రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 10, 2020

915 : రివ్యూ


దర్శకత్వం : మోహిత్ సూరి
తారాగణం : ఆదిత్యా రాయ్ కపూర్, దిశా పటానీ, అనిల్ కపూర్, కుణాల్ ఖేమూ, అమృతా ఖన్విల్కర్, ఎల్లీ ఆవ్రమ్ తదితరులు
రచన : అసీం అరోరా, స్క్రీన్ ప్లే : అనిరుద్ధ గుహ, సంగీతం : మిథూన్, అంకిత్ తివారీ, అసీం అజర్, వేద్ శర్మ, ఫ్యూజన్ ప్రాజెక్ట్; ఛాయాగ్రహణం : వికాస్ శివరామన్.
నిర్మాతలు : భూషణ్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్
బడ్జెట్ : 40 కోట్లు, ప్రింట్స్, యాడ్స్ : 10 కోట్లు
విడుదల : ఫిబ్రవరి 7, 2020
      మోహిత్ సూరి సినిమా వస్తోందంటే ఒక ఆసక్తి. జహెర్, మర్డర్-2, రాజ్ -3, ఆషికీ -2, వో లమ్హే, కలియుగ్, ఏక్ విలన్...వంటి కథాబలమున్న సినిమాలు అతడికి అభిమానులని సంతరించి పెట్టాయి. బలమైన కథలు, బలమైన పాత్రలు అతడి బ్రాండ్ గా పాపులరయ్యాయి. బలమైన సంగీతం, సాంకేతికాలు కూడా. తనదైన శైలితో ఒక అభిరుచిగల దర్శకుడుగా చెరగని ముద్ర వేశాడు. వో లమ్హే, ఆషికీ-2 ల వంటి విజయవంతమైన రెండు బలమైన ప్రేమకథలు తప్పిస్తే, మిగతావన్నీ హిట్ థ్రిల్లర్సే. ఇప్పుడు ‘మలంగ్’ అనే మరో మ్యూజికల్ థ్రిల్లర్ తో వచ్చాడు. ఆదిత్యారాయ్ కపూర్, దిశా పటానీ, అనిల్ కపూర్, కుణాల్ ఖేమూ నటీనటులు. నటీ నటులతో యూత్ అప్పీల్ ని రాబట్టగల ఈ థ్రిల్లర్ లో ఒక పజిల్ ని విసిరాడు ప్రేక్షకుల మీద. క్రైం నవలారాణి అగథా క్రిస్టీ మాత్రమే సర్ప్రైజ్ చేస్తూ విప్పగల కష్టసాధ్యమైన పజిల్ ఇది. బాక్సాఫీసు రిస్కుతో కూడిన దీన్ని తన శక్తి సామర్ధ్యాలతో ఎలా పరిష్కరించాడు? తొలిరోజు బాక్సాఫీసు 15 కోట్లు పలికిన ఈ థ్రిల్లర్ ఎంతవరకు మెప్పిస్తుంది? దీన్ని తన ఇతర హిట్ థ్రిల్లర్స్ సరసన మరో హిట్ గా నిలిపాడా? … మొదలైన అంశాలు పరిశీలిద్దాం.
కథ
     అద్వైత్ ఠాకూర్ (ఆదిత్యారాయ్ కపూర్) ఒక ఆవారా బంజారా. ఇంట్రోవర్ట్. ఫోటోగ్రఫీ హాబీగా దేశాటన చేస్తూంటాడు. సారా నంబియార్ (దిశా పటానీ) లండన్ నుంచి వచ్చిన ఎన్నారై. ఎక్ స్ట్రోవర్ట్. వెకేషన్ కి గోవా వస్తుంది. జీవితం విరగబడి ఎంజాయ్ చేయడానికే వుందని నమ్ముతుంది. గోవాలో ఇద్దరూ పరస్పరం ఆకర్షితులవుతారు. ప్రేమించుకుంటారు, విరగబడి ఎంజాయ్ చేస్తారు. ఒకటవుతారు. ఇంతలో వూహించని విధంగా విడిపోతారు. ఐదేళ్ళ తర్వాత అద్వైత్ విరగబడి పోలీసుల్ని చంపుతూంటాడు. ఇద్దరు పోలీసు అధికార్లు అంజానే అఘాసే (అనిల్ కపూర్), మైకేల్ రోడ్రిగ్స్ (కుణాల్ ఖేమూ) లు ఈ హంతకుణ్ణి పట్టుకోవడానికి వెంటాడుతూంటారు. పట్టుకున్నారా? పట్టుకుంటే ఏం జరిగింది? అద్వైత్ ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు జైలుకెళ్ళాడు? అసలు సారా ఏమైంది? వీళ్ళతో పోలీసులకున్న సంబంధమేమిటి? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
     రోమాంటిక్ క్రైం థ్రిల్లర్ జానర్. రివెంజి కథ. మాదక ద్రవ్యాలు అలవాటు లేకున్నా, మాదక ద్రవ్యాల ప్రపంచంతో, మనుషులతో దూరంగా వుండాలని చెప్పే కథ. ఈ మనుషులతో సావాసం ఒక చిన్న పొరపాటువల్ల జీవితాల్ని తలకిందులు చేస్తుందని హెచ్చరించే కథ. కథా ప్రయోజనం ఓకే. కథ చెప్పడానికి గోవా రెండు ముఖ చిత్రాలు నేపథ్యంగా వున్నాయి. అబ్బురపర్చే గోవా ప్రకృతి ఎంత మానసికోల్లాసాన్నిస్తుందో, మాదక ద్రవ్యాల కుసంస్కృతితో అంత వికృతంగా వుంటుందనీ, నేపథ్యాన్ని సబ్ టెక్స్ట్ గా చేసి ఫీల్ నిచ్చారు. అయితే కథలో పెద్ద లోపం వల్ల కథ ప్రశ్నార్ధకంగా మారిన ఇబ్బంది ఒకటుంది. దీన్ని మరుగుపర్చడానికి ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని కథకి వాడినట్టున్నారు. ఇలాకూడా కథ వాడిపోతుందని గుర్తించారో, గుర్తించినా చెల్లిపోతుందనుకున్నారో తెలీదు. ఇక ఇందులో వేసిన ఒక బంపర్ పజిల్ ని విప్పడానికి ఒక ట్విస్టుని వాడకం చేశారు. ఈ వాడకం మరీ కథని ఆవారా బంజారా చేసింది...అగథా క్రిస్టీ తల్లి కాపాడాల్సిందే! విప్పడం ఆమెకి మాత్రమే సాధ్యమయ్యే పజిల్ ని  ‘మలంగ్’ (ఆవారా) కి శరాఘాతంలా ఎక్కుపెట్టారు.
ఎవరెలా చేశారు
       అద్వైత్ గా ఆదిత్యా రాయ్ కపూర్ పగతో రగిలిపోయే, కండలు తిరిగిన ఉన్మాద కిల్లింగ్ మెషీన్ గా ఆద్యంతం ఆకట్టుకుంటాడు. లవర్ బాయ్ గా సాఫ్ట్ గెటప్ లో, యాంగ్రీ యంగ్ మాన్ గా రఫ్ గెటప్ లో భిన్న షేడ్స్ తో ఈ థ్రిల్లర్ ని నిలబెట్టేందుకు కృషి చేశాడు.
సారా పాత్రలో దిశా పటానీ గ్లామరెక్స్ పోజ్ ఈ క్రేజీ ప్రేమ కథకి తగ్గట్టే వుంది. పోలీస్ పాత్రలో అనిల్ కపూర్ ఈ థ్రిల్లర్ కే బలాన్ని తీసుకొచ్చాడు. దర్బార్ లో కూతురి హత్యతో రజనీకాంత్ ఎన్కౌంటర్ పోలీసుగా ఎలామరతాడో, అలా అనిల్ కపూర్ కూడా కూతురిని పోగొట్టుకుని ఉన్మాద ఎన్కౌంటరిస్టుగా మారిపోతాడు. అనిల్ కపూర్ ని అదుపుచేసే ఇంకో పోలీసు అధికారి పాత్రలో పాత్రలో కుణాల్ ఖేమూ ఇంకో ఉన్మాద కిల్లర్ గా మారిపోతాడు. వెరసి ఇది ముగ్గురు విడివిడి కిల్లర్స్ కథవుతుంది : ఆదిత్యారాయ్ కపూర్, అనిల్ కపూర్, కుణాల్ ఖేమూ. ఇక జెస్సీ అనే డ్రగ్ ఎడిక్ట్ పాత్రలో ఎల్లీ ఆవ్రమ్ చివరి ట్విస్టుకి కీలకంగా మారుతుంది. సన్నివేశాలు బలంగా వుండడంతో నటనలూ బలంగా వున్నాయి.
        ఇది పూర్తిగా మ్యూజికల్ థ్రిల్లర్. పాటలు, వాటి చిత్రీకరణ సినిమానెంతో నిలబెట్టాయి. ప్రతీ సినిమాలో మోహిత్ సూరి మ్యూజిక్ ని ఒక ఆకర్షణగా మార్చేస్తాడు. ఐదుగురు సంగీత దర్శకుల ఫ్యూజన్ సాంగ్స్ కథకి ఆత్మని సంతరించిపెట్టాయి. నేపథ్య సంగీతపు మాస్టర్ రాజూ సింగ్ మరో ఉరకలేసే ట్రాక్ ఇచ్చాడు. కెమెరా వర్క్, గోవా లొకేషన్స్ ఇంకో ఎత్తు. యాక్షన్ సీన్స్ బావున్నా, ఫస్టాఫ్ లో ప్రతీసారీ కొట్టి చంపడాలు వెరైటీ లేకుండా చేశాయి. అసలే బలహీనంగా వున్న ఫస్టాఫ్ ని కిల్లింగ్స్ ని వేర్వేరు పద్ధతుల్లో చూపైనా హుషారు తీసుకు రావొచ్చు. ఆ పని చేయలేదు.
        కొన్ని డైలాగ్స్ బావున్నాయి బావున్నాయి-  ఆదిత్యారాయ్ కపూర్ : ‘మనం ముగ్గురం కిల్లర్స్ వెధవలమని మనకి తెలుసు. కానీ మీకు చంపడంలో మజా రాదు, నాకు చంపడం నిషా’. కుణాల్ ఖేమూ : ‘ప్రాణాలు తీయడం నా అవసరం’. అనిల్ కపూర్ : ‘ప్రాణాలు తీయడం నాకలవాటు’. దిశా పటానీ : ‘ఆడదాన్ని గౌరవించ లేని వాడివి మగాడిగా ప్రూవ్ చేసుకుంటావా?’
        సమస్య కథా కథనాలతో, దీని స్క్రీన్ ప్లే తోనే.
చివరికేమిటి
     మొదటే చెప్పుకున్నట్టు ఆవారా బంజారా కథ. పజిల్ వల్ల, దాని ట్విస్టు వల్ల. దీంతో సెకండాఫ్ సగం తర్వాత మొత్తం కథతో బాటు హీరో పాత్ర ప్రశ్నార్ధక మయ్యాయి. ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ చేసిన విషయం వల్ల హీరో జైలుకెళ్ళే, బయటికొచ్చి పగదీర్చుకునే అవసరమే రాదు. అంటే ఈ పాత్రే లేదు, కథే లేదు. అనవసరంగా ఆదిత్యారాయ్ కపూర్ రివెంజితో రగిలిపోతూ, పాపం పోలీసుల్ని చంపాడు. దిశా పటానీ హీరోయిన్ పాత్ర కూడా ఇల్లాజికల్ గా వచ్చి చివర ట్విస్టు ఇస్తుంది. పజిల్ ని విప్పడానికి ఈ ట్విస్టుతో లాజిక్ లేకుండా గజిబిజి చేశారు. అసలీ గొడవేంటో ఇప్పుడే విడమర్చి చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఒక వారం తర్వాత చెప్పుకుందాం.
        ఫస్టాఫ్ జైల్లో వున్న హీరో ఖైదీలతో పోరాడే సుదీర్ఘ యాక్షన్ సీను తర్వాత, అతను హీరోయిన్ని తల్చుకుంటాడు. ఆమెతో గోవా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఈ రోమాంటిక్ ఫ్లాష్ బ్యాక్ మధ్యమధ్యలో వస్తూంటుంది. జైల్లోంచి విడుదలైన హీరో పోలీసుల్ని చంపడం ప్రారంభిస్తాడు. ప్రేమ కథలో ఈ పోలీసులు దుష్టులనీ, అందుకే చంపుతున్నాడనీ అర్ధమవుతుంది. డిసెంబర్ ఇరవై నాల్గు సాయంత్రం 5 గంటలకి హత్యలు ప్రారంభిస్తాడు. రాత్రి పదకొండు వరకూ ఒక్కొక్కర్నీ చంపుతాడు. పోలీసు అధికారులు ఇద్దరికీ చెప్పి, వాళ్ళ ముందే చంపి పారిపోతూంటాడు మొహం కన్పించకుండా. డిసెంబర్ ఇరవైనాల్గు రాత్రంతా గోవాలో రేపు క్రిస్మస్ పండగతో సంరంభంగా వుంటుంది. ఈ మ్యూజికల్ వేడుకల మధ్య ప్రస్తుత కథ కలర్ఫుల్ గా జరుగుతూంటుంది. మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమ కథ వస్తూంటుంది. అయితే ఈ తరహా కథనం ఎండ్ సస్పెన్స్ కి దారి తీస్తున్న కథలా అన్పిస్తుంది. ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తో కథలోకి వెళ్ళకుండా, చంపడమే - తప్పించుకోవడమే తంతుగా మారడంతో విషయం లేనిదిగా తయారయ్యింది. చివరి హత్య తర్వాత దొరికిపోవడంతో ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంతవరకూ ఏం చూశామంటే ఏమీ లేదు. లేని కథకి పవర్ఫుల్ నటనలు ఆదరగొట్టడం తప్ప.
        అసలు గతంలో హీరో కేం జరిగిందో, హీరోయిన్ ఏమైందో ఇంకా చివరి దాకా సాగదీస్తే సరాసరి  ఎండ్ సస్పెన్స్ సుడి గుండంలో పడి సినిమా గల్లంతయ్యేది. అదృష్టవశాత్తూ ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ని పూర్తి చేసి అసలేం జరిగిందో రివీల్ చేసేశారు. దీంతో కొత్త విషయాలు బయట పెట్టి సర్ప్రైజ్ చేశారు. ఐదేళ్ళ క్రితం హీరో, ఇద్దరు పోలీసు అధికార్లూ  పరస్పరం తెలిసిన వాళ్ళే. అందులో పైగా పోలీసు అధికారి అనిల్ కపూర్ ఎందుకు ఉన్మాదంగా ఎన్కౌంటర్లు చేస్తున్నాడో వెల్లడై పాత్ర బలాన్ని పొందుతుంది. అలాగే కుణాల్ ఖేమూ పోలీస్ పాత్ర ఇంకో కోణంలో కిల్లర్ గా వెల్లడవుతుంది. ఇక్కడే కథకి ఐదేళ్ళ క్రితం బీజం పడుతుంది...
        ఈ మొలకెత్తిన బీజం సరైన పోషణ లేక బొటానికల్ బ్యూటీ కాలేకపోయింది.

సికిందర్
Watched at : Mukta A2 Cinemas
9 pm, Feb, 9