రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, April 13, 2017

      క్రైం జానర్ మీద వ్యాసాలు  ఎవరి కోసం రాయాలన్న సందేహం వచ్చిందన్నాం  ప్రారంభ వ్యాసంలోనే. క్రైం జానర్ గురించి తెలియని పరిస్థితుల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి దాని గురించి ఏం చెప్పినా సంస్కృతం చెప్తున్నట్టో, అరబ్బీ భాష మాటాడుతున్నట్టో వింతగా వుండొచ్చు. 2000 నుంచీ ఇప్పటిదాకా తెలుగులో ఇంకా ప్రేమ సినిమాల గొడవే  నడుస్తోంది, అవి ఆడినా ఆడకపోయినా. వీటితో బాటు యాక్షన్, హార్రర్ కామెడీలూ వున్నాయి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా వీటిని మాత్రమే చూస్తూ పెరిగిన తరానికి, సినిమా తీయడానికి వస్తే, తమకి సినిమా జ్ఞానం కల్పించిన  అవే రోమాంటిక్ కామెడీలు, అవే హార్రర్ కామెడీలే  తప్పనిసరవుతున్నాయి.  ప్రతీ కొత్త దర్శకుడూ విసుగు లేకుండా వీటినే తీస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. తమకి తెలిసిన జానర్స్ ఈ రెండే అయ్యాయి. వీటితో బాటు యాక్షన్ సినిమాలు కూడా చూస్తూ పెరిగినప్పటికీ,  ఆ చూసిన యాక్షన్ సినిమాలు క్రైం సినిమాలు కావు. యాక్షన్ కీ, క్రైం కీ చాలా తేడా వుంది. ఇలాంటప్పుడు ఈ డార్క్ (క్రైం) మూవీస్ ప్రపంచం గురించి కొత్తగా వ్యాసాలు  ఏమర్ధమవుతాయి?

          ‘కౌన్ కిత్నే పానీమే’ (ఎవరెంత మునిగారు) అనే ఒక ఛోటా హిందీ సెటైరికల్ సినిమాలో ఓపెనింగ్ డైలాగు వుంటుంది... ‘కాలం వినాశకారి. ఆదిమ కాలంలో  డైనోసారస్ లని అంతం  చేసింది, తర్వాత ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో రాజుల్నీ రాజ్యాల్నీ అంతం చేసింది’ ... అని. ఇంతటి శక్తి వున్న కాలానికి  తెలుగు ‘రోమ్- కామ్’ (రోమాంటిక్ కామెడీలు) జనరేషన్ దర్శకులు వచ్చేసి  చచ్చినా లొంగడం లేదు. రోమాంటిక్ కామెడీలతో ఎవరెంత మునిగారో, ఇంకా మునుగుతున్నారో తెలిసినా, వారం వారం ఇంకా  తెలుస్తూనే వున్నా-  కాలాన్నే  ఓడించడానికి  కంకణం కట్టుకున్నారు. కొత్త కొత్త మొహాలతో నల్గురైదుగురు  ప్రేక్షకులే దొరకని అవే   ‘రోమ –కామ’ వికారాలకి పోతున్నారు. ఒకవేళ మునక్కూడదని వాళ్ళ తో బాటు వాళ్ళ నిర్మాతలకీ ఇంకేదైనా  చేద్దామని అన్పించినా – పట్టుకోవడానికి ఈ గడ్డిపోచ తప్ప ఇంకోటి కన్పించడం లేదు. చూసి చూసి ఇలా కాదని కాలమే ఒక పడవ పంపించింది పక్క రాష్ట్రాల నుంచి. అందులోకి ఈ నయా మేకర్స్ కాకుండా,  ప్రేక్షకులే ఎక్కేశారు. ఇక నవ్వుల నదిలో పువ్వుల పడవా  – పాటేసుకుని హైలెస్సా తెడ్డేసుకుంటూ సాగిపోతున్నారు జల్సాగా. 

           అయినా నయా  మేకర్స్ కి దీనర్ధమేమిటా అని బోధపడ్డం లేదు. అదృష్టానికో దురదృష్టానికో ఈ వ్యాసకర్తతో కనెక్ట్ అయి వున్న కొందరు నయా మేకర్స్ కి-  పడవా వచ్చిందే పిల్లా పండగ వచ్చిందే – పాటతో టీజ్ చేసినా స్పందనలే కరువవుతున్నాయి. ఇలాంటప్పుడు ఈ వ్యాసాలు  ఎవరికోసం? కాలం ఇంకేం చెయ్యాలి? కాలం  అంతం చేసిన రాక్షస బల్లులకంటే దళసరి చర్మాల  రోమ – కామ వికారాల ఆటలోంచి బయట పడెయ్యడమెలా? ఇక్కడో ఆదిత్యా నాథ్ పుట్టాలా? 

          ఈ సంవత్సరం మార్చి వరకూ మూడు నెలల్లో పక్క రాష్ట్రాల నుంచి కనుపాప, 16 -డి, నగరం, మెట్రో అనే నాల్గు తెలుగు ప్రేక్షకులకి తెలియని కొత్త పడవ లొచ్చాయి. కొత్త మొహాలతో వచ్చి పడుతున్న తెలుగు ప్రేమ సినిమాల వైపు చూడ్డం పూర్తిగా మానేసిన ప్రేక్షకులు,  ఈ డార్క్ మూవీస్  డబ్బింగుల్లో తెలియని  కొత్త వాళ్లున్నా విరగబడి చూశారు. సందీప్ కిషన్- రెజీనాలు లాంటి పాపులర్ స్టార్స్ నటించిన ‘నగరం’ లో పాటలూ కామెడీలూ   లేకపోయినా,  పదిరూపాయల టికెట్ ప్రేక్షకుడు కూడా సంతృప్తి కరంగా చూశాడు. ప్రేక్షకుల్లో ఈ మార్పుకి కారణ మేమిటి? ఈ డార్క్ మూవీస్ మిగతా జానర్స్ లా కాకుండా వాస్తవికతకి, నిజ జీవితాలకి దగ్గరగా వుంటాయి. నేల మీద నడుస్తాయి. ఇప్పుడు నేల మీద నడిచే చిన్న సినిమాలు కావాలి తెలుగు ప్రేక్షకులకి. ప్రేక్షకులు ఏ సినిమాని ఎలా చూడాలో అర్ధం జేసుకుంటున్నారు. నయా మేకర్లకే వాస్తవాలు తెలీక లేనిపోని భయాలతో అవే అవాస్తవిక రోమకామాలు తీసుకుంటున్నారు. ఇలా ఈ డబ్బింగుల సాక్ష్యంగా  కాలం ఇంత క్లియర్ గా పరిస్థితి చెప్తూంటే ఎవరైనా ఆగి ఆలోచించాల్సిందే. 

          డార్క్ మూవీస్ కి తెలుగులో నిర్మాతలు దొరుకుతారా అన్న ప్రశ్న కూడా రావొచ్చు నిజమే.  ఇంకో సినిమాకే కన్పించని కొత్త కొత్త మొహాలతో  అవే రొటీన్ ప్రేమ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్న నిర్మాతలు కూడా పరిస్థితి గ్రహించి  సహకరిచాల్సి వుంటుంది. అలా తమిళ డబ్బింగు లైతే చూస్తారు గానీ, అవే తెలుగులో తీస్తే చూడరన్న ఒక అభిప్రాయం ఎప్పట్నించో వుంది. దృశ్యం, ధృవ లాంటి తమిళ సినిమాల్ని తెలుగులో రీమేక్ చేస్తే ఆడాయి. డబ్బుకోసం వ్యాపారం చేసే నిర్మాతల లెవరికైనా ప్రేమ సినిమాలకి  మార్కెట్ ఎలా మూసుకుపోయిందో, డార్క్ డబ్బింగుల ట్రెండ్ తో తిరిగి ఎలా వికసిస్తోందో మార్కెట్ స్పృహతో వివరిస్తే వాళ్ళే పునరాలోచనలో పడతారు. తమిళం లో 16- డి తీసిన 22 ఏళ్ల కొత్త దర్శకుడికి హీరోగా రెహమాన్ తప్ప నిర్మాతలే దొరకలేదు. తనే డబ్బు పోగేసుకుని తీసేసి  సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడిప్పుడు. ఇలాంటివి కూడా నిర్మాతలకి ఇన్స్ పిరేషన్ అవుతాయి, కావాలి కూడా.   

       సమస్యల్లా డార్క్ మూవీస్ తీసే విషయ పరిజ్ఞానం గురించే. డార్క్ మూవీస్ గురించిన విషయ పరిజ్ఞానం లేకపోతే  ధృవ లాంటిది తీసేసి ఇది కూడా నేర పరిశోధనే కదా అనొచ్చు. యాక్షన్ మూవీస్ లో వుండేది  అచ్చమైన నేర పరిశోధన కాదు, అచ్చోసి వదిలిన నేర పరిశోధన. యాక్షన్ మూవీస్  ఏ లాజిక్ నీ పట్టించుకోవు, వాస్తవికతా  వుండదు. కానీ క్రైం –డార్క్ మూవీస్ కి ఈ రెండూ ప్రాణం. ‘రోమ్ – కామ్’ ట్రెండ్ నయా మేకర్లు ధృవ లాంటి యాక్షన్ మూవీస్ సులభంగా తీసి పడెయ్యొచ్చు. ఎందుకంటే తాము ఇలాటి యాక్షన్ మూవీస్ కూడా చూస్తూనే కదా పెరిగారు. కాబట్టి వీటి వరకూ విషయ పరిజ్ఞానం వుంటుంది. కానీ క్రైం జానర్ లో తీయాలంటే కొత్తగా  అ- ఆ- లంటూ అక్షరాలు దిద్దుకోవాలి.  లేకపోతే  జన్మలో కనుపాప, 16 -డి, నగరం, మెట్రో, పింక్, కహానీ- 2 లాంటివి తీయనే తీయలేరు. ఏవో ఆషామాషీ యాక్షన్ సినిమాలు తీసుకుంటూ దయనీయంగా మిగిలిపోవాల్సిందే. 

           సరే, ఏ ఒకరికో ఇద్దరికో ఈ సుడిగుండం లోంచి బయటపడితేనే గుర్తింపూ భవిష్యత్తూ వుంటాయని  ఖచ్చితంగా  అన్పించి ఇటు వైపు కొనసాగాలన్పించిందనుకుందాం - ఇలాటి వాళ్ళ కి ఈ వ్యాసాలు పనికి రావొచ్చు. ఇతరులు  కాలక్షేపంగా చదివి వదిలేసి,  అవే రోమాంటిక్ కామెడీలూ, ఈ జానర్ కూడా తెలీక రోమాంటిక్ కామేడీ లనుకుంటూ ఈ కాలంలో చెల్లని రో మాంటిక్ డ్రామాలూ,  చాదస్తాలూ తీసుకుంటూ వుంటే  సరిపోతుంది. 

          కానీ ఈ డార్క్ మూవీస్ తోనే రచయితలకీ, దర్శకులకీ  ప్రొఫెషనలిజం వస్తుందనేది నిజం.  ఎందుకంటే అడుగడుగునా ఇవి ప్రొఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తాయి. ప్రధానంగా పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల గురించి విషయపరిజ్ఞానాన్ని ఇవి డిమాండ్ చేస్తాయి. ఇవి లేకపోతే వీటిలో రాణించలేరు. కేవలం ప్రేమ సినిమాలూ, హార్రర్ కామెడీలూ ఇతర యాక్షన్ సినిమాలూ వంటివి  చూస్తూ ఈ రెండు దశాబ్దాల కాలం గడిపేసినందువల్లే  వ్యవస్థల పరిజ్ఞానం లేకుండా పోయిందనీ, డిటెక్టివ్ నవలలు  చదివుంటే, క్రైం సినిమాలూ  చూసి  అర్ధం జేసుకుని వుంటే పోలీసు- న్యాయవ్యవస్థల పనితీరులు తెలిసి వుండేవనీ చెప్పడం కూడా కాదిక్కడ. ఆర్ధిక సంస్కరణల పుణ్యమాని 2000 నుంచి అన్ని రంగాల్లో చోటుచేకున్న బూమ్ తో రకరకాల చదువులూ, ఉద్యోగాల  వేటా తప్ప సాంస్కృతికంగా, సామాజికంగా, సృజనాత్మకంగా  ఇంకేదీ పట్టకుండా యువతరం తయారైన మాట మాత్రం నిజం.  కొందరు ఎంబీయే  చదివిన వాళ్ళనే  అడగండి, పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరెవరుంటారో తెలీదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరో తెలీదు. పోనీ బెయిల్, ఛార్జిషీట్ల గురించి తెలుసా అన్నా కూడా తెలీదనే తలూపుతారు.  ఇదీ  పరిస్థితి.

          అయితే ఇదే సమయంలో టెక్నాలజీ అర చేతిలో కొచ్చేసి షార్ట్ ఫిలింలు తీయడం అందరికీ వచ్చేశాక- ఒక శుభపరిణామం సంభవిస్తోంది. ఈ షార్ట్ ఫిలిమ్స్ పుణ్యమా అని రచన చేయడం నేర్చుకోవడం మొదలెట్టారు!  షార్ట్  ఫిలిమ్స్ వచ్చేసి వూరూరా టీనేజర్స్ ని కూడా రైటర్స్ గా  మార్చేస్తున్నాయి. ఇలా ఏదో ఒకటి వూహించి కథ రాస్తున్నాడంటే  అదొక సృజనాత్మక, కాల్పనిక, సాంస్కృతిక, సామాజిక  వ్యక్తీకరణే కదా ఇన్నాళ్ళకి! లేకపోతే ఏం కథలు చదివేవాడని వీడు? ఏం రాసేవాడని? ఆనాడు డిటెక్టివ్ సాహిత్యం  వచ్చేసి సామాన్యుల్లో చదివే ఆసక్తి పెంచినట్టు, ఈనాడు షార్ట్ ఫిలిమ్స్  కథలు రాయడాన్ని నేర్చుకునేలా చేస్తున్నాయన్న మాట. 

         అయితే ఈ షార్ట్ ఫిల్మిస్టులు కూడా ఏవో జోకులూ, తమ వయసుకి  తెలిసిన అచ్చి బుచ్చి ప్రేమలూ రాసుకుంటూ ఇంకొక  డేంజరస్ వ్యవహారంగా తయారవుతున్నారు తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రాణానికి. అసలే సినిమా ఫీల్డు లోపల అచ్చి బుచ్చి రోమ కామీయులు క్రిక్కిరిసి వున్నారనుకుంటూంటే, ఫీల్డు బయట కూడా ఇలా తయారై  ఫీల్డు మీదికి దండెత్తి రాబోతున్నారన్న మాట. ముందుకాలంలో ఇంకా రోమ్- కామ్ లతో ప్రేక్షకుల్ని రాచిరంపాన పెట్టేందుకు కత్తులు నూరుతున్నారన్న మాట!

          యాంటీ వైరస్ అవసరం. అదేమిటో ఇప్పుడే మనం కనిపెట్టలేక పోతున్నాం. కానీ తమిళనాడులో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ప్రతీ వాడూ క్రైం జానర్ సినిమా తీసిన వాడే. దీనికి ఆద్యుడు కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, జిగర్తాండ లతో అతను వేసిన ముద్ర షార్ట్ ఫిలిం మేకర్లని క్రైం జానర్ వైపు- డార్క్ మూవీస్ వైపు -  మళ్లేలా చేసింది.  చివరికి 16 –డి తీసిన  22 ఏళ్ల కార్తీక్ నరేన్ సహా! 

          వీళ్ళ సినిమాల్ని స్టడీ చేసినా నియో నోయర్ సినిమా అంటే ఏమిటో అర్ధమవుతుంది. అసలు డార్క్ మూవీస్ (ఫిలిం నోయర్) అనేవి హాలీవుడ్ లో 1930లలో డిటెక్టివ్ సాహిత్యంలోంచి పుట్టాయని చెప్పుకున్నాం. కలర్ సినిమా లొచ్చేటప్పటికి అవి నియో నోయర్ గా అభివృద్ధి చెందాయి. తెలుగులో ఇలా జరగలేదు. 1970 లలో బ్లాక్ అండ్ వైట్  లో క్రైం సినిమాలంటూ చాలా వచ్చాయి. వీటిలో హీరో కృష్ణ నటించినవే ఎక్కువ. అయితే ఇవి నోయర్ సినిమాలు కావు, యాక్షన్ సినిమాలు. తెలుగు డిటెక్టివ్ నవలలు కూడా పెద్దగా తెర కెక్కిన చరిత్ర లేదు. కొమ్మూరి సాంబ శివరావు నవలలు   ‘పట్టుకుంటే లక్ష’,  ‘నకిలీ మనిషి’ రెండే సినిమాలుగా కన్పిస్తాయి. ‘పట్టుకుంటే లక్ష’ ( 1971-బ్లాక్ అండ్ వైట్) లో డిటెక్టివ్ యుగంధర్ గా నాగభూషణం నటిస్తే, అసిస్టెంట్ రాజుగా కృష్ణ నటించారు. ‘నకిలీ మనిషి’ (1980- కలర్) అపరాధ పరిశోధక కథ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్.  ఇందులో చిరంజీవి నటించారు. ఈ రెండు తప్ప ఇంకో డిటెక్టివ్ నవల తెరకెక్కిన ఆధారాలు కన్పించవు.

       అయితే ఇప్పుడు నియో నోయర్ డార్క్ మూవీ తీయాలంటే డిటెక్టివ్ సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు.  ఇందుకే గత రెండు వ్యాసాల్లో తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని పరిచయం చేశాం. ఈ వ్యాసాల్ని  బాగా అర్ధం చేసుకోగలగాలి. డిటెక్టివ్ అన్న పదం కూడా ఈరోజుల్లో చాలా మందికి తెలీదు. ముందుగా ఈ సాహిత్యం చదివితే నేరపరిశోధన గురించి అవగాహన ఏర్పడుతుంది. చదివితే వచ్చే  జ్ఞానం చూస్తే రాదు. కొమ్మూరి సాంబశివరావు నవలలు కొత్తగా మార్కెట్ లో కొచ్చాయి. ఇవి నలభై రూపాయల చొప్పున దొరుకుతున్నాయి. వీలైనన్ని కొనుక్కుని చదువుకుంటే మంచిది. ఇంగ్లీషు భాష తెలిస్తే ఇంగ్లీషులో బోలెడు డిటెక్టివ్ సాహిత్యం ఇప్పటికీ అందుబాటులో వుంది. 

          ఇప్పుడు డిటెక్టివ్ లేడు. పోలీస్ అధికారులతోనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ కథలు / సినిమాలు వస్తున్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ గురించి తెలుకోవడం అవసరం. న్యాయవ్యవస్థ గురించి కూడా- కనీసం సెక్షన్ 302 అంటే ఏమిటో లాంటి ప్రాథమిక జ్ఞానం పొందడం అవసరం. ఫోరెన్సిక్ లాబ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ వ్యవస్థలు సమాజంతో, మన నిత్య జీవితంతో ముడిపడి వున్నాయి- వీటి పరిజ్ఞానం లేకుండా పౌరులుగా కొనసాగడం కూడా  కష్టమే.

Next : డార్క్ మూవీస్ వర్సెస్ యాక్షన్ మూవీస్

-సికిందర్
http://www.cinemabazaar.in/