రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, April 16, 2014

రివ్యూ..
కథతో పనిలేని కహానీ!

స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సురేందర్ రెడ్డి
తారాగణం : అల్లు అర్జున్, శృతీ హాసన్, సలోనీ అశ్వని, శ్యామ్, రవికిషన్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, ఎమ్మెస్, అలీ తదితరులు.
కథ : వక్కంతం వంశీ*మాటలు : వేమారెడ్డి*సంగీతం : తమన్*ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస*యాక్షన్ : రామ్-లక్ష్మణ్, విజయ్*కూర్పు :గౌతమ్ రాజు*కళ : నారాయణ రెడ్డి
బ్యానర్ :  లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్*నిర్మాతలు : డా.వెంకటేశ్వరరావు, నల్లమలుపు శ్రీనివాస్, రంగరాజన్ జయప్రకాష్
విడుదల : ఏప్రెల్ 11, 2014 * సెన్సార్: U/A
***


ర్శకుడు సురేంద్రరెడ్డి దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే అది తెలుగు-యూరోపియన్ సినిమాల టెక్నిక్కులతో మిక్స్చర్ పొట్లమేనేమో. ఈ ధోరణి నుంచీ ఇప్పటికైనా కాస్తయినా పక్కకు తొలిగేది లేదని నిర్ణయించుకున్నట్టు తాజా నజరానా రేసుగుర్రంసైతం తెలియజేస్తోంది. దీనికి తోడు అల్లుఅర్జున్ తో సమకట్టిన ఈ యాక్షన్ కామెడీ ప్రక్రియ ఫార్ములాని కూడా తిరగరాయాలని ప్రయత్నించడం ఈ సారి తను బోనస్ గా అందిస్తున్న కానుక!


సురేంద్రరెడ్డి ప్రేక్షకులకిస్తున్నఈ బోనస్ తోపాటు, దీంతో రంజింప జేయడానికి రంగంలోకి దిగిన అల్లు అర్జున్ తో ఏమాత్రం ఈ ‘రేసుగుర్రం’ పరుగెత్తిందో ఈపాటికి ప్రేక్షకులకి తెలిసిపోయే వుంటుంది. లాజిక్, కామన్ సెన్స్, సరైన కథా, పద్ధతీ అని పట్టింపు ఉండని  ప్రేక్షకులకి  ఇది బ్రహ్మాండమైన ఎంటర్ టైనర్. యాభై కోట్ల స్టార్ సినిమాకదా అని కాస్త  నాణ్యమైన కథాకథనాలు, హాస్యం, నటనలు, లజిక్కూ, సాంకేతిక విలువలూ వగైరా ఆశించి వెళ్ళే  అభిరుచిగల ప్రేక్షకులకి మాత్రం పెదవి విరుపే!

ఈ ‘రేసుగుర్రం’ తో రేసెంత వుందో ఓసారి చూద్దాం..

అన్నదమ్ముల సవాల్- శత్రువు కమాల్!
ప్రధానంగా ఇద్దరన్నదమ్ముల కయ్యాల కథ ఇది. లక్ష్మణ్ అలియాస్ లక్కీ (అల్లు అర్జున్), రామ్ (శ్యామ్) లనే ఇద్దరన్న దమ్ములకి క్షణం పడదు. ప్రాణ శత్రువుల్లా కీచులాడుకుంటుంటారు. రామ్ ఏసీపీ. లక్కీ పనీపాటా లేకుండా తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు (తనికెళ్ళ- పవిత్రా లోకేష్) లు వీళ్ళతో పడలేక పోతూంటారు. లక్కీ స్పందన ( శృతీ హాసన్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈమె తండ్రి భీమ్ ప్రకాష్ (ప్రకాష్ రాజ్) బాగా డబ్బున్నవాడు. తన కూతుర్నుంచీ లక్కీని దూరం చేయలేక అల్లాడి పోతూంటాడు.

ఇంకోవైపు శివారెడ్డి (రవికిషన్) అనే రౌడీ షీటర్ రాజకీయపార్టీని బెదరింఛి టికెట్ పొంది నామినేషన్ కి సిద్ధమౌతూంటాడు. పార్టీ అధ్యక్షుడు వీడి నేరాల గురించి ఒక్క సాక్ష్యమైనా పట్టుకొస్తే నామినేషన్ ని అడ్డుకోవచ్చని ఏసీపీ రామ్ ని ఎగదోస్తాడు. ఈ విషయం శివారెడ్డికి తెలిసిపోయి, రామ్ ని చంపించేందుకు ప్లానేస్తాడు. సాక్ష్యాధారాలతో కార్లో పోతున్నది రామ్ అనుకుని అనుచరులు ఎటాక్ చేస్తారు. ఆ కార్లో రామ్ కాక లక్కీ ఉంటాడు. ఇతడికి అన్న మీద జరిగిన కుట్ర తెలిసిపోయి శివారెడ్డి ని పట్టుకుని చావబాదుతాడు. శివారెడ్డి నామినేషన్ వేయలేకపోతాడు.

ఇదీ కథ. తన రాజకీయ జీవితాన్ని పాడు చేసిన లక్కీ మీద పగతో శివారెడ్డి ఇక ఏం చేశాడన్నది ఇక్కడనుంచీ సాగే ద్వితీయార్ధంలో తెలుసుకోవచ్చు.


అల్లు అర్జున్ కిది కొత్త తరహా పాత్రేం కాదు, ఇలాటి బరువు బాధ్యతల్లేని అల్లరి పాత్రలు నటించి నటించి వున్నాడు. ఆ కోవలోనే ఈ నటనా వుంది. ఈ మాస్  పాత్రకి డైలాగుల బలం కూడా తోడ్పడాల్సింది. సన్నివేశాల్ని ఉద్విగ్నభరితం చేసే ఒక్క డైలాగూ పేలిన జాడలేకపోవడం విచారకరం. దీనిక్కారణమేమిటో  ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో తెలుసుకుందాం. ఇకపోతే, పాటల్లోనూ  అభిమానులు కేరింతలు కొట్టే ఒక్క డాన్సు మూవ్ మెంటు కూడా లేకపోవడం మరో లోటు! పోరాటాల్లో ఫర్వాలేదు, సినిమా సినిమాకీ వైవిధ్యం కనబర్చే యాక్షన్ డైరక్టర్లు రామ్-లక్ష్మణ్ లు, విజయ్ –అల్లుఅర్జున్ ని హైప్ చేస్తూ యాక్షన్ కోరియోగ్రఫీ చేశారు. ఐతే ఇంటర్వెల్ సీన్లో హింస ఎక్కువైపోయింది...

నటుడిగా అర్జున్ లో కొత్త కోణాలు బయటపడాలంటే అది హుందా తనంగల పాత్రల్లో నటిస్తేనే కుదురుతుంది. ఇక శృతీ హాసన్ పాత్ర ప్రవేశం నుంచీ కొన్ని దృశ్యాలవరకూ పాత్రతీరు కొత్త క్రియేటివిటీ అనొచ్చు. పైకి సున్నం కొట్టిన రాయిలా ఉంటూ భావోద్వేగాలన్నీ లోలోపలే అనుభవించే క్రేజీ క్యారెక్టరైజేషన్ నిజంగా పిచ్చెత్తించేదే. ఆతర్వాత షరామామూలు గ్లామర్ పాత్రలో ఒదిగిపోయింది. రెండో హీరో తమిళ నటుడు శ్యామ్ ఇలాటి పాత్రలకే పనికొస్తాడు. ఇతడి ప్రియురాలిగా నటించిన సలోనీ పరిచయ దృశ్యం లోని గ్రేస్ వదిలిపారేసి చిలిపితనాలతో దయనీయంగా తయారయ్యింది. తొలిసారిగా తెలుగుకి పరిచయమౌతూ విలన్ గా నటించిన భోజ్ పురి హీరో రవికిషన్ ప్రారంభ దృశ్యంలో ఆకట్టుకునే నటన కనబర్చినా, ఆ తర్వాత్తర్వాత  అది మితిమీరిన ఓవర్ యాక్షనై తలపోటు నటుడిగా మారిపోయాడు. చివర్లో వచ్చే బ్రహ్మానందం తుపాకులు పేలుస్తూ ఎంత ఉత్తుత్తి హడావిడి చేసినా, అది గేమ్ ఆడే పాత్ర అయివుంటే, క్లైమాక్స్ ని కొత్త మలుపు తిప్పివుంటే ఈ సినిమా దర్శకుడికి, రచయితలకి  మంచి పేరొచ్చేది.

తమన్ సంగీతంలోని పాటలు, మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం సినిమాకి ఆకర్షణే, కానీ బ్రహ్మానందం వచ్చాక యాక్షన్  దృశ్యా లకి కూర్చిన నేపధ్యసంగీతం చాలా చీప్ కామెడీ గా వుంది.

స్క్రీన్ ప్లే సంగతులు
ఇది ఇటీవల  విడుదలై ఫ్లాపయిన తమిళ డబ్బింగ్ ‘సిటిజెన్’ సినిమాని పోలిన  స్క్రీన్ ప్లే నడకతో వుంది ఈ సినిమా. ఇదే నడక  సురేంద్ర రెడ్డి గత పరాజయ సినిమా ‘ఊసరవెల్లి’ లలోనూ చూడొచ్చు. ‘సిటిజెన్’, ‘ఊసరవెల్లి’ లలోని తప్పుడు ఇంటర్వెల్ దృశ్యాలే మళ్ళీ ‘రేసుగుర్రం’ లోనూ చూడాల్సి వచ్చింది. ఇంటర్వెల్లో ఇలాటిదే  తప్పుడు ఇంటర్వెల్ దృశ్యం గండాన్ని ఇటీవల ‘లెజెండ్’ లో చాలా తెలివిగా దాటేసి, సెకండాఫ్ ని నిలబెట్ట గల్గారు. ఇక సురేందర్ రెడ్డి ఇంకో గత పరాజయ సినిమా అయిన ‘అశోక్’ పొరపాట్లు సైతం తిరిగి యధాతధంగా ప్రస్తుత ప్రయత్నంలోనూ దిగుమతి అవడం ఆశ్చర్యకరం.

సినిమాని ఇద్దరన్నదమ్ముల చిన్నప్పటి కథతో ప్రారంభించారు. నిజానికీ కథలేకపోయినా వచ్చే నష్టమేం లేదు. ప్రధాన కథలో అర్జున్-శ్యాం ల గొడవల్ని చూపిస్తున్నప్పుడు ఓ రెండు మాటల్లో బ్యాక్ స్టోరీ చెప్పేస్తే సరిపోయేది. ఇలా ప్రారంభమైన కథ అన్నదమ్ముల కీచులాటలతో, హీరోయిన్, విలన్ల పరిచయాలతో నడిచి..తన ప్రేమని చెడగొట్టిన అన్నకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో తమ్ముడు సిద్ధపడి, ఇంకో వైపు ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు విలన్ తయారై, మరో వైపు ఆ నామినేషన్ వేయకుండా తగిన అస్త్రాలతో అన్న పాత్ర రెడీ అవడంతో కథకి మొదటి మలుపు (సమస్య) ఏర్పడి, రెండో అంకంలో పడుతుంది. ఇప్పటికి సుమారు  గంట సమయం తీసుకుంటుంది. దీనితర్వాత పావుగంట సేపు ఇంటర్వెల్ వరకూ సాగే రెండో అంకం మొదటి భాగంలో- అన్న అనుకుని తమ్ముడి మీద విలన్ హత్యా యత్నం, విలన్ కుట్ర తెలుసుకున్న తమ్ముడు విలన్ని చావదన్ని బుద్ధి చెప్పడం, విలన్ నామినేషన్ వేయలేకపోవడం వగైరా  జరుగుతాయి.


దీంతో ఏమర్ధమౌతోంది? మొదటి మలుపు దగ్గర ఏర్పడ్డ సమస్య ఇంటర్వెల్ దగ్గర పరిష్కారమై పోయిందన్పించడం లేదూ?

అంటే కథ ముగిసిందన్న ఫీలింగ్ ఏర్పడ్డం లేదూ? హీరోకి సంబంధించినంతవరకూ విలన్ తో పనైపోయింది. అన్న మీద కుట్ర తో తను ఎదుర్కొన్న నైతిక సంక్షోభం కాస్తా  తీరిపోయి సుఖాంతమై పోయింది. ఇంకేం మిగిలింది?

‘సిటిజెన్’ లోనూ విలన్ తమ్ముడ్ని బంధించి, విలన్ మీద కక్ష తీర్చుకోవాలన్న హీరో లక్ష్యం ఇంటర్వెల్లో నె రవేరిపోవడంతో కథ ఇంకేం మిగల్లేదు!

కాకపొతే శత్రుశేషం మిగల్చకూడదన్న తెలివి  హీరోకి లోపించడంవల్ల ఈ రెండు సినిమాల్లోనూ ఆ తర్వాత సెకండాఫ్ లో విలన్ లేచివచ్చి మళ్ళీ హీరో మీద పడ్డాడు!

అంతే లక్ష్యం హీరోకి కాక రివర్స్ లో విలన్ కేర్పడిందన్న మాట..ఇందుకే సెకండాఫ్ లో విలన్ లేచి వచ్చేవరకూ హీరో ఏపనీ లేక పనికిరాని కథనాలు ఎత్తుకుని బోరుకొట్టిస్తాడు. అంటే ఇంకా చెప్పాలంటే, ఇంటర్వెల్లో ముగిసి పోయిన కథని మళ్ళీ ఎత్తుకోవడమంటే, అది సినిమాలకి పనికిరాని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ కి పాల్పడ్డ మన్నమాట.

 ‘ఊసరవెల్లి’ లోనూ హీరో ఎన్టీఆర్ ఇంటర్వెల్ దగ్గర విలన్ల గ్యాంగులో ప్రకాష్ రాజ్ ని మినహా మిగతా అందరు విలన్లనీ చంపేస్తాడు. ప్రకాష్ రాజ్ ని చంపకుండా వదిలెయ్యడం దర్శకుడు సెకండాఫ్ కథని కృత్రిమంగా నడపడానికే అన్నట్టు తయారయ్యింది!

‘లెజెండ్’ లో ఇంటర్వెల్ దగ్గర మొదటి బాలకృష్ణ మీద విలన్ జగపతిబాబు ఎటాక్ చేసి వెళ్ళిపోతాడు. కొన వూ పిరితో పడివున్న బాలకృష్ణ ని  కాపాడమని నానమ్మ  దేవుణ్ణి ప్రార్ధిస్తూంటే,  రెండో బాలకృష్ణ బీభత్స భరితంగా వచ్చేసి జగపతిబాబు అనుచరుల్ని సఫా చేస్తాడు.

ఇక్కడ రెండో బాలకృష్ణ దృష్టిలో లక్ష్యం అసంపూర్తిగా ఉండిపోయింది. ఇంటర్వెల్లో కథ ముగిసిపోలేదు. సెకండాఫ్ లో ఆ జగపతిబాబుని వెతికిపట్టుకుని చంపే లక్ష్యం మిగిలే వుంది!

ఇలకాక, ‘సిటిజెన్’ లో  హీరో బందీగా పట్టుకున్న విలన్ తమ్ముడ్ని,  ఆశయం నెరవేరాక  పోలీసులకి పట్టుబడేలా చెయ్యకపోవడం వల్ల, ఆ తమ్ముడే తర్వాత హీరోకి ఖర్మకాలి ప్రాణాంతకంగా మారాడు!

అలాగే  ’రేసుగుర్రం’ లోనూ అన్నమీద హత్యాయత్నం చేసిన అంత ప్రమాదకరమైన విలన్ని పోలీసులకి అప్పగించకుండా తెలివితక్కువగా హీరో వదిలెయ్యడంతో, ఆ విలన్ తిరిగి వచ్చి నానా తిప్పలు పెట్టాడు హీరోనీ, అతడి కుటుంబాన్నీ!

ఇలా దర్శకుడు సెకండాఫ్ లో కథ నడపడం కోసం విలన్ని సేఫ్ గా ఉంచేస్తున్నాడన్న మాట  - హీరో పాత్ర తెలివితేటల్ని  పణంగా పెట్టేసి!

అసలు ఇంటర్వెల్ పాయింటు ఉద్దేశమేమిటని చూస్తే, 1) అది కథ ఇంకో కొత్త మలుపు తీసుకుని ముందుకు దూసుకెళ్ళాడానికి  ఏర్పడే మజిలీ, అంతే గానీ కథ ముగిసినట్టు సర్దుబాట్లు జరిగే అడ్డాకాదు, 2) అది హీరోకి ఎదురుదెబ్బ తగిలి (‘లెజెండ్’ లోలాగా) అతణ్ణి కొత్తమార్గం పట్టించే చౌరాస్తా, అంతేగానీ కథ ముగిసిందని వెనక్కొచ్చే డెడ్ ఎండ్ కాదు, 3) అది కథని ఇంకా పై దశ పట్టిస్తూ హీరో కమిట్మెంట్ ని పెంచే కేంద్ర బిందువే తప్ప, ఆశయం నెరవేరిందని విశ్రమించే సత్రం కాదు. ఇంకా చెప్పాలంటే  ఫస్టాఫ్ లో మలుపునీ,  సెకండాఫ్ లో (క్లైమాక్స్ ) మలుపునీ బిగించి ఉంచే యాంకర్  లాంటిది మధ్యలో వచ్చే ఇంటర్వెల్ పాయింటు!

ఇదే సమస్య తో వుండే హాలీవుడ్ సినిమా ‘అరైవల్’ (1996) ఎలావుందో ఒకసారి  చూద్దాం..ఇందులో హీరోకి గ్రహాంతర వాసుల గురించి సమాచారం అంది, అడవిలో వాళ్లేర్పాటు చేసుకున్న రహస్య స్థావరానికి చేరుకుంటాడు. ఇది విశ్రాంతి దగ్గరే జరుగుతుంది. ఆతర్వాత నుంచీ కథలో ఆసక్తికరంగా ఏదీ జరగదు. కథ అయిపోయిందనే అర్ధాన్నే సూచిస్తుంది. హీరో ఆ స్థావరాన్ని చేరుకునే ఘట్టం మూడో అంకంలో ఏర్పాటు చేసివుంటే ఈ సమస్య ఏర్పడేది కాదని అంటూ ... ఒక హాలీవుడ్ స్క్రీన్ ప్లే నిపుణుడు ఇలా పేర్కొన్నాడు- It's a question of giving away too much in the middle and not holding enough back for the end. Worry about whether your story is taking too long to get off the ground, or if you're introducing new characters so fast we don't get to know them well enough. Worry about whether your middle drags, or gets too complicated, or if you are running out of complications and your hero is going to defeat his enemy too quickly and easily. Worry about whether your ending feels rushed, or if you've got more than one scene that feels like an ending...


పైన అండర్ లైన్ చేసిన పంక్తులన్నీ  ‘రేసుగుర్రంలో కన్పించే  లోపాలే. ఇంటర్వెల్ వరకూ పాయింటు(?)కి కథని లాక్కురావడానికి అల్లిన కథనంలో కథ కన్పించని విధంగా ఏవేవో దృశ్యాలు బలవంతంగా రుద్దుతున్నట్టు వచ్చిపోతుంటాయి. కొట్టొచ్చినట్టు కన్పించే తెలిసో తెలియకో పాల్పడిన ఈ విధానం ఏమిటంటే,  వెంటవెంటనే ఏదేదో చెప్పేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేయ్యాలనే తపన. స్క్రీన్ ప్లే పరిభాషలో  ‘too much, too soon syndrome’ అంటారు దీన్ని. ఆవారాగా తిరిగే హీరో అమెరికా వెళ్లేందుకు తందిని వేధించి ఆ డబ్బు తీసుకోవడం, ఆ డబ్బు హీరో తను మీద పడి తింటున్న హోటల్ యజమాని కొడుకు హాస్పిటల్ ఖర్చులకి పెట్టేయడం (హీరో అన్నాక ఆ ఖర్చు యాక్సిడెంట్ చేసిన వాడితో కక్కిం చాలిగా?), హాస్పిటల్లో పొలిటీషియన్ (పొసాని)కి ఆయాచితంగా క్రెడిట్ దక్కడం, ఈ ఋణం తీర్చుకుంటానని హీరోతో అనడం, బ్యాంకు దోపిడీ దృశ్యం, హీరో హీరోయిన్ తండ్రిని పిల్చి తనగురించి చెప్తున్నప్పుడు హఠాత్తుగా ఒక నాటు ముఠా ఎటాక్ చేసి రసభంగం కల్గించడం, మరోచోట  ఇదే హీరో అన్న హీరోయిన్ కి పెళ్లి తప్పించి తీసుకుపోతున్నప్పుడు  ఇమడని అకస్మాత్తుగా జరిగే ఇంకో ముఠా దాడి ..ఇలా చాలావుంటాయి.

సెకండాఫ్ ఓపెన్ చేస్తే (రెండో అంకం రెండో భాగం) కథలో హీరోకి పనిలేదు. అందుకని గతంలో ఎప్పుడో తనవల్ల దెబ్బ తిన్న అన్న ప్రేమకథని దారిలో పెట్టే  పనికి పూనుకుంటాడు. అన్నకి ఆ ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వగైరా ఓపెన్ వుతాయి. దీంతో సినిమా ఇంటరెస్ట్ గ్రాఫ్ పూర్తిగా డ్రాప్ అయింది. ఎందుకంటే ఇది రెండో అంకం లో రావాల్సిన అంశం కాదు. రెండో అంకంలో జరిగే స్క్రీన్ ప్లే బిజినెస్ కథ ముందుకెళ్ళి పోయిన దశలో, ప్రధాన సమస్యతో హీరో సంఘర్షణ తీవ్రతరం గావడమే. అన్న ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వగైరా మొదటి అంకంలో నే సర్దుబాటు చేయాల్సిన స్క్రీన్ ప్లే బిజినెస్. ఇంటర్వెల్ తర్వాత హీరోకి ప్రధాన సమస్య ఏదీ లేదుగాబట్టి ఈ అన్న ప్రేమకథ గొడవ తప్పలేదన్నమాట. దీనిపర్యవసానం ఇంటరెస్ట్ గ్రాఫ్ పాతాళానికి పతనమవడం!

ఇక సెకండాఫ్ లో ఏదో కొత్త టెక్నిక్ తో కథ చెప్తున్నట్టు అన్పించాలని ఫ్లాష్  ఫార్వర్డ్  ప్రక్రియని రెండు చోట్ల వాడారు. సడెన్ గా హీరో పోలీస్ అధికారి వేషంలో దర్శన మిస్తాడు. పోలీస్ ఎలా అయ్యాడనేదానికి వెంటనే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళి ఆ విధం చూపించుకొస్తారు. అలాగే హీరో అన్న పెళ్లి చూపులప్పుడూ ఫ్లాష్ ఫార్వర్డ్ తో ఓపెన్ చేసి పాత ప్రేయసి సడెన్ గా ఎలావచ్చిందో కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇదంతా ఫాలో అవడానికి చాలా కష్టంగా వుంటుంది. సీదాసాదాగా కథ ఎందుకు చెప్పకూడదు? కమర్షలియేతర యూరోపియన్ సినిమాలకి నప్పే ఈ కథన హననానికి పాల్పడ్డం ఎందుకు? సురేందర్ రెడ్డే తీసిన ‘అశోక్’ లో ఇష్టారాజ్యంగా ఇలాటి సీన్లేకదా వేసి కమర్షియల్ మాస్  సినిమా లుక్ కి విఘాతం కల్గించారు?

ఇక లాజిక్ విషయానికొస్తే, క్లైమాక్స్ లో హీరో పోలీసులా రావడానికి ఎలాటి లాజిక్కూ లేదు. అంతే కాదు దీనికి సపోర్టుగా ఎక్కడో ఫస్టాఫ్ లో పొలిటీషియన్ తో ఆ రుణపడి వుండే సీన్లన్నీ అనవసరమే. హీరోవల్ల పొలిటీషియన్ క్రెడిట్ పెరిగిందని పాయింటుని ‘సెటప్’ చేసేందుకు ఆ సీన్లు వేశారు. కథనంలో ప్రతీ ‘సెటప్’ కీ ఒక  ‘పేఆఫ్’ సీను వుంటుంది. మరి క్లైమాక్స్ లో ‘పే ఆఫ్’ సీను ఎలావుందంటే, హీరో పుణ్యాన హోమంత్రి అయిన పొలిటీషియన్ కి హీరో తనని ఒకరోజుకోసం పోలీసు అధికారిని చేయమంటాడు. ఆ హోం మంత్రి అలాగే చేసేసి, కొంత ఫోర్సుని కూడా హీరోకిచ్చేసి తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఈ లాజిక్ లేని మలుపుని లాజికల్ గా చూపించాలన్న తాపత్రయం ఎందుకు? దానికి పనిగట్టుకుని సెటప్పులూ పేఆఫ్ లూ ఎందుకు? అంత చలాకీ అయిన హీరో హోం మంత్రి ని అడుక్కోకుండా తనే పోలీసు వేషం వేసుకుని దొరక్కుండా హల్ చల్ చేస్తూ విలన్ ని ఫినిష్ చేయొచ్చుగా! ఆ చొరబడ్డ బ్రహ్మానందం పాత్రకూడా నకిలీ పోలీసే అయితే క్లైమాక్స్ కి మంచి బ్యాగ్ ఉండేదిగా?

అలాగే హీరో అన్న మిస్సయిన కారు కోసం దర్యాప్తు ప్రహసనం ఒకటి. ఇది మాస్ కమర్షియల్ సినిమా కథనంలో పోసగేది కాదు. ప్రత్యేకంగా క్రైం ఇన్వేస్టి గేషన్ ఝాన్ర్ సినిమాల్లో ఉండాల్సిన రసానుభూతి. దీన్ని తెచ్చి అరకొరగా ఇరికించడంతో కమర్షియల్ ఝాన్ర్ సినిమా అనుభూతిని పంటికింద రాయిలా దెబ్బతీసింది.


ఆమాటకొస్తే, నామినేషన్ వేయకుండా విలన్ని అడ్డుకోవడానికి హీరో అన్న సాక్ష్యాధారాలతో కలక్టర్ దగ్గరికి బయల్దేరడం హాస్యాస్పద మైనది. సాక్ష్యాధారాలే వుంటే అరెస్టు చేసి ఎఫ్ఫై ఆర్ నమోదు చేయాలి.

ఇక హీరో విలన్లూ విడతలవారీగా ఓ చెట్టుకి వేలాడదీసుకోవడం ‘అగ్నిపధ్’ లోనిదికదూ? ‘అగ్నిపధ్’ లో విలన్ ఇలాకాలోని ఆ మర్రి చెట్టు కూడా సినిమాలో ఓ పాత్రే. అది పాత్ర చాలించి అమాంతం వచ్చి అనామకంగా ‘రేసుగుర్రం’ లో ఏం ప్రభావం చూపించిందని?

మొదటి అంకం లో కథని ‘సెటప్’ చేయడంలో ఏమాత్రం వృత్తి తత్త్వం కనబర్చక పోవడంవల్ల- త్వరత్వరగా టూమచ్ ఇన్ఫర్మేషన్ తో నింపెయ్యడమనే అనర్ధం జరిగింది. తత్ఫలితంగా- పాత్రల్లో డెప్త్ గానీ, స్టోరీలైన్ లో తగిన బలమైన సంఘర్షణ గానీ లేకపోవడంతో,  విడివిడిగా ఏ సీనుకా సీను బలవంతపు కామెడీ ని రుద్దుతూ ఇదే సినిమా అన్పించారు!

పాత్రోచితానుచితాలు
కమర్షియల్ సినిమా కథ హీరోది తప్ప మరెవ్వరిదీ అవడానికి వీల్లేదు. కథని మలుపులు తిప్పేదీ, పాత్రలతో ఆడుకునేదీ అతనే. ఈ క్రమంలో కష్టాలేదుర్కొంటాడు, అనుకున్నది సాధించడానికి ఎంతదూరమైనా వెళ్తాడు. అంతేగానీ, విలన్ పాత్రవచ్చేసి హీరో చేతిలోంచి కథ లాక్కుని తానే కథానాయకుడు అవడం ఎక్కడా  జరగదు.  కేవలం తెలుగు సినిమాల్లోనే జరుగుతుంటుంది. వీటికే సినిమానిరక్షరాస్యులైన ప్రేక్షకులు అలవాతుపదిపోయారు.   ‘రేసుగుర్రం’లో హీరోది పూర్తిగా పసలేని పాసివ్ పాత్ర గా వున్న  వైనాన్ని రచయితలూ దర్శకుడూ గమనించినట్టు లేదు!

హీరోకి తన అన్న తనలాగా కాక, ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఎదిగాడన్న గౌరవభావం, భయభక్తులు ఏకోశానా లేకపోగా, అదే చిన్నప్పటి తుంటరి చేష్టలతో ఏడ్పి స్తూంటాడు. ఎదిగిన మెచ్యూర్డ్ వ్యక్తులుగా జీవితంపట్ల. లేదా వృత్తి వ్యాపకాలపట్లా ఏదైనా అర్ధవంతమైన  భిన్న దృక్పథాలతో విభేదించుకోవడం కాక, దిగజరుడుతనంతో దెబ్బలాడుకుంటూంటారు. అన్న సంపాదనమీద బ్రతికే హీరో నువ్వు లంచగొండివని నిందించడం హీరోయిజం అనుకుంటాడు. కష్టార్జితం అక్షరాలా ఆరులక్షలు అమెరికా వెళ్ళడానికి (ఏం చదివాడో, ఎందుకు వెళ్తున్నాడో మనకి తెలీదు, ఇంత  ఆవారా అమెరికా లో ఏం చేస్తాడో అంతకన్నా తెలీదు) తండ్రి ఇస్తే, ఎవరో పిల్లాడి ట్రీట్ మెంట్ కి అప్పనంగా ధారబోస్తే, ప్రేక్షకుల దృష్టిలో హీరో గొప్ప వాడెలా అవుతాడో అర్ధంగాదు!

అన్నని చంపడానికే ప్రయత్నించిన విలన్ని హీరో వదిలేస్తే, ఆ తర్వాత ఆ విలన్ అన్నకే ఎసరుపెట్టి, కొంప కూల్చేస్తే, అన్న హీరోకి ఇంట్లోంచి వెలివేస్తే, హీరో పట్ల ప్రేక్షకులకి సానుభూతిని ప్రోదిచేసే ప్రయత్నం దర్శకుడికి ఎందుకో అర్ధంగాదు. తెలివితక్కువ హీరోకి సానుభూతా?

తన ప్రేమ చెడగొట్టాడని అన్నమీద కక్ష గడతాడు హీరో. గతంలో అన్న ప్రేమని తనే చెడగొట్టానని  చల్లగా సెకండాఫ్ లో రివీల్ చేస్తాడు హీరో. ఇది ఎలాటి పాత్ర చిత్రణ? గతంలో అన్న ప్రేమని అన్నకి తెలీకుండా తనే చెడగొట్టి వుంటే, ఇప్పడు అన్న తన ప్రేమని చెడగొట్టాడని కక్షెందుకు? ఈ బూటకపు వ్యక్తిత్వంతో మొదటి అంకం మలుపుదగ్గర సమస్య ఏర్పాటుచేసి ప్రేక్షకుల్ని ఏమార్చడమేనా?

అనవసరంగా తనతో పెట్టుకోవద్దని వెళ్లి పెద్ద ఫ్యాక్షనిస్టు అయిన విలన్ తండ్రికి వార్నింగ్ ఇచ్చినంత పని చేస్తాడు. అప్పుడు అంతకి ముందు విలన్ గానీ, ఇప్పుడు విలన్ తండ్రిగానీ ఎందుకు కేర్ చేయాలి? హీరో ఏమైనా కరుడుగట్టిన మాఫియానా? విలన్ కంటే పెద్ద గ్యాంగ్ లీడరా? అతడి వెనుక ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తివున్నాడా? లాటి ఫాల్స్ బిల్దప్పులతో హీరోయిజాన్ని ఎలా స్థాపిస్తారు?

అసలు హీరో రేసు గుర్రమెలా అయ్యాడు? ఆ రకమైన క్యారక్టరైజేషన్ ఎక్కడుంది? ఎవరితో రేసు మొదలెట్టాడు? రేసు వద్దని విలన్ తో అనేవాడు రేసుగుర్రమెలా అవుతాడో మిలియన్ రీళ్ళు కాదు, చిప్స్ ప్రశ్న!

-సికిందర్