రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, April 10, 2014

రివ్యూ..
అదే గాడ్ ఫాదరీయం!


మోహన్ బాబు, విష్ణు,శాన్వీ శ్రీవాస్తవ, జయసుధ, తనికెళ్ళ భరణి, బెనర్జీ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్,  ఛాయాగ్రహణం ; సతీష్ ముత్యాల    మాటలు : గంగోత్రి విశ్వనాథ్
బ్యానర్ : ఏవీ పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాతలు :  విజయ కుమార్, పి. గజేంద్ర బాబు, ఎం. పార్ధసారధి నాయుడు
రచన -దర్శకత్వం : రాంగోపాల్ వర్మ

విడుదల : 4.4.2014     సెన్సార్ : U/A
***
ఇంకా తెలుగు సినిమాని ఎక్కడేసిన గొంగళిలా వుంచేసేందుకు కృషిచేసే దర్శకుల కొరత తీర్చడానికా అన్నట్టు ప్రత్యేకంగా ముంబాయి నుంచి రాం గోపాల్ వర్మ కూడా వచ్చి ఓచేయి వేసినట్టుంది.  ‘గాడ్ ఫాదర్’ ని  అదేపనిగా తీసే డైరెక్టర్లు లేకపోవడంకూడా వర్మకి ఇచ్చగించ నట్టుంది. చర్వితచరణంగా తను ‘గాడ్ ఫాదర్’ నే తీస్తూ ఉండకపోతే ప్రపంచం ఏమనుకుంటుందో నన్న భయసందేహాలు కూడా వెన్నాడుతున్నట్టుంది. అదే పనిగా తీసే ఓకే తరహా సినిమాలకి సృజనాత్మకతతో పనేముంటుంది గనుక - ఇది ‘రౌడీ’ అనే టైటిల్ పెట్టడం దగ్గర కూడా రుజువవుతూ- గొప్ప విషాద దృశ్యాన్ని కళ్ళెదుట నిలబెడుతోంది...


శివ-సత్య-కంపెనీ-సర్కార్-నిశ్శబ్ద్ ల వంటి వేటికవి ఆలోచనాత్మక సినిమాలుగా తీసిన దర్శకుడు అమాంతం అరాచక సినిమాల సారధి కావడం, అంతకి మించి ఎదగక పోవడం పోటీ యుగంలో విచిత్రమే.  ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి సుతారమూ ఇష్టంలేని ఆ సినిమా సీక్వెల్స్ ని నిర్మాతల ప్రోద్బలంతో నే తీయాల్సి వచ్చిందట. వర్మ అదే ‘గాడ్ ఫాదర్ ‘తో  తరాలు మారుతున్న ప్రేక్షకుల్నీ ఆకట్టుకుకో గల్గుతాననుకోవడంలో తనకి మాత్రమే తెలిసిన సక్సెస్ ఫార్ములా ఇంకా ఏదో అందులో కన్పిస్తోందేమో.  కపోలా  తన 29 ఏళ్ల కుర్ర వయసులో వయసుమళ్ళిన దశలో కెరీర్ ప్రారంభిస్తున్నట్టు, ఓల్డర్ లుక్ గల ‘గాడ్ ఫాదర్’ తీయాల్సి వచ్చిందనీ, అదే ఇప్పుడు తన వయసుమళ్ళిన దశలో కుర్రాడిలా కెరీర్ ప్రారంభిస్తున్నట్టు,  యంగర్ లుక్ గల సినిమా తీస్తున్నాననీ ‘యూత్ వితౌట్ యూత్’ తీస్తున్న సందర్భంగా ఛలోక్తి విసిరాడు! ప్రేక్షకులు విసిగిపోయినా  ‘గాడ్ ఫాదర్’ నస తో  వర్మ కింకా వార్ధక్యం అనుభవం కావడం లేదేమో!
ఇలా వుంటే ఎంత బావుండేది!


ఇప్పుడు  లేని ఫ్యాక్షన్ గొడవల్ని  ‘గాడ్ ఫాదర్’ ఆలంబనగా తీయాల్సి వచ్చిన ఒక అవస్థ 'రౌడీ'. మేకప్ లేకుండా మోహన్ బాబు నటించాడన్న ఒక్క విశేషం తప్పితే ఏ కొత్తదనమూ లేని వన్ బై టూ కిచిడీ గా-  ప్రథమార్ధపు  వాస్తవిక ధోరణి కాస్తా సెకండాఫ్ లో మూస ఫార్ములా చిత్రీకరణకి ఫిరాయించిన దర్శకత్వపు తీరు.

నందవరం ప్రాజెక్టు ప్రహసనం

సమకాలీన రాజకీయం అన్పిస్తూ, గొడవెందుకన్నట్టు రాజీ పడినట్టనిపించే కాలక్షేప చిత్రణ ఇది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టూ దాని ముంపుగ్రామాల వివాదమూ ఇంకా రగులుతూ వుండగానే, ఈసినిమా ‘నందవరం’ ప్రాజెక్టూ దాని చుట్టూ కుట్రా అంటూ వేరేదారి పట్టిపోయింది . ‘రక్తచరిత్ర’ లాంటి డేరింగ్ సినిమా తీయగల్గిన వర్మ చేతిలో చితికిపోయిన ఈ సినిమాలో ఓ కుట్ర- ఆ  కుట్రలో టార్గెట్ ‘అన్న’ (మోహన్ బాబు) అనే కరుడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్టు. ఇతడికి భార్య (జయసుధ), కొడుకులిద్దరు భూషణ్ (కిషోర్), కృష్ణ (విష్ణు) అనే తూర్పు పడమరలు.


మాట వేదం- చేత శూన్యం 
ఆప్రాంతాల ‘అన్న’ మాటే వేదం. ప్రజలకి ఆయనే దేవుడు. మాట వినని మనిషిని కఠినంగా శిక్షిస్తాడు. ‘న్యాయం కోసం’ హత్యలు చేయిస్తే అరెస్టు చేసే ధైర్యం ఎస్పీకి కూడా  వుండదు. ఇలాటి తండ్రి అండ చూసుకుని పెద్దకొడుకు భూషణ్ చుట్టుపక్కల అరాచకాలు చేస్తూ సమస్యగా తయారవుతాడు. ఇతడికి భార్య, కొడుకు కూడా వుంటారు. చిన్న కొడుకు కృష్ణ బుద్ధిమంతుడు. సిటీలో ఇతను శిరీషా (శాన్వి ) అనే అమ్మాయిని రౌడీల బారి నుంచి కాపాడిన పరిణామ క్రమంలో ఆమె ఇతడితో ప్రేమలో పడుతుంది. ఇతని తండ్రి తన తండ్రిని చంపించాడని తెలిసీ ప్రేమిస్తుంది. ఈ విషయం కృష్ణ తండ్రికి చెప్తే, ఆమె గొప్పమనసుకి తెగ ఫీలైపోతాడు అన్నగారైన తండ్రి.

ఇంకో వైపు ఓ వ్యాపార ముఠా ( తనికెళ్ళ, జీవా, విశ్వనాథ్) అన్న కి వ్యతిరేకంగా పథకా లాలోచిస్తూంటారు. వీళ్ళ వెనుక అసలు వ్యాపారవేత్త ఇంకొక డుంటాడు. వీళ్ళు ప్రతిపాదించిన నందవరం ప్రాజెక్టు పనులు సంపాదించుకోవాలి. కానీ ఈ ప్రాజెక్టు కడితే మూడు నాల్గొందల గ్రామాలు మునుగుతాయని అన్న అడ్డుపడుతున్నాడు. ఈ అన్న పీడా ఎలా తొలగించాలి? ముందుగా పెద్ద కొడుకు భూషన్ ని తమవైపు లాగుతారు. ఇది పెద్దగా లాభించక పోవడంతో ఏకంగా అన్ననే లేపేసేందుకు పూనుకుంటారు.

ఇదీ విషయం. ఇప్పుడు వీళ్ళ కుట్రని కృష్ణ ఎలా భగ్నం చేశాడన్నది మిగతా కథ.

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మోహన్ బాబు గురించి చెప్పుకోవాలంటే, ప్రధానంగా పాత్ర చిత్రణ ఆయన అభినయ చాతుర్యానికి ప్రతిబంధకంగా మారింది.  ఏ మేకప్పూ హంగూ  ఆర్భాటాలూ లేకుండా ఎంత బాగా నటిస్తేనేం, పాత్రలో  అసలంటూ సరుకుండాలిగా? దీనిగురించి వివరంగా ‘పాత్రోచితానుచితాలు’  విభాగంలో మాట్లాడుకుందాం. ఇతరపాత్రల్లో విష్ణు, శాన్వి, జయసుధ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులున్నా బలహీన పాత్రల కారణంగా వీళ్ళూ ప్రభావం చూపలేకపోయారు.

సాంకేతికంగా, సంగీతపరంగా, యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా నీరసంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు అలవాటులేని బ్రౌన్ టింట్ లో గ్రేడింగ్ వర్మ అదేపనిగా చేయడం మాత్రం మానుకోవడంలేదు.

స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకుడు గమనించారో లేదో గానీ,  ప్రథమార్ధం షుగర్ కోటింగ్ లేని సహజత్వం తో కూడిన సన్నివేశాలతో  (ఈ సన్నివేశాల కల్పన కూడా పూర్ గా వుండడం వేరే సంగతి), ద్వితీయార్ధం సహజత్వం లేని కృతిమ మూస ఫార్ములా సన్నివేశాలతోనూ దర్శకత్వం దారి తప్పి నడుస్తుంది. సెకండాఫ్ లో డాక్టర్ల వేషాల్లో ముఠా వచ్చి హాస్పిటల్లో ‘అన్న’ మీద హత్యాయత్నం చేయడం, దాన్ని కృష్ణ ఎదుర్కోవడం, అలాగే కృష్ణ- శిరీషా లమీద తుపాకీ కాల్పులు జరుపుతూ దుండగులు వెంటాడ్డం, ఆ సందర్భంగా జరిగే ఫైట్ దృశ్యాలూ వగైరా ఫస్టాఫ్ సహజ ఫ్యాక్షన్ శైలిలో ఇమిడేవికావు. ఒక విధంగా ఇవి వీక్షణానుభావాన్ని భంగపరుస్తాయి. ఇంటర్వెల్ వరకూ రియలిస్టిక్ సినిమా చూసి, ఇంటర్వెల్ తర్వాతనుంచీ పూర్తిగా వేరే రొటీన్ ఫార్ములా సినిమా చూస్తున్నట్టు వుంటుంది.

స్క్రీన్ ప్లే కి కూడా ఒక నిర్మాణమంటూ లేదు. దీనిక్కారణం ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో తెలుసుకుందాం. ఎప్పుడో ఇంటర్వెల్ వరకూ మలుపు లేకుండా మొదటి అంకమే సుదీర్ఘంగా అపసోపాలుపడుతూ సాగుతుంది. అక్కడ పెళ్ళికి వెళ్తున్న ‘అన్న’ బృందం మీద మొదటి దాడి జరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత రెండో అంకంలో పడిన కథ వెంటనే శైలి మార్చుకుంటూ మూస ఫార్ములా ధోరణిలో పడి, హాస్పటల్లో మరోసారి ‘అన్న’ మీద దాడి జరుగుతుంది. మొదటి హత్యాయత్నం జరిగాక దాని  పరిణామాల మూల్యాంకన, ‘అన్న’ ప్రతివ్యూహం, శాంతి భద్రతల పరిస్థితి, ప్రభుత్వ యంత్రాంగం స్పందన మొదలైనవేవీ పరిగణనలోకి తీసుకోకుండా, ప్రత్యర్ధులు వెంటనే మరోదాడికి పాల్పడ్డం ఎక్కడా జరగదు. అంటే  దర్శకుడు కథనంలో సాధారణంగా పాటించాల్సిన  ‘పేసింగ్’ ని కూడా పట్టించుకోలేదన్న మాట.


తండ్రిని చంపినా ఈమెకి ప్రేమే !
ఇది చాలనట్టు రెండోసారి కూడా హాస్పిటల్లో దాడి చేసి ‘అన్న’ భార్యని చంపేస్తారు. విచిత్రమేమిటంటే ఇన్నేసి దాడులు చేస్తున్నదెవరో అంతటి ‘అన్న’ కి తెలీకపోవడం! క్లైమాక్స్ కి ముందు కృష్ణ చెప్తే నే తెలుస్తుంది. అదికూడా కృష్ణకి ఫస్టాఫ్ లోనే  మొదటి దాడి జరక్కముందే, హీరోయిన్ అన్న ఆ దాడి ప్రమాదాన్ని హెచ్చరించినప్పుడే, శత్రువు గురించి సూచన లందుతాయి. ఇది  దర్శకుడి కథా సౌలభ్యంకోసం మర్చిపోయాడు  బహుశా కృష్ణ! సరే, చిట్టచివరికి ఆ శత్రువుని పట్టుకు రమ్మంటాడు ‘అన్న’ . పట్టుకువస్తే పాత  సినిమాల్లోలాగా కేవలం ఓ కత్తితో కడుపులో గుచ్చితే, కిందపడి చచ్చిపోతాడు శత్రువు!

క్లైమాక్స్ వరకూ విలన్ ఎవరో చెప్పకపోవడంవల్ల, ‘అన్న’కీ, విలన్ కీ మధ్య ముఖాముఖీ ఉండాల్సిన నువ్వానేనా పోరు లోపించి టైం అండ్ టెన్షన్ గ్రాఫు ఐపులేకుండా పోయి- చేవ చచ్చిపోయింది సినిమా. విలన్ ఎవరో చివరి వరకూ చూపించకుండా ‘ఎండ్ సస్పెన్స్’ పోషించడం ఎక్కడో మర్డర్ మిస్టరీల్లో వాడుకునే టూల్. ఇదికూడా ఇప్పటి సినిమాల్లో భరించే ఓపిక ప్రేక్షకులకి లేదు. దీంతో ‘ఎండ్ సస్పెన్స్’ ని కూడా సినిమాల్లో పక్కనపెట్టేసి, అడుగడుగునా టెన్షన్ పెట్టే ‘సీన్-టు-సీన్’ సస్పెన్స్ ని వాడుకుంటున్నారు. ప్రస్తుత సినిమాలో ఉన్న మూస ఫార్ములా ప్రక్రియ చొరబాటుకి తోడు ఈ మర్డర్ మిస్టరీ టూల్ ఒకటొచ్చి పడింది కథనంలో. ఏకసూత్రత ఇన్నిసార్లు మటాష్ అవుతూంటే ఇక ఏ రస ప్రధానంగా ఈ సినిమా ని ఫాలోఅవాలి?

ఇంటర్వెల్ ముందు ‘పదకొండు నిమిషాల లాంగెస్ట్ యాక్షన్ సీన్ ‘ అంటూ కూడా పబ్లిసిటీ చేశారు. ‘అన్న’ని ఒంటరిచేసి పెద్ద ముఠా కత్తులతో దాడిచేసే యాక్షన్ కోరియోగ్రఫీ –టెన్షన్ లేకపోగా చాలా డీలాగా హాస్యాస్పదంగా కూడా వుంది. ఫ్యాక్షన్ ఎటాక్ ఈ పద్ధతిలో జరుగుతుందా? ఇంతకంటే రోమాంచితంగా  గతంలో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో చిత్రీకరించారు. అన్నట్టు దీనికంటే ముందు విడుదలైన ‘లెజెండ్’ లో ఇలాగే ఇంటర్వెల్ సీన్లో పెళ్లి బృందం మీద (బీభత్స భరిత)దాడి దృశ్యాలు వుండడం కాకతాళీయమే కావొచ్చు.


ఒక డ్యూయెట్ కి లీడ్ సీను -ఉన్నట్టుండి హీరోయిన్ హాస్యాస్పదమైన డైలాగులతో,  క్రియేటివిటీతో పనుండని ‘బి’గ్రేడ్ చిత్రీకరణకి తక్కువేమీ కాదు!

పాత్రోచితానుచితాలు


అందరికీ 'అన్న'-విలన్ కి సున్నా - 
పాత్రల్ని పట్టించుకోకుండా, కథనంలో పాత్రలు ఒక భాగం కాకుండా, కథే పాత్రల్ని నడిపిస్తే, అప్పుడా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందనేందుకు ఈ సినిమానే ఒక ఉదాహరణ. టైటిల్ రోల్ పోషిస్తున్న కమర్షియల్ పాత్ర కథని తాను  నడిపించకుండా, కథకుడు చెప్పినట్టు నడుచుకుంటే, అదొక స్క్రీన్ ప్లే కాదుకదా, కథకూడా అవదు. ఆర్టు సినిమా కథవుతుందేమో గానీ, కమర్షియల్ సినిమా కథవదు. పొరపాటున కూడా వర్మ ఆర్టు సినిమా అనుకుని ఈ సినిమా తీసి వుండరు. కమర్షియల్ సినిమాకి శక్తివంతమైన ప్రధానపాత్రే ప్రాణం. కమర్షియల్ సినిమాల కథలన్నీ సంఘర్షణల సమాహారాలు. సంఘర్షణ లేక పోతే పాత్రలేదు, పాత్ర లేకపోతే అవి పాల్పడే చర్యల్లేవు, చర్యల్లేక అసలు కథే లేదు, కథే లేకపోయాక స్క్రీన్ ప్లేనూ లేదు, అదంతే!

మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోషించిన ఈ ‘అన్న’అనే కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు పాత్ర ఎంత బలహీన ప్యాసివ్ పాత్రంటే, తన ప్రాణ శత్రు వెవరో తనకే తెలీక పదేపదే తనమీద దాడులు చేయించుకుంటూ-కుటుంబ సభ్యులని పోగొట్టుకుంటూ- తల్లడిల్లి పోతూంటాడు. ఇతను పరస్పర వైరుధ్యాల పుట్ట. పాపం ఎవడో అర్భకుడు కట్నంకోసం కడుపుతో వున్న పెళ్ళాన్ని వేధిస్తే, ఈ  ‘అన్న’ గారు ఇంత పెద్ద సుత్తి తీసుకుని వాడి కాళ్ళూ చేతులూ రాక్షసంగా విరగ్గొడతాడు. హాస్పిటల్లో పడేసి నెలకి పది వేలు ఇంటికి పంపమని అనుచరుడికి చెప్తాడు. మంచాన పడ్డ వీడికి భార్య సేవలుచేస్తూంటే, ఆమె ఎంత మంచిదో  తెలిసి వస్తూందంటాడు -అదేం న్యాయమో దేవుడెరుగు!


వద్దు బాబో ఈ న్యాయం!
అదే తన పెద్దకొడుకు ఒకమ్మాయిని ఎత్తుకుపోయి రేప్ చేసినప్పుడు, నీకు న్యాయం చేయలేను క్షమించమని ఆమెకి సింపుల్ గా చెప్పేసి పంపించేసి, కొడుకుని బెల్టుతో కొట్టి, ‘గృహనిర్బంధం’ మాత్రమే గావిస్తాడు. ఒక పెళ్ళికి వెళ్ళాలని భార్య వేడుకుంటే, విడుదల చేసేస్తాడు!

ఈ ‘అన్న’ అనుభవంలేని లేత పిండం చిన్న కొడుకు కృష్ణ ఏదో చెప్పగానే తను చంపిన శత్రువు కూతురితో ప్రేమని అంగీకరించేస్తాడు. తన మీద దాడులు జరుగుతున్నప్పుడు ఇదంతా ఈ ‘కూతురి’ పన్నాగమేమో అనుమానించడు.

ఈ పాత్ర చిత్రణలో చాలా పెద్ద లోపం ఏమిటంటే, ఒక డ్యాం కాంట్రాక్టు పనుల్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వర్గం ఎవరో  తనకి తెలీకుండా ఎలా వుంటుంది? అది నిత్యం వార్తల్లో నలిగే కామన్ నాలెడ్జియే కదా? డ్యాం ని తను అడ్డు కుంటున్నప్పుడు,  కింది స్థాయి నుంచీ అత్యున్నత అధికార వర్గాలవరకూ ఏమేం జరుగుతున్నాయో తెలీకుండానే ఉంటుందా!

కథ కోసం, ఏదో కథా సౌలభ్యం కోసమనుకుంటూ పాత్రని బలి చేశారు. కథ ప్రకారం పాత్ర నడవాలనుకున్నారు. పాత్రే కథని నడపాలన్న సామాన్య సూత్రాన్ని మరిచారు. పాత్రే కథని నడిపితే కథా ప్రపంచంలో జరిగే ఏ విషయమూ పాత్రనుంచి దాచి పెట్టలేరు. దాచిపెట్టాల్సిన అవసరం కథని ఇష్టారాజ్యంగా తానే  నడపాలనుకుంటున్న కథకుడికి వుంది గనుక పాత్ర ఇలా చేష్ట లుడిగిపోయింది. మొదటి దాడిలో కోడలు, మనవడు చనిపోయారన్న స్పృహ కూడా పాత్రకి లేకుండా పోయిందంటే,  పాత్ర చిత్రణ ఏ స్థాయిలో వుందో ఊహించుకోవచ్చు.

దర్శకుడు వర్మ అందరికీ భిన్నమైన కోణంలో ఆలోచించే దర్శకుడు నిజమే.. పాత్ర చిత్రణ ఎప్పుడూ ఇలాగే యాక్టివ్ గానే ఎందుకుండాలి, ఇదేమైనా మార్చ వీల్లేని  స్థిరీకరించిన  ఏక శిలా సదృశ శాసనమా?అనుకుని వుంటే కూడా-తన వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో విఫలమైనట్టే.

ఇది చాలామంది తెలీక చేసే పాసివ్ పాత్ర చిత్రణకి నిలువెత్తు నిదర్శనమే తప్ప మరేం కాదు. పాసివ్ పాత్ర కమర్షియల్ సినిమా విజయానికి పనికిరాదనే విషయం ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకుంటున్నది కాదు. ఈ సినిమాలో ఉన్నట్టే పాసివ్ పాత్రకి కథలో ఎదుగుదల కన్పించదు. అంటే క్యారక్టర్ ఆర్క్ ఉండదన్నమాట. ఇది లేకపోతే ఈ సినిమాలో లాగే చాలా బోరు కొడుతుందన్నమాట. ఈ పాత్ర సినిమా ప్రారంభంలో ఏ మానసిక స్థాయిలో వుందో, ముగింపు లోనూ జీవితంలోంచి ఏమీ నేర్చుకోకుండా అదే మానసిక  స్థాయిలో ఉండిపోయింది.


వీడు రూటు చూపిస్తాడు!
అయినా కూడా ఇలాటి పాత్రతో నూ కథని రంజింప జేయగలమా అంటే, తప్పకుండా చేయవచ్చు. దీని మెకానిజం ఎలావుంటుందో అన్నా మరియా క్రమ్ అనే స్క్రీన్ ప్లే రచయిత్రి ఆసక్తికరంగా వివరించింది...ఇదామె కు 2008 లో విడుదలైన డిస్నీ- పిక్సార్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘వాల్-ఇ’ ఆనే యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చూసినప్పుడు  కలిగిన అవగాహన...ఇందులో వాల్-ఇ అనే  రోబో పొరపాటున అంతరిక్ష నౌకలో పడి ఒక గ్రహం మీది కెళ్తుంది. అక్కడ ఈవ్ నే ఇంకో రోబోని ప్రేమిస్తుంది. ఇతర రోబోల్ని ఇది వాటికున్న ప్రోగ్రామింగ్ ని మించి ఎదగవచ్చని మోటివేట్ చేస్తూంటుంది. ఒక్కో రోబోని ఒక్కో విధంగా ఎగదోస్తూ వాటి అంతర్గత శక్తుల్ని బయటికి తీయిస్తుంది. దీంతో ఆ రోబోలన్నీ వాల్-ఇ ని దైవసమానంగా చూస్తూ అరాధిస్తాయి. స్థూలంగా ఇదీ కథ.


ఈ కథలో ప్రధాన పాత్ర అయిన వాల్-ఇ కి ఒక లక్ష్యం గానీ సంఘర్షణ గానీ లేకపోవడంతో దాని ఎదుగుదల- క్యారక్టర్ ఆర్క్ –కన్పించదు. క్యారక్టర్ ఆర్క్ లేకుండా ఏ కథా ఎంజాయ్ చేయలేం. అలాంటిది వాల్-ఇ విషయంలో ఈ లోటే తెలీలేదు సదరు రచయిత్రికి. ఎందుకని? ఎందుకనంటే, అది ఇతర క్యారక్టర్ల ఎదుగుదలకి దోహదపడి వాటి క్యారక్టర్ యార్క్ లని తనే క్రియేట్ చేస్తోంది  కాబట్టి. అయితే  ఈ కోవలో ఇది సీరియస్ గా  క్లాసు పీకే పాత్రలా బోరు కొట్టే ప్రమాదం కూడా వుంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ఈ పాత్రకి హాస్యప్రియత్వం అనే లక్షణాన్ని జోడించారు.  వెరసి ఇదొక రూల్స్ ని బ్రేక్ చేసిన క్యారక్టర్ ఆర్క్ లేని విజయవంతమైన పాత్రగా సూపర్ హిట్టయ్యింది!

ఇలాటిది ‘రౌడీ’లో జరగలేదు. జడం గా వుండే మోహన్ బాబు పాత్ర ఏ పాత్ర ఎదుగుదలనీ కోరుకోలేదు. కనీసం కుట్రని తిప్పికొట్టే సూత్రధారిగా ఇతర పాత్రల్ని తన ప్రయోజనం కోసం అస్త్ర శస్త్రాలుగా నైనా ఉపయోగించుకోలేదు. రూల్స్ ని బ్రేక్ చేయాలనుకుంటే అసలంటూ రూల్సేమిటో  తెలిసి వుండాలికదా? అదీ సమస్య!

ఒక సినిమా కథని ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు సృష్టించుకుంటే ఫలితాలేలావుంటాయో వేరే చెప్పక్కర్లేదు!

-సికిందర్