రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, జులై 2023, శనివారం

1349 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్
తారాగణం : సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ, గారీ ఓల్డ్ మాన్, కెనెత్ బ్రనగా, టామ్ కాంటీ తదితరులు
సంగీతం : లుడ్విగ్ గోరన్సన్, ఛాయాగ్రహణం : హయ్ట్ వాన్ హయ్టెమా 
బ్యానర్స్ : సింకాపీ ఇన్ కార్పొరేషన్, అట్లాస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు: ఎమ్మా థామస్, ఛార్లెస్ రోవెన్, క్రిస్టఫర్ నోలన్
విడుదల : జులై 21, 2023
***

ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ఒపెన్ హైమర్ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైంది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తర్వాత టాప్ పొజిషన్లో వున్న నోలన్ సినిమా అంటే అంతర్జాతీయంగా ప్రేక్షకులు విరగబడి చూస్తారు. తీసింది 12 సినిమాలే అయినా వాటిలో ఒక్క టెనెట్ (2020) తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లే. సైన్స్ ఫిక్షన్లు ఎక్కువ తీసే నోలన్ తాజాగా బయోపిక్ ప్రయత్నించాడు. అణుబాంబు సృష్టికర్త జూలియస్ రాబర్ట్ ఒపెన్ హైమర్ జీవి చరిత్రని ఎపిక్ బయోగ్రఫికల్ థ్రిల్లర్ అంటూ అందించాడు.


దీంతో సహజంగానే జపాన్ ని ధ్వంసం చేసిన అణుబాంబు సృష్టికర్త ఒపెన్ హైమర్ గురించి దృశ్యాత్మకంగా చూసి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నోలన్ ఫ్యాన్స్ కేర్పడింది. ఓపెనింగ్స్ తోనే 45-50 మిలియన్ డాలర్ల బాక్సాఫీసుతో విజయవంతంగా నిలిచిన ఈ మూవీ బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు. ఇది లాభాలార్జించాలంటే 400 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు రాబట్టాలని అంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? ఈ మూవీ మిగిలిన నోలన్ సినిమాల్ని తలదన్నేలా వుందా? అన్ని  వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే మేకింగ్ తో వుందా? ఈ విషయాలు పరిశీలిద్దాం...

కథ

రాబర్ట్ జే ఒపెన్ హైమర్ అలియాస్ ఒప్పీ (సిలియన్ మర్ఫీ) అమెరికాలో జన్మించిన యూదు. 1927 లో జర్మనీలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది, అమెరికా వచ్చి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా చేరుతాడు. ఇక్కడ క్వాంటం మెకానిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖల్లో చేస్తున్న కృషిని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీంతో  మన్హట్టన్ ప్రాజెక్ట్లో సైంటిస్టుగా నియమిస్తుంది. ఇలావుండగా మరోవైపు జీన్ టట్లక్ (ఫ్లారెన్స్ పాగ్) అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూంటాడు. మన్హట్టన్ ప్రాజెక్టు నుంచి బదిలీ అయి న్యూ మెక్సికోలోని  లాస్ అలమోస్ లాబొరేటరీకి డైరెక్టర్గా నియమితుడవుతాడు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ జనరల్ లెస్లీ గ్రోవ్స్ (మాట్ డామన్) జర్మనీ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రారంభించిందని వెలుగులోకి వచ్చిన సమాచారంతో,  ఒప్పీ ని  అణ్వాయుధ తయారీకి ఆదేశిస్తాడు.
        
దాంతో ఒప్పీ టీమ్ ని ఏర్పాటు చేసుకుని ఆటంబాంబు తయారు చేసి విజయవంతంగా పరీక్ష జరుపుతాడు. ఆ తర్వాత ఒప్పీకి చెప్పకుండా అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ (గేరీ ఓల్డ్ మాన్) 1945 ఆగస్టు 6 న, మళ్ళీ 9 న ఒకటి కాదు, రెండు ఆటం బాంబులు జపాన్ లోని హీరోషిమా, నాగసాకి లపై ప్రయోగించాలని ఆదేశించడంతో ఒప్పీ బెదిరిపోతాడు. జపాన్లో జరిగిన బీభత్సానికి ట్రూమన్ ని నిలదీస్తాడు. ఇక్కడ్నించీ ఒప్పీకీ ప్రభుత్వానికీ సంబంధాలు చెడి, ఒప్పీ మీదే కోర్టు విచారణకి దారితీస్తుంది.
        
ఈ నేపథ్యంలో ఒప్పీపై ప్రభుత్వం చేసిన ప్రత్యారోపణ ఏమిటి? ఒప్పీ కమ్యూనిస్టు సానుభూతి పరుడనేది నిజమేనా? ఒప్పీ తను నిర్దోషియని ఎలా నిరూపించుకున్నాడు? అణుబాంబు ప్రయోగం తర్వాత ఒప్పీ ఎందుకు పశ్చాత్తాపం చెందాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

అమెరికన్ ప్రొమీథియస్ అని 2005 లో కై బర్డ్, మార్టిన్ షెర్విన్ లు రాసిన ఒపెన్ హైమర్ బయోగ్రఫీ ఈ మూవీ కాధారం. క్రిస్టఫర్ నోలన్ తన స్టయిల్లో బయోపిక్‌ని తెరపై చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా కథ అయినప్పటికీ క్లాసిక్ నోలన్ మూవీగానే కన్పిస్తుంది. నోలన్ ఇష్టపడే నాన్ లీనియర్ కథనం, విభిన్న కలర్ స్కీములు, ఒప్పీ  మానసిక స్థితిని చిత్రించడానికి మాంటేజ్‌లతో వివరణాత్మక కథనం మొదలైన నోలన్ నుంచి ఆశించే ప్రతిదీ వుంటాయి- ఒక్క కమర్షియల్ ఎలిమెంట్లు తప్ప.
        
సినిమా విడుదలకి ముందు ఇది హార్రర్ జానర్ అని ప్రకటించి సంచలనం రేపాడు నోలన్. ఇంత ప్రతిష్టాత్మక సినిమా చీప్ గా హార్రర్ ఏమిటని అభిమానులు నొచ్చుకున్నారు. చెప్పినట్టుగానే నోలన్ ఇష్టపడే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోబాటు, పొలిటికల్ డాక్యుమెంటరీ ఆనవాళ్ళు లేకుండా దాదాపు హార్రర్ గానే ఈ బయోపిక్ వుంది. జపాన్ మీద ప్రయోగించిన అణుబాంబు తాలూకు హార్రర్ కాదిది- దీని పర్యవసానంగా ఒప్పీ అనుభవించే హార్రర్. ఇది ఆటంబాంబు దాడి కథ కాదు. ఒప్పీ అనుభవించే భయానక మానసిక స్థితి కథ. అతడి మేధకీ, హృదయానికీ మధ్య సంఘర్షణ. లక్షల మంది అమాయకుల్ని బలిగొన్న ఆటంబాంబుని కనుగొన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయాణం ఈ కథ.
        
అయితే సాంకేతికంగా ఇది కథ కాదు, గాథ. అందువల్ల రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా నాయకుడు- ప్రతినాయకుడు- సంఘర్షణ అనే యాక్షన్ థ్రిల్లర్ గా వుండదు. ఇది ఒక జీవిత చరిత్ర కావడంతో ఒప్పీ జీవితపు ముఖ్య సంఘటనల సంపుటిగా, డైరీగా  మాత్రమే ఇది వుంటుంది. ఇక్కడ నోలన్ అభిమానులు నిరాశపడతారు. ఇది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే యాక్షన్ థ్రిల్లర్ గాక, మూడు గంటల సేపు సాగే డైలాగు డ్రామా. క్యారక్టర్ స్టడీ. దీన్ని థ్రిల్స్, సస్పెన్స్, యాక్షన్ కోరుకుని చూస్తే మాత్రం అణుబాంబు మీద పడ్డట్టే వుంటుంది. 
        
ఫస్టాప్ మందకొడిగా సాగుతుంది ఒప్పీ వృత్తిగత, వ్యక్తిగత జీవిత చిత్రణతో. దీన్ని చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అతడి శృంగార జీవితం కూడా కలుపుకుని పాయింటుకి రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆటం బాంబు తయారీ దగ్గర్నుంచి ఆసక్తి పెరిగేలా చేసి, ఆటంబాంబు ప్రయోగంతో అసలు కథలోకి తీసికెళ్ళాడు నోలన్.
        
జపాన్ మీద అణుబాంబు ప్రయోగానికి ఎదురుతిరిగే ఒప్పీతో సెకండాఫ్ కథ వుంటుంది. కమ్యూనిస్టు అనే అనుమానంతో అతడ్నే ప్రభుత్వం దోషిగా నిలబెట్టడంతో డ్రామా ఊపందుకుంటుంది. అధికారులు చుట్టు ముట్టి జరిపే ఈ విచారణ భావోద్వేగ భరితంగా వుంటుంది. మరోపక్క అణుబాంబు కనిపెట్టిన పాపిగా ఒప్పీ అనుభవించే మనోవేదన గుండెల్ని కదిలిస్తుంది. ముగింపు భావోద్వేగాల పతాక సన్నివేశాలతో కట్టి పడేస్తుంది. అణుబాంబు పితామహుడు ఒపెన్ హైమర్ సంక్షుభిత మనస్థితిని దర్శించాలంటే ఈ బయోపిక్ ని ఒక దృశ్యమాధ్యమం రూపంలో తన మేధస్సుతో అనితర సాధ్యంగా అందించాడని చెప్పాలి దర్శకుడు క్రిస్టఫర్ నోలన్.

నటనలు -సాంకేతికాలు

ఒపెన్ హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీకి ఆస్కార్ నామినేషన్‌ తప్పనిసరి అని అప్పుడే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నామినేషనే కాదు, ఆస్కార్ ప్రతిమనూ సొంతం చేసుకుంటాడు. మరే ఇతర నటుడూ సాధించలేని ఔన్నత్యాన్ని అతను దాదాపు సాధించినట్టు కన్పిస్తాడు. ఎందరో నటులకి అతనొక గైడ్ గా కన్పించినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అతడి హావభావాల్ని, ముఖకవళికల్ని కెమెరా జూమ్ చేసి పట్టుకున్న తీరు ఇంతవరకు ఏ సినిమాలోనూ చూసి వుండం. అతడి నిస్సహాయత, ఆక్రోశం, ఆందోళన, పాప భీతి... ఒకటేమిటి, ప్రతీదీ హార్రర్ గా చేసి ప్రేక్షకుల మీదికి విసిరేదే. ఇది జపాన్ మీద అణుబాంబు దాడి కథ కాదు, అణుబాంబులా విస్ఫోటించే  సిలియన్ మర్ఫీ అభినయపు గాథ.
        
ఇంకా ఇందులో ఎన్ని పదుల పాత్రలున్నాయో చెప్పలేం. ఏ పాత్రలో ఎవర్ని చూస్తున్నామో కూడా పట్టుకోవడం కష్టం. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గా టాం కోంటీ, మరో శాత్రవేత్త నీల్స్ బోర్ గా కెన్నెత్ బ్రనగా (ఈయన 2018 లో అగాథా క్రిస్టీ నవల మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్ ని దర్శకుడుగా తెరకెక్కించాడు), అమెరికా ప్రెసిడెంట్ హారీ ట్రూ మన్ గా గేరీ గోల్డ్ మాన్, లెఫ్టినెంట్ జనరల్  లేస్లీ గ్రోవ్స్ గా మాట్ డామన్‌ మాత్రం  గుర్తుంటారు.
        
సాంకేతికంగా లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం థియేటర్ సౌండ్ సిస్టమ్ లో కట్టిపడేస్తుంది. సన్నివేశాల్లో సంగీతం ఇంకి పోయి, ఎదురుగా నిజంగానే సంఘటనలు జరుగుతున్నాయా అన్నట్టు వుంటుంది. రిచర్డ్ కింగ్ సౌండ్ డిజైన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హయ్ట్ వాన్ హయ్టెమా ఛాయాగ్రహణం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా క్లోజప్ షాట్లు కథనాన్ని మనస్సుల్లో ముద్రించేస్తాయి. రూత్ డి జోంగ్ పీరియడ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంకో అద్భుతం. ఎల్లెన్ మిరోజ్నిక్ రూపొందించిన దుస్తులు ఇంకో హైలైట్. ఇక జెన్నిఫర్ లేమ్ ఎడిటింగ్ మాత్రం ఈ పూర్తి స్థాయి డైలాగ్ డ్రామాని గేట్లు తెరిచి వదిలేసి నట్టుంది మూడు గంటల సేపూ.
        
పోతే, అణుపరీక్ష నిర్వహించే సీను గ్రాఫిక్స్ వాడకుండా నిజదృశ్యం చూస్తున్నట్టు క్రియేట్ చేయగల్గడం క్రిస్టఫర్ నోలన్ కళాదృష్టికి ఓ చిన్న మచ్చు తునక.
—సికిందర్


20, జులై 2023, గురువారం

1348 : రివ్యూ!

 


రచన-దర్శకత్వం: అనిల్ కృష్ణ కన్నెగంటి
తారాగణం : అశ్విన్ బాబు, నందితా శ్వేత, సాహితీ అవంచ, విద్యుల్లేఖా రామన్, సంజయ్ స్వరూప్,రాజీవ్ కనకాల శుభలేక సుధాకర్, శ్రీనివాస రెడ్డి, రఘు కుంచె తదితరులు
సంగీతం: వికాస్ బాడిస, ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్
సమర్పణ : అనిల్ సుంకర, బ్యానర్: ఎస్వీకే సినిమాస్, నిర్మాత: గంగపట్నం శ్రీధర్
విడుదల తేదీ :  జూలై 20, 2023
***

        వారం ట్రైలర్స్ తో, ప్రమోషన్స్ తో ఉత్కంఠ రేపిన హిడింబ అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజుగారి గది హార్రర్ కామెడీల్లో నటించి పరిచయమైన అశ్విన్ బాబు ఈ సారి వైవిధ్యమున్న సినిమాలో నటించడం, అదీ యాక్షన్ హీరోగా కొత్త మేకోవర్ రో ప్రత్యక్షమవడం ఆసక్తి కల్గించే విషయమే. అయితే ఈ ప్రయత్నంలో వైవిధ్యం ఎంత వరకూ వుంది? ప్రచార ఆర్భాటం ఎంతవరకూ సబబన్పించుకుంది? ఇవి పరిశీలిద్దాం...  

కథ

అభయ్ (అశ్విన్ బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీసు ట్రైనింగ్ పొందుతున్న సమయంలో ప్రేమలో పడి తర్వాత విడిపోతారు. అభయ్ నగరంలో ఎస్సైగా పని చేస్తూంటాడు. నగరంలో యువతులు సీరియల్ కిడ్నాప్స్ కి గురవుతూంటారు. ఈ కేసుని దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం కేరళ నుంచి ఆద్యాని పిలిపిస్తుంది. ఆద్య ఇప్పుడు ఐపీఎస్. కేసులో ఆమెకి సహాయంగా అభయ్ ని నియమిస్తుంది ప్రభుత్వం. ఇద్దరూ దర్యాప్తు చేసి కాలా బండలో బోయ అనే క్రిమినల్ ని పట్టుకుని యువతుల్ని విడిపిస్తారు.      

అయినా ఇంకో యువతి కిడ్నాప్ అయ్యేసరికి, మిస్సయిన 16 మంది యువతులు వేరని, బోయ బంధించిన యువతులు వేరనీ గుర్తిస్తుంది ఆద్యా. అంతే గాక ఆ కిడ్నాపర్ ఎరుపు దుస్తులేసుకున్న యువతుల్ని అపహరిస్తున్నాడని తెలుసుకుంటుంది. ఎవరా కిడ్నాపర్? ఎక్కడున్నాడు? అండమాన్ దీవుల్లో ఆదిమ జాతి హిడింబకి ఈ కిడ్నాప్స్ తో వున్న సంబంధమేమిటి? ఈ కేసుని ఎలా ఛేదించారు ఆద్యా, అభయ్? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

హార్రర్ జానర్ లో సబ్ జానర్ కిందికి కానబలిజం (నరమాంస భక్షణ) సినిమాలొస్తాయి. 1965 -1980 ల మధ్య హాలీవుడ్ నుంచి విపరీతంగా కానబలిజం సినిమాలొచ్చాయి. దాన్ని కానబలిజం బూమ్ అన్నారు.1965 లో నేకెడ్ ప్రే తో ఈ బూమ్ ప్రారంభమయింది. శ్వేత జాతీయుడ్ని ఆఫ్రికన్ నరమాంస భక్షక తెగ వెంటాడి పట్టుకుని తినేసే కథతో ఈ సినిమా తీశారు. తర్వాత ఈ టెంప్లెట్టే  నరమాంస భక్షక థ్రిల్లర్స్ కి బ్లూప్రింట్గా మారింది. అరణ్యంలో టూర్ కెళ్ళి నరభక్షకుల పాలబడి తప్పించుకురావడంగా, లేదా బలై పోవడంగా ఈ కథలుంటాయి.
       
1980 లలో బూమ్ ముగిసినా
, తర్వాత  అడపాదడపా ఈ తరహా సినిమాలు వస్తూనే వున్నాయి. తమిళంలో 2010 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ నటించిన ఆయిరత్తిల్ ఒరువన్ (వెయ్యి మందిలో ఒక్కడు) వచ్చింది. దీన్ని చోళ రాజుల నాటి చారిత్రక నేపథ్యంలో తీశారు.
       
నరమాంస భక్షణతో జుగుప్స
, వికారం, గగుర్పాటు కల్గించే కానబలిజం సినిమాలన్నీ హార్రర్ సబ్ జానర్స్ కి  పరాకాష్ఠ. మన దేశంలో కేవలం అండమాన్ దీవుల్లోని ఒక దీవిలో జరావా అనే తెగ ఏకైక నరభక్షక తెగగా వుంది. నిజానికి అండమాన్ దీవుల్లో వున్న ఆదిమవాసులు పదివేల సంవత్సరాల క్రితం మానవావిర్భావం జరిగిన ఆఫ్రికా నుంచి ఒక పాయగా విడిపోయి వచ్చి అండమాన్స్ లో స్థిరపడ్డారు. మరి కొందరు వివిధ ఖండాలకి వలస పోయారు. అండమాన్స్ కి వచ్చిన సమూహాలు  ఉపఖండమంతా విస్తరించారు. కాబట్టి మన పూర్వీకులు ఇప్పుడు అండమాన్స్ లో నివాసమున్నఆదిమ తెగలేనని శాస్త్రవేత్తలు తేల్చారు. మనమంతా వాళ్ళమే!!
        
అక్కడ వుంటున్న సంతతి నాగరిక ప్రపంచంలోకి రారు. నాగరికులు వెళ్తే ప్రతిఘటిస్తారు. ప్రభుత్వాలు వాళ్ళని నాగరిక ప్రపంచంలోకి తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ ప్రయత్నాల్లో కొందరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అలాటి ప్రయత్నం చేస్తే తెగలు చంపేస్తాయి. ప్రభుత్వం ఆ ప్రాంతం టూరిస్టులకి నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది.
       
ఇప్పుడు నరభక్షక జరావా తెగకి హిడింబా అనే కల్పిత పేరు పెట్టి ఈ సినిమా తీసినట్టున్నారు. అయితే జరావా తెగ పరాయివాళ్ళు తమవైపు వస్తే ప్రాణాలు తీస్తారేమోగానీ
, వాళ్ళు నాగరిక ప్రపంచంలోకి వచ్చి మనుషుల్ని ఎత్తుకుపోయి తినరు. ఈ దృష్ట్యా ఈ కథ అసహజంగానే గాక, జరావా తెగపట్ల, మన మూలాల పట్లా అన్యాయంగానూ అన్పిస్తుంది.
       
కాన్సెప్ట్ ఇలావుంటే దీంతో చేసిన కథ అమెచ్యూరిష్ గా వుంది. పైగా గతంలో జ రిగింది
, వర్తమానంలో జరిగింది నాన్ లీనియర్ కథనం (మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్) తో చెప్పడం చాలా గందరగోళానికి దారితీసింది. ఫస్టాఫ్ కేవలం కిడ్నాపులు, దర్యాప్తు- వీటితోనే సాగుతూ, ఈ దర్యాప్తు కూడా పేలవంగా, అర్ధరహితంగా, లాజిక్ లేకుండా సాగడంతో, మధ్యమధ్యలో ఆసక్తి కల్గించని లవ్ ట్రాక్ వచ్చి జొరబడడంతో -ట్రైలర్స్, ప్రమోషన్స్ హంగామా అంతా తాటాకు చప్పుళ్ళేనని స్పష్టమైపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ఏ మాత్రం వైవిధ్యంలేని పాత మూస ఫార్ములా చిత్రణగా తేలిపోతుంది.
       
ఇక సెకండాఫ్ లో అసలు కథలో కొచ్చాకైనా కథనం దారిలో పడదు. రెండు ట్విస్టులు మాత్రం బావుంటాయి.
అండమాన్ దీవుల్లోని హిడింబా తెగ కథకి ముడిపెడుతూ చూపించిన ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత క్లయిమాక్స్ కి ముందు అంతరించిపోయిన హిడింబ తెగ మిగిలున్న వారసుడు రివీలయ్యే ట్విస్టూ మంచి బ్యాంగ్ నిస్తాయి. వీటితో ఈ కానిబాలిజం థ్రిల్లర్ మంచి థ్రిల్ నిస్తుంది. ఈ రెండు బలమైన పాయింట్లు చేతిలో వుంచుకుని వీటిని ప్లే చేసే విషయంలో దర్శకుడు ఎందుకు ఫెయిలయ్యాడో హిడింబాలకే తెలియాలి.
       
ఈ కాన్సెప్ట్ లో విషయముంది. ఎలా చెప్పాలో తెలియక వీగిపోయింది. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు
, కాలా బండలో కేజీఎఫ్ టైపు యాక్షన్ సీన్లు, సెకండాఫ్ లో యాక్షన్ సీన్లూ- వీటితో హడావిడి చేస్తే లోపాలు కవరై పోతాయనుకున్నట్టుంది- ఇంకా చూడడానికి జుగుప్స కల్గించే దృశ్యాల వల్లా – ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకూ రాని సినిమా చూసినట్టు ప్రేక్షకులు ఫీలై పోతారనుకున్నట్టుంది- అంత సీను మాత్రం లేదు. ఈ బీభత్సాన్ని బోయపాటి శ్రీను తీసివుంటే ఇంకోలా వుండేది. అన్నట్టు ఈ సినిమాలో బోయపాటిని అనుకరించడమూ వుంది.

నటనలు-సాంకేతికాలు

అశ్విన్ బాబు మేకోవర్ తో యాక్షన్ సీన్స్ కి తప్ప, ఎమోషనల్ సీన్స్ కి సరిపోలేదు. క్లయిమాక్స్ ట్విస్ట్ ని మాత్రం బాగా హేండిల్ చేయగలిగాడు. కానీ క్లయిమాక్స్ యాక్షన్ సీన్లు అతడితో చాలా అతి అన్పిస్తాయి బోయపాటి లెవెల్ తో. ఇక పోలీసు అధికారిగా ఫస్టాఫ్ లో నటన ఫరవాలేదుగానీ, ఆ దర్యాప్తులో విషయం లేక తేలిపోయాడు.  అలాగే రోమాంటిక్ సీన్స్ లో. ఐపీఎస్ గా నందితది మాత్రం పాత్రని నిలబెట్టే నటన. టాలెంట్ వున్న నటి.
       
ఇతర నటుల్లో మకరంద్ దేశ్పాండే పాత్ర
, నటన బలమైన ముద్ర వేస్తాయి. సహాయ పాత్రల్లో ఇతర నటులు కథకి తగ్గట్టు వుంటారు- అది కథ అనుకుంటే. సంగీతం లౌడ్ గా బి గ్రేడ్ సినిమా టైపులో వుంటే, ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వుంటాయి.
       
తొలిసారిగా కానబలిజం సినిమా చూపిస్తున్నప్పుడు జానర్ మర్యాదలు పాటించకుండా మూస ఫార్ములా ధోరణిలో చుట్టేయడం
, క్లయిమాక్స్ తో కాన్సెప్ట్ నిలబడినా ముగింపుని నిర్లక్ష్యం చేయడం వంటి కారణాలతో హిడింబ  చేజారిన యూనిక్ జానర్ గా మిగిలింది...

—సికిందర్


11, జులై 2023, మంగళవారం

1347 : స్పెషల్ ఆర్టికల్


    దేశంలో బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ పడిపోవడంతో బాటు, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 333 కోట్ల నికర నష్టాన్ని చవి చూడడంతో, ఇక  కొరియన్ సినిమాలపై దృష్టి పెట్టింది దేశంలోనే పెద్దదైన పీవీఆర్ -ఐనాక్స్ పిక్చర్స్ మల్టీప్లెక్స్ సంస్థ. ఇందుకు ప్రారంభ చిత్రంగా కొరియన్ - అమెరికన్ మూవీ పాస్ట్ లైవ్స్ అనే రోమాంటిక్ డ్రామాని గత శుక్రవారం (జులై 7) దేశ వ్యాప్తంగా 70 స్క్రీన్ లలో విడుదల చేసింది.     భారతీయ చలనచిత్ర పరిశ్రమ 2022 లో 2.4 కోట్ల మంది ప్రేక్షకుల్ని  కోల్పోయిందని మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ వెల్లడిస్తోంది. దీని ప్రకారం, జనవరి-డిసెంబర్ 2022 మధ్య, భారతదేశంలో కేవలం 12.2 కోట్ల మంది థియేటర్ ప్రేక్షకులు వున్నారు. ఇదే 2019 లో మహమ్మారికి ముందు, కనీసం ఒక థియేటర్‌లో ఒక సినిమా చూసిన వారు 14.6 కోట్ల మంది వున్నారు. ప్రేక్షకుల తగ్గుదల ఆదరణ కోల్పోతున్న హిందీ సినిమాల కారణంగానే జరుగుతోందని గుర్తించిన పీవీఆర్- ఐనాక్స్,  ప్రత్యామ్నాయ  సినిమాల్ని అన్వేషించి, కొరియన్ డ్రామాల్ని దేశంలోకి తీసుకురావాలని నిర్ణయించింది.

    క్షిణ కొరియా కె- డ్రామా అనే కొరియన్ డ్రామా సినిమాలకి ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి ఆదరణ వుంది. అనేక కొరియన్ డ్రామాల్ని తెలుగులో కాపీకొట్టి కూడా తీశారు. తీయరాక ఫ్లాప్స్ చేశారు. కొరియన్ డ్రామాలు అధికంగా రోమాంటిక్ డ్రామాలుగా వుంటాయి. ఇతర జానర్స్ లో యాక్షన్ డ్రామాలు, హిస్టారికల్ డ్రామాలు, స్కూల్ డ్రామాలు, మెడికల్ డ్రామాలు, లీగల్ డ్రామాలు, హార్రర్ కామెడీలు వంటివి వుంటాయి. ఇవన్నీ లోతైన భావోద్వేగాల ఇతివృత్తాలతో కూడి వుంటాయి. స్నేహంకుటుంబ విలువలు,  ప్రేమపాశ్చాత్య భౌతికవాదం, వ్యక్తివాదంతో వాళ్ళ సాంప్రదాయ కన్ఫ్యూషియస్ దార్శనికతని కలపడం - వంటి అంశాల చుట్టూ ఇతివృత్తాలుంటాయి.

        
కె- సంస్కృతి కాన్సెప్టు ప్రపంచవ్యాప్తంగా విస్ఫోటించిందని, సినిమా ప్రదర్శన -పంపిణీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీవీఆర్ - ఐనాక్స్ వంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్ఫోటించిన ఈ స్పష్టమైన దృగ్విషయాన్ని ఆమోదించడాన్ని విస్మరింప జాలదనీ ఒక ప్రకటనలో తెలిపింది.
       
కె- డ్రామాల పట్ల ప్రేక్షకాదరణ
పెరగడంతో పాటు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి విరివిగా ఇవి అందుబాటులోకి రావడం, ప్రేక్షకులు భాషల అడ్డంకిని కూడా తొలగించుని వీటిని ఎంజాయ్ చేయడం గమనిస్తే, ఈ దృష్టాంతం పరిపక్వత చెందిన  ప్రేక్షక వర్గాన్ని మెండుగా సృష్టిస్తున్నట్టు అర్ధమవుతోందనీ ప్రకటనలో తెలిపింది. టిక్కెట్ల అమ్మకాల పరంగా చూస్తే, మహమ్మారి తర్వాత అంకెలు, మహమ్మారి కంటే ముందున్న స్థాయుల కంటే దాదాపు 25 శాతం తక్కువున్నాయనీ, హిందీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడం ఇందుకు కారణమనీ సంస్థ పేర్కొంది.
       
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గత ఏప్రెల్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం
,
మహమ్మారి అనంతర సంవత్సరాల్లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ, అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమ రెండూ కలిసి హిందీ సినిమాల అధిపత్యంపై తిరుగుబాటు చేశాయి. ఇది హిందీ సినిమాల నాణ్యతని ప్రశ్నించినట్టయ్యింది.  
       
ఇంకో వైపు
, ఓటీటీలు వచ్చేసి విదేశీ కంటెంట్ కి సులభంగా యాక్సెస్‌ ని అందించినప్పటికీ, 2022 లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఆదాయాలు దాదాపు రెండింతలు పెరిగి రూ. 7,000 కోట్లకు చేరుకున్నాయి. ఈ మొత్తం పాన్-ఇండియన్ చలనచిత్ర పరిశ్రమ ఆదాయాలలో 52 శాతం వాటాని క్లెయిమ్ చేస్తోంది.
       
రానున్న నెలల్లో పరిస్థితిలో మార్పు కనిపించవచ్చని పీవీఆర్- ఐనాక్స్ భావిస్తోంది.
యానిమల్’, ‘జవాన్’, ‘టైగర్ 3’, డుంకీ వంటి బిగ్ స్టార్ సినిమాలు వచ్చే రెండు  త్రైమాసికాల్లో క్యూలో వున్నట్టు పేర్కొంది.
       
పీవీఆర్ -
ఐనాక్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 'సుజామ్' అనే కొరియన్ యానిషన్ ని  విడుదల చేసింది. ఇది రూ. 10  కోట్ల బిజినెస్ చేసింది. తాజాగా గతవారం విడుదల చేసిన కె- డ్రామా 'పాస్ట్ లైవ్స్' ఓపెనింగ్స్ రూ. 5 కోట్లు రావడంతో ప్రోత్సాహకర వాతావరణం కన్పిస్తోంది. కొరియన్ సినిమాలని విస్మరించడం చాలా కష్టమనీ, భాషతో సంబంధం లేకుండా కొరియన్ సినిమాలు పాపులర్ అవుతున్నాయనీ, ఓటీటీలు కొరియన్ సినిమా సామర్థ్యాన్ని గుర్తించడం పీవీఆర్ - ఐనాక్స్ కి ఎంతో తోడ్పడిందనీ సంస్థ ప్రశంసించింది.

సెలిన్ సాంగ్ అనే కొత్త దర్శకురాలి
పాస్ట్ లైవ్స్ 24 సంవత్సరాల క్రితం విడిపోయిన ఇద్దరు చిన్ననాటి స్నేహితుల (అమ్మాయి- అబ్బాయి) మధ్య వారి సంబంధాన్ని, సొంత జీవితాల్ని, ఎడబాటు బాధనీ సంకలనం చేస్తూ, పునః కలయికని ప్రతిపాదించే ఓ సున్నిత ప్రేమ కథ.

—సికిందర్

 

 

10, జులై 2023, సోమవారం

1346 : రివ్యూ!


 దర్శకత్వం : సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్  తారాగణం : పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్, రషీద్ నాజ్, అశోక్ పాఠక్ తదితరులు 
రచన : అనిల్ పాండే, ఛాయాగ్రహణం : చిరంతన్ దాస్
బ్యానర్స్ : సారధి ఎంటర్ టైన్మెంట్, ఎలియెన్స్ పిక్చర్స్

నిర్మాతలు : గులాబ్ సింగ్ తన్వర్, అశోక్ పండిత్, కిరణ్ డాగర్, అనిరుధ్ తన్వర్
విడుదల : జులై 7, 2023
*** 

టీవలి కాశ్మీర్ ఫైల్స్’, ది కేరళ స్టోరీ ప్రాపగండా సినిమాల కోవలో 72 హూరే విడుదల సైతం వివాదాలు రేపింది. వివాదం కొద్దీ వసూళ్ళు సాధిస్తున్న ఈ రకమైన సినిమాలు మంచి వ్యాపార వస్తువుగా మారాయి. 72 హూరే (72 అందమైన కన్యలు)  ట్రైలర్ కి క్లియరెన్స్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించడంతో మరింత వివాదం, ప్రచారం క్రియేటయ్యాయి. 2019 లోనే ఈ సినిమాకి సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు, ఇప్పుడు ట్రైలర్ కి నిరాకరించడం కేవలం వివాదాన్నిసృష్టించి, ప్రేక్షకుల దృష్టి నాకర్షించడానికి చేసిన ప్రయత్నమేనని విమర్శలు వచ్చాయి. 2019 లో సెన్సారై, జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డు కూడా పొందింది. మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా పొందింది. కానీ థియేట్రికల్  విడుదలకి నోచుకోలేదు. కారణం ఇది 80 నిమిషాల కళాత్మక సినిమా కావడమే. ప్రస్తుత మాస్ ప్రాపగండా సినిమాల ట్రెండ్ లో కళాత్మకంగా తీసి విడుదల చేస్తే ఓపెనింగ్స్ కూడా లేవు. కేవలం 8.98 శాతం ఆక్యుపెన్సీతో, 35 లక్షలు మాత్రమే వసూలు చేసింది 10 భాషల్లో.

        ఇంతకీ ఏమిటీ 72 హూరే’? టెర్రరిస్టు నాయకులు యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి ఆత్మాహుతి దాడులకి పురిగొల్పే మంత్రం ఇది. ఆత్మాహుతి దాడులకి పాల్పడి మనుషుల్ని చంపితే, స్వర్గంలో 72 మంది అందమైన కన్యలతో సుఖ భోగాలు లభిస్తాయనీ మతపరంగా నమ్మించి పబ్బం గడుపుకుంటున్న వైనాన్ని ఈ సినిమా చిత్రిస్తోంది.
       
ఒక పాకిస్తానీ మౌల్వీ ఇలా బ్రెయిన్ వాష్ చేయడంతో
, ఇద్దరు పాక్ టెర్రరిస్టులు హకీం (పవన్ మల్హోత్రా), బిలాల్ (అమీర్ బషీర్) ముంబాయి చేరుకుని గెట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడతారు.  అయితే బిలాల్ అక్కడి జనసమూహంలో పిల్లా పాపలతో వున్న మనుషుల్ని చూసి మనసొప్పక వెనకడుగు వేస్తే, హకీం బాంబు పేల్చుకుంటాడు. ఈ పేలుడులో చాలామంది జనాలతో బాటు బిలాల్ చచ్చిపోతాడు.
       
చచ్చిపోయాక చూస్తే స్వర్గం వుండదు
, అందమైన కన్యలూ వుండరు. చీకటి సొరంగంలోకి ప్రయాణం...దీంతో మౌల్వీ మోసం చేశాడని అర్ధం జేసుకుంటారు. వాళ్ళ ఆత్మలు తిరుగాడుతూ మృతుల, బాధితుల పరిస్థితిని చూసి చలిస్తాయి. పశ్చాత్తాప పడతాయి. మౌల్వీ మన బతుకుల్నీ చావుల్నీ నాశనం చేశాడు అని కుమిలిపోతారు (వెళ్ళి మౌల్వీ ని తమతో లాక్కొస్తే సరిపోయేది).

ఇలా నమ్మి టెర్రరిజం లోకి వెళ్ళే యువకులకి సందేశం ఈ సినిమా. అంతేగానీ ప్రాపగండా మూవీ కాదు. ఏ మతాన్నీ టార్గెట్ చేయలేదు. బాంబు దాడిలో టెర్రరిస్టుల స్వమతస్తులు కూడా చనిపోతారు. దర్శకుడు ఏ ఒకరి పక్షం వహించడం లేదనీ సూచించే దృశ్యాలు పదే పదే వస్తూంటాయి. సెక్యులరిజం సరేగానీ
, ఎందుకో కంగారుపడిపోయి అతి సెక్యులరిజాన్ని ప్రదర్శిస్తాడు. 2019 లో ఈ సినిమా తీసినప్పుడు ఎజెండా లేదు కాబట్టేమో.
       
అయితే ఇదంతా సామాన్య ప్రేక్షకుల శక్తికి మించిన కళా ప్రదర్శన. సింబాలిజమ్స్ తో
, స్లోమో డ్రామాతో, నాన్ లీనియర్ నేరేషన్ తో, ఫాంటసీ తో, మేధావులకి మాత్రమే అర్ధమయ్యే ఇంటలెక్చువల్ సినిమా. 80 నిమిషాల ఈ సినిమాలో 10 నిమిషాలు పోతే మొత్తమంతా బ్లాక్ అండ్ వైట్ చిత్రీకరణతో వుంటుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రీకరణలో కొన్ని వస్తువులు ఎరుపులో కన్పిస్తాయి. స్టీవెన్ స్పీల్బెర్గ్ నాజీల దురాగతాల మీద బ్లాక్ అండ్ వైట్ లో తీసిన షిండ్లర్స్ లిస్ట్ లో, సైనికులతో బాటు నడిచే ఎరుపు దుస్తుల బాలికలా.
       
బాంబు దాడి దృశ్యాలు చాలా హృదయవిదారకంగా వుంటాయి. సంభాషణలు కరకుగా వుంటాయి. మనం చూస్తున్నది హకీం
, బిలాల్ పాత్రలు కాదనీ, వాళ్ళ ఆత్మలనీ కథా క్రమంలో వెల్లడవుతుంది. దర్శకుడు
సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ కథనానికి, దృశ్యీకరణకీ చూపిన తెగువ టెర్రర్ గ్రూపులకి  సవాలు విసురుతున్నట్టు వుంటాయి. పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్ లు శక్తిమంతమైన నటనతో దర్శకుడి మెసేజ్ ని ప్రకటిస్తారు. ఉగ్రవాదానికి మూలకారణాల్ని పరిష్కరించాల్సిన తక్షణ అవసరం కోసం ఈ సినిమా అంటూ దర్శకుడు తన ఉద్దేశాన్ని వెల్లడించాడు.
—సికిందర్


9, జులై 2023, ఆదివారం

1345 : రివ్యూ!


 

 రచన - దర్శకత్వం : అజయ్ సామ్రాట్ 
తారాగణం : జగపతి బాబు, ఆశీష్ గాంధీ, గానవీ లక్ష్మణ్, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు
సంగీతం :  ఐస్ నావల్ రాజా, ఛాయాగ్రహణం : సంతోష్ శనమోనీ
నిర్మాత : రసమయి బాలకిషన్

విడుదల : జులై 7, 2023
***

***

        బాహుబలి మాటల రచయితల్లో ఒకరైన అజయ్ సామ్రాట్ దర్శకుడుగా మారి తీసిన రుద్రంగి 1940 లనాటి తెలంగాణ దొరల కథ. దీనికి రసమయి బాలకిషన్ నిర్మాత. నిజాం కాలంలో తెలంగాణా దొరల సినిమా అంటే ఒకే తరహా కథలతో తీసిన సినిమాలు మెదులుతాయి. మరి రుద్రంగి కూడా మరో ఆ తరహా కథేనా, లేక ఏమైనా తేడా గల కథా? జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ పీరియెడ్ తెలంగాణా మూవీ చరిత్రలోంచి నేటి కాలానికి చెబుతున్న నీతి ఏమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ  

దొర భీంరావు దేశ్ ముఖ్ (జగపతి బాబు) చుట్టు పక్కల ప్రజలకి టెర్రర్ లా వుంటాడు. అణిచివేసి, ప్రాణాలు తీసి, దొరతనం చెలాయిస్తూంటాడు. స్త్రీ వ్యామోహమెక్కువ. భార్య మీరాబాయి (విమలా రామన్) వుండగా, జ్వాలాబాయి (మమతా మోహన్ దాస్) అనే ఇంకో సంపన్నురాలిని పెళ్ళి చేసుకుని తెచ్చుకుంటాడు. ఆమె ఆడదానిగా కంటే మగవాడి ప్రతాపం చూపించే దానిలా వుండడంతో, నువ్వు ఆడదానివి కావని పక్కన పెట్టేస్తాడు. దీంతో ఆమె జీతగాడు మల్లేష్ (ఆశీష్ గాంధీ) మీద కన్నేస్తుంది. దొర మల్లేష్ మరదలి మీద కన్నేస్తాడు. ఎలాగైనా మల్లేష్ మరదలు రుద్రంగి (గానవీ లక్ష్మణ్) ని పడకలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మల్లేష్ తిరగబడి దీన్ని అడ్డుకోవడం మొదలెడతాడు. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

అదే అప్పటి తెలంగాణా దొరల టెంప్లెట్ కథ. ఏ 1940ల నాటి తెలంగాణా కథతో  సినిమా ఎప్పుడు తీసినా ఓ దొర, అతడి దౌర్జన్యాలు, చివరికి ప్రజల చేతిలో చావు- అనే మూసలోనే వుంటాయి. టైటిల్సే తేడా తప్ప, సినిమాలన్నీ ఒకటే. నేటి తరం ప్రేక్షకులకి సమీప చరిత్ర అయిన నక్సలిజం మీద తీసే సినిమాలే కనెక్ట్ కావడంలేదు, ఇక సుదూర చరిత్ర అయిన తెలంగాణా దొరల మీద సినిమాలు కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఈ సినిమాల్లో ఏం యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ వుంటాయని యువ ప్రేక్షకులు చూస్తారు?

దొరల సినిమాల్లో దొరలకి ఏ నీతీ చెప్పడం వుండదు. రుద్రంగి లో కూడా లేదు. ఆడవాళ్ళ మీద మీరు చేస్తున్న అత్యాచారాలు రేపు మీ వారసులు మిమ్మల్ని రోల్ మోడల్స్ గా తీసుకుని చేస్తే ముందు కాలంలో చాలా ఘోరాలు జరుగుతాయని- ఇప్పటి కాలంలో వాళ్ళ వారసుల్ని మాస్ రేపిస్టులుగా చూపిస్తూ దొరల కథలకి కలిపి చూపిస్తే - ఇప్పటి ప్రేక్షకులకి నాటి దొరల చరిత్ర మీద కుతూహల మేర్పడి కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది కథ. లేకపోతే కుతూహలానికి అవకాశమే లేదు.
       
ఒక కామాంధుడైన దొరకి అతడి బానిస బంటు బుద్ధి చెప్పే కథ
రుద్రంగి’. తెలిసిపోయే రొటీన్ కథా కథనాలతో, పాత్ర చిత్రణలతో, పోరాటాలతో, భీకరమైన అరుపులతో  బి సి సెంటర్ల మాస్ ప్రేక్షకుల సినిమాగా, ఇది నాటుగా కూడా వుంటుంది. అలాగే తెలంగాణా పీరియెడ్ సినిమా తీస్తూ అందులో ఇటీవల వచ్చిన కొన్ని తెలుగు సినిమాల కాపీ సీన్లే పెడితే, 1940 ల నాటి తెలంగాణా చరిత్ర అనే స్వచ్ఛతని కూడా కోల్పోయింది కథ. బాహుబలి రచయిత నుంచి తెలంగాణా కథ ఇలా తెరకెక్కడం విచిత్రం.

నటనలు –సాంకేతికాలు

నెగెటివ్ పాత్రలో కామాంధుడైన దొరగా జగపతి బాబుకే ఈ సినిమాలో ప్రాధాన్యం. మిగతా పాత్రలు డమ్మీలు. జగపతి బాబు తానొక్కడై సినిమా మొత్తం వూపేస్తాడు ఓవరాక్షన్ విలనీతో. ఇది మాస్ కి నచ్చుతుందనుకోవచ్చు. కానీ క్లాస్ కి నచ్చాలంటే పాత్రచిత్రణ బావుండాలి. పెళ్ళి చేసుకుని తెచ్చుకున్న రెండో భార్య వచ్చీ రావడంతోనే, జగపతి బాబు శత్రువు పంపిన అనుచరుల్ని యాంజెలీనా జోలీలా మార్షల్ ఆర్ట్స్ టైపులో, టపటపా కొట్టి పడెయ్యడంతో బెదిరిపోతాడు జగపతి బాబు. నువ్వు ఆడదానివి కాదు, ఆడది మంచులా వుండాలి, కంచులా కాదని నీతులు చెప్పి దూరం పెట్టేస్తాడు.
       
దీంతో జగపతి బాబుది పిరికి పాత్ర అన్పిస్తుంది. చుట్టుపక్కల అంత ఉగ్రుడైన
, కామాంధుడైన దొర ఓ ఆడది కంచులా వుంటే మంచులా మార్చేసి బానిసగా చేసుకోకుండా తప్పించుకుంటాడు. పైగా వూళ్ళో బలహీనురాలైన రుద్రంగి మీద కన్నేసి ప్రతాపం చూపిస్తాడు. అసలు రెండో భార్య శత్రువు అనుచరుల్ని చంపి తన ప్రాణాలు కాపాడిందన్న విషయమే మర్చిపోతాడు. పాత్ర ఇలా ఎస్టాబ్లిష్ అయ్యాక ఇక జగపతి బాబు సినిమాని ఎంత వూపేసినా బాక్సాఫీసు వూగిపోదు.
       
రుద్రంగి పాత్రలో కన్నడ నటి గానవీ లక్ష్మణ్ పీరియెడ్ తెలంగాణా పాత్ర రూపు రేఖలకి సరిపోయింది గ్లామర్ లేకుండా. పాత్ర ఎలా వున్నా హావభావ ప్రదర్శనతో దృశ్యాల్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. కానీ బానిస బంటుగా ఆశీష్ గాంధీ ఫేసులో ఎక్స్ ప్రెషన్స్ సరిపోలేదు. బానిసగా
, ఆ తర్వాత తిరగబడ్డ తెలంగాణా బిడ్డగా, అవసరానికి మించిన జగపతి బాబు మాస్ విశ్వరూపం ముందు నిలబడ లేకపోయాడు.
       
రెండో భార్యగా మమతా మోహన్ దాస్ ది కూడా ఓవరాక్షనే. ఆమె నటన
, పలికే డైలాగులు మాస్ కోసమే. ఇక మొదటి భార్యగా విమలా రామన్ ది రెగ్యులర్ బానిస పాత్ర, నటన. బానిస బంటు ప్రేమిస్తున్న రుద్రంగి మీద కామంతో దొర, పెళ్ళి చేసుకున్న దొర దూరం పెడితే బానిస బంటు మీద కామం పెంచుకున్న రెండో భార్య- ఇలా ఇదంతా ఒక చతుర్ముఖ రంకు పురాణం.
       
దర్శకత్వం షాట్లు తీసే విషయంలో నిలబడింది. అయితే కొన్ని చోట్ల షాట్సు ఏ పాయింటాఫ్ వ్యూతో తీశారో అర్ధంగాదు. రెండో భార్య ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు మొదటి భార్య దిష్టి తీస్తూంటే
, మధ్యలో పై నుంచి ఏరియల్ షాట్ ఎందుకు? పై నుంచి దేవుడు చూస్తున్నాడా? ఇంకో షాట్ కిటికీ చువ్వల మధ్య నుంచి తీయడమెందుకు? కిటికీ లోంచి ఎవరు చూస్తున్నారు?
       
రసమయి బాలకిషన్ మీద ఓ పాట వుంది. తెలంగాణా సాహిత్యంతో మిగిలిన పాటలు ఓకే. కళాదర్శకత్వం
, వస్త్రాలంకరణ, సెట్స్ వగైరా పీరియెడ్ ప్రపంచంలోకి తీసికెళ్తాయి. కానీ కథ పీరియెడ్ మూడ్ లోకి తీసికెళ్ళదు. ఫస్టాఫ్ పాయింటుని ఎస్టాబ్లిష్ చేస్తూ స్పీడుగా సాగితే, ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకి లాగే సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది. దొరకీ బానిసకీ తెలిసిన పోరాటమే తీరుబడిగా పోరాడుకుంటే, రెండు గంటలా 15 నిమిషాల సినిమా, 4 గంటలూ సాగుతున్నట్టు అన్పిస్తుంది.
—సికిందర్