స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీను వైట్ల
తారాగణం : వరుణ్ తేజ్, హెబ్బా పటేల్, లావణ్యా త్రిపాఠీ, నాజర్, నాగినీడు, పృథ్వీ, భరత్, శ్రీనివాస రెడ్డి. హరీష్ ఉత్తమన్, నికితన్ ధీర్ తదితరులు
కథ : గోపీ మోహన్, మాటలు : శ్రీధర్ సీపాన
సంగీతం : మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం : కెవి గుహన్
బ్యానర్ : లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు
విడుదల : ఏప్రెల్ 14, 2017
***
కథ : గోపీ మోహన్, మాటలు : శ్రీధర్ సీపాన
సంగీతం : మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం : కెవి గుహన్
బ్యానర్ : లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు
విడుదల : ఏప్రెల్ 14, 2017
***
భారీ ఫ్లాపు తీయడానికే బాగా కష్టపడాలి, కష్ట పడుతున్నారు కూడా. ఎంత కష్టపడితే అంత ఫ్లాప్ ఇవ్వొచ్చు. తర్వాత హిట్టూ ఫ్లాపులు మన చేతుల్లో లేవనొచ్చు. హిట్ సంగతేమోగానీ, తీయబోతున్నది అట్టర్ ఫ్లాప్ అని ముందే తెలిసిపోతూంటుంది చేతిలో
వున్న పేజీల్లో. ఆ పేజీల్ని కెమెరా కిచ్చి, ఆ కెమెరా ప్రొజెక్టర్ కి అందిస్తే, ఆ ప్రొజెక్టర్ తెర మీద బొమ్మ వేశాకే - అయ్యో ఇంతకీ మనం రాసింది ఇంత ఫ్లాపా? అని అప్పుడు గానీ తెలియడం లేదంటే ఇదొక అద్భుతమైన
విషయమే. దీన్నిలాగే భద్రపర్చుకుని కంటిన్యూ చేస్తూండాలి. మర్మం తెలుసుకుని
మామూలుగా కష్ట పడితే సరిపోయే దానికి, మార్గం తెలీక బరువు లెత్తుతారు. హెవీ వెయిట్
ఛాంపియన్ లవుతారు. ఒక్కొక్క బరువుతో ప్రేక్షకుల తల బద్దలు కొడతారు. అమాయకులైన ప్రేక్షకులేమో
రక్షక కవచం తొడుక్కుని వెళ్ళడం మర్చిపోయి,
వొళ్ళంతా కైమా చేసుకుని వస్తారు!
కానీ భయపడాల్సిన పనిలేదు. ఇలాటి సినిమాలకి మార్నింగ్ షో కి
అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే, మ్యాట్నీ నుంచీ
రక్షకవచాలు అందించే పథకం ప్రారంభిస్తే, ప్రేక్షకులు అవి తొడుక్కుని కొంత ధైర్యం చేసి ఓ మాదిరిగానైనా
కలెక్షన్లు ముట్ట జెప్తారు.
ఇదంతా డజను సినిమాలు తీసిన టాప్ డైరక్టర్ కి తెలియదని కాదు. ఇంకో డజను సినిమాలు రాసిన టాప్ రైటర్స్ కీ తెలీదని కాదు. ఈ సినిమాలోనే రైటర్ ఒక చోట డైలాగ్ రాస్తాడు- కంఫర్స్ట్ పెరిగిపోతే కథలు రాయలేవు, కాలే కడుపుతో జనంలోకి వెళ్తేనే రాయగలవనీ. ఇది నిజమని అక్షరాలా ఈ సినిమానే బలిపెట్టి రుజువు చేశాడు. కంఫర్స్ట్ పెరిగిపోయి రాసిన అట్టర్ ఫ్లాప్ స్క్రిప్టు ఇది.
కాలే
కడుపుతో జనంలోకి వెళ్లి రాయాలని ఇంత కనెక్టివిటీ తో చెప్పిన డైలాగే ప్రేక్షకులతో మర్చిపోయారు. ప్రేక్షకులతో సినిమా
కనెక్ట్ అవ్వాలంటే కావాల్సింది సైకలాజికల్ కనెక్షనే. సైకలాజికల్ కనెక్షన్ సినిమాలో
హీరో మాత్రమే ఏర్పాటు చేస్తాడు. సినిమా కథంటే హీరోదే. హీరోయే కథ. కథలోంచి హీరో పుట్టడు,
హీరోయే కథని పుట్టిస్తాడు, దాన్ని తనే నడిపిస్తాడు. హీరోకే కథ విన్పించి ఓకే చేయించుకుంటారు
గానీ కమెడియన్లకీ విలన్లకీ చెప్పి కాదు.
విచిత్రంగా ఈ కథని హీరోకి కాకుండా ఇరవయ్యేసి మంది కమెడియన్లకి, ఇంకో నలభయ్యేసి
మంది విలన్లకీ విన్పించి ఓకే చేయించుకుని, ఆ తర్వాతే
హీరో వరుణ్ తేజ్ కి మాట మాత్రంగా
చెప్పేసి మొదలెట్టినట్టు కన్పిస్తుంది ఆద్యంతం. పాపం వరుణ్ తేజ్! మరోసారి మూసని
నమ్ముకుని దెబ్బ తినిపోయాడు...సెకండాఫ్ లో అసలే కన్పించకుండా పోయాడు!
‘మిస్టర్’ అనే అట్టహాసపు హీరోయే కన్పించకపోతే ఇక సైకలాజికల్ కనెక్షన్ ఎక్కడిది? సీన్లలో కన్పించినంత మాత్రాన హీరో హీరో కాడు. సీన్లని విలన్లూ కమెడియన్ లూ నడిపిస్తున్నప్పుడు, వాళ్ళే అతడి చావు బతుకుల్నీ, పెళ్లి పెటాకుల్నీ నిర్ణయిస్తున్నప్పుడు- నిలబడి దిక్కులు చూస్తూంటే హీరోయిజం అవదు- బకారాయిజం అవుతుంది. పాసివ్ క్యారక్టర్ అవుతుంది. కమెడియన్లతో, విలన్లతో గతంలో చేసిన శ్రీను వైట్ల బకరా కామెడీలు ఇక చాలనుకుని ఎంత అనుకున్నా, ఆ రంగు ఎలాగో బయట పడక తప్పలేదు- ఈ సారి హీరోనే బకరాని చేస్తూ, మిస్టర్ బకరాగా మార్చేస్తూ.
ఈ
సినిమా చూస్తూంటే రవితేజ ఫ్లాప్ కిక్ -2 ఎందుకు గుర్తుకు రావాలి? కాకపోతే రవితేజ సెటప్ తెలుగు నేటివిటీకి దూరంగా,
విడ్డూరంగా రాజస్థాన్ తండాలో అక్కడి
హీరోయిన్ ని రక్షించడం గురించి. శ్రీనువైట్ల తండా కూడా వచ్చేసి తెలుగు
నేటివిటీకి దూరంగా, విడ్డూరంగా ఆంధ్రా - కర్నాటక సరిహద్దులో శ్రీ కృష్ణ
దేవరాయలి కాలపు అలవాట్లతో వున్న గ్రామంలో, అక్కడి రాజ వంశపు హీరోయిన్ తో, వాళ్ళ విలన్లతో. ఇంటర్వెల్
చూస్తూంటే, ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ ఇంటర్వెల్ మలుపే ఎందుకు గుర్తుకురావాలి- ఒక
హీరోయిన్ అనుకుంటే ఇంకో హీరోయిన్ మీదికి విలన్లు వస్తూ? ప్రారంభంలో ఏర్ పోర్టులో హీరో ఒకర్ననుకుని ఇంకో
హీరోయిన్ ని రిసీవ్ చేసుకుని మొదలెట్టిన ప్రహసనమంతా చూస్తే, అమీర్- సల్మాన్ ల ‘అందాజ్ అప్నా అప్నా’ ఎందుకు గుర్తుకు రావాలి?
సినిమా ఓపెనింగ్ సీనేమిటి అలా వుంది- సరిహద్దు గ్రామం మీద ఖనిజాల కోసం కన్నేసిన విలన్ కుట్ర పన్నడం దగ్గర ఆగిపోయి – మళ్ళీ క్లయిమాక్స్ లో పెళ్లి కుట్రలుగా మారిపోవడమేమిటి?
సరిహద్దు
గ్రామంలో వున్న వూరి పెద్ద స్పెయిన్ లో వున్న మనవడు రావాలని కోరుకోవడంతో
మొదలవుతుంది మిస్టర్ హీరో కథ. స్పెయిన్ లో ఈ మిస్టర్ హీరోయిన్ హెబ్బా పటేల్ తో
ప్రేమలో పడతాడు. ఆమె ఇంటర్వెల్ దగ్గర వేరొకర్ని ప్రేమిస్తున్నా నంటుంది. వాడితో
పెళ్లి ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం తీర్చడానికి
మిస్టర్ సరిహద్దు ఆ గ్రామానికి వెళ్తాడు. అక్కడ
పారిపోతూ సెకండ్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ తగుల్తుంది. ఈమెని మిస్టరే ఎత్తుకుపోయాడని ఆమె తండ్రి మరణ శిక్ష
విధిస్తాడు. చివరినిమిషంలో ఆమె తమ్ముడు మిస్టర్ చావకుండా కాపాడతాడు. అప్పుడు మిస్టర్ వొంటి మీద ఏదో పుట్టు మచ్చ చూసిన హీరోయిన్
తండ్రి, మిస్టర్ తో నిశ్చితార్ధం జరిపేస్తాడు... ఇలావుంటుంది ఈ గజిబిజి కథ.
బాగా కష్ట పడి ఈ కథని హిట్ చేయాలనీ ‘ఊపిరి’ లో నాగార్జున పాత్రతో సెటైర్ కూడా చేశారు రఘుబాబు నుపయోగించుకుని. ఇది చప్పగా తేలిపోయింది. ప్రేక్షకులెవరికీ నవ్వే రాలేదు. ఫస్టాఫ్ లో హీరోయిన్ కన్ఫ్యూజన్ కామెడీతో, మిస్టర్ ఇంట్లో పాత ఫ్యామిలీ సెంటి మెంట్లతో, వాళ్ళ కామెడీతో, అక్కడో ఫారిన్ బాల నటుడితో, శ్రీనివాస రెడ్డితో, ఆఖరికి సినిమా డైరెక్టర్ గా పృథ్వీ తో కామెడీ కోసం చాలా పట్లు పడ్డారు. ప్రేక్షకులె వరికీ నవ్వు రా లేదు.
ఇక సెకండాఫ్ మొదలవగానే ఆ సరిహద్దు గ్రామపు పిచ్చిమాలోకం మొదలు. ఇక్కడ గాంధేయ వాదులూ, శ్రీ కృష్ణ దేవరాయలి ఫ్యాన్సూ వాళ్ళ పిచ్చి పిచ్చి సాంప్రదాయాలూ ప్రవర్తనలూ- దీనికి షకలక శంకర్ కామెడీ ఏదీ నవ్వించలేదు. ఇంకా మందుకు పోతే ‘పెళ్లిచూపులు’ కమెడియన్లు కూడా తలో చెయ్యేసి కామెడీ కోసం పాట్లు పడాల్సి వచ్చింది. ఈ భారీ ఫ్లాపుకి భారీగా కష్టపడడానికి ఏమేమో చేశారు. చివరికి అనుకున్న ఫలితం సాధించారు.
ఇక
ఏ హీరోయిన్ కోసం ఏ గ్యాంగు గుంపుగా వచ్చి
పడుతున్నారో అర్ధం కానంత భారీగా కూడా కష్ట పడ్డారు. ఇంటర్వెల్లో నైతే ఎంతకీ
ముగియని యాక్షన్ సీన్లు సాగదీసి సాగదీసి ఒక మ్యూజియం ఐటెం గా తయారు చేశారు. అసలు
ఇంత మంది ఆర్టిస్టుల మధ్య బంధుత్వాలు, బాగోతాలు గుర్తుంచుకోవాలంటే కూడా అపార మైన
జ్ఞాపక శక్తి మనకుండాలి.
ఒక ముక్కోణ ప్రేమ కథ- ఇందులో అటు అమ్మాయి తరపు, ఇటు అమ్మాయి తరపు ముఠాలు- మధ్యలో ఏం చేయాలో తెలియక బలిమేకలా మిస్టర్! కానీ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ కి తను గతంలో స్టార్స్ తో తీసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హీరో కోమాలో వున్నాడని తెలిసే వుండాలి. కోమా హీరోతో ఎందుకు పెట్టుకున్నట్టో అర్ధం గాదు. తన సినిమాల్లో పాటలు కూడా హిట్టయ్యేవి. ఈ సారి పాటలు కూడా కోమాలో కెళ్ళి పోయాయి. తన సినిమాల్లో సెంటిమెంట్లు కూడా బలంగా ఉండేవి, ఈ సారి బలవంతంగా సెంట్లు పూసుకున్నట్టు వుంది. ఒక్క నిర్మాణ విలువలే తనకి తగ్గట్టుగా వున్నాయి.
సింపుల్ గా ఒక హీరో- అతడికో ఉపద్రవం- అతడి విజయం –ఈ ముక్కోణాన్ని మర్చిపోయి – భారీ కసరత్తులు, ‘బెన్ హర్’ తీస్తున్నట్టు భారీ సంఖ్యలో నటీ నటులు, ‘టెన్ కమాండ్ మెంట్స్’ తీస్తున్నట్టు ఆ పిచ్చిమాలోకం గ్రామంలో పెత్తందారీ తీర్పులు, మరణ శిక్షలు, ఆఖరికి ‘కొత్త కాపురం’ తీస్తున్నట్టు కర్ర ఫైటింగులతో క్లైమాక్స్! ఇన్ని చూపించిన ఈ ప్రయోగశాల భావితరాలకి వధ్యశిల!
-సికిందర్