దర్శకత్వం : సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ తారాగణం : పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్, రషీద్ నాజ్, అశోక్ పాఠక్ తదితరులు
రచన : అనిల్ పాండే, ఛాయాగ్రహణం : చిరంతన్ దాస్
బ్యానర్స్ : సారధి ఎంటర్ టైన్మెంట్, ఎలియెన్స్ పిక్చర్స్
నిర్మాతలు : గులాబ్ సింగ్ తన్వర్, అశోక్ పండిత్, కిరణ్ డాగర్, అనిరుధ్
తన్వర్
విడుదల : జులై 7, 2023
***
ఇటీవలి ‘కాశ్మీర్
ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ ప్రాపగండా సినిమాల కోవలో ‘72 హూరే’ విడుదల సైతం వివాదాలు రేపింది. వివాదం కొద్దీ వసూళ్ళు సాధిస్తున్న ఈ
రకమైన సినిమాలు మంచి వ్యాపార వస్తువుగా మారాయి. ‘72 హూరే’ (72 అందమైన కన్యలు) ట్రైలర్ కి
క్లియరెన్స్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించడంతో మరింత వివాదం, ప్రచారం క్రియేటయ్యాయి. 2019 లోనే ఈ సినిమాకి సర్టిఫికేట్ జారీ చేసిన
సెన్సార్ బోర్డు, ఇప్పుడు ట్రైలర్ కి నిరాకరించడం కేవలం
వివాదాన్నిసృష్టించి, ప్రేక్షకుల దృష్టి నాకర్షించడానికి
చేసిన ప్రయత్నమేనని విమర్శలు వచ్చాయి. 2019 లో సెన్సారై,
జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డు కూడా పొందింది. మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు
కూడా పొందింది. కానీ థియేట్రికల్ విడుదలకి
నోచుకోలేదు. కారణం ఇది 80 నిమిషాల కళాత్మక సినిమా కావడమే. ప్రస్తుత మాస్ ప్రాపగండా
సినిమాల ట్రెండ్ లో కళాత్మకంగా తీసి విడుదల చేస్తే ఓపెనింగ్స్ కూడా లేవు. కేవలం 8.98
శాతం ఆక్యుపెన్సీతో, 35 లక్షలు మాత్రమే వసూలు చేసింది 10
భాషల్లో.
ఇంతకీ ఏమిటీ ‘72
హూరే’? టెర్రరిస్టు నాయకులు యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి
ఆత్మాహుతి దాడులకి పురిగొల్పే మంత్రం ఇది. ఆత్మాహుతి దాడులకి పాల్పడి మనుషుల్ని
చంపితే, స్వర్గంలో 72 మంది అందమైన కన్యలతో సుఖ భోగాలు
లభిస్తాయనీ మతపరంగా నమ్మించి పబ్బం గడుపుకుంటున్న వైనాన్ని ఈ సినిమా చిత్రిస్తోంది.
ఒక పాకిస్తానీ మౌల్వీ ఇలా బ్రెయిన్ వాష్ చేయడంతో, ఇద్దరు పాక్ టెర్రరిస్టులు హకీం (పవన్ మల్హోత్రా), బిలాల్ (అమీర్ బషీర్) ముంబాయి చేరుకుని గెట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడతారు. అయితే బిలాల్ అక్కడి జనసమూహంలో పిల్లా పాపలతో వున్న మనుషుల్ని చూసి మనసొప్పక వెనకడుగు వేస్తే, హకీం బాంబు పేల్చుకుంటాడు. ఈ పేలుడులో చాలామంది జనాలతో బాటు బిలాల్ చచ్చిపోతాడు.
చచ్చిపోయాక చూస్తే స్వర్గం వుండదు, అందమైన కన్యలూ వుండరు. చీకటి సొరంగంలోకి ప్రయాణం...దీంతో మౌల్వీ మోసం చేశాడని అర్ధం జేసుకుంటారు. వాళ్ళ ఆత్మలు తిరుగాడుతూ మృతుల, బాధితుల పరిస్థితిని చూసి చలిస్తాయి. పశ్చాత్తాప పడతాయి. ‘మౌల్వీ మన బతుకుల్నీ చావుల్నీ నాశనం చేశాడు’ అని కుమిలిపోతారు (వెళ్ళి మౌల్వీ ని తమతో లాక్కొస్తే సరిపోయేది).
ఇలా నమ్మి టెర్రరిజం లోకి వెళ్ళే
యువకులకి సందేశం ఈ సినిమా. అంతేగానీ ప్రాపగండా మూవీ కాదు. ఏ మతాన్నీ టార్గెట్
చేయలేదు. బాంబు దాడిలో టెర్రరిస్టుల స్వమతస్తులు కూడా చనిపోతారు. దర్శకుడు ఏ ఒకరి
పక్షం వహించడం లేదనీ సూచించే దృశ్యాలు పదే పదే వస్తూంటాయి. సెక్యులరిజం సరేగానీ, ఎందుకో కంగారుపడిపోయి అతి సెక్యులరిజాన్ని ప్రదర్శిస్తాడు. 2019 లో ఈ
సినిమా తీసినప్పుడు ఎజెండా లేదు కాబట్టేమో.
అయితే ఇదంతా సామాన్య ప్రేక్షకుల శక్తికి మించిన కళా ప్రదర్శన. సింబాలిజమ్స్ తో, స్లోమో డ్రామాతో, నాన్ లీనియర్ నేరేషన్ తో, ఫాంటసీ తో, మేధావులకి మాత్రమే అర్ధమయ్యే ఇంటలెక్చువల్ సినిమా. 80 నిమిషాల ఈ సినిమాలో 10 నిమిషాలు పోతే మొత్తమంతా బ్లాక్ అండ్ వైట్ చిత్రీకరణతో వుంటుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రీకరణలో కొన్ని వస్తువులు ఎరుపులో కన్పిస్తాయి. స్టీవెన్ స్పీల్బెర్గ్ నాజీల దురాగతాల మీద బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ‘షిండ్లర్స్ లిస్ట్’ లో, సైనికులతో బాటు నడిచే ఎరుపు దుస్తుల బాలికలా.
బాంబు దాడి దృశ్యాలు చాలా హృదయవిదారకంగా వుంటాయి. సంభాషణలు కరకుగా వుంటాయి. మనం చూస్తున్నది హకీం, బిలాల్ పాత్రలు కాదనీ, వాళ్ళ ఆత్మలనీ కథా క్రమంలో వెల్లడవుతుంది. దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ కథనానికి, దృశ్యీకరణకీ చూపిన తెగువ టెర్రర్ గ్రూపులకి సవాలు విసురుతున్నట్టు వుంటాయి. పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్ లు శక్తిమంతమైన నటనతో దర్శకుడి మెసేజ్ ని ప్రకటిస్తారు. ఉగ్రవాదానికి మూలకారణాల్ని పరిష్కరించాల్సిన తక్షణ అవసరం కోసం ఈ సినిమా అంటూ దర్శకుడు తన ఉద్దేశాన్ని వెల్లడించాడు.
—సికిందర్