రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, April 1, 2017

నాటి సినిమా !







           2012  సృష్టి విలయ రహస్యాన్ని మోనాలిసా బొమ్మ ఇముడ్చుకుందన్న మాటే నిజమైతే, జానపద సినిమాల్నీ, సాహిత్యాన్నీ అటక మీదికి చేరుస్తున్న  మానవజాతి,  ముందే తన మానసిక వినాశాన్నీ  కొనిదెచ్చుకుంటున్న  మాటా అంతే  నిజమౌతుంది.

           స్పీడు యుగంలో యాంత్రికంగా బతకడం అలవాటు చేసుకున్నాడు మనిషి. తన నుంచి తానూ పూర్తిగా వేర్పడిపోతూ దిక్కు తోచని స్థితిలో పడుతున్నాడు. దారీ తెన్నూ తెలీక దొరికిన వ్యక్తిత్వ వికాస పుస్తకమల్లా చదవడం మొదలెట్టాడు. కానీ ఇవే విజయానికి సోపానాల గురించి  ఏనాడో పురాణాల్లోనే,  జానపద కథల్లోనే  రాసిపెట్టారన్న సంగతే గుర్తించ లేకపోయాడు. ఇదీ మనిషి మానసిక దివాళాకోరుతనం.  పురాణాలు ఆత్మని కడిగితే, జానపదాలు మేధస్సుని పెంచుతాయి. నిగూఢంగా వున్న  మానసిక శక్తుల్ని పైకి లాగి - పోరా ఆకాశమే నీ హద్దూ అనేసి బతకడాన్ని బ్యాలెన్సు చేస్తూ జీవిత ప్రాంగణంలోకి ముందుకు తోస్తాయి. 

          ఈ పని జానపద చలన చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా టీఎల్ కాంతారావు కొన్ని వందలసార్లు చేసి వుంటారు. కాంతారావు చేసిన మేలు మనం అప్పుడు తెలుసుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే  జానపద సినిమాలతో వ్యక్తిత్వ వికాసానికి బ్రాండ్ అంబాసిడర్ కి తక్కువకాని  హోదాని తనే ఆనాడే  పోషించారు!


          ఈ పని ‘సప్తస్వరాలు’ తో ఇంకా పరమ నిష్ఠగా చేశారు. ఈ సినిమా మొత్తంగా ఒక సైకలాజికల్ విహార యాత్ర. ఇందులోకి ప్రవేశిస్తే మనల్ని మనం తెలుసుకోగలం
. నిమిష నిమిషానికీ మన మనసు చేసే మాయ, చిత్ర విచిత్రాలూ- వీటన్నిటినీ ఒక దారిలో పెట్టి, లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేసే విశ్వ ప్రయత్నాలూ- దీన్నొక కదిలే బొమ్మల పర్సనాలిటీ క్విజ్ గా నిలబెడతాయి.
     కృష్ణుడికి ఎన్టీఆర్ నీ, దేవదాసుకి ఏఎన్నార్ నీ పర్మనెంట్ సింబల్స్ గా ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించి వదిలిపెట్టిన సినిమాయే,  జానపద కథానాయకుడికి సింబల్ గా స్ఫురద్రూపియైన కాంతారావు  రూపాన్ని అచ్చు గుద్ది, పక్కనే నిలువెత్తు కత్తినీ గుచ్చి వదిలింది! తను పోతూ ఆ కత్తినీ పట్టుకుపోయారు కాంతారావు. కత్తి కూడా స్వరాలు పలికిస్తుందని ఆయన నిర్ధారణ. సప్తస్వరాల మాలిక సంగీతమైనట్టే, యుద్దాల్లో కత్తులూ ఏడు రకాల శబ్దాలు విన్పిస్తాయట! ఇదీ కాంతారావు ప్రకటన! యుద్ధాలూ,  సమురాయ్ కత్తుల విన్యాసాలూ గురించి కసక్ కసక్ మని రాసే పాల్ సియోలో కూడా ఈ సంగతి చెప్పలేదు మనకి! 

          అలాగని సప్తస్వరాలు ఏవో కత్తులు పాడుకునే సంగీత సమ్మేళన మనుకుంటే  కత్తుల మీద కాలేసినట్టే. సప్త స్వరాలు కేవలం మాధుర్యాన్ని చిలికే సరిగమలే కావనీ, సప్త సముద్రాలు, సప్త గిరులు, సప్తర్షులు, సూర్యుడి సప్తమాశ్వాలూ ... ఇవన్నీ మానవ కోటికి  మహత్తర వరాలనీ, సప్త సంఖ్యామయమైన ఈ జగత్తే మొత్తంగా ఈ సప్తస్వరాల్లో ఇమిడి వుందనీ, ఈ సప్త స్వరాలని జయించిన వాడే శారదా పీఠాన్ని అందుకోగల్గుతాడనీ ఈ సినిమా  కథలోని భావం. మెంటల్ పోస్ట్ మార్టం మేడీజీ అన్నమాట. 


          ఈ అంతరంగ ప్రయాణం ప్రారంభించే ముందు ఏడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే
  అగాథంలోకి పతనం ఖాయం. దీంతో తొలిసారిగా సినిమా నిర్మాణానికి పూనుకున్న కాంతారావు, తన ఉత్తమాభిరుచులేమిటో అడుగడుగునా దృశ్యాల్లో ప్రతిఫలించేలా చేశారు. దీని ఆర్ధిక పరాజయానికి కొన్ని రాజకీయాలు కారణమై వుండొచ్చు, కానీ విషయపరంగా దీన్ని శాశ్వత తత్వానికి  ఎదురేదీ లేదు.

          దేవదాసు లాంటి భగ్న ప్రేమికుడి విషాదాంతంతో బాగా- బాగా-  ఏడ్పించేసి  వదిలిన వేదాంతం రాఘవయ్య కి,  ఈ ‘సప్తస్వరాలు’ గమ్మత్తుగా భగ్నప్రేమికుడి విజయగాథ! ఈ మహా దర్శకుడి చిత్రీకరణలో పాత్రల నిమ్నోత్తమాలు, వాటి తాలూకు భావోద్వేగాలు, అభినయ విలాసాలు, అన్నీ మహోన్నతంగా ఉట్టి పడతాయి.  కాంతారావు, నాగయ్య, రామకృష్ణ, ధూళిపాళ, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, బాలకృష్ణ (అంజి గాడు), రాజశ్రీ, విజయలలిత, విజయనిర్మలల బారెడు తారాతోరణంతో  రాఘవయ్య దర్శకత్వ లాఘవం మనల్ని కదలకుండా కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. అదే నీవంటివీ, కృష్ణయ్యా గడసరి కృష్ణయా... వంటి పాపులర్ గీతాలతో, నృత్యాలతో, సూటిపదాల సంభాషణలతో; రాజకోట, మాంత్రికుడి కళాత్మక సెట్స్ తో, సమ్మోహనకర ట్రిక్ ఫోటోగ్రఫీతో, కత్తి పోరాటాలతో... ఓ పరిపుష్ట పంచభక్ష్య పరమాన్న విందిది. నిర్మాణ వ్యయాన్ని  వేదాంతం ఆరు లక్షలకి  పైగా లాగేశారని కాంతారావు వాపోయినా, వేదాంతం ఇచ్చిన విందు ముందు కాంతారావు ఖేదం బేఖాతర్ మనకి!

       విచిత్రంగా జానపదంలో పౌరాణీకాన్ని కలుపుకున్న జానర్ ప్రయోగమిది. దీంతో ఇది ఆథ్యాత్మిక యానం కోసం చేసే మనోవైజ్ఞానిక విహార యాత్రవుతోంది. హాలీవుడ్ చలన చిత్ర రాజం  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  లో ఆథ్యాత్మిక శక్తులున్న ఆర్క్ కోసం జరిపే పోరాటం ద్వారా మహా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఏం చెప్పాలనుకున్నాడో, సరీగ్గా ఆ లోక కల్యాణాన్నే ప్రబోధిస్తోంది ‘సప్త స్వరాలు’ కూడా!
          అనేక సమస్యలతో, అన్యాయాలూ అక్రమాలతో పుచ్చి పోయింది మానవ లోకం సమస్తం. అజ్ఞానమే దీనికంతటికీ మూలం.  దీంతో నారదుడు (రామకృష్ణ), గంధర్వుడు (కాంతారావు) లు కలిసి  వెళ్లి సరస్వతి (విజయనిర్మల) కి ఈ సంగతి మొరపెట్టుకుంటారు. అప్పుడామె ఓ శారదా పీఠాన్ని అందించి, దాంతో మనుషుల అజ్ఞానాన్ని తొలగించి మానవ కల్యాణాన్ని పునఃప్రతిష్ఠాపన చెయ్యమనీ ఉపదేశించి పంపుతుంది. ఈ శారదా పీఠాన్ని  వైజయంతి (విజయలలిత) వ్యామోహంలో పడిన గంధర్వుడు పోగొడతాడు. దీంతో – నువ్వెళ్ళి భూలోకంలో అలాగే బాధలనుభవించమని నారదుడు శపిస్తాడు.


          భూలోకంలో ఓ సంగీత కారుడు (నాగయ్య) కి  ముత్యపు చిప్పలో మగ శిశువు దొరుకుతాడు. వాడికి సారంగ అని పేరు పెట్టి పెంచుకుంటూ సంగీతం నేర్పుతూంటాడు. ఇంకో ముత్యపు చిప్పలో మహారాజు (ధూళిపాళ) కి ఆడ శిశువు దొరుకుతుంది. దానికి దేవ మనోహరి అని నామకరణం చేసి పెంచుకుంటూ, నాట్యం నేర్పిస్తూంటాడు. సంగీతం
నేర్చుకుని పెద్దవాడైన  సారంగ (కాంతారావు), జయంతి (రాజశ్రీ) తో ప్రేమ కలాపాలు సాగిస్తూంటాడు. ఇది తండ్రికి తెలిసి మందలిస్తాడు. ఎందుకంటే, సారంగాకి తను ఒక లక్ష్యంతో సంగీతం నేర్పుతున్నాడు. ఆ లక్ష్యం స్వర్గలోకం నుంచి భూమండలంలో పతనమైన శారదా పీఠాన్ని  సాధించడం. అది ప్రస్తుతం సోపాన మంటపం మీద ప్రత్యక్షమై వుంది.  దాన్ని సాధించే వాడు సంగీతంలో స్రష్ట అయి, మాతృగర్భంలో జన్మించని అయోనిజుడై వుండాలి. స్త్రీ స్పర్శ ఎరుగని బ్రహ్మచారియై కూడా వుండాలి. ఇది విన్న సారంగ  చకితుడవుతాడు. తను అయోనిజుడు సరే, బ్రహ్మచర్యమంటే ఎలా సాధ్యం? జయంతి  తన సర్వస్వం. ఎటూ తేల్చుకోలేక ఈ సంకటంలో వుండగా,  అప్పుడు వూడిపడతాడు అభేరి (సత్యనారాయణ)  అనే తాంత్రిక విద్యల తుచ్ఛుడు. వీడికి మానవ జాతి పచ్చగా వుంటే నచ్చదు. ఆ శారదా పీఠాన్ని చేజిక్కించుకుని, మానవ లోకాన్ని ముక్కలు చెక్కలు చెయ్యాలని చూస్తూంటాడు. 

        ఇక మొదలవుతుంది రసవత్తర క్రీడ. మామూలు ప్రేక్షకులకి మామూలు భాషలో సస్పెన్స్, థ్రిల్స్, టెంపో, యాక్షన్, అడ్వెంచర్ లాంటివి అన్నీ ఇందులో వుంటాయి. ఈ ఎలిమెంట్సే  రసజ్ఞులకి  ఒకొక్కటీ ఒక్కో  సైకలాజికల్ ట్రూత్ గా ఆశ్చర్య పరుస్తాయి. స్థాపించిన కథా ప్రపంచంలో పైకి కన్పించని ఈ హిడెన్ ట్రూత్  ఆసాంతం రసమయ సంగీతమనే రజాయిని వెచ్చ వెచ్చగా కప్పుకుని వుంటుంది.

          ప్రతీ పాత్రా,  ప్రతీ సన్నివేశమూ సంగీతాన్నే వొలికిస్తాయి. లక్ష్య సాధన కోసం కాంతారావుకే ద్రోహం చేసే నాగయ్య, ఆ ద్రోహంతో ప్రేమలో పిచ్చి వాడయ్యే కాంతారావు మీదికి విషకన్య విజయలలితని ప్రయోగించే సత్యనారాయణ విద్రోహం, మధ్యలో తిక్క వేషాల ధూళిపాళ చెత్త పనులు, మరోవైపు గడ్డీ గాదం మేసి దిట్టంగా సంగీతం నేర్చుకోవాలనుకునే రాజబాబు హాస్య ప్రహసనాలు, రాజశ్రీ సోయగాల కనువిందూ... కలిసి ఓ మహోజ్వల జానపద చలనచిత్ర రాజం!   
  
          వీటూరి కథా మాటలూ రాస్తే; పాటలు సినారె తో బాటు వీటూరి కూడా రాశారు. టీవీ రాజు సంగీతం సమకూరిస్తే, అన్నయ్య ఛాయాగ్రహణాన్నీ, ఎస్ ఎస్ లాల్  ట్రిక్ ఫోటోగ్రఫీనీ పోషించారు. నృత్యాలు వెంపటి సత్యం, కళా దర్శకత్వం బీఎన్ కృష్ణ వహించారు.

          హేమా ఫిలిమ్స్  సంస్థని స్థాపించిన టీఎల్ కాంతారావు, 1969 లో నిర్మించి నటించిన న ఈ కళాఖండాన్ని గురువు హెచ్ ఎం  రెడ్డికి అంకితమిచ్చారు.

చరిత్రలో ఒక పేజీ...
       అప్పటి సినిమాల్లో రాజనాల గొప్ప విలనే. అయితే ఈ విలన్ పాత్రని అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా పోషిస్తూ ఎలా అవమానపర్చే వాడో, ‘బందిపోటు’ షూటింగు సమయంలో ఇచ్చిన డైలాగులతో కావాలని పెట్టిన ముప్పు తిప్పలూ, అది దారి తీసిన పెద్ద గొడవా సీనియర్ రచయిత త్రిపురనేని మహారధి ఈ వ్యాసకర్తకి ఒకసారి వివరించారు.

           కాంతారావుకీ ఇలాటిదే జరిగిందన్నారు త్రిపురనేని. ఎక్కడో చదివిన కథని వీటూరి చేత ‘సప్త స్వరాలు’ స్క్రిప్టుగా రాయించుకుని, రాజనాల దగ్గరికి వెళ్తే, ఆయన  స్క్రిప్టుని సరీగ్గా పట్టుకోకుండా కావాలని కింద పడేసి, ‘ఇప్పుడు రాహుకాలం. నేను కథలు వినను, నీ సినిమాలో నటించను ఫో!’ అనేశారు. దెబ్బతిన్న కాంతారావు వెళ్లిపోయి వేదాంతం రాఘవయ్యకి చెప్పుకుంటే, ఆయన సత్యనారాయణని విలన్ గా తీసుకుందామని సలహా ఇచ్చారు. అలా నాల్గు వేలు పారితోషికంగా తీసుకుని సత్యనారాయణ విలన్ పాత్ర వేసి మెప్పించారు.

          సినిమా 1969 లో విడుదలయ్యింది. అప్పుడు రాజకీయాలు ఈ సినిమాని తినేశాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలం. ‘ప్రేక్షకులారా మీరు తెలంగాణా వాడు తీసిన ఆ సినిమా చూస్తారో, ఆంధ్రా వాడు తీసిన ఈ సినిమా చూస్తారో తేల్చుకోండి!’ అని కృష్ణతో  ‘లవ్ ఇన్ ఆంధ్రా’  తీసిన భావనారాయణ ప్రచారం చేయడంతో కాంతారావు గుండె పగిలింది. అయితే ఆ ఉద్యమ ప్రభావానికి ‘సప్తస్వరాలు’ తో బాటు ‘లవ్ ఇన్ ఆంధ్రా’ కూడా మట్టి కర్చింది. 

డైలాగ్ డిష్ 
నాగయ్య :
           * నాకు స్వార్ధమా? భార్యలా బిడ్డలా సంసారమా...  ఏముందని, ఎవరున్నారని నాకు స్వార్ధం?
           ఎవరేం చేసినా చేయకపోయినా,  కళాకారుడు మాత్రం తన కళ ద్వారా దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటాడు.
 కాంతారావు :
           * ఆశా లేదు, నిరాశా లేదు. అనుకున్నదీ లేదు, అనుకోనిదీ లేదు. లేదనుకుంటే ఏదీ లేదు, అవునా?
           * నవ్వీ నవ్వీ నవ్వీ ...గుండె బండబారిపోయింది...
           * పాదాలు పట్టుకునే ఆడదాన్నీ, కన్నీళ్లు పెట్టుకునే మగవాణ్ణీ నమ్మ కూడదు.
 రాజబాబు :
           * చచ్చింది గొర్రె! నా నోట్లో నువ్వు గింజ కూడా నానదే!
           * ఇంత వరకూ భూమి కనిపించింది, ఇక ముందు చుక్కలు కనపడతాయి.


-సికిందర్ 
(సాక్షి- నవంబర్, 2009)
cinemabazaar.in