రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query ఊపిరి. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query ఊపిరి. Sort by relevance Show all posts

Sunday, June 14, 2026

1419 : స్క్రీన్ ప్లే సంగతులు


 

రచన-దర్శకత్వం : బుచ్చిబాబు సానా
తారాగణం : రాం చరణ్, జాహ్నవీ కపూర్, జగపతిబాబు, శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ
రచయితలు : నాగేంద్ర కాశి, వర ప్రసాద్ తోలేటి, కృష్ణ హరి, వెంకట ప్రసాద్ గాంధీ, శ్రీ రామన్
సంగీతం : ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు, కూర్పు : నవీన్ నూలి
బ్యానర్ : వృద్ధి సినిమాస్
నిర్మాత : కె వెంకట సతీష్
విడుదల : జూన్ 6, 2026
***

      థకీ, గాథకీ తేడాల గురించి చాలా సార్లు చెప్పుకున్నా ఇంకా కథలనుకుని గాథలతో సినిమాలు తీస్తూనే వున్నారు...మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి సింపుల్ భాషలో ఇంకోసారి తెలుసుకుందాం. కథకీ,  గాథకీ వుండే తేడా ఇదీ : కథ (Story) అనేది  హీరోకీ, విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ గోల్స్ కోసం జరిగే సంఘర్షణలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అన్న తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ (వాదన) ని తేల్చి చెప్పే జడ్జిమెంట్. అంటే కథంటే వేడి పుట్టించే వాదన  అన్నమాట. ఒక అనిల్ కుమార్ అనే రైటర్ / డైరెక్టర్ వున్నాడనుకుందాం. అతను కథ ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ పోతూంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. కాలు విరిగి హాస్పిటల్లో చేరాడు. అప్పుడా  వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. వాడెవరో తెలియడం లేదని అన్నారు పోలీసులు. దీన్ని తల రాతగా సరిపెట్టుకోమన్నారు. నేను కమర్షియల్ సినిమా రైటర్ / డైరెక్టర్ని- నాకు తల రాత గురించీ, విధి ఆట గురించీ చెప్పకండి- వాణ్ణి పట్టుకుని కేసు పెట్టండి అని వాదించాడు. పోలీసులు వాణ్ణి పట్టుకుని కోర్టులో కేసు వేశారు. కోర్టు లో వేడి వేడి ఆర్గ్యుమెంట్ జరిగింది. వాహనదారుడిదే తప్పని తీర్పు వెలువడింది. అనిల్ కుమార్ కేసు గెలిచి నష్టపరిహారం పొందాడు. ఇదీ కథంటే. పత్రాల మధ్య ఇది ఒక వాదులాటని ముందుకు తెచ్చి,  ఆట చూపిస్తూ ఎవరు రైటో ఎవరు రాంగో జడ్జిమెంటు నిస్తోంది. అంటే కథంటే వాదన తో కూడిన వేడి పుట్టించే  గరంగరం మసాలా అని  తెలుస్తోంది.

రి గాథంటే? గాథ (Tale) అంటే, విలన్ లేకుండా హీరో ఒక్కడే తనకి జరిగే కొన్ని అనుభవాల జర్నీని ఒక కొలిక్కి తెచ్చుకుని, ఇదీ నా జీవితమని  చివర్లో ఇచ్చే స్టేట్ మెంట్ (ప్రకటన) లాంటిది మాత్రమే. అంటే గాథంటే వేడి పుట్టించని ప్రకటన అన్నమాట. ఇంకో సునీల్  కుమార్ అనే రైటర్ / డైరెక్టర్ వున్నాడనుకుందాం. అతను కథ ఆలోచించు
కుంటూ రోడ్డుమీద నడుచుకుంటూ పోతూంటే, విధి వక్రించి యాక్సిడెంట్ జరిగింది. కాలు విరిగి హాస్పిటల్లో చేరాడు. కాలు బాగా ఫ్రాక్చరైందని, తిరిగి లేచి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందనీ చెప్పారు డాక్టర్లు. అలాగా, నా తల రాత ఇలా రాసి పెట్టి వుంటే ఇంకేం చేస్తాం, సరే ఇలాగే తంటాలు పడతాను, అదే సర్దుకుంటుందని రాజీ పడిపోయాడు. యాక్సిడెంట్ చేసిన వాడితో అమీతుమీ తేల్చుకోవాలన్పించలేదు. అలాగే ఇబ్బందులు పడుతూ కొన్ని నెలల తర్వాత కోలుకుని, తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇలా తన అనుభవాల్ని రికార్డు చేసి, దానికి తగ్గ ప్రతనగా ముగించేదే గాథ. ఇలా గాథంటే వేడి పుట్టించని ప్రకటన మాత్రమే అవుతోంది. గరం మసాలా లేదు, వీర రసం లేదు. కమర్షియల్ సినిమా తీయాలనుకుంటే,  వేడి పుట్టించే వాదన కావాలా,  వేడి పుట్టించని ప్రకటన కావాలా  -ఏది అవసరం?

కమర్షియల్ సినిమాకి కచ్చితంగా  వాదులాటతో వేడి పుట్టించే కథే కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే ఇందులో వాదులాటకి హీరోతో బాటు విలన్ వుంటాడు, వాళ్ళ మధ్య వేడి పుడుతుంది. కానీ ఆర్ట్ సినిమాల్లో సాధారణంగా కన్పించేవి గాథలే. విలన్ లేని హీరో అనుభవాల వేడి పుట్టించని ప్రకటనల్లాగా.  ‘పెద్ది’ ఈ కోవకి చెందుతుంది. ఇది గాథ అయినా బాక్సాఫీసులో నిలబడిందంటే ఒకటే కారణం- ప్రత్యర్ధి పాత్రలేని పెద్ది తన ఏకపక్ష ప్రయాణంలో చివరి భాగంలో సానుభూతిని  సంపాదించుకోవడమే.

 

తెలుగులో తీస్తున్నది కథలనుకుని గాథలతో తీసిన  ఇతర చిన్నా పెద్దా సినిమాలూ హీరో మీద ఏ భావోద్వేగాలూ పుట్టించకుండా ఫ్లాపయ్యాయి.  ‘పెద్ది’ కూడా తీస్తున్నది కథే అనుకుని తీస్తే అది ఎందుకో గాథ అయినట్టుంది- అయితే ‘పెద్ది’ గాథకీ, మిగతా సినిమాల గాథలకీ తేడా గుర్తించాలి- ‘పెద్ది’ కి చివర్లో సానుభూతి వర్కౌట్ అయింది. అయితే ప్రత్యర్ధి పాత్ర వుందని గాథల్లో హీరో మీద సానుభూతిని సృష్టిస్తే ఫర్వాలేదా అంటే చెప్పలేం. అన్నిసార్లూ వర్కౌట్ కాకపోవచ్చు. గాథ అని తెలిసి గాథతో స్క్రీన్ ప్లే ఆలోచించడం ఎప్పుడైనా రిస్కే. ప్రత్యర్ధి పాత్ర వుండే కథలతో సేఫ్ బిజినెస్ వుంటుంది.

గాథ అనేది వేడి పుట్టించని ఓ ప్రకటన కాబట్టి - ఈ రకమైన గాథల్ని, ముఖ్యంగా సినిమాల పరంగా, ఒకసారికి మించి చూడాలనిపించదు. మొదటిసారి చూసిన తర్వాత, మళ్ళీ చూసే ఏ ప్రయత్నమైనా చాలా విసుగ్గా మారుతుంది.  కానీ కథ అనేది వేడి పుట్టించే వాదన కాబట్టి-  ఇది సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా పురికొల్పుతుంది. బాగా తీస్తే కథతో వున్నా సినిమాని  పదే పదే చూడాలని ఎందుకు అనిపిస్తుందంటే,  నిజ జీవితంలో మనకి అనుభవం కాని  అర్థం పరమార్ధం అందిస్తుంది కాబట్టి.

ఈ నేపథ్యంలో ‘పెద్ది’ గాథని స్క్రీన్ ప్లేగా ఎలా సర్దుబాటు చేశారో చూద్దాం...

2. ‘పెద్ది’  గాథలో విషయమిలా వుంది :

2016 ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, జాతీయ క్రీడా మంత్రిత్వ శాఖకి చెందిన ఉన్నతాధికారి కిరణ్ సింగ్ జైస్వాల్ (బొమన్ ఇరానీ) ని క్రీడా మంత్రి మందలిస్తాడు. ఆ తర్వాత జైస్వాల్ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పట్టణంలో పర్యటిస్తు
న్నప్పుడు, అక్కడి స్థానిక యువత అథ్లెటిక్స్ పట్ల చూపిస్తున్న అసాధారణ అంకిత భావాన్ని గమనిస్తాడు. యువత క్రీడా స్ఫూర్తికి పెద్ది’ (రాం చరణ్) అనే ఆట కూలీ కారణమని తెలుసుకున్న  జైస్వాల్, పెద్ది వెనకున్న అసలు కథని తెలుసుకోవడానికి ముందుకు సాగుతాడు. అలా పెద్ది చరిత్రని వెలికితీసే క్రమంలో, విజయనగరం జిల్లాలోని అడవులు, కొండలు దాటుతూ మారుమూలనున్న పేరులేని కొండ గ్రామానికి చేరుకుంటాడు ఓ గ్రామస్తుడ్ని వెంటబెట్టుకుని. ఈ గ్రామస్థుడు పెద్ది గాథ చెప్పుకు పోతూంటాడు...


ఫ్లాష్ బ్యాక్ లో గాథ 1980ల చివర్లో విజయనగరం పరిసర ప్రాంతాల్లోని ఒక వెనుకబడిన, ప్రభుత్వ గుర్తింపు లేని గిరిజన కుగ్రామానికి మారుతుంది. ఆ గ్రామస్థులు పొరుగున వున్న అగ్రవర్ణ భూస్వాముల నుంచి తీవ్ర సామాజిక వివక్షని, ఆర్థిక దోపిడీనీ ఎదుర్కొంటూ వుంటారు.

ఆ గ్రామానికి చెందిన అప్పలసూరి (జగపతిబాబు) తమ ఊరికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని, దానికి ఒక పేరు పెట్టి, బయటి ప్రపంచంతో అనుసంధానించేలా ఒక రైల్వే స్టేషన్ మంజూరు చేయాలనీ  ముప్పై ఏళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతూంటాడు. అప్పలసూరి స్నేహితుడు పెద్ది. ఇతను క్రికెట్ లో మంచి టాలెంటున్న రోజువారీ ఆట కూలీ. కేవలం ఆటకి ఇంతని కూలి డబ్బుల కోసం స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ విజయాలు సాధిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తె అచ్చియమ్మ (జాహ్నవీ కపూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి రాజకీయ ప్రత్యర్థి మేనల్లుడైన రాంబుజ్జి (దివ్యేందు) అచ్చియమ్మని  బహిరంగంగా అవమానించడానికి ప్రయత్నించినప్పుడు పెద్ది అడ్డుకుంటాడు. ఈ ఘర్షణ పగగా మారి, రాంబుజ్జి ఒక స్థానిక టోర్నమెంట్‌లో పెద్దిని కుట్రతో ఓడించి, అవమానిస్తాడు. అయినా సరే, పెద్ది ప్రజల గుండెల్లో నాయకుడిగానే నిలుస్తాడు. అతడి లోని శారీరక సామర్థ్యాన్ని గమనించిన గౌర్నాయుడు (శివరాజ్ కుమార్) అనే సీనియర్ మల్లయోధుడు, అంతరించిపోతున్న సాంప్రదాయ కుస్తీలో పెద్దికి శిక్షణ ఇస్తానని ముందుకొస్తాడు. పెద్ది నిరాకరిస్తాడు.

ఒకరోజు అడవిలో పనికి వెళ్ళిన ఒక గిరిజన బాలుడు ప్రమాదవశాత్తూ మరణించడంతోగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంటుంది. తీవ్రంగా కుంగిపోయిన అప్పలసూరి ఇక ఎలాగైనా సమస్యని  పరిష్కరించాలని స్థానిక మంత్రిని  కలిసి వినతిపత్రం ఇస్తాడు. కానీ ఆ మంత్రి అతడ్ని దారుణంగా అవమానించి తరిమేస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకతీవ్ర నిరాశతో అప్పలసూరి వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతే పెద్ది వచ్చి కాపాడతాడు. తర్వాత ఇంకో సంఘటనలో అప్పలసూరి మరణించడంతోమృత దేహాన్ని తీసికెళ్ళడానికి గుర్తింపు కార్డు చూపించమంటాడు మంత్రి. గుర్తింపు లేని వూళ్ళో ఎవరికీ గుర్తింపు కార్డు లుండవు. దీంతో పెద్ది మంత్రి ముఠాతో పోరాడి అప్పలసూరి మృతదేహంతో పారిపోతాడు.

సెకండాఫ్ లో - ఇక తమ గ్రామస్థుల సమస్యలన్నిటికీ తమకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడమే కారణమని గ్రహించిన పెద్ది
, తన గ్రామానికి న్యాయం చేయడం కోసం గౌర్నాయుడు దగ్గర కుస్తీ శిక్షణకి ఒప్పుకుంటాడు. అందులో కఠోర శ్రమతో స్థానిక, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాడు.

 

ఇక జాతీయ స్థాయి పోటీలకి  సిద్ధమవుతున్న రెజ్లింగ్ ఈవెంట్ లో, తనమీద అసూయతో రగిలిపోయిన  ప్రత్యర్థి, పెద్ది కాలి నరాలు దెబ్బతినేలా గాయపరుస్తాడు. అయినా ఆ బాధని ఓర్చుకుంటూ పెద్ది సెమీ-ఫైనల్స్‌ గెలిచి స్పృహ కోల్పోతాడు. కళ్ళు తెరిచేసరికి, తను ఇకపై ఎప్పటికీ కుస్తీ ఆడలేడని డాక్టర్లు చెబుతారు. పెద్ది నేరుగా ఢిల్లీ వెళ్ళి  రైల్వే మంత్రిని కలుస్తాడు. కానీ ఆ మంత్రి కూడా అతడి శారీరక స్థితిని ఎగతాళి చేస్తూ విజ్ఞప్తిని తోసిపుచ్చుతాడు.

 

రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి విసిగిపోయిన పెద్ది ఒక సంచలన నిర్ణయం తీసుకుని, దెబ్బతిన్న కాలుని పూర్తిగా తొలగించుకుని, కృత్రిమ కాలుని  అమర్చుకుంటాడు. మళ్ళీ ఇంకో కఠోర శారీరక శిక్షణతో పారా-ట్రాక్ అథ్లెట్‌గా మారుతాడు.

 

చివరికి  జాతీయ ట్రాక్ రేసులో పాల్గొని అద్భుత విజయాన్ని సాధిస్తాడు. విజయోత్సవ ప్రసంగంలో, ప్రభుత్వ గుర్తింపు లేక తన గ్రామం ఎదుర్కొంటున్న కష్టాల్ని దేశానికి ఏకరువు పెడతాడు.

 

దీంతో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రజా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఆ గ్రామాన్ని అధికారికంగా గుర్తించి, అక్కడ ఒక రైల్వే స్టేషన్‌ని  నిర్మిస్తుంది. దానికి పెద్ది పేరు పెట్టాలని ప్రభుత్వం భావించినా, పెద్ది తన స్నేహితుడి త్యాగానికి గుర్తుగా ఆ గ్రామానికి ‘అప్పలవలస’   అని పేరు పెట్టాలని కోరతాడు.

ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకున్నాక, ప్రభుత్వ అధికారి జైస్వాల్ దేశంలోని ప్రతి మారుమూల గ్రామంలో దాగివున్న స్పోర్ట్స్ టాలెంట్స్ ని వెలికితీసి, ప్రోత్సహించడానికి ఒక భారీ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో  గాథ ముగుస్తుంది.

 

3. ఎలావుంది ఈ గాథ?

ఈ రెండు దశాబ్దాల కాలంలో గాథలుగా తీస్తే ఫ్లాపయిన తెలుగు సినిమాలెన్నో వున్నాయి- వాటిలో మచ్చుకి కొన్ని - బ్రహ్మోత్సవం, పైసా, మొగుడు, ఓకే బంగారం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, జక్కన్న, ఉన్నది ఒక్కటే జీవితం, రాజుగారి గది 2, రాజాధి రాజా, కబాలీ, ద్వారక, ఒక్కడు మిగిలాడు, డియర్ కామ్రేడ్, జార్జి రెడ్డి, రాధే శ్యామ్, శాకుంతలం, బ్రో, బచ్చలమల్లికింగ్డమ్ ...ఇలా పొరపాటున తీసిన ఇన్నేసి గాథలు ఫ్లాపవుతున్నా మళ్ళీ పెద్దితీశారంటే, మిగతా వాటిలాగే  తాము తీస్తున్నదీ గాథ అని తెలుసుకోకుండా తీశారని భావించాల్సి వస్తోంది. వందల కోట్లతో సినిమా తీస్తున్నప్పుడు ఈ చిన్న విషయం తెలియకుండా ఎలా వుంటుంది? ఏమో, దీన్ని పక్కనబెట్టి కంటెంట్ గురించి మాట్లాడుకుందాం.

జానర్ పరం గా ఇది స్పోర్ట్స్ సినిమా. అయితే రెగ్యులర్ కమర్షియల్ స్పోర్ట్స్ సినిమాల టెంప్లెట్ లో ఇది లేకపోవడానికి కారణముంది.  స్పోర్ట్స్ జానర్ సినిమాఎవరు తీసినా కథకి ఈ టెంప్లెట్టే వుంటుంది- 1. ఆట నేర్పే ఒక ట్రైనర్, 2. ఒక పీడితుడైన హీరో, 3. హీరోకి ట్రైనింగ్, 4. ట్రైనింగ్ లో సమస్యలు, 5. హీరోకి ఒక ప్రత్యర్థి, 6. ఆటలో ఆ ప్రత్యర్ధితో హీరో ఓటమి, 7. హీరోకి మరింత కఠినమైన ట్రైనింగ్, 8. ఫైనల్ గా ఆటలో ప్రత్యర్ధి మీద హీరో విజయం, 9. విజేతగా హీరోకి మెడల్, ఇంతే!

స్క్రీన్ ప్లే ట్యూటర్ కెన్ మియమోటో ఈ టెంప్లెట్ ని అప్డేట్ చేశాడు. గొప్ప స్పోర్ట్స్ డ్రామాని క్రియేట్ చేయాలంటే దృష్టి పెట్టాల్సింది పాత్ర క్రీడలో ఏం సాధించాలనుకుంటోందో ఆ గోల్ మీద కాదు, ఆ మార్గంలో ఎదురైన ఆటంకాల్ని పాత్ర ఎలా బీట్ చేసిందన్నది, ఆ అవసరం ఎందుకన్నది- వీటి మీద దృష్టి పెట్టాలి. సిల్వెస్టర్ స్టాలోన్ తో రాకీసిరీస్  స్పోర్ట్స్ సినిమాల విజయ రహస్యమిదే అన్నాడు.

‘పెద్ది’ విషయానికొస్తే, దీని గాథ 2024 హిందీ స్పోర్ట్స్ బయోపిక్ ‘చందూ ఛాంపియన్’ ని పోలి వుంటుంది. మన దేశపు మొట్టమొదటి పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్టు, మురళీకాంత్ పెట్కర్ జీవిత కథ ఆధారంగా హీరో కార్తీక్ ఆర్యన్ తో దర్శకుడు కబీర్ ఖాన్ దీన్ని తీశాడు. పారాలింపిక్స్ (లేదా పారాలింపిక్ గేమ్స్) అనేది శారీరక, దృష్టి, మానసిక వైకల్యాలున్న అథ్లెట్ల కోసం ఒలింపిక్స్ లో సమాంతరంగా నిర్వహించే వివిధ క్రీడా పోటీలు. ఈ బయోపిక్ లో ఇందులో వృద్ధుడైన మురళీకాంత్ పెట్కర్, తన విజయాలకి  గాను అర్జున అవార్డు ఇవ్వనందుకు భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని  పోలీస్ స్టేషన్‌కొస్తాడు. ఆ అవార్డు తనకి లభిస్తే తన గ్రామం అభివృద్ధికి సహాయపడుతుందని అంటాడు. అతడి అర్హతల గురించి అధికారి ప్రశ్నించినప్పుడు, షెట్కర్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు.

పాయింటేమిటంటే, దేశానికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టి, తన గ్రామానికి గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో ఇల్లు వదిలి పారిపోయి సైన్యంలో చేరిన షెట్కర్, అక్కడ బాక్సర్‌గా ఎంపికై శిక్షణ పొందుతాడు. తీరా 1964 లో టోక్యోలో బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నప్పుడు శ్రద్ధతో బాటు ఏకాగ్రత లేక ఓడిపోతాడు. దీంతో బాక్సింగ్ పట్ల షెట్కర్ కి కమిట్ మెంట్ లేదని ట్రైనింగ్ ఇవ్వను పొమ్మంటాడు ట్రైనర్.

1965 ఇండో-పాక్ యుద్ధంలో వైమానిక దాడిలో ఒక బుల్లెట్ షెట్కర్ వెన్నెముకని  దెబ్బతీయడంతో  పక్షవాతానికి గురవుతాడు. ఇక తాను ఎప్పటికీ ఒలింపిక్ గోల్డ్ గెలవలేననే నిరాశతో ఆత్మహత్యకి  ప్రయత్నిస్తాడు. అప్పుడు ట్రైనర్ అతడ్ని మందలించి  పారాలింపిక్స్‌లో పోటీపడమని ప్రోత్సహిస్తాడు. దీంతో కఠోరంగా శిక్షణ పొంది, 1972  పారాలింపిక్స్‌లో  ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌ లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి, గోల్డ్ మెడల్ గెల్చుకుంటాడు. ఈ వార్త అతని గ్రామానికి చేరగానే సెలబ్రిటీ అయోపోతాడు. గ్రామస్తులు అతడికి ఘన స్వాగతం పలుకుతారు.

గ్రామం అభివృద్ధి, ఒలింపిక్ గోల్డ్ మెడల్, బాక్సింగ్, పక్షవాతం, పారాలింపిక్స్, గోల్డ్ మెడల్ తో సత్కారం వంటి ఈ బయోపిక్ లోని గాథని నడిపిన బేసిక్ థీమ్స్ ‘పెద్ది’ లోనూ వున్నాయి. గ్రామానికి గుర్తింపు, ఒలింపిక్ గోల్డ్ మెడల్, బాక్సింగ్, కాలు దెబ్బతినడం, పారాలింపిక్స్, గోల్డ్ మెడల్ తో సత్కారం మొదలైనవి ఈ బయోపిక్ తో పోలిన ‘పెద్ది’ గాథని నడపడానికి వాడుకున్న థీమ్స్.

ఐతే ‘పెద్ది’ గాథని ముగించిన విధానం కాన్సెప్ట్ కి గండి కొట్టినట్టుంది. పెద్ది గోల్డ్ మెడల్ గెలవడంతో  ప్రభుత్వం ఎట్టకేలకు అతడి  గ్రామాన్ని అధికారికంగా గుర్తించి, డిమాండ్ లో వున్న రైల్వే స్టేషన్‌ ని ప్రారంభిస్తుంది. దీంతో పెద్ది గాథ తెలుసుకుంటున్న అధికారి జైస్వాల్, దేశవ్యాప్తంగా వున్న మారుమూల గ్రామాల్లో క్రీడా ప్రతిభని గుర్తించి, ప్రోత్సహించడానికి ఒక జాతీయ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంకల్పించుకుంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ ని ఇందుకు ఉద్దేశించలేదు. మారుమూల గ్రామాల్లో క్రీడా ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడం గురించి ఈ గాథ కాన్సెప్ట్ కాదు. ఏ గుర్తింపుకూ నోచుకోకుండా మగ్గుతున్న మారుమూల గ్రామాలని జాతీయ పటంపైకి తీసుకువచ్చే ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేయడం గురించి ఈ కాన్సెప్ట్. ఇది కాస్తా ముగింపులో వూసులోకి లేకుండా పోయింది!

4. ఈ స్క్రీన్ ప్లే గాథ ఎలా అయిందో చూద్దాం...

కథకి మాత్రమే స్క్రీన్ ప్లే త్రీ యాక్ట్స్  స్ట్రక్చర్ వుంటుంది. గాథకి ఏ స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ వుండదు. ఎలా బావుందని అనిపిస్తే అలా తోచినట్టూ రాసుకుంటూ, తీసుకుంటూ  పోవడమే. చేస్తున్నది గాథ అని తెలియక పోతే ఇదే జరుగుతుంది. చేస్తున్నది కథే అనుకుని చేస్తూంటే అది కథ కాకుండా, సరైన గాథ కూడా గాకుండా పోతుంది. ఇదే ఎక్కువ జరుగుతోంది. కథలతో బాటు గాథలూ వుంటాయనీ, ఈ విషయం తెలియకపోతే గాథలు చేసేసే ప్రమాదముందనీ తెలుసుకోవడం లేదు. గాథలతో హాలీవుడ్ సినిమాలూ వస్తూంటాయి. చేస్తున్నది గాథ అని తెలిసి గాథలాగా తీసి సక్సెస్ చేస్తూంటారు. కొన్ని వరల్డ్ మూవీస్ కూడా గాథలుగా వస్తూంటాయి. 2016లో తెలుగులో నాగార్జున- కార్తీ- తమన్నా లతో దర్శకుడు వంశీ పైడిపల్లి  ‘ఊపిరి’ ని గాథగా తీస్తే హిట్టయ్యింది. ఇదెలా జరిగిందో చివర్లో చూద్దాం. ముందుగా ‘పెద్ది’ కి తయారు చేసిన స్క్రీన్ ప్లే గురించి...

పై సెక్షన్ 2 లో చెప్పుకున్న ‘పెద్ది’ గాథ ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ చూస్తే, గ్రామానికి గుర్తింపు కోసం పెద్ది రెజ్లర్ గా మారాలని నిర్ణయించుకోవడం ఇంటర్వెల్ లో వస్తుంది. ఈ ఫస్టాఫ్ లో ముందు దిక్కులేని  గ్రామ పరిస్థితి, భూస్వాముల ఆగడాలు, రైల్వే హాల్ట్ కోసం అప్పలసూరి ప్రయత్నాలు, మరోవైపు ఆట కూలీగా పెద్ది క్రికెట్ లో గెలుస్తూ వుండడం, ఇలా బిగినింగ్ సుదీర్ఘంగా సాగుతూ వుంటుంది. ఇంకా టోర్నమెంటులో కుట్ర చేసి ప్రత్యర్ధి రాంబుజ్జి పెద్దిని ఓడించడం, గౌర్నాయుడు వచ్చి కుస్తీలో పెద్దికి శిక్షణ ఇస్తానని ఆఫరివ్వడం, పెద్ది కాదనడం, ఇంకా అప్పల సూరి మరణం, దాంతో గుర్తింపు ప్రశ్న తలెత్తడం, పెద్ది మంత్రి మనుషులకి బుద్ధి  చెప్పి- వూరికి గుర్తింపు కోసం కుస్తీ పోటీలకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం వగైరా జరుగుతాయి.

ఇంటర్వెల్ వరకూ గంటంపావు సేపూ సుదీర్ఘంగా సాగుతూ వుంటుంది బిగినింగ్. ఇదే కథ అయితే బిగినింగ్ ఇంటర్వెల్ వరకూ సుదీర్ఘంగా సాగినా, అందులో ఇంత కథ వుండదు. బిగినింగ్ బిజినెస్ లో ఏఏ 4 అంశాలైతే వుండాలో ఆ నాల్గు అంశాలతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. హీరోకి విలన్ తో సంఘర్షణ పుడుతుంది. విలన్ మీద గెలవాలన్న గోల్ హీరోకి ఏర్పడుతుంది.

ఇవేవీ లేకపోవడంతో, చివరికి ఒక విలన్ అంటూ ఎవరూ లేకపోవడంతో, ఇంటర్వెల్ లో పెద్ది ఏకోన్ముఖంగా కుస్తీ పోటీలకి వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో ఇది కథ కాదు, గాథ అని స్పష్ట మవుతోంది. కథయితే, ఎదురుగా  విలన్ అనే వాడుంటే,  పెద్ది తీసుకునే ఈ నిర్ణయంలో రిస్కు కనపడుతుంది. ఊరికి గుర్తింపు కోసం పోరాటం అనే ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ తో విలన్ తో సంఘర్షణ పుట్టి కథ రక్తి కడుతుంది. ‘పెద్ది’ లో ఇలాటి ఎదుటి శక్తిగా విలన్ కనిపించనప్పుడు,  పెద్ది నిర్ణయంలో రిస్కూ కనిపించడం లేదు. పరిణామాల హెచ్చరికా, చివరికి ఎమోషన్ కూడా కనిపించడం లేదు. ఇలా క్యారక్టరైజేషన్ బలహీన పడింది గాథ కాబట్టి. చూద్దాం, ఒకటి కాకపోతే ఇంకో  ఆట ఆడి చూద్దామని రాజీ పడుతూ ఏకపక్ష ప్రయాణం చేస్తున్నాడు. ఇందుకే ఈ మొత్తం గాథ పథకం ఎక్కడి కక్కడ ముగిసిపోయే చిన్న చిన్న ఎపిసోడ్లుగా సాగింది. పెద్ది ప్రయాణంలో కాన్ఫ్లిక్ట్ అనేది సహజంగానే గాథల్లో లాగా పరిస్థితులతో ఏర్పడుతోంది. అంటే పరిస్థితులతో పోరాటమన్నమాట, విలన్ తో పోరాటం కాదు. కథల్లో విలన్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడి ఎమోషన్ డ్రైవ్ అవుతుంది.

ఇక సెకండాఫ్ కొస్తే, కుస్తీ శిక్షణ పొందడం, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలవడం, జాతీయ పోటీలకి వెళ్ళడం, అక్కడ ఇంకో ఇంకో ప్రత్యర్ధి పెద్ది కాలుకి హాని చెయ్యడంతో, ఆ ప్రత్యర్ధి మీద పగ తీర్చుకునే బదులు, నా ఖర్మ ఇంతే ననుకుని ఆ కాలు తీసేయిన్చుకుని, కృత్రిమ కాలుతో  పారా-ట్రాక్ అథ్లెట్‌గా మారి గెలుస్తాడు. ఊరికి గుర్తింపూ రైల్వే స్టేషనూ సాధిస్తాడు. ఇలా తను పడ్డ కష్టాలతో స్టేట్ మెంట్ మాత్రంగా గాథ ముగిస్తాడు. ముందుగ చెప్పుకున్నట్టు, చివరి ఎపిసోడ్ లో పాత్ర మీద సానుభూతి ఏర్పడడంతో, దీన్ని క్యాష్ చేసుకుంటూ రాం చరణ్ గట్టెక్కాడు.

5. ఎందుకిలా జరిగింది?

ఎందుకంటే పోలికలున్న ‘చందూ ఛాంపియన్’ లాగే కథనం చేయడం వల్ల. అంటే నిజ జీవిత చరిత్రతో బయోపిక్ గా వున్న ‘చందూ ఛాంపియన్’ కథనాన్ని అలాగే బయోపిక్ గా తీసేయడం వలన ‘పెద్ది’ ది కూడా బయోపిక్ గాథలా అయింది. బయోపిక్ నిజ వ్యక్తులతో వుంటుంది. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి? ‘పెద్ది’ తో రెండు జరిగాయి : తీసింది గాథ అయితే, ఆ గాథని బయోపిక్ లా తీయడం!

బయోపిక్ అంటే ఈ భూమ్మీద పుట్టిన నిజ వ్యక్తి జీవిత చరిత్ర. భూమ్మీద పుట్టని కల్పిత పాత్రతో బయోపిక్ వుండదు. ‘చందూ ఛాంపియన్’ లో అతను నిజ క్రీడా కారుడు. కాబట్టి అతడి మీద సినిమా బయోపిక్ అయింది స్పోర్ట్స్ జానర్ లో. అయితే ఈ బయోపిక్ ని గాథలా తీయడంతో బాక్సాఫీసులో నష్టపోయింది.

 

పెద్ది భూమ్మీద ఎప్పుడు పుట్టాడు? క్రీడా కారుడుగా అతడి చరిత్ర ఎక్కడుంది? కాబట్టి పెద్ది అనే కల్పిత పాత్రతో ‘చందూ ఛాంపియన్’ లో నిజ వ్యక్తి బయోపిక్ తో గాథ కిచ్చిన కథనాన్నే దృష్టిలో పెట్టుకుని, అందులోనూ పొరపాటున బయోపిక్ గా తీసేశారు.

ఒక తమాషా జరిగింది...2019 లో  సుధాకర్ కోమాకుల హీరోగా, హరినాథ్ అనే దర్శకుడు తీసిన ‘నువ్వు తోపురా’ వచ్చింది. దీన్ని కామన్ మాన్ బయోపిక్ అని నిర్మాత ప్రచారం చేశారు. ఏదో అప్పుడున్న బయోపిక్ ల ట్రెండ్ లో బిజినెస్ కోసం అని వుంటార్లే అనుకున్నాం. కానీ నిజంగానే బయోపిక్ లాగే తీయబోయారు. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి, బయోపిక్ అంటే నిజంగా జీవించిన మనిషి కథతో కదా వుండాలి - అన్న హద్దుల్ని కూడా చెరిపేయదల్చుకున్నారు. ఆ కల్పిత ఆవారా పాత్రతో బయోపిక్ ఎలా తీశారో చూస్తే మతిపోతుంది. అందుకే బాక్సాఫీసు పట్టించుకోలేదు.

గాథకి కథకి లాగా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుండకపోవచ్చు. కానీ, బయోపిక్ ని త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తో కథ లాగా తీయొచ్చు. ఎలాగంటే, ఆ నిజ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన సమస్య ఒకటి తీసుకుని, దాంతో ఎలా సంఘర్షించాడో, ఫలితంగా ఏం సాధించాడో ఆ నిజ జీవితంలోని సంఘటనల్ని ఏర్చి కూర్చి - త్రీయాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడ్చి, కమర్షియాలిటీ కల్పించ్చ వచ్చు. అంటే నిజ జీవితాన్ని- బయోపిక్ ని - సినిమాగా ఆడించుకోవాలన్నా దాన్ని సమస్య - సంఘర్షణ - పరిష్కారమనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ తోనే చూపించాలన్న మాట. ఈ పని ‘చందూ ఛాంపియన్’ చేయలేక పోయింది.

ఇలాకాక నిజ  జీవితంలో జరిగిన అన్ని సంఘటనలూ అనుభవాలూ ఎపిసోడిక్ గా చూపించుకుంటూ పోతే అది సినిమా అవదు, డాక్యుమెంటరీ అవుతుంది. ఇది టీవీకి పనికొస్తుంది, సినిమాకి కాదు. అలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో బయోపిక్ అనేది సినిమాకే పనికొస్తుంది, టీవీ ఫిలింగా తీయడానికి కాదు. అయితే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో సినిమాగా తీసిన బయోపిక్ ని టీవీలో ప్రసారం చేయొచ్చు. ఈటీవీ ‘మార్గదర్శి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ మీద రెండు భాగాల బయోపిక్ఈ వ్యాసకర్త రాసినప్పుడు, డాక్యుమెంటరీగానే రాయాల్సి వచ్చింది. కాకపోతే ప్రారంభం కూలీషూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడిన ఆసక్తికర సంఘటనతో ఎత్తుకున్నాం. ఇదే సినిమా కోసం బయోపిక్ అనుకుంటేఅమితాబ్ జీవితంలో ఓ ప్రధాన సమస్యని  తీసుకుని, దాంతో సంఘర్షించిన విధం చూపించాల్సి వచ్చేది.

ఇలా సినిమాగా ఆడేందుకు నిజ జీవితాల్నే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టి తీయాల్సి వస్తున్నప్పుడు, ఇక రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాల్లో కల్పిత హీరోయిజాల కథలకి ఇంకెంత త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుండాలి!! ఇది గుర్తించకపోవడం వల్లే ఎవరి యాక్ట్’  ప్రకారం వాళ్ళు స్ట్రక్చర్ లేని సొంత క్రియేటివిటీలతో గాథలు తీసేస్తున్నారు.

 

6. ‘ఊపిరి’కి వూపిరి పోసిందేమిటి?

మరి గాథగా తీస్తే ‘ఊపిరి’ ఎలా హిట్టయ్యింది? ఎలాగంటే, దాన్ని ఇదివరకే హిట్టయిన ‘ఇన్ టచబుల్స్’ అనే ఫ్రెంచి మూవీ ఆధారంగా తీశారు. ‘ఇన్ టచబుల్స్’ ని చైనీస్ / జపనీస్ టెక్నిక్ తో గాథగా తీశారు. గాథలకి పనికొచ్చే ఈ చైనీస్ /జపనీస్ టెక్నిక్ కి త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుండదు, అంటే కాన్ఫ్లిక్ట్ వుండదు. ఈ టెక్నిక్ ని కిష్టెన్ క్యాచో’ (Kishotenketsu) అన్నారు.

ఈ టెక్నిక్ లో గాథ ఇలా సర్దుకుంటుంది :
1. Ki : Introduction
2. Sho : Development
3. Ten : Twist (complication)
4. Ketsu : Conclusion (reconciliation)

కమర్షియల్ సినిమా కథల్లో త్రీ యాక్ట్స్(బిగినింగ్, మిడిల్, ఎండ్) వుంటే, ఈ టెక్నిక్ లో ఫోర్ యాక్ట్స్  వుంటాయి. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనైతే బిగినింగ్ లో పాత్రల పరిచయం, సమస్య ఏర్పాటు, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం అనే పద్ధతి వుంటుంది. ఇక్కడ 4 యాక్ట్స్ విధానంలో ఇవేవీ వుండవు. ఇందులో ఫస్ట్ యాక్ట్ లో కథా పరిచయంపాత్రల పరిచయం, వాటి సామాన్య ప్రపంచమూ వుంటాయి. సెకండ్ యాక్ట్ లో  పాత్రలు పరస్పరం సంపర్కంలోకి వస్తాయి. వాటి ప్రపంచం మారుతుంది. ఆయా పాత్రల గురించి మరిన్ని విషయాలు బయటపడతాయి. ఇంతలో ఒక కొత్త ఎలిమెంట్ వచ్చి చేరుతుంది. ఇంతేగాక రకరకాల సంఘటనలతో ఆ పాత్రలు మరింత దగ్గరై ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది. థర్డ్ యాక్ట్ లో ఎమోషనల్ కనెక్ట్ తో పాత్రలు మరింత ముందుకు సాగుతాయి.  చివర్లో ఒక ట్విస్టు వస్తుంది. ఫోర్త్ యాక్ట్ లో సెకండ్ యాక్ట్ లో ప్రవేశపెట్టిన ఎలిమెంట్ తో పరిష్కారం వుంటుంది. దీని గురించి పూర్తి ఆర్టికల్ ని ఈ లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు.

కమర్షియల్ గా ఏ కథయినా ఒక సమస్య (పాయింటు) చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక సమస్య చుట్టే వుంటుంది. గౌతమీ పుత్ర శాతకర్ణిగణరాజ్యాల్ని  ఏకం చేసే సమస్య చుట్టే వుంటుంది. ఒక సమస్యా, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది గాథలకే. విడివిడి ఎపిసోడ్లుగా సమస్యలు మారిపోతూ వుంటాయి. అంటే ఎమోషన్ ఎక్కడికక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ అనే పంథాలో ఆగుతూ సాగుతూ వుంటుంది. గాథలతో ఇలాటి రిస్కులు చాలా వుంటాయి.

ఒక విలన్, అతడితో కాన్ఫ్లిక్ట్ అంటూ లేని ‘పెద్ది’ అనే గాథకి, కిష్టెన్ క్యాచో టెక్నిక్ మంచి కమర్షియల్ ప్రయోగమయ్యేది. వందల కోట్ల బడ్జెట్ వున్నప్పుడు అనుకున్న కాన్సెప్ట్ ని ఏ తరహాగా చెప్పాలా రీసెర్చి అవసరం. ఐదారుగురు రచయితలతో భారీ రీసెర్చికి తెరతీయడానికి నిధుల కొరతేమీ వుండదు కాబట్టి. గాథల్నే కాదు, ఏ కథలనైనా రీసేర్చే కాపాడుతుంది. రీసెర్చి లేని స్క్రిప్టు రచ్చ.

-సికిందర్

 

Tuesday, September 9, 2025

1392 : స్పెషల్ ఆర్టికల్


 

తను సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయదల్చుకోలేదు, సినిమా రైటర్ అవదల్చు కోలేదు, నిర్మాతా అవ్వాలనుకోలేదు, హీరో అవ్వాలనుకోలేదు. పెద్ద స్టార్ మాత్రమే అవ్వాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆడిషన్స్ లో నటనకి పనికిరావు పొమ్మంటున్నారు. కారణం అతడి ముఖం ఎడమ భాగం కింది వైపు పక్షవాతం వల్ల ముఖ కవళికలు పలకవు. పురిట్లో డాక్టర్ పొరపాటువల్ల జరిగిన అనర్ధం. వెయ్యి ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యాడు. ఒకవైపు పేదరికం, భార్యతో గొడవలు. చెప్పకుండా ఆమె నగలు తీసికెళ్ళి అమ్మేశాడు. ఆమె అతడ్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ పెంపుడు కుక్క వెళ్ళలేదు, విశ్వాసంతో తనతోనే వుంది. డబ్బుకోసం దాన్ని కూడా తీసికెళ్ళి పాతిక డాలర్లకి అమ్మేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఓ రోజు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మహ్మదాలీకీ, చక్ వెప్నర్ అనే జ్యూనియర్ కీ మ్యాచ్ జరుగుతోంటే వెళ్ళి చూశాడు. వెప్నర్ గెలిచే ప్రసక్తే లేదు. అయితే గెలిచి తీరతానన్న అతడి ఆత్మవిశ్వాసం కదిలించింది. అంతే, దీంతో మూడురోజుల్లో ఒక కథ సృష్టించి స్క్రిప్టు రాసేశాడు.

స్క్రిప్టు పట్టుకుని తిరగసాగాడు. ఎవరికీ నచ్చడం లేదు. నీకు రాయడం రాదు వేరే పని చూసుకో మనసాగారు. అలా తిరుగుతోంటే ఓ పేరున్న నిర్మాతకి నచ్చింది. దానికి లక్షాపాతిక వేల డాలర్లు ఆఫర్ చేశాడు. ఆ డబ్బుతో రిచ్ గా సెటిలై పోవచ్చనుకున్నాడు. అయితే నిర్మాత షరతు పెట్టాడు. ఇందులో హీరో రోల్ ఇవ్వనన్నాడు. స్క్రిప్టు అమ్మేసి వెళ్ళి పొమ్మన్నాడు. నేను స్టార్ ని అవ్వాలనే ఈ స్క్రిప్టు రాసుకున్నాను, నాకు డబ్బులెందుకు అని వెళ్ళిపోయాడతను.

కొన్ని రోజుల తర్వాత అదే నిర్మాత పిలిచి- ఒరే బాబూ, రెండున్నర లక్షల డాలర్లు తీసుకో, స్క్రిప్టు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. అస్సలు కుదరదన్నాడు. మరి కొన్ని రోజుల తర్వాత అదే నిర్మాత మళ్ళీ పిలిచి-  బాబ్బాబూ, నీ మొహంతో స్టార్ వి కాలేవురా, మూడున్నర లక్షల డాలర్లకి స్క్రిప్టు ఇచ్చేసి వెళ్ళిపోరా అన్నాడు. అస్సలంటే అస్సలు కుదరదన్నాడు. నా స్క్రిప్టులో నేను స్టార్ గా యాక్ట్ చేయాల్సిందేనన్నాడు.

ఆఖరికి దిగి వచ్చాడు నిర్మాత- సరే అలాగే కానీయ్, కానీ 35వేల డాలర్లే నీకిస్తా నన్నాడు. దీనికి ఒప్పుకున్నాడు. ఆ డబ్బు తీసుకుని వెంటనే పెంపుడు కుక్క కోసం వెళ్ళాడు. మూడురోజులు వెతికితే కొనుక్కున్న వ్యక్తి  కనబడ్డాడు. పెంపుడు కుక్కని వెనక్కి ఇచ్చేయమని ఆ వ్యక్తికి 500 డాలర్లు ఆఫర్ చేశాడు. ఆ వ్యక్తి  ఒప్పుకోలేదు. వెయ్యి డాలర్లకీ ఒప్పుకోలేదు. ఆఖరికి 15 వేల డాలర్లకి బేరం కుదిరింది. ఆ డబ్బు చెల్లించి పెంపుడు కుక్కని ఇంటికి తెచ్చేసుకున్నాడు. పాతిక డాలర్లకి అమ్మేసిన పెంపుడు కుక్కని, పారితోషికంగా తనకొచ్చిన 35 వేల డాలర్లలో 15 వేల డాలర్లు దానికే వెచ్చించేశాడు. భార్య తనని వదిలేసి వెళ్ళిపోయినా ఇది విశ్వాసంతో తనతోనే వుంది మరి!

ఇక తను స్టార్ గా నిర్మాత మొదలెట్టిన సినిమా నటించేశాడు. అది 1976 సంవత్సరం. ఆ సినిమా సర్ప్రైజ్ హిట్టయ్యింది. 200 మిలియన్ డాలర్ల కలెక్షన్లు. దీనికి ఆస్కార్ అవార్డులు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఎడిటింగ్ ఆస్కార్ అవార్డులు. బెస్ట్ యాక్టర్ గా, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గా రెండు నామినేషన్లు. దీంతో తనని స్టార్ గా ఫీలవుతూ ఎంట్రీ ఇచ్చిన సినిమాతో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టారే అయిపోయాడు. ఆ సినిమా ‘రాకీ’. ఆ స్టార్ ఇంకెవరో కాదు, సిల్వెస్టర్ స్టాలోనే! తర్వాత ‘రాకీ’, ‘రాంబో’ సిరీస్ సినిమాల ‘సిల్వెస్టార్’!

బిగ్ గోల్స్ రహస్యమిదే!     


                        
స్టాలోన్ గురించి ఇప్పుడెందుకంటే, లా ఆఫ్ ఎట్రాక్షన్ మానసిక స్ట్రక్చర్ లో సెల్ఫ్ ఇమేజి ప్రధాన పాత్ర వహిస్తుంది. జీవితంలో ఏం పాత్ర పోషించాలనుకుంటున్నామో, ఆ పాత్రలో మనల్ని మనం ఊహించుకోకపోతే ఎల్ ఓ ఏ పని చేయదు. లక్ష్యాన్ని సాధించలేం. అసలు లక్ష్యమంటూ ఏర్పడదు. ఇది కాసేపూ అది కాసేపూ అని మనసు నిలకడ లేకుండా వివిధ విషయాల మీదికి పోతుంది. వెరసి ఏమీ కాకుండా పోతాం. ఒక్కోసారి అధైర్యం, ఆత్మ న్యూనతా భావం, భయం వంటివి సెల్ఫ్ ఇమేజిని సృష్టించుకోవడానికి ప్రతిబంధకాలవుతాయి. దీన్ని బ్రేక్ చేయాలంటే అతి పెద్ద గోల్ ని ప్లానింగ్ చేయాల్సిందే.


        సిల్వెస్టర్ స్టాలోన్ తన ముఖంలో కుంగ దీసే చిన్న లోపాన్ని చూసుకుని అధైర్య  పడలేదు. అదెంత కుంగదీస్తోందో అంత ఆకాశాన్నంటే గోల్ ని సృష్టించుకుని, తనని ఏకంగా స్టార్ గా ఊహించుకుంటూ, నామరూపాల్లేకుండా  లోపాన్ని పాతాళంలోకి తొక్కేశాడు. హాలీవుడ్ స్టార్ గా తన సెల్ఫ్ ఇమేజిని ముందే సృష్టించుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నెరసిన జుట్టునీ, బట్ట తలనీ పట్టించుకోలేదు. వాటిని గాలికొదిలేసి యాక్టర్ గా తనని విభిన్నంగా ఊహించుకుంటూ, టాప్ లెవెల్ ఇమేజిని మనసులో  సృష్టించుకున్నాడు. దీని వల్ల తను బయట ఎంత అందవిహీనంగా కనిపించినా ప్రేక్షకుల అభిమానం తగ్గలేదు. అందాల నటుడు దివంగత శోభన్ బాబు రిటైరయ్యాక బయట కనిపించలేదు. ఎందుకంటే అందాల నటుడుగా ప్రేక్షకుల్లో తన గ్లామరస్ ఇమేజి ఎలా ముద్రించుకుందో, అదే ఇమేజితో వాళ్ళ జ్ఞాపకాల్లో మిగిలిపోవాలని, గ్లామరున్నప్పుడే రిటరై పోయి వృద్ధాప్యంలో బయట ఎవరికీ కనిపించలేదు.

        సెల్ఫ్ ఇమేజి ఎంత పనిచేస్తుందో విజువల్ గా చెప్పడానికి ఆలోచిస్తూంటే, ఎప్పుడో చదివిన స్టాలోన్ అనుభవం మెదిలి, దాన్ని వెతికి తెచ్చి ఇక్కడ పేర్కొన్నాం. ఐతే బిగ్ గోల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే విశ్వం అనంత మైనది, పైగా ఇంకా విస్తరిస్తూ పోతోంది. దానికి ఎంతయినా పంచి పెట్టడానికి కొరతంటూ లేదు. మనుషుల మీద ఆధారపడితేనే గోల్స్ ని కురచ చేసుకుంటాం. మనుషులతో పోటీ పడితేనే అవకాశాల్ని పరిమితం చేసుకుంటాం. మార్కెట్ లో పోటీ ఎక్కువుంది, మన వస్తువు అమ్మకం కష్టమనుకోవడం విశ్వాన్ని అర్ధం జేసుకోక పోవడం వల్లే. పోటీ, పోటీ, అన్ని రంగాల్లోనూ పోటీ అనే మాట పెరిగిపోతోంది. పోటీ పరీక్షలని చెప్పి విద్యార్ధులని కూడా లేనిపోని వొత్తిళ్ళకి లోనుజేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పోటీ అనే పదాన్ని నెగెటివ్ పదంగా ఎంచి నిషేధించాలి.

ఎవ్వరూ ఎవ్వరితోనూ పోటీ పడనవసరం లేదు- ఎంత కోరుకుంటే అంత సమృద్ధిగా అందించే వనరుగా అనంత విశ్వమే వుంటే ఏమిటి పోటీ? సిల్వెస్టర్ స్టాలోన్ స్టార్ గా అవకాశమిస్తేనే స్టోరీ ఇస్తానని రాజీ లేని బిగ్ గోల్ పెట్టుకుంటేనే కదా దాన్ని నిజం చేసి విశ్వం అందించింది? చాలా మంది కొత్త దర్శకులు తీసే చిన్నచిన్న సినిమాలకి కూడా ఎంత బిజినెస్ చేస్తుందో నిర్మాతకి వివరించి అంచనా ఇవ్వడానికి జంకుతారు. అది నిర్మాతకి వివరించడం కాదనీ, విశ్వానికి చెప్తున్నామనీ నమ్మితే, ఆ బిజినెస్ విశ్వమే తెచ్చి చూపిస్తుంది. ఏం కావాలో ఖచ్చితంగా కోరుకోవాలి, ఎంత కావాలో స్పష్టంగా తెలియజేయాలి- లేకపోతే నిజాయితీ  లోపించిందని ఎల్ఓఏ పని చేయదు.

 మానసిక స్ట్రక్చర్ సంగతులు

        గత వ్యాసంలో శారీరక ఎల్ ఓ ఏ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాక, ఇప్పుడు మానసిక  స్ట్రక్చర్ ఎలా వుంటుందో చూద్దాం. ఇందులో భాగంగా 1. సెల్ఫ్ ఇమేజి, 2. అర్హత, 3. గోల్ సెట్టింగ్, 4.విశ్వాసం, 5. అఫర్మేషన్స్, 6. విజువలైజేషన్, 7. యాక్షన్ -ఈ ఏడు అభ్యాసాలూ వుంటాయి.

అయితే వీటన్నిటికంటే ముందుగా మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. మానసికారోగ్యంతో  లేకపోతే ఎల్ ఓ ఏ ప్రయత్నించడం వృధా. అందుకని ముందుగా మనసు గురించి తెలుసుకోవడం ముఖ్యం. దర్శకులు, రచయితలు మనసు గురించి తెలియకుండా పాత్ర చిత్రణలు చెయ్యరు. అయినా మనసు గురించి ఒకసారి తెలుసుకుందాం. మనసు రెండంచెలుగా వుంటుంది. 1. కాన్షస్ మైండ్, 2. సబ్ కాన్షస్ మైండ్. ఇవి కంటికి కనిపించే అవయవాలు కావు. మెదడుని హార్డ్ వేర్ అనుకుంటే అందులో ఇన్ స్టాల్ అయి వుండే సాఫ్ట్ వేర్లు ఈ రెండూ. కాన్షస్ మైండ్ బాహ్య ప్రపంచాన్ని స్కాన్ చేస్తూంటుంది. దాంతో మనం కళ్ళతో దృశ్యాలు చూస్తాం, చెవులతో శబ్దాలు వింటాం, నాలుకతో రుచి తెలుసుకుంటాం, నాసికతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ గ్రహిస్తాం. పంచేంద్రియాలతో ఈ కార్యకలాపాల్ని నిర్వహించే కాన్షస్ మైండ్ ఐదు శాతమే వుంటుంది. సబ్ కాన్షస్ మైండ్ అలా కాదు, ఇది 95 శాతమూ వుంటుంది. 

ఇందులోనే పంచేంద్రియాలతో కాన్షస్ మైండ్ గ్రహించే సమాచారం జ్ఞాపకాలుగా నిల్వ వుంటుంది. ఈ జ్ఞాపకాలు విజువల్స్ గా నిల్వవుంటాయి. ఎప్పుడైనా మనం మన ఫ్లాష్ బ్యాక్స్ చూసుకోవడానికి వీలుగా. దీని నిల్వ సామర్ధ్యం ఎంతటిదంటే, మన జీవితకాలం పూర్తయినా ఇంకా స్పేస్ మిగిలే వుంటుంది. డిజిటల్ గా చెప్పుకుంటే, 2.5 పెటా బైట్లు వుంటుంది. అంటే 2.5 మిలియన్ల గిగా బైట్లు! మన జీవితంలో జరిగే ప్రతీదీ జ్ణాపకాలుగా స్టోర్ చేసుకుంటూ, మన శరీరం లోపల  రక్త ప్రసరణ దగ్గర్నుంచీ హృదయ స్పందనల వరకూ, ఊపిరి తీసుకోవడం దగ్గర్నుంచీ నిద్ర తెప్పించడం వరకూ  సమస్త జీవన క్రియలు అవిశ్రాంతంగా 24x7 నిర్వహిస్తూనే  వుంటుంది సబ్ కాన్షస్ మైండ్.

        ఈ భాండాగారంలో లేనిదంటూ లేదు. దీన్ని అంతరాత్మ అనికూడా అంటారు. ఇందులో శాశ్వత సత్యాలు, నగ్న సత్యాలూ, పుట్టిన దగ్గర్నుంచీ మనం అనుభవిస్తున్న, చేసిన- చేస్తున్న మంచీ చెడులు అన్నీ జ్ఞాపకాల రూపం లో నిల్వ వుండి, దైనందిన జీవితంలో ప్రశ్నిస్తూ వుంటాయి. ఈ ప్రశ్నలు కాన్షస్ మైండ్ లో వుండే మన ఇగోకి నచ్చవు. అందుకని సబ్ కాన్షస్ మైండ్ కి కాన్షస్ మైండ్ ప్రత్యర్ధిలా వుంటుంది. ఇది అంతరాత్మ గొంతు నొక్కి జల్సాగా బ్రతకాలనే చూస్తుంది. అంటే నిత్యం మన లోపల కాన్షస్ కీ, సబ్ కాన్షస్ కీ మధ్య ఘర్షణ జరుగుతూ వుంటుంది. ఈ సైకాలజీయే స్క్రీన్ ప్లేల్లో కాన్షస్ మైండ్ ఫస్ట్ యాక్ట్ గా, సబ్ కాన్షస్ మైండ్ సెకండ్ యాక్ట్ గా, ఇగో హీరోగా దర్శనమిస్తాయన్న విషయం కూడా తెలిసిందే.

స్వామి చిన్మయానంద పుస్తకం ఆధారంగా చెప్పుకుంటే- కురుక్షేత్రం మరెక్కడో జరగలేదు, మన మనస్సులోనే అనుక్షణం జరుగుతూ వుంటుంది. అంటే పంచ పాండవుల్లాంటి ఐదు పాజిటివ్ ఎమోషన్స్ వచ్చేసి, సబ్ కాన్షస్ మైండ్ లోని నూరుమంది కౌరవుల్లాంటి నెగెటివ్ ఎమోషన్ తో పాల్పడే సంఘర్షణ.

సబ్ కాన్షస్ లో పొంచి వుండే నెగెటివ్ ఎమోషన్స్ ఏమిటి? మన భయాలు, సందేహాలు, సంకోచాలు, చెడు అనుభవాలు, అవమానాలు, అణిచివేతలు, ఈర్ష్యాసూయలు, ప్రతీకారాలూ మొదలైన గతం తాలూకు నెగెటివ్ ఎమోషన్లు, భవిష్యత్తు గురించి ఆందోళనా...ఇలా మనల్ని బాధించే ప్రతీదీ నూరుమంది కౌరవుల్లాంటి నెగెటివ్ ఎమోషన్స్, లేదా జ్ఞాపకాలతో సమానం. ఎల్ ఓ ఏ పనిచేయాలంటే ముందు ఈ నెగెటివ్ ఎనర్జీని సంహరించాల్సిందే. సంహరించి పాజిటివ్ ఎనర్జీకి చోటివ్వాలి.అప్పుడే సెల్ఫ్ ఇమేజి సృష్టి సాధ్యమవుతుంది.

        కానీ కాన్షస్ మైండ్ లో ఇగో వీటిని సంహరించడానికి ఓ పట్టాన ఒప్పుకోదు. దానికి పాజిటివ్ శక్తులు వుండి కూడా వాటిని ప్రయోగించక, బాధ్యత నుంచి, క్రమశిక్షణ నుంచి తప్పించుకుంటూ వుంటుంది. కురుక్షేత్రంలో అర్జునుడు ఇలాటి కాన్షస్ ఇగో.ఇందుకే మొదట యుద్ధం (సబ్ కాన్షస్ మైండ్ తో) చేయనన్నాడు. యుద్ధంలో వున్న కౌరవులని చూసి నా బంధువుల్ని నేనెలా చంపుకోనూ అని వాపోయాడు. అంటే నెగెటివ్ ఎమోషన్స్ కి కాన్షస్ ఇగో అంతలా అలవాటు పడిపోతుందన్న మాట. ఇందుకే వాటి సంహారానికి ఓ పట్టాన ఒప్పుకోదు. సర్వాంతర్యామి అయిన సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకైన కృష్ణుడు ఎంతో నచ్చేజెప్పి అర్జునుడ్ని యుద్ధానికి దింపాల్సి వచ్చింది. మన కాన్షస్ ఇగో తో కూడా ఇంతే. ఇలా సబ్ కాన్షస్ లో పేరుకు పోయిన నానా చెత్త- నెగెటివ్ ఎనర్జీని ఖాళీ చేయించేందుకు ఒక టెక్నిక్ వుంది. అదే హో- ఒపోనోపోనో టెక్నిక్. ప్రాచీన కాలపు హవాయీ చికిత్సా విధానం.

దీని కథ ఏమిటి?   

        అమెరికాలో హవాయి ద్వీపకల్పం. అక్కడో పిచ్చాసుపత్రి. అందులో 40 మంది కరుడుగట్టిన పిచ్చోళ్ళు. దగ్గరి కెళ్తే దాడి చేసి కొట్టేస్తారు. దీంతో ఏ డాక్టరూ ఎక్కువ కాలం వుండేవాడు కాదు. అప్పుడొచ్చాడు డాక్టర్ ఇహలేకలా హ్యూ లేన్ అనే అతను. ఇతను రోగుల దగ్గరికెళ్ళకుండా, అస్సలు వాళ్ళని చూడనే చూడకుండా, వాళ్ళ ఫైళ్ళు తెప్పించుకుని చదివాడు. అవి చదవడం వల్ల ఆ రోగుల నెగెటివ్ ఎనర్జీ అంతా తన సబ్ కాన్షస్ లో నిండిపోయింది. అప్పుడా  రోగుల పరిస్థితికి తను బాధ్యత ఫీలవుతూ, తన సబ్  కాన్షస్ మైండ్ ని పరిశుభ్రం చేసుకోవడానికి  హవాయీ ప్రాచీన వైద్య మంత్రం హో- ఒపోనోపోనో ఉచ్ఛరించ సాగాడు- ‘ఐయాం సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్యూ, ఐ లవ్యూ అని ఈ నాలుగు మాటలు. 


        ఇలా కొన్ని వారాల పాటు ప్రార్ధన చేస్తూంటే రోగుల్లో మార్పు కనిపించసాగింది. మరి కొన్ని రోజుల తర్వాత ఆ కరుడు గట్టిన 40 మంది పిచ్చోళ్ళంతా ఆరోగ్యవంతులై ఆస్పత్రి ఖాళీచేసి వెళ్ళిపోయారు. ఇది 1980 లో జరిగిన ఉదంతం. దీని మీద విస్తృతంగా పరిశోధనలు చేసి ఆధునిక కాలానికి అప్డేట్ చేస్తూ డాక్టర్ జో విటాలేతో కలిసి ‘జీరో లిమిట్స్’ అన్న పుస్తకం రాశాడు 2007 లో డాక్టర్ హ్యూ లేన్. ఇలా ఈ టెక్నిక్ క్రమంగా పాపులర్ అవుతూ ఈ మధ్యకాలం లో మనదేశంలో ప్రాకింది. కోకొల్లలుగా యూట్యూబ్ వీడియోలు. అయితే రీకీ హీలర్ డాక్టర్ పూరణ్ శర్మ హో –ఒపోనోపోనో వీడియోలు డెప్త్ తో వుంటాయి.

నెగెటివ్ ఎనర్జీకి చెక్

        ఇది శక్తివంతమైన ప్రార్ధనా విధానం. దీంతో అన్ని నెగెటివ్ ఎమోషన్స్ వైదొలగి మనసు తేటపడుతుంది. గత జ్ఞాపకాలుగా వున్న ఎమోషన్సే మన ప్రస్తుత పరిస్థితుల్లో రియాక్షన్స్ కి / రెస్పాన్స్ కి కారణమవుతాయి. ప్రస్థుత పరిస్థితులకి జ్ఞాపకాల్లోని నెగెటివ్ ఎమోషన్స్ యాక్టివేట్ అయితే ఆవేశంతో రియాక్ట్ అవుతాం. జ్ఞాపకాల్లోని పాజిటివ్ ఎమోషన్స్ యాక్టివేట్ అయితే రియాక్ట్ అవకుండా ప్రశాంతంగా రెస్పాండ్ అవుతాం. ఈ రెండో ఫలితంతో జీవితాన్ని సుఖమయంగా మార్చుకోవడానికి వీలు కల్పించేదే ఈ ప్రార్ధన.    ప్రార్థన చేయాలంటే ముందుగా జీవితంలో జరిగిన ప్రతీ దానికీ బాధ్యత వహించాలి. వేరొకర్ని బ్లేమ్ చేయడం కాదు. అందుకని ‘నా జీవితంలో జరిగిన ప్రతి మంచికీ చెడుకీ అన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను’ అని చెప్పి ప్రార్థన ప్రారంభించాలి.   

        ప్రార్ధనలో మొదటి లైను ‘ఐయాం సారీ’. సారీ ఎవరికి చెప్తున్నట్టు? సబ్ కాన్షస్ మైండ్ కి చెప్తున్నట్టు. ఎందుకంటే మన నానా నెగెటివ్ ఎమోషన్స్ తో దాన్ని నింపేసి బాధపెడుతున్నాం కాబట్టి. దాని దైవత్వాన్ని దెబ్బ తీస్తున్నాం కాబట్టి- ‘ఐయాం సారీ’ అని  చెప్పాలి. రెండవ లైను- ‘ప్లీజ్ ఫర్గివ్ మీ’- ఐయాం సారీ అంటూ విచారం వ్యక్తం చేశాక, క్షమించమని అడగాలి. మూడవ లైను- ‘థాంక్యూ’- క్షమించినందుకు థాంక్స్ చెప్పాలి. అది క్షమించిందని ఏమిటి నమ్మకం? మనమేం చెప్తే దాన్ని ఆజ్ఞగా తీసుకుంటుంది సబ్ కాన్షస్. నాల్గవ లైను- ‘ఐ లవ్యూ’- ఇక నిన్నుబాధించే ప్రసక్తే లేదు, నిన్ను బేషరతుగా ప్రేమిస్తూ వుంటాను -అని కమిటవడం.

ఈ ప్రార్థన- ‘ఐయాం సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్యూ, ఐలవ్యూ’- సూర్యోదయానికి ముందు 108 సార్లు చేయాలి. పైకి ఉచ్చరించలేకపోతే మనసులో స్మరించుకోవచ్చు. 21 రోజుల పాటు వరసగా క్రమం తప్పకుండా చేయాలి. మధ్యలో మిస్ చేస్తే మళ్ళీ మొదట్నుంచీ చేయాలి. రోజుకి 108 సార్లు, 21 రోజులు ఎందుకంటే -ఇన్ని సార్లు ఇన్ని రోజులు చేస్తేనే సబ్ కాన్షస్ లో, ఇంకాతర్వాత శరీరం అణువణువులో ఇంకుతుంది ప్రార్ధన. డ్రైవింగ్ నేర్చుకోవడమంటే సబ్ కాన్షస్ కి అలవాటు చేయడమే. ఆ తర్వాత మనం ఏటో ఆలోచిస్తూ బండి నడుపుతున్నా సబ్ కాన్షస్ మైండ్ దానికదే డ్రైవ్ చేసుకుంటూ పోతుంది. ఈ ప్రార్ధనతో మనసుతో బాటు శరీరంలోంచి కూడా నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి శారీరక మానసికా రోగ్యాలు చక్కబడతాయి.

ఎప్పుడైతే నెగెటివిటీ వెళ్ళిపోతుందో అప్పుడు పాజిటివ్ సంఘటనలు ఎదురవుతూంటాయి, పాజిటివ్ వ్యక్తులు కలుస్తూంటారు, పాజిటివ్ అవకాశాలు వస్తూంటాయి. ఇక నెగెటివ్ ఆలోచన, మాట, చర్య కట్టిపెట్టాలి. ఇది ప్రార్ధన వల్ల ఆటోమేటిగ్గా కట్టడి అయిపోతుంది. అయినా ఎప్పుడైనా దేనికో ఆందోళన కలగ వచ్చు. అప్పుడు దైవనామ స్మరణ చేసుకోవచ్చు. క్రమంగా దేనికీ ఆందోళన చెందని శక్తి వచ్చేస్తుంది. సబ్ కాన్షస్ లో తులసి తోటలు తప్ప గంజాయి కలుపు వుండదు.      

ఈ ప్రార్ధన వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు పొందడానికే కాదు, మానవ సంబంధాల ఆరోగ్యానికి, అర్దికారోగ్యానికీ కూడా పని చేస్తుంది. కాకపోతే డబ్బు కోసమైతే ప్రార్ధనలో మొదట డబ్బు కి ఐయాం సారీ చెప్పాలి.

దర్శకత్వ అవకాశాల కోసం ఇలా మానసిక శారీరక శుద్ధి చేసుకున్నాక,  తర్వాతి ఎల్ ఓ ఏ అభ్యాస  ప్రక్రియ రేపు చూద్దాం.

-సికిందర్