రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఫిబ్రవరి 2020, గురువారం

916 : రివ్యూ!


        శ్మీర్లో కశ్మీరీ పండిట్ల ఊచకోత, తరిమివేత చరిత్రలో ఒక అమానుష, అమానవీయ ఘట్టం. కేంద్రంలో బిజెపి మద్దతుతో కొనసాగిన వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో, కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో, గవర్నర్ పదవిలో వున్న బిజెపి నాయకుడు జగ్మోహన్ మల్హోత్రా పాలనలో, జరిగిన అతిపెద్ద విషాదం. గత 30 ఏళ్లుగా ఈ విషాదంతో పాలకులు పాటిస్తూ వస్తున్ననిశ్శబ్దం. 4 లక్షల మంది బాధిత పండిట్ల జీవితాల్ని శిబిరాల పాల్జేసి చూస్తున్న చోద్యం. మొన్న కశ్మీర్లో 370 ని రద్దు చేసినప్పుడు బుద్ధిలేని జీవులు జన్మ స్థానాన్ని కోల్పోయిన కశ్మీరీ పండిట్లని మరచి, ఇక కశ్మీర్లో భూములు కొనుక్కోవచ్చని, విహారయాత్రల కెళ్ళ వచ్చనీ సంబరాలు చేసుకున్న వెర్రితనం. ఇంత చులకనై పోయారు పండిట్లు. ఇప్పుడు సినిమా తీసిన విధూ వినోద్ చోప్రాకి కూడా. పండిట్ల చరిత్ర పేరుతో బాలీవుడ్ ప్రేమ సినిమా తీసేసి ఇది తన కుటుంబానికి కూడా జరిగిన విషాదమని చెప్పుకోవడం. నిజానికి గత నవంబర్లోనే విడుదల చేయాలనుకున్నట్టు, కానీ అప్పుడప్పుడే 370 ని రద్దు చేయడంతో సినిమాతో  సొమ్ము చేసుకోవడంగా అవుతుందనీ వాయిదావేసి, ఫిబ్రవరి 7 న విడుదల చేసినట్టూ పేర్కొన్నాడు. కానీ ఫిబ్రవరి 7 కల్లా షాహీన్ బాగ్ నిరసనల పట్ల ముస్లింలపై విద్వేషాలు చిమ్ముతున్న వేళ, సినిమా విడుదల ఆజ్యం పోసిననట్టవుతుందని భావించినట్టు లేదు. ఆ పాటికే కశ్మీరీ పండిట్లు షాహీన్ బాగ్ కి వెళ్లి తమ సమస్యని కూడా ఉద్యమంలో భాగం చేయాలనీ కోరారు. కశ్మీర్లో పండిట్లు, ముస్లింలు సాంస్కృతికంగా, సామాజికంగా కలిసిపోయి సహజీవనం చేసిన వర్గాలు. మధ్యలో జనవరి 19, 1990 రాత్రిని కాళరాత్రి చేస్తూ మిలిటెంట్లు విరుచుకుపడి- మతమైనా మారాలి, లేదా కాశ్మీర్ ని వదిలిపోవాలి, లేదా చావుకు సిద్ధపడాలంటూ తుపాకులతో రక్త చరిత్ర రాశారు.  

        
 రక్త చరిత్రని ప్రేమ కథతో కలిపి బాక్సాఫీసు ఫార్ములాకి వాడుకున్నారు. ఈ వాడకాన్ని ఢిల్లీలో కశ్మీరీ పండిట్లకి ప్రివ్యూ వేసినప్పుడు పండిట్లు ఎండగట్టారు. ఒక పండిట్ యువతి విధూ వినోద్ చోప్రా మీద ఘాటుగా విరుచుకుపడిన వీడియో వైరల్ అయింది. ఇందులో - పండిట్ల గురించి ఏం చూపారు, ప్రేమ కథ చెప్పారు, పైగా కశ్మీరీ పండిట్లుగా ముస్లిం హీరో హీరోయిన్లని చూపిస్తారా? -అంటూ దుఖం పొంగుకొచ్చి కూలబడింది. దర్శకుడు చోప్రా ‘షికారా’ తీసి పండిట్ల మనోభావాల్ని దెబ్బతీస్తున్నట్టు తెలుసుకున్నట్టు లేదు. పైగా కశ్మీర్లో జరిగింది పండిట్లు - ముస్లిముల మధ్య స్వల్ప పరిణామమని, ఇక గతాన్ని మర్చిపోయి కలిసి సాగాలనీ ఈ సినిమా ద్వారా చెప్తున్నట్టు  కూడా వ్యాఖ్యానించడంతో, మరింత వివాదాస్పదమై సినిమాని బాయ్ కాట్ చేయాలనే దాకా వెళ్ళింది. మిలిటెంట్లని, రాజకీయాలనీ పక్కనబెట్టి, సమస్యని రెండు వర్గాల మధ్య సమస్యగా కుదించడం ఇంకో పొరపాటు. ఆ మాటకొస్తే సినిమాలో చరిత్రలేదు, రాజకీయాలు లేవు, కేవలం ప్రేమ మాత్రమే, దాని కష్టాలు మాత్రమే. మణిరత్నం తీసిన ‘రోజా’, ‘బొంబాయి’ వేరు. వాటి ఫ్రేం వర్క్ లోనే  ‘షికారా’ నీ ప్రేమ కథగా మార్చేశారు!

       ముప్పావుగంట వరకూ ప్రేమా పెళ్ళీ కాపురం ఇవే. అప్పుడు వున్నట్టుండీ మిలిటెంట్ల దాడి, కాపురం ముక్కలు, కష్టాలు, కన్నీళ్ళూ. హీరో హీరోయిన్లు యాభై ఏళ్ల వయసులో వున్నప్పుడు కథ ప్రారంభమవుతుంది. శివకుమార్ పండిట్ (ఆదిల్ ఖాన్), శాంతీ పండిట్ (సాదియా) ఇండియా వస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ని కలవాలనుకుంటారు. అమెరికా ప్రెసిడెంట్లకి శివకుమార్ గత ముప్ఫై ఏళ్లుగా ఉత్తరాలు రాస్తూంటాడు. సీనియర్ బుష్ - క్లింటన్- జూనియర్ బుష్ - ఒబామాల వరకూ. పండిట్ల సమస్యని ఆలకించమని. ఈ నేపథ్యంలో ఇప్పుడొస్తున్న ప్రెసిడెంట్ ని కలుసుకునేందుకు ఆహ్వానం వస్తుంది. ఈ ఆహ్వానం మేరకు ఫైవ్ స్టార్ హోటల్లో వసతి లభిస్తుంది. అక్కడ బస చేసి గతాన్ని తలచుకుంటే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది...

        ఫ్లాష్ బ్యాక్ లో 1987 లో కశ్మీర్లో సినిమా షూటింగ్. అది చూసేందుకొచ్చిన శివ కుమార్, శాంతిలు ఒక పాసింగ్ షాట్లో నటించమంటే నటిస్తారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. పెద్దలు ఒప్పుకుని పెళ్ళవుతుంది. శోభనం జరుగుతుంది. రెండు పాటలు పూర్తవుతాయి. పచ్చని కాపురం. ఆ కాపురంలో చిచ్చు పెడుతూ మిలిటెంట్లు. కశ్మీర్ వ్యాప్తంగా పండిట్ల పైన దాడులు. పండిట్లు కొందరు చనిపోయి, కొందరు ప్రాణాలర జేతిలో పెట్టుకుని పారిపోతారు. శివ కుమార్, శాంతిలు కూడా పారిపోయి జమ్మూ చేరుకుంటారు. అక్కడ శిబిరాల్లో కష్టాలు. పోలీసులెక్కడున్నారు? సైన్యమెక్కడుంది? పండిట్లకి శిబిరాలు ఏర్పాటు చేయడానికే మాత్రమే ప్రభుత్వం వుంది.  

        ఇక్కడ్నించీ సర్వం పోగొట్టుకున్న శివ, శాంతిల ప్రేమకి అష్టకష్టాలు, కన్నీళ్ళూ, మెలోడ్రామా. మృతదేహాల మధ్య ప్రేమ కోసం తపన. నేపథ్యంతో అతకని ప్రేమ కథా కథనాలు. నేపథ్యాన్ని విడిచి అందమైన అసందర్భ ప్రేమ కావ్యం. ఈ ప్రేమ కావ్యం కూడా ఓల్డ్ స్కూల్ ఫార్ములా ప్రేమ కావ్యం. మహేష్ బాబు ‘బాబీ’ లోలాగా నేపథ్య స్పర్శ లేని, విషయం లేని ప్రేమ. ‘జైబోలో తెలంగాణా’ లో తెలంగాణా ఉద్యమాన్ని తెలంగాణా అబ్బాయి - ఆంధ్రా అమ్మాయిల ఫార్ములా రోమాన్స్ తో సరిపెట్టిన లాంటి వ్యాపార గిమ్మిక్.


      ఒక బాధిత పండిట్ ఆర్తితో అంటున్నట్టు చూపిస్తాడు చోప్రా - నన్ను కశ్మీర్ కి వాపసు తీసికెళ్ళండి - అని. ఇది అర్ధవంతంగా వుంది. కానీ హీరో నుద్దేశించి హీరోయిన్ తో అన్పిస్తాడు - నా ఇల్లు నువ్వే కదా - అని. ఇక కశ్మీర్ ని మర్చిపోయి మొగుడే ఇల్లనుకుని సరిపెట్టుకోవాలా? ఇది ప్రధాన పాత్రల్లో ఒకటైన హీరోయిన్ చేత అన్పించే మాటేనా? వాపసు తీసికెళ్ళండని అర్ధవంతంగా పలికిన సహాయ పాత్ర కంటే దిగువ స్థాయి పాత్రా హీరోయిన్?

      నిజానికి ఈ కథంతా వుండాల్సింది చెదిరిపోయిన పండిట్ల జీవితాలు తిరిగి తమ సొంత గడ్డ కశ్మీర్ చేరాల్సిన పోరాటం గురించి! ఈ పోరాటం వదిలి, ప్రశ్నించడం వదిలి- ద్వేషాన్ని ద్వేషించండి, మనుషుల్ని కాదు- అని మూస సందేశమివ్వడం పుండుమీద కారం జల్లడమే. వేలమంది తమ లాంటి బాధితుల మధ్య ప్రేమికులు తమ ప్రేమల్ని పక్కన బెట్టి, సామూహిక ప్రయోజనాల కోసం పోరాడినప్పుడు, వాళ్ళ ప్రేమ బంధానికి అర్ధముంటుంది గానీ, ప్రేమల కోసం ఈసురోమని ఏడుస్తూంటే కాదు. అది కథానాయక / నాయికా లక్షణం కూడా కాదు.   

       
        1992 లో కశ్మీర్ లో పుట్టిన ఖాలిద్ షా అనే పాలసీ మేకర్ పండిట్ల సాంస్కృతిక దుస్థితిని సరీగ్గా విశ్లేషించాడు : 1990 తర్వాత పుట్టిన పండిట్లకి సొంత గడ్డతో ప్రత్యక్ష సంబంధం లేదు. వాళ్ళకి తమ సంస్కృతితో, కశ్మీర్ గురించిన పరిజ్ఞానంతో ప్రత్యక్ష సంబంధంలేదు. ఇతరులు చెప్తే పరోక్షంగా తెలుసుకోవడమే. వారసత్వాన్ని తమ తర్వాతి తరాలకి అందించాల్సిన వాళ్ళు వృద్ధులైపోయారు. ఇప్పుడు కశ్మీర్ వెలుపల ఎక్కడెక్కడో చెదిరిపోయి నివసిస్తున్న పండిట్లు అక్కడి ప్రభావాల చేత తమ సాంస్కృతిక విశిష్టతనీ, తమ ఉనికినీ కోల్పోయారు. కనుక పాత తరం పండిట్లు తమ వారసులతో తిరిగి సొంత కశ్మీర్లో స్థిర పడడం అత్యవసరం.

――సికిందర్
Watched at Prasads
12 pm, 13 Feb