రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, మార్చి 2017, శుక్రవారం

రివ్యూ!



దర్శకత్వం : కిషోర్ కిషోర్ పార్థసాని

తారాగణం : పన్ళ్యాణ్, శృతీహాసన్, రావు మేష్, ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా, ల్ కామరాజు, శివ బాలాజీ, చైతన్య కృష్ణ, అజయ్, అలీ, పృథ్వీ  దితరులు
కథ : శివ,  స్క్రీన్ ప్లే : వాసూ వర్మ, దీపక్ రాజ్, రచన : ఆకులశివ, వేమారెడ్డి, శ్రీనివాస రెడ్డి, తిమ్మా రెడ్డి; సంగీతం
: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రణంః ప్రసాద్ మూరెళ్ల
బ్యానర్ :
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతః
 త్ రార్
విడుదల : మార్చి 24, 2017

         ***


        గబ్బర్ సింగ్’  సీక్వెల్ గా  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో నటించి భంగ పడ్డ పవన్ కల్యా ణ్  రీమేక్ మీద దృష్టి పెట్టి, 2014 లో తమిళంలో అజిత్- తమన్నాలు నటించిన  ‘వీరమ్’ ని ‘కాటమ రాయుడు’ గా మార్చుకుని ప్రేక్షకుల ముందు కొచ్చారు. ‘వీరమ్’ తెలుగులో డబ్బింగ్ అయి ‘వీరుడొక్కడే’ గా విడుదలయింది. డబ్బింగ్ అయిన సినిమాని రీమేక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. పవన్ కల్యాణ్  తన స్టార్ పవర్ తో డబ్బింగ్ ప్రభావాన్ని ని అధిగమించవచ్చన్న నమ్మకంతో రిస్కు చేశారు. మరి ఈ రిస్కు పే చేసిందా? ఈ రిస్కులో వున్న రిస్కేమిటి? రిస్కు రిస్కు కాకుండా ఎప్పుడుంటుంది? రిస్కు రిస్కు అయినప్పుడు ఇంకేం రిస్క్ చేయాలి.... ఇత్యాది సందేహాలకి సమాధానాలు ఈ కింద వెతుకుదాం...

కథ 
    రాయల సీమలో రాయల్ గా బతికే కాటమరాయుడు (పవన్ కల్యాణ్) కి నల్గురు తమ్ముళ్ళు (ల్ కామరాజు, శివ బాలాజీ, చైతన్య కృష్ణ, అజయ్), ఈ తమ్ముళ్ళ తో పాటు వుండే వకీలు (అలీ). తమ్ముళ్ళని అమితంగా ప్రేమించే కాటమరాయుడు పెళ్లి చేసుకోవాలనుకోడు. చేసుకుంటే ఆ వచ్చే భార్యవల్ల అన్నదమ్ముల అనుబంధం చెడి పోతుందనుకుంటాడు. పెళ్లి మాటెత్తితే శివాలెత్తి పోతాడు. కనుక తమ్ముళ్ళతో బాటు వకీలు లింగబాబు రహస్య ప్రేమాయణాలు మొదలెట్టుకుంటారు. కానీ అన్నకి పెళ్లి కాకుండా  తాము చేసుకోలేమని, అన్నని ప్రేమలోకి దింపాలనీ  ప్లానేస్తారు. ప్లాను ప్రకారం అవంతిక ( శృతీ హాసన్)  అనే క్లాసికల్ డాన్సర్ చేత వూళ్ళో  ప్రోగ్రాం ఇప్పించి ఆమెకి కాటమరాయుడు పడేలా చేస్తారు. ప్రేమలో పడ్డ కాటమరాయుణ్ణి తండ్రి (నాసర్)కి పరిచయం చేద్దామని అవంతిక తన వూరికి తీసుకుపోతూండగా దుండగులు కాటమరాయుడి మీద దాడి చేస్తారు.  అప్పుడు తిరగబడ్డ కాటమరాయుడి ప్రతాపం చూసి అవంతిక తనకి ఇలాటి హింసావాది వద్దని, అహింసా వాదియైన  తండ్రికి ఇది చెప్పుకోలేనని తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది...

          పడకపడక ప్రేమలో పడ్డ కాటమరాయుడి పరిస్థితి ఇప్పుడేమిటి? ఆమె మనసు మార్చాడా, లేక తను మరాడా? ఆమె కుటుంబం వెనుక కథేమిటి? ఆమె కుటుంబాన్ని కూడా తను ఎలా కాపాడాడు?... ఇవి తెలుసుకోవాలంటే  వెండి తెరని ఆశ్రయించాల్సిందే.

ఎలావుంది కథ 
      నిజానికిది 1954 నాటి హాలీవుడ్ క్లాసిక్ ‘సెవెన్ బ్రైడ్స్ ఫర్ సెవెన్ బ్రదర్స్’  కి  తిరగేసిన వెర్షన్ లాంటి కథలా వుంటుంది. ఈ హాలీవుడ్ క్లాసిక్ ని 1982 లో అమితాబ్ బచ్చన్,  హేమమాలినిలతో  ‘సత్తేపే సత్తా’ మ్యూజికల్ హిట్ గా తీశారు. పొలం పనులు చూసుకునే అన్న మాట జవదాటని ఆరుగురు తమ్ముళ్ళుంటారు. వీళ్ళకి నాగరికత తెలీదు, మ్యానర్స్ వుండవు. అడవి మనుషుల్లా వుంటారు. ఈ వెధవలుంటే తన పెళ్లి కాదని హేమమాలినిని ప్రేమించే  అమితాబ్ బచ్చన్, తనకి ఒక్కడే తమ్ముడున్నాడని అబద్ధం చెప్పి పెళ్ళిచేసుకుని తీసుకొస్తాడు. రాగానే ఆమె ఈ చంఢాలమంతా చూసి, ఖర్మ అనుకుని ఆ కోతుల్ని మనుషులుగా మార్చే పనిలో పడుతుంది. ప్రేమల్లో కూడా పడేస్తుంది ఆరుగురమ్మాయిలతో. అప్పుడు రంగ ప్రవేశం చేస్తాడు అచ్చు అమితాబ్ బచ్చన్ లా వుండే విలన్ (అమితాబ్ డబుల్)...చాలా ఫన్నీగా వుంటుంది ఈ కథ. ఈ కథతో 1984 లో తెలుగులో కృష్ణ –జయసుధలతో టి. కృష్ణ దర్శకత్వంలో ‘అందరికంటే మొనగాడు’ వచ్చింది. కానీ నేటివిటీ సమస్యవల్ల ఆడలేదు.

          ఈ కథ ‘వీరమ్’ లో  పెళ్లి వద్దనే అన్న- కావాలనుకునే తమ్ముళ్ళ దాగుడుమూతల డ్రామాగా రూపం మార్చుకుంది. ఇదే మార్పులు లేకుండా  ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయింది. 

ఎవరెలా చేశారు.
        కాటమ రాయుడిగా పవన్ చివరంటా  డామినేట్ చేశారు. కీలకమైన నల్గురు తమ్ముళ్ళ పాత్రల్ని, తనని సమస్యలో పడేసే హీరోయిన్ పాత్రనీ పక్కకు నెట్టేశారు. పక్కకి నేట్టేశాక తనకి మిగిలింది పది నిమిషాలకో సారి భారీ యాక్షన్ సీన్సే, ఓ ఆరు పాటలే. యాక్షన్ సీన్స్, పాటలూ వీటి ఆధారంగా తన స్టార్ పవర్ తో  సినిమాని నిలబెట్ట వచ్చను కున్నారు. సూర్య కూడా తన ‘సింగం -3’ తో ఇలాగే వన్ మాన్ షో చేస్తే, సెకండాఫ్ నుంచే అది మొనాటనీ బారినపడి చతికిలబడింది. ‘వీరమ్’ లో అజిత్ స్టార్ పవర్ తో – ఆ స్టార్ పవర్ కి తోడు  తనెలా వుంటాడో అలా నెరసిన జుట్టుతో, సాంతం పంచె కట్టుతో  నటించి - ఆ  లుక్ ని బాక్సాఫీసు విజయానికి యూఎస్పీగా  మార్చేశాడు. అంతేగానీ కథతో కాదు. పవన్ కల్యాణ్  అప్పుడప్పుడు పంచె కట్టడం తప్ప పాత్రకి తగ్గ లుక్ పై అస్సలు శ్రద్ధ పెట్టలేదు. తన పాత్రకి మారని తన రొటీన్ మీసకట్టే ఇబ్బందికరంగా తయారయ్యింది. ట్రిమ్ చేసిన అలవాటైన మీసాన్ని తిప్పబోతే చేతికే రావడం లేదు- లేని మీసాన్ని తిప్పడమెందుకు అనుకునేట్టు వుంది.  బాక్సాఫీసు విజయంకోసం తన వంతు యూఎస్పీ గా పవన్ ఏమీ ఇచ్చినట్టు కన్పించదు - కొత్తగా తనేం ఇచ్చినా ఇవ్వకపోయినా  ఫ్యాన్స్  మోసేస్తారులే అన్నట్టుంది. 

          ఫస్టాఫ్ లో శృతీహాసన్ తో ప్రేమ సన్నివేశాల్లోనే పవన్ అభిమానుల్ని అలరిస్తాడు. అయితే ఆరు పాటలున్నా అవి పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడంతో  తన స్టార్ పవర్ తో వాటికి ఊపు తీసుకురావడం సాధ్యం కాలేదు. మొత్తం మీద చెప్పొచ్చేదేమంటే,  తన స్టార్ పవర్ యాక్షన్ సీన్స్ కి పనికొచ్చిందే గానీ,  దారితప్పిన స్టోరీ పవర్ తనకి చాల్లేదు. 

          శృతీహాసన్ ‘సింగం -3’ లో ఎలా వుందో అలాగే వుంది. అదుపులోలేని షేపుతో, వన్నె తగ్గిన అందాలతో. పాత్రకూడా బలి అయిపోయింది.  ఇంటర్వెల్ లో కథని మలుపు తిప్పిన తను, తర్వాత ఆ ప్రేమ కథకి ప్రత్యర్ధిగా వుండక- ప్రేక్షక పాత్ర వహించింది.

          తమ్ముళ్ళ పాత్రల్లో నల్గురూ ప్రాధాన్యం లేక మగ్గి పోవాల్సి వచ్చింది. అలీ అయితే పాపం జాలి గొల్పే స్థితి. పృథ్వీ అయితే ఇంకా దయనీయ స్థితి. కమెడియన్లు కూడా వాళ్ళ సహజ పద్ధతిలో కామెడీ చేసుకునే స్వేచ్ఛతో కన్పించరు. విలన్లు తప్పించి, తమ్ముళ్ళు సహా  అందరూ, కాటమరాయుడి  భయానికి అన్నట్టు, చాటు మాటుగా వచ్చేసి గుసగుసలాడి వెళ్లిపోయే సెన్సార్  షిప్ బాధితుల్లాగా కన్పిస్తారు.  

          ప్రదీప్ రావల్, తరుణ్ అరోరా అనే ఇద్దరు విలన్లు వున్నారు. ఫస్టాఫ్ ప్రదీప్ తన పాత్ర చాలించుకు వెళ్ళిపోతే, సెకండాఫ్ తరుణ్ అరోరా స్వీకరిస్తాడు. పక్క విలన్ గా శాడిస్టుగా మొత్తమంతా రావురమేష్ వుంటాడు- ముగ్గురితో వచ్చిన సమస్యేమిటంటే, ముగ్గురూ పవన్ స్టార్ పవర్ కి తగ్గ విలన్ పాత్రలు కాలేకపోవడం. పక్క విలన్ వుంటే వుండొచ్చు గానీ, ఇలా ఒక ప్రధాన విలన్ వెళ్లిపోయి, ఆ స్థానంలో  మరో విలన్ వచ్చే సినిమాలు ఎక్కడా ఆడలేదు.

          అనూప్ రూబెన్స్ ఈసారి స్టార్ సినిమాకి సరిపోలేదు. పవన్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ ఇంత బలహీనంగా లేవు. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం, రామ్ – లక్ష్మణ్ ల పోరాటాలు మాత్రం బావున్నాయి. ప్రొడక్షన్ విలువలు భారీగా వున్నాయి. స్క్రిప్టు మీద కూడా (ఆరుగురు రచయితలు) భారీగానే ఖర్చు పెట్టినట్టున్నారు. ఇవన్నీ పొందిన దర్శకుడు కిషోర్ ఈ రీమేక్ ని ఎక్కడో పట్టాలు తప్పించినట్టు మాత్రం ప్రేక్షకులే కాదు, ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.

చివరికేమిటి?

      డబ్బింగ్ అయిన సినిమాని రిమేక్ చేయడం స్టార్ పవర్ వుంటే రిస్కు కాకపోవచ్చు, కానీ ఆ వొరిజినల్ లో అసలు దేన్ని రిస్క్ చేశారో తెలుసుకోకపోతే  రీమేక్ చేయడం రిస్కే అవుతుంది. ఒక భాష లో ఒక సినిమా హిట్టవడం ఒక్కటే  రిమేక్ చేయడానికి గీటు రాయి అయితే, అన్ని రీమేకులూ హిట్టే అవుతాయి. ‘వీరమ్’ హిట్టవడానికి అజిత్ యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్), తమన్నా గ్లామర్ కోషెంట్,  దేవీశ్రీ ప్రసాద్ పాటలు, విడుదలైన 2014 నాటి పరిస్థితులు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు, పెట్టిన బడ్జెట్ ...మొదలైనవి అనేకం తోడ్పడి వుంటాయి. ముమ్మాటికీ ‘వీరమ్’ దాని కథాకథనాలతో హిట్టవలేదని స్థానిక, జాతీయ మీడియాల్లో వచ్చిన రివ్యూలు చదివితే తెలిసిపోతుంది. కానీ కథా కథనాలనే నమ్మి, అజిత్ పోషించిన పాత్ర కూడా ఆకర్షించి  తెలుగులో రీమేక్ చేసినట్టు కన్పిస్తోంది. ఇది రిస్కే, మిగతా వాటిని పట్టించుకోక పోతే. ‘వీరమ్’ నే అవకతవక కథా కథనాలతో రిస్క్ చేసి, మిగతా పైన చెప్పుకున్న అంశాలతో కవర్ చేస్తేగానీ  అది హిట్టవ లేదని తెలుస్తోంది. రిస్కు ఎప్పుడు రిస్కు కాకుండా వుంటుందంటే- ఒరిజినల్ హిట్ చుట్టూ వుండే  కారణాలన్నీ  రీమేక్ కి కూడా బదలాయింపు అయినప్పుడు మాత్రమే. కానప్పుడు ఆ కథా కథనాల తాలూకు లొసుగులన్నీ వెంటాడతాయి. 


          ‘వీరమ్’ కి కథ కొకరు, మాటలకి ఒకరు ఇద్దరే రచయితలుంటే (ఇద్దర్లో  ఒకరు దర్శకుడు), ‘కాటమ రాయుడు’ రీమేక్ కి దర్శకుడితో  కలిపి ఏడుగురున్నారు! ఇంకా పవన్ ఇన్ పుట్స్ కూడా వుంటాయి. ఇంతమంది కలిసి ఒక్కటే గుర్తించలేకపోయారు- ఈ కథ ఇంటర్వెల్ దగ్గరే ఫ్రాక్చర్ అయి సెకండాఫ్ సిండ్రోమ్  లో పడిందని, ఈ కథకి కేంద్రబిందువుగా ఒకే సమస్యతో కూడిన సంఘర్షణ లేదనీ;  ఫస్టాఫ్ హీరో కథకి ఒక విలన్ తో ఒక సంఘర్షణ పూర్తయ్యాక, సెకండాఫ్ హీరోయిన్ కథకి ఇంకో విలన్ తో మొదలయ్యిందనీ! 

          ఇంకా చెప్పుకోవాలంటే , కథ ప్రారంభిస్తూనే పాయింటు లో కెళ్ళే కథలు ఫస్టాఫ్ వరకే సరిపోయి, సెకండాఫ్ లో వేరే కథగా సాగడం తెలుగు సినిమాల్లో తరచూ చూస్తున్నాం. ఇలాటి వన్నీ ఫ్లాపయ్యాయి- తెలివిగా మేనేజ్ చేయడం వల్ల  ‘దొంగాట’ తప్ప. ప్రస్తుత స్క్రిప్టుకి రచయితల్లో ఒకరైన వేమారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘చక్కిలిగింత’ కి ఇదే జరిగిందని రివ్యూలో రాశాం. ఇది తెలుసుకుని వుంటే ‘వీరమ్’ కథలోనూ దీన్ని పసిగట్టి కిం కర్తవ్యం ఆలోచించే వారేమో.

          ‘కాటమరాయుడు’ ఎంతవరకు ఈ లోపాల్ని పవర్ స్టార్ స్టార్ పవర్ తో జయిస్తుందో ఈ వారాంతం తర్వాత తేలుతుంది.

-సికిందర్

(స్క్రీన్ ప్లే సంగతులు సోమవారం)