ఎన్ని ఉగాదులు వచ్చినా తెలుగు
సాంప్రదాయంలో రీమేక్ ఒకటే వుంటుంది, హాలీవుడ్ సాంప్రదాయంలో రీబూట్ కూడా వుంటుంది. పాత
తెలుగుని రీమేక్ చేయడం తెలుగులో
ఎప్పుడోగానీ జరిగే పనికాదు. హాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలనే రీమేక్ చేయడమో, లేదా రీబూట్
చేయడమో తరచూ జరిగేపని. ప్రస్తుతం హాలీవుడ్ నుంచి హాలీవుడ్ రీమేకులు గానీ, రీబూట్స్
గానీ 36 జరుగుతున్నాయి! తెలుగులో తమిళం
నుంచి ఎక్కువగా రీమేకులు జరుగుతూంటాయి. కానీ రీబూట్ ఒక్కటీ జరగదు. రీమేకింగ్ నే
తెలుగు నేటివిటీకి, స్టార్ కనెక్టివిటీకీ ఉపరితలంలో కొన్ని మార్పు చేర్పులు చేసి పూర్తిచేస్తున్నారు.
రీమేక్ తప్ప రీబూట్ లేకపోవడంతో రీమేక్ కి
పనికి రాని సినిమాలని కూడా ఉపరితలంలో తాపీ
పనిచేసి రీమేక్ చేసేస్తున్నారు. నిజానికి
ఇలాటి రీమేక్ కి పనికి రాని సినిమాలని రీబూట్ చేయాలి. కానీ రీమేక్ చేయాలంటేనే
ఎన్నో సందేహాలతో వుండే ‘రీమేకిష్టులు’, మూలంలో ఒరిజినల్ స్వరూప స్వభావాల్ని
మార్చివేసే రీబూటింగ్ ని అస్సలూహించలేరు. రీమేక్ తో వర్కౌట్ కాని
సినిమాలని కూడా రీమేకే చేసేసి చేతులు కాల్చుకోవడం అలవాటుగా చేసుకున్నారు.
హాలీవుడ్ లో కొన్ని సినిమాలని రీమేక్
చేస్తే సరిపోయినా కూడా, రీబూట్ చేసి మరీ ఇంకింత సక్సెస్ ని సాధిస్తున్నారు.
పరభాషల నుంచి రీమేకులే గాకుండా, పాత తెలుగు సినిమా కథల్నేఅటు ఇటు మార్చి రీసైక్లింగ్ చేస్తూంటారు. కనీసం ఈ సందర్భంలోనైనా రీబూట్ గురించి ఆలోచించడం లేదు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ పాత రీసైక్లింగ్ కథ అని తెలిసిందే. అందులో కొత్తగా గుర్రాల్ని పెట్టి జాక్ పాట్ కొట్టవచ్చనుకున్నారు. కానీ అదే కథని రీబూట్ చేసివుంటే (ఎలా చేయవచ్చో ఇదే బ్లాగులో ఫిబ్రవరి 26 నాటి ‘విన్నర్’ కి సంబంధించిన ఆర్టికల్ లో సందేహిస్తూనే రాశాం- ఎందుకంటే, రీబూటింగ్ అనే ప్రక్రియ ఒకటుందని తెలీకపోతే, ఇదేదో వ్యాసకర్త పెడుతున్న నస అనుకునే అవకాశముంది) బాక్సాఫీసు హిట్ కొట్టే వాళ్ళేమో.
కానీ పవన్ కల్యాణ్ సహా మెగా హీరోలు రీబూట్ కి ఒప్పుకునే స్టార్స్ కారు. తమతమ సినిమాలు ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని అవే రొటీన్ మసాలాగా, అవే జడప్రాయమైన పరిధుల్లో వుండాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు అలాటి ఒక రొటీన్, జడప్రాయమైన మసాలాగా, రీమేక్ చేసిన పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ గురించి చెప్పుకోవాల్సి వస్తే, రీబూట్ గురించే చాలా చెప్పుకోవాలి.
కానీ
రీబూట్ కి అంగీకరించని హీరోల సినిమాల్ని ఆ
దృష్ట్యా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకుని లాభంలేదు. కాబట్టి ‘కాటమరాయుడు’ రీబూట్ సంగతి పక్కన పెడదాం; అయినా
దీన్నొక రీమేక్ గానే స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడానికి కూడా ఏమీ కన్పించడం
లేదు. ఎందుకంటే ఇది టెంప్లెట్ రూపంలో వున్న రీమేక్. టెంప్లెట్ సినిమాల్లో స్క్రీన్
ప్లే పరంగా చెప్పుకునేది ఏమీ వుండదని, వాటి గురించి రాయడం కూడా ఈ మధ్య మానుకున్నాం. టెంప్లెట్
సినిమాల అందాల్ని కనిపెట్టి బి, సి సెంటర్ల ప్రేక్షకులే తిప్పి కొట్టగల సినిమా
అక్షరాస్య సమర్ధులుగా ఎదుగుతున్నాక, ఈ మూడు నెలల్లోనే వరసగా విన్నర్, గుంటూరోడు,
నేనోరకం, మా అబ్బాయి- అనే నాల్గుకి నాల్గూ టెంప్లెట్ సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాయి.
తాజాగా వీటి సరసన ‘కాటమ రాయడు’ చేరింది. సామాన్యుడు కూడా నేటి డిజిటల్ ప్రపంచానికి
అలవాటై ముందుకు పోతూంటే, సినిమాలు సామాన్యుడికి వెనకబడే వుంటున్నాయి.
బోరు కొడుతున్న టెంప్లెట్ సినిమాలంటే- ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్ లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు. తనతో ఈ పరిహాసం సామాన్యుడు భరించే పరిస్థితుల్లో లేకనే తిప్పి కొడుతున్నాడు. అయినా సామాన్యుడి బాధ పట్టించుకోకుండా దుందుడుకుగా ‘కాటమ రాయుడు’ కూడా ఇలాటి టెంప్లెట్ సినిమాగానే వచ్చింది.
ఇప్పుడు ప్రస్తావన
వచ్చింది గాబట్టి రీబూట్ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే- రీబూట్
అంటే ఓ సినిమాలోని పాయింటు మాత్రమే
తీసుకుని, ఆ బీజ స్థాయి నుంచీ మొత్తమంతా కొత్తగా నిర్మించుకు రావడం. రీసైక్లింగ్ ‘విన్నర్’
నే తీసుకుంటే- చిన్నప్పుడు తండ్రీ తాతల వివక్షకి గురై పారిపోయిన హీరో- ఇంకోవైపు
వ్యాపారంలో కోట్లకి పడగెత్తిన తాతా తండ్రులు – ఈ పాత పాయింటునే ఈ కాలానికి తగిన కథనంతో కొత్తగా చెబితే రీబూట్
చేసినట్టు. 1954 నాటి ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్
Rear Window ని 2007 లో Disturbia
గా రీబూట్ చేస్తే హిట్టయ్యింది. బ్యాట్ మాన్ బిగిన్స్, స్టార్ ట్రెక్, కేసినో
రాయల్, అమేజింగ్ స్పైడర్ మాన్, రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ దిఏప్స్...ఇవన్నీ రీబూట్
చేసిన అనేక హిట్స్ లో కొన్ని.
అదే రీమేక్ అంటే, ఆ మాతృకలో వున్న పాయింటు సహా మొత్తమంతా యథాతథంగా వుంచడం. పైపైన కొన్ని మార్పు చేర్పులు చేస్తే చేయొచ్చు, బేసిక్ పాయింటు జోలికి పోవడం వుండదు. ఇప్పుడు ‘కాటమ రాయుడు’ రీమేక్ కోసం తీసుకున్న తమిళ ‘వీరమ్’ సంగతి. 2014 లో ఇది అక్కడ మంచి ఫాలోయింగ్ వున్న సీనియర్ స్టార్ అజిత్ తో హిట్టయ్యింది. నెరిసిన జుట్టుతో, కొన్ని పాటల్లో తప్ప - సాంతం తమిళ సాంప్రదాయపు పంచకట్టుతో అతను పాత్ర పోషించాడు. ఇదీ అతను ఈ సినిమాకి తన వంతుగా కంట్రిబ్యూట్ చేసిన తనదైన యూనిక్ సెల్లింగ్ పాయింట్ (యూఎస్పీ). ఇంకా తమన్నా అనే ఒక హాట్ స్టార్, అప్పటి మార్కెట్ పరిస్థితులూ ఇవీ దాని విజయానికి తోడ్పడి ఉండొచ్చు. కథగా ఇందులో కొత్త ఏమీ లేదు. పైగా ఇది స్క్రీన్ ప్లే కూడా కాదు. తమిళంలో హిట్టయింది కాబట్టి తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఓ ఛానెల్లో కూడా ప్రసారమయ్యింది. అయినా పవన్ తో దీన్ని రీమేక్ చేయడానికి పూనుకున్నారు- డబ్బింగూ, ఛానెల్లో ప్రసారమూ ఇవన్నీ పవన్ స్టార్ డమ్ ధాటికి నిలబడవనే అనుకుందాం; కథో పాత్రో తన స్టార్ డమ్ తో అద్భుతాలు చేస్తాయనే నమ్మకంతో రీమేక్ కి పూనుకున్నారనే అనుకుందాం – అయితే పాత్ర ని అజిత్ తన యూఎస్పీ గా మార్చేసినట్టు- పవన్ అలాటి దేమీ చేయలేదు. అజిత్ ఆ గెటప్ లో బాగా వయసుపై బడిన వాడిలా వుంటాడు- అతడిలో హీరోయిన్ తండ్రి అల్లుణ్ణి చూడడం ఎబ్బెట్టుగానే వుంటుంది. ఈ ముసలివాడితో హీరోయిన్ రోమాన్స్ ఎలా చేస్తోందని కూడా అన్పిస్తుంది. కానీ అతడిది అంత పెద్ద వయసు కాదనీ, చిన్న వయసులోనే ఆహారపుటలవాట్ల వల్ల జుట్టు తెల్లబడిందనీ చెప్పి ఈ యూఎస్పీ ని జస్టిఫై చేసుకుంటారు.
'సోగ్గాడే
చిన్ని నాయనా’ లో హుషారైన పెద్ద నాగార్జున సాంప్రదాయ ఆహార్యం, మీసకట్టూ ఒక
యూఎస్పీ. మామూలుగా వుండే చిన్న నాగార్జున సేఫ్టీ. అలాగే పవన్ కాటమ రాయుడుగా వయసుకు
తగ్గ గెటప్ తో ఒక యూఎస్పీ ని సృష్టించుకుని, సేఫ్టీకోసం అతి చిన్న ముద్దుల, అల్లరి
తమ్ముడుగా ఇంకో పాత్రలో తనే నటించి వుంటే –అనూహ్యంగా
వుండేది వ్యవహారం. కానీ ఇది రీబూట్. రీబూట్ జోలికి మనం వెళ్ళడం లేదు.
ఇక కథలో వున్నదేమిటి? ఈ కథ పాయింటేమిటి? ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, తొలి సీనుతో ఫ్రెష్ గా విలన్ తో బాటు, ముందునుంచే రగిలిపోతున్న పక్క విలన్ కూడా కాటమ రాయుడు అంతు చూడాలనుకుంటారు, ఆ తర్వాత మొదటి పది నిమిషాల్లోనే కథ మలుపు తీసుకుంటూ పెళ్లి ఇష్టం లేని కాటమ రాయుడు మీదికి తమ్ముళ్ళు హీరోయిన్ని ప్రయోగించాలనుకుంటారు, దీని తర్వాత ఇంటర్వెల్లో విలన్ ముఠాతో కాటమ రాయుడు పాల్పడే హింస చూసి ప్రేమలో వున్న హీరోయిన్ బ్రేకప్ చెప్పేస్తుంది, ఆతర్వాత సెకండాఫ్ లో హీరోయిన్ కుటుంబ శత్రువులతో కాటమ రాయుడు తలపడి అంతు చూస్తాడు. ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి పాయింట్లు దాడి చేస్తూంటాయి. ఈ కథ ఏ పాయింటు మీద నడిచిందీ అంటే చెప్పలేని పరిస్థితి. ఒక పాయింటు ఆధారంగా కథ నడిచిందని చెప్పబోతే, మిగిలిన పాయింట్లు ఎందుకున్నాయన్న ప్రశ్న తగుల్తుంది. కొన్ని సినిమాల్లో కథనం ఎపిసోడ్ల మయంగా వుంటూ –ఎక్కడికక్కడ ముగిసిపోతూ, స్టాప్ అండ్ స్టార్ట్ డాక్యుమెంటరీ బాపతు ఫ్లాప్ సినిమాలుగా తయారైన విచిత్రాలు చూశాం. ‘వీరమ్’ ఇంకా తేడా. ఇందులో కథనం కాదు- స్టాప్ అండ్ స్టార్ట్ డాక్యుమెంటరీ టెక్నిక్ తో మల్టిపుల్ స్టోరీ పాయింట్లే వచ్చి పడ్డాయి! ఇది కొత్త రికార్డు.
‘వీరమ్’
మార్కెట్ యాస్పెక్ట్ కోసం యూఎస్పీ తో ఎలాగో తంటాలు పడ్డా, క్రియేటివ్ యాస్పెక్ట్
దగ్గర దొరికిపోయారు. క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్ గానీ, స్ట్రక్చర్
గానీ, లాగ్ లైన్ గానీ కన్పించవు. లాగ్ లైన్ చూద్దామంటే అనేక స్టోరీ పాయింట్లు
అడ్డుపడతాయి. స్ట్రక్చర్ చూద్దామన్నా అనేక స్టోరీ పాయింట్లే అడ్డుపడతాయి,
ఆర్గ్యుమెంట్ చూద్దామన్నా మల్టిపుల్ స్టోరీ పాయింట్లే అడ్డుపడతాయి.
కాబట్టి ఈ కథకి ఒక పాయింటు లేదు, పాయింటు లేక ఆర్గ్యుమెంట్ లేదు, ఆర్గ్యుమెంట్ లేక పాత్ర లేదు, పాత్ర లేక స్ట్రక్చర్ లేదు, స్ట్రక్చర్ లేక లాగ్ లైనూ లేదు. దీంతో ఇదొక సినిమాగా తీయాల్సిన కథే కాదు. సినిమా కథలో ప్రశ్నించే ఒకే పాయింటు వున్నప్పుడే అన్నీ దారిలో పడతాయి. ప్రశ్నించనప్పుడు చూస్తున్నది సొదలాగే వుంటుంది ప్రేక్షకులకి. సినిమా కెళ్ళే ప్రేక్షకులు హీరోని పరీక్షకెళ్ళే – ప్రశ్నలకి జవాబులిచ్చే - విద్యార్థిగా చూడాలనుకుంటారు గానీ, పరీక్ష తీసుకునే మాస్టారుగా చూడాలనుకోరు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి ఆసక్తి కల్గించే యాక్టివ్ పాత్ర, మాస్టారు కూర్చుని వుండే పాసివ్ పాత్ర.
కనుక ఈ ‘కథ’ రీబూట్ కి తప్ప ని రీమేక్ పనికి రాదని తెలిసిపోతోంది. రీమేక్ కోసం చేసిన ఉపరితల మార్పు చేర్పులేమిటంటే, అసలే పనిలేకుండా వున్న మొదటి విలన్ కి పక్క విలన్ గా బిల్డప్ ఇచ్చి ఇంకో పాత్ర సృష్టించడం, అలాగే తమన్నా శిల్పి పాత్రని శృతీ హాసన్ గాయని పాత్రగా మార్చడం. ‘వీరమ్’ లో ఇదే మొదటి విలన్ అయిన ప్రదీప్ రావత్ స్థానిక మార్కెట్ యార్డ్ ని శాసించే వ్యాపారిగా, కథలో తక్కువ ప్రాధాన్యం కలిగి వుంటాడు. రీమేక్ లో ఈ పాత్రని రావురమేష్ కిచ్చి, పక్క విలన్ గా కొత్త పాత్రని సృష్టించారు. ప్రదీప్ రావత్ నేమో మొదటి విలన్ ని చేసి, బిగ్ షాట్ గా అట్టహాసంగా కథకి ఇతనే ప్రత్యర్ధి అన్నట్టు చూపారు. ఇంటర్వెల్ తర్వాత ఇంత కష్టపడి క్రియేట్ చేసిన ఈ విలన్ నే వదిలేశారు.
తమిళంలో అంతగా ప్రాధాన్యం లేకుండా వున్న ఫస్టాఫ్ విలన్ ని, ఏ దృష్టితో ఇంత బిల్డప్ తో తెలుగులో అర్ధం లేకుండా మార్చారు? ఉపరితల మార్పులు అసలుకే ఎసరు. కథకి ఇద్దరు విడివిడి విలన్లుండడం బాక్సాఫీసుకి క్షేమం కాదనేది ఎలా మర్చిపోయారు. ఏ కథకైనా విలన్ ఒకడే వుంటాడు. ఎందుకంటే సమస్య- సంఘర్షణ- పరిష్కారమనే యూనివర్సల్ స్క్రీన్ ప్లే ఒక విలన్ వుంటేనే ఏర్పడుతుంది. ఎలా పడితే అలా చేసేవి కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లేలు కావు, ఆర్ట్ సినిమా లేదా ఇండీ ఫిలిమ్స్ స్క్రీన్ ప్లేలు. ఇందుకే మన సినిమాలు కమర్షియల్ సినిమా ముసుగేసుకున్న ఉత్త ఆర్ట్ సినిమాలవుతున్నాయి.
ఇక
శృతీహాసన్ ఉపరితల మార్పుపాత్ర అయితే, కథని రెండుముక్కలు చేస్తూ - విన్నర్,
నేనులోకల్, గుంటూరోడు టైపు అరిగిపోయిన ఇంటర్వెల్ సీనిచ్చింది. సెకండాఫ్ పట్ల ఏ
మాత్రం ఆసక్తి కల్గించని, ఇక సెకండాఫ్ లో ఏం జరుగుతుందో తెలిసిపోయే, సెకండాఫ్ ని ఇక
చూడనవసరం లేదని తేల్చేసే ఇంటర్వెల్ మలుపు
ఇది. ‘వీరమ్’ లో ఇలా లేదు!
‘వీరమ్’ ఇంటర్వెల్ కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు దర్శకుడు మహానుభావుడు. అతుకులబొంత కథకి కూడా ఇంటర్వెల్లో తెలిసో తెలీకో మెరుపులు మెరిపించాడు తమన్నా పాత్రతో. కనీసం ఈ మెరుపుల వల్ల ఇంటర్వెల్ దగ్గరే కథ తెగిపోయి, సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడలేదు సినిమా.
రైలు ప్రయాణంలో అజిత్ విలన్ ముఠాతో పాల్పడే హింసని చూసి కళ్ళు తిరిగి అలా.....పడిపోవడం మాత్రమే చేస్తుంది తమన్నా. అజిత్ ఆగిపోయి చూస్తూంటాడు. అలా చూస్తూంటే సింపుల్ గా విశ్రాంతి పడుతుంది.
ఇంటర్వెల్లో పెద్ద బ్యాంగే ఇవ్వనవసరం లేదనీ, సన్నివేశం చేసే డిమాండ్ ని బట్టి సింపుల్ గానూ వుండొచ్చనీ సిడ్ ఫీల్డ్ అంటాడు – the function of the mid- point is to keep the story moving forward, it is a link in the chain of the dramatic action connecting the First Half of Act -2, with the Second Half of Act -2 అనీ, it can either be a quiet moment అనీ అంటాడు.కమర్షియల్ సినిమాల గురించే అన్నాడు, కళాత్మక సినిమాల గురించి ఎప్పుడూ అనలేదు.
‘వీరమ్’ ఇంటర్వెల్లో వున్నది ఈ quiet moment- నిశ్శబ్ద క్షణాలే. పైన చెపినట్టు అజిత్ హింసని చూసి తమన్నా కళ్ళు తిరిగి పడిపోతుంది. అతనామెనే కళ్ళప్పగించి చూస్తూంటే విశ్రాంతి పడుతుంది. దీంతో దానికదే కథ సెకండాఫ్ లోకి స్మూత్ గా ఫ్లో అయ్యింది, ఫస్టాఫ్- సెకండాఫ్ రెంటినీ కనెక్ట్ చేస్తూ. అంటే కథ ముందుకు సాగిందే తప్ప తెగిపోలేదు. అతడి హింసని ఆమె చూసి కళ్ళు తిరిగిపడిపోయింది – ఇప్పుడేమిటి?- అన్న ప్రశ్న ఏర్పడింది. ఇప్పుడేం జరుగుతుంది?- అన్న సస్పెన్స్ ని కూడా సెకండాఫ్ పట్ల కల్గించింది. ఇక్కడితో ఆసక్తి చచ్చిపోకుండా కాపాడింది. ఏదైతే పరిస్థితిని మాత్రమే చూపిస్తే బలంగా వుంటుందో, దాన్ని మాటలతో చెప్పిస్తే తేలిపోతుంది! ఇక్కడ తమన్నా గానీ, అజిత్ గాననీ ఒక్క డైలాగు పలికినా మొత్తం నాశనమయ్యేది సెకండాఫ్ సహా. అంటే ఈ సీన్ ని డైలాగుల జోలికి పోకుండా, సబ్ టెక్స్ట్ తో నిర్వహించి పైకెత్తారన్న మాట.
‘కాటమ
రాయుడు’ లో డైలాగులు పెట్టేశారు శృతీహసన్ కి. కాటమ రాయుడి హింసని వ్యతిరేకించి,
ప్రేమని తెంచుకుని వెళ్ళిపోయే ఎమోషనల్ డైలాగులు! దీంతో మొత్తం చెడిపోయింది. కథ
ఇక్కడ తెగిపోయింది. కథ తెగిపోవడంతో సస్పెన్స్ లేకుండా పోయింది.. సెకండాఫ్ ఏం
జరుగుతుందో తెలిసిపోయింది. సినిమా ఇక్కడే ఫ్లాప్ అయ్యింది. టెంప్లెట్ సినిమాల్లో ఇంతే- ఇంకా ఇలాటి ఛాలెంజిలతోనే ఇవే కాలం చెల్లిన ఇంటర్వెల్స్.
టెంప్లెట్ ఇంటర్వెల్స్ ఈ మూడు నెలల కాలంలోనే మచ్చుకి కొన్ని- ‘గుంటూరోడు’లో హీరోయిన్ తో పెళ్లి గురించి ఆమె అన్నతో హీరో ఛాలెంజ్! ‘నేను లోకల్’ లో హీరోయిన్ పెళ్లి సీనులో హీరోతో ఆమె తండ్రి ఛాలెంజ్! ‘విన్నర్’ లో పెళ్ళి సీనులో హీరోకి కన్నతండ్రి ఛాలెంజ్! ‘కాటమ రాయుడు’ ప్రేమ గురించి హీరోకి హీరోయిన్ ఛాలెంజ్!
ఇంటర్వెల్ ఛాలెంజ్! ఛాలెంజ్!! ఛాలెంజ్!!! తొడగొట్టి మీసం తిప్పి మరీ బాక్సాఫీసుతో ఛాలెంజ్!!!!
ఎప్పటికప్పుడు మారిపోయే బాక్సాఫీసు హుండీల్లో చెల్లని టెంప్లెట్ నాణేలు...
ఎక్కడి కథలివి...ఎప్పటి ఇంటర్వెల్స్ ఇవి...ఏం ప్రేమలివి...ఏం పెళ్ళిళ్ళు ఇవి... ఎప్పటి ఛాలెంజులివి... ఏం మనుషులు వీళ్ళు... ఏ జమానాలో జీవిస్తున్నారింకా... తిప్పి తిప్పి కొడుకుతున్నారు సామాన్య ప్రేక్షకులు కూడా ఇందుకే. మన కళ్ళముందు కూరగాయలమ్మే ముసలమ్మ, సెల్ ఫోన్లో మాటాడుతూ ‘స్ట్రెయిట్ గా పో’ అని చెప్పగల్గి డెవలప్ అవుతున్న డిజిటల్ ప్రపంచంలో, ఇంకా టెంప్లెట్ ఆమ్లెట్స్ అమ్ముకుంటూ గడపడం జాతీయ స్థూల ఉత్పత్తికి ఏ మాత్రం దోహదం చెయ్యని నేరపూరిత నిర్లక్ష్య కార్యమే.
ఇంటర్వెల్
తర్వాత మొదటి సీను నుంచే ‘కాటమ రాయుడు’ నీరసపడిపోవడాన్ని స్పష్టంగా ఫీలవ్వొచ్చు. కానీ
ఇక్కడ్నించీ ‘వీరమ్’ దర్శకుడు అజిత్ తో కాస్తయినా పాత్రని నిలబెట్టే ప్రయత్నం
చేశాడు. అర్ధోక్తిలో ఆపేసిన ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండాఫ్ లో ఏంజరగబోతుందీ అని ఆసక్తితో చూస్తూంటే, అజిత్ తమన్నా వున్న హస్పిటల్ బయట వుంటాడు. తర్వాత ఆమె
పూర్తిగా కోలుకున్నాక ఆమె ఇంటికే వెళ్తాడు. జరిగిందానికి సారీ చెప్తాడు. ఆమె కోరుకున్నట్టే మారడానికి
ప్రయత్నిస్తానంటాడు. అప్పటికి కూడా ఆమె పల్లెత్తు మాటనదు. మనకి అర్ధమైపోతున్నప్పుడు వేరే అనాల్సిన అవసరం లేదు. ఇదంతా సెన్సిబుల్ గా,
సస్పెన్స్ ఫుల్ గా వుంటుంది- అజిత్ పాత్రని నిలబెడుతూ.
ఇలా కాకుండా కాటమ రాయుడు తమ్ముళ్ళు విసిరే సవాలుకి తనని ఛీకొట్టిన హీరోయిన్ గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ పడిగాపులు గాస్తూ డౌన్ అయిపోతాడు. ఆమె ఇంట్లో ఎలా తిష్ట వేయలా అని కామెడీగా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా రాంగ్ ఇంటర్వెల్ సీను బాధితుడుగా మారిపోయి హీరోయిన్ కి సారీ కూడా చెప్పడు. ఆమె వూళ్ళో ఆమె దగ్గరికి అజిత్ వెళ్ళడానికి గల నేపధ్యం అర్ధవంతంగా వుంటే, పవన్ వెళ్ళడంలో అర్ధమే లేకుండా వుంది - ఇంటర్వెల్ సీను పుణ్యమాని.
ఇంటర్వెల్లో తమన్నా ఛాలెంజి చేయకపోవడంతో, తర్వాత అజిత్ సారీ చెబితే వ్యతిరేకించకుండానూ వుండడంతో, ప్రేమలో సంఘర్షణ అనే పాయింటు తొలగిపోయి- ఆమె కుటుంబ శత్రువు మీదికి మళ్ళింది స్టోరీ పాయింటు- అదే వేరే విషయం. కానీ కాటమ రాయుడులో ఇంటర్వెల్ లో హీరోయిన్ ఛాలెంజింగ్ గా మాటాడి పాయింటు ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఆమెతో దీనిమీదే కథ వుండదు. సింపుల్ గా ఆమె కథలోంచి అదృశ్య మైపోతుంది. ఆమె కుటుంబ శత్రువుని కాటమ రాయుడు అంతం చేశాక వచ్చేసి ప్రేమకి ఓకే అనేస్తుంది.
కథని ‘జెనిటికల్’ గా రీబూట్ చేయకుండా ఈ పైపైన ఉపరితల మార్పులు చేసి సాధించిందేమిటి? తమిళంలో ఉన్నది ఉన్నట్టు తీసినా ఉట్టి కొట్టేవాడేమో కాటమ రాయుడు- ఇవ్వాళ ఉగాది పచ్చడి కూడా ఎంజాయ్ చేస్తూ!