రివ్యూ..
డైనమిక్స్
మిస్సైన డ్రామా !
రచన- దర్శకత్వం : లింగుస్వామి
తారాగణం : సూర్య, సమంతా, విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్
పాయి, బ్రహ్మానందం తదితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, పాటలు : వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, భువన
చంద్ర
సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం :
సంతోష్ శివన్, కూర్పు : ఆంథోనీ,
ఆర్ట్ : రాజీవన్,
ఫైట్స్ : సిల్వా,
డాన్స్ : బృందా, రాజు సుందరం,
బ్యానర్ : తిరుపతి బ్రదర్స్ , నిర్మాతలు : లగడపాటి శిరీష - శ్రీధర్, సుభాష్
చంద్రబోస్
విడుదల : ఆగస్టు
15,2014, సెన్సార్ : ‘U’
***
ఇప్పుడు ముంబాయి మాఫియాల్ని
ఫీలవుతోందా అంటే లేదనే సమాధానం వస్తుంది. మారుతున్న ముంబాయి నగర వాతావరణాన్ని బాలీవుడ్
కూడా ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో అంతర్భాగంగా చేసుకుని అందిస్తూ వుంటుంది. 1970-80లలో
స్మగ్లర్లు ఏలిన ముంబాయి శాంతిభద్రతల పరిస్థితుల్ని, ఆ తర్వాత 1990-2000లలో మాఫియాలతో ఏర్పడిన
హింసాత్మక స్థితినీ బాలీవుడ్ సినిమాలు దర్పణం పడుతూ వచ్చాయి. దీని తర్వాత టెర్రరిజం
ముంబాయిని వణికించినప్పుడూ బాలీవుడ్ సినిమాలు దాన్నీ రికార్డు చేశాయి. ఇలా ఒక్కో
దశ దాటుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి లేని దశ వైపు చూసి ఆ సినిమాల్ని ఉత్పత్తి
చేయలేదు. వెనక్కి చూడాల్సి వస్తే ఆ దశని పీరియడ్ ఫిలిమ్స్ గా అదే కాలంలో
స్థాపించిన కథలతో ఈమధ్య సినిమాలొచ్చాయి. పై మూడు దశలూ గడిచి పోయాక ఇప్పుడు ముంబాయిలో మరో
శాంతి భద్రతల సిట్యుయేషన్ లేదు. దీంతో
బిగ్ స్టార్స్ సినిమాలూ కాలక్షేప యాక్షన్ కామెడీలుగా రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం
నడుస్తున్న ట్రెండ్ ఇదే.
ఈ నేపధ్యంలో తమిళ టాప్ దర్శకుడు లింగు స్వామి
ముంబాయిలో ఇంకా మాఫియాల్ని ఫీల్ కమ్మంటూ భారీ యాక్షన్ సినిమా ప్రేక్షకుల కందించాడు.
ఏమంటే, ఇందులోమాఫియా నేపధ్యం మాటవరసకేననీ, అక్కడ ప్రధానంగా చెప్పింది ఓ స్నేహం
గురించీ, ఇంకో ప్రేమ గురించీ మాత్రమేననీ సెలవిచ్చాడు. కానీ ఇలా కూడా లేదు. సమస్య
ఎక్కడ వచ్చిందంటే, భారీ బడ్జెట్లతో బిగ్ స్టార్ సినిమా అనగానే తమిళ-తెలుగు భాషల్లో
మాఫియా కథలు తప్పించి మరొకటి ఆలోచించలేని తనం దగ్గర! తత్ఫలితంగా ఇలాటి కృత్రిమ సినిమాలతో
కుత్తుకల మీద కత్తి పెట్టి చూసి తీరాల్సిందేనంటూ
డిమాండ్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ సూర్య నేటివిటీ వున్న ‘సింగం’ సినిమాలు చేస్తున్న
వాడల్లా ముంబాయి వెళ్లి ముంబాయిలోనే నేటివిటీ లేని సినిమా నటించి ఔరా అన్పించాడు.
వెంట వెళ్ళిన సమంతా మాత్రం ముంబాయి నేటివిటీకి మారిపోయి బికినీకి సాహసించి జీవించింది.
విలన్ గా ముంబాయి మనోజ్ బాజ్ పాయి కళ తప్పిన మొహంతో దక్షిణ ప్రేక్షకులకి షాకిచ్చే స్థితికొచ్చాడు.
ఇంతకీ ఈ ప్రేమా స్నేహాల, మాఫియా పోరాటాల సినిమాలో ఏముంది?
అన్వేషించు-వధించు!
అతను కృష్ణ(సూర్య). అతను కర్ర సహాయంతో నడిచే
వికలాంగుడు. వైజాగ్ నుంచి ముంబాయి చేరుకొని అన్న రాజు (సూర్య) కోసం వెతుకుతూంటాడు.
అన్న గురించి నమ్మలేని నిజాలు తెలుస్తూంటాయి. రాజూ రాజు కాదు, రాజూ భయ్యా. ఇంకో
చంద్రూ (విద్యుత్ జమ్వాల్)తో కలిసి మాఫియాగా ఎదగాలని ప్రయతిస్తున్నాడు. అతనంటే
ముంబాయి ప్రజల్లో ఎంత భయమో అంత భక్తి. కృష్ణకి ఒకొక్కరే రాజు అనుచరులు తారసపడుతూ
సమాచారమందిస్తూ వుంటారు. ఆ సమాచారమంతా గతందే. దాని ప్రకారం రాజూ చంద్రూల మధ్య
‘బిజినెస్’ కంటే ఎక్కువ స్నేహబంధం వుంది. ఇద్దరూ ఎదురొచ్చిన ప్రత్యర్ధుల్ని చంపుతూ
వాళ్ళ సొత్తు లూటీ చేస్తూంటారు. ఈ మాఫియాల్ని అంతమొందించాలని పోలీస్ కమిషనర్ చంపి పారేస్తూంటాడు.
దీన్ని అడ్డుకునేందుకు కమిషనర్ కూతురు జీవా ( సమంతా) ని కిడ్నాప్ చేస్తాడు రాజు. ఆమె అతడితో ప్రేమలో పడుతుంది.
ఇలా వుండగా ముంబాయిని పాలిస్తున్న పెద్ద మాఫియా ఇమ్రాన్ ( మనోజ్ బాజ్ పాయి ) ఉంటాడు. ఇతను ఒక పార్టీలో రాజూ చంద్రూ లని చూసి, ఎక్కడున్నా వాళ్ళు అక్కడే వుండండి- ఒక్క అడుగు ఎదగాలని ప్రయత్నించినా పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తా- అని హెచ్చరిస్తాడు. అతనలా అన్నాడని పగతో రగిలిపోతాడు చంద్రూ. చంద్రూ ఇలా రగిలిపోతాడని ముందే తెలిసిన రాజు – ఇమ్రాన్ ని ముందే ఎత్తుకొచ్చి ఒక సెల్లార్ లో బంధించి చంద్రూకి చూపిస్తాడు. ఇమ్రాన్ అన్న మాటలకి పది మాటలతో అతణ్ణి అవమానపర్చి కసి
ఇలా వుండగా ముంబాయిని పాలిస్తున్న పెద్ద మాఫియా ఇమ్రాన్ ( మనోజ్ బాజ్ పాయి ) ఉంటాడు. ఇతను ఒక పార్టీలో రాజూ చంద్రూ లని చూసి, ఎక్కడున్నా వాళ్ళు అక్కడే వుండండి- ఒక్క అడుగు ఎదగాలని ప్రయత్నించినా పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తా- అని హెచ్చరిస్తాడు. అతనలా అన్నాడని పగతో రగిలిపోతాడు చంద్రూ. చంద్రూ ఇలా రగిలిపోతాడని ముందే తెలిసిన రాజు – ఇమ్రాన్ ని ముందే ఎత్తుకొచ్చి ఒక సెల్లార్ లో బంధించి చంద్రూకి చూపిస్తాడు. ఇమ్రాన్ అన్న మాటలకి పది మాటలతో అతణ్ణి అవమానపర్చి కసి
తీర్చుకుంటాడు చంద్రూ. రాజూ ఇమ్రాన్ ని వదిలేస్తాడు.
ఇక కొన్నాళ్ళు జీవాతో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్
చేయమని రాజు ని పంపించేస్తాడు చంద్రూ. జీవాతో ఆటా పాటలతో ఎంజాయ్ చేసి వచ్చిన
రాజూకి చంద్రూ శవం స్వాగతం పలుకుతుంది. ఎవరీ పని చేశారని అనుచరుల మీద ఎగురుతాడు.
ఒక అనుచరుడు చెప్తానని తీసికెళ్ళి రాజు ని
కాల్చిచంపేస్తాడు.
ఇదంతా తెలుసుకున్న కృష్ణ ఏం చేశాడు? అన్న చావుకి పగ తీర్చుకున్నాడా?
అన్న నిజంగానే చనిపోయాడా, ప్రాణాలతో ఎక్కడైనా వున్నాడా? జీవా ఏమైంది? ఇవన్నీ సెకండాఫ్
లో తేలే అంశాలు.
ఇది పూర్తిగా సూర్య భుజస్కంధాల మీద ఆధారపడ్డ సినిమా.
రెండు భిన్నపాత్రల్లో- ఒకదాంట్లో స్టార్ సూర్య కన్పిస్తే, మరోదాంట్లో నటుడు సూర్య కన్పిస్తాడు.
స్టార్ సూర్యగా మాస్ ని ఊపెయ్యాలని ప్రయత్నిస్తాడు, నటుడు సూర్యగా గుండెల్ని తడమాలని
చూస్తాడు. రెండిట్లోనూ సఫలమయ్యాడు. ఐతే ఇంత విభిన్నమైన ఈ ద్విపాత్రాభినయానికి తగిన
కథ జత పడకపోవడం విచారించాల్సిన విషయం. దర్శకుడు చేసిన పెద్ద పొరపాటు- కథలోంచి పాత్ర
పుడుతుందనుకోవడం. కానీ అలా జరగదు- సినిమాకి, అందునా బిగ్ కమర్షియల్ సినిమాకి – పాత్రలోంచే
కథ పుడుతుంది! ఇలా ఆలోచించి వుంటే, సాత్విక కృష్ణ పాత్రతో అద్భుతం చేసి ఈ సినిమాని
తిరుగులేకుండా నిలబెట్టేవాడు దర్శకుడు. ఇదెలాగో తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం...
సమంతా కిందులో ఆడేపాడే, హీరో వెంటపడి తిరిగే, పాత ఫార్ములా
కొలమానాల కమిషనర్ కూతురి పాత్రే లభించింది. దీంతో బికినీల్లో అందాల ప్రదర్శనకీ పాల్పడాల్సి
వచ్చింది.ఇంతకంటే చెప్పుకోవదానికేం లేదు. చంద్రూ పాత్ర నటించిన- నటుడూ, మోడల్,
మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్, పూర్తి శాఖాహారీ అయిన విద్యుత్ జమ్వాల్ తెలుగులో రెండు
ఎన్టీఆర్ సినిమాలతో పరిచితుడే. తమిళంలో ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ వున్న బాలీవుడ్ నటుడు.
ఈ సినిమాలో అతనున్న ప్రతి సీనూ పేరుకు తగ్గట్టే ఎలెక్ట్రిఫయింగ్ గా వుంది. ఇక మనోజ్
బాజ్ పాయ్ వన్నె తగ్గిన మొహంతో ప్రధాన విలన్ గా విఫలమయ్యాడు. సంగీత విద్వాంసుడిగా ఒక
సీను లోకన్పించే బ్రహ్మానందం, సెకండాఫ్ లో
మరీ బలహీనపడ్డ కథలో హుషారు పుట్టించడానికి విఫలయత్నం చేశాడు.
చీమల్లా పుట్టుకొచ్చే మాఫియాల అనుచరుల పాత్రల్లో బాలీవుడ్
ఫైటర్స్ రఫ్ గా కొందరు, స్టయిలిష్ కొందరూ కన్పిస్తారు. కానీ వర్మ పాపులర్ చేసిన బ్రాండ్
సహజత్వాన్ని ప్రదర్శించలేకపోతారు.
ఈ సినిమాకి మరో స్టార్ వున్నాడు. అతను సంతోష్ శివన్.
కెమెరాతో మాఫియా లోకాన్ని మర్చిపోలేనంత గ్లోరిఫై చేశాడు. ఇందుకు కళాదర్శకుడు రాజీవన్
సమకాలీనతని దృష్టిలో ఉంచుకుని చాలా తోడ్పాటు నందించాడు. సిల్వా సమకూర్చిన విశృంఖల యాక్షన్
దృశ్యాలూ, బృందా- రాజు సుందరంల నృత్య విన్యాసాలూ, ఆఖరికి యువన్ శంకర్ రాజా ఫాస్ట్ బీట్
సంగీతమూ అన్నీ- వేలెత్తి చూపలేని విధంగా వున్నాయి-ఒక్క ఎడిటింగ్, డైరెక్షన్ తప్పిస్తే.
సుమారు మూడు గంటల నిడివికి సాగలాగిన బలహీన కథకి ఇతర టెక్నీషియన్లు ఎంత టాప్ క్లాస్ సేవలందిస్తే మాత్రం
ఏం లాభం- బూడిదలో పోసిన పన్నీరే!
దర్శకుడు లింగు స్వామి తను దర్శకుడుగా ఎనిమిది సినిమాలు
తీస్తే, ఇతర దర్శకులతో నిర్మాతగా ఆరు చిన్న సినిమాలు తీశాడు. ఇవే బావున్నాయి. దర్శకుడుగా
బాగా మాస్ కమర్షియల్స్ కి అలవాటు పడ్డ తను ఇప్పుడు తీసిన సినిమాతో సక్సెస్ కోసం ప్రేక్షకుల్ని
ఫూల్స్ చేయొచ్చని కూడా తెలుసుకున్నట్టుంది - లేదా తనేం చేస్తున్నాడో తెలుసుకోలేదేమో-
ఏమైనా జరిగిందొక్కటే- ప్రేక్షకులు ఫూల్స్ అవడం!
స్క్రీన్ ప్లే సంగతులు..
మాస్ సినిమాలతో ఉన్న సులువేమిటంటే వాటికి అంతగా లాజిక్ తో పనుండదు. ఎంత ఎక్కువ చేసి
చూపిస్తే అంత పంచ్ వుంటుంది. దృశ్యాల్లో పంచ్ లేని మాస్ సినిమా చప్పగా వుంటుంది. దీన్నే
suspension
of disbelief (మన నమ్మకాల్నీ అపనమ్మకాల్నీ కాసేపు పక్కన బెట్టి సినిమాని
ఎంజాయ్ చేయడం) లేదా cinematic liberty (
సృజనాత్మక స్వేచ్ఛ) అంటారు. అయితే ఈ ఎక్కువ, లేదా ‘అతి’ అన్నది ఎంత ఎక్కువ వుండాలన్నది కూడా
మన కామన్ సెన్సే చెప్తుంది. ఉదాహరణకి ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ లో బాలకృష్ణ సైగ చేస్తే రైలాగి పోవడం, కుర్చీ ముందుకు కదిలి
రావడం లాంటివి శృతి మించిన ‘అతి’ అయ్యాయి. అలాగే
బ్రహ్మానందం కూడా ఓ పందెం కోడితో శత్రు సంహారం చేయడం శృతి మించిన
లాజిక్కయ్యింది. ఇవేవీ మింగుడుపడక తిప్పి
కొట్టి ఫ్లాప్ చేశారు ప్రేక్షకులు. ఇవి దృశ్యాల్లో కంటికి కన్పించిపోయే
నాన్సెన్స్. ఇలాటివి పసిగట్టినంత తేలిగ్గా కథా కథనాల్లో అనౌచిత్యాల్ని గ్రహించలేరు
అందరు ప్రేక్షకులూ.
ఎలాగంటే, ఉదాహరణకి- ‘దృశ్యం’లో హత్య జరిగిన మర్నాడే శవాన్ని
తీసికెళ్ళి పోలీస్ స్టేషన్ ‘కింద’ పాతిపెట్టేశాక- ఇక మిగతా కథంతా నడపడంలో ఎలా
అర్ధం లేదో, అలా ప్రస్తుత సినిమాలోనూ జరిగింది. అదేమిటంటే- తన స్నేహితుణ్ణి చంపి,
తన మీద హత్యా ప్రయత్నం చేసిందెవరో హీరో (రాజు భయ్యా )కి ప్రత్యక్షంగా తెలిసిపోతున్నాక
కూడా, ఇంకా తమ్ముడు కృష్ణంటూ వేషం కట్టి ఆరాతీయడం అంతా నాన్సెన్స్!
ఇది కనీస లాజిక్ కి కూడా ఎలా
అందదో చూడ్డానికి పెద్ద మేధస్సేం అక్కర్లేదు. రాజూ భయ్యా తమ్ముణ్ణంటూ కృష్ణ
ముంబాయి వచ్చాడు. అన్న ఆచూకీ ఆరా తీస్తూ అన్న అనుచరుల్నే కలుస్తున్నాడు. విడతలు
విడతలుగా ఫ్లాష్ బ్యాక్స్ లో రాజూ భయ్యా ఉనికి గురించి మనకూ సస్పెన్స్
పెరుగుతోంది. కచ్చితంగా ఇలాటి డ్రామాకి అంతిమంగా తమ్ముడికి షాకింగ్ న్యూసే
తెలియాలి. అంటే అన్న హతమే అయి వుండాలి. ‘సస్పెన్స్ పోషణ’ అనే స్క్రిప్టింగ్ టూల్ కి రెండు
పార్శ్వాలుంటాయి. ఎందుకు? ఎలా? అనేవి. వీటిలో కథాక్రమంలో ఎందుకు? అనే పార్శ్వాన్ని విప్పుతూ
పోతూ, ఎలా? అనే రెండో పార్శ్వాన్ని
మూసిపెడతారు. ఇదే చివరంటా సస్పెన్స్ పోషణకి తోడ్పడుతుంది. మొదటి పార్శ్వాన్ని పూర్తిగా
విప్పేశాక, ఈ రెండోది విప్పడం మొదలెడతారు.
అలా అన్న హతమై వుంటే ఎందుకు
హతమై ఉంటాడో రానురాను కథనంలో కారణం మనకి తెలిసిపోయింది. ఇక ఎలా హతమై ఉంటాడో
చూడాలన్న ఈ రెండో కుతూహలాన్ని డ్రమెటిక్ గా తీర్చాడు దర్శకుడు. హతమై ఉంటాడని కథ
మొదలెట్టిన మొదట్లోనే మనకి తెలిసిపోయినా, ఎలా హతమై ఉంటాడో చూడాలన్న కుతూలంతో కూడిన
రెండో పార్శ్వమే మనల్ని కూర్చోబెట్టింది. ఇంటర్వెల్ ముందు వరకూ సినిమాని
నిలబెట్టింది.
ఇంతవరకూ బాగానే వుంది. అలా
అన్నహత్యకి కారకుల్ని కూడా తెలుసుకున్న తమ్ముడు, ఇంటర్వెల్లో వాళ్ళ మీద తిరగబడుతూ
ఊతకర్ర విసిరేసినప్పుడు, అతను తమ్ముడు
కాదనీ, తమ్ముడి వేషంలో వున్న అన్నే అనీ
ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. దీంతో ప్రేక్షకులు థ్రిల్లయిపోయి దిమ్మదిరిగే
ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుందనుకున్నాడు!
ఇది ప్రేక్షకుల్ని ఫూల్స్
చేయడంగా భావించ లేదతను- లేదా ఫూల్స్ చేస్తున్నానన్న జ్ఞానం కూడా లేకపోవచ్చు. తను
చేసిందేమిటో తనకే తెలీక తను ఫూలవుతూ, ప్రేక్షకుల్నీఫూల్స్ చేసినట్టు.
అన్నీ తెలిసిన రాజూ భయ్యే
తమ్ముడి వేషంలో వచ్చి, మళ్ళీ మొదట్నించీ
తన గురించే ఎందుకు తెలుసుకుంటూ కూర్చుంటాడు- వెళ్లి మొత్తం వాళ్ళని లేపెయ్యక? ఈ ఒక్క
ప్రశ్నతో మొత్తం అంతవరకూ నడిపిన కథ కి ఎటువంటి లాజిక్కూ లేకుండా పోయింది. పాత్రే
అర్ధరహితంగా ఉండడంతో అంతవరకూ చూసిన కథనంతటినీ
ఆటోమేటిగ్గా మన మన మైండ్ డిలీట్
చేసుకునే పరిస్థితేర్పడింది!
పాత్రోచితానుచితాలు
విజయవంతమైన సినిమాల్లో హీరోకి బలమైన ఒక
లక్ష్యసాధన, దాన్ని వ్యతిరేకించే బలమైన విలన్, ఆ విలన్ తో పోరాటానికి బలమైన
పునాది, దానికి సహేతుకమైన ఎమోషనల్ చోదక శక్తి, దీని ఆలంబనగా ప్రాణప్రదమైనది ఏదైనా
పణంగా పెట్టడం మొదలైనవి చూస్తూంటాం. ప్రస్తుత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాలో
ఇవన్నీ లోపించడాన్ని గమనించవచ్చు.
విలన్ ఎంత బలహీనుడు కాకపోతే
హీరో కామెడీగా ఎత్తుకొచ్చి ఫ్రెండ్ కుతి తీరుస్తాడు? నాకడ్డొస్తే పందిని
కాల్చినట్టు కాల్చి పారేస్తానని విలన్ అనడమే మొత్తం పోరాటానికి కారణం కావడం ఎంత
బలహీనం? ఈ ఫస్ట్ యాక్ట్ అంతంలో ముడేయాల్సిన పాయింటు ఇంత బలహీనంగా ఉన్నందుకే గా క్లైమాక్స్ పటుత్వం
లేకుండా పోయింది? ( If the ending
seems to be weak, go to the conflict
point at the end of first act and set it up strongly –Syd Field
). ఇక
హీరోకి ప్రతీకార కారణంగా పెట్టుకున్న ఫ్రెండ్ హత్యోదంతం ఎమోషనల్ గా ఏమేరకు చోదకశక్తి?
ఆ ఫ్రెండ్ కూడా హత్యలు చేసిన మాఫియానే. అతడి పట్ల ప్రేక్షకులకి సానుభూతి
ఎందుకుంటుంది? అప్పుడు హీరో చేసే పోరాటంలో
ఎలా ఇన్వాల్వ్ అవగలరు? నాగార్జున నటించిన ‘మాస్’ లో అమాయక ఫ్రెండ్ పాత్ర సునీల్ ని
మాఫియాలు చంపేయడం నాగార్జునకీ, తద్వారా ప్రేక్షకులకీ ఎమర్జెంట్ ఎమోషనల్ డ్రైవ్
అయింది.
ఇక శత్రు సంహారంలో హీరో అడుగు
ముందుకేయాలంటే ఖబడ్దార్ అని అడ్డుకట్ట
వేసే పణం (రిస్కు)గా పెట్టారా అంటే ఏదీ లేదు. క్లైమాక్స్ లో హీరోయిన్ని
ఎత్తుకుపోవడం పణం కాబోదు. అలాటిదే జరిగితే ముందునుంచే వుండాలి.
దర్శకుడు ఏదైనా పణంగా
పెట్టాడంటే అది హీరో- అతడి ఫ్రెండ్ ల తెలివితేటల్నే. లేకపోతే విలన్ ఏదో అన్నంత మాత్రానే కుతకుతలాడిపోయి
అతన్నిఅవమానించడమే పరమావధిగా ఎందుకు పెట్టుకుంటారు. దీని పర్యవసానాలెలా ఉంటాయో మనం
ఊహించగల్గినప్పుడు హీరో ఎందుకు ఊహించలేడు ? అంత మొనగాడైన ఫ్రెండ్ ని విలన్ వూరికే
కుక్కని చంపినట్టు కుళ్ళబొడిచి చంపాడు. ఇలా వుంది పాత్రచిత్రణ!
విలన్ అవమానిస్తే, వృత్తిపరంగా అతణ్ణి దెబ్బ కొట్టేందుకు అది
మోటివేషన్ . అక్కడ్నించీ అతడి పతనానికీ, గల్లీ బతుకు చాలించి తమ
ఏకఛత్రాధిపత్యానికీ మెట్లు వేసుకుంటూ
రావాలి. ఈ సంఘర్షణలో ఫ్రెండ్ చనిపోతే ఒక అర్ధముంటుంది. అప్పుడు ఫ్రెండ్ చావుకి
ప్రతీకారమనే బలహీనతకి ఆస్కారముండదు. ఆ ఫ్రెండ్ ఆత్మశాంతికి వాళ్ళ ఉమ్మడి లక్ష్యమైన ఏకఛత్రాధిపత్య సాధనే ధ్యేయంగా సమంజసంగా వుంటుంది. కమల్ హాసన్ ‘నాయకుడు’, మోహన్ లాల్
‘అభిమన్యు’, నాగార్జున ‘శివ’, జేడీ చక్రవర్తి ‘సత్య’ –ఇలా విజయవంతమైన ఏ మాఫియా
పాత్రని చూసినా అది ఏకఛత్రాధిపత్యమనే ఉన్నతాశయం కోసమే పోరాడింది.
విలన్ అవమానించడమనే సంఘర్షణ
కారణాన్ని తీసుకుని పై విధంగా కథ అల్లలేదు
సరికదా, ఫ్రెండ్ ని విలన్ చంపినప్పుడైనా దాన్ని సమగ్రంగా ఎష్టాబ్లిష్ చేయలేదు-
అంటే, చావబోతున్న ఆ ఫ్రెండ్ నుంచి విలన్ ఏదో వ్యక్తిగత రహస్యాన్ని లేదా వృత్తి
సంబంధ సమాచారాన్ని, ఇంకాలేదా ఓ ట్రోఫీ (హంతకుడు తన విజయాన్ని స్వైరకల్పనలతో ఎంజాయ్
చేయడానికి సేకరించే హతుడి తాలూకు ఏదైనా విలువైన వస్తువు) హస్తగతం చేసుకుని వుంటే అది
హీరో ప్రతీకారానికి స్పీడ్ బ్రేకర్ గా పనిచేసే రిస్క్ ఫ్యాక్టర్ (పణం)గా పనిచేసి
సెకండాఫ్ కథనానికి డైమెన్షన్ వుండేది.
అసలు హీరో తో తన కథ తనే
తెలుసుకునే అసహజత్వానికి పూనుకునేకన్నా, నిజంగానే అన్నకోసం అమాయక తమ్ముడు కృష్ణే వచ్చినట్టు
చూపిస్తే సరిపోయేది - ఇంటర్వెల్ దగ్గర ఊత కర్ర విసిరేసినప్పుడు అతను అవిటివాడు
కాదని మాత్రమే ట్విస్ట్ ఇచ్చి-
అక్కడ్నించీ అన్న చావుకి తమ్ముడి ప్రతీకారంగా ఎమోషనల్ డ్రైవ్ తో – లేని
శక్తియుక్తులతో అపసోపాలుపడుతూ మాఫియాల్ని అంత మొందించి, తనే పెద్ద మాఫియాగా
ప్రకటించుకునే తెగువతో బ్యాంగ్ ఇచ్చివుంటే రుగ్మతలన్నీ తొలగిపోయేవి. దర్శకుడు
ఇంటర్వెల్ దగ్గర కథకి హాని చేసే హీరో రోల్
రివర్సల్ ట్విస్ట్ ఇచ్చేకన్నా – సినిమా ముగింపులో అన్నెం పున్నెం ఎరుగని అమాయకుడు
కృష్ణ ముంబాయికి పెద్ద మాఫియాగా మారే రోల్ రివర్సల్ ఇంకా బాగా పేలేది!
-సికిందర్