దేశంలో బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ పడిపోవడంతో
బాటు, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 333 కోట్ల నికర
నష్టాన్ని చవి చూడడంతో, ఇక కొరియన్ సినిమాలపై దృష్టి పెట్టింది దేశంలోనే పెద్దదైన
పీవీఆర్ -ఐనాక్స్ పిక్చర్స్ మల్టీప్లెక్స్ సంస్థ. ఇందుకు ప్రారంభ చిత్రంగా కొరియన్
- అమెరికన్ మూవీ ‘పాస్ట్ లైవ్స్’ అనే రోమాంటిక్
డ్రామాని గత శుక్రవారం (జులై 7) దేశ వ్యాప్తంగా 70 స్క్రీన్ లలో విడుదల చేసింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ 2022 లో 2.4 కోట్ల మంది ప్రేక్షకుల్ని కోల్పోయిందని మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ వెల్లడిస్తోంది.
దీని ప్రకారం, జనవరి-డిసెంబర్ 2022 మధ్య, భారతదేశంలో కేవలం 12.2 కోట్ల మంది థియేటర్
ప్రేక్షకులు వున్నారు. ఇదే 2019 లో
మహమ్మారికి ముందు, కనీసం ఒక థియేటర్‌లో ఒక సినిమా చూసిన
వారు 14.6 కోట్ల మంది వున్నారు. ప్రేక్షకుల తగ్గుదల ఆదరణ కోల్పోతున్న హిందీ సినిమాల
కారణంగానే జరుగుతోందని గుర్తించిన పీవీఆర్- ఐనాక్స్, ప్రత్యామ్నాయ సినిమాల్ని అన్వేషించి, కొరియన్ డ్రామాల్ని దేశంలోకి తీసుకురావాలని నిర్ణయించింది.
దక్షిణ కొరియా కె- డ్రామా అనే కొరియన్ డ్రామా
సినిమాలకి ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి ఆదరణ వుంది. అనేక కొరియన్ డ్రామాల్ని
తెలుగులో కాపీకొట్టి కూడా తీశారు. తీయరాక ఫ్లాప్స్ చేశారు. కొరియన్ డ్రామాలు అధికంగా
రోమాంటిక్ డ్రామాలుగా వుంటాయి. ఇతర జానర్స్ లో యాక్షన్ డ్రామాలు, హిస్టారికల్ డ్రామాలు, స్కూల్ డ్రామాలు, మెడికల్ డ్రామాలు, లీగల్ డ్రామాలు, హార్రర్ కామెడీలు వంటివి వుంటాయి. ఇవన్నీ లోతైన భావోద్వేగాల ఇతివృత్తాలతో కూడి
వుంటాయి. స్నేహం, కుటుంబ విలువలు, ప్రేమ, పాశ్చాత్య
భౌతికవాదం, వ్యక్తివాదంతో వాళ్ళ సాంప్రదాయ
కన్ఫ్యూషియస్ దార్శనికతని
కలపడం - వంటి అంశాల చుట్టూ ఇతివృత్తాలుంటాయి.
కె- సంస్కృతి కాన్సెప్టు ప్రపంచవ్యాప్తంగా విస్ఫోటించిందని, సినిమా ప్రదర్శన -పంపిణీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీవీఆర్ - ఐనాక్స్ వంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్ఫోటించిన ఈ స్పష్టమైన దృగ్విషయాన్ని ఆమోదించడాన్ని విస్మరింప జాలదనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కె- డ్రామాల పట్ల ప్రేక్షకాదరణ పెరగడంతో పాటు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి విరివిగా ఇవి అందుబాటులోకి రావడం, ప్రేక్షకులు భాషల అడ్డంకిని కూడా తొలగించుని వీటిని ఎంజాయ్ చేయడం గమనిస్తే, ఈ దృష్టాంతం పరిపక్వత చెందిన ప్రేక్షక వర్గాన్ని మెండుగా సృష్టిస్తున్నట్టు అర్ధమవుతోందనీ ప్రకటనలో తెలిపింది. టిక్కెట్ల అమ్మకాల పరంగా చూస్తే, మహమ్మారి తర్వాత అంకెలు, మహమ్మారి కంటే ముందున్న స్థాయుల కంటే దాదాపు 25 శాతం తక్కువున్నాయనీ, హిందీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడం ఇందుకు కారణమనీ సంస్థ పేర్కొంది.
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గత ఏప్రెల్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, మహమ్మారి అనంతర సంవత్సరాల్లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ, అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమ రెండూ కలిసి హిందీ సినిమాల అధిపత్యంపై తిరుగుబాటు చేశాయి. ఇది హిందీ సినిమాల నాణ్యతని ప్రశ్నించినట్టయ్యింది.
ఇంకో వైపు, ఓటీటీలు వచ్చేసి విదేశీ కంటెంట్ కి సులభంగా యాక్సెస్ ని అందించినప్పటికీ, 2022 లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఆదాయాలు దాదాపు రెండింతలు పెరిగి రూ. 7,000 కోట్లకు చేరుకున్నాయి. ఈ మొత్తం పాన్-ఇండియన్ చలనచిత్ర పరిశ్రమ ఆదాయాలలో 52 శాతం వాటాని క్లెయిమ్ చేస్తోంది.
రానున్న నెలల్లో పరిస్థితిలో మార్పు కనిపించవచ్చని పీవీఆర్- ఐనాక్స్ భావిస్తోంది. ‘యానిమల్’, ‘జవాన్’, ‘టైగర్ 3’, ‘డుంకీ’ వంటి బిగ్ స్టార్ సినిమాలు వచ్చే రెండు త్రైమాసికాల్లో క్యూలో వున్నట్టు పేర్కొంది.
పీవీఆర్ -ఐనాక్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 'సుజామ్' అనే కొరియన్ యానిషన్ ని విడుదల చేసింది. ఇది రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. తాజాగా గతవారం విడుదల చేసిన కె- డ్రామా 'పాస్ట్ లైవ్స్' ఓపెనింగ్స్ రూ. 5 కోట్లు రావడంతో ప్రోత్సాహకర వాతావరణం కన్పిస్తోంది. కొరియన్ సినిమాలని విస్మరించడం చాలా కష్టమనీ, భాషతో సంబంధం లేకుండా కొరియన్ సినిమాలు పాపులర్ అవుతున్నాయనీ, ఓటీటీలు కొరియన్ సినిమాల సామర్థ్యాన్ని గుర్తించడం పీవీఆర్ - ఐనాక్స్ కి ఎంతో తోడ్పడిందనీ సంస్థ ప్రశంసించింది.
సెలిన్ సాంగ్ అనే కొత్త దర్శకురాలి ‘పాస్ట్ లైవ్స్’ 24 సంవత్సరాల క్రితం విడిపోయిన ఇద్దరు చిన్ననాటి స్నేహితుల (అమ్మాయి- అబ్బాయి) మధ్య వారి సంబంధాన్ని, సొంత జీవితాల్ని, ఎడబాటు బాధనీ సంకలనం చేస్తూ, పునః కలయికని ప్రతిపాదించే ఓ సున్నిత ప్రేమ కథ.
—సికిందర్