రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, మార్చి 2014, సోమవారం


పాత కళ -కళ !


‘ముత్యాల ముగ్గు’ ముగింపు మెరుపులు!


‘డైరె‘డైరెట్రూ, పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో? సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ? మాసిపోయిన మూస పాత్రలు, డైలాగులు, యాక్టింగులూ మర్డరై పోయిన దృశ్య మయ్యా ఇదీ. డైరెట్రు అన్నాక  కాస్తంత కళా పోసనుండాలయ్యా. ఉత్తినే కాపీకొట్టి కాలరెగరేస్తే డైరెట్రుకీ, దిగిపోయిన బ్యాట్రీకీ తేడా ఏటుంటది?’

ముత్యాలముగ్గు’ లో రావు గోపాలరావు ఫేమస్ విలనీ రీమిక్స్ అయిందని పై డైలాగు చూసి ఎవరైనా సీడీల కోసం రేసు మొదలెడితే అంతకన్నా ‘కర్సయిపోవడం’ వుండదు! అది ‘యాభైలో సగం పన్నెండున్నర’ బాపతు అమాయకత్వమే అవుతుంది. పై నివేదన నేటి అభిరుచిగల ప్రేక్షకుడి/ప్రేక్షకురాలి ఆవేదనే కావొచ్చు. ‘ముత్యాలముగ్గు’ ని చూసిన కళ్ళతో నేటి సినిమాల్ని చూడలేకపోతున్న రోదనే కావొచ్చు. వాస్తవమెప్పుడూ కర్కశంగానే వుంటుంది. ‘ముత్యాలముగ్గు’ దీన్ని  గుర్తు చేస్తూనే వుంటుంది.

సినిమా అన్నది కళాత్మక వ్యాపారమని అందరూ అంటారు. కళాత్మకంగా కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళే తక్కువ. ఓ కళాత్మక (ఆర్టు) సినిమా తీసే ముందు మామూలు కమర్షియల్ మసాలా లతో చేయి తిప్పుకోండని ‘స్టోరీ’ అన్న ఉద్గ్రంధం రాసిన  ప్రొఫెసర్ రాబర్ట్ మెక్ కీ సినిమా దర్శకులకి సలహా ఇస్తాడు. ఒకవేళ ఆ దర్శకుడు వెండితెర మీద కెమెరాని కుంచెలా  మల్చుకోక ముందు, బ్రష్ తో కాన్వాస్ ని రంగుల రమ్యలోకంగా చేస్తున్న చిత్రకారుడయితే? అప్పుడతను వేరే కమర్షియల్సూ, కాకరకాయలంటూ కళాత్మక సినిమాకోసం ప్రత్యేకంగా చేయి తిప్పుకోవాల్సిన అవసరముంటుందా? ఇదీ ‘బాపు’ గారి ప్రశస్తి అంటే!

ముదిమితనానికి నో !
1967లో ‘సాక్షి’ అనే తొలి కళాత్మక ప్రయత్నం చేసినప్పుడే ఆయన నేపధ్యం చిత్ర లేఖనం. అలా చిత్రకారుడు చలన చిత్ర కారుడైనప్పుడు ఆ సృజనాత్మకతకి  వయస్సే  మీదపడదేమో? ‘ముత్యాల ముగ్గు’ తీసి నలభై ఏళ్ళు కావొస్తున్నా ముదిమితనమే అంటలేదు. మళ్ళీ ఒక్కసారి సీడీ వేసుకుని చూస్తే, ఏ విభాగంలో ఇది ప్రస్తుత కాలానికి వెనుకబడింది?కథా కథనాలు, మాటలు, సంగీత  సాహిత్యాలు, నటనలు, చిత్రీకరణా ఏదీ కాలదోషం పట్టని అసమాన సృజనే. అసలే మేకప్పూ లేని నటీ నటులతో వాస్తవిక కథాచిత్రాల నడక నడుస్తూనే, కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కావడం దీనికే చెల్లింది.

ఇంకో దశాబ్ద కాలంలో ఆర్టు సినిమాల చెలామణి చరమాంకం కొస్తుందనగా,  బాపు భవిష్యద్దర్శనం చేసినట్టు అప్పుడే (1975లో )ఈ ముందుకాలపు ‘కమర్షియలార్టు’ నిచ్చారు. ఉత్తరాదిన ఆర్టు సినిమాల ఉద్యమం ముగిశాక వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆతర్వాత బాలీవుడ్ లో క్రాసోవర్ సినిమాల పేరుతో  వచ్చినవన్నీ, నేటికీ వస్తున్నవీ ‘ముత్యాలముగ్గు’ టైపు కమర్షియలార్టు సినిమాలే.

‘ముత్యాలముగ్గు’ అనగానే రావుగోపాలరావు మెదలడం సహజం. కానీ ‘ముత్యాలముగ్గు’ అంటే కేవలం రావుగోపాలరావు క్లాసిక్ విలనీ మాత్రమే కాదు, బహు సుందరమైన కుటుంబ గాథ కూడా. హృద్యమైన శోకనాశన జానకీ వృత్తాంతం. ఆధునిక రామాయణం...ఉత్తర రామాయణం! విడిపోయిన భార్యా భర్తలమధ్య పసి పిల్లల గేమ్ ప్లాన్!

శ్రీధర్, సంగీతలు భార్యాభర్తలు. బాధితురాలు భార్యే. బాధకుడు డబ్బుకోసం ఏమైనా చేసే కాంట్రాక్టర్ రావుగోపాలరావు. అప్పుడా తల్లి అవస్థ చూడలేక కవలలిద్దరూ సదరు కాంట్రాక్టరు దురాగతాన్ని నిరూపించి, పునీతురాలిగా తిరిగి పునీతురాలిగా తిరిగి తల్లిని కన్నతండ్రితో కలిపి సుఖాంతం చేసే వృత్తాంతమే.
ఎందరికో భిక్ష!
సినిమా కథని ఆసక్తిగా మొదలెట్టాలంటే రెండు మార్గాలున్నాయంటాడు సిడ్ ఫీల్డ్. ఏదైనా ఒక సంఘటనతో యాక్షన్ దృశ్యాల్ని చూపడం, లేదా పాత్ర ద్వారా కథని వివరిస్తూ పోవడం. బాపుగారు తన మూడంకాల స్క్రీన్  ప్లేకి ఈ రెండో విధానాన్నే ఎంచుకున్నారు. శ్రీధర్ పాత్ర ద్వారా జమీందారు అయిన తండ్రి కాంతారావుని, ఆయన అక్కగార్ని, ముక్కామలని, అతడి మోడరన్ కూతుర్ని, అక్కడి ఉద్యోగి అల్లు రామలింగయ్యని, శ్రీధర్ స్నేహితుడ్నీ చకచకా పరిచయం చేసేసి- ఆ స్నేహితుడి చెల్లెలి పెళ్ళికి శ్రీధర్ ని పంపించేసి, ఆ పెళ్ళికూతురి రూపంలో సంగీతాని చూపిస్తారు.
ప్రారంభంలోనే ఇది చాలా ఆసక్తి రేపే ఘట్టం. హీరోయిన్ పెళ్ళవుతోంటే హీరో రావడం! ...ఇలాంటి ప్రారంభంతో మొన్నటివరకూ అదేపనిగా చాలా సినిమా లొచ్చాయి. ఇది ‘ముత్యాలముగ్గు’ పెట్టిన భిక్షే. ఈ ప్రారంభ ఘట్టంలోనే సంగీత పెళ్లి చెడిపోయి, శ్రీధర్ ఆపద్ధర్మంగా ఆమెనే చేసుకోవాల్సిరావడంతో టెన్షన్ గ్రాఫ్ అమాంతం పెరిగి, కథకి గట్టి ముడి పడిపోతుంది. ఇదంతా కేవలం ఎనిమిది సీన్లలోపే జరిగిపోతుంది.

రిచర్డ్ గెర్ నటించిన విజయవంతమైన సినిమా ‘అన్ ఫెయిత్ ఫుల్’ (2002) లో ఐదవ సీనుకల్లా కథ ముడి పడిపోతుంది. ఇలాటి క్లుప్తీ కరించిన కథనాలే అసలుసిసలు సృజనాత్మకతకి నిదర్శనాలవుతాయి. ‘ముత్యాలముగ్గు’ ఈ సెక్షన్ లో అపూర్వంగా నిలబడుతుంది. బాపూ- ఈ కథా, సంభాషణలూ రాసిన రమణా ‘ముత్యాలముగ్గు’ ని భావి తరాలకి రిఫరెన్స్ గైడ్ లా అందించారు. ఏ కథైనా సరదాగా మొదలై, సంక్షుభితంగా మారి, తిరిగి శాంతి సామరస్యాలు స్థాపించే మూడంకాల నిర్మాణంలోనే  వుంటుంది. ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది. ఫస్టాఫ్ లో ఇలా విడదీయడం సులభమే. సెకండాఫ్ లో ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే పెద్ద సమస్య. ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి? పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు ఉపయోగపడే సాధనాలు వాళ్ళే.  వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే.

పోనీ శ్రీధర్-సంగీతల ఎడబాటు తాలుకూ బాధల్ని వాళ్లిద్దరి మీదా  చిత్రీకరిస్తూ కాలక్షేపం చేద్దామా అంటే అదీ సుడిగుండంలో పడేస్తుంది. పైగా  రసభంగం కల్గిస్తూ శోక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి పిల్లలు పుట్టి వచ్చేవరకూ కథ ఎలా నడపాలి? మొదట్నించీ చూస్తే  ఈ కథ అద్భుత రస ప్రధానంగానే నడుస్తూ వచ్చింది. ఈ అద్భుత రసాన్నే ఇక ముందూ కొనసాగించాల్సి వుంటుంది. అప్పుడే కథకి ఏకసూత్రత చేకూరుతుంది.  అందుకని ఈ అద్భుతరస స్రవంతికి  ఒక సాధనంగా ఉంటూ వస్తున్న  రావుగోపాలరావు అండ్ గ్యాంగు ని పోస్ట్ మార్టం చేసే పని చేపట్టారు సిద్ధహస్తులైన బాపూ-స్వర్గీయ రమణలు దిగ్విజయంగా!

ఇదీ సరైన సెకండాఫ్ కథనానికి మార్గం! ఇదే సూత్రం! ఏ రసప్రధానంగా కథ ప్రారంభమై దాని ఆలంబనగా కొనసాగుతోందో, అదే రస స్రవంతిని పట్టుకుని ఇంటర్వెల్ చౌరస్తా నుంచీ దారితప్పకుండా సాగిపోవడమే దిశ-దశ-సమస్తం కూడా!

పంచభూతాలు మింగేసుకున్నాయి!
సరే, ఎవరీ రావుగోపాలరావు అండ్ గ్యాంగులో దొంగలు? ఓ అమాయకురాలి కాపురాన్ని చెడగొట్టిన రావుగోపాలరావు, ముక్కామల, అల్లురామలింగయ్య, నూతన్ ప్రసాద్ లు- మరి ఈ దుష్ట చతుష్టయం చెడబుట్టిన బతుకుల్లో చీకటి కోణాలేమిటి?...అనే సెకండ్ ట్రాక్ ఓపెన్ చేసి, వాళ్లకి వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునే ఆత్మవినాశక చర్యలతో టైం అండ్ టెన్షన్ థియరీకి న్యాయం చేస్తూ అమాంతం కథనంలో టెంపో- దాంతోబాటు కొత్త సస్పెన్సూ సృష్టించేశారు!

చేసిన పాపం చావదనే కదా? సృష్టిలో ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. మంచి చేస్తే మంచీ, చెడు చేస్తే చెడూ చుట్టూ తిరిగి మనకే వచ్చి తగుల్తాయి. ఈ దుష్ట చతుష్టయం ధనదాహంతో సంగీత ని వనవాసం పట్టించినప్పుడు, సృష్టి చూస్తూ ఊరుకోదు. సృష్టెప్పుడూ హెచ్చు తగ్గుల్ని సమతూకం చేసే దిశగానే కదుల్తూంటుంది. సంగీతకి ఆ స్థాయిలో అన్యాయం చేసి హెచ్చిపోయిన కీచకుల అదృష్టాల్ని ఛిన్నాభిన్నం చేసి, ఆ నష్టపరిహారం సంగీతకి ఇప్పించడం సృష్టి ధర్మం కదా? ఇదే కదా ది గ్రేట్ ఫిలాసఫర్ ఎమర్సన్ సూత్రీకరించిన, సృష్టి తనపని తానుగా చేసుకుపోయే ‘లా ఆఫ్ కంపెన్సేషన్’ ప్రక్రియ?

కథలో ఈ ఫిలాసఫీ ఎంచక్కా ఇమిడిపోయి సంగీత పాత్ర పట్ల ప్రేక్షకులకి ఎనలేని సానుభూతేర్పడుతుంది!

ఇలా సాగుతూండగా, సంగీతకి పుట్టిన కవలలు తల్లిదండ్రుల్ని కలిపే అధ్యాయం మొదలౌతుంది. వీళ్ళ చేత ఈ పని ఎలా చేయించాలి?  ఇది మిలియన్ రీళ్ల ప్రశ్న! ఎవరికీ? కథని ఉదాత్తంగా చెప్పాలని సమకట్టిన వాళ్ళకే. ఇందుకు ముందుగా శాస్త్రం తెలియాలి...

కృతయుగంలో మనుషులు సత్వర ఫలితాలు పొందేందుకు ధ్యానం చేసే వాళ్లట. త్రేతాయుగంలో యాగాలు చేశారని, ద్వాపరయుగంలో అర్చనద్వారా పొందారనీ, ఇక కలియుగంలో జ్ఞాన శూన్యులైన అల్పులు అధైర్య పడకుండా సంకీర్తన ద్వారా సత్వర ఫలితాలు పొందవచ్చనీ  సూత మహర్షి చెప్పాడు.

అల్పులైన పిల్లల చేత బాపుగారు ఈ పనే చేయించారు!

రామాలయంలో ఒకర్నీ, రావుగోపాలరావు ఇంట మరొకర్నీ పడేసి సంకీర్తనలతో మస్కాలు కొట్టిస్తూ స్వకార్యం పూర్తి చేయించారు. అక్కకేమో ఆంజనేయుడితో ఫాంటసీ, తమ్ముడికేమో కోతితో ప్రాక్టికాలిటీ! తత్ఫలితంగా రావుగోపాలరావు చాపకింద నీళ్ళొచ్చేయడం!
ఇప్పుడు ఈ మజిలీకి చేరిన కథని ఎలా ముగించడం? మళ్ళీ శాస్త్రమే! సృష్టికర్త ఈ సృష్టిని ఎలా ఉపసంహరిస్తాడు? బ్రహ్మ పురాణం ఏం చెప్తోంది? త్రివిధాలుగా సృష్టి ఉపసంహారం జరగవచ్చంది. నైమిత్తికం, ప్రాకృతికం, ఆత్మీంద్రికం...మొదటిదాంతో పంచభూతాలు ఒకదాన్నొకటి మింగేసుకుని ఆకాశం శూన్యమైపోతుంది. రెండోదాంతో ప్రకృతి పరమాత్మలో కలిసిపోతుంది. మూడో ప్రక్రియలో మానవాళి మోక్షమార్గం ద్వారా జరుగుతుంది.

సినిమాలో ఆల్రెడీ వెన్నుపోట్లతో కలహించుకుంటున్న దుష్టచతుష్టయం కీచులాటలన్నిటినీ  ఇక పతాక స్థాయికి చేర్చి , పంచ మహాభూతాల్లా ఒకర్నొకరు మింగేసుకునే నైమిత్తిక ముగింపు నే ఇచ్చారు చాలా టెర్రిఫిక్ చిత్రీకరణతో!
అప్పుడంతా  ఆకాశం శూన్యమైపోయినట్టు శ్మశాన నిశ్శబ్దం!

తిరిగి సృష్టి తాజాగా మొదలైనట్టూ...శ్రీధర్-సంగీతల కాపురం - కళకళలాడుతూ...సీతారాములు తామై, పిల్లలు లవకుశలై ఉత్తరరామాయణం పరిసమాప్తం!

-సికిందర్
(సాక్షి, 2009)