్ సినిమా తీయగల్గిన వర్మ చేతిలో చితికిపోయిన ఈ సినిమాలో ఓ కుట్ర- ఆ  కుట్రలో టార్గెట్ ‘అన్న’ (మోహన్ బాబు) అనే కరుడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్టు. ఇతడికి భార్య (జయసుధ), కొడుకులిద్దరు భూషణ్ (కిషోర్), కృష్ణ (విష్ణు) అనే తూర్పు పడమరలు.


మాట వేదం- చేత శూన్యం 
ఆప్రాంతాల ‘అన్న’ మాటే వేదం. ప్రజలకి ఆయనే దేవుడు. మాట వినని మనిషిని కఠినంగా శిక్షిస్తాడు. ‘న్యాయం కోసం’ హత్యలు చేయిస్తే అరెస్టు చేసే ధైర్యం ఎస్పీకి కూడా  వుండదు. ఇలాటి తండ్రి అండ చూసుకుని పెద్దకొడుకు భూషణ్ చుట్టుపక్కల అరాచకాలు చేస్తూ సమస్యగా తయారవుతాడు. ఇతడికి భార్య, కొడుకు కూడా వుంటారు. చిన్న కొడుకు కృష్ణ బుద్ధిమంతుడు. సిటీలో ఇతను శిరీషా (శాన్వి ) అనే అమ్మాయిని రౌడీల బారి నుంచి కాపాడిన పరిణామ క్రమంలో ఆమె ఇతడితో ప్రేమలో పడుతుంది. ఇతని తండ్రి తన తండ్రిని చంపించాడని తెలిసీ ప్రేమిస్తుంది. ఈ విషయం కృష్ణ తండ్రికి చెప్తే, ఆమె గొప్పమనసుకి తెగ ఫీలైపోతాడు అన్నగారైన తండ్రి.

ఇంకో వైపు ఓ వ్యాపార ముఠా ( తనికెళ్ళ, జీవా, విశ్వనాథ్) అన్న కి వ్యతిరేకంగా పథకా లాలోచిస్తూంటారు. వీళ్ళ వెనుక అసలు వ్యాపారవేత్త ఇంకొక డుంటాడు. వీళ్ళు ప్రతిపాదించిన నందవరం ప్రాజెక్టు పనులు సంపాదించుకోవాలి. కానీ ఈ ప్రాజెక్టు కడితే మూడు నాల్గొందల గ్రామాలు మునుగుతాయని అన్న అడ్డుపడుతున్నాడు. ఈ అన్న పీడా ఎలా తొలగించాలి? ముందుగా పెద్ద కొడుకు భూషన్ ని తమవైపు లాగుతారు. ఇది పెద్దగా లాభించక పోవడంతో ఏకంగా అన్ననే లేపేసేందుకు పూనుకుంటారు.

ఇదీ విషయం. ఇప్పుడు వీళ్ళ కుట్రని కృష్ణ ఎలా భగ్నం చేశాడన్నది మిగతా కథ.

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మోహన్ బాబు గురించి చెప్పుకోవాలంటే, ప్రధానంగా పాత్ర చిత్రణ ఆయన అభినయ చాతుర్యానికి ప్రతిబంధకంగా మారింది.  ఏ మేకప్పూ హంగూ  ఆర్భాటాలూ లేకుండా ఎంత బాగా నటిస్తేనేం, పాత్రలో  అసలంటూ సరుకుండాలిగా? దీనిగురించి వివరంగా ‘పాత్రోచితానుచితాలు’  విభాగంలో మాట్లాడుకుందాం. ఇతరపాత్రల్లో విష్ణు, శాన్వి, జయసుధ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులున్నా బలహీన పాత్రల కారణంగా వీళ్ళూ ప్రభావం చూపలేకపోయారు.

సాంకేతికంగా, సంగీతపరంగా, యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా నీరసంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు అలవాటులేని బ్రౌన్ టింట్ లో గ్రేడింగ్ వర్మ అదేపనిగా చేయడం మాత్రం మానుకోవడంలేదు.

స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకుడు గమనించారో లేదో గానీ,  ప్రథమార్ధం షుగర్ కోటింగ్ లేని సహజత్వం తో కూడిన సన్నివేశాలతో  (ఈ సన్నివేశాల కల్పన కూడా పూర్ గా వుండడం వేరే సంగతి), ద్వితీయార్ధం సహజత్వం లేని కృతిమ మూస ఫార్ములా సన్నివేశాలతోనూ దర్శకత్వం దారి తప్పి నడుస్తుంది. సెకండాఫ్ లో డాక్టర్ల వేషాల్లో ముఠా వచ్చి హాస్పిటల్లో ‘అన్న’ మీద హత్యాయత్నం చేయడం, దాన్ని కృష్ణ ఎదుర్కోవడం, అలాగే కృష్ణ- శిరీషా లమీద తుపాకీ కాల్పులు జరుపుతూ దుండగులు వెంటాడ్డం, ఆ సందర్భంగా జరిగే ఫైట్ దృశ్యాలూ వగైరా ఫస్టాఫ్ సహజ ఫ్యాక్షన్ శైలిలో ఇమిడేవికావు. ఒక విధంగా ఇవి వీక్షణానుభావాన్ని భంగపరుస్తాయి. ఇంటర్వెల్ వరకూ రియలిస్టిక్ సినిమా చూసి, ఇంటర్వెల్ తర్వాతనుంచీ పూర్తిగా వేరే రొటీన్ ఫార్ములా సినిమా చూస్తున్నట్టు వుంటుంది.

స్క్రీన్ ప్లే కి కూడా ఒక నిర్మాణమంటూ లేదు. దీనిక్కారణం ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో తెలుసుకుందాం. ఎప్పుడో ఇంటర్వెల్ వరకూ మలుపు లేకుండా మొదటి అంకమే సుదీర్ఘంగా అపసోపాలుపడుతూ సాగుతుంది. అక్కడ పెళ్ళికి వెళ్తున్న ‘అన్న’ బృందం మీద మొదటి దాడి జరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత రెండో అంకంలో పడిన కథ వెంటనే శైలి మార్చుకుంటూ మూస ఫార్ములా ధోరణిలో పడి, హాస్పటల్లో మరోసారి ‘అన్న’ మీద దాడి జరుగుతుంది. మొదటి హత్యాయత్నం జరిగాక దాని  పరిణామాల మూల్యాంకన, ‘అన్న’ ప్రతివ్యూహం, శాంతి భద్రతల పరిస్థితి, ప్రభుత్వ యంత్రాంగం స్పందన మొదలైనవేవీ పరిగణనలోకి తీసుకోకుండా, ప్రత్యర్ధులు వెంటనే మరోదాడికి పాల్పడ్డం ఎక్కడా జరగదు. అంటే  దర్శకుడు కథనంలో సాధారణంగా పాటించాల్సిన  ‘పేసింగ్’ ని కూడా పట్టించుకోలేదన్న మాట.


తండ్రిని చంపినా ఈమెకి ప్రేమే !
ఇది చాలనట్టు రెండోసారి కూడా హాస్పిటల్లో దాడి చేసి ‘అన్న’ భార్యని చంపేస్తారు. విచిత్రమేమిటంటే ఇన్నేసి దాడులు చేస్తున్నదెవరో అంతటి ‘అన్న’ కి తెలీకపోవడం! క్లైమాక్స్ కి ముందు కృష్ణ చెప్తే నే తెలుస్తుంది. అదికూడా కృష్ణకి ఫస్టాఫ్ లోనే  మొదటి దాడి జరక్కముందే, హీరోయిన్ అన్న ఆ దాడి ప్రమాదాన్ని హెచ్చరించినప్పుడే, శత్రువు గురించి సూచన లందుతాయి. ఇది  దర్శకుడి కథా సౌలభ్యంకోసం మర్చిపోయాడు  బహుశా కృష్ణ! సరే, చిట్టచివరికి ఆ శత్రువుని పట్టుకు రమ్మంటాడు ‘అన్న’ . పట్టుకువస్తే పాత  సినిమాల్లోలాగా కేవలం ఓ కత్తితో కడుపులో గుచ్చితే, కిందపడి చచ్చిపోతాడు శత్రువు!

క్లైమాక్స్ వరకూ విలన్ ఎవరో చెప్పకపోవడంవల్ల, ‘అన్న’కీ, విలన్ కీ మధ్య ముఖాముఖీ ఉండాల్సిన నువ్వానేనా పోరు లోపించి టైం అండ్ టెన్షన్ గ్రాఫు ఐపులేకుండా పోయి- చేవ చచ్చిపోయింది సినిమా. విలన్ ఎవరో చివరి వరకూ చూపించకుండా ‘ఎండ్ సస్పెన్స్’ పోషించడం ఎక్కడో మర్డర్ మిస్టరీల్లో వాడుకునే టూల్. ఇదికూడా ఇప్పటి సినిమాల్లో భరించే ఓపిక ప్రేక్షకులకి లేదు. దీంతో ‘ఎండ్ సస్పెన్స్’ ని కూడా సినిమాల్లో పక్కనపెట్టేసి, అడుగడుగునా టెన్షన్ పెట్టే ‘సీన్-టు-సీన్’ సస్పెన్స్ ని వాడుకుంటున్నారు. ప్రస్తుత సినిమాలో ఉన్న మూస ఫార్ములా ప్రక్రియ చొరబాటుకి తోడు ఈ మర్డర్ మిస్టరీ టూల్ ఒకటొచ్చి పడింది కథనంలో. ఏకసూత్రత ఇన్నిసార్లు మటాష్ అవుతూంటే ఇక ఏ రస ప్రధానంగా ఈ సినిమా ని ఫాలోఅవాలి?

ఇంటర్వెల్ ముందు ‘పదకొండు నిమిషాల లాంగెస్ట్ యాక్షన్ సీన్ ‘ అంటూ కూడా పబ్లిసిటీ చేశారు. ‘అన్న’ని ఒంటరిచేసి పెద్ద ముఠా కత్తులతో దాడిచేసే యాక్షన్ కోరియోగ్రఫీ –టెన్షన్ లేకపోగా చాలా డీలాగా హాస్యాస్పదంగా కూడా వుంది. ఫ్యాక్షన్ ఎటాక్ ఈ పద్ధతిలో జరుగుతుందా? ఇంతకంటే రోమాంచితంగా  గతంలో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో చిత్రీకరించారు. అన్నట్టు దీనికంటే ముందు విడుదలైన ‘లెజెండ్’ లో ఇలాగే ఇంటర్వెల్ సీన్లో పెళ్లి బృందం మీద (బీభత్స భరిత)దాడి దృశ్యాలు వుండడం కాకతాళీయమే కావొచ్చు.


ఒక డ్యూయెట్ కి లీడ్ సీను -ఉన్నట్టుండి హీరోయిన్ హాస్యాస్పదమైన డైలాగులతో,  క్రియేటివిటీతో పనుండని ‘బి’గ్రేడ్ చిత్రీకరణకి తక్కువేమీ కాదు!

పాత్రోచితానుచితాలు


అందరికీ 'అన్న'-విలన్ కి సున్నా - 
పాత్రల్ని పట్టించుకోకుండా, కథనంలో పాత్రలు ఒక భాగం కాకుండా, కథే పాత్రల్ని నడిపిస్తే, అప్పుడా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందనేందుకు ఈ సినిమానే ఒక ఉదాహరణ. టైటిల్ రోల్ పోషిస్తున్న కమర్షియల్ పాత్ర కథని తాను  నడిపించకుండా, కథకుడు చెప్పినట్టు నడుచుకుంటే, అదొక స్క్రీన్ ప్లే కాదుకదా, కథకూడా అవదు. ఆర్టు సినిమా కథవుతుందేమో గానీ, కమర్షియల్ సినిమా కథవదు. పొరపాటున కూడా వర్మ ఆర్టు సినిమా అనుకుని ఈ సినిమా తీసి వుండరు. కమర్షియల్ సినిమాకి శక్తివంతమైన ప్రధానపాత్రే ప్రాణం. కమర్షియల్ సినిమాల కథలన్నీ సంఘర్షణల సమాహారాలు. సంఘర్షణ లేక పోతే పాత్రలేదు, పాత్ర లేకపోతే అవి పాల్పడే చర్యల్లేవు, చర్యల్లేక అసలు కథే లేదు, కథే లేకపోయాక స్క్రీన్ ప్లేనూ లేదు, అదంతే!

మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోషించిన ఈ ‘అన్న’అనే కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు పాత్ర ఎంత బలహీన ప్యాసివ్ పాత్రంటే, తన ప్రాణ శత్రు వెవరో తనకే తెలీక పదేపదే తనమీద దాడులు చేయించుకుంటూ-కుటుంబ సభ్యులని పోగొట్టుకుంటూ- తల్లడిల్లి పోతూంటాడు. ఇతను పరస్పర వైరుధ్యాల పుట్ట. పాపం ఎవడో అర్భకుడు కట్నంకోసం కడుపుతో వున్న పెళ్ళాన్ని వేధిస్తే, ఈ  ‘అన్న’ గారు ఇంత పెద్ద సుత్తి తీసుకుని వాడి కాళ్ళూ చేతులూ రాక్షసంగా విరగ్గొడతాడు. హాస్పిటల్లో పడేసి నెలకి పది వేలు ఇంటికి పంపమని అనుచరుడికి చెప్తాడు. మంచాన పడ్డ వీడికి భార్య సేవలుచేస్తూంటే, ఆమె ఎంత మంచిదో  తెలిసి వస్తూందంటాడు -అదేం న్యాయమో దేవుడెరుగు!


వద్దు బాబో ఈ న్యాయం!
అదే తన పెద్దకొడుకు ఒకమ్మాయిని ఎత్తుకుపోయి రేప్ చేసినప్పుడు, నీకు న్యాయం చేయలేను క్షమించమని ఆమెకి సింపుల్ గా చెప్పేసి పంపించేసి, కొడుకుని బెల్టుతో కొట్టి, ‘గృహనిర్బంధం’ మాత్రమే గావిస్తాడు. ఒక పెళ్ళికి వెళ్ళాలని భార్య వేడుకుంటే, విడుదల చేసేస్తాడు!

ఈ ‘అన్న’ అనుభవంలేని లేత పిండం చిన్న కొడుకు కృష్ణ ఏదో చెప్పగానే తను చంపిన శత్రువు కూతురితో ప్రేమని అంగీకరించేస్తాడు. తన మీద దాడులు జరుగుతున్నప్పుడు ఇదంతా ఈ ‘కూతురి’ పన్నాగమేమో అనుమానించడు.

ఈ పాత్ర చిత్రణలో చాలా పెద్ద లోపం ఏమిటంటే, ఒక డ్యాం కాంట్రాక్టు పనుల్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వర్గం ఎవరో  తనకి తెలీకుండా ఎలా వుంటుంది? అది నిత్యం వార్తల్లో నలిగే కామన్ నాలెడ్జియే కదా? డ్యాం ని తను అడ్డు కుంటున్నప్పుడు,  కింది స్థాయి నుంచీ అత్యున్నత అధికార వర్గాలవరకూ ఏమేం జరుగుతున్నాయో తెలీకుండానే ఉంటుందా!

కథ కోసం, ఏదో కథా సౌలభ్యం కోసమనుకుంటూ పాత్రని బలి చేశారు. కథ ప్రకారం పాత్ర నడవాలనుకున్నారు. పాత్రే కథని నడపాలన్న సామాన్య సూత్రాన్ని మరిచారు. పాత్రే కథని నడిపితే కథా ప్రపంచంలో జరిగే ఏ విషయమూ పాత్రనుంచి దాచి పెట్టలేరు. దాచిపెట్టాల్సిన అవసరం కథని ఇష్టారాజ్యంగా తానే  నడపాలనుకుంటున్న కథకుడికి వుంది గనుక పాత్ర ఇలా చేష్ట లుడిగిపోయింది. మొదటి దాడిలో కోడలు, మనవడు చనిపోయారన్న స్పృహ కూడా పాత్రకి లేకుండా పోయిందంటే,  పాత్ర చిత్రణ ఏ స్థాయిలో వుందో ఊహించుకోవచ్చు.

దర్శకుడు వర్మ అందరికీ భిన్నమైన కోణంలో ఆలోచించే దర్శకుడు నిజమే.. పాత్ర చిత్రణ ఎప్పుడూ ఇలాగే యాక్టివ్ గానే ఎందుకుండాలి, ఇదేమైనా మార్చ వీల్లేని  స్థిరీకరించిన  ఏక శిలా సదృశ శాసనమా?అనుకుని వుంటే కూడా-తన వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో విఫలమైనట్టే.

ఇది చాలామంది తెలీక చేసే పాసివ్ పాత్ర చిత్రణకి నిలువెత్తు నిదర్శనమే తప్ప మరేం కాదు. పాసివ్ పాత్ర కమర్షియల్ సినిమా విజయానికి పనికిరాదనే విషయం ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకుంటున్నది కాదు. ఈ సినిమాలో ఉన్నట్టే పాసివ్ పాత్రకి కథలో ఎదుగుదల కన్పించదు. అంటే క్యారక్టర్ ఆర్క్ ఉండదన్నమాట. ఇది లేకపోతే ఈ సినిమాలో లాగే చాలా బోరు కొడుతుందన్నమాట. ఈ పాత్ర సినిమా ప్రారంభంలో ఏ మానసిక స్థాయిలో వుందో, ముగింపు లోనూ జీవితంలోంచి ఏమీ నేర్చుకోకుండా అదే మానసిక  స్థాయిలో ఉండిపోయింది.


వీడు రూటు చూపిస్తాడు!
అయినా కూడా ఇలాటి పాత్రతో నూ కథని రంజింప జేయగలమా అంటే, తప్పకుండా చేయవచ్చు. దీని మెకానిజం ఎలావుంటుందో అన్నా మరియా క్రమ్ అనే స్క్రీన్ ప్లే రచయిత్రి ఆసక్తికరంగా వివరించింది...ఇదామె కు 2008 లో విడుదలైన డిస్నీ- పిక్సార్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘వాల్-ఇ’ ఆనే యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చూసినప్పుడు  కలిగిన అవగాహన...ఇందులో వాల్-ఇ అనే  రోబో పొరపాటున అంతరిక్ష నౌకలో పడి ఒక గ్రహం మీది కెళ్తుంది. అక్కడ ఈవ్ నే ఇంకో రోబోని ప్రేమిస్తుంది. ఇతర రోబోల్ని ఇది వాటికున్న ప్రోగ్రామింగ్ ని మించి ఎదగవచ్చని మోటివేట్ చేస్తూంటుంది. ఒక్కో రోబోని ఒక్కో విధంగా ఎగదోస్తూ వాటి అంతర్గత శక్తుల్ని బయటికి తీయిస్తుంది. దీంతో ఆ రోబోలన్నీ వాల్-ఇ ని దైవసమానంగా చూస్తూ అరాధిస్తాయి. స్థూలంగా ఇదీ కథ.


ఈ కథలో ప్రధాన పాత్ర అయిన వాల్-ఇ కి ఒక లక్ష్యం గానీ సంఘర్షణ గానీ లేకపోవడంతో దాని ఎదుగుదల- క్యారక్టర్ ఆర్క్ –కన్పించదు. క్యారక్టర్ ఆర్క్ లేకుండా ఏ కథా ఎంజాయ్ చేయలేం. అలాంటిది వాల్-ఇ విషయంలో ఈ లోటే తెలీలేదు సదరు రచయిత్రికి. ఎందుకని? ఎందుకనంటే, అది ఇతర క్యారక్టర్ల ఎదుగుదలకి దోహదపడి వాటి క్యారక్టర్ యార్క్ లని తనే క్రియేట్ చేస్తోంది  కాబట్టి. అయితే  ఈ కోవలో ఇది సీరియస్ గా  క్లాసు పీకే పాత్రలా బోరు కొట్టే ప్రమాదం కూడా వుంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ఈ పాత్రకి హాస్యప్రియత్వం అనే లక్షణాన్ని జోడించారు.  వెరసి ఇదొక రూల్స్ ని బ్రేక్ చేసిన క్యారక్టర్ ఆర్క్ లేని విజయవంతమైన పాత్రగా సూపర్ హిట్టయ్యింది!

ఇలాటిది ‘రౌడీ’లో జరగలేదు. జడం గా వుండే మోహన్ బాబు పాత్ర ఏ పాత్ర ఎదుగుదలనీ కోరుకోలేదు. కనీసం కుట్రని తిప్పికొట్టే సూత్రధారిగా ఇతర పాత్రల్ని తన ప్రయోజనం కోసం అస్త్ర శస్త్రాలుగా నైనా ఉపయోగించుకోలేదు. రూల్స్ ని బ్రేక్ చేయాలనుకుంటే అసలంటూ రూల్సేమిటో  తెలిసి వుండాలికదా? అదీ సమస్య!

ఒక సినిమా కథని ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు సృష్టించుకుంటే ఫలితాలేలావుంటాయో వేరే చెప్పక్కర్లేదు!

-సికిందర్ 















2, ఏప్రిల్ 2014, బుధవారం

పాత కళ-కళ 

పాత్రచిత్రణకి పరాకాష్ఠ ! 
ఆధునికత్వంతో సాంప్రదాయం అభ్యుదయంగా సాగితే దాని  ఔన్నత్యమే  వేరు. మాతృస్థానం లో  వున్నది ఆధునిక పోకడల్ని నిరసిస్తూ దూరం పాటిస్తే, అప్పుడు దారీతెన్నూ తెలీని ఆధునిక పోకడలు మరింత కాలుష్యాన్నే సృష్టిస్తాయి!

హోదా అనేది రాగ ద్వేషాల కోసం సమకూరదు. మార్గనిర్దేశం చేసేందుకోసం ప్రాప్తిస్తుంది. కరుడుగట్టిన సాంప్రదాయవాది శంకరాభరణం శంకరశాస్త్రే గనుక ఛీత్కార మంత్రమే పఠించి వుంటే, కె. విశ్వనాథ్ కి తన దర్శకత్వ ప్రతిభతో ఇంత చమత్కారం చేసే అవకాశమే దక్కేది కాదు. ఎంతో ఉదారంగా శంకర శాస్త్రి ‘ఊఁ..సరే, కానీయ్!’ అని భుజంతడితే గానీ విశ్వనాథ్ తనపని తను చేసుకుపోయే వీలు చిక్కలేదు. తీరా చూస్తే- అదొక మాటలకందని అద్భుత సృష్టి అయి, పండిత-పామర- పురాతన-ఆధునిక అగాధా లన్నిటినీ పూడ్చేస్తూ, సినిమా సక్సెస్ సూత్రాల్ని తిరగ రాసేస్తూ, మహోజ్వల వినోద సాధనమై కూర్చుంది మాహా దర్జాగా!


‘శంకరాభరణం’ ఫక్తు దర్శకుడి సినిమా. ఖాయంగా డబ్బులు రావని తెలిసికూడా సోమయాజులూ మంజూ భార్గవి ల్లాంటి ఏ బాక్సాఫీసు అప్పీలూ లేని నటులతో ఆడిన మహా జూదం. చోద్యంగా మారే ప్రమాదాన్ని కాచుకున్న మహా దృశ్య కావ్యం. మాట-పాట-ఆట-తీతా అన్నిటా సంభ్రమానికి గురిచేసే ఒక మహాద్భుత వైవిధ్య ప్రదర్శన.

పాశ్చాత్య సంగీత వ్యామోహంలో దేశీయ వారసత్వ సంపదైన శాస్త్రీయ సంగీతాన్ని అలక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేని సంగీత విద్వాంసుడు శంకర శాస్త్రి కథ ఇది. శంకర భరణం రాగంలో నిష్ణాతుడు. ప్రయోగాల పేరుతో అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయడాన్ని అస్సలు సహించడు. సంగీతానికి అతడి దృష్టిలో కులమతాల్లేవు. భాషా భేదాలూ స్వపర అంతరాలూ లేవు. 

 ఒకరకమైన సంగీతం గొప్పదనీ, మరొకటి అధమమనీ చెప్పడానికి మనమెవరన్న వివేచనకూడా అతడికుంది. సంగీతంలో ఆధునిక పోకడలపట్ల ధర్మాగ్రహమే తప్ప తానేదో గొప్పన్న అహంకారం  కాదది. సంప్రదాయానికేదో అపచారం జరిగిపోతోందనీ కళ్ళూ చెవులూ మూసుకుని తనలోకి తానూ ముడుచుకుపోయే సంకుచిత్వమూ, పలాయన వాదమూ లేవు. అలాటి అర్భకుల్ని దిశానిర్దేశం చేసి  సన్మార్గంలో పెట్టాలన్నతపనే. పాప్ మ్యూజిక్ కుర్ర గ్యాంగ్ అయినా, ప్రయోగాల పిచ్చి మాస్టా రైనా, తనకి అర్భకులే. వాళ్ల కంటే దివ్యంగా పాప్ కూతలు తాను కూయగలడు. అసలంటూ శాస్త్రీయ సంగీతపు పునాదులుంటే, ఇంకే సంగీతమైనా  అర్ధవంతంగా పాడగలరనీ నిరూపించనూ గలడు!

వృత్తి గతంగా ఇంతటి అభ్యుదయమున్న శంకర శాస్త్రికి వ్యక్తిగత జీవితంలోనూ విశాల దృక్పథమే. లోకులు ఛీ థూ అని దూరమైనా, తానొక నిష్టాగరిష్టుడైన సద్బ్రాహ్మణుడనే భేషజాలేవీ పెట్టుకోకుండా నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. ఆమె నాట్యాభిలాషని ప్రోత్సహిస్తాడు. సంగీతంలో అభ్యుదయవాది ఎంతో, జీవన సంగీతంలోనూ అంతే. అందుకే అంటాడు- ‘ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదు’ –అని.

సచే గ్రేట్ పర్సనాలిటీ! అయితే ఇంతటి  సెక్యులర్ పర్సనాలిటీ శాస్త్రీయ సంగీతానికి గనుక హాని జరుగుతోందని తెలిస్తే, కన్నకూతురి పెళ్లి సంబంధం సైతం చెడగొట్టుకోవడానికీ వెనుకాడడు! కూతురి గళాన ఆందోళనగా హిందోళ రాగం హింసపడి,

contd..