రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, April 15, 2017

రివ్యూ!








తారాగణం : విద్యాబాలన్, నసీరుద్దీన్ షా ,ఆశీష్ విద్యార్థి ,రజిత్ కపూర్, చంకీ పాండే, గౌహర్ ఖాన్, పల్లవీ శారద ,ఇళా అరుణ్ తదితరులు
కథ : శ్రీజిత్ ముఖర్జీస్క్రీన్ ప్లే : శ్రీజిత్ ముఖర్జీకౌసర్ మునీర్మాటలుపాటలు  : కౌసర్ మునీర్
సంగీతం : అనూ మాలిక్, ఖయ్యాం, ఛాయాగ్రహణం : గోపీ భగత్
బ్యానర్ : విశేష్  ఫిలిమ్స్, ప్లే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ముఖేష్ భట్విశేష్  భట్
విడుదల : ఏప్రెల్  14, 2017
            ***
        దేశ విభజన మీద హిందీలో అనేక సినిమాలొచ్చాయి. దేశ విభజన నేపధ్యంలో వేశ్యల పోరాటంతో ‘బేగం జాన్’ వచ్చింది. బెంగాలీ దర్శకులతో విద్యాబాలన్ నటించినప్పుడల్లా అదొక కళాత్మక సినిమా అవుతోంది. ఈ మధ్య సరిగా సినిమాలు తీయక వెనకబడ్డ మహేష్ భట్ ఈసారి విద్యాబాలన్ తో, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీతో ఈ కళాత్మకం  తీసి వార్తలకెక్కారు. దేశ విభజన గురించి వేశ్య పాత్రలతో ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారన్న ఆసక్తి రేకెత్తించారు. విద్యాబాలన్ మరో షబానా అజ్మీ అవుతున్న క్రమంలో, శ్యాం బెనెగళ్ తీసిన ‘మండి’లో లాంటి షబానా అజ్మీ పాత్ర సంఘర్షణని ఇంకో స్థాయికి తీసికెళ్ళి ఎలా బలమైన ముద్ర వేశారో ఒకసారి చూద్దాం...

కథ 
       2016 డిసెంబర్ లో ఒక రాత్రి న్యూ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో బస్సులో పోతున్న బాయ్  ఫ్రెండ్- గర్ల్ ప్రెండ్ జంటని పోకిరీలు వేధిస్తూంటే,  బస్సు దిగి పారిపోతుంది గర్ల్ ఫ్రెండ్.  ఆమెని వెంబడించి రేప్ చేయబోతారు. అప్పుడొక ముసలవ్వ ఆ అమ్మాయికి రక్షణగా నిలబడి- తన బట్టలు విప్పేస్తూ పోకిరీలని ఆహ్వానిస్తుంది...ఈ దృశ్యంతో  పోకిరీలు జన్మకి సరిపడా గుణపాఠం నేర్చుకుంటారు. 

          ఈ ఓపెనింగ్ టీజర్ తో కథ 1947 నాటి కాలంలోకి పోతుంది. అక్కడ పంజాబ్ కొండ కనుమల మధ్య ఒకే పెద్ద కోటలాంటి ఇల్లు. ఆ ఇంట్లో బేగం జాన్ ( విద్యా బాలన్ ) అనే యజమానురాలు. ఆమె కింద పదకొండు మంది వేశ్యలు, ఒక అమ్మ (
ఇళా అరుణ్), ఇంకో మైనర్ బాలిక. సుర్జిత్ (పితో బాష్  త్రిపాఠీ) అనే ఒక సేవకుడు, సలీం మీర్జా (సుమిత్ నిఝావన్) అనే అంగరక్షకుడు వుంటారు. ఆ వేశ్యా గృహంలో వేశ్యల మధ్య కులమత ప్రాంతీయ బేధాల్లేవు. అందరిదీ బతకడం కోసం ఒకే పోరాటం. బేగం జాన్ దేనికీ రాజీ పడని, లొంగని  మొండి ఘటం. ఒక సంస్థానానికి చెందిన రాజాజీ (నసీరుద్దీన్ షా) తో, ఇంకో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాస్టర్ (వివేక్ ముష్రాన్) అనే నేతతో సంబంధాలు పెట్టుకుని తన జోలికి ఏ చట్టమూ, ఏ తెల్లవాడి నిర్బంధమూ రాకుండా చూసుకుంటూ వుంటుంది. స్థానిక పోలీసు అధికారిని పూచిక పుల్లలా తీసిపారేస్తుంది. ఆమె దగ్గరికి వచ్చే విటుల్లో పెద్ద మనుషులూ వుంటారు, ఆ పెద్ద మనుషుల్లో కులీనులూ వుంటారు. 

          ఇలా వుండగా ఓ అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది. రేడియోలో ఈ ప్రకటనకి వేశ్యలంతా  ఆనందాతిరేకాలతో  నృత్యాలు చేస్తారు, బాణసంచా కాలుస్తారు. బేగం జాన్ మాత్రం నిర్లిప్తంగా  కూర్చుని వుంటుంది. ఆమె దృష్టిలో దేశానికి స్వాతంత్ర్యం రాలేదు, మగాళ్ళకి వచ్చింది. మగాళ్ళ నుంచి ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం లభించినప్పుడే దేశానికి లభించినట్టు. 

          ఇదిలా వుండగా,  
ఢిల్లీలో దేశ విభజనకి విభజన రేఖ గీసే నిర్ణయాలు జరుగుతాయి.
 లూయిస్ మౌంట్ బాటెన్ (పాట్రిక్ ఐర్) ఈ పనిని బ్రిటిష్ లాయర్ సిరిల్ రాడ్ క్లిఫ్ (రాజా బిస్వాస్)కి అప్పజెప్తాడు. వారం రోజుల్లో అటు బెంగాల్లో, ఇటు పంజాబ్ లో రెండు గీతలు గీసేసి దేశాన్ని విభజించేస్తాడు రాడ్ క్లిఫ్. అటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్, మధ్యలో ఇండియా అంటాడు. 

          దీంతో అటూ ఇటూ స్థానచలనం, వలసలు ప్రారంభమవుతాయి. మరో వైపు విభజన రేఖ మ్యాప్ పట్టుకుని కంచె వేసే పని చేపడతారు  పంజాబ్ వైపు ఇద్దరు చిన్ననాటి మిత్రులు. వీళ్ళు హరిప్రసాద్ (ఆశీష్ విద్యార్థి), ఇలియాస్ ( రజిత్ కపూర్) లనే కాంగ్రెస్,  ముస్లిం లీగ్ నేతలు. కంచె వేసుకుంటూ వస్తూంటే, సరీగ్గా రాడ్ క్లిఫ్ రేఖ మీద బేగం జాన్ కోట తగుల్తుంది. ఖాళీ చేయాల్సిందిగా ఆమెకి నోటీసు లిస్తారు. ఆమె చించి పారేస్తుంది- ‘మీరు సాని కొంప అంటున్న ఈ ఇల్లు నా ఇల్లు, నా దేశం. మమ్మల్ని ఇక్కడ్నించి కదిలించాలని చూశారో, మీ కాళ్ళూ చేతులూ తీసేసి “దేహ విభజన” చేస్తాం’ అని వార్నింగ్ ఇస్తుంది. 

          ఇదీ సమస్య. ఇదెలా పరిష్కార మైంది? ఎవరిది పై చేయి అయింది? బేగం జాన్ తన బృందంతో కలిసి దేశానికి ఇచ్చిన సందేశం ఏమిటి? పైకి కన్పించని ఈ సందేశం ఆమె పోరాటానికి ఎలా సంసిద్ధం చేసింది?...ఇవీ మిగిలిన కథలో తెలిసే అంశాలు.

ఎలావుంది కథ 
         ‘రాజ్ కహిని’ (రాజుల కథ) పేరుతో 2015 లో ఇదే దర్శకుడు తీసిన బెంగాలీకి ఇది రీమేక్. అందులో రీతూ పర్ణ సేన్ గుప్తా నటించారు. అయితే 1983 లో  శ్యాం బెనెగళ్ తీసిన ‘మండి’ స్ఫూర్తితోనే  ‘రాజ్ కహిని’ తీశారు. ‘మండి’ (సంత) కూడా ‘ది బెస్ట్ లిటిల్ వోర్ హౌస్ ఇన్ టెక్సాస్’  (1982) అనే హాలీవుడ్ తో బాటు, గులాం అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే ఉర్దూ కథ ఆధారంగా తీశారు. ఇందులో  రుక్మిణీ బాయి (షబానా అజ్మీ)  హైదరాబాద్ లో నడిపే వేశ్యాగృహాన్ని నగర శివార్లకి తరలించాలని నేతలు నిర్ణయించడంతో రుక్మిణీ బాయి సంఘర్షిస్తుంది. అది స్థానిక సమస్య, దాంతో వ్యక్తిగత సంఘర్షణ. 

          ‘బేగం జాన్’ కొచ్చేసరికి విశాలప్రాతిపదికన దేశ విభజన సమస్యకి కేంద్ర బిందువు అయింది. ఈ సినిమా చూస్తూంటే ఆమె ఓ ఇంటికోసం తను గెలవలేని పోరాటం ఎందుకు చేస్తోందని అన్పిస్తుంది. మూర్ఖత్వమని కూడా అన్పిస్తుంది. కొన్ని భూసేకరణ  కథల్లో రైతు పొలం అమ్మనని భీష్మించుకునే లాగ. అమ్మక తప్పదు, అభివృద్ధిని ఆపలేరు. బ్రిటిష్ వాడు నిర్ణయించిన విభజన రేఖని మార్చడం బేగం వల్ల కాదు, ఆమె ఖాళీ చేసి పోవాల్సిందే. 

          కానీ రైతుకీ ఓ రక్షణ వుంటుంది, కనీసం నష్టపరిహారం లభిస్తుంది. ఈ వేశ్యల చేత ఖాళీ చేయించి తమలో కలుపు కోడానికి సరిహద్దు కిరువైపులా ఎవరూ సిద్ధంగా వుండరు.  వాళ్ళ ఖర్మానికి వదిలేస్తారు.  ఈ నేపధ్యంలో బేగం, ఆమె బృందం ఆయుధాలు చేపట్టి, ఓడిపోతామని తెలిసీ  కోటని రక్షించుకోవడాని చేసే భీకర పోరాటం చూస్తూంటే, మామూలు కంటికి ఓ యాక్షన్ – మెర్సినరీ జానర్ లో ఫిక్స్ చేసి కమర్షియల్ గా సొమ్ములు చేసుకోవాలనుకున్న కథలాగే అన్పిస్తుంది. వేశ్యలు వాళ్ళ  వృత్తి కోసం చేస్తున్న ప్రాణత్యాగం లాగే అన్పిస్తుంది. 

          ఇంతే కథ అనుకుంటే పప్పులో కాలేసినట్టే, సినిమా చూడ్డం రానట్టే. అర్ధవంతమైన సినిమా కథకి ఓ సంస్కారం వుంటుంది. అది కంటికి కాదు, మనసుకి కథని అందిస్తుంది. అందుకని ఈ పైకి కన్పించేదంతా నిజం కాదనీ - దీనికి సమాంతరంగా అంతర్లీనంగా వేరే అర్ధంలో అసలు కథ నడుస్తోందనీ పసిగడతాం. వేశ్యలు వాళ్ళ వృత్తి కోసం ప్రాణత్యాగం చెయ్యరు. అలా చూపిస్తే సినిమా ఒక్క ఆట కూడా ఆడదు. 

          బేగం సహా పదకొండు మంది వేశ్యలు ప్రాణాలకి తెగించి చేసే ఆ  పోరాటం కేవలం వృత్తి కోసమో, ఇంటి కోసమో కాదు. దేశం కోసం. ఆ కోటలాంటి ఇల్లు  దేశానికి రూపకాలంకారమని మనకి  అర్ధమవుతుంది. ఆ వేశ్యల పోరాటం దేశ విభజననే అడ్డుకుంటున్న పోరాటమని తెలుస్తుంది. సంకేత భాషలో  అంతర్గతంగా  ఈ కథ నడుస్తోంది. నీలకంఠ తీసిన ‘షో’ లో కూడా సంకేత భాషలో అంతర్లీనంగా కూడా ఓ కథ నడుస్తూంటుంది. ఇది మనసుకి కన్పిస్తుంది. 

          బేగం ఈ పోరాటంలో ఓడిపోతుందని తెలుసు- దేశం అఖండ భారత్ గా వుండాలన్న వాళ్ళ కోరికలోని బలం ముందు ప్రాణాలు ముఖ్యం కాదు. కథ ముగుస్తున్నప్పుడు వచ్చే పాట వాళ్ళ నినాదాన్ని తెలుపుతుంది-  ‘వోహ్ సుభాహ్ హమీసే ఆయేగీ’ - ఆ శుభోదయం మాతోనే వస్తుంది అంటూ. మిమ్మల్ని స్వర్గానికి తీసి కెళ్ళడానికి ఏ కాంతి పుంజమూ ఆకాశంలోంచి దిగిరాదు, మీరే కాంతి పుంజం కావాలని పాడతారు. నిజమే, ఎవళ్ళ  స్వార్ధాలతో వాళ్ళు మనుషులు దేశాన్ని చీకట్లోనే వుంచుతారు- వాళ్ళతో శుభోదయం ఎలా ఎప్పుడు వస్తుంది? 

          దేశభక్తి గురించి ఇంతగా మాట్లాడే సంస్థలు, పార్టీలు ఏవీ ఆ నాడు దేశ విభజనని అడ్డుకునే చిన్న ఉద్యమం కూడా రేపి ప్రజల్నిజాగృతం చేయలేదు. పైపెచ్చు ప్రజల్ని అనాధలుగా వదిలేసి, విభజన వంకతో  వాళ్ళు వూచకోతకి గురవుతూంటే ప్రేక్షక పాత్ర వహించాయి.

          దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ఈ కథతో అలాటి పార్టీలకి, సంస్థలకి చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చాడు.

ఎవరెలా చేశారు 
       ఎవరెలా చేశారంటే చెప్పడం కష్టం. ప్రతీ ఒక్క పాత్రలో ప్రతీ ఒక్కరూ 1940 ల నాటి మనుషులే  అన్పించేలా పోకడలు ప్రదర్శించారు. పచ్చి వేశ్యలుగా నటించిన ప్రతి వొక్కరూ నటుల్లా అన్పించరు. వేశ్యలే వచ్చి నటిస్తున్నట్టు వుంటుంది. పచ్చి భాష మాట్లాడే బేగం పాత్రలో విద్యాబాలన్ ని తప్ప ఇప్పట్లో ఇంకొకర్ని వూహించలేం.  ఈ పాత్రకి ఒకలాంటి ఫెమినిజం వుంటుంది. తిడితే ఆడదానికి తగిలే తిట్లు తిట్టే మగ నాకొడుకులతో ఆడదానికి స్వాతంత్ర్యం ఎప్పుడూ రాదనే ఈమే, ఆడవాళ్ళకి తగిలే తిట్లే  ఘోరంగా తిడుతూంటుంది. ఇది పాత్రచిత్రణ లోపం కావచ్చు. 

          ఈమె పుట్టుపూర్వోత్తరాలు పోలీసులకి కూడా తెలీవు. ఈమె అసలెవరో, వేశ్య గా ఎలా మారిందో  తెలపడానికి దర్శకుడు అద్భుతమైన క్రియేటివిటీ చేశాడు. మామూలుగానైతే  ఓ పాత్ర వచ్చి ఈమె ఫలనాఫలనా అని స్టేజి నాటకం పద్ధతిలో  చెప్పేసి చెక్కేస్తుంది. అది క్రియేటివిటీ కాదు, కుక్కలు కూడా ఆపని చేయగలవు. మొరగడం సినిమా కళ కాదు. మొరగకుండా  దృశ్యపరంగా చూపించేదే సినిమా కళ. కుక్కలకి  సినిమా కళ సింహాసనం తెలీదు. 

          విభజన రేఖ గీసి ఆమెని నెట్టేస్తున్న నేపధ్యంలో దర్శకుడు సమయోచితంగా ఆమె గతాన్ని బయట పెడతాడు. దేశానికి ఈ విభజన రేఖ లాంటిదే ఆమె జీవితంలోనూ విభజన రేఖే దగా చేసిందని. దీన్ని ఆమె ఈ సందర్భంగా  తల్చుకుంటుంది. మొగుడు పోయాడని లేత వయసులోనే తనకి శిరో ముండనం చేసి, తెల్ల చీర చుట్టి తనవాళ్ళు  వీధిలోకి నెట్టేసిన విభజన రేఖ! అలా అలా తిరిగి వేశ్యగా మారి, ఓ నవాబు దగ్గర బేగం జాన్ అయింది. దీనికి సోదిలా ఫ్లాష్ బ్యాక్ ఏమీ వుండదు. షాక్ వేల్యూ కోసం కొన్ని కట్ షాట్స్ తో  మెరుపు వేగంతో చూపించేస్తాడు దర్శకుడు. తేరుకోవడం మనవల్ల  కాదు. సినిమా తీయడమంటే మజాకా కాదు. డాగీ బిజినెస్ కాదు.

          ప్రస్తుతానికొస్తే, కోట ఖాళీ చేయమని తనని వేధిస్తున్న వాళ్ళ సంగతి చూడమని రాజాజీ (నసీరుద్దీన్ షా) ని పొదరింటికి ఆహ్వానించి, ఎర్ర చీరా నిండుగా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతూ కొత్త పెళ్లి కూతుర్లా  విద్యాబాలన్ అతడి ముందు కూర్చున్నప్పుడు- ఇంకొక డిస్టర్బింగ్ సీను వస్తుంది. అతను ఆమె పెంచుకుంటున్న మైనర్ బాలిక కావాలంటాడు. షాక్ అవుతుంది. ఏం చెప్పినా విన్పించుకోడు. పైగా పాట పాడితే తప్ప తనకి మూడ్ రాదం టాడు.  మైనర్ బాలికతో అతను  పవళిస్తే అతడి ముందు కూర్చుని పాడే విద్యాబాలన్ పెళ్ళికూతురి ముస్తాబంతా పోయి పడే వేదన అంతాఇంతా కాదు. ‘శంకరాభరణం’ లో  మానభంగం జరుగుతున్నపుడు అరిగిపోయిన రికార్డు తిరుగుతూంటే, ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చుని నరకం అనుభవిస్తూ పాడాల్సి వస్తుంది. ఈ భజన్ రాజాజీ పక్కలో ఆ మైనర్ బాలికకి జోల పాడే భజన్. ఇలాటి డిస్టర్బింగ్  సీన్లు విద్యాబాలన్ కి చాలా వున్నాయి. పీరియడ్ ఫిలిం కావడం వల్ల  ఈ వెయిట్ వున్న పాత్ర కావాల్సినంత క్లాసిక్ లుక్ తో విజువల్ గా బలమైన ముద్ర  వేస్తుంది. 

         ఆశీష్ విద్యార్థి, రజిత్ కపూర్ మిత్రుల సీన్లలో కూడా దర్శకుడి పనితనం వల్ల వాళ్ళు అద్భుతంగా హత్తుకునేలా కన్పిస్తారు. ఒకరు ఇండియన్, ఇంకొకరు పాకిస్తానీ అన్నట్టుగా విడిపోబోతున్నారు కంచె వేసే పని పూర్తి చేశాక. వీళ్ళిద్దర్నీ ఎప్పుడు చూపించినా, స్క్రీన్ కి ఇటు చివర ఒకరి సగం ముఖం -  అటు చివర ఇంకొకరి సగం ముఖం మాత్రమే చూపిస్తాడు దర్శ కుడు. ఈ విభజన ప్రాణమిత్రుల్ని కూడా ముక్కలు చేసిందనే అర్ధంలో ఇలాటి  షాట్ డివిజన్ చేస్తాడు దర్శకుడు. ఇతను ఇండియాలో వుంటే సగమే వుంటాడు, తన ఇంకో సగం మిత్రుడితో పాకిస్తాన్ లో వుంటుందన్నట్టు,   అలాగే అతను  పాకిస్తాన్ లో వుంటే సగమే వుంటాడు, తన ఇంకో సగం మిత్రుడితో ఇండియాలో వుంటుందన్నట్టు కదిలించే దృశ్యీకరణ. విద్యాబాలన్ సహా ఏ పాత్రని చూపించినా విభజన కాన్సెప్టే దృశ్యాల్లో నిశ్శబ్దంగా వెల్లడయ్యేలా చిత్రీకరణ  చేస్తాడు  దర్శకుడు. 

          ఇక ఇందులో కిరాయి హంతకుడుగా పేరు చెప్తే తప్ప గుర్తుపట్టలేని విధంగా వుంటాడు చంకీ పాండే విరిగిన, గారపట్టిన పళ్ళతో.  కిల్లర్ కబీర్ గా అవసరాన్ని బట్టి హిందువుగా, ముస్లిం గా మారిపోయే ఊసర వెల్లిలా ఖతర్నాక్ గా వుంటాడు. 

          అనూ మాలిక్, ఖయ్యూం ల సంగీతాల్లో పాటలూ, వాటి చిత్రీకరణా దృశ్య కావ్యంలా వుంటాయి. దర్శకుడి చేతిలో ప్రతీదీ కళాత్మకమే. గోపీ భగత్ సమకూర్చిన ఛాయాగ్రహణం, దాని డీఐ ఇంకో చెప్పుకోవాల్సిన కళా నైపుణ్యం. కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం, పోరాటాలు ఛత్తీస్ ఘడ్ లొకేషన్స్  ప్రతీదీ కథాకాలంలో సింక్ అయిపోతూ కన్పిస్తాయి.  ఇందులో ముగింపు పాట కోసం దర్శకుడు చాలా అన్వేషించి 1958 లో రాజ్ కపూర్ సినిమా ‘ఫిర్ సుభాహ్  హోగీ’ లొ వాడకుండా వుంచేసిన, సాహిర్ లుథియాన్వీ రాసిన ‘వోహ్ సుభాహ్ తో కభీ ఆయేగీ ‘ పాటని కొద్ది మార్పులు చేసి వాడుకున్నారు. 

          పోతే, దేశ విభజన నేపధ్యంలో కేవలం వలసలు పోతున్న ప్రజలనే చూపించి, అప్పట్లో చెలరేగిన హింసాగ్ని, లక్షలాది మరణాలూ  చూపించలేదన్న ప్రశ్న తప్పక వస్తుంది. అదంతా చూపిస్తే, బేగం చేసే పోరాటం దాని ముందు డైల్యూట్ అయిపోతుంది. ప్రధాన కథనీ, ప్రధాన పాత్రనీ కాపాడుకోవాలంటే ఒక్కోసారి నేపధ్యాన్ని సెలెక్టివ్ గా వాడుకోక తప్పదు. 

          బాలీవుడ్ కొస్తున్న బెంగాలీ దర్శకులు అత్యంత కళాత్మకంగా తీస్తూ ఇతర దర్శకులకి సవాలు విసురుతున్నారు. ‘పింక్’ లాంటి  థ్రిల్లర్ తీసినా కళాత్మకమే- వాళ్ళు ఏం తీస్తే అది హిట్టే!
చివరికేమిటి 
దర్శకుడు శ్రీజిత్  ముఖర్జీ
        స్ట్రక్చర్ తో క్రియేటివిటీకే అందం వస్తుంది. స్ట్రక్చర్ లో వుంచడం వల్ల ఈ స్క్రీన్ ప్లే ఇంత బలంగా, అర్ధవంతంగా వుంది, కళాత్మకంగా వుంది. హాలీవుడ్ సినిమాల్లో ఓపెనింగ్ టీజర్లు వుంటాయి- మన సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగులు వున్నట్టు. ఓపెనింగ్ టీజర్లు ఇంకా వాడిగా, బలంగా, కత్తిలా వుంటాయి. దీన్ని ఈ కథ మొదలెట్టడానికి వాడుకున్నారు. పైన చెప్పుకున్న కథలో మొదటి పేరాలో ముసలవ్వ వివస్త్ర అయ్యే సన్నివేశం అలాటి పవర్ఫుల్ టీజరే.  ఈ టీజర్ లో  సన్నివేశం 2016 నాటిది. మరి వెంటనే మరుసటి సీన్లో 1947 లోకి కథ వెళ్ళాలి - ఎలా? 

          ఈ ముసలవ్వ ‘టైటానిక్’ ముసలావిడ అయ్యింది... అంటే ఆ అమ్మాయిని పోకిరీల బారినుంచి తను కాపాడేక, తీక్షణమైన చూపులు చూస్తూ తన గతంలో కెళ్ళి పోతుంది. వెంటనే ఈ ముసలవ్వ పాయింటాఫ్ వ్యూలో 1947 లో కథ ప్రారంభమవుతుంది. ఆనాటి కథలో మైనర్ బాలికే ఇప్పుడున్న ముసలవ్వ. 1947 లొ మైనర్ గా వున్నప్పుడు ఒకావిడ్ని పోలీసు అధికారి రేప్ చేయకుండా ఇలాగే బట్టలు విప్పుకు నిలబడి ఆహ్వానిస్తుంది. పోలీసు అధికారికి  సెక్స్ మీదే వైరాగ్యం పుట్టి పారిపోతాడు. ఈ ఓపెనింగ్ టీజర్ కి  1947 తో లింకు వుందన్న మాట. రేపిస్టులకి బుద్ధి చెప్పడానికి చిన్నప్పుడు ఏం చేసిందో,  ముసలావిడ అయ్యాకా అదే చేయాల్సి వచ్చిందన్న మాట. ఇది కొరడా చరుపు లాంటి  సోషల్ కామెంట్ అన్నమాట!

          స్ట్రక్చర్ లో బిగినింగ్ వచ్చేసి, బేగం జాన్ వేశ్యాగృహం, బిజినెస్ వగైరా ఒక పక్క చూపిస్తూ, ఇంకో పక్క దేశ పరిణామాలు, స్వాతంత్ర్యం, దేశ విభజన ప్రక్రియా, సరిహద్దుల ఏర్పాటూ అంచెలంచెలుగా చూపించు కొస్తూంటారు. ఈ ట్రాక్ అంతా బేగంతో ఎక్కడ ఎందుకు ఎలా కనెక్ట్ అవుతుందా అన్న సస్పెన్స్ పుడుతుంది. ఈ ట్రాక్ అంతా ముందు ముందు  ప్లాట్ పాయింట్ -1 దగ్గర కథకి అవసరమైన ‘సమస్య’ ఏర్పాటు కోసం దారితీసే పరిస్థితుల కల్పనే అని అర్ధమవుతుంది నియమాల ప్రకారం.

          నలభై ఐదో నిమిషం కల్లా సరిహద్దు కంచె వేసుకుంటూ వస్తే ఏముంది- విభజన రేఖ మీద బేగం కోట వుంటుంది. అంతే, ప్లాట్ పాయింట్ -1, దాని సమస్యా ఏర్పాటై పోయాయి. కోట ఖాళీ చేసి వెళ్ళాలంటూ బేగంతో అధికారుల వాదన, వాళ్లతో ఆమె  ఘర్షణ - కథ ప్రకారం బలంగా భీకరంగా వుంటాయి. 

          అయితే ఇక్కడ ఏ సినిమాలోనూ జరగని విధంగా ‘సీనస్ ఇంటరప్టస్’ జరుగుతుంది. ఇది తికమక పెడుతుంది. ప్లాట్ పాయింట్ -1  సన్నివేశాన్ని బ్రేక్ చేసి మరో సీన్ కి వెళ్ళడం జరగదు. కానీ ఇక్కడ జరిగింది.  అధికారులూ, బేగంల మధ్య రసపట్టులో వున్న సంఘర్షణ అకస్మాత్తుగా  వీగిపోతూ సీన్ మారుతుంది- అక్కడ దూరంగా వేశ్యా ఆమె ప్రియుడుల మధ్య  ఎమోషనల్ సీను, వర్షం. ఇదొక అద్భుత దృశ్య కావ్యం, అది వేరే విషయం. దీని తర్వాత తిరిగి ప్లాట్ పాయింట్ -1 సీనుకి!  

          కథనంలో ఎక్కడైనా సీన్లకి ‘సీనస్ ఇంటరప్టస్’ జరగవచ్చు గానీ, ప్లాట్ పాయింట్ -1 సీనుని మధ్యకి విరిచి తిరిగి అతికిస్తూ చేయడం ఎక్కడా వుండదు. సమస్య ఎంత తీవ్రమైనదో చరిత్ర తెలిసిన మనకి తెలుసు కాబట్టి ప్లాట్ పాయింట్ -1 ని ఇలా విరిచినా కథనానికి డ్యామేజి జరగలేదు. వెంటనే ఇంటర్వెల్ వస్తుంది యాభయ్యో నిమిషంలో. 

          మళ్ళీ ఇదొక బుర్ర దొలిచేసే పని. ప్లాట్ పాయింట్ -1 తో ఎవరైనా ఇంటర్వెల్ వేస్తారా? ప్లాట్ పాయింట్ -1 ని అనవసరంగా సాగదీసి సాగ దీసి గంటకో, గంటంపావుకో ఎస్టాబ్లిష్ చేసి ఇంటర్వెల్ వేయడం వేరు. కానీ యాభై నిమిషాలకి ప్లాట్ పాయింట్ -1 అవగానే ఇంటర్వెల్ ఇవ్వడం నాటక పద్దతి. నాటకాల్లో ఒక అంకం అయిపోగానే తెరదించినట్టు, ఇక్కడ బిగినింగ్ అనే మొదటి అంకం అవగానే విశ్రాంతి నిచ్చేశారు.  ఇంకో బెంగాలీ దర్శకుడు తీసిన ‘పింక్’ లో నైతే కోర్టు సీన్లన్నీ నాటక రంగ టెక్నిక్ తోనే నడుస్తాయి!

రచయిత్రి కౌసర్ మునీర్
         ఇక విశ్రాంతి తర్వాత మిడిల్ లో పడ్డ కథ అత్యంత సంఘర్ష ణాత్మకంగా వుంటుంది. నియమాల ప్రకారం. ఈ సంఘర్షణలో ఆమెకి ఎదురయ్యే అడ్డంకులు అంతకంతకీ తీవ్రత పెంచుకుంటూ వుంటాయి. ఇక విధిలేక తుపాకులు పేల్చడంలో తనతో సహా అందరూ శిక్షణ పొందడం, బయటి నుంచి ప్రత్యర్ధుల దాడులు పెరిగి, చివరికి ఆమె అంగ రక్షకుడు సజీవ దహన మైనప్పుడు,  ప్లాట్ పాయింట్ -2 ఏర్పడి  మిడిల్ ముగుస్తుంది.

          ఈ ప్లాట్ పాయింట్ -2 కూడా బలంగా రిజిస్టర్ అవుతుంది. ప్లాట్ పాయింట్-1, ప్లాట్ -పాయింట్ -2  రెండూ కూడా విజువల్ గా బలంగా రిజిస్టర్ చేసినప్పుడే ఈ మిడిల్ అనే స్క్రీన్ ప్లేకి  వెన్నెముక పటిష్టవంతంగా వుంటుంది.

          ఈ ప్లాట్ పాయింట్ -2 దృశ్యాన్ని  ఎవరూ జీవితంలో మర్చిపోలేరు. మర్చిపోయారంటే మనసుతో సినిమా చూడనట్టే. అంగరక్షకుడు నిలువెత్తు మంటల్లో ఒక ప్రభాలా వెలిగిపోతూ, గాలికి వూగుతున్న వరికంకిలా అటూ ఇటూ స్వింగ్ అవుతూంటాడు. అతన్నే చూస్తూంటుంది. జీవితంలో ఏదీ వూరికే జరగదు. ప్రతిదీ మనకో అర్ధాన్నిస్తాయి. సింక్రో డెస్టినీ అంటారు. దీని ప్రాధాన్యాన్ని గుర్తించకుండా-  ఏదో తగలబడ్డాడు, ఆమె చూసింది, అతను కిందపడ్డాడు, చచ్చి పోయాడు, ఏడ్చింది –అన్న చందంగా  సీను తీసేస్తే అది అజ్ఞానం. క్రియేటివిటీకి అవమానం. 

          నిలువెల్లా మంటల్లో అలా ఊగుతూ అతనేదో మూగగా చెప్తున్నాడు - ఈ పోరాటాన్ని గెలవలేవు, ఆనందంగా ఆహుతైపో- అంటున్నాడేమో? ఇదే ప్లాట్ పాయింట్ -2 దగ్గర ఆమెకి దొరికిన పరిష్కారమార్గం. దీంతో ఎండ్ విభాగంలో ఆమె బృందంతో కలిసి తీసుకునే నిర్ణయం ఎంత హృదయవిదారకంగా వుంటుందంటే...

          కళ, క్రియేటివిటీ, ఇతర సాంకేతికాలు ఒక స్ట్రక్చర్ పరిధిలోకి వచ్చినప్పుడే పురులు విప్పుకుంటాయి. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ మృత దేహానికి అలంకరణ చేయడం లాంటిది. దర్శకుడు శ్రీజిత్  ముఖర్జీ, రచయిత్రి కౌసర్ మునీర్ ల చేతుల్లో ఈ స్క్రీన్ ప్లే అంతా ఒక స్టడీ మెటీరియల్.


-సికిందర్
http://www.cinemabazaar.in



Friday, April 14, 2017

రివ్యూ!








స్క్రీన్ ప్లే దర్శకత్వం : శ్రీను వైట్ల


తారాగణం : వరుణ్ తేజ్హెబ్బా పటేల్, లావణ్యా త్రిపాఠీ, నాజర్, నాగినీడు, పృథ్వీ, భరత్, శ్రీనివాస రెడ్డి. హరీష్ ఉత్తమన్, నికితన్ ధీర్ తదితరులు
కథ : గోపీ మోహన్, మాటలు : శ్రీధర్  సీపాన
సంగీతం : మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం : కెవి గుహన్
బ్యానర్ : క్ష్మీ సింహా ప్రొడక్షన్స్
నిర్మాతలు: ల్లలుపు శ్రీనివాస్, ఠాగూర్ ధు
విడుదల : ఏప్రెల్ 14, 2017
               ***
   భారీ ఫ్లాపు తీయడానికే బాగా కష్టపడాలి, కష్ట పడుతున్నారు కూడా. ఎంత కష్టపడితే అంత ఫ్లాప్ ఇవ్వొచ్చు.  తర్వాత హిట్టూ ఫ్లాపులు మన చేతుల్లో లేవనొచ్చు. హిట్ సంగతేమోగానీ, తీయబోతున్నది అట్టర్ ఫ్లాప్ అని ముందే తెలిసిపోతూంటుంది చేతిలో వున్న పేజీల్లో. ఆ పేజీల్ని కెమెరా కిచ్చి, ఆ కెమెరా ప్రొజెక్టర్ కి అందిస్తే, ఆ  ప్రొజెక్టర్ తెర మీద బొమ్మ వేశాకే -  అయ్యో  ఇంతకీ మనం రాసింది ఇంత ఫ్లాపా?  అని అప్పుడు గానీ తెలియడం లేదంటే ఇదొక అద్భుతమైన విషయమే. దీన్నిలాగే భద్రపర్చుకుని కంటిన్యూ చేస్తూండాలి. మర్మం తెలుసుకుని మామూలుగా కష్ట పడితే సరిపోయే దానికి, మార్గం తెలీక బరువు లెత్తుతారు. హెవీ వెయిట్ ఛాంపియన్ లవుతారు. ఒక్కొక్క బరువుతో ప్రేక్షకుల తల బద్దలు కొడతారు. అమాయకులైన ప్రేక్షకులేమో రక్షక కవచం తొడుక్కుని వెళ్ళడం మర్చిపోయి,  వొళ్ళంతా కైమా చేసుకుని వస్తారు!

        కానీ భయపడాల్సిన  పనిలేదు. ఇలాటి సినిమాలకి మార్నింగ్ షో కి అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే,  మ్యాట్నీ నుంచీ రక్షకవచాలు అందించే పథకం ప్రారంభిస్తే,  ప్రేక్షకులు అవి తొడుక్కుని కొంత ధైర్యం చేసి ఓ మాదిరిగానైనా కలెక్షన్లు ముట్ట జెప్తారు. 

         
ఇదంతా డజను సినిమాలు తీసిన టాప్ డైరక్టర్ కి తెలియదని కాదు. ఇంకో  డజను సినిమాలు రాసిన టాప్ రైటర్స్ కీ తెలీదని కాదు. ఈ సినిమాలోనే రైటర్ ఒక చోట డైలాగ్ రాస్తాడు- కంఫర్స్ట్ పెరిగిపోతే కథలు  రాయలేవు, కాలే కడుపుతో జనంలోకి వెళ్తేనే రాయగలవనీ. ఇది నిజమని అక్షరాలా ఈ సినిమానే బలిపెట్టి రుజువు చేశాడు. కంఫర్స్ట్ పెరిగిపోయి రాసిన అట్టర్ ఫ్లాప్ స్క్రిప్టు ఇది. 

         కాలే కడుపుతో జనంలోకి వెళ్లి రాయాలని ఇంత కనెక్టివిటీ తో చెప్పిన డైలాగే  ప్రేక్షకులతో మర్చిపోయారు. ప్రేక్షకులతో సినిమా కనెక్ట్ అవ్వాలంటే కావాల్సింది సైకలాజికల్ కనెక్షనే. సైకలాజికల్ కనెక్షన్ సినిమాలో హీరో మాత్రమే ఏర్పాటు చేస్తాడు. సినిమా కథంటే హీరోదే. హీరోయే కథ. కథలోంచి హీరో పుట్టడు, హీరోయే కథని పుట్టిస్తాడు, దాన్ని తనే నడిపిస్తాడు. హీరోకే కథ విన్పించి ఓకే చేయించుకుంటారు గానీ కమెడియన్లకీ  విలన్లకీ చెప్పి కాదు. విచిత్రంగా ఈ కథని హీరోకి కాకుండా ఇరవయ్యేసి మంది కమెడియన్లకి, ఇంకో నలభయ్యేసి మంది విలన్లకీ విన్పించి ఓకే చేయించుకుని,  ఆ తర్వాతే  హీరో వరుణ్ తేజ్ కి  మాట మాత్రంగా చెప్పేసి మొదలెట్టినట్టు కన్పిస్తుంది ఆద్యంతం. పాపం వరుణ్ తేజ్! మరోసారి మూసని నమ్ముకుని దెబ్బ తినిపోయాడు...సెకండాఫ్ లో అసలే కన్పించకుండా పోయాడు!

          ‘మిస్టర్’ అనే అట్టహాసపు హీరోయే కన్పించకపోతే  ఇక సైకలాజికల్ కనెక్షన్ ఎక్కడిది? సీన్లలో కన్పించినంత మాత్రాన  హీరో హీరో కాడు. సీన్లని విలన్లూ కమెడియన్ లూ నడిపిస్తున్నప్పుడు, వాళ్ళే అతడి చావు బతుకుల్నీ, పెళ్లి పెటాకుల్నీ  నిర్ణయిస్తున్నప్పుడు- నిలబడి దిక్కులు చూస్తూంటే హీరోయిజం అవదు- బకారాయిజం అవుతుంది. పాసివ్ క్యారక్టర్ అవుతుంది. కమెడియన్లతో, విలన్లతో గతంలో చేసిన శ్రీను వైట్ల బకరా కామెడీలు  ఇక చాలనుకుని ఎంత అనుకున్నా, ఆ రంగు ఎలాగో బయట పడక తప్పలేదు- ఈ సారి హీరోనే బకరాని చేస్తూ,  మిస్టర్ బకరాగా మార్చేస్తూ.

          ఈ సినిమా చూస్తూంటే రవితేజ ఫ్లాప్ కిక్ -2 ఎందుకు గుర్తుకు రావాలి?  కాకపోతే రవితేజ సెటప్ తెలుగు నేటివిటీకి దూరంగా, విడ్డూరంగా  రాజస్థాన్ తండాలో అక్కడి హీరోయిన్ ని రక్షించడం గురించి. శ్రీనువైట్ల తండా కూడా వచ్చేసి తెలుగు నేటివిటీకి  దూరంగా, విడ్డూరంగా  ఆంధ్రా - కర్నాటక సరిహద్దులో శ్రీ కృష్ణ దేవరాయలి కాలపు అలవాట్లతో వున్న గ్రామంలో,  అక్కడి రాజ వంశపు  హీరోయిన్ తో, వాళ్ళ విలన్లతో. ఇంటర్వెల్ చూస్తూంటే, ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ ఇంటర్వెల్ మలుపే ఎందుకు గుర్తుకురావాలి- ఒక హీరోయిన్ అనుకుంటే ఇంకో హీరోయిన్ మీదికి విలన్లు వస్తూ?  ప్రారంభంలో ఏర్ పోర్టులో హీరో ఒకర్ననుకుని ఇంకో హీరోయిన్ ని రిసీవ్ చేసుకుని మొదలెట్టిన ప్రహసనమంతా చూస్తే, అమీర్- సల్మాన్ ల  ‘అందాజ్  అప్నా అప్నా’ ఎందుకు గుర్తుకు రావాలి?

          సినిమా ఓపెనింగ్ సీనేమిటి అలా వుంది- సరిహద్దు గ్రామం మీద ఖనిజాల కోసం కన్నేసిన విలన్ కుట్ర పన్నడం దగ్గర ఆగిపోయి – మళ్ళీ క్లయిమాక్స్ లో పెళ్లి కుట్రలుగా మారిపోవడమేమిటి? 

       సరిహద్దు గ్రామంలో వున్న వూరి పెద్ద స్పెయిన్ లో వున్న మనవడు రావాలని కోరుకోవడంతో మొదలవుతుంది మిస్టర్ హీరో కథ. స్పెయిన్ లో ఈ మిస్టర్ హీరోయిన్ హెబ్బా పటేల్ తో ప్రేమలో పడతాడు. ఆమె ఇంటర్వెల్ దగ్గర వేరొకర్ని ప్రేమిస్తున్నా నంటుంది. వాడితో పెళ్లి ప్రాబ్లం  అవుతుంది. ఆ ప్రాబ్లం తీర్చడానికి మిస్టర్  సరిహద్దు ఆ గ్రామానికి వెళ్తాడు. అక్కడ పారిపోతూ సెకండ్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ తగుల్తుంది. ఈమెని మిస్టరే  ఎత్తుకుపోయాడని ఆమె తండ్రి మరణ శిక్ష విధిస్తాడు. చివరినిమిషంలో ఆమె తమ్ముడు మిస్టర్  చావకుండా కాపాడతాడు. అప్పుడు మిస్టర్  వొంటి మీద ఏదో పుట్టు మచ్చ చూసిన హీరోయిన్ తండ్రి,  మిస్టర్ తో నిశ్చితార్ధం జరిపేస్తాడు... ఇలావుంటుంది ఈ గజిబిజి కథ. 

          బాగా కష్ట పడి  ఈ కథని హిట్ చేయాలనీ ‘ఊపిరి’ లో  నాగార్జున పాత్రతో సెటైర్ కూడా చేశారు రఘుబాబు నుపయోగించుకుని. ఇది చప్పగా తేలిపోయింది. ప్రేక్షకులెవరికీ నవ్వే రాలేదు. ఫస్టాఫ్ లో హీరోయిన్ కన్ఫ్యూజన్  కామెడీతో, మిస్టర్ ఇంట్లో పాత ఫ్యామిలీ సెంటి మెంట్లతో, వాళ్ళ కామెడీతో, అక్కడో ఫారిన్ బాల నటుడితో, శ్రీనివాస  రెడ్డితో, ఆఖరికి సినిమా డైరెక్టర్ గా పృథ్వీ తో కామెడీ కోసం చాలా  పట్లు పడ్డారు. ప్రేక్షకులె వరికీ నవ్వు రా లేదు. 

          ఇక సెకండాఫ్  మొదలవగానే  ఆ సరిహద్దు గ్రామపు పిచ్చిమాలోకం మొదలు. ఇక్కడ గాంధేయ వాదులూ, శ్రీ కృష్ణ దేవరాయలి ఫ్యాన్సూ వాళ్ళ పిచ్చి పిచ్చి  సాంప్రదాయాలూ ప్రవర్తనలూ- దీనికి షకలక శంకర్ కామెడీ ఏదీ నవ్వించలేదు.  ఇంకా మందుకు పోతే ‘పెళ్లిచూపులు’ కమెడియన్లు కూడా తలో చెయ్యేసి కామెడీ కోసం పాట్లు పడాల్సి వచ్చింది. ఈ భారీ ఫ్లాపుకి  భారీగా కష్టపడడానికి ఏమేమో చేశారు. చివరికి అనుకున్న ఫలితం సాధించారు.

         ఇక ఏ  హీరోయిన్ కోసం ఏ గ్యాంగు గుంపుగా వచ్చి పడుతున్నారో అర్ధం కానంత భారీగా కూడా కష్ట పడ్డారు. ఇంటర్వెల్లో నైతే ఎంతకీ ముగియని యాక్షన్ సీన్లు సాగదీసి సాగదీసి ఒక మ్యూజియం ఐటెం గా తయారు చేశారు. అసలు ఇంత మంది ఆర్టిస్టుల మధ్య బంధుత్వాలు, బాగోతాలు గుర్తుంచుకోవాలంటే కూడా అపార మైన జ్ఞాపక శక్తి మనకుండాలి. 

          ఒక ముక్కోణ ప్రేమ కథ- ఇందులో  అటు అమ్మాయి తరపు, ఇటు అమ్మాయి తరపు ముఠాలు- మధ్యలో ఏం చేయాలో తెలియక బలిమేకలా మిస్టర్!  కానీ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ కి తను గతంలో స్టార్స్ తో తీసిన సినిమాలతో పోలిస్తే ఈ  సినిమాలో హీరో కోమాలో వున్నాడని తెలిసే వుండాలి. కోమా హీరోతో ఎందుకు పెట్టుకున్నట్టో అర్ధం గాదు. తన సినిమాల్లో పాటలు కూడా హిట్టయ్యేవి. ఈ సారి పాటలు కూడా కోమాలో కెళ్ళి పోయాయి. తన సినిమాల్లో సెంటిమెంట్లు కూడా బలంగా ఉండేవి, ఈ సారి బలవంతంగా సెంట్లు పూసుకున్నట్టు వుంది. ఒక్క నిర్మాణ విలువలే తనకి తగ్గట్టుగా వున్నాయి.

          సింపుల్ గా ఒక హీరో- అతడికో ఉపద్రవం- అతడి విజయం –ఈ ముక్కోణాన్ని మర్చిపోయి – భారీ కసరత్తులు, ‘బెన్ హర్’ తీస్తున్నట్టు భారీ సంఖ్యలో నటీ నటులు, ‘టెన్ కమాండ్ మెంట్స్’ తీస్తున్నట్టు ఆ పిచ్చిమాలోకం గ్రామంలో పెత్తందారీ తీర్పులు, మరణ శిక్షలు,  ఆఖరికి  ‘కొత్త కాపురం’ తీస్తున్నట్టు కర్ర ఫైటింగులతో క్లైమాక్స్!  ఇన్ని చూపించిన ఈ ప్రయోగశాల భావితరాలకి వధ్యశిల!


-సికిందర్




          

Thursday, April 13, 2017

      క్రైం జానర్ మీద వ్యాసాలు  ఎవరి కోసం రాయాలన్న సందేహం వచ్చిందన్నాం  ప్రారంభ వ్యాసంలోనే. క్రైం జానర్ గురించి తెలియని పరిస్థితుల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి దాని గురించి ఏం చెప్పినా సంస్కృతం చెప్తున్నట్టో, అరబ్బీ భాష మాటాడుతున్నట్టో వింతగా వుండొచ్చు. 2000 నుంచీ ఇప్పటిదాకా తెలుగులో ఇంకా ప్రేమ సినిమాల గొడవే  నడుస్తోంది, అవి ఆడినా ఆడకపోయినా. వీటితో బాటు యాక్షన్, హార్రర్ కామెడీలూ వున్నాయి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా వీటిని మాత్రమే చూస్తూ పెరిగిన తరానికి, సినిమా తీయడానికి వస్తే, తమకి సినిమా జ్ఞానం కల్పించిన  అవే రోమాంటిక్ కామెడీలు, అవే హార్రర్ కామెడీలే  తప్పనిసరవుతున్నాయి.  ప్రతీ కొత్త దర్శకుడూ విసుగు లేకుండా వీటినే తీస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. తమకి తెలిసిన జానర్స్ ఈ రెండే అయ్యాయి. వీటితో బాటు యాక్షన్ సినిమాలు కూడా చూస్తూ పెరిగినప్పటికీ,  ఆ చూసిన యాక్షన్ సినిమాలు క్రైం సినిమాలు కావు. యాక్షన్ కీ, క్రైం కీ చాలా తేడా వుంది. ఇలాంటప్పుడు ఈ డార్క్ (క్రైం) మూవీస్ ప్రపంచం గురించి కొత్తగా వ్యాసాలు  ఏమర్ధమవుతాయి?

          ‘కౌన్ కిత్నే పానీమే’ (ఎవరెంత మునిగారు) అనే ఒక ఛోటా హిందీ సెటైరికల్ సినిమాలో ఓపెనింగ్ డైలాగు వుంటుంది... ‘కాలం వినాశకారి. ఆదిమ కాలంలో  డైనోసారస్ లని అంతం  చేసింది, తర్వాత ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో రాజుల్నీ రాజ్యాల్నీ అంతం చేసింది’ ... అని. ఇంతటి శక్తి వున్న కాలానికి  తెలుగు ‘రోమ్- కామ్’ (రోమాంటిక్ కామెడీలు) జనరేషన్ దర్శకులు వచ్చేసి  చచ్చినా లొంగడం లేదు. రోమాంటిక్ కామెడీలతో ఎవరెంత మునిగారో, ఇంకా మునుగుతున్నారో తెలిసినా, వారం వారం ఇంకా  తెలుస్తూనే వున్నా-  కాలాన్నే  ఓడించడానికి  కంకణం కట్టుకున్నారు. కొత్త కొత్త మొహాలతో నల్గురైదుగురు  ప్రేక్షకులే దొరకని అవే   ‘రోమ –కామ’ వికారాలకి పోతున్నారు. ఒకవేళ మునక్కూడదని వాళ్ళ తో బాటు వాళ్ళ నిర్మాతలకీ ఇంకేదైనా  చేద్దామని అన్పించినా – పట్టుకోవడానికి ఈ గడ్డిపోచ తప్ప ఇంకోటి కన్పించడం లేదు. చూసి చూసి ఇలా కాదని కాలమే ఒక పడవ పంపించింది పక్క రాష్ట్రాల నుంచి. అందులోకి ఈ నయా మేకర్స్ కాకుండా,  ప్రేక్షకులే ఎక్కేశారు. ఇక నవ్వుల నదిలో పువ్వుల పడవా  – పాటేసుకుని హైలెస్సా తెడ్డేసుకుంటూ సాగిపోతున్నారు జల్సాగా. 

           అయినా నయా  మేకర్స్ కి దీనర్ధమేమిటా అని బోధపడ్డం లేదు. అదృష్టానికో దురదృష్టానికో ఈ వ్యాసకర్తతో కనెక్ట్ అయి వున్న కొందరు నయా మేకర్స్ కి-  పడవా వచ్చిందే పిల్లా పండగ వచ్చిందే – పాటతో టీజ్ చేసినా స్పందనలే కరువవుతున్నాయి. ఇలాంటప్పుడు ఈ వ్యాసాలు  ఎవరికోసం? కాలం ఇంకేం చెయ్యాలి? కాలం  అంతం చేసిన రాక్షస బల్లులకంటే దళసరి చర్మాల  రోమ – కామ వికారాల ఆటలోంచి బయట పడెయ్యడమెలా? ఇక్కడో ఆదిత్యా నాథ్ పుట్టాలా? 

          ఈ సంవత్సరం మార్చి వరకూ మూడు నెలల్లో పక్క రాష్ట్రాల నుంచి కనుపాప, 16 -డి, నగరం, మెట్రో అనే నాల్గు తెలుగు ప్రేక్షకులకి తెలియని కొత్త పడవ లొచ్చాయి. కొత్త మొహాలతో వచ్చి పడుతున్న తెలుగు ప్రేమ సినిమాల వైపు చూడ్డం పూర్తిగా మానేసిన ప్రేక్షకులు,  ఈ డార్క్ మూవీస్  డబ్బింగుల్లో తెలియని  కొత్త వాళ్లున్నా విరగబడి చూశారు. సందీప్ కిషన్- రెజీనాలు లాంటి పాపులర్ స్టార్స్ నటించిన ‘నగరం’ లో పాటలూ కామెడీలూ   లేకపోయినా,  పదిరూపాయల టికెట్ ప్రేక్షకుడు కూడా సంతృప్తి కరంగా చూశాడు. ప్రేక్షకుల్లో ఈ మార్పుకి కారణ మేమిటి? ఈ డార్క్ మూవీస్ మిగతా జానర్స్ లా కాకుండా వాస్తవికతకి, నిజ జీవితాలకి దగ్గరగా వుంటాయి. నేల మీద నడుస్తాయి. ఇప్పుడు నేల మీద నడిచే చిన్న సినిమాలు కావాలి తెలుగు ప్రేక్షకులకి. ప్రేక్షకులు ఏ సినిమాని ఎలా చూడాలో అర్ధం జేసుకుంటున్నారు. నయా మేకర్లకే వాస్తవాలు తెలీక లేనిపోని భయాలతో అవే అవాస్తవిక రోమకామాలు తీసుకుంటున్నారు. ఇలా ఈ డబ్బింగుల సాక్ష్యంగా  కాలం ఇంత క్లియర్ గా పరిస్థితి చెప్తూంటే ఎవరైనా ఆగి ఆలోచించాల్సిందే. 

          డార్క్ మూవీస్ కి తెలుగులో నిర్మాతలు దొరుకుతారా అన్న ప్రశ్న కూడా రావొచ్చు నిజమే.  ఇంకో సినిమాకే కన్పించని కొత్త కొత్త మొహాలతో  అవే రొటీన్ ప్రేమ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్న నిర్మాతలు కూడా పరిస్థితి గ్రహించి  సహకరిచాల్సి వుంటుంది. అలా తమిళ డబ్బింగు లైతే చూస్తారు గానీ, అవే తెలుగులో తీస్తే చూడరన్న ఒక అభిప్రాయం ఎప్పట్నించో వుంది. దృశ్యం, ధృవ లాంటి తమిళ సినిమాల్ని తెలుగులో రీమేక్ చేస్తే ఆడాయి. డబ్బుకోసం వ్యాపారం చేసే నిర్మాతల లెవరికైనా ప్రేమ సినిమాలకి  మార్కెట్ ఎలా మూసుకుపోయిందో, డార్క్ డబ్బింగుల ట్రెండ్ తో తిరిగి ఎలా వికసిస్తోందో మార్కెట్ స్పృహతో వివరిస్తే వాళ్ళే పునరాలోచనలో పడతారు. తమిళం లో 16- డి తీసిన 22 ఏళ్ల కొత్త దర్శకుడికి హీరోగా రెహమాన్ తప్ప నిర్మాతలే దొరకలేదు. తనే డబ్బు పోగేసుకుని తీసేసి  సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడిప్పుడు. ఇలాంటివి కూడా నిర్మాతలకి ఇన్స్ పిరేషన్ అవుతాయి, కావాలి కూడా.   

       సమస్యల్లా డార్క్ మూవీస్ తీసే విషయ పరిజ్ఞానం గురించే. డార్క్ మూవీస్ గురించిన విషయ పరిజ్ఞానం లేకపోతే  ధృవ లాంటిది తీసేసి ఇది కూడా నేర పరిశోధనే కదా అనొచ్చు. యాక్షన్ మూవీస్ లో వుండేది  అచ్చమైన నేర పరిశోధన కాదు, అచ్చోసి వదిలిన నేర పరిశోధన. యాక్షన్ మూవీస్  ఏ లాజిక్ నీ పట్టించుకోవు, వాస్తవికతా  వుండదు. కానీ క్రైం –డార్క్ మూవీస్ కి ఈ రెండూ ప్రాణం. ‘రోమ్ – కామ్’ ట్రెండ్ నయా మేకర్లు ధృవ లాంటి యాక్షన్ మూవీస్ సులభంగా తీసి పడెయ్యొచ్చు. ఎందుకంటే తాము ఇలాటి యాక్షన్ మూవీస్ కూడా చూస్తూనే కదా పెరిగారు. కాబట్టి వీటి వరకూ విషయ పరిజ్ఞానం వుంటుంది. కానీ క్రైం జానర్ లో తీయాలంటే కొత్తగా  అ- ఆ- లంటూ అక్షరాలు దిద్దుకోవాలి.  లేకపోతే  జన్మలో కనుపాప, 16 -డి, నగరం, మెట్రో, పింక్, కహానీ- 2 లాంటివి తీయనే తీయలేరు. ఏవో ఆషామాషీ యాక్షన్ సినిమాలు తీసుకుంటూ దయనీయంగా మిగిలిపోవాల్సిందే. 

           సరే, ఏ ఒకరికో ఇద్దరికో ఈ సుడిగుండం లోంచి బయటపడితేనే గుర్తింపూ భవిష్యత్తూ వుంటాయని  ఖచ్చితంగా  అన్పించి ఇటు వైపు కొనసాగాలన్పించిందనుకుందాం - ఇలాటి వాళ్ళ కి ఈ వ్యాసాలు పనికి రావొచ్చు. ఇతరులు  కాలక్షేపంగా చదివి వదిలేసి,  అవే రోమాంటిక్ కామెడీలూ, ఈ జానర్ కూడా తెలీక రోమాంటిక్ కామేడీ లనుకుంటూ ఈ కాలంలో చెల్లని రో మాంటిక్ డ్రామాలూ,  చాదస్తాలూ తీసుకుంటూ వుంటే  సరిపోతుంది. 

          కానీ ఈ డార్క్ మూవీస్ తోనే రచయితలకీ, దర్శకులకీ  ప్రొఫెషనలిజం వస్తుందనేది నిజం.  ఎందుకంటే అడుగడుగునా ఇవి ప్రొఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తాయి. ప్రధానంగా పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల గురించి విషయపరిజ్ఞానాన్ని ఇవి డిమాండ్ చేస్తాయి. ఇవి లేకపోతే వీటిలో రాణించలేరు. కేవలం ప్రేమ సినిమాలూ, హార్రర్ కామెడీలూ ఇతర యాక్షన్ సినిమాలూ వంటివి  చూస్తూ ఈ రెండు దశాబ్దాల కాలం గడిపేసినందువల్లే  వ్యవస్థల పరిజ్ఞానం లేకుండా పోయిందనీ, డిటెక్టివ్ నవలలు  చదివుంటే, క్రైం సినిమాలూ  చూసి  అర్ధం జేసుకుని వుంటే పోలీసు- న్యాయవ్యవస్థల పనితీరులు తెలిసి వుండేవనీ చెప్పడం కూడా కాదిక్కడ. ఆర్ధిక సంస్కరణల పుణ్యమాని 2000 నుంచి అన్ని రంగాల్లో చోటుచేకున్న బూమ్ తో రకరకాల చదువులూ, ఉద్యోగాల  వేటా తప్ప సాంస్కృతికంగా, సామాజికంగా, సృజనాత్మకంగా  ఇంకేదీ పట్టకుండా యువతరం తయారైన మాట మాత్రం నిజం.  కొందరు ఎంబీయే  చదివిన వాళ్ళనే  అడగండి, పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరెవరుంటారో తెలీదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరో తెలీదు. పోనీ బెయిల్, ఛార్జిషీట్ల గురించి తెలుసా అన్నా కూడా తెలీదనే తలూపుతారు.  ఇదీ  పరిస్థితి.

          అయితే ఇదే సమయంలో టెక్నాలజీ అర చేతిలో కొచ్చేసి షార్ట్ ఫిలింలు తీయడం అందరికీ వచ్చేశాక- ఒక శుభపరిణామం సంభవిస్తోంది. ఈ షార్ట్ ఫిలిమ్స్ పుణ్యమా అని రచన చేయడం నేర్చుకోవడం మొదలెట్టారు!  షార్ట్  ఫిలిమ్స్ వచ్చేసి వూరూరా టీనేజర్స్ ని కూడా రైటర్స్ గా  మార్చేస్తున్నాయి. ఇలా ఏదో ఒకటి వూహించి కథ రాస్తున్నాడంటే  అదొక సృజనాత్మక, కాల్పనిక, సాంస్కృతిక, సామాజిక  వ్యక్తీకరణే కదా ఇన్నాళ్ళకి! లేకపోతే ఏం కథలు చదివేవాడని వీడు? ఏం రాసేవాడని? ఆనాడు డిటెక్టివ్ సాహిత్యం  వచ్చేసి సామాన్యుల్లో చదివే ఆసక్తి పెంచినట్టు, ఈనాడు షార్ట్ ఫిలిమ్స్  కథలు రాయడాన్ని నేర్చుకునేలా చేస్తున్నాయన్న మాట. 

         అయితే ఈ షార్ట్ ఫిల్మిస్టులు కూడా ఏవో జోకులూ, తమ వయసుకి  తెలిసిన అచ్చి బుచ్చి ప్రేమలూ రాసుకుంటూ ఇంకొక  డేంజరస్ వ్యవహారంగా తయారవుతున్నారు తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రాణానికి. అసలే సినిమా ఫీల్డు లోపల అచ్చి బుచ్చి రోమ కామీయులు క్రిక్కిరిసి వున్నారనుకుంటూంటే, ఫీల్డు బయట కూడా ఇలా తయారై  ఫీల్డు మీదికి దండెత్తి రాబోతున్నారన్న మాట. ముందుకాలంలో ఇంకా రోమ్- కామ్ లతో ప్రేక్షకుల్ని రాచిరంపాన పెట్టేందుకు కత్తులు నూరుతున్నారన్న మాట!

          యాంటీ వైరస్ అవసరం. అదేమిటో ఇప్పుడే మనం కనిపెట్టలేక పోతున్నాం. కానీ తమిళనాడులో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ప్రతీ వాడూ క్రైం జానర్ సినిమా తీసిన వాడే. దీనికి ఆద్యుడు కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, జిగర్తాండ లతో అతను వేసిన ముద్ర షార్ట్ ఫిలిం మేకర్లని క్రైం జానర్ వైపు- డార్క్ మూవీస్ వైపు -  మళ్లేలా చేసింది.  చివరికి 16 –డి తీసిన  22 ఏళ్ల కార్తీక్ నరేన్ సహా! 

          వీళ్ళ సినిమాల్ని స్టడీ చేసినా నియో నోయర్ సినిమా అంటే ఏమిటో అర్ధమవుతుంది. అసలు డార్క్ మూవీస్ (ఫిలిం నోయర్) అనేవి హాలీవుడ్ లో 1930లలో డిటెక్టివ్ సాహిత్యంలోంచి పుట్టాయని చెప్పుకున్నాం. కలర్ సినిమా లొచ్చేటప్పటికి అవి నియో నోయర్ గా అభివృద్ధి చెందాయి. తెలుగులో ఇలా జరగలేదు. 1970 లలో బ్లాక్ అండ్ వైట్  లో క్రైం సినిమాలంటూ చాలా వచ్చాయి. వీటిలో హీరో కృష్ణ నటించినవే ఎక్కువ. అయితే ఇవి నోయర్ సినిమాలు కావు, యాక్షన్ సినిమాలు. తెలుగు డిటెక్టివ్ నవలలు కూడా పెద్దగా తెర కెక్కిన చరిత్ర లేదు. కొమ్మూరి సాంబ శివరావు నవలలు   ‘పట్టుకుంటే లక్ష’,  ‘నకిలీ మనిషి’ రెండే సినిమాలుగా కన్పిస్తాయి. ‘పట్టుకుంటే లక్ష’ ( 1971-బ్లాక్ అండ్ వైట్) లో డిటెక్టివ్ యుగంధర్ గా నాగభూషణం నటిస్తే, అసిస్టెంట్ రాజుగా కృష్ణ నటించారు. ‘నకిలీ మనిషి’ (1980- కలర్) అపరాధ పరిశోధక కథ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్.  ఇందులో చిరంజీవి నటించారు. ఈ రెండు తప్ప ఇంకో డిటెక్టివ్ నవల తెరకెక్కిన ఆధారాలు కన్పించవు.

       అయితే ఇప్పుడు నియో నోయర్ డార్క్ మూవీ తీయాలంటే డిటెక్టివ్ సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు.  ఇందుకే గత రెండు వ్యాసాల్లో తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని పరిచయం చేశాం. ఈ వ్యాసాల్ని  బాగా అర్ధం చేసుకోగలగాలి. డిటెక్టివ్ అన్న పదం కూడా ఈరోజుల్లో చాలా మందికి తెలీదు. ముందుగా ఈ సాహిత్యం చదివితే నేరపరిశోధన గురించి అవగాహన ఏర్పడుతుంది. చదివితే వచ్చే  జ్ఞానం చూస్తే రాదు. కొమ్మూరి సాంబశివరావు నవలలు కొత్తగా మార్కెట్ లో కొచ్చాయి. ఇవి నలభై రూపాయల చొప్పున దొరుకుతున్నాయి. వీలైనన్ని కొనుక్కుని చదువుకుంటే మంచిది. ఇంగ్లీషు భాష తెలిస్తే ఇంగ్లీషులో బోలెడు డిటెక్టివ్ సాహిత్యం ఇప్పటికీ అందుబాటులో వుంది. 

          ఇప్పుడు డిటెక్టివ్ లేడు. పోలీస్ అధికారులతోనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ కథలు / సినిమాలు వస్తున్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ గురించి తెలుకోవడం అవసరం. న్యాయవ్యవస్థ గురించి కూడా- కనీసం సెక్షన్ 302 అంటే ఏమిటో లాంటి ప్రాథమిక జ్ఞానం పొందడం అవసరం. ఫోరెన్సిక్ లాబ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ వ్యవస్థలు సమాజంతో, మన నిత్య జీవితంతో ముడిపడి వున్నాయి- వీటి పరిజ్ఞానం లేకుండా పౌరులుగా కొనసాగడం కూడా  కష్టమే.

Next : డార్క్ మూవీస్ వర్సెస్ యాక్షన్ మూవీస్

-సికిందర్
http://www.cinemabazaar.in/






         


Wednesday, April 12, 2017








     ‘‘హాలీవుడ్లో సిడ్ఫీల్డ్‌  అని రచయిత ఉన్నాడు. స్క్రీన్ప్లే ఎలా రాయాలనే విషయంలో ఆయన సబ్కా బాప్‌. స్క్రీన్ప్లే మీద బుక్స్రాశాడు. హాలీవుడ్అంతా ఆయన్నే ఫాలో అవుతోంది. నేనూ బుక్చదివా. అలాంటాయన రెండు సినిమాలకు కథలు రాస్తే, రెండూ ఫ్లాపే. థియరీ వేరు, ప్రాక్టికల్వేరు. సినిమా హిట్టూఫ్లాపులు మన చేతుల్లో ఉండవు’’ – ‘రోగ్’  విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ లో పూరీ జగన్నాథ్ స్టేట్ మెంట్. 

         కలం కోతికి ఇలా అన్పించడం లేదు. దాని ఇన్ఫర్మేషన్ వేరే వుంది : సిడ్ ఫీల్డ్ హాలీవుడ్ లో సినిమాలకి కథలూ స్క్రీన్ ప్లేలూ రాశారు నిజమే, కానీ అది ‘స్క్రీన్ ప్లే గురు’ గా మారడానికి చాలా ముందు. 1967 లో డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ గా ప్రవేశించి ‘స్ప్రీ’ అనే ఒక డాక్యుమెంటరీకి రాశారు. తర్వాత హలీవుడ్ లో స్ట్రగుల్ చేస్తూ ఏడు స్క్రీన్ ప్లేలకి సహ రచయితగా పనిచేశారు. అక్కడ విసిగి ‘సినీమొబైల్’ అనే కంపెనీలో స్క్రిప్టులు చదివే ఉద్యోగంలో కుదిరారు. అక్కడ రెండు వేల స్క్రిప్టులు చదివి, వాటిలో స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పట్టుకున్నారు. ఇక తన గమ్యం ఏమిటో అర్ధమైంది. దానివైపు సాగిపోయారు. స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని కొత్తగా నిర్వచిస్తూ మూడు స్క్రీన్ ప్లే పుస్తకాలూ రాశారు. అవి బ్రహ్మాండాన్ని బద్దలు చేశాయి. 1979 నుంచీ స్క్రీన్ ప్లే ట్యూటర్ గా మారిపోయారు. ఇంకా పుస్తకాలూ రాశారు. 29 భాషల్లో ఈ పుస్తకాలు అనువాదమయ్యాయి. ‘స్క్రీన్ ప్లే వర్క్ బుక్’ అన్న పుస్తకం ఒక్కటే 40 సార్లు పునర్ముద్రితమైంది. ఈ పుస్తకం 400 విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకమైంది. సిడ్ ఫీల్డ్ కి హాలీవుడ్ సినిమాలకి కథలు రాసేంత తీరికా ఆసక్తీ లేవు. ప్రపంచవ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహిస్తూ తన స్టూడెంట్స్ కి  శిక్షణ ఇవ్వడంతోనే సరిపోతోంది. ఆయన స్కూల్ నుంచి వచ్చిన శిష్యులు ఎవరంటే- ఆస్కార్ అవార్డ్ విజేత  దర్శకుడు ఆల్ఫాన్సో క్వారాన్ (గ్రావిటీ),  గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్  అయిన  రచయిత/ దర్శకుడు జడ్ అపటోవ్ (బ్రైడ్స్ మెయిడ్స్, గర్ల్స్),  మూడు సార్లు ఆస్కార్ కి నామినేట్ అయిన రచయిత/ నిర్మాత ఫ్రాంక్ డరబొంట్ (షషాంక్ రిడెంప్షన్, ది గ్రీన్ మైల్), ఆస్కార్ కి నామినేట్ అయిన రచయిత్రి  అన్నా హేమిల్టన్ ఫెలాన్ ( మాస్క్, గోరిల్లాస్, మిస్ట్),  రెండు సార్లు ఆస్కార్  కి నామినేట్ అయిన దర్శకుడు/రచయిత జాన్ సింగిల్టన్ ( బాయ్స్ అండ్ ది  హుడ్, పోయెటిక్ జస్టిస్), రచయిత్రి రాండీ మేయన్ సింగర్ (మిసెస్ డౌట్ ఫైర్), రచయిత్రి లారా ఎస్క్యూవేల్ (లైక్ వాటర్ ఫర్ చాకొలేట్), రచయిత కెవిన్ విలియంసన్  (వాంపైర్, స్క్రీమ్  -1,2,3,4) తదితరులెందరో  వున్నారు. ఇంతే కాదు, సిడ్ ఫీల్డ్ ముంబాయి వచ్చి అమీర్ ఖాన్ నటించిన ‘రంగ్ దే బసంతీ’,  షారుఖ్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’  అనే రెండు విజయవంతమైన బాలీవుడ్  సినిమాలకి పనిచేసి వెళ్లారు కూడా. 

       విషయం ఇలా వుండగా, ‘హాలీవుడ్లో సిడ్ఫీల్డ్‌  అని రచయిత ఉన్నాడు’ - అని పూరీ తేలిక చేసి మాట్లాడడం అన్యాయం. ‘అలాంటాయన రెండు సినిమాలకు కథలు రాస్తే, రెండూ ఫ్లాపే. థియరీ వేరు, ప్రాక్టికల్వేరు’ అనడం ఇంకా అన్యాయం. సిడ్ ఫీల్డ్  రచయితగా స్ట్రగుల్ చేస్తున్న కాలంలో అదృష్టవశాత్తూ తన గమ్యం ఏమిటో తెలిసిపోయాక, తను కనుగొన్న స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పట్టుకుని అటువైపుగా సాగిపోయారు. విశ్వవిద్యాలయ్యాల్లో పాఠ్యాంశమయ్యారు. ఆస్కార్ స్థాయి రచయితల్ని, దర్శకులని అందించిన అంతర్జాతీయ గురువు అయ్యారు. 70 ఏళ్ల  వయసులో బాలీవుడ్ వచ్చి రెండు హిట్ సినిమాలకి రాసిపోయారు. థియరీ వేరు- ప్రాక్టికల్ వేరు అని  అలవాటుగా అనేస్తూంటారు. అసలు థియరీ తెలుసుకోకుండా చేస్తున్న ప్రాక్టికల్స్ తోనే వరస ఫ్లాపులు. పాత మూసగా, అవే ఫార్ములా నమ్మకాలతో రాసుకుంటున్న స్క్రీన్ ప్లేలకి దీటుగా స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని నవీకరించి సులభంగా అర్ధమయ్యేట్టు చేసిన  ఒక ప్రఖ్యాత పండితుడి సేవల్ని గుర్తించకుండా,  చులకన చేసి మాటాడ్డం సీనియర్ దర్శకుడుగా తనకి ఎంతవరకు సబబో పూరీ విజ్ఞతకే వదిలేద్దాం.

-సికిందర్