రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, January 13, 2018

585 : స్క్రీన్ ప్లే సంగతులు


  
తమిళనాడు సేలంలోని మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ పేరు  తెలియని వాళ్ళుండరు. దీని అధినేత రామప్ప సుందరం తండ్రి ప్రవేశ పెట్టిన  లో-బడ్జెట్ సినిమాల మేకింగ్ ని తు. చ. తప్పక పాటించిన వాడు.  సీనియర్ సుందరం (1907-63) రచయితల్ని సంస్థకి గొప్ప ఎస్సెట్స్ గా పరిగణించి, ఉద్యోగ ప్రాతిపదికన నియమిం
చుకుని
, రాయించుకునే వాడు. ఆ రచయితల్లో కరుణానిధితో మొదలుకొని భారతీ దాసన్, ఆశై తంబీల వరకూ ఎందరో వున్నారు. అతను తన చిన్న తరహా సినిమాలకంటూ కొన్ని నిర్దిష్ట ప్రమాణాల్ని స్థిరీకరించాడు. సూటిగా స్పష్టంగా ఉండే కథ, పరుగులెత్తే కథనం, షార్ప్ టేకింగ్, సూపర్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్, క్యాచీ సంగీతం, నృత్యాలూ హాస్యం వగైరా. ఇలా తండ్రి సాంప్రదాయాన్నే తుదివరకూ కొనసాగించిన జూనియర్  సుందరం కూడా, తనెలా సక్సెసయ్యాడో చెప్పడానికి ఎస్వీ రంగారావుని రౌడీగా చూపిస్తూ ‘మొనగాళ్ళకి మొనగాడు’, గుమ్మడి ని విలన్ గా  చేసి ‘నేనూ మనిషినే’ …రెండు విజయవంతమైన ప్రయోగాలూ  చాలు!  
           మల్లీశ్వరి చూద్దాం : ‘మల్లీశ్వరి’ చరిత్రకి కల్పనని జోడించిన అపురూప సంగీతభరిత ప్రేమ కథగా పండిత పామరులందర్నీ అలరిస్తోంది నేటికీ. మరో కీర్తి కూడా దీని సొంతమైంది. స్క్రీన్ ప్లే పరంగా  అతికొద్ది పాత క్లాసిక్స్ లాగే ఇది కూడా ఒక పాఠ్యాంశమవుతుందని గుర్తించారు. అయితే ఈ పాఠ్యాంశాన్ని ఎవరెంత తమ తమ సినిమాల్లో వినియోగించుకున్నారో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు పూర్తిగా రూపు రేఖలు మార్చుకుంటున్న ఈ కాలంలో –కనీసం చిన్న సినిమాలకి సంబంధించి – ఒక ప్రత్యామ్నాయ స్క్రీన్ ప్లే నమూనా అవసరం ఎంతైనా వుంది. ఈ అవసరాన్ని ‘మల్లీశ్వరి’ మహాద్భుతంగా తీర్చగలదని బాక్సాఫీసుని గుద్ది మరీ చెప్పొచ్చు.

          ఓంకార, లవ్ ఆజ్ కల్, లండన్ డ్రీమ్స్ లాంటి హిందీ  సినిమాల్ని చూస్తే ఒక మార్పు కన్పిస్తుంది. వీటిలో గజినీ, వాంటెడ్ లలో లాంటి రొటీన్ మసాలా విలన్లు కన్పించరు. హిందీ మల్టీప్లెక్స్, ఓవర్సీస్ ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల్ని కాలక్షేప బఠానీల కన్నా తేలిగ్గా తీసుకోవడంతో, పై మూడు చిత్రాల్లో కేవలం పరిస్థితులు, పాత్రల మనస్తత్వాలు అనే రెండు ఎలిమెంట్స్ మాత్రమే కథలకి విలన్లుగా కన్పిస్తున్నాయి. ఇవే వాటి విజయాలకి సరిపోతున్నాయి.  

         
ఇదే ఇప్పుడు గనుక తెలుగు సినిమాల్లోనూ జరిగితే, ప్రేమ కథల్లో కూడా విలన్ తో పొడిపించు కోవడాలు, రక్తాలు పారించు కోవడాలూ ఇక వుండవు. అసలు విలన్ పాత్రే వుండదు. ‘మల్లీశ్వరి’ కొస్తే, చరిత్ర ప్రకారం రాణివాసంలో పడతులకేసి పరాయి మగాడు కన్నెత్తి చూస్తే శిరఛ్ఛేదం తప్పదు. అంటే అంటే నాగరాజు పాత్ర తల తెగిపడే పరిస్థితి అన్నమాట. ఇక్కడే స్క్రీన్ ప్లే లో విలన్ పాత్ర ఉనికిని శుభ్రంగా చేరిపేస్తోందీ సినిమా. మరి విలన్ పాత్ర లేకపోతే కథెలా నడవాలి? నాగరాజు ఆడిన వేళాకోళమే అతడి పాలిట విలన్ అవుతుంది ఈ కథలో. తెర మీద నడిచే సినిమా అంతా కూడా మన మానసిక ప్రపంచంలోని భావోద్వేగాల సమాహారమే అనుకుంటే – అంటే మన సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ ఆడే ఆట!  కచ్చితమైన స్క్రీన్న్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, సినిమా కథని సినిమాకథ అనరు. స్టోరీ మైండ్ అంటారు. ఈ దృష్టితోనే స్క్రీన్ ప్లే ని నిర్వచిస్తారు.

         
ఈ స్టోరీ మైండ్ లో నాగరాజు కాన్షస్ మైండ్ లాంటి వాడు. అంటే ఇగో అన్నమాట. తన ఈ ఇగో తన సబ్ కాన్షస్ మైండ్ తో,  లేదా అంతరంగంతో చెలగాట మాడుతుంది ఈ కథలో ఒక వేళాకోళం చేసేసి. మరి ఈ అంతరంగానికి తెర మీద కన్పించే భౌతిక రూపం ఎవరు?  దేవరాయాలి పాత్రే. దీంతోనే తలపడాలి తను, ఇక వేరే విలన్ అవసరం లేదు!

***
    సహజత్వానికి దగ్గరగా తీసికెళ్ళిన విషాదభరిత సినిమా ‘మనుషులు మారాలి’.  అయితే మరీ ఆర్ట్ సినిమా లాంటి సహజత్వంతో కాక, కాస్త నాటకీయత, చలం- కెవి చలం- రమాప్రభలతో ఇంకాస్త హాస్యం, మంచి పాటలు, ఇంకా చురకత్తి లాంటి నాగభూషణం చెణుకులతో- ఇంకా ఇతర మసాలా దినుసులూ  దట్టించి, అన్ని వర్గాల ప్రేక్షకులూ బ్రహ్మ రధం పట్టేలా తీశారు. పైగా బ్లాక్ అండ్ వైట్ లో చాలా మంచి షాట్లు తీశారు దర్శకుడు వి. మధుసూదన రావు.  ఇందులో సృజనాత్మకత ఏమిటంటే, ఒక విశిష్ట శిల్పం ఈ స్క్రీన్ ప్లే కి కన్పిస్తుంది. కథ పాత్రల చేతులు మారుతూ పోతూంటుంది. అసలు ట్రాజడీల్లో కథే పాత్రల్ని నడిపిస్తుంది. ట్రాజడీల్లో పాత్రలు గొప్ప కాదు, అవి బలిపశువులు. అప్పుడే ట్రాజడీ. కాబట్టి ట్రాజడీల్ని పాత్రలు నడపవు. కథే  పాసివ్ పాత్రల్ని నడిపిస్తుంది. ‘దేవదాసు’ తీసుకున్నా, ‘శంకరాభరణం’  తీసుకున్నా ఇంతే. అలా ‘మనుషులు మారాలి’  గుమ్మడి ట్రాకుతో ప్రారంభమౌతుంది. తర్వాత శారద, ఆ తర్వాత శోభన్, ఇంకా తర్వాత తిరిగి శారద, ఆఖరికి పిల్లలూ.. ఇలా అధ్యాయాల వారీగా, ఏ అధ్యాయానికా అధ్యాయం విస్పష్ట  విభజన జరిగిన ట్రాకులతో నడుస్తుంది. ఇబ్బందిపడకుండా కథని ఫాలో అవడాన్ని సులభతరం చేసింది ఈ విధానం. కథలు చెప్పడం లో గ్రేట్ మాస్టర్లు ఆ కాలంలోనే వున్నారు.

          సెకండాఫ్ లో, చనిపోయే శోభన్ పాత్ర హేండాఫ్ పాత్రలా వుంటుంది. అంటే, కథలో తను చేయాల్సిన కార్యం ముగించుకుని, ఆ రెపరెపలాడే కథ అనే పతాకాన్ని, రెండో ముఖ్య పాత్రకి అప్పగించి  తను నిష్క్రమించడ మన్నమాట. ఇలా శోభన్ నుంచి  ఆ పతాకాన్ని అందుకున్న శారద,  దాంతో ముగింపు దిశగా సాగిపోతారు. ‘రాబోయే కష్టాలకి భయపడి రావాల్సిన హక్కుల్ని వదులుకోవడం పిరికితనం’ అని శోభన్ సిద్ధాంతం. సమ్మె చేస్తాడు, వాళ్ళు లాకౌట్ ప్రకటిస్తే నిరాహార దీక్ష చేస్తాడు, ప్రభుత్వమే పూనుకుని  ఫ్యాక్టరీ తెరిపిస్తూంటే నిస్సహాయుడై పోతాడు, లంచం ఎరజూపితే తిప్పికొడతాడు, ఓ రాత్రి యాజమాన్యం పంపిన గూండాల చేతిలో హతమైపోతాడు.

         
ఒక్క యంత్రాలు తెచ్చి పెట్టుకుని నాగభూషణం సృష్టించిన పరిస్థితి ఇది. యంత్రాలు మంచివే, వాటితో యాజమాన్యాల వైఖరే ప్రశ్నార్ధకమవుతోంది. మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు, యుధిష్టరుడు, ధృతరాష్ట్రుడు, అశ్వత్థామ లాంటి వాళ్ళందరూ కలిసే, వాల్ స్ట్రీట్ ని కుప్ప కూల్చి, పెట్టుబడిదారీ వ్యవస్థని నేలకు దించారని – ఆర్ధిక నిపుణుడు, కాలమిస్టు గురుచరణ్ దాస్ ఒక  ఆర్టికల్ రాశారు. ఈ సినిమాలో కూడా నాగభూషణం దుర్యోధనుడైతే, రావికొండలరావు యుధిష్టరుడు, హరనాథ్ కర్ణుడు లాంటి వాళ్ళే. ఈ ముగ్గురి నిర్వాకమే కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది- ఏ నాటికైనా ఈ సినిమా ఓ హెచ్చరిక, కనువిప్పు.


***
      ‘నాటకాల రాయుడు’లో 
ఆద్యంతం నాగభూషణం చాలా యాక్టివ్ గా, చలాకీగా రక్తి కట్టించే ఈ నవ్వుల ప్రపంచంలో తీరని విషాదం కూడా వుంది. నాగభూషణం అతడి కుటుంబపు పరిస్థితుల అనులోమ- విలోమ సంబంధం, రేఖా గణితం ఈ సినిమా కథా కథనాలకి బలమైన వెన్నెముక గా నిలుస్తాయి. ఎలాగంటే అతనెక్కడో మహా నగరంలో పైపైకి ఎదుగుతూ వుంటే, అటు వూళ్ళో కుటుంబం నానాటికీ దిగజారి పోతూ వుంటుంది. తను చాలా చాలా గొప్ప వాడైపోయేసరికి, ఆ కుటుంబంలో ఓ మరణం సంభవించి, ఇంకో జననం తో ముక్కలై, భిక్షాటన చేసే దౌర్భాగ్యం. ఇప్పటి సినిమాల్లో కొరవడిన కరకు వాస్తవ జీవిత మంతా ఇందులో జడలు విప్పుకుంటుంది.   తల్లి ఆశీర్వాద బలంతోనే  తానిలా గొప్ప వాణ్ణయి పోయాననుకుని మురిసిపోతాడు. ఆ తల్లి ఎప్పుడో గతించిన విషయం కూడా తెలీదు! ఆ కుటుంబంలో పెళ్ళి శుభకార్యానికి  డబ్బెప్పుడూ నిలవదు. మొదటిసారి డబ్బు దొంగల పాలవగానే, అంతవరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఆ కుటుంబం ఒక్కసారి భగ్గుమనేస్తుంది. కలలో కూడా ఊహించని కటువైన మాటలు పేలతాయి వాళ్ళ మధ్య. ఆ పరస్పర దూషణలు, దెప్పి పొడుపులు తనకి కూడా తగిలి కుమిలికుమిలి పోతుందా పెళ్లి కున్నఅమ్మాయి. దర్శకుడు సంజీవి ఈ దృశ్యాన్ని నాగయ్య, హేమలత, సత్యనారాయణ, అనిత లతో అత్యంత బలంగా సృష్టించాడు. సినిమాకి ఇదే హైలైట్.

***
         ‘బందిపోటు’ కొస్తే, అనగనగా గాంధార రాజ్యంలో సత్యసేన భూపతి అనే అశక్తుడైన మహారాజు. మందారమాల అనే మహా అహంకారియైన కూతురు. శూరసింహుడనే దుష్ట సేనాపతి. ఇతను రాజుగారి బావమరిది కూడా. రాజ్యం మీదా రాజకన్య మీదా కన్నేసి రాజు గార్ని బద్నాం చేస్తూంటాడు. పంట లెత్తుకుపోవడం,  బల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు.అసహాయ శూరుడనే వాడు ఇతడి లేటెస్ట్ బాధితుడు. ఇతను ముసుగు దొంగలా ఖజానాని దోచి పేదలకి పంచి పెడుతూంటాడు. కీచక రాజభటుల్ని వధిస్తూంటాడు. ఈ అవకాశంతో  శూర సింహుడు  తన దురాగతాల్ని ఇతడికే అంటగట్టి, రాజుకి ఫిర్యాదు చేస్తూంటాడు. ఒకసారి నరసింహ అనే యువ రైతు అసహాయ శూరుడ్ని అటకాయిస్తే, ఇతను తన చిన్నాన్నే అని తెలిసిపోతుంది. అటు రాజుకి కూడా ఈ రహస్యం తెలిసిపోయి, ఆ అసహాయ శూరుడ్ని విచారణకి తన ఎదుట ప్రవేశ పెట్టాల్సిందిగా అతడి అన్న ధర్మ నాయకుణ్ణి ఆదేశిస్తాడు. 

         ఈలోపు నిజాలు బయట పడకూడదని శూర సింహుడు అసహాయ శూరుడ్ని చంపించేస్తాడు. ఈ అఘాయిత్యానికి గుండె పగిలి చస్తాడు ధర్మనాయకుడు. కుటుంబంలో ఒకేసారి ఇలా ఈ ఉత్పాతాలకి నరసింహ ఖిన్నుడై, తేరుకుని శూర సింహుడి మీద పగబడ్తాడు.

          ఓ అరగంట లోపే సెటప్ చేసిన ఈ కథా ప్రారంభం (స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం) చాలా పకడ్బందీ స్క్రిప్టింగ్ ప్రణాళిక అనొచ్చు. సెటప్ డైనమిక్స్ కి ఈ భాగం వరకూ కత్తిరించి రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు ఆసక్తి వున్న సినిమా రచయితలెవరైనా. చాలా అందమైన దృశ్య మాలిక ఇది. జానపద సినిమాలు ఉత్త నేలబారువి అనేవాళ్ళకి చెంప పెట్టు సృజనాత్మకత ఇది. ఇక్కడి దాకా కథని, పాత్రల్ని పరిచయం చేసిన తీరూ, మల్చిన తీరూ, సమస్యని స్థాపించి (ప్లాట్ పాయింట్ వన్) కథానాయకుడ్ని కార్యోన్ముఖుడ్ని చేసిన పద్ధతీ…అదీ కేవలం ఓ అరగంట సమయంలో …ఓ క్రియేటివ్ ఛాలెంజియే అనాలి మూడో తరగతి వరకే చదివిన విఠలాచార్య నుంచి!!

―సికిందర్