రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

The dubious privilege of a freelance writer is he’s given the freedom to starve anywhere.
- S.J. Perelman

Wednesday, April 2, 2014

పాత కళ-కళ 

పాత్రచిత్రణకి పరాకాష్ఠ ! 
ఆధునికత్వంతో సాంప్రదాయం అభ్యుదయంగా సాగితే దాని  ఔన్నత్యమే  వేరు. మాతృస్థానం లో  వున్నది ఆధునిక పోకడల్ని నిరసిస్తూ దూరం పాటిస్తే, అప్పుడు దారీతెన్నూ తెలీని ఆధునిక పోకడలు మరింత కాలుష్యాన్నే సృష్టిస్తాయి!

హోదా అనేది రాగ ద్వేషాల కోసం సమకూరదు. మార్గనిర్దేశం చేసేందుకోసం ప్రాప్తిస్తుంది. కరుడుగట్టిన సాంప్రదాయవాది శంకరాభరణం శంకరశాస్త్రే గనుక ఛీత్కార మంత్రమే పఠించి వుంటే, కె. విశ్వనాథ్ కి తన దర్శకత్వ ప్రతిభతో ఇంత చమత్కారం చేసే అవకాశమే దక్కేది కాదు. ఎంతో ఉదారంగా శంకర శాస్త్రి ‘ఊఁ..సరే, కానీయ్!’ అని భుజంతడితే గానీ విశ్వనాథ్ తనపని తను చేసుకుపోయే వీలు చిక్కలేదు. తీరా చూస్తే- అదొక మాటలకందని అద్భుత సృష్టి అయి, పండిత-పామర- పురాతన-ఆధునిక అగాధా లన్నిటినీ పూడ్చేస్తూ, సినిమా సక్సెస్ సూత్రాల్ని తిరగ రాసేస్తూ, మహోజ్వల వినోద సాధనమై కూర్చుంది మాహా దర్జాగా!


‘శంకరాభరణం’ ఫక్తు దర్శకుడి సినిమా. ఖాయంగా డబ్బులు రావని తెలిసికూడా సోమయాజులూ మంజూ భార్గవి ల్లాంటి ఏ బాక్సాఫీసు అప్పీలూ లేని నటులతో ఆడిన మహా జూదం. చోద్యంగా మారే ప్రమాదాన్ని కాచుకున్న మహా దృశ్య కావ్యం. మాట-పాట-ఆట-తీతా అన్నిటా సంభ్రమానికి గురిచేసే ఒక మహాద్భుత వైవిధ్య ప్రదర్శన.

పాశ్చాత్య సంగీత వ్యామోహంలో దేశీయ వారసత్వ సంపదైన శాస్త్రీయ సంగీతాన్ని అలక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేని సంగీత విద్వాంసుడు శంకర శాస్త్రి కథ ఇది. శంకర భరణం రాగంలో నిష్ణాతుడు. ప్రయోగాల పేరుతో అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయడాన్ని అస్సలు సహించడు. సంగీతానికి అతడి దృష్టిలో కులమతాల్లేవు. భాషా భేదాలూ స్వపర అంతరాలూ లేవు. 

 ఒకరకమైన సంగీతం గొప్పదనీ, మరొకటి అధమమనీ చెప్పడానికి మనమెవరన్న వివేచనకూడా అతడికుంది. సంగీతంలో ఆధునిక పోకడలపట్ల ధర్మాగ్రహమే తప్ప తానేదో గొప్పన్న అహంకారం  కాదది. సంప్రదాయానికేదో అపచారం జరిగిపోతోందనీ కళ్ళూ చెవులూ మూసుకుని తనలోకి తానూ ముడుచుకుపోయే సంకుచిత్వమూ, పలాయన వాదమూ లేవు. అలాటి అర్భకుల్ని దిశానిర్దేశం చేసి  సన్మార్గంలో పెట్టాలన్నతపనే. పాప్ మ్యూజిక్ కుర్ర గ్యాంగ్ అయినా, ప్రయోగాల పిచ్చి మాస్టా రైనా, తనకి అర్భకులే. వాళ్ల కంటే దివ్యంగా పాప్ కూతలు తాను కూయగలడు. అసలంటూ శాస్త్రీయ సంగీతపు పునాదులుంటే, ఇంకే సంగీతమైనా  అర్ధవంతంగా పాడగలరనీ నిరూపించనూ గలడు!

వృత్తి గతంగా ఇంతటి అభ్యుదయమున్న శంకర శాస్త్రికి వ్యక్తిగత జీవితంలోనూ విశాల దృక్పథమే. లోకులు ఛీ థూ అని దూరమైనా, తానొక నిష్టాగరిష్టుడైన సద్బ్రాహ్మణుడనే భేషజాలేవీ పెట్టుకోకుండా నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. ఆమె నాట్యాభిలాషని ప్రోత్సహిస్తాడు. సంగీతంలో అభ్యుదయవాది ఎంతో, జీవన సంగీతంలోనూ అంతే. అందుకే అంటాడు- ‘ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదు’ –అని.

సచే గ్రేట్ పర్సనాలిటీ! అయితే ఇంతటి  సెక్యులర్ పర్సనాలిటీ శాస్త్రీయ సంగీతానికి గనుక హాని జరుగుతోందని తెలిస్తే, కన్నకూతురి పెళ్లి సంబంధం సైతం చెడగొట్టుకోవడానికీ వెనుకాడడు! కూతురి గళాన ఆందోళనగా హిందోళ రాగం హింసపడి,

contd..  

No comments: