ఈ
రకమైన సాధనాలని మరింత
అభివృద్ధి చేయడానికి ఉత్తమ మార్గం ప్రతిదీ వినడం, గ్రహించడం, ప్రాసెస్ చేయడమే. ప్రపంచంలో అత్యంత చెడ్డ లేదా
నీచమైన వ్యక్తికి కూడా ఒక దృక్కోణం వుంటుంది. రచయితగా మీ విలువలకి, నమ్మకాలకి విరుద్ధంగా వుండే
విభిన్న
దృక్కోణాలని మీరు అర్థం
చేసుకోవాలి. ఇతర వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి మీరు ఎంత ఓపెన్‌గా వుంటే, మీ పాత్రలు అంత లోతుగా వుంటాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్లో
తప్పు, ఒప్పు
అన్నవి వుండవు - కేవలం
దృక్కోణాలే వుంటాయి. అందుకే చాలా మంది రచయితలు విశ్లేషకులుగా పుట్టుకొచ్చారు.
రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Monday, November 22, 2021
1091 : రైటర్స్ కార్నర్
ప్రతి వృత్తికీ
సాధనాలు
అవసరం. ప్రాథమికంగా పారా పలుగూ లేకుండా మీరు ఇల్లు నిర్మించలేరు.
బ్రోకర్ లేకుండా షేర్స్ వ్యాపారం చేయలేరు. బాస్కెట్ బాల్
ఆటగాళ్ళు హూప్స్, బాల్ లేకుండా బాస్కెట్ బాల్ ఆడలేరు. చిత్రకారులకి కుంచెలు, రంగులు అవసరం...మీరు సినిమా రచయితైతే మీకో టూల్ బాక్స్ అవసరం! ఆ టూల్ బాక్స్ లో ఏఏ
సాధనాలు అవసరం? ఓ పెన్నూ కాగితమా? ఓ కంప్యూటరా? ఇవి సరే, ఇంకేం అవసరం? వృత్తిపరంగానో, అభిరుచిగానో స్క్రీన్‌ప్లేలు రాయాలనుకుంటే, మీరు మీ సొంత
టూల్ బాక్స్ ని అనుభవాల సారంగా నిర్మించుకోవడం, అనుకూలీకరించు కోవడమూ ప్రారంభించాల్సిందే!
సినిమా
రచన భౌతికమైనది
కాబట్టి మీకు టైప్‌రైటర్ లేదా రైటింగ్ సాఫ్ట్ వేర్ తో బాటు చాలా రిఫరెన్స్ పుస్తకాలతో కూడిన
కంప్యూటర్ అవసరం. స్క్రీన్
రైటింగ్ అనేది ఒక క్రాఫ్ట్ కాబట్టి మీకు విద్య, శిక్షణ, అభ్యాసం చాలా అవసరం. స్క్రీన్ రైటింగ్ అనేది ఒక కళ
కాబట్టి కూడా మీరు అనుభవించిన ప్రతి అనుభవం, మీరు ఎప్పుడైనా చూసిన లేదా చదివిన
ప్రతి కథ, మీరు
ఎప్పుడైనా విన్న ప్రతి విషయం మీరు ఉద్వేగభరితంగా భావించే ప్రతిదానికీ
అవసరం. ఈ వ్యక్తిగత అనుభవాలన్నీ మీ టూల్ బాక్స్
లోకి వెళ్ళడానికి అవసరం.
అదృశ్య సాధనాలు :
“నేను ఐదేళ్ళ వయసులో నా మొదటి స్క్రీన్‌ప్లే రాసేశా, పన్నెండు సంవత్సరాల వయసులో నా మొదటి ఆస్కార్ గెలిచేశా, నా రెండవ ఆస్కార్ పదిహేనవ
యేట వచ్చేసింది...” చెప్పాడు యమ బిజీగా వున్న పిల్లవాడు. “ఈ వయస్సులో మీరు దేని గురించి రాశారండీ?” అడిగాడు అనామకుడు. "జీవితం గురించి
రాసేశా!” చెప్పాడు బుడ్డోడు. “కానీ మీరు తగినంత జీవితాన్ని అనుభవించలేదు కదండీ?” అన్నాడు అనామకుడు. "ఓహ్, అనుభవించేశా!”
అరిచాడు బుడతడు,“తెలీదేమో మీకూ, నా గత జన్మల
విశేషాలన్నీనాకు బాగా గుర్తుంటాయి మరి!” అన్నాడు మళ్ళీ
ముక్కు తుడుచుకుంటూ.
ఇలా మీ వ్యక్తిగత అనుభవాలే, పరిశీలనలే
మీ అదృశ్య సాధనాలు. ఇదేం మీరు భౌతికంగా బయట
కొనుగోలు
చేసి మీ ఊహాత్మక టూల్ బాక్స్ లో వుంచగలిగేది కాదు. కానీ ఇది అన్ని రచనా వ్యాసంగాలకీ ముఖ్యావసరమే. మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, చూస్తే, అనుభూతిస్తే, అంత ఎక్కువ రాసేటప్పుడు సారం మీ రచనల్లో ప్రవహిస్తుంది. ఈ రకమైన సాధనాలని
సేకరించడానికి
సంవత్సరాలు పట్టొచ్చు.
"మీకు తెలిసింది రాయండి" అన్నారు.
మీ
వ్యక్తిగత అనుభవాలతో నాలెడ్జ్
బేస్ పెరిగేకొద్దీ (దురదృష్టవశాత్తూ, వయస్సుతో పాటూ), మీరు మీ అదృశ్య సాధనాలని విస్తరించడమూ, ఉన్నతస్థాయి రచనలల్నిచేయడమూ ప్రారంభిస్తారు. నా సలహా, నోట్ ప్యాడ్ దగ్గరుంచుకుని బయటకి వెళ్ళండి.
బయట ఏం తెలుసుకుంటున్నారో రాసుకోండి. తిరిగి వచ్చాక విశ్లేషించుకోండి. మీరు లోతైన రచనలు
చేయడానికి ఇది అవసరం.
క్రాఫ్టింగ్
సాధనాలు :
“నేను ఆ సినిమా కంటే బ్రహ్మాండమైన
సినిమా కథ రాయగలను. వందల కొద్దీ సినిమాలు చూశా, నాకు చాలా ఈజీ!” చెప్పాడు బిజీ
ప్రేక్షకుడు. “సరే రాయ్ మరి” చెప్పాడు అనామకుడు. నెలరోజుల తర్వాత, “ఏం సార్, పూర్తయిందా మీ బ్రహ్మాండమైన సినిమా కథ?” అడిగాడు
అనామకుడు. “ఫస్ట్ పేజీ మీద హెవీ వర్క్ చేస్తున్నానబ్బా ఆగు!” అన్నాడు హెవీ
ప్రేక్షకుడు.
మీ క్రాఫ్టింగ్
సాధనాలు మీ సినిమా రచన విద్యా, శిక్షణా, అభ్యాసాల
ద్వారా మాత్రమే
అభివృద్ది చెందుతాయని గుర్తు పెట్టుకోండి. సినిమాలు చూస్తున్నంత మాత్రాన ఏమీ వొరగదు.
మీకు సినిమా
రచనలో డిగ్రీ
లేకుంటే (చాలా మందికి వుండదు కూడా), వర్క్ షాపులు, స్క్రీన్
రైటింగ్ పుస్తకాలతో స్వబోధనా మీకు తోడ్పడతాయి. కొత్తగా వచ్చేవాళ్ళు కనీసం రెండు వర్క్
షాపులు హాజరవాలని నేను
సిఫార్సు చేస్తున్నాను. ఇక్కడ మీకు
ఇతరులు ఎలా రాస్తున్నారో చదవడానికీ, చర్చించడానికీ అవకాశముంటుంది.
దీంతో అపారమైన
అంశాల మీద మీకు పట్టు లభిస్తుంది. ఇతరులు చేస్తున్న
తప్పులు కూడా తెలుసుకుని మిమ్మల్ని దిద్దుకోగల్గుతారు.
సినిమా రచన ప్రాథమికాలని నేర్చుకోవడంలో సార్వత్రిక కథా నిర్మాణం (యూనివర్సల్
స్టోరీ స్ట్రక్చర్) తెలుసుకోవడం అతి ముఖ్యమైన భాగం. మౌలిక కథా నిర్మాణం జానపద కథల నుంచి, పురాణాల
నుంచీ లభిస్తోంది. ఈ విషయాలని బోధించే తరగతులకి మీరు హాజరైతే వృత్తిలో మీరు
ముందుంటారు.
ఈ విద్య మీకు స్క్రీన్ రైటింగ్ పుస్తకాల్లోంచి
కూడా లభిస్తుంది. మరొక
క్రాఫ్టింగ్ సాధనం తిరగ రాయడం. రాసింది దిద్దుకుంటూ తిరగ రాయడం.
ఎన్నిసార్లయినా తిరగ రాయండి. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచి రచయితవుతారు. సినిమా రచననేది
ఒక క్రాఫ్టు.
ఎంత సాధన చేస్తే అంత మేలైన రచయితవుతారు.
భౌతిక సాధనాలు:
ఇక్కడ కొన్ని రిఫరెన్సు
పుస్తకాలని
సూచిస్తున్నాను. అసంఖ్యాకంగా లభిస్తున్న స్క్రీన్ రైటింగ్ పుస్తకాల్లో ఏవి తీసుకోవాలన్న
తికమక లేకుండా మీకు సూచిస్తున్నాను. పాత్ర, కథ ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి
ముడిపడి వుంటాయి. ఏ పుస్తకం దేని కవసరమో ఈ కింద జాబితాలో బ్రాకెట్లలో సూచిస్తున్నాను.
1. ది ఆర్ట్ ఆఫ్ డ్రమటిక్ రైటింగ్, లాజోస్ ఎగ్రి - ఈ పుస్తకం 1946 లో వెలువడింది. ప్రత్యేకంగా ప్లే రైటింగ్ (నాటకాల)
కోసం. స్క్రీన్
రైటింగ్ కోసం దీన్ని సిఫార్సు చేస్తాను. ఇందులో వున్న లోతైన సమాచారంతో
బలమైన రచనలు చేయగల్గుతారు (క్యారెక్టర్ డెవలప్మెంట్, స్టోరీ స్ట్రక్చర్)
2. పోయెటిక్స్, అరిస్టాటిల్ మాస్టర్ - కథా నిర్మాణాన్ని పరిశోధించి
విశ్లేషించిన మొదటి పండితుడు. ఆయన చెప్పిన బేసిక్స్ ఇంకా మారలేదు (స్టోరీ స్ట్రక్చర్)
3. ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్, జోసెఫ్ కాంప్‌బెల్ - ఈ పుస్తకం చదవడం అంత తేలికైనది కాదు. అయితే
క్లాసిక్ మిథ్
స్ట్రక్చర్ (మోనో మిథ్) ని ఉపయోగించి కథానాయకుడి కథా ప్రయాణాన్ని వివరిస్తుంది (క్యారెక్టర్
డెవలప్మెంట్, స్టోరీ
స్ట్రక్చర్)
4. ది రైటర్స్ జర్నీ, క్రిస్టఫర్ వోగ్లర్ - ఇది ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ కి గైడ్ లాంటిది. దీని కంటెంట్ ని నేరుగా దాని నుంచి
తీసుకున్నారు.
ఫిల్టర్ చేసి విషయం చెప్పారు. పురాణాల నిర్మాణంపై దృష్టి పెట్టి
రాశారు (స్టోరీ స్ట్రక్చర్)
5. స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్, జేమ్స్ బానెట్ - ఇది కూడా
పురాణాల నిర్మాణాన్ని
పరిశోధించి రాసిన పుస్తకం. కల్పిత కథలకి మీకు కొత్త అంతర్దృష్టిని కల్పిస్తుంది
(క్యారెక్టర్
డెవలప్మెంట్, స్టోరీ
స్ట్రక్చర్)
6. స్క్రీన్ రైటింగ్ ఫ్రమ్ ది
హార్ట్, జేమ్స్ ర్యాన్ - పాత్ర చోదిత కథా
కథనాలకి సహాయపడే ప్రత్యేకతలున్న
పుస్తకం (క్యారెక్టర్
డెవలప్మెంట్)
7. స్క్రీన్‌ప్లే, సిడ్
ఫీల్డ్ - ప్లాట్ పాయింట్లని
పేజీ నంబర్లుగా
మార్చి చూపిన ప్రసిద్ధ పుస్తకం. స్క్రీన్‌ప్లే నిర్మాణాన్ని
నేర్చుకోవడం ప్రారంభించడానికి ఇది మంచి పుస్తకం. ఐతే ఒక హెచ్చరిక - అలాగని పేజీ
నంబర్లు ముందే అనుకుని ప్లాట్ పాయిట్స్ రాయకండి. అంకాల నిడివిని బట్టి పేజీ నంబర్లు
మారవచ్చు.
—గినీ వాన్ నేమ్ (రచయిత్రి, నిర్మాత)
గమనిక : పై పుస్తకాల్లో
మొదటి ఐదిటి గురించి బ్లాగులో అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నదే. అలాగే ముందుగానే ఈ
పుస్తకాలు చదివే ప్రయత్నం చేయవద్దని కూడా చెప్పాం. ఇవి హయ్యర్ స్టడీస్. ప్రాథమికంగా
బేసిక్స్ తెలియకపోతే ఈ పుస్తకాలు అర్ధం గావు. బేసిక్స్ నేర్చుకున్నాకే, ఎంతో
అనుభవం పొందిన తర్వాతే వాటి జోలికెళ్ళాలంటూ, బేసిక్స్ కోసం సిడ్
ఫీల్డ్ - ‘స్క్రీన్‌ప్లే’ పుస్తకాన్ని సూచిస్తూ వచ్చాం. కనుక పై జాబితాలో చివర సూచించిన
సిడ్ ఫీల్డ్ - ‘స్క్రీన్‌ప్లే’ మాత్రమే మొదట అభ్యసించాలి. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొనేసుకుంటే
అయోమయ జీవిగా మిగిలిపోవడం ఖాయం – సికిందర్
Friday, November 19, 2021
1090 : రివ్యూ
దర్శకత్వం : మల్లిక్ రామ్
తారాగణం: తేజ సజ్జ, శివానీ రాజశేఖర్, సత్య,
శివాజీ రాజా, తులసి తదితరులు
కథ : ప్రశాంత్ వర్మ, స్క్రీన్ ప్లే
- మాటలు : లక్ష్మీ భూపాల, సంగీతం: రథన్, ఛాయాగ్రహణం
: విద్యాసాగర్
బ్యానర్ : మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్
విడుదల: నవంబర్ 19, 2021, డిస్నీ + హాట్ స్టార్
సైన్స్
ఫిక్షన్ ని జత చేసి ‘అద్భుతం’ అనే ఇంకో
ప్రేమ సినిమా కొత్త వాళ్ళతో డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది ఈ రోజు
నుంచి. హీరో తేజ సజ్జా, హీరోయిన్ శివానీ రాజశేఖర్, దర్శకుడు మల్లిక్ రామ్ కొత్త వాళ్ళు. రొటీన్ ప్రేమ సినిమాలతో విసిగిన
ప్రేక్షకులకి కాస్త డిఫరెంట్ గా సైన్స్ ఫిక్షన్ రోమాన్స్ ఉత్సాహాన్నిచ్చేదే. ‘అద్భుతం’ అని టైటిల్ కూడా వుంటే అద్భుత జర్నీలో తేలియాడే
ఫీల్ కూడా పుట్టి, ఇంట్లోనే కదా థియేటర్ కేళ్ళే పని లేదుగా అని
పిల్లా పాపలతో డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోవచ్చు అల్పాహారాలు పెట్టుకుని. ఇక
ఒక మౌస్ క్లిక్ తో మొదలవుతుంది ఆట. అప్పుడుంటుంది అసలు తండ్లాట. అదేమిటో
చూద్దాం...
కథ
కథ
సూర్య (తేజ సజ్జా) ఒక ఛానెల్లో పని చేస్తూంటాడు. ఒక రోజు ఆఫీసులో అయిన ఒక అనుభవంతో ఆత్మ హత్యకి సిద్ధపడతాడు. ఇంకో చోట వెన్నెల (శివాని) వుంటుంది. ఈమె కూడా ఒక కారణంతో ఆత్మహత్యకి పూనుకుంటుంది. ఇంతలో సూర్య సెల్ కి అతడి నెంబరుతోనే మెసేజి వస్తుంది. అది వెన్నెల సెల్ నుంచి వస్తుంది. తన నెంబర్ వెన్నెల దగ్గరెలా వుంది? తెలుసుకుంటే ఆమే తనూ వేర్వేరు కాలాల్లో వున్నట్టు తెలుస్తుంది. ఆమె 2014 లో, తను 2019 లో. ఇదెలా సాధ్యం? ఇప్పుడేం చేయాలి? ఇద్దరూ ఎలా కలుసుకోవాలి? అసలు ఇద్దరి మధ్య వున్న సంబంధమేమిటి? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
వివిధ జానర్ల సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తూంటాయి. వాటిలో ప్రేమ కథలొకటి. ఈ ప్రేమ కథల్లో సైన్స్ ఎక్కువై ప్రేమ తగ్గినా, ప్రేమ ఎక్కువై సైన్స్ తగ్గినా, లేదా సైన్సే మిస్సయినా ఫలితాలు బావుండవు. సైన్స్ సృష్టించిన కథా ప్రపంచంలో ప్రేమ కథలుంటే రెండూ కలిపి అద్భుతంగా ఫీలవగల్గుతాం- మనమూ ఆ కాల్పనిక సైన్స్ ప్రపంచంలో విహరిస్తూ. ‘ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్’ (2005), ‘ఎబౌట్ టైమ్’ (2013), ‘ఐయాం యువర్ మాన్’ (2021) వంటివి కొన్ని. తెలుగులో ‘ఆదిత్య 369’ చూసినా మనం మొత్తం వేరే ప్రపంచంలో వున్నట్టు ఫీలవుతాం. అలా ఫీలయ్యేట్టు చేయకపోతే అది సైన్స్ ఫిక్షన్ కాదు.
‘అద్భుతం’ సైన్స్ ఫిక్షన్ జానర్లో లో భిన్న కాలాల టైమ్ జంబ్లింగ్ కథ. వేర్వేరు
కాలాల్లో వున్న హీరో హీరోయిన్ల ఫోన్
కాల్స్ కలిసి మొదలయ్యే కథలు. ఆ మధ్య తెలుగులో ఇలా ‘ప్లే
బ్యాక్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్, గత
నెలలోనే ‘నేను లేని నా ప్రేమ కథ’ అనే
రోమాన్స్ వచ్చాయి. ‘అద్భుతం’, ‘నేను లేని నా ప్రేమ కథ’ ఒకటే. రెండిటి ఇంటర్వెల్
సీన్లు ఒకటే. రెండిట్లోనూ ఎత్తుకున్న సైన్స్ ని వదిలేసి రోటీన్ ప్రేమ కథల్లోనే
పడ్డారు. కాబట్టి ‘అద్భుతం’ ఏదో
అద్భుతమనుకుంటే నిరాశ తప్పదు. వారం వారం వస్తున్న అవే పస లేని ప్రేమ సినిమాల్లో ఇదీ
ఒకటి.
‘నేను లేని నా
ప్రేమ కథ’ లో కాలాల ఎడం 17 ఏళ్ళు వుంటుంది. దాంతో 1983 లో
వుంటున్న హీరోయిన్ కథకి పీరియెడ్ లుక్ తో బాటు ఆమె కట్టూబొట్టూ, భాషా ఆ కాలంలోకి తీసికెళ్తాయి. ‘అద్భుతం’ లో కేవలం అయిదేళ్ళే కాలాల ఎడం. 2014 కీ, 2019 కీ
తేడా వుండని కాలం. దీంతో రెండు కాలాల దృశ్యాలూ, పాత్రల
తీరులూ ఒకలాగే వుంటాయి. సైన్స్ ఫిక్షన్ ఫీల్ కలగక పోవడానికి ఇదే ప్రధాన కారణం.
‘నేను లేని నా
ప్రేమ కథ’ లో కనీసం కథనమైనా డైనమిక్ గా వుంది. అనేక చోట్ల ఓ
ప్రశ్న రేకెత్తిస్తూ రీఫ్రెష్ అవుతూ పోయే కథనం. వీటితో మలుపులూ సస్పెన్సూ ఏర్పడే
కథనం. ‘అద్భుతం’ లో ఇది కూడా లేదు. ఏ
మలుపులూ సస్పెన్సూ లేని చాలా నీరసమైన పూర్ కథనంగా ఇది వుంటుంది.
ప్రేమ సినిమాలెన్ని తీసినా వాటికి ఎప్పటికప్పుడు
వయసుకొచ్చిన యువ ప్రేక్షకులు వుంటూనే వుంటారు.
అయినా తీస్తున్న ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నాయంటే లేత కుర్రాళ్ళకి కూడా పట్టని ఓల్డ్
సరుకుగా అనిపిస్తున్నాయన్న మాట. సినిమాలు చూసే వయసు కొచ్చిన నేటి లేత కుర్రాళ్ళ ప్రపంచంలో
కెళ్ళి నేటివైన ప్రేమ సినిమాల్ని ఆవిష్కరిస్తే తప్ప అద్భుతాలు జరగవు.
నటనలు- సాంకేతికాలు
తేజకిది మొదటి సినిమా. తర్వాత నటించిన సినిమా ముందు వచ్చి వుంటే వచ్చి వుండొచ్చు. ఈ మొదటి సినిమాలో నీటుగా ఆత్మవిశ్వాసంతో నటించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ వుంది. సీన్లు బాగా తీసివుంటే తనకి బావుండేది. పైపైన క్యారక్టర్ ని చిత్రించేయకుండా ఈ కథకి ప్రధాన పాత్రగా చేసి, ఒక గోల్, దాంతో డ్రైవ్ కల్పించి వుంటే స్క్రీన్ ప్లే ఇలా దెబ్బతీసేది కాదు తనని. ప్రారంభంలో ఆత్మహత్యా యత్నానికి బలమైన కారణం ఎలాలేదో, నటించడానికి అలా బలమైన కథ ఎక్కడా లేదు. సెకండాఫ్ లో ఫాదర్ సెంటి మెంటు, ట్రాజడీ కథని పక్కదోవ పట్టించాయే తప్ప తనకుపయోగ పడలేదు. హీరోయిన్ శివానితో ఫోన్ రోమాన్సు కూడా సాగి సాగి, వుండాల్సిన ప్రత్యక్ష రోమాన్స్ అప్పీల్ లేకుండా చేసింది. రెండు పాటల్లో రోమాంటిక్ గా కనిపించాడు.
కొత్త హీరోయిన్, అలనాటి హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ ఎమోషనల్ సీన్లలో కంటే మిగతా సీన్లలో
హీరోని కేర్ చేయని పాత్ర నటించడంలో స్పీడు కనబర్చింది. తేజాకీ తనకీ భవిష్యత్తు వుంది.
ఇక తేజ తండ్రిగా శివాజీ రాజా, శివానీ తండ్రిగా దేవీ ప్రసాద్, నానమ్మగా తులసి నటించారు. తేజ ఫ్రెండ్ గా సత్య బాగానే ఎంటర్ టైన్ చేస్తాడు
కామెడీతో. ప్రొడక్షన్ విలువలు, విజువల్స్ రిచ్ గా వున్నాయి అద్భుతం టైటిల్ కి తగ్గట్టు. మిగిలిన విషయాలే
అద్భుతంగా లేవు.
పాత ప్రేమకి సైన్స్ ఫిక్షన్ సింగారం. నామ్ కే వాస్తే సైన్స్ ఫిక్షన్. అద్భుతమన్నాక ప్రతీ సీనూ పరవళ్ళు తొక్కుతూ అద్భుతాలు చేయాల్సింది పోయి- అద్భుత రసంతో లవ్ ని ఒక అడ్వెంచర్ గా చూపాల్సింది పోయి, చూసి చూసి వున్న అదే పాత రొటీన్ ప్రేమ డ్రామా కింద మార్చేశారు. కొత్త దర్శకుడి చేతిలో ఏమీ లేదు. ‘జాంబీ రెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథే తీశాడు.
—సికిందర్
1089 : హాలీవుడ్ రివ్యూ
రెండు
వేల ఏళ్ళ క్రితం ఈజిప్షియన్ రాణి క్లియోపాత్రాకి పెళ్ళినాడు పెళ్ళికొడుకు మార్కస్ ఆంటోనియస్
కానుకగా ఇచ్చిన మూడు అండాకార వజ్ర ఖచిత కళాకృతులు (ఎగ్స్) ని , వెతికి తెచ్చిన వారికి 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తానని ప్రకటిస్తాడొక ఈజిప్షియన్
బిలియనీర్. ఇతను వీటిని కుమార్తె పెళ్ళిలో
చదివించాలనుకుంటాడు.
ఇలా
వుండగా, రోమ్ లోని ఒక మ్యూజియంలో క్లియోపాత్రా ఎగ్ అపహరణ
కేసుకి సంబంధించి దర్యాప్తులో ఇంటర్ పోల్ ఏజెంట్ ఊర్వశీ దాస్ (రీతూ ఆర్య) తో
సహకరించేందుకు ఎఫ్ బీఐ ఏజెంట్ జాన్ హార్ట్లీ (డ్వాయెన్ జాన్సన్) వస్తాడు. మ్యూజియంలో
ఒరిజినల్ ఎగ్ ని అపహరించి నకిలీ ఎగ్ వుంచినట్టు గుర్తించిన అతనూ ఊర్వశి, వెంటనే యాక్షన్‌లోకి దిగుతారు. కళా ఖండాల చోరుడు నోలన్ బూత్ (రేయాన్
రేనాల్డ్స్) ని వెంటాడుతారు. నోలన్ తప్పించుకుని ఎగ్ తో బాలీలోని తన నివాసానికి
చేరుకుంటాడు. అక్కడే వున్న జాన్ అతడ్ని పట్టుకుంటాడు. అక్కడికే వచ్చిన ఊర్వశి, నోలన్ తో బాటు జాన్ ని పట్టుకుంటుంది. జాన్ నోలన్ తో కుమ్మక్కయ్యాడని
ఆరోపించి, నోలన్ తో బాటు రష్యన్ జైల్లో వేయిస్తుంది. అక్కడ ఎగ్స్
అన్వేషణలో వున్న బిషప్ (గాల్ గడోట్) వీళ్ళిద్దరితో బేరమాడుతుంది. ఆమెతో బేరం
ఒప్పుకుని ప్లాను ప్రకారం నోలన్, జాన్ తో కలిసి జైల్లోంచి
తప్పించుకుని ఎగ్స్ వేటలో పడతాడు...
ఈ వేటలో నోలన్ విజయం సాధించాడా? ప్రపంచానికి తెలియని మూడో ఎగ్ జాడ ఎలా కనుక్కున్నాడు? ఈ క్రమంలో ఎదుర్కొన్న కష్టాలేమిటి? మోసాలేమిటి? జాన్, బిషప్ ల నిజ స్వరూపాలేమిటి? ఇవి తెలియడమే మిగతా కథ.
స్టార్ పవర్ - స్టోరీ పవర్
నెట్ ఫ్లిక్స్ 200 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి కొని విడుదల చేసిన ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇందులో క్లియోపాత్రా ఎగ్స్ అనేది సినిమా కోసం కల్పించిన కథ. చారిత్రక స్పర్శ గల ఈ కల్పిత కథ వల్ల సినిమాకో విషయ గాంభీర్యం ఏర్పడింది. దీనికి కాంట్రాస్ట్ గా పూర్తిగా యాక్షన్ కామెడీ చేశారు కథని. ఎక్కడా సీరియస్ గా వుండదు. ఏది ఎందుకు జరుగుతున్నాయో కూడా లాజిక్ లేకుండా మాస్ అప్పీల్ తో నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. దీనికి సారధులు ముగ్గురు స్టార్స్ - రేయాన్ రెనాల్డ్స్, డ్వాయెన్ జాన్సన్, గాల్ గోడాట్. తెర మీద ఈ స్టార్స్ కన్పిస్తే చాలు, కథ అవసరం లేదన్నట్టు ప్రవర్తించాడు దర్శకుడు రాసన్ మార్షల్ థర్బర్. దీంతో స్టార్ పవర్ తో దేశాదేశాల లొకేషన్స్ లో హంగామాయే తప్ప స్టోరీ పవర్ లేకుండా పోయింది.
ముగ్గురూ లోకం చుట్టిన వీరుల్లా రోమ్, బాలీ, లండన్, రష్యా, కైరో, అర్జెంటీనా, పారిస్, సార్డినా తిరిగేస్తారు. ఒక్కో దేశం పేరు తెర
నిండుగా బండగా పడుతూంటాయి - మాస్ సినిమా కదా? తీరా చూస్తే ఆ దేశాల్లో
ఇండోర్స్ లోనే సీన్సు జరుగుతాయి. ఈ మాత్రం
ఇండోర్ సీన్స్ కి దేశాలు వెళ్ళడం ఎందుకో అర్ధం గాదు. ప్రతీ దేశంలో ఒక్కో యాక్షన్ సీనుమాత్రం
అదరగొట్టేస్తారు. రష్యాలో హెలీకాప్టర్ తో యాక్షన్
సీను, అర్జెంటీనాలో పారిపోయిన జర్మన్ నాజీకి చెందిన పురాతన కారుతో
యాక్షన్ సీను లాంటివి. ఆరుకి ఆరూ యాక్షన్ సీన్సు స్టార్స్ సెలబ్రిటీ స్టేటస్ తో పోటీ పడతాయి.
లాజిక్ కి డైలాగ్ పంచ్
భూగర్భంలో ఈ నాజీ రహస్య బంకర్ ని యాక్సిడెంటల్ గా కనుగొన్నాక అందులో విద్యుద్దీపాలు దేదీప్యమానంగా వెలిగి పోతూండడం చూసి, బంకర్లో ఈ లైటింగ్ ఎలా సాధ్యమని మనకి డౌటు వస్తూండగానే, కరెంటు బిల్లు ప్రతీ నెలా కరెక్టుగా కడుతున్నట్టుంది - అనేస్తాడు రెనాల్డ్స్. ఇలా ప్రతీ చోటా లాజిక్ ని డైలాగులతో నవ్వించి ఎగుర గొట్టేస్తూంటారు. అయితే జలపాతం దగ్గర అద్భుత యాక్షన్ నైట్ సీను పట్ట పగలులా ఎలా వెలిగిపోతోందో డైలాగు కొట్టలేదు.
కళా ఖండాల దొంగగా రెనాల్డ్స్ జేమ్స్
బాండ్ అడ్వెంచర్లు చేయడం ఈ యాక్షన్ కామెడీ ప్రత్యేకత. అతను అతి తెలివైన వాడు, చురుకైన వాడు. కష్ట సమయంలో కూడా డోంట్ కేర్ అన్నట్టు డైలాగులు కొట్టే రకం.
నోరు తెరిస్తే కామెడీ పంచులే వస్తాయి. తన వల్ల తనతో బాటు అరెస్టయి జైల్లోపడ్డ ఎఫ్‌బీఐ
ఆఫీసరు జాన్సన్ కి తనే దిక్కు. అలుసుగా తీసుకుని డైలాగులతో హింసిస్తూ వుంటాడు. తెలుగు
డబ్బింగ్ డైలాగులు బాగా పేలాయి. జాన్సన్ కూడా డైలాగులు కొట్టడంలో తక్కువేం కాదు- జైల్లో
ఫైటింగు సీను వద్దని నేను ఫీలవుతున్నాను- అంటాడొక సారి.
చేయని నేరానికి జైల్లో పడ్డ జాన్సన్
బాధేమిటంటే, తను నిర్దోషియని నిరూపించుకోవాలంటే రెనాల్డ్స్ తో
వుండక తప్పదు. క్లియోపాత్రా ఎగ్స్ ఎక్కడెక్కడెక్కడున్నాయో కనుక్కొని బయటపడాలంటే రెనాల్డ్సే
దిక్కు. రెనాల్డ్స్ ఏడ్పించినా ఏడ్వక తప్పదు. దీంతో ఒకరంటే ఒకరికి పడని ఈ పోలీసు-దొంగ
జోడీ ప్రయాణ కథ వినోద భరితంగానే వుంటుంది. వీళ్ళిద్దర్నీ గుప్పెట్లో పెట్టుకుని ఆడించే
అసలు దొంగ గాల్ గోడాట్ హీరోయిన్ కామెడీ అదనం.
అయితే ఎగ్స్ తో వుండాల్సిన కథే కథ కాకుండా
సినిమా బోలుగా తయారైంది. వీళ్ళకి ప్రత్యర్ధిగా ఇంటర్ పోల్ ఏజెంట్ ఊర్వశీ దాస్ పాత్రలో
వున్న బ్రిటిష్ నటి రీతూ ఆర్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. క్లయిమాక్స్ లో పాత తెలుగు
సినిమాల్లో లాగా బిలబిలమంటూ పోలీసులతో వచ్చేసి, యూఆర్ అండర్ అరెస్ట్
అంటూ అందర్నీ పట్టుకునే లాంటి సీన్సే ఈమెకుంటాయి. ఇదొక ఆఫ్ స్క్రీన్ కామెడీ.
రెనాల్డ్స్, జాన్సన్
లకి నాన్న లుండే వాళ్ళు. రెనాల్డ్స్ నాన్న పోలీసు అయితే తను దొంగగా మారాడు. జాన్సన్
నాన్న దొంగ అయితే తను పోలీసు అయ్యాడు. పాత్రల మధ్య ఈ ఫార్ములా డైనమిక్స్ బావున్నాయి.
చిన్నప్పుడు తన వాచీ దొంగిలించాడని రెనాల్డ్స్ ని అపార్ధం జేసుకుని మాట్లాడ్డం మానేశాడు
నాన్న. పెద్దయ్యాక రెనాల్డ్స్ కి ఆ వాచీ దొరికి కసి దీరా పగుల గొట్టి పారేస్తే, అందులోనే బయట పడింది మూడో ఎగ్ రహస్యం. దాంతో ప్రపంచ యాత్ర ప్రారంభించి ఈ కథకి
శ్రీకారం చుట్టాడన్న మాట. కథ పట్టించుకోకుండా స్టార్ కామెడీని ఎంజాయ్ మాత్రం చేయొచ్చు
ఈ హాలీవుడ్ మెగా మాస్ మూవీతో.
—సికిందర్
Thursday, November 18, 2021
1088 : రివ్యూ
దర్శకత్వం : అజయ్ భుయాన్
తారాగణం : రవి దుబే, జోయా ఆఫ్రోజ్, రవి కిషన్, పీయూష్ మిశ్రా, మధుర్ మిట్టల్, నావెద్
అస్లం. రాజేష్ శర్మా, ఋత్విక్ షోరే తదితరులు
కాన్సెప్ట్ : దేబూ పుర్కాయస్థ, కథ : నరేష్
దుబే, శివ్ సింగ్, తేజ్‌పాల్ రావత్, దేబూ పూర్కాయస్థ, స్క్రీన్ ప్లే: శివ్ సింగ్, మాటలు : అనుకృతీ ఝా, ఛాయాగ్రహణం : మనోజ్ రెడ్డి
బ్యానర్ : ఎమెక్స్
ప్లేయర్
నిర్మాతలు: దీపక్ ధార్, ఋషి నేగీ
విడుదల : నవంబర్ 18, 2021,
ఎమెక్స్ ప్లేయర్
***
పాపులర్ టీవీ
స్టార్ రవి దుబే వెబ్ సిరీస్ ‘మత్స్య కాండ్’ సీజన్ -1 విడుదలైంది. థ్రిల్లర్ జానర్లో 11 ఎపిసోడ్ల షో ఇది. నాగ
చైతన్యతో 2014 లో ‘దడ’ తీసిన దర్శకుడు
అజయ్ భుయాన్, రవి దుబేతో ప్రయోగాత్మక వెబ్ సిరీస్ తీశాడు.
బాలీవుడ్ సహాయ నటుడు పీయూష్ మిశ్రా ఓ పాత్ర వేశాడు. భోజ్ పురి సూపర్ స్టార్ రవి
కిషన్ కీలక పాత్రలో కన్పిస్తాడు. రివెంజీ దాని చుట్టూ స్కామ్స్ తో సాగే దీని
కథాకథనాల నిడివి ఆరు గంటలు. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలు. ఇది పెద్దలకు
మాత్రమే వెబ్ సిరీస్.
ఇందులో రవి
దుబే ఎపిసోడ్ కొక బ్యాంగ్ తో కనిపిస్తాడు. కన్పించినప్పుడు రవి దుబే అని
గుర్తుపట్ట లేనంత మాయ చేస్తాడు పాత్రలకే కాదు, ప్రేక్షకులకి కూడా. అతను
మాయగాడు. పేరు మత్స్య. మాయగాడుగా అతనెలా మారాడని తెలియజేస్తూ జైలు సీనుతో
ప్రారంభమవుతుంది.
సైనికుడైన మత్స్య తండ్రి కార్గిల్
యుద్ధంలో మరణిస్తాడు. ప్రభుత్వ సాయం కింద అతడి తల్లికి పెట్రోలు బంకు
కేటాయిస్తారు. ఆ పెట్రోలు బంకు తగుల బెట్టేసి జైలుకి పోతాడు మత్శ్య. జైల్లో
సిబ్బంది హింసిస్తారు. తను బయటికెళ్ళి పగ దీర్చుకునే పనుంది. అందుకని జైల్లోంచి తప్పించుకునే ప్రయత్నాలు
చేస్తూంటాడు. జైల్లో మహాభారతం బోధించే శివో పాసకుడు ఆనంద్ పండిత్ (పీయూష్ మిశ్రా)
వుంటాడు. మత్స్య బయటికెళ్తే బయటి ప్రపంచంలో ఎలా పరిస్థితుల్ని ఎదుర్కోవాలో
అభిమన్యుడి కథ భోదిస్తాడు. జైల్లోంచి బయటపడ్డ మత్స్య ఇక మాయగాడుగా మారతాడు.
చిటికెలో మాయచేసి దోచుకుని మాయమై పోతూంటాడు. ఈ కేసులు ఏసీపీ తేజ్ రాజ్ సింగ్ (రవి కిషన్)
దృష్టికొచ్చి వేట మొదలెడతాడు. తేజ్ రాజ్ కంటే తెలివైన మత్స్య ఎత్తుకి పై ఎత్తులేసి
తప్పించుకుంటూ మాయలు చేస్తూంటాడు. ఇతడ్ని తేజ్ రాజ్ ఎలా పట్టుకున్నాడన్నది మిగతా కథ.
ఇందులో మెజీషియన్ ఊర్వశీగా జోయా ఆఫ్రోజ్
తో రవి దుబేకి రోమాన్స్ వుంటుంది. కామెడీ వుంటుంది. రవి దుబే పగ దీర్చుకునే విలన్లు కావలసినంత మంది వున్నారు, ఢిల్లీ, మీరట్, జైపూర్, సాంభార్లలో ఈ గ్యాంగ్
స్టర్స్ తో పగదీర్చుకునే కథకి రవి దుబే ప్రత్యేక ఆకర్షణ. టీవీ సీరియల్స్ తో సాఫ్ట్
రోల్స్ లో కన్పించే ఇతను ఇంత హార్డ్ కోర్ క్రిమినల్ పాత్ర వేసి ఆశ్చర్య పరుస్తాడు.
డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్
బ్యాగేజ్, యాక్షన్ సిల్స్ లో పూర్తిగా కొత్త రవి దుబే ప్రత్యక్షమవడం
ఒకెత్తయితే, మాయగాడుగా ఎపిసోడ్ కొక మారు వేషం వేయడం ఒకెత్తు.
11 ఎపిసోడ్లలో 11 మారు వేషాల్లో కన్పిస్తాడు. కన్పించినప్పుడల్లా గుర్తు పట్టలేనంత
మాయ చేస్తాడు, థ్రిల్ చేస్తాడు మనల్ని. ఈ క్రెడిట్ మేకప్ డిపార్ట్ మెంట్ నరేంద్ర
ఝెట్వా, మేఘనా సకట్ లకి పోతుంది.
గ్యాంగ్ స్టర్స్ మీద పగ దీర్చుకునే రక్త దాహ పాత్ర రవి దుబేది. మాయలు చేసి అనూహ్య సంఘటనలు సృష్టిస్తూనే, ఎక్కడా తనని పట్టించే ఆధారం వదలని మాస్టర్ క్రిమినల్ గా పాత్రని తీర్చిదిద్దిన
తీరుకి క్రెడిట్ రచయితలకి పోతుంది. అలాగే ఏసీపీ గా రవికిషన్ పాత్ర కూడా. కర్కోటకుడైన
బ్యాడ్ పోలీసు పాత్ర. ఇతడికీ, ఇతను పట్టుకోవాల్సిన రవి దుబేకీ
మధ్యే ఈ ఎపిసోడ్లు కాబట్టి, ఇద్దరి ఎలుకా పిల్లీ చెలగాటపు కథనాన్ని
హైలైట్ చేస్తూ కాన్సెప్ట్ ని నిలబెట్టారు.
గ్యాంగ్ స్టర్స్ తో వెబ్ సిరీస్ అంటేనే
ఆయుధాలు, హత్యలు, బూతులూ కాబట్టి ఇవి ఇందులోనూ
వున్నాయి. పాత్రలు బండ బూతులు తిడితే తప్ప ఇలాటి వెబ్ సిరీస్ కి నిండుదనం రాదన్నట్టు
ప్రేక్షకులకి పళ్ళెంలో పెట్టి అందిస్తున్నారు. ఈ సిరీస్ చూస్తూంటే ఇందులోని బండ బూతులు
మన ఇంటి నిండా ప్రతిధ్వనించి దరిద్రంగా వుంటుంది ఇల్లు. ఈ బూతులు తాకిన గోడలు మలినమైపోతాయి.
అజయ్
భుయాన్ దర్శకత్వమెలా వున్నా పదకొండు మారువేషాలనే యూఎస్పీ ఎపిసోడ్స్ ని నిలబెట్టింది.
దర్శకత్వం మీద మన దృష్టి పడనంతగా రవి దుబే ఈ మారు వేషాలతో కమ్మేస్తాడు. నాల్గు నగరాల
లొకేషన్స్ మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణంలో బావున్నాయి. ఇండోర్స్ కి డార్క్ లైటింగ్ చేశారు.
మిస్టరీ, థ్రిల్, డ్రామా ప్రధానంగా ఈ సిరీస్ మొదటి రెండు ఎపిసోడ్లు
కదలని కథతో ఆసక్తికరంగా వుండవు. మిగిలిన ఎపిసోడ్స్ గేమ్ అందుకుని వేగం పుంజుకుంటాయి.
—సికిందర్
Subscribe to:
Posts (Atom)