రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, April 1, 2017

రివ్యూ!






    

టెంప్లెట్ - దర్శకత్వం : పూరీ జగన్నాథ్.
తారాగణం: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్ లిన్ స్కీ,  తులసి, అనూప్సింగ్ఠాకూర్, సుబ్బరాజు, అలీ, అవినాష్, ఎజాజ్ ఖాన్
సంగీతం: సునీల్కాశ్యప్, ఛాయాగ్రహణం: ముకేష్ బ్యానర్‌: తన్వి ఫిలింస్
నిర్మాత: సి.ఆర్‌. మనోహర్, సి.ఆర్‌. గోపి
విడుదల : మార్చి 31, 2017
***

     ఒక దర్శకుడు ఎన్నేళ్ళు పోయినా అవే సినిమాలు అలాగే తీస్తూపోతున్నాడంటే ప్రేక్షకుల సహన శక్తి మీద అంత నమ్మకమన్న మాట. ప్రేక్షకులకి ఈ సహన శక్తి ఏ సినిమాకా సినిమా తను మార్చేసే స్టార్స్ ని చూసి వస్తూండవచ్చు. ఇది తన అదృష్టమే. చాలా కొద్ది మందికే ఇలా చెల్లిపోతుంది. వాళ్ళల్లో  పూరీ జగన్నాథ్ ఒకరు. తనని స్టార్స్ కరుణిస్తున్నంత కాలం శాశ్వత ప్రాతిపదికన, ఎక్కడో ఘనీభవించిన-  శిలాసదృశమైన  తన రాత- తీత పనికే ఢోకా వుండదు. తను రాసిందే కథ, తను తీసిందే సినిమాగా,  స్త్రీ ద్వేషమే  తన అమ్మకపు సరుకుగా కార్యకలాపాలు సాగించుకోవచ్చు. 

         
దృష్ట్యా పూరీ సినిమాలకి రివ్యూలే అవసరం లేదు. ఏముంటుంది రాయడానికి రాసిందే రాయడం తప్ప. అలాగే కొత్త తరం దర్శకులు నేర్చుకోవడానికి ఏముంటుంది పూరీ సినిమాల్లో, చూసిందే చూడడం తప్ప. అయితే ఎవరో పసిగట్టేసి అల్లరి చేస్తున్నారని కాబోలు, కాస్త మారినట్టూ కన్పించడమూ తనకే సాధ్యమైంది. కానీ మారినట్టు కన్పించినంత మాత్రాన  కొత్తగా తీసిన  ‘రోగ్’ కాస్తా రోగరహితమై పోతుందా? రోగాన్ని దాచుకుని పైపైన స్ప్రే కొట్టుకు తిరిగితే ఆ స్ప్రే మార్నింగ్ షో వరకే సరిపోతుంది. ఇక ప్రతీ షోకీ ప్రేక్షకులు స్ప్రే కొట్టుకుని చూడాల్సి వస్తే సహనశక్తి పూర్తిగా నశించిపోతుంది. 




          టెంప్లెట్ సినిమాలు తీసి తీసి, అల్లరయ్యాకా ఎందుకు ఫ్లాపవుతున్నాయో తెలుసుకుని, ‘రోగ్’ ని టెంప్లెట్ నుంచి కాస్తా తప్పించినట్టు కన్పించేలా చేద్దామనుకున్నట్టుంది. పూరీ మార్కు టెంప్లెట్ అంటే- తాజాగా గత వారం  వచ్చిన  ‘కాటమ రాయుడు' అనే అట్టర్ ఫ్లాపే. ఆ దర్శకుడు పూరీని ఆదర్శంగా తీసుకుని టెంప్లెట్ లో అన్నీ సర్దేశాడు. పూరీ టెంప్లెట్ ప్రకారం ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్  లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు.

          ఇదే టెంప్లెట్ ని ఇంకో విధంగా కూడా చూపించారు-
అదే కథ, అవే పాత్రలు, వాటికి  ఒక యాక్షన్ సీన్ ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాటమళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా ఇవే రౌండ్లేస్తూ  వుండడమన్నమాట.

          అవతల మూసని బ్రేక్ చేసే తెలుగు టాలెంట్స్  తో  ఒక ‘ఘాజీ’ రానీ, ఇంకో ‘గురు’ రానీ- ఈ టెంప్లెట్  ఏమాత్రం గిల్టీ  ఫీలవదు. టెంప్లెట్ కి కాలంతో పని లేదు, కాలమ్స్ కి సరిపడా పాత రేషన్ ని డంప్ చేయడమే దాని పని.

          ఇప్పుడు రూపం మార్చుకున్న టెంప్లెట్ లో ఈ కింది విధంగా ఏడు కాలమ్స్ వున్నాయి :

          ఇవే ఏడు కాలమ్స్ పాత టెంప్లెట్ లో ఇలా వుండేవి :

            ఫస్టాఫ్ ఇంటర్వెల్ దాకా హీరోయిన్ ని పడేసే హీరో కామెడీ ఇప్పుడు లేదు, మార్పు కోసం మిస్టర్  రోగ్ హీరోయిన్స్ ని సీరియస్ గా ద్వేషిస్తూంటాడు, అంతే. ఓపెనింగ్ లోనే పోలీస్ కమీషనర్  పాత్రనీ, అతడి చెల్లెలైన హీరోయిన్ పాత్రనీ రొటీన్ గా భూతకాలంలోంచి దిగుమతి చేసుకుంటాడు. హీరోయిన్ పెళ్లవుతూంటే వచ్చి అడ్డుపడతాడు. అందర్నీ కొడతాడు, ఒక పోలీసు కాళ్ళు  విరగ్గొడతాడు. హీరోయిన్ పెళ్లి మాత్రం జరిగిపోతుంది. దాంతో ఆమె  మోసానికి  స్త్రీ లందర్నీ ద్వేషించడం మొదలెడతాడు. హీరోయిన్ పేరు అంజలి అనే టెంప్లెట్ పేరు. దీంతో అంజలి పేరుతో  ఏ టెంప్లెట్  అమ్మాయి కన్పించినా  పట్టుకు కొట్టేస్తాడు. 

          ఈ రోగ్ కి  అసలే మైనారిటీ లో పడిపోతున్న మాస్ ప్రేక్షకులని బుజ్జగించడానికి  చంటి అనే ఇంకో టెంప్లెట్ పేరు. ఇక బుజ్జగింపు రాజకీయాలు మొదలు. పోలీసు కాళ్ళు విరగ్గొట్టినందుకు ఈ చంటి రోగ్ రెండేళ్ళు జైలుకి పోతాడు. ఈ జైలు సీన్లు మైనారిటీలో పడిపోతున్న మాస్ ప్రేక్షకుల్ని బుజ్జగించేందుకు ప్రత్యేకించినవి. జైలుకొచ్చి కలిసిన పెళ్ళయిన హీరోయిన్, అటు మొగుడితో కూడా ఎలా నాటకాలాడుతోందో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో అమ్మాయిలు మేథమెటిక్స్ అనీ  - అబ్బాయిలు పోయెట్రీ అని  డిసైడ్ చేసుకుంటాడు రోగ్. అబ్బాయిలే పవిత్రులూ, అమ్మాయిలు అపవిత్రులన్న డైలాగులు ఇక సాంతం రాజ్యమేలతాయి. ఇక ఏ ఆడ పాత్రకీ పూచిక పుల్ల విలువుండదు. వాళ్ళని ఎంత కించపరిస్తే అంత బాక్సాఫీస్ గలగలలు విన్పిస్తాయన్నట్టు. ఇదంతా అసలే మైనారిటీలో పడిపోతున్న –అదికూడా పూరీ సినిమాలకి కొందరు అబ్బాయిలకే పరిమితమైపోయిన యువ ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టించడానికే. నీట్లో తడిసిన హీరోయిన్- ‘పంది కూడా తడిస్తే అందంగా వుంటుంది’ అన్నదాకా ఈ డైలాగుల పంద్యారం సాగుతుంది.

         ఇంతకీ రోగ్ ఇవన్నీ చేసేది కోల్ కత మహా నగరంలోనే. జైలునుంచి విడుదలై  టెంప్లెట్ ప్రకారం ఇంటికి పోతే టెంప్లెట్ ప్రకారమే తండ్రి వెళ్ళ గొడతాడు. కాళ్ళు విరగ్గొట్టిన పోలీసు కుటుంబాన్ని ఆదుకుందామని పోతాడు. వాళ్ళు ఛీ కొట్టినా ఇంటి ముందే వుంటున్న బెగ్గర్స్ గుంపుతో  మకాం వేస్తాడు. ఆ కానిస్టేబుల్ చెల్లెలు ఇంకో హేరోయిన్. ఈమె కోల్ కత నైట్ క్లబ్ లో టెంప్లెట్ ప్రకారం తెలుగు పాటలు పాడుతూ అన్న కుటుంబాన్ని పోషించుకునే త్యాగమయి- ఈమె కూడా ‘బజారుమయి’ అయిపోతుంది. సౌజన్యం : రోగ్ గారి స్త్రీ ద్వేషం. పైగా ఈమె పేరూ అంజలి. రోగ్ గారు కర్ర తీసుకుని చావబాదుతూ బిర్యానీలు కూడా తినిపిస్తాడు ఈమె ఇంటిల్లిపాదినీ.

          టెంప్లెట్ ప్రకారమె ఒక వడ్డీల వ్యాపారికి వసూళ్ళ ఏజెంటుగా కుదిరి, ఆ వచ్చిన కమిషన్ తో  కానిస్టేబుల్ అప్పులు తీర్చడం మొదలెడతాడు రోగ్. కానిస్టేబుల్ కి ప్రభుత్వం నష్టపరిహారం అదీ బాగానే ఇచ్చే వుండాలి, చెల్లెలికి ప్రభుత్వోద్యోగం కూడా ఇచ్చే వుండాలి. అయినా రోగ్ ఆదుకుంటానని వేధిస్తూంటాడు. ఇంకా చాలా చేస్తూంటాడు. పెళ్ళయిన హీరోయిన్ ఇంటికి కూడా వెళ్లి భర్తకి, పోలీస్ కమీషనర్ అయిన ఆమె అన్నకీ ఆమె మీద గాసిప్స్ చెప్పి చెడగొట్టాలని చూస్తూంటాడు. టెంప్లెట్ ప్రకారం ఇంటర్వెల్ కి  ముందు విలన్ వచ్చే దాకా ఈ రోగ్ స్త్రీ ద్వేషిగా టైం పాస్ చేయాలి కాబట్టి- కామెడీ చేయరాక అరుస్తూ వుండాలి కాబట్టి, అడ్డొచ్చిన వాళ్ళని కొడుతూ వుండాలి కాబట్టి- ఇవన్నీ చేస్తూండగా, ఇక టైము చూసుకుని వచ్చేస్తాడు టెంప్లెట్ విలన్. 


         వీడు సైకో. హీరో రోగ్ అయితే, విలన్ సైకో. ఈ సైకోకి ఇంకా హీరోయిన్ కన్పించాలి కాబట్టి అప్పటి దాకా రోగ్ తో దోస్తానా చేస్తూంటాడు. హీరోయిన్ కన్పించగానే  టెంప్లెట్ ప్రకారం కామెడీగా వెంటపడతాడు. ఈ కామెడీ సైకోతో ఆమెకి కథ వుంది. క్లాస్ రూమ్ లో వీడు ఒకమ్మాయిని కాల్చి చంపాడు. అప్పుడు పెట్రోలు పోసుకుని వున్న వీణ్ణి లైటర్ తో అంటించేసి చంపాలనుకుంటుంది హీరోయిన్. కానీ చేతిలో ఆ లైటర్ వెల్గించి పట్టుకుని ఆ పనే చెయ్యదు. ఫ్రెండ్ చస్తే చచ్చింది, నేనెందుకు వీణ్ణి చంపి జైలుకి పోవాలనుకుందో ఏమో- అలాగే ముందు ముందుకు వెళ్తూంటుంది లైటర్ తో. వాడి మీదికి విసిరేస్తే వాడే భస్మీ పటలమైపోతాడు. కానీ ఆ పనే చెయ్యదు. సైకో కూడా గట్టిగా వూదితే ఆరిపోయే లైటర్ కి భయపడతాడే గానీ, వూదేసి పారిపోవాలనుకోడు. పోలీసులు వచ్చే దాకా లైటర్ ని చూస్తూ భయపడుతూ స్టూడెంట్స్ చేత తన్నులు తిని, పోలీసులకి దొరికిపోతాడు. ఇప్పుడు జైలు నుంచి తప్పించు కొచ్చి హీరోయిన్ పని బడుతున్నాడన్న మాట. 

        ఇదీ విషయం. ఇక వీణ్ణి ఎదుర్కొని హీరోయిన్ని కాపాడుకోవాలి రోగ్. ఈ రీసైక్లింగ్ కథ కాదుగానీ, దీంతో పూరీ పడ్డ పాట్ల గురించే చెప్పుకోవాలి. ఎలాగైనా దీన్ని నిలబెట్టాలన్న ఆదుర్దా, ఆందోళనలే ప్రతీ చోటా కన్పిస్తాయి. ఏం చేస్తున్నాడో తనకే తెలీనట్టు ఎడాపెడా అర్ధం లేని సీన్లు వచ్చిపడుతూంటాయి. సెకండాఫ్ లో ఇదెక్కువై పోతుంది. అప్పటికప్పుడు సెట్లో సీన్లు రాసుకున్నారన్నట్టు తయారవుతుంది. పోనూ పోనూ పూర్తిగా అదుపుతప్పి పోతుంది. తనకి హీరోయిన్ దక్కకుండా చేస్తున్నారని ఊళ్ళో ఆడవాళ్ళందర్నీ సైకో కిడ్నాప్ చేయడం, కానిస్టేబుల్ కి కాళ్ళు తెప్పించే  ఆపరేషన్ కోసం రోగ్ కి పది లక్షలు కావాల్సి వచ్చి సైకో సాయమే తీసుకోవడం, ఆ సైకో ఏకంగా దోపిడీలే చేయడం....ఏమిటో,  కథంటే ఎలా అంటే అలా నరుక్కు పోతూంటే ఎక్కడో దార్లో పడకపోతుందా అన్నట్టు- సిల్వర్ స్క్రీన్ మీదే సినిమా చూపిస్తూ పూరీ రఫ్ కాపీ రాసుకుంటున్నట్టు వుంటుంది... ఈ ‘రోగ్’ రఫ్ కాపీయే. దీన్ని చక్కదిద్ది ఫైనల్ కాపీ ఎప్పుడు చూపిస్తారో. ఫైనల్ కాపీయే  ఇంకో కథగా, ఇంకో టెంప్లెట్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు. 

          ఇలా తను టెంప్లెట్ నుంచి బయటపడ్డానని అన్పించుకోవడానికి, టెంప్లెట్ కే కొత్త రూపం తొడిగి మభ్యపెట్టబోతే ఫలితాలు డిటో గానే వచ్చాయి. టెంప్లెట్స్ రాయకుండా పూరీ స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకున్నప్పుడు ఫలితాలు వేరేగా వుంటాయి. అన్నట్టు పూరీ స్క్రీన్ ప్లే ఎప్పుడు రాసినట్టు? అసలు ఒక్క స్క్రీన్ ప్లే రాయకుండా రెండు దశాబ్దాలు చెలామణీ అవడం రికార్డే. 

         ఐతే ఈసారి టెంప్లెట్ కి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా పోయింది. కన్నడ వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తూ  స్టార్ ఎట్రాక్షన్ లేని లోపంతో సతమతమవాల్సి వచ్చింది. కొత్త హీరో ఇషాన్ ఫైట్లు డాన్సులు బాగా చేయడం గొప్పేం కాదు. ఈ రోజుల్లో అవి లేకుండా తెరంగేట్రం చేయలేరు. నటన ఎంతన్నదే పాయింటు. తనలో గనుక నటుడే వుంటే, నటనకి ఏమాత్రం అవకాశమివ్వని ఈ ‘రోగ్’ బ్యాడ్ ఆప్షనే తనకి. నటనంటే అరుపులు అరవడమే, లంగ్ పవర్ చూపడమే అని పూరీ అనుకుంటే, తన ద్వారా పరిచయమయ్యే హీరోల కెరీరే ప్రారంభం కాదు. 

          హీరోయిన్లు ఏంజెలా
క్రిస్ లిన్ స్కీ , మన్నారా చోప్రా లు ఎందుకున్నారో వున్నారు. అలీ, అతడి గ్రూపు బెగ్గర్ కామెడీ నీరసంగా వుంది. సైకో అనూప్ సింగ్ హీరో కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ,  రూపాయికి రూపాయిన్నర శ్రమని అమ్ముకున్నాడు. చాలా రోజులకి కన్పించిన సుబ్బరాజు ఎన్ కౌంటర్ స్పెషలిస్టు టెంప్లెట్ పాత్రలో ఏమీ చేయకుండానే వుం డిపోయాడు. రోగ్ గారి మాతృమూర్తిగా తులసిది అయోమయం పాత్ర. 

          పూరీ చేతిలో మంచి స్క్రిప్టు లేకపోయినా ముఖేష్ జి రూపంలో మంచి కెమెరా మాన్ దొరకడం అదృష్టం. స్క్రిప్టు విషయంలో తను అవుట్ డేటెడ్ గా వుంటే,  ఆ కెమెరా మాన్ కి అన్యాయం చేయడమే అవుతుంది. చిరిగిన చొక్కా మీద కోటేసుకున్న చందాన తను టెక్నీషియన్ లని వాడుకోవడం ఇకనైనా మానుకుంటే మంచిది. అలాగే సునీల్ కాశ్యప్ సంగీతాన్ని ఆస్వాదించాలంటే సినిమాకో అర్ధంపర్ధం కూడా వుండాలిగా.

          పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించిన రోజున ప్రేక్షకులు తిరిగి రావడం ప్రారంభిస్తారు తన సినిమాలకి. ఈ సంవత్సరం ఈ మూడు నెలల్లో ‘రోగ్’ తో కలిపి ‘కాటమ రాయుడు’, ‘విన్నర్’, ‘మా అబ్బాయి’, ‘నేనోరకం’, ‘గుంటూరోడు’ అనే ఆరు  టెంప్లెట్ సినిమాలు వస్తే  అరింటినీ నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు క్లాస్ మాస్ ప్రేక్షకులందరూ. ఇప్పటికైనా టెంప్లెట్ ని మూసిపెట్టుకుంటారా? ఇలాగే  కోటాను కోట్లు పోగొట్టుకుంటూ వుంటారా? 

-సికిందర్
cinemabazaar.in