రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 23, 2014



సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
5 డీ ని పర్సనలైజ్ చేసుకోవాలి !
 దర్శకుడు మారుతి 


 రానున్న అయిదేళ్ళలో తెలుగులో డిజిటల్ సినిమాలే ఉంటాయనీ, ముడి ఫిలిం పూర్తిగా అదృశ్యం అయిపోతుందనీ గత సంవత్సరం వ్యాఖ్యానించారు సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి. అప్పుడాయన మంచు విష్ణుతో తెలుగులో తొలి బిగ్ బడ్జెట్ డిజిటల్ సినిమా చిత్రీకరిస్తున్నారు. రెడ్ కెమెరాతో ఆయన చిత్రీకరిస్తోంటే ప్రతి నిత్యం ఆయన్ని సంప్రదించి సందేహాలు తీర్చుకునేవారు ఇతర సినిమాటోగ్రాఫర్లు. ఫలితాల్ని వెండి తెర మీద చూస్తే మీకే అర్ధమవుతుందని ఆయన ధైర్య వచనాలు పలికేవారు. సినిమా విడుదలైంది. చూసి ధైర్యం తెచ్చుకున్నారు సదరు సినిమాటోగ్రాఫర్లు.

డిజిటల్ మూవీ మేకింగ్‌ని ఒక ఉద్యమంగా దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్న డిజి క్వెస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు బసిరెడ్డి కూడా తెలుగులో వేళ్ళమీద లెక్కించదగ్గ సినిమాలవరకే డిజిటలీకరణని తీసుకు వెళ్ళగలిగారు. నిర్మాణ వ్యయం తగ్గిపోయే డిజిటల్ సినిమాలంటే చిన్న నిర్మాతలకెందుకో అంత భయం.

అప్పుడు రాంగోపాల్‌వర్మ దొంగల ముఠాఅనే సినిమాని 5డీ కానన్ కెమెరాతో అయిదు రోజుల్లో ప్రయోగాత్మకంగా తీసి సంచలనం సృష్టించారు. డిజిటల్ అంటే ఖరీదైన రెడ్ కెమెరా అనుకుంటున్న వర్గాలకి ఈ కానన్ 5డి సాధారణ కెమెరాతో వర్మ సినిమా తీసి చూపించడం కూడా ధైర్యాన్నివ్వలేదు. ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి ఒక్కరికే కలిగింది.. ఇవి కలిగేందుకు ఇంకెటువంటి అనుమానాలూ అడ్డుపడలేదు. అయితే ఈ ధైర్యం, ఈ స్ఫూర్తి కలిగిన వెంటనే వర్మ పరిచయంచేసిన కేవలం మూడు లక్షల రూపాయల కెమెరా చేత బట్టుకుని పొలోమని పరుగులు తీసి ఓ సినిమాని అడ్డంగా చుట్టి పారేయ్యలేదు. ఆ కెమెరామీద కూడా తనదైన పరిశోధన చేసి పరిచయంచేసిన వర్మకే కళ్ళు తిరిగే ఫలితాలతో సినిమాని హిట్‌చేసి కూర్చున్నారు... దటీజ్ మారుతి ఆఫ్ ఈ రోజుల్లోఫేమ్ దర్శకుడు!


వర్మ కేవలం నాలుగైదు రోజుల్లో సినిమా తీయవచ్చని నిరూపించేందుకే దొంగల ముఠా తీశారు. దాన్ని అంతవరకే చూడాలి, టెక్నికల్ ఫలితాలతో కలిపి చూడకూడదనిపించింది.. అందుకే ఆ కెమెరాని మా సబ్జెక్ట్ కి అనుగుణంగా మార్చుకునేదాని మీదే దృష్టిపెట్టి విజయం సాధించాం. ఈ విజయానికి స్ఫూర్తినిచ్చిన రాంగోపాల్‌వర్మకి ఎంతైనా రుణపడి వుంటాంఅన్నారు ‘వెన్నెల’ కిచ్చిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మారుతి.

5డీ కెమెరా మీద దృష్టిపెట్టడం గురించి ఫీల్డులో రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. ప్రయోగాలుచేసి రెండు కెమెరాలు పాడుచేసుకున్నారనీ, సాఫ్ట్ వేర్ మార్చారనీ...అయితే సాఫ్ట్ వేర్ మార్చలేదంటారు మారుతి. కేవలం తీయాలనుకుంటున్న సబ్జెక్ట్ కి అనుగుణంగా లెన్సులు మార్చామన్నారు. అదెలా? ఎలాగంటే, కానన్ కెమెరాతో వచ్చిన లెన్స్ తో తీస్తే పిక్చర్ బ్యాక్‌గ్రౌండ్ బర్న్ అవుతోంది. అంతేకాదు, మార్నింగ్ షూట్ చేస్తే ఒక రకంగా, ఈవెనింగ్ ఇంకో  రకంగా వస్తోంది.. ఈ సమస్యని అధిగమించేందుకు కెమెరామాన్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి లెన్సుల మీద పరిశోధనలు చేశామన్నారు మారుతి. చివరికి అమెరికానుంచి తప్పించిన వేరే లెన్సులు అనుకున్న రిజల్ట్స్ నిచ్చాయన్నారు.


‘‘
ఏ కెమెరాకైనా లెన్సులే ప్రధానం. ఉన్నదున్నట్టు కానన్ కెమెరాతో తీస్తే సినిమాలో మీరు చూస్తున్న క్వాలిటీ వచ్చేది కాదు. కథ ఎంత బావున్నా చిత్రీకరణ సినిమా చూస్తున్న ఫీలింగ్‌నివ్వకపోతే అది హిట్‌కాదు. మా విషయంలో హిట్ అయ్యిందంటే అది పర్సనల్‌గా మేం రూపొందించుకున్న కెమెరావల్లే సాధ్యమయింది.’’ అని ఆనందం వ్యక్తంచేశారు.

‘‘
ఈ రోజుల్లో’’ సినిమాలో చూస్తే రిచ్ లొకేషన్స్ కనిపిస్తాయి. అభివృద్ధి చెందుతున్న శివారు హైదరాబాద్ (సైబరాబాద్) కట్టడాల మధ్య, అవుటర్ రింగ్ రోడ్ మీదా, అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ, విలాసవంతమైన అపార్ట్‌మెంట్లలోనూ ఒక పెద్ద బడ్జెట్ సినిమా చూస్తున్నట్టు దృశ్య వైభవం కనిపిస్తుంది. ఇదంతా యాభయి లక్షల వ్యవహారమే అంటే నమ్మబుద్ధికాదు. అమర్చుకున్న లెన్సులు ఇచ్చిన ఎఫెక్ట్. థియేటర్‌లో హైక్వాలిటీ వచ్చింది. కలర్ కరెక్షన్ అవసరం కూడా అంతగా రాలేదు. గ్రేడింగ్ పేరుతోనో, డిఐ పేరుతోనో వేరే కలర్స్ ని కృత్రిమంగా అద్దలేదు. ఇదంతా ఒకెత్తుఐతే లైటింగ్, ఆర్ట్ డైరెక్షన్ ఒకెత్తూ. గదుల్ని ముస్తాబు చేసేందుకు వాడిన సెట్ ప్రాపర్టీస్ లైటింగ్ స్కీంతో మ్యాచ్ అయి మనోహరమైన భావాల్ని రేకెత్తిస్తాయి. స్వాభావికంగా మారుతి యానిమేటర్ అవడంవల్లే ఇది సాధ్యమైంది. సైన్సుని, సృజనాత్మకతనీ కలగలిపి అడుగడుగునా మనోనేత్రంతో చూస్తే గానీ ఓ మామూలు కానన్ కెమెరాతో ఈ తరహా మెయిన్‌స్ట్రీమ్ అవుట్‌పుట్ సాధ్యంకాదు.
మరైతే రేపు ఇదే స్ఫూర్తిఅయి మరిన్ని ఇలాంటి క్వాలిటీ సినిమాలు కానన్ కెమెరాతో తీస్తే రెండు కోట్ల ఖరీదైన రెడ్ డిజిటల్ కెమెరా పరిస్థితి ఏమవుతుంది?


దీనికి సూటిగా సమాధానం చెప్పకుండా ‘‘సినిమాని ఏ కెమెరాతో తీశారని ప్రేక్షకులు చూడరు. బాగా వచ్చిందా లేదా అనే చూస్తారు. ఎంత ఖరీదయిన కెమెరా అన్న ప్రశ్నే రాదు.’’ అనేశారు.

 ఈరోజుల్లోఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు 5డి కెమెరా - ఫఫ్టీలాక్స్ బడ్జెట్ స్కీము తో అనేకమంది అరంగేట్రం చేస్తున్నారు. వాళ్ళందరికీ మారుతి ఇటీవల డైరక్టర్స్ అసోసియేషన్ ఇంటరాక్షన్ క్లాసులో చేసిన హెచ్చరికే మరోసారి చేశారు. తీస్తున్న సబ్జెక్ట్ ఎలాంటి చిత్రీకరణని డిమాండ్ చేస్తోందో 5డి కెమెరాని అలా మార్చుకోవాలి. ముఖ్యంగా సినిమా బ్లాకులు పెట్టడం నేర్చుకోవాలి. సినిమాకి, టీవీకి, షార్ట్ ఫిలిమ్స్ కీ వేర్వేరు షాట్ కంపోజిషన్‌లుంటాయి. ఈ కెమెరాని సినిమాకి వాడుతున్నందువల్ల ఈ తేడా గమనించి బ్లాకులు పెట్టుకోవాలి. ఇండోర్లో ఎలా వస్తోంది, అవుట్‌డోర్లో ఎలా వస్తోందీ ఒకటికి రెండుసార్లు టెస్ట్ షూట్‌లు చేసుకుని చూసుకోవాలి. ఏదీ లేకుండా బ్లయిండ్‌గా వెళ్తే దెబ్బతినిపోతారు. ఎవరికి  వారు దీన్ని ప్రత్యేక కేసుగా తీసుకుని ఆ ప్రకారం తగిన మార్పుచేర్పులు చేసుకోకపోతే, ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, డిజిటల్ సినిమాలంటేనే ప్రేక్షకులకి అసహ్యమేసి దీని కథ అంతటితో ముగిసిపోతుంది.

మరిప్పుడు మారుతి కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నారు? హిట్ చేసిన ప్రతీ  కొత్త దర్శకుడికి లాగే తనూ పై మెట్టు ఎక్కేశారు. టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ నుంచి ఆఫర్ వచ్చింది... కానీ అది డిజిటల్ సినిమా కాదు, సాంప్రదాయ ముడి ఫిల్మే. ఇక తను ఇన్నోవేట్ చేసిన డిజిటల్‌ని వదిలేస్తారా? –అంటే, అలాంటిదేం లేదనీ .. శిష్యుడికి బస్టాప్అనే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు ఇచ్చి ఇదే ఈరోజుల్లోస్కీముతో డిజిటల్‌లో తీయించబోతున్నాననీ చెప్పుకొచ్చారు.  కాకపోతే ఈసారి ఇంకాస్త ప్రయోజనకరంగా వుండే  టీనేజర్స్ - వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ప్రస్తుత కాలంలో నలుగుతున్న సమస్యల గురించీ!

-సికిందర్
(అక్టోబర్ 2013 ‘ఆంధ్రభూమి వెన్నెల’ కోసం)



Thursday, August 21, 2014


సాంకేతికం :
ఆనాటి ఇంటర్వ్యూ 

స్టార్స్ ని సెట్స్ డామినేట్ చేయకూడదు!
కళాదర్శకుడు ఆనంద్ సాయి 

Friday, August 15, 2014

రివ్యూ..

డైనమిక్స్ మిస్సైన డ్రామా !


రచన- దర్శకత్వం : లింగుస్వామి
తారాగణం : సూర్య, సమంతా, విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్ పాయి, బ్రహ్మానందం తదితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, పాటలు :  వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, భువన చంద్ర
సంగీతం : యువన్ శంకర్ రాజా,  ఛాయాగ్రహణం :  సంతోష్ శివన్, కూర్పు : ఆంథోనీ,  ఆర్ట్ : రాజీవన్,
ఫైట్స్ :  సిల్వా, డాన్స్ : బృందా, రాజు సుందరం,
బ్యానర్ : తిరుపతి బ్రదర్స్ ,   నిర్మాతలు : లగడపాటి శిరీష - శ్రీధర్, సుభాష్ చంద్రబోస్
విడుదల :  ఆగస్టు 15,2014,  సెన్సార్ : ‘U’
***
ఇప్పుడు ముంబాయి మాఫియాల్ని ఫీలవుతోందా అంటే లేదనే సమాధానం వస్తుంది.  మారుతున్న ముంబాయి నగర వాతావరణాన్ని బాలీవుడ్ కూడా ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో అంతర్భాగంగా చేసుకుని అందిస్తూ వుంటుంది. 1970-80లలో స్మగ్లర్లు ఏలిన ముంబాయి శాంతిభద్రతల పరిస్థితుల్ని,  ఆ తర్వాత 1990-2000లలో మాఫియాలతో ఏర్పడిన హింసాత్మక స్థితినీ బాలీవుడ్ సినిమాలు దర్పణం పడుతూ వచ్చాయి. దీని తర్వాత టెర్రరిజం ముంబాయిని వణికించినప్పుడూ బాలీవుడ్ సినిమాలు దాన్నీ రికార్డు చేశాయి. ఇలా ఒక్కో దశ దాటుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి లేని దశ వైపు చూసి ఆ సినిమాల్ని ఉత్పత్తి చేయలేదు. వెనక్కి చూడాల్సి వస్తే ఆ దశని పీరియడ్ ఫిలిమ్స్ గా అదే కాలంలో స్థాపించిన కథలతో ఈమధ్య సినిమాలొచ్చాయి.  పై మూడు దశలూ గడిచి పోయాక ఇప్పుడు ముంబాయిలో మరో శాంతి భద్రతల సిట్యుయేషన్ లేదు.  దీంతో బిగ్ స్టార్స్ సినిమాలూ కాలక్షేప యాక్షన్ కామెడీలుగా రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే.

ఈ నేపధ్యంలో తమిళ టాప్ దర్శకుడు లింగు స్వామి ముంబాయిలో ఇంకా మాఫియాల్ని ఫీల్ కమ్మంటూ భారీ యాక్షన్ సినిమా ప్రేక్షకుల కందించాడు. ఏమంటే, ఇందులోమాఫియా నేపధ్యం మాటవరసకేననీ, అక్కడ ప్రధానంగా చెప్పింది ఓ స్నేహం గురించీ, ఇంకో ప్రేమ గురించీ మాత్రమేననీ సెలవిచ్చాడు. కానీ ఇలా కూడా లేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే, భారీ బడ్జెట్లతో బిగ్ స్టార్ సినిమా అనగానే తమిళ-తెలుగు భాషల్లో మాఫియా కథలు తప్పించి మరొకటి ఆలోచించలేని తనం దగ్గర! తత్ఫలితంగా ఇలాటి కృత్రిమ సినిమాలతో  కుత్తుకల మీద కత్తి పెట్టి చూసి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ సూర్య నేటివిటీ వున్న ‘సింగం’ సినిమాలు చేస్తున్న వాడల్లా ముంబాయి వెళ్లి ముంబాయిలోనే నేటివిటీ లేని సినిమా నటించి ఔరా అన్పించాడు. వెంట వెళ్ళిన సమంతా మాత్రం ముంబాయి నేటివిటీకి మారిపోయి బికినీకి సాహసించి జీవించింది. విలన్ గా ముంబాయి మనోజ్ బాజ్ పాయి కళ తప్పిన మొహంతో దక్షిణ ప్రేక్షకులకి షాకిచ్చే స్థితికొచ్చాడు.

ఇంతకీ ఈ ప్రేమా స్నేహాల, మాఫియా పోరాటాల సినిమాలో ఏముంది?
అన్వేషించు-వధించు!

అతను కృష్ణ(సూర్య). అతను కర్ర సహాయంతో నడిచే వికలాంగుడు. వైజాగ్ నుంచి ముంబాయి చేరుకొని అన్న రాజు (సూర్య) కోసం వెతుకుతూంటాడు. అన్న గురించి నమ్మలేని నిజాలు తెలుస్తూంటాయి. రాజూ రాజు కాదు, రాజూ భయ్యా. ఇంకో చంద్రూ (విద్యుత్ జమ్వాల్)తో కలిసి మాఫియాగా ఎదగాలని ప్రయతిస్తున్నాడు. అతనంటే ముంబాయి ప్రజల్లో ఎంత భయమో అంత భక్తి. కృష్ణకి ఒకొక్కరే రాజు అనుచరులు తారసపడుతూ సమాచారమందిస్తూ వుంటారు. ఆ సమాచారమంతా గతందే. దాని ప్రకారం రాజూ చంద్రూల మధ్య ‘బిజినెస్’ కంటే ఎక్కువ స్నేహబంధం వుంది. ఇద్దరూ ఎదురొచ్చిన ప్రత్యర్ధుల్ని చంపుతూ వాళ్ళ సొత్తు లూటీ చేస్తూంటారు. ఈ మాఫియాల్ని అంతమొందించాలని పోలీస్ కమిషనర్ చంపి పారేస్తూంటాడు. దీన్ని అడ్డుకునేందుకు కమిషనర్ కూతురు జీవా ( సమంతా) ని కిడ్నాప్ చేస్తాడు రాజు.  ఆమె అతడితో  ప్రేమలో పడుతుంది.



ఇలా వుండగా ముంబాయిని పాలిస్తున్న పెద్ద మాఫియా ఇమ్రాన్ ( మనోజ్ బాజ్ పాయి ) ఉంటాడు. ఇతను ఒక పార్టీలో రాజూ చంద్రూ లని చూసి, ఎక్కడున్నా వాళ్ళు అక్కడే వుండండి-  ఒక్క అడుగు ఎదగాలని ప్రయత్నించినా పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తా- అని హెచ్చరిస్తాడు. అతనలా అన్నాడని పగతో రగిలిపోతాడు చంద్రూ. చంద్రూ ఇలా రగిలిపోతాడని ముందే తెలిసిన రాజు – ఇమ్రాన్ ని ముందే ఎత్తుకొచ్చి ఒక సెల్లార్ లో బంధించి చంద్రూకి చూపిస్తాడు. ఇమ్రాన్ అన్న మాటలకి పది  మాటలతో అతణ్ణి అవమానపర్చి కసి 
తీర్చుకుంటాడు చంద్రూ. రాజూ ఇమ్రాన్ ని వదిలేస్తాడు.

ఇక కొన్నాళ్ళు జీవాతో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయమని రాజు ని పంపించేస్తాడు చంద్రూ. జీవాతో ఆటా పాటలతో ఎంజాయ్ చేసి వచ్చిన రాజూకి చంద్రూ శవం స్వాగతం పలుకుతుంది. ఎవరీ పని చేశారని అనుచరుల మీద ఎగురుతాడు. ఒక అనుచరుడు చెప్తానని తీసికెళ్ళి  రాజు ని కాల్చిచంపేస్తాడు.

ఇదంతా తెలుసుకున్న కృష్ణ ఏం చేశాడు? అన్న చావుకి పగ తీర్చుకున్నాడా? అన్న నిజంగానే చనిపోయాడా, ప్రాణాలతో ఎక్కడైనా వున్నాడా? జీవా ఏమైంది? ఇవన్నీ సెకండాఫ్ లో తేలే అంశాలు.

ఇది పూర్తిగా సూర్య భుజస్కంధాల మీద ఆధారపడ్డ సినిమా. రెండు భిన్నపాత్రల్లో- ఒకదాంట్లో స్టార్ సూర్య కన్పిస్తే, మరోదాంట్లో నటుడు సూర్య కన్పిస్తాడు. స్టార్ సూర్యగా మాస్ ని ఊపెయ్యాలని ప్రయత్నిస్తాడు, నటుడు సూర్యగా గుండెల్ని తడమాలని చూస్తాడు. రెండిట్లోనూ సఫలమయ్యాడు. ఐతే ఇంత విభిన్నమైన ఈ ద్విపాత్రాభినయానికి తగిన కథ జత పడకపోవడం విచారించాల్సిన విషయం. దర్శకుడు చేసిన పెద్ద పొరపాటు- కథలోంచి పాత్ర పుడుతుందనుకోవడం. కానీ అలా జరగదు- సినిమాకి, అందునా బిగ్ కమర్షియల్ సినిమాకి – పాత్రలోంచే కథ పుడుతుంది! ఇలా ఆలోచించి వుంటే, సాత్విక కృష్ణ పాత్రతో అద్భుతం చేసి ఈ సినిమాని తిరుగులేకుండా నిలబెట్టేవాడు దర్శకుడు. ఇదెలాగో తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం...


సమంతా కిందులో ఆడేపాడే, హీరో వెంటపడి తిరిగే, పాత ఫార్ములా కొలమానాల కమిషనర్ కూతురి పాత్రే లభించింది. దీంతో బికినీల్లో అందాల ప్రదర్శనకీ పాల్పడాల్సి వచ్చింది.ఇంతకంటే చెప్పుకోవదానికేం లేదు. చంద్రూ పాత్ర నటించిన- నటుడూ, మోడల్, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్, పూర్తి శాఖాహారీ అయిన విద్యుత్ జమ్వాల్ తెలుగులో రెండు ఎన్టీఆర్ సినిమాలతో పరిచితుడే. తమిళంలో ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ వున్న బాలీవుడ్ నటుడు. ఈ సినిమాలో అతనున్న ప్రతి సీనూ పేరుకు తగ్గట్టే ఎలెక్ట్రిఫయింగ్ గా వుంది. ఇక మనోజ్ బాజ్ పాయ్ వన్నె తగ్గిన మొహంతో ప్రధాన విలన్ గా విఫలమయ్యాడు. సంగీత విద్వాంసుడిగా ఒక సీను లోకన్పించే బ్రహ్మానందం,  సెకండాఫ్ లో మరీ బలహీనపడ్డ కథలో హుషారు పుట్టించడానికి విఫలయత్నం చేశాడు.

చీమల్లా పుట్టుకొచ్చే మాఫియాల అనుచరుల పాత్రల్లో బాలీవుడ్ ఫైటర్స్ రఫ్ గా కొందరు, స్టయిలిష్ కొందరూ కన్పిస్తారు. కానీ వర్మ పాపులర్ చేసిన బ్రాండ్ సహజత్వాన్ని ప్రదర్శించలేకపోతారు.

ఈ సినిమాకి మరో స్టార్ వున్నాడు. అతను సంతోష్ శివన్. కెమెరాతో మాఫియా లోకాన్ని మర్చిపోలేనంత గ్లోరిఫై చేశాడు. ఇందుకు కళాదర్శకుడు రాజీవన్ సమకాలీనతని దృష్టిలో ఉంచుకుని చాలా తోడ్పాటు నందించాడు. సిల్వా సమకూర్చిన విశృంఖల యాక్షన్ దృశ్యాలూ, బృందా- రాజు సుందరంల నృత్య విన్యాసాలూ, ఆఖరికి యువన్ శంకర్ రాజా ఫాస్ట్ బీట్ సంగీతమూ అన్నీ- వేలెత్తి చూపలేని విధంగా వున్నాయి-ఒక్క ఎడిటింగ్, డైరెక్షన్ తప్పిస్తే. సుమారు మూడు గంటల నిడివికి సాగలాగిన బలహీన కథకి  ఇతర టెక్నీషియన్లు ఎంత టాప్ క్లాస్ సేవలందిస్తే మాత్రం ఏం లాభం- బూడిదలో పోసిన పన్నీరే!

దర్శకుడు లింగు స్వామి తను దర్శకుడుగా ఎనిమిది సినిమాలు తీస్తే, ఇతర దర్శకులతో నిర్మాతగా ఆరు చిన్న సినిమాలు తీశాడు. ఇవే బావున్నాయి. దర్శకుడుగా బాగా మాస్ కమర్షియల్స్ కి అలవాటు పడ్డ తను ఇప్పుడు తీసిన సినిమాతో సక్సెస్ కోసం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయొచ్చని కూడా తెలుసుకున్నట్టుంది - లేదా తనేం చేస్తున్నాడో తెలుసుకోలేదేమో- ఏమైనా జరిగిందొక్కటే- ప్రేక్షకులు ఫూల్స్ అవడం!

స్క్రీన్ ప్లే సంగతులు..
మాస్ సినిమాలతో ఉన్న సులువేమిటంటే వాటికి  అంతగా లాజిక్ తో పనుండదు. ఎంత ఎక్కువ చేసి చూపిస్తే అంత పంచ్ వుంటుంది. దృశ్యాల్లో పంచ్ లేని మాస్ సినిమా చప్పగా వుంటుంది. దీన్నే suspension of disbelief (మన నమ్మకాల్నీ అపనమ్మకాల్నీ కాసేపు పక్కన బెట్టి సినిమాని ఎంజాయ్ చేయడం)  లేదా  cinematic liberty ( సృజనాత్మక స్వేచ్ఛ) అంటారు. అయితే ఈ ఎక్కువ,  లేదా ‘అతి’ అన్నది ఎంత ఎక్కువ వుండాలన్నది కూడా మన కామన్ సెన్సే చెప్తుంది. ఉదాహరణకి ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ లో బాలకృష్ణ  సైగ చేస్తే రైలాగి పోవడం, కుర్చీ ముందుకు కదిలి రావడం లాంటివి శృతి మించిన ‘అతి’ అయ్యాయి. అలాగే  బ్రహ్మానందం కూడా ఓ పందెం కోడితో శత్రు సంహారం చేయడం శృతి మించిన లాజిక్కయ్యింది. ఇవేవీ  మింగుడుపడక తిప్పి కొట్టి ఫ్లాప్ చేశారు ప్రేక్షకులు. ఇవి దృశ్యాల్లో కంటికి కన్పించిపోయే నాన్సెన్స్. ఇలాటివి పసిగట్టినంత తేలిగ్గా కథా కథనాల్లో అనౌచిత్యాల్ని గ్రహించలేరు అందరు ప్రేక్షకులూ.

ఎలాగంటే, ఉదాహరణకి- ‘దృశ్యం’లో హత్య జరిగిన మర్నాడే శవాన్ని తీసికెళ్ళి పోలీస్ స్టేషన్ ‘కింద’ పాతిపెట్టేశాక- ఇక మిగతా కథంతా నడపడంలో ఎలా అర్ధం లేదో, అలా ప్రస్తుత సినిమాలోనూ జరిగింది. అదేమిటంటే- తన స్నేహితుణ్ణి చంపి, తన మీద హత్యా ప్రయత్నం చేసిందెవరో హీరో (రాజు భయ్యా )కి ప్రత్యక్షంగా తెలిసిపోతున్నాక కూడా, ఇంకా తమ్ముడు కృష్ణంటూ వేషం కట్టి ఆరాతీయడం అంతా నాన్సెన్స్!

ఇది కనీస లాజిక్ కి కూడా ఎలా అందదో చూడ్డానికి పెద్ద మేధస్సేం అక్కర్లేదు. రాజూ భయ్యా తమ్ముణ్ణంటూ కృష్ణ ముంబాయి వచ్చాడు. అన్న ఆచూకీ ఆరా తీస్తూ అన్న అనుచరుల్నే కలుస్తున్నాడు. విడతలు విడతలుగా ఫ్లాష్ బ్యాక్స్ లో రాజూ భయ్యా ఉనికి గురించి మనకూ సస్పెన్స్ పెరుగుతోంది. కచ్చితంగా ఇలాటి డ్రామాకి అంతిమంగా తమ్ముడికి షాకింగ్ న్యూసే తెలియాలి. అంటే అన్న హతమే అయి వుండాలి. ‘సస్పెన్స్ పోషణ’  అనే స్క్రిప్టింగ్ టూల్ కి రెండు పార్శ్వాలుంటాయి. ఎందుకు? ఎలా? అనేవి. వీటిలో  కథాక్రమంలో ఎందుకు? అనే పార్శ్వాన్ని విప్పుతూ పోతూ,  ఎలా? అనే రెండో పార్శ్వాన్ని మూసిపెడతారు. ఇదే చివరంటా సస్పెన్స్ పోషణకి తోడ్పడుతుంది. మొదటి పార్శ్వాన్ని పూర్తిగా విప్పేశాక,  ఈ రెండోది విప్పడం మొదలెడతారు.

అలా అన్న హతమై వుంటే ఎందుకు హతమై ఉంటాడో రానురాను కథనంలో కారణం మనకి తెలిసిపోయింది. ఇక ఎలా హతమై ఉంటాడో చూడాలన్న ఈ రెండో కుతూహలాన్ని డ్రమెటిక్ గా తీర్చాడు దర్శకుడు. హతమై ఉంటాడని కథ మొదలెట్టిన మొదట్లోనే మనకి తెలిసిపోయినా, ఎలా హతమై ఉంటాడో చూడాలన్న కుతూలంతో కూడిన రెండో పార్శ్వమే మనల్ని కూర్చోబెట్టింది. ఇంటర్వెల్ ముందు వరకూ సినిమాని నిలబెట్టింది.

ఇంతవరకూ బాగానే వుంది. అలా అన్నహత్యకి కారకుల్ని కూడా తెలుసుకున్న తమ్ముడు, ఇంటర్వెల్లో వాళ్ళ మీద తిరగబడుతూ ఊతకర్ర విసిరేసినప్పుడు,  అతను తమ్ముడు కాదనీ, తమ్ముడి వేషంలో వున్న అన్నే అనీ  ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. దీంతో ప్రేక్షకులు థ్రిల్లయిపోయి దిమ్మదిరిగే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుందనుకున్నాడు!
ఇది ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడంగా భావించ లేదతను- లేదా ఫూల్స్ చేస్తున్నానన్న జ్ఞానం కూడా లేకపోవచ్చు. తను చేసిందేమిటో తనకే తెలీక తను ఫూలవుతూ, ప్రేక్షకుల్నీఫూల్స్ చేసినట్టు.

అన్నీ తెలిసిన రాజూ భయ్యే తమ్ముడి వేషంలో వచ్చి,  మళ్ళీ మొదట్నించీ తన గురించే ఎందుకు తెలుసుకుంటూ కూర్చుంటాడు- వెళ్లి మొత్తం వాళ్ళని లేపెయ్యక? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం అంతవరకూ నడిపిన కథ కి ఎటువంటి లాజిక్కూ లేకుండా పోయింది. పాత్రే అర్ధరహితంగా ఉండడంతో అంతవరకూ చూసిన కథనంతటినీ  ఆటోమేటిగ్గా  మన మన మైండ్ డిలీట్ చేసుకునే పరిస్థితేర్పడింది!

పాత్రోచితానుచితాలు

విజయవంతమైన సినిమాల్లో హీరోకి బలమైన ఒక లక్ష్యసాధన, దాన్ని వ్యతిరేకించే బలమైన విలన్, ఆ విలన్ తో పోరాటానికి బలమైన పునాది, దానికి సహేతుకమైన ఎమోషనల్ చోదక శక్తి, దీని ఆలంబనగా ప్రాణప్రదమైనది ఏదైనా పణంగా పెట్టడం మొదలైనవి చూస్తూంటాం. ప్రస్తుత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాలో ఇవన్నీ లోపించడాన్ని గమనించవచ్చు.

విలన్ ఎంత బలహీనుడు కాకపోతే హీరో కామెడీగా ఎత్తుకొచ్చి ఫ్రెండ్ కుతి తీరుస్తాడు? నాకడ్డొస్తే పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తానని విలన్ అనడమే మొత్తం పోరాటానికి కారణం కావడం ఎంత బలహీనం? ఈ ఫస్ట్ యాక్ట్ అంతంలో ముడేయాల్సిన పాయింటు ఇంత  బలహీనంగా ఉన్నందుకే గా క్లైమాక్స్ పటుత్వం లేకుండా పోయింది? ( If the ending seems to be weak,  go to the conflict point at the end of first act and set it up strongly –Syd Field ). ఇక హీరోకి ప్రతీకార కారణంగా పెట్టుకున్న ఫ్రెండ్ హత్యోదంతం ఎమోషనల్ గా ఏమేరకు చోదకశక్తి? ఆ ఫ్రెండ్ కూడా హత్యలు చేసిన మాఫియానే. అతడి పట్ల ప్రేక్షకులకి సానుభూతి ఎందుకుంటుంది? అప్పుడు  హీరో చేసే పోరాటంలో ఎలా ఇన్వాల్వ్ అవగలరు? నాగార్జున నటించిన ‘మాస్’ లో అమాయక ఫ్రెండ్ పాత్ర సునీల్ ని మాఫియాలు చంపేయడం నాగార్జునకీ, తద్వారా ప్రేక్షకులకీ ఎమర్జెంట్ ఎమోషనల్ డ్రైవ్ అయింది.

ఇక శత్రు సంహారంలో హీరో అడుగు ముందుకేయాలంటే ఖబడ్దార్ అని అడ్డుకట్ట  వేసే పణం (రిస్కు)గా పెట్టారా అంటే  ఏదీ లేదు. క్లైమాక్స్ లో హీరోయిన్ని ఎత్తుకుపోవడం పణం కాబోదు. అలాటిదే జరిగితే ముందునుంచే వుండాలి.
దర్శకుడు ఏదైనా పణంగా పెట్టాడంటే అది హీరో- అతడి ఫ్రెండ్ ల తెలివితేటల్నే. లేకపోతే  విలన్ ఏదో అన్నంత మాత్రానే కుతకుతలాడిపోయి అతన్నిఅవమానించడమే పరమావధిగా ఎందుకు పెట్టుకుంటారు. దీని పర్యవసానాలెలా ఉంటాయో మనం ఊహించగల్గినప్పుడు హీరో ఎందుకు ఊహించలేడు ? అంత మొనగాడైన ఫ్రెండ్ ని విలన్ వూరికే కుక్కని చంపినట్టు కుళ్ళబొడిచి చంపాడు. ఇలా వుంది  పాత్రచిత్రణ!

విలన్ అవమానిస్తే,  వృత్తిపరంగా అతణ్ణి దెబ్బ కొట్టేందుకు అది మోటివేషన్ . అక్కడ్నించీ అతడి పతనానికీ, గల్లీ బతుకు చాలించి తమ ఏకఛత్రాధిపత్యానికీ  మెట్లు వేసుకుంటూ రావాలి. ఈ సంఘర్షణలో ఫ్రెండ్ చనిపోతే ఒక అర్ధముంటుంది. అప్పుడు ఫ్రెండ్ చావుకి ప్రతీకారమనే బలహీనతకి ఆస్కారముండదు. ఆ ఫ్రెండ్ ఆత్మశాంతికి వాళ్ళ  ఉమ్మడి లక్ష్యమైన  ఏకఛత్రాధిపత్య సాధనే ధ్యేయంగా సమంజసంగా  వుంటుంది. కమల్ హాసన్ ‘నాయకుడు’, మోహన్ లాల్ ‘అభిమన్యు’, నాగార్జున ‘శివ’, జేడీ చక్రవర్తి ‘సత్య’ –ఇలా విజయవంతమైన ఏ మాఫియా పాత్రని చూసినా అది ఏకఛత్రాధిపత్యమనే ఉన్నతాశయం కోసమే పోరాడింది.

విలన్ అవమానించడమనే సంఘర్షణ కారణాన్ని  తీసుకుని పై విధంగా కథ అల్లలేదు సరికదా, ఫ్రెండ్ ని విలన్ చంపినప్పుడైనా దాన్ని సమగ్రంగా ఎష్టాబ్లిష్ చేయలేదు- అంటే, చావబోతున్న ఆ ఫ్రెండ్ నుంచి విలన్ ఏదో వ్యక్తిగత రహస్యాన్ని లేదా వృత్తి సంబంధ సమాచారాన్ని, ఇంకాలేదా ఓ ట్రోఫీ (హంతకుడు తన విజయాన్ని స్వైరకల్పనలతో ఎంజాయ్ చేయడానికి సేకరించే హతుడి తాలూకు ఏదైనా విలువైన వస్తువు) హస్తగతం చేసుకుని వుంటే అది హీరో ప్రతీకారానికి స్పీడ్ బ్రేకర్ గా పనిచేసే రిస్క్ ఫ్యాక్టర్ (పణం)గా పనిచేసి సెకండాఫ్ కథనానికి డైమెన్షన్ వుండేది.

అసలు హీరో తో తన కథ తనే తెలుసుకునే అసహజత్వానికి పూనుకునేకన్నా, నిజంగానే అన్నకోసం అమాయక తమ్ముడు కృష్ణే వచ్చినట్టు చూపిస్తే సరిపోయేది - ఇంటర్వెల్ దగ్గర ఊత కర్ర విసిరేసినప్పుడు అతను అవిటివాడు కాదని మాత్రమే  ట్విస్ట్ ఇచ్చి- అక్కడ్నించీ అన్న చావుకి తమ్ముడి ప్రతీకారంగా ఎమోషనల్ డ్రైవ్ తో – లేని శక్తియుక్తులతో అపసోపాలుపడుతూ మాఫియాల్ని అంత మొందించి, తనే పెద్ద మాఫియాగా ప్రకటించుకునే తెగువతో బ్యాంగ్ ఇచ్చివుంటే రుగ్మతలన్నీ తొలగిపోయేవి. దర్శకుడు ఇంటర్వెల్ దగ్గర కథకి హాని చేసే  హీరో రోల్ రివర్సల్ ట్విస్ట్ ఇచ్చేకన్నా – సినిమా ముగింపులో అన్నెం పున్నెం ఎరుగని అమాయకుడు కృష్ణ ముంబాయికి పెద్ద మాఫియాగా మారే రోల్ రివర్సల్ ఇంకా బాగా పేలేది!

-సికిందర్




















సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
పాటల ఖర్చూ పోరాటాల రిస్కూ
తగ్గించవచ్చు!
యుగంధర్ తమ్మారెడ్డి- పిక్సెలాయిడ్ స్టూడియోస్ 
ఖండాంతరాలు దాటి వెళుతున్న తెలుగు సినిమాకి ఒట్టి స్టార్ డమ్ లు, హిట్ కాంబినేషన్లు, అత్యధిక ప్రింట్ లూ అనే సౌకర్యాలొక్కటే ఇప్పుడు సరిపోవడంలేదు బాక్సాఫీసులు బద్దలు కొట్టడానికి. ఇంకేదో కావాలి. ఏమిటది? ఇంకేమిటి, గ్రాఫిక్సే!
ఖర్చురీత్యా, రిస్కు రీత్యా, సౌలభ్యం రీత్యా కూడా ఇప్పుడు సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) టెక్నాలజీ నిత్యావసర వస్తువై కూర్చుంది. గ్రాఫిక్స్ లేని సినిమా తడిసి మోపెడవుతోంది-ఇది నిజం!

అది జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లోని ఓ కాంప్లెక్స్ మూడో అంతస్తులో ‘పిక్సెలాయిడ్’ సంస్థ కార్యాలయం. ఛాంబర్ లో సంస్థ యంగ్ ఎండీ యుగంధర్ తమ్మారెడ్డి తాము గ్రాఫిక్స్ సమకూర్చిన బిగ్ కమర్షియల్ సినిమాల క్లిప్పింగ్స్ చూపిస్తూ వెళ్ళారు. ‘రాజకుమారుడు’ దగ్గర్నుంచీ నేటి ‘ఖలేజా’ వరకూ మహేష్ బాబు సినిమాలన్నీ, ’నువ్వు-నేను’ దగ్గర్నుంచీ ‘కేక’ వరకూ తేజా సినిమాలన్నీ, ’గోలీమార్’తప్పించి పూరీ జగన్నాథ్ సినిమాలన్నీ, ‘బొమ్మరిల్లు’ దగ్గర్నుంచీ దిల్ రాజు సినిమాలన్నీ, పవన్ కళ్యాణ్  ‘జల్సా’, ‘కొమరంపులి’, రాం చరణ్  ‘మగధీర’, రానున్న ‘ఆరెంజ్’ సినిమాలు రెండూ, అలాగే అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’, ‘ఆర్య- 2’ రెండూ..ఇలా ఎన్నో చిత్రాల క్లిప్పింగ్స్...

“మగధీరలో ఓ వంద మందిని వధించే మేజర్ సీనుంది చూశారా, దాని సృష్టికి వేరే స్టూడియోకి మేమే హెల్ప్ చేశాం” అని చెబుతూ,  గ్రాఫిక్స్ లో కళాత్మక కోణం, సాంకేతిక కోణం అని రెండూ ఉంటాయనీ, యాక్షన్ దృశ్యాలకి రెండోదే ఆయువు పట్టవుతుందనీ వివరించుకొచ్చారాయన. మహేష్ బాబు ‘సైనికుడు’ కి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా ‘నంది’ అవార్డు నందుకున్న ఈయన సినిమా ప్రస్థానం పద్మాలయా స్టూడియోతోనూ, సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ ముడిపడి వుంది.

1997 లో పద్మాలయాలో ఎడిటర్ గా చేరిన ఈయన నిజానికి ఫోటోగ్రఫీలో ఫైనార్ట్స్ పట్టభద్రుడు. అప్పట్లో పద్మాలయాకే ప్రత్యేకమైన సిలికాన్ గ్రాఫిక్స్ మీద యానిమేషన్ చేయడం ప్రారంభించారు. సినిమా ట్రైలర్లూ వగైరా రూపొందిస్తూ,1999నాటికి మహేష్ బాబు నటించిన ‘రాజకుమారుడు’కి గ్రాఫిక్స్ ని సమకూర్చే స్థాయికి చేరుకున్నారు.

తర్వాత ముంబాయిలో ఓ బహుళ జాతీయ సంస్థలో అవకాశం వస్తే వెళ్ళారు. కానీ అప్పట్లో మనదేశానికి అవుట్ సోర్సింగ్ గా విదేశీ కంపెనీలు ‘లోఎండ్ వర్క్’ (మిగులు పని) ని మాత్రమే అప్పగించేవి. సృజనాత్మకతకి ఏమాత్రం వీలు లేని ఈ పనితో అసంతృప్తి చెంది, మహేష్ బాబు పిలుపు మేరకు తిరిగి హైదరాబాద్ వచ్చేశారు యుగంధర్. అప్పుడు మహేష్ బాబు నటించిన ‘నిజం’ కి గ్రాఫిక్స్ సమకూర్చి మెప్పు పొందారు. అప్పట్నించీ ప్రతీ అడుగులో మహేష్ బాబు అండదండలు ఈయనకు లభించాయి.

మహేష్ బాబే కాకుండా ఎస్.గోపాల రెడ్డి, రసూల్, తేజ, దిల్ రాజు, పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ మొదలైన వారి ప్రోత్సాహంతో చకచకా ఎదుగుతూపోయారు.


“తేజ తీసిన ‘నువ్వు-నేను’ తో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ హోదా వచ్చింది నాకు”-అని చెప్తూ, అప్పట్లో ‘పద్మాలయా విజువల్స్ స్ప్లెండర్’ లో తనతో పాటు పనిచేసిన వీఎఫెక్స్ ఎక్స్ పర్ట్ సయ్యద్ జునైదుల్లాతో కలిసి 2005 లో ఇప్పుడున్న ‘పిక్సెలాయిడ్’ ని స్థాపించానని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా వర్ని పట్టణానికి చెందిన యుగంధర్ తమ్మారెడ్డి అంతటితో ఆగిపోలేదు. వైజాగ్ లోనూ బ్రాంచి ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పాతికమంది వరకూ సిబ్బంది పని చేస్తున్నారు. సినిమాలకి గ్రాఫిక్స్, యానిమేషన్స్ రూపొందించడం తో బాటు, వీడియో గేమ్స్ రూపొందించడం, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ కంపెనీల వారి డిజైన్లకి ప్రీ విజువలైజేషన్ వర్క్ చేయడం మొదలైనవి కూడా చేపడుతున్నారు.

ఇప్పటివరకూ తన గ్రాఫిక్స్ తో 50 వరకూ తెలుగు సినిమాలని మనోరంజకం చేసిన ఈయన ఒకటే చెప్తారు : గ్రాఫిక్స్ తో ఖర్చుకి ఖర్చూ, వృధాకి వృధా, రిస్కుకి రిస్కూ తగ్గించవచ్చు. అదెలాగంటే, పాటల చిత్రీకరణే తీసుకుంటే, లొకేషన్స్ కి వెళ్ళనవసరం లేకుండానే గ్రాఫిక్స్ తో కోరుకున్న నేపధ్యాన్నేకాదు, ఇంకా ఊహకందని అద్భుతాల్ని కూడా సృష్టించ వచ్చు. సెట్స్ విషయాని కొస్తే, నటుల మధ్య ఇంటరాక్షన్ మేరకే సెట్స్ వేసుకుంటే చాలు, మిగతా సెట్ పోర్షన్ అంతా గ్రాఫిక్స్ తో సృష్టించ వచ్చు. ఇక ఫైట్స్ లో వాహనాల పేల్చివేతలు, ఛేజింగ్స్ వగైరా రిస్కీ షాట్స్ ని కూడా గ్రాఫిక్స్ తో సృష్టించ వచ్చు. ఇందువల్ల షూటింగుల్లో ప్రమాదాలూ తగ్గుతాయి.

మరి ఇలాగైతే ఆర్ట్ డైరెక్టర్లూ, యాక్షన్ డైరెక్టర్లూ ఉపాధి లేకుండా పోతారేమోనని అడిగితే, అదేం కాదంటారు యుగంధర్. వాళ్ళ ప్రయాస ప్లస్ రిస్కూ మాత్రమే తగ్గుతాయంటారు.

ప్రస్తుతం ‘డాన్ శీను’ గ్రాఫిక్స్ వర్క్ పూర్తయి విడుదల కూడా అయ్యింది. ఇప్పుడు ఖలేజా, బృందావనం, గగనం, కొమరం పులి, ఆరెంజ్, మనసారా మొదలైన సినిమాలతో బిజీగా వున్న యుగంధర్ తమ్మారెడ్డి, ఏకకాలంలో ఎన్ని సినిమాలకైనా పనిచేయగలనని ధైర్యంగా చెప్పారు.

-సికిందర్
(ఆగస్టు -2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)





Thursday, August 14, 2014

సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
ఐదేళ్ళలో అంతా డిజిటల్ మయం!
కెమెరామాన్ ఎస్.గోపాలరెడ్డి 


మనమిప్పుడు డిజిటల్ టెక్నాలజీ ముఖద్వారంలో సవాలక్ష సందేహాలతో నిలబడి వున్నాం. 



       ఐతే  1970 లలో సస్పెన్స్ బ్రహ్మ అని పిలుచుకునే ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  ‘ఫ్యామిలీ ప్లాట్’ అనే సినిమాని రంగుల్లో తీస్తూ, ఆ కొత్త టెక్నాలజీని కథ చెప్పే టెక్నిక్ కి అర్ధవంతంగా వాడుకుని టెక్నాలజీకే తాత అన్పించుకున్నాడు. రెండే రెండు దృశ్యాలు  –ప్రారంభంలో గోల్ఫ్ కోర్సు సీనులో గాఢమైన రంగుల్ని వాడుకుని బీభత్స రస స్థాయిని ఉన్నతీకరించాడు. ఆ తర్వాత ముగింపులో కారు తగలబడే దృశ్యంలో భావోద్రేకాల మీద రంగుల ప్రభావాన్ని గుర్తెరిగి, వాటితో అలజడి సృష్టించాడు. ఈ రెండు చోట్ల తప్పిస్తే, మిగతా సినిమా అంతా కథకి తగ్గ మూడ్ ని కాపాడేందుకు మాత్రమే రంగుల్ని వాడుకున్నాడు. కొత్త టెక్నాలజీని సృజనాత్మకంగా ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే, ఏ కొత్త ఆవిష్కరణా భయపెట్టదు.


          సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల రెడ్డి కూడా ఈ కోవకే చెందుతారు. సీనియారిటీతో  సొంతమయ్యే ఆస్తేమిటంటే, సాధికారత! ఈ సాధికారత అనే సంపదతో సీనియర్లు ముందడుగు వేయకపోతే,  ఇతరులు వృత్తిపరమైన సందేహాలతో మిగిలిపోతారు. అందుకే గోపాల రెడ్డి ఏకంగా ఓ బిగ్ కమర్షియల్ సినిమాకి డిజిటల్లో చిత్రీకరణ జరపడానికి పూనుకున్నారు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా తో నిర్మిస్తున్న- ‘వస్తాడు నా రాజు’ కి  ఆయన చకచకా చిత్రీకరణ చేసుకుపోతూంటే, ఇతర కెమెరామెన్లు ఆసక్తితో ఆయనకు ఫోన్లు చేస్తున్నారు. డిజిటల్ తో వున్న సులువేమిటో తమకూ చెబితే ఆ ప్రవాహంలో తామూ దూకుతామని తొందర పెడుతున్నారు. ఈ సినిమా విడుదలయ్యే వరకూ ఓపికపట్టి, స్వయంగా పరిశీలించుకుని ముందడుగు వేయాల్సిందిగా  గోపాలరెడ్డి హితవు చెబుతున్నారు.ఇంటర్వ్యూకి సంభాషణ ప్రారంభించడమే – “ఇంకో ఐదేళ్ళ తర్వాత ముడి ఫిలిం ఉండదు!”- అంటూ పంచ్ ఇచ్చారు గోపాల రెడ్డి. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా తెలుగు సినిమాల భవిష్య (డిజిటల్) యానాన్ని వివరించుకొచ్చారు.
      

       “రంగుల సినిమా అరవై ఐదేళ్ల ప్రస్థానంలో రంగుల బొమ్మల్ని కంటికి చేరువగా తీసుకొచ్చేందుకు విశేష కృషి జరిగింది. డిజిటల్ లోనూ కంటికీ - బొమ్మకూ కొద్దిగా ఎడం మిగిలి వున్నా, దాన్నీ పూడ్చే ప్రయత్నాలు తప్పక జరుగుతాయి. సాంప్రదాయ ఎనలాగ్ (ముడి ఫిలిం) కెమెరాలతో పనిచేసిన కెమెరా మెన్లు డిజిటల్ మీద పట్టు సాధించడం వాళ్ళ వాళ్ళ మేధస్సు మీద ఆధార పడి వుంటుంది. ఇప్పుడున్న రెడ్ ఒన్, వైపర్, డీ21, సోనీ వంటి అత్యాధునిక డిజిటల్ కెమెరాలని అంత తేలికగా తీసివేయలేం. అంత శక్తిమంత మైనవి అవి. వాటి సాంకేతిక ఔన్నత్యంతో సమానంగా మన మేధస్సుని పెంచుకోవాల్సి వుంటుంది. విష్ణు నటిస్తున్న సినిమాకి ఉపయోగిస్తున్నది రెడ్ కెమెరానే. దీని వాడకంలో  ఇబ్బందులేవీ ఎదురుకావడంలేదు, ఒక్క మనదేశ వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త వేడెక్కడం తప్ప. ఓ పది నిమిషాలు విశ్రాంతి నిస్తే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. లక్షలాది అడుగుల ముడి ఫిలింతో చేస్తున్న పనిని ఇది కొన్ని చిప్స్ తో సరిపెట్టేస్తుంది. ఇలా ఎంతో డబ్బు ఆదా అయినట్టే. ఇక నిర్మాణాననంతర కార్యక్రమాల్లో స్కానింగ్ తంతు కూడా పరిసమాప్త మవుతుంది. చెన్నైలో ఈ మార్పు లేప్పుడో వచ్చేశాయి. మన వైపు కూడా థియేటర్లు డిజిటల్ ప్రదర్శనలకి అనువుగా మారుతున్నాయి. కెమెరామెన్ల ఆత్మవిశ్వాసమే నిర్మాతల్ని, దర్శకుల్నీ, నటుల్నీ పూర్తిస్థాయి డిజటలీకరణ వైపు అడుగులేయిస్తుంది...” అన్నారాయన.
“మరి డీఐ (డిజిటల్ ఇంటర్మీడియేట్), గ్రాఫిక్స్ ల వంటి టెక్నాలజీలతో కెమెరామెన్ల రిలేషన్ షిప్ ఎలాటిది? ఈ రెండూ కూడా సినిమాటోగ్రఫీలో అంతర్భాగాలే కదా..” అని అడిగితే, కెమెరామాన్ పర్యవేక్షణ లేకుండా ఈ రెండూ పూర్తికావన్నారు గోపాల రెడ్డి. డీఐ తో ఎన్నో షూటింగ్ అనివార్యతల్ని అధిగమించ వచ్చన్నారు... “ఒక షాట్ తీస్తున్నప్పుడు కిటికీ లోంచి ఎండ పడుతోంటే మనం ఏమీ చేయలేకపోవచ్చు. అయితే తర్వాత డీఐతో ఆ ఎండని ఆ దృశ్యం లోంచి తొలగించుకో వచ్చు. లేదా కావాల్సిన తీవ్రతకి  మార్చుకోవచ్చు. ఇలాటి సదుపాయాలెన్నో డీఐతో వున్నాయి. ఓ బొమ్మ గీశాక బాగా అన్పించని భాగాల్ని రబ్బరుతో చెరిపేసి తిరిగి వేయడం లాంటిదే డీఐ కూడా!” అని వివరించారు.

        కొత్త టెక్నాలజీతో ఎవరి అర్హతలూ తగ్గిపోవని అభిప్రాయ పడ్డారు. అయితే సంతకాలు చె రిగిపోవా అన్నది మనకొచ్చే సందేహం. ఎలాగంటే, పూర్వం మనం చూసిన సినిమాల్లో వీ ఎస్సార్ స్వామి, పుష్పాల గోపీకృష్ణ, కన్నప్ప, అటు హిందీలో చూస్తే సుదర్శన్ నాగ్, పీటర్ ఫెరీరా లాంటి ఛాయగ్రాహకులెందరో వాళ్ళవైన ప్రత్యేకశైలులతో ఐడెంటిఫై అయ్యే వాళ్ళు. పేరు చూడకుండానే ఆ చిత్రీ కరణ  లెవరివో చెప్పగల్గే వాళ్ళం. ఇప్పుడొస్తున్న ఛాయాగ్రాహకుల పేర్లు చూస్తే తప్ప చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. డీఐతో రంగుల్నీ, వెలుగునీడల్నీ దిద్దుబాటు చేసుకుంటూ కెమెరామెన్ల సంతకాలు చెరిపి వేస్తున్నారన్న విమర్శ వుంది-దీనికే మంటారు గోపాల రెడ్డి?


       బొమ్మే చూసి ఫలనా కెమెరామాన్ అని ప్రేక్షకులు చెప్పలేరని ఆయన సమాధానం. ఒక చిత్ర పటంలో కుంచె విరుపుల్నిబట్టి ఆ చిత్రకారుడెవరో మరో చిత్రకారుడే చెప్ప గలడ న్నారు -  “ సినిమాల్లో లైటింగ్ చూసి నేను అది అశోక్ మెహతానా లేకపోతే సంతోష్ శివ న్నా చెప్పగల్ను, ఆడియెన్స్ చెప్పలేరు”-  అని స్పష్టం చేశారు. అయితే టెక్నాలజీతో  సంతకాలు గల్లంతవుతున్నాయన్న మాట మాత్రం నిజమేనని అంగీకరించారు రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్న ఏస్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి.



-సికిందర్

(అక్టోబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ )




సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 



వాస్తవికత లేని మిక్సింగ్ వృధా!



దేవీకృష్ణ కడియాల

(సౌండ్ ఇంజనీర్-రామానాయుడు స్టూడియో) 

తెలుగు సినిమాలన్నీ డీటీఎస్ మయమే! పోస్ట్ ప్రొడక్షన్ లో మా సినిమాకి డీటీఎస్ జరుగుతోందని చెప్పుకునే వాళ్ళే గానీ డోల్బీ జరుగుతోందని చెప్పే వాళ్ళెవరూ కన్పించరు!

దీనికి కారణం కడియాల దేవీకృష్ణ మాటల్లో, డోల్బీ ఖర్చూ, నిర్వహణా వ్యయమూ డీటీఎస్ తో పోల్చుకుంటే యాభై శాతం అధికంగా ఉండడమే. అయితే ఫిలిం అంచు మీద డీటీఎస్ టైం కోడ్ దెబ్బతింటే, సంబంధిత సౌండ్ డిస్కులు లాక్ అయిపోయే సమస్య వుంది. అలాంటప్పుడు ప్రింటు మీద విధిగా ముద్రించే మోనో ఆడియో ఫార్మాట్ ని రన్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు.

అది సరే, ఒకవిమానం ఎగురుతూంటుంది. తెర మీద కుడి పక్కకో, ఎడం పక్కకో టేకాఫ్ తీసుకుని, మన నడి నెత్తి మీద నుంచి గయ్యి మని దూసుకెళ్తుంది. అప్పుడు థియేటర్ సీలింగ్ లో స్పీకర్లే వుండవు. అయినా చెవులు చిల్లులు పడే శబ్దం పైనుంచే వస్తుంది. ఇదెలా సాధ్యం?


రామానాయుడు స్టూడియోలో డీటీఎస్ మిక్సింగ్ హెడ్ గా వున్న దేవీక్రుష్ణ దీనికిచ్చిన వివరణ ఏమిటంటే - ఈక్యూ (ఈక్విలైజేషన్ కంట్రోల్) చూసుకుని, పిక్చర్ సౌండ్ ని ఎలా అడుగుతోందో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ స్టేజి (తెర వెనుక కుడి, ఎడమ, మధ్యమ స్పీకర్స్) లో పెట్టుకుని, సరౌండ్స్ ( హాల్లో కుడి వరస, ఎడమ వరస, వెనుక వైపూ వున్న స్పీకర్స్) లో తగ్గించుకుని, బ్యాలెన్స్ చేస్తూ పోతే,  పైన చెప్పుకున్న శబ్ద ఫలితాన్ని మనం అనుభవిస్తాం.

మన దగ్గర ఇదంతా డిజైనర్ (రూపకల్పన చేసిన)సౌండ్. అదే విదేశాల్లోనైతే లైవ్ రికారింగ్ వుంటుంది. ఎలాటి శబ్దాలనైనా లైవ్ గా రికార్డ్ చేసి పట్టుకొస్తారు. నటీనటులడైలాగుల్ని కూడా షూటింగ్ సమయంలోనే శక్తివంతమైన మైక్రోఫోన్స్ తో రికార్డు చేసి, దాన్నే మిక్సింగ్ లో వాడుకుంటారు. అక్కడ మనలాగా వేరే డబ్బింగ్ అనేది వుండదు. దీనివల్ల నటనలో లీనమైన వాళ్ళ భావోద్వేగాలన్నీ లైవ్ గా వాళ్ళ గొంతుల్లోంచే వచ్చి సహజత్వం వస్తుంది. అదే తెర మీద నటనని చూస్తూ డబ్బింగ్ చెప్తే రాదు. ఇక మన సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్సు గురించి చెప్పాలంటే, కీబోర్డు నుంచి అన్ని వాద్యపరికరాల బాణీల్ని  సృష్టించగల్గి నట్టే, హాలీవుడ్ సినిమాల్లోంచి తీసి సీడీలుగా తయారు చేసిన  సౌండ్ ఎఫెక్ట్సు నే  వాడతారు. విమాన శబ్దమైనా, గన్ షాట్స్ అయినా, ఇంకేదైనా ఈ సీడీల్లోని ప్రీ రికార్డెడ్ –డిజైనర్ సౌండ్ ఎఫెక్ట్స్ నుంచే తీసి వాడుకుంటారు.  

పై విషయాలన్నీ చెప్పుకొస్తూ, అసలు ఆడియోని స్క్రిప్టు దశలోనే డిజైన్ చేసుకుంటే అత్యత్తమ ఫలితాలొ స్తాయంటారు దేవీకృష్ణ. ఎంతవరకూ హీరో అడుగుల చప్పుడుండాలి, ఎక్కడ్నించీ రీరికార్డింగ్ ప్రారంభం కావాలీ మొదలైన శబ్ద విన్యాసాలు ఆడియో సెన్స్ తో ముందే నిర్ణయించుకుని షూటింగ్ జరుపుకుంటే, ప్రేక్షకులకి కల్గించే ఆ థ్రిల్లే వేరంటారు.

ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడమనేది దేవీకృష్ణ యూనిక్ సెల్లింగ్ పాయింటేమే అన్పిస్తుంది, ఆయన మాటల్ని వింటూంటే.  శబ్దాన్ని రసాత్మకంగా ఆవిష్కరించే సీనియర్ సౌండ్ ఇంజనీర్ పి.మధుసూదన్ రెడ్డికి ఈయన ప్రియ శిష్యుడు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం కి చెందిన ఈయన అక్కడే ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా పూర్తి చేశాక,  నేరుగా వచ్చి రామానాయుడు స్టూడియోలో  చేరిపోయారు. అనుభవంతో సౌండ్ ఇంజనీరింగ్ ని నేర్చుకున్నారు. 1998లో రికార్డింగ్ శాఖలో చేరి, 2001 కల్లా అదే రామానాయుడు స్టూడియోలో  డీటీఎస్ కి పి మధుసూదన్ రెడ్డికి అసిస్టెంట్ అయ్యారు. 2009 లో డీటీఎస్ హెడ్ గా ప్రమోటయ్యి , మొదటి సినిమాగా ‘రైడ్’ చేశారు. ప్రస్తుతం ‘బావ’,చంద్రముఖి-2’ సినిమాలకి పని చేస్తున్న ఈయన ఇప్పటి వరకు 25 సినిమాలు పూర్తి చేశారు. ‘అది నువ్వే’ ఇటీవలే విడుదలైన సినిమా.


ఎప్పుడైనా ఏదైనా సన్నివేశంలో, సంగీత దర్శకుడు చేసిన రీ- రికార్డింగ్  ట్రాక్ అవసరం లేదన్పించవచ్చు. అలాంటప్పుడు మీరేం చేస్తారన్న ప్రశ్నకి- ఆ సినిమా దర్శకుడ్ని కన్విన్స్ చేసి, కంటిన్యూటీ దెబ్బ తినకుండా, జర్క్ లేకుండా తీసేస్తా మన్నారు. ఎఫెక్ట్స్ తో త్రిల్ కల్గించడమే ప్రధానమైతే, రసాస్వాదన ఎలా కుడుర్తుందని అడిగితే - అలాటి సన్నివేశాలుంటే వాటి ఫీల్ చెడకుండా జాగ్రత్త తీసుకుంటా నన్నారు. ఏ ఫీల్ కైనా ప్రత్యేకించి వాస్తవికతని దృష్టిలో పెట్టుకుంటా నన్నారు.

అయితే విడుదలకి పదిరోజుల ముందు హడావిడిగా వచ్చేసి  సినిమాలు అప్పగిస్తారనీ, దాంతో నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు పనిచేయాల్సి వస్తుందనీ, ఎంత చేసినా ఈ పనిలో ఆనందమే వేరనీ చెప్పుకొచ్చారు. కొన్ని సార్లు రిలీజ్ టెన్షన్ వల్ల  సినిమాని విభజించి  నాల్గైదు చోట్ల డీటీఎస్ కిస్తారన్నారు.
తను చేసే డీటీఎస్ మిక్సింగ్ తో బాధ్యత తీరిపోయిందనుకోకుండా, అ సినిమా ప్రివ్యూల్లోనూ, థియేటర్ల లోనూ ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ళ స్పందన కూడా విధిగా తెలుసుకుంటానన్నారు దేవీ కృష్ణ.


***
సినిమాల్లో శబ్దాన్ని మోనో అవస్థల నుంచి డోల్బీ, డీటీఎస్ కంపెనీలు  5.1 మల్టీ ఛానెల్ సిస్టంతో విముక్తి కల్గించాక, మరి కొంచెం ముందుకు సాగి, 6.1, 7.1  వెర్షన్స్ తో వైవిధ్య శీలతని ప్రదర్శించాయి. తాజాగా సోనీ సంస్థ రంగప్రవేశం చేస్తూ, ఏకంగా 8.1 ఎస్ డీడీ ఎస్ ( సోనీ డైనమిక డిజిటల్ సౌండ్ తో) తో ఆసక్తి రేపింది. కానీ ఇవేవీ సౌండ్ ఇంజనీర్లతో క్లిక్ కాలేకపోయాయి. ఒక్క 5.1 సిస్టం తప్ప. ఇది ఇచ్చే కిక్కే వేరంటారు వాళ్ళు. అయినా ఈ కంపెనీ లన్నీ కలిసి ఆడియో ఫార్మాట్ ని ఫిలిం రీలు అంచు మీద ఎలా పంచుకున్నాయో ఈ ప్రక్కన పటం లో చూడవచ్చు..


-సికిందర్
(అక్టోబర్, 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

(PS : పై ఇంటర్వ్యూలో 5.1, 6.1,7.1, 8.1 సౌండ్ సిస్టమ్స్  అని సాంకేతిక పదాలు దొర్లాయి. వీటి అర్ధమేమిటో వేరే సౌండ్ ఇంజనీర్ల  ఇంటర్వ్యూల్లో త్వరలో తెలుసుకుందాం)