రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 19, 2021

1089 : హాలీవుడ్ రివ్యూ


 

        రెండు వేల ఏళ్ళ క్రితం ఈజిప్షియన్ రాణి క్లియోపాత్రాకి పెళ్ళినాడు పెళ్ళికొడుకు మార్కస్ ఆంటోనియస్ కానుకగా ఇచ్చిన మూడు అండాకార వజ్ర ఖచిత కళాకృతులు (ఎగ్స్) ని , వెతికి తెచ్చిన వారికి 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తానని ప్రకటిస్తాడొక ఈజిప్షియన్ బిలియనీర్. ఇతను వీటిని కుమార్తె  పెళ్ళిలో చదివించాలనుకుంటాడు.    

లా వుండగా, రోమ్ లోని ఒక మ్యూజియంలో క్లియోపాత్రా ఎగ్ అపహరణ కేసుకి సంబంధించి దర్యాప్తులో ఇంటర్ పోల్ ఏజెంట్ ఊర్వశీ దాస్ (రీతూ ఆర్య) తో సహకరించేందుకు ఎఫ్ బీఐ ఏజెంట్ జాన్ హార్ట్లీ (డ్వాయెన్ జాన్సన్) వస్తాడు. మ్యూజియంలో ఒరిజినల్ ఎగ్ ని అపహరించి నకిలీ ఎగ్ వుంచినట్టు గుర్తించిన అతనూ ఊర్వశి, వెంటనే యాక్షన్లోకి దిగుతారు. కళా ఖండాల చోరుడు నోలన్ బూత్ (రేయాన్ రేనాల్డ్స్) ని వెంటాడుతారు. నోలన్ తప్పించుకుని ఎగ్ తో బాలీలోని తన నివాసానికి చేరుకుంటాడు. అక్కడే వున్న జాన్ అతడ్ని పట్టుకుంటాడు. అక్కడికే వచ్చిన ఊర్వశి, నోలన్ తో బాటు జాన్ ని పట్టుకుంటుంది. జాన్ నోలన్ తో కుమ్మక్కయ్యాడని ఆరోపించి, నోలన్ తో బాటు  రష్యన్ జైల్లో వేయిస్తుంది. అక్కడ ఎగ్స్ అన్వేషణలో వున్న బిషప్ (గాల్ గడోట్) వీళ్ళిద్దరితో బేరమాడుతుంది. ఆమెతో బేరం ఒప్పుకుని ప్లాను ప్రకారం నోలన్, జాన్ తో కలిసి జైల్లోంచి తప్పించుకుని ఎగ్స్ వేటలో పడతాడు...
        ఈ వేటలో నోలన్ విజయం సాధించాడా? ప్రపంచానికి తెలియని మూడో ఎగ్ జాడ ఎలా కనుక్కున్నాడు? ఈ క్రమంలో ఎదుర్కొన్న కష్టాలేమిటి? మోసాలేమిటి? జాన్, బిషప్ ల నిజ స్వరూపాలేమిటి? ఇవి తెలియడమే మిగతా కథ.

స్టార్ పవర్ - స్టోరీ పవర్
    నెట్ ఫ్లిక్స్ 200 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి  కొని విడుదల చేసిన ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇందులో క్లియోపాత్రా ఎగ్స్ అనేది సినిమా కోసం కల్పించిన కథ. చారిత్రక స్పర్శ గల ఈ కల్పిత కథ వల్ల సినిమాకో విషయ గాంభీర్యం ఏర్పడింది. దీనికి కాంట్రాస్ట్ గా పూర్తిగా యాక్షన్ కామెడీ చేశారు కథని.  ఎక్కడా సీరియస్ గా వుండదు. ఏది ఎందుకు జరుగుతున్నాయో కూడా లాజిక్ లేకుండా మాస్ అప్పీల్ తో నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. దీనికి సారధులు ముగ్గురు స్టార్స్ - రేయాన్ రెనాల్డ్స్, డ్వాయెన్ జాన్సన్, గాల్ గోడాట్. తెర మీద ఈ స్టార్స్ కన్పిస్తే చాలు, కథ అవసరం లేదన్నట్టు ప్రవర్తించాడు దర్శకుడు రాసన్ మార్షల్ థర్బర్. దీంతో స్టార్ పవర్ తో దేశాదేశాల లొకేషన్స్ లో హంగామాయే తప్ప స్టోరీ పవర్ లేకుండా పోయింది.

        ముగ్గురూ లోకం చుట్టిన వీరుల్లా రోమ్, బాలీ, లండన్, రష్యా, కైరో, అర్జెంటీనా, పారిస్, సార్డినా తిరిగేస్తారు. ఒక్కో దేశం పేరు తెర నిండుగా బండగా పడుతూంటాయి - మాస్ సినిమా కదా? తీరా చూస్తే ఆ దేశాల్లో ఇండోర్స్  లోనే సీన్సు జరుగుతాయి. ఈ మాత్రం ఇండోర్ సీన్స్ కి దేశాలు వెళ్ళడం ఎందుకో అర్ధం గాదు. ప్రతీ దేశంలో ఒక్కో యాక్షన్ సీనుమాత్రం అదరగొట్టేస్తారు. రష్యాలో హెలీకాప్టర్ తో  యాక్షన్ సీను, అర్జెంటీనాలో పారిపోయిన జర్మన్ నాజీకి చెందిన పురాతన కారుతో యాక్షన్ సీను లాంటివి. ఆరుకి ఆరూ యాక్షన్ సీన్సు  స్టార్స్ సెలబ్రిటీ స్టేటస్ తో పోటీ పడతాయి.

లాజిక్ కి డైలాగ్ పంచ్
     భూగర్భంలో ఈ నాజీ రహస్య బంకర్ ని యాక్సిడెంటల్ గా కనుగొన్నాక అందులో విద్యుద్దీపాలు దేదీప్యమానంగా వెలిగి పోతూండడం చూసి, బంకర్లో ఈ లైటింగ్ ఎలా సాధ్యమని మనకి డౌటు వస్తూండగానే, కరెంటు బిల్లు ప్రతీ నెలా కరెక్టుగా కడుతున్నట్టుంది - అనేస్తాడు రెనాల్డ్స్. ఇలా ప్రతీ చోటా లాజిక్ ని డైలాగులతో నవ్వించి ఎగుర గొట్టేస్తూంటారు. అయితే జలపాతం దగ్గర అద్భుత యాక్షన్ నైట్ సీను పట్ట పగలులా ఎలా వెలిగిపోతోందో డైలాగు కొట్టలేదు.

         కళా ఖండాల దొంగగా రెనాల్డ్స్ జేమ్స్ బాండ్ అడ్వెంచర్లు చేయడం ఈ యాక్షన్ కామెడీ ప్రత్యేకత. అతను అతి తెలివైన వాడు, చురుకైన వాడు. కష్ట సమయంలో కూడా డోంట్ కేర్ అన్నట్టు డైలాగులు కొట్టే రకం. నోరు తెరిస్తే కామెడీ పంచులే వస్తాయి. తన వల్ల తనతో బాటు అరెస్టయి జైల్లోపడ్డ ఎఫ్బీఐ ఆఫీసరు జాన్సన్ కి తనే దిక్కు. అలుసుగా తీసుకుని డైలాగులతో హింసిస్తూ వుంటాడు. తెలుగు డబ్బింగ్ డైలాగులు బాగా పేలాయి. జాన్సన్ కూడా డైలాగులు కొట్టడంలో తక్కువేం కాదు- జైల్లో ఫైటింగు సీను వద్దని నేను ఫీలవుతున్నాను- అంటాడొక సారి.

        చేయని నేరానికి జైల్లో పడ్డ జాన్సన్ బాధేమిటంటే, తను నిర్దోషియని నిరూపించుకోవాలంటే రెనాల్డ్స్ తో వుండక తప్పదు. క్లియోపాత్రా ఎగ్స్ ఎక్కడెక్కడెక్కడున్నాయో కనుక్కొని బయటపడాలంటే రెనాల్డ్సే దిక్కు. రెనాల్డ్స్ ఏడ్పించినా ఏడ్వక తప్పదు. దీంతో ఒకరంటే ఒకరికి పడని ఈ పోలీసు-దొంగ జోడీ ప్రయాణ కథ వినోద భరితంగానే వుంటుంది. వీళ్ళిద్దర్నీ గుప్పెట్లో పెట్టుకుని ఆడించే అసలు దొంగ గాల్ గోడాట్ హీరోయిన్ కామెడీ అదనం.

        అయితే ఎగ్స్ తో వుండాల్సిన కథే కథ కాకుండా సినిమా బోలుగా తయారైంది. వీళ్ళకి ప్రత్యర్ధిగా ఇంటర్ పోల్ ఏజెంట్ ఊర్వశీ దాస్ పాత్రలో వున్న బ్రిటిష్ నటి రీతూ ఆర్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. క్లయిమాక్స్ లో పాత తెలుగు సినిమాల్లో లాగా బిలబిలమంటూ పోలీసులతో వచ్చేసి, యూఆర్ అండర్ అరెస్ట్ అంటూ అందర్నీ పట్టుకునే లాంటి సీన్సే ఈమెకుంటాయి. ఇదొక ఆఫ్ స్క్రీన్ కామెడీ.

        రెనాల్డ్స్, జాన్సన్ లకి నాన్న లుండే వాళ్ళు. రెనాల్డ్స్ నాన్న పోలీసు అయితే తను దొంగగా మారాడు. జాన్సన్ నాన్న దొంగ అయితే తను పోలీసు అయ్యాడు. పాత్రల మధ్య ఈ ఫార్ములా డైనమిక్స్ బావున్నాయి. చిన్నప్పుడు తన వాచీ దొంగిలించాడని రెనాల్డ్స్ ని అపార్ధం జేసుకుని మాట్లాడ్డం మానేశాడు నాన్న. పెద్దయ్యాక రెనాల్డ్స్ కి ఆ వాచీ దొరికి కసి దీరా పగుల గొట్టి పారేస్తే, అందులోనే బయట పడింది మూడో ఎగ్ రహస్యం. దాంతో ప్రపంచ యాత్ర ప్రారంభించి ఈ కథకి శ్రీకారం చుట్టాడన్న మాట. కథ పట్టించుకోకుండా స్టార్ కామెడీని ఎంజాయ్ మాత్రం చేయొచ్చు ఈ హాలీవుడ్ మెగా మాస్ మూవీతో.

—సికిందర్