రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఆగస్టు 2014, శనివారం

రివ్యూ..
కాన్సెప్ట్ మరచిన కథనం!


రచన- దర్శకత్వం: నీలకంఠ
తారాగణం : హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, సుష్మా రాజ్, ఝాన్సీ, నాగబాబు, వేణు తదితరులు.
సంగీతం : శేఖర్ చంద్ర,   ఛాయాగ్రహణం : బాల్ రెడ్డి,  కూర్పు : నవీన్ నూలి
బ్యానర్ : షిర్డీ సాయి కంబైన్స్ , నిర్మాతలు: ఎంవికె రెడ్డి,  మధుర శ్రీధర్ రెడ్డి
విడుదల : 1 ఆగస్టు 2014,      సెన్సార్: ‘A’
***
దర్శకుడు నీలకంఠ  తీసే సినిమాల కథలు వేరైనా  వాటి మూలం ఒకటే  - మానసికం. ఆటవిడుపుగా గత సినిమా ’చెమ్మక్ చల్లో’ అనే కమర్షియల్, అంతకి ముందు “విరోధి’ అనే నక్సల్ సినిమాలు తప్పించి, ప్రస్తుత సినిమావరకూ తీసినవన్నీ మనో వైజ్ఞానిక సంబంధ  డ్రామాలే. వీటిలో తొలి రెండు సినిమాలు- షో, మిస్సమ్మ-మినహా  మిగిలినవన్నీ ప్రేక్షకుల నాడికి అందకుండా పోయినవే. సైకాలజీతోనే ఇలా వుంటే, ఇప్పుడు  ‘మాయ’ అనే తాజా  ప్రయత్నంతో ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా పారాసైకాలజీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐతే ఈ తరహా  కథాంశాల్ని సెల్యూలాయిడ్ మీద పండించడంలో తన తొలి రోజులనాటి సృజనాత్మకత సన్నగిల్లిందని గమనించడం లేదు. ఆర్టు సినిమాలు అంతరించి, అవి కమర్షియల్ అంశాల్ని మిళితం చేసుకుని, సామాన్య ప్రేక్షకుల్నీ అలరించే క్రాసోవర్ సినిమాలుగా పరిణామం చెంది దశాబ్ద కాలం దాటిపోయినా, ఇంకా నీలకంఠ ఆర్ట్ సినిమాల కాలంలోనే ఆగిపోయినట్టు కన్పిస్తారు.

ఆర్టు సినిమాలు పరాజితుల పాసివ్  కథలు చెప్తాయి. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఆర్ధిక స్వాతంత్ర్యానికి కొత్త  ద్వారాలు తెర్చుకుని, ప్రజల జీవితాల్లో పెనుమార్పులు సంభవించడంతో ఏడ్పు కథల ఆర్టు సినిమాలకి కాలం చెల్లి- శ్యాం బెనెగల్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ తో వినోదాత్మక హాస్యకథలు తీయడం, గోవింద్ నిహలానీ అదే బాలీవుడ్ బిగ్ స్టార్స్ మీద ఆధార పడి యాక్షన్ సినిమాలు తీయడమూ చేసి క్రాసోవర్ సినిమా అనే సరికొత్త ఒరవడిని కొత్త దర్శకులకి అందించి వదిలారు. హైదరాబాద్ బ్లూస్, పర్జానియా, ఇంగ్లిష్ వింగ్లిష్ , కహానీ మొదలైన తరహా మేకింగ్ లో వచ్చినవీ, వస్తున్నవీ క్రాసోవర్ సినిమాలే.

తెలుగులో గగనం, వినాయకుడు, చందమామ కథలు, దృశ్యం లాంటి వెన్నో క్రాసోవర్ సినిమాలున్నాయి. ట్రెండ్ లో వున్న వీటికీ నీలకంఠ తీసే సినిమాలకీ తేడా ఏమిటంటే, 2002 లో  ‘షో’ దగ్గర్నుంచీ ఆయన  ఆర్టు తరహా సినిమాల దగ్గరే  ఆగిపోయి వున్నారు. ఇప్పుడు  మాయ’ సూపర్ నేచురల్ (అతీంద్రియ శక్తుల) థ్రిల్లర్ అని చెప్పుకున్నారు.  ఈ థ్రిల్లర్ కథేమిటో  ఓసారి చూద్దాం!

జరగబోయేది ముందే తెలిస్తే...
మేఘన (అవంతికా మిశ్రా) కి  ఐదేళ్ళ వయసులో జరగబోయేది ముందే కనబడే అతీంద్రియ దృష్టి వున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక ప్రమాదంలో తన  తల్లి చనిపోనుందని దృశ్యాలు ముందే కనపడినా అర్ధంకాక ఆమెని  పోగొట్టుకుంటుంది. పెద్దయ్యాక ఆ బాధే వెన్నాడుతుంటుంది. ఇప్పుడీమె టీవీ జర్నలిస్టు. ఈమెకి సిటీలో ఈవెంట్ కోసం వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ్ వర్మ ( హర్షవర్ధన్ రాణే)తో వృత్తిపరమైన బాధ్యత అప్పజెప్పడంతో, అతన్తో క్రమంగా ప్రేమలో పడుతుంది. ఇంతలో ఈమె చిన్ననాటి స్నేహితురాలు పూజ (సుష్మా రాజ్) వచ్చేసి,  సిద్ధార్థ్ తనక్కాబోయే భర్త అనడంతో మేఘన ఇరుకున పడుతుంది.

ఇలా వుండగా మేఘనకి ఒక నగల షాపు దగ్గర హత్య జరగబోతున్నట్టు దృశ్యాలు కనబడతాయి. కాకతాళీయంగా ఆ సంఘటనలో హంతకుణ్ణి పట్టిస్తుంది. అలాగే సిద్ధార్థ్ కి సంబంధించి కూడా గతం లో జరిగింది ఆమెకి తెలుస్తుంది. ఆ గతంలో అతను ముందు ప్రేమించిన వైశాలి (నందినీ రాయ్) అనే అమ్మాయి అనుమానాస్పద మరణంలో అతడి హస్తమున్నట్టు తెలుస్తుంది.  అంతేగాక ఇక ముందు కూడా తను పెళ్లి చేసుకోబోతున్న పూజని కూడా చంపబోతున్నట్టు మేఘనకి భవిష్యద్దర్శనం అవుతుంది. ఇప్పుడు  మేఘన ఏం చేసిందనేది మిగతా కథ.

ముగ్గురమ్మాయిలతో ఈ చతుర్భుజ ప్రేమాయణంలో పాత్రధారుల నటనలు చాలా నిరాశ పరుస్తాయి. మేఘన పాత్రలో హీరోయిన్ అవంతికా మిశ్రా చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకి. ముఖంలో ఎక్స్ ప్రెషన్స్  వుండవు. పైగా చేస్తున్న టీవీ జర్నలిస్టు వృత్తికి తగ్గ వేషభాషలు లేక, ఎప్పుడూ నిండు చీరలో నుదుట పెద్ద బొట్టుతో, వయసుకి మించిన హుందాతనంతో  చాదస్తంగా కన్పిస్తుంది. యువ ప్రేక్షకులకి హీరోయిన్ అక్కయ్య లా కన్పడ్డంకన్నా బాక్సాఫీసు వ్యతిరేక చర్య వుంటుందా?


మెయిన్ హీరోయిన్ని ఇలా చూపించాం కాబట్టి,  సెకండ్ హీరోయిన్ని ఫాస్ట్ గర్ల్ గా చూపించాలన్న ఫార్ములా కొలమానాలతో సుష్మా రాజ్ ని ప్రవేశ పెట్టారు. ఈమె అల్లరి ఆకతాయితనం కృత్రిమంగా, ఐదేళ్ళ మెంటల్ స్టేజిని ప్రదర్శిస్తూంటాయి.

డల్ ఫేసుతో హర్షవర్ధన్ రాణే సైతం హీరో లా అన్పించడు. ఇక మూడో హీరోయిన్ నదినీ రాయ్ సరేసరి. ఇలా తారాగణమంతా తెలుగువాళ్ళు కాని నటీ నటులైనప్పుడు తెలుగు సినిమా తీయడ మెందుకని ప్రశ్న వేధిస్తూంటుంది.

సాంకేతికంగా చూస్తే ఛాయాగ్రహణం డౌన్ ప్లే చేసిన లైటింగ్ తో విజువల్ అప్పీల్ కల్గించదు, అలాగే సంగీతమూ. దర్శకత్వం వెనకటి తరం ప్రేక్షకుల కాలం నాటి శైలిలో వుంది.

స్క్రీన్ ప్లే సంగతులు..
ఫ్రెంచి దర్శకుడు జీన్ లక్ గొడార్డ్ అంటాడు – ఒక సినిమా సృజనాత్మక విలువల్ని ఎక్కడ్నించీ సంగ్రహించామన్నది  కాదు ప్రశ్న, ఎక్కడికి తీసుకెళ్తున్నా మన్నదే సమస్య అని!

హాలీవుడ్ ‘ఫైనల్ డెస్టినేషన్’ సినిమా ‘మాయ’ కి స్ఫూర్తి అయితే కావొచ్చు , కానీ ఈ స్ఫూర్తిని, ఆ సృజనాత్మక విలువల్నీ  ఏ కాలపు ప్రేక్షకులకి అందిస్తున్నామన్న కాలీన స్పృహ లోపించడమే ఈ స్క్రీన్ ప్లే కి పెద్ద శాపం.

నేటి కాలపు థ్రిల్లర్ కుండాల్సిన డైనమిక్స్ కంటే ఆర్ట్ సినిమాలో వుండే బద్దకమే ఇందులో కన్పిస్తుంది. ఎత్తుకున్న అతీంద్రియ శక్తులకథకీ, విప్పిన హత్యా రహస్యానికీ ఏ సంబంధమూ లేకుండా ఉండడం కొట్టొచ్చినట్టుండే ఒక కాన్సేప్చ్యువల్ బ్లండర్ గా తెలిసిపోతుంది. జరగబోయేది ముందే తెలిసిపోయే ఈ.ఎస్.పి ( ఎక్స్ ట్రా సెన్సరీ పర్సెప్షన్) లేదా సిక్స్త్ సెన్స్ కొంచెం ఎక్కువుండే స్థితి అన్న బిల్డప్ తో ప్రచారం చేశారు. తీరా సినిమాలో తేలిందేమిటంటే, ఇంత ఇంటలెక్చువల్ కలరివ్వ నవసరం లేకుండానే, దీన్నో సాదా సీదా మర్డర్ మిస్టరీగా నడిపించెయ్యొచ్చని!

ఒక సినిమా కథని మూడు వాక్యాల్లో ఒక లైనుగా చెప్పుకుంటే ఆది మధ్యాంతాల  పరస్పర సంబంధంతో కన్పించాలి. ఈ సినిమా కథని మూడు వాక్యాల్లో పెట్టి చూస్తే  ఇలా వుంటుంది.... అతీంద్రియ దృష్టి వున్న మేఘన సిద్ధార్థ్ ని ప్రేమించింది, ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది, అప్పుడామె పూజతోనే ప్రాణాపాయంలో పడింది.

ఈ లైనులో ఆది (అతీంద్రియ దృష్టి వున్న మేఘన సిద్ధార్థ్ ని ప్రేమించింది) మధ్యమం (ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది) అంతం (అప్పుడామె పూజతోనే ప్రాణాపాయంలో పడింది..) పరస్పరాధార భూతంగా ఉన్నాయా?

ఆది మధ్యమాల్లో అతీంద్రియ దృష్టి అనే ఎత్తుకున్న కాన్సెప్ట్ కన్పించినా, అంతం లో దాన్ని విడిచి పెట్టేశారు.  అతీంద్రియ దృష్టి వున్న మేఘనకి పూజతో తనే ప్రమాదంలో పడుతుందని ఎందుకు తెలీదు?

ఇలా ఎత్తుకున్న కాన్సెప్ట్  పరంగా కథకి ముగింపు నివ్వలేదు. కాన్సెప్ట్ విలువకి ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదు. ఒక మర్డర్ మిస్టరీ తేల్చే సాధారణ బిజినెస్సే జరిగి అంతం లో కాన్సెప్ట్ ఎగిరి పోయింది. ఇలా ఇంటర్వెల్ తర్వాత నుంచీ ఈ కాన్సెప్ట్ కనుమరుగై పోయి, ఈ మాత్రం దానికి ఈ  కాన్సెప్ట్ తో ఇంత హడావిడి అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

అతీంద్రియ దృష్టి వున్న జర్నలిస్టు మేఘన సిద్ధార్థ్  ని ప్రేమించింది (ఆది), ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది (మధ్యమం), అప్పుడామె పూజనే హంతకురాలిగా చేసి సిద్ధార్థ్ నే కాపాడుకునే స్వార్ధపరురాలిగా ప్రశ్నార్ధకంగా తయారయ్యింది (అంతం)!


ఇలా వుంటే మేఘన  పాత్ర ఎంత ఇంటరెస్టింగ్ గా తయారయ్యేది (యాంటీ హీరోయిన్ గా రోల్ రివర్సల్)? దీంతో కథ ఎంత క్రేజీగా, డైనమిక్ గా  తయారయ్యేది? ఆమె ఎందుకలా తయారవుతుందంటే , అసలు జరిగిందేమిటో తనకి ముందే తెల్సు. లేకపోతే అలాటి అతీత శక్తి వుండీ అర్ధం లేదు. దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపించిందాని ప్రకారం, మొదటి గర్ల్ ఫ్రెండ్ వైశాలి మరణం లో  సిద్ధార్థ్ అనుమానితుడు. ఇది మేఘన కూడా తన అతీత శక్తితో చూసింది. ఇక్కడే కిటుకు వుంది. ఎలాగంటే, దర్శకుడు చిట్టచివర్లో  మిస్టరీ విప్పడం కోసం,  అసలా వైశాలి మరణంలో అసూయతో రగిలిపోయిన రెండో గర్ల్ ఫ్రెండ్ పూజ పాల్పడిన చర్యని  ప్రేక్షకుల నుంచి దాచి పెట్టాడు. ప్రేక్షకులనుంచి దాచి పెట్టడం క్లైమాక్స్ కోసం చాలా అవసరమే. కానీ అదే సమయంలో అతీత శక్తి వున్న  మేఘన నుంచి ఎలా దాచి పెట్టగలడు? ఆమె గతంలో జరిగిన ఆ హత్యా దృశ్యాన్ని  చూసివుంటే, అందులో పూజ పాత్రసహా మొత్తం చూసి వుండాలి కదా. లాజిక్ ని  పట్టించుకోకుండా క్రైం కథని ఊహించడం సాధ్యమవుతుందా?  దాన్ని ఆస్వాదించడం అంతకన్నా వీలవుతుందా?


కాబట్టి ఇప్పుడు మేఘనకి తన మనోనేత్రం  ద్వారా హంతకుడు సిద్ధార్థ్ కాదనీ, పూజాయే హంతకురాలనీ ముందే తెలుసనుకుందాం, అప్పుడు  ఈ ఎరుకతోనే ఆమె ఆలా ప్రవర్తించడం మొదలెట్టిందన్న మాట : పూజాని హంతకురాలిగా నిరూపించి, తను ప్రేమిస్తున్న సిద్ధార్థ్ ని దక్కించుకోవడం కోసం ! రివర్స్అయిన  క్యారక్టర్!

ఈ ముగింపులో తనే మర్డర్ మిస్టరీని రివీల్ చేసి, తన అతీత శక్తిని హైలైట్ చేసుకుని, మారిపోయిన తన ప్రవర్తనని జస్టిఫై చేసుకుంటుందన్న మాట!

అంతేగానీ, సినిమాలో మనకి చూపించినట్టుగా పూజాయే తను చేసిన హత్యని వెల్లడించడం కాదు. అలా చేయడంవల్ల మేఘనతో బాటు, హీరో కూడా చేతకాని వాళ్ళయ్యారు. ఈ కథలో ప్రధాన పాత్ర మేఘనయే. అలాంటప్పుడు ఏదైనా ఆమె విజయంగానే వుండాలి. చాలా పూర్వం హిందీలో తీసిన ‘ధువాఁ ’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో చిట్టచివర్లో రాజమాత పాత్ర (రాఖీ) తనే హత్య చేసినట్టు ఒప్పుకుంటుంది- తానుగా వెల్లడించదు -ఆమె తన నోటితో తానే వెల్లడించేలా పరిస్థితులు కల్పిస్తూ వస్తాడు సీబీసి పాత్రధారి అమ్జద్ ఖాన్. ఈ సినిమా అంతా ఎందుకు జరుగుతోందో చెప్పకుండా రకరకాల పాత్రలతో రాజమాత నోట నిజం కక్కించడానికి చేసే పరిస్థితుల కల్పనగానే సాగుతుంది కథనం!

* సిటీ కొచ్చి భాయ్ పేరుతో దందా చేసుకుంటున్న శీను విషయం భాయ్ కి తెలిసిపోతుంది (ఆది), అతన్ని మామతో సహా చంపెయ్యమని ఆర్డరేసి హీరోయన్ని తీసుకుని వేరే పెళ్లి చేయడానికి షార్జా పారిపోతాడు భాయ్ (మధ్యమం), అప్పుడు శీను షార్జా వెళ్లి  భాయ్ కుట్రలన్నిటినీ బయటపెట్టి హీరోయిన్ని సొంతం చేసుకుంటాడు (అంతం)- ఇదీ మూడు వాక్యాల్లో ఆదిమధ్యాంతాల  ‘అల్లుడు శీను’ పరస్పరాధార భూత స్టోరీ లైను.

* భార్యా పిల్లలతో హాయిగా గడిచిపోతుంటుంది హీరో జీవితం, అప్పుడొక యూత్ కూతురి అభ్యంతరకర ఫోటో తీసి తల్లీ కూతుళ్ళ చేతుల్లో హతమై పోతాడు, ఇప్పుడీ కుటుంబాన్ని చట్టం బారి నుంచి కాపాడ్డానికి తెలివైన ప్లానేస్తాడు హీరో - ఇదీ ‘దృశ్యం’ లైను.

* పంజాబీ హీరో-  తమిళ హీరోయిన్ ప్రేమించుకుంటారు, పెళ్లి దగ్గర కొచ్చేసరికి కుటుంబాలు అడ్డు అవుతాయి, తమ కుటుంబాలు ఒప్పుకుంటే తప్ప పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు హీరోహీరోయిన్లు- ‘2-స్టేట్స్’ హిందీ లైను.

* ఒక వైరస్ వ్యాపించి మానవజాతి సమస్తం తుడిచి పెట్టుకుపోతుంది, తట్టుకున్న వానరాలు వాటి నాయకుడి సంరక్షణలో ప్రశాంతంగా జీవిస్తూంటాయి, అప్పుడింకా బతికే వున్న  కొందరు మనుషులు వాటి భూభాగంలోకి చొచ్చుకు రావడంతో తీవ్ర పోరాటం మొదలవుతుంది....ఇది ‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ లైను.

* ఆ భార్యాభర్త లిద్దరూ గీత రచయితలుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటారు, భర్తకి ఒక పెద్ద అవకాశం వస్తుంది, దీంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమా కళాతృష్ణా సంఘర్షణలో పడతాయి- ‘బిగిన్ ఎగైన్’ స్టోరీ లైను.  

ఒక స్టోరీ లైను అనుకుంటున్నప్పుడు అందులో ఆది మధ్యాంతాల సమన్వయాన్ని బట్టే కథ వస్తుంది. ఆ ఆది మధ్యాంతాల్లోనే స్క్రీన్ ప్లే మూడంకాలుంటాయి. ఆది (ఫస్ట్ యాక్ట్)- మధ్యమం (సెకండ్ యాక్ట్)-అంతం (థర్డ్ యాక్ట్). ఇలా కథకి లైను అనుకున్నప్పుడే  త్రీ యాక్ట్స్ ధర్మానికి సెట్టయ్యేలా – ఆ త్రీ యాక్ట్స్ లోనూ కాన్సెప్ట్ రన్ అయ్యేలా చూసుకుంటే, కథకి ఓ దారీ తెన్నూ ఏర్పడుతుంది.

రాముడు వనవాసం వెళ్ళాడు-రావణుడు సీతని అపహరించాడు-రాముడు రావణ సంహారం చేసి సీతని రక్షించుకున్నాడు...ఇలా పురాణాల్లో చూసినా ఈ నిర్మాణమే వుంటుంది. త్రీ యాక్ట్స్ నిర్మాణం గురించి రెండువేల ఏళ్ళ క్రితం నాటకాల్ని దృష్టిలో పెట్టుకుని అరిస్టాటిల్ చెబితే చెప్పి ఉండొచ్చు గానీ, అంతకి ముందు నుంచే ప్రపంచ పురాణా లన్నిట్లోనూ ఒక లైను గా చెప్పుకుంటే వుంది. ఎందుకు వుందంటే మనిషి మెదడు కథని రిసీవ్ చేసుకునే పధ్ధతి అదే కాబట్టి! పురాణాలన్నీ, ఆ మాటకొస్తే ఇప్పటిదాకా వచ్చిన నాణ్యమైన కాల్పనిక కథలన్నీ చేసేది సైకో థెరఫీనే!

ఇందుకు భిన్నంగా ‘మాయ’ అనే పారాసైకలజీ స్టోరీ లైను లోనే ఆదిమధ్యాంతాల సమన్వయం లోపించడంతో, సైకో థెరఫీ చేసే మాటలా వుంచి, కనీస స్థాయి థ్రిల్లర్ గానూ రాణించలేక పోయింది.

***
ఈ సినిమా ఫస్టాఫ్ విషయమేమీ లేక బోరు కొట్టిందని వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కారణం, ఇంటర్వెల్లోపు ప్రవేశ పెట్టిన పూజా పాత్రతో ప్లే ని నిర్లక్ష్యం చేయడమే. సినిమా ప్రారంభమైన అరగంటలోపు నా కాబోయే భర్తంటూ పూజ రావడం దగ్గర, హమ్మయ్య ఫస్ట్ యాక్ట్ సకాలం లోనే ముగిసి సెకండ్ యాక్ట్ తో అసలు కథ ప్రారంభ మైనదని సంబరపడతాం. పూజ వల్ల ఈ కథ ఏ మలుపు తీసుకుంటుందో నని ఎదురు చూస్తాం. పూజ బ్యాక్ గ్రౌండ్ ముందుగా మనకి తెలీక పోయినా దర్శకుడికి తెలుసు- అప్పటికే ఆమె తనకాబోయే భర్త గర్ల్ ఫ్రెండ్ వైశాలిని చంపిన హంతకురాలని. అప్పుడేం చేయాలి? ఈ తురుపు ముక్కని చేతిలో పెట్టుకున్న దర్శకుడు, ఇక్కడ మరో కొత్త గర్ల్ ఫ్రెండ్ రూపంలోవున్న హీరోయిన్ తో, పూజ పాత్రకి వున్న  ధ్యేయం కొద్దీ ప్లే ప్రారంభించాలి. అంతేగానీ, సెకండ్ యాక్ట్ తో అసలు కథలోకి ప్రవేశించాక ఇంకా ఫస్ట్ యాక్ట్ బిజినెస్సే నడపడం కాదు. ఐతే ఏమిటా ప్లే? ఈ హీరోయిన్ని కూడా లేపేసే ప్రయత్నాలే! ఎట్టి పరిస్థితిలో హీరో తనకే దక్కాలన్న ధ్యేయం పూజది, ఈ ధ్యేయంతోనే కదా ఒక హత్య చేసొచ్చింది. అంటే ఈమెది ఫాటల్ ఎట్రాక్షన్ సిండ్రోం తాలూకు మానసిక స్థితి. ఇలా పాత్ర మానసిక స్థితీ, దాని ధ్యేయమూ మర్చిపోతే కథేలా నడుస్తుంది? ఇదన్నమాట ఫస్టాఫ్ బోరుకి దారితీసిన కారణం.

దర్శకుడు ఈ కథకి ప్రధాన మలుపు ఇంటర్వెల్ దగ్గర వచ్చే పాయింటుగా (హీరోయిన్ తన మనోనేత్రంతో హీరోని హంతకుడుగా చూడ్డంగా ) పొరబడి దాన్ని పట్టుకుని సాగిపోయాడు. కానీ అది ప్రధాన మలుపు కాదు. కథకి ప్రధాన మలుపు అంతకి ముందు పూజా వంటి కీలక పాత్ర ఎంట్రీ దగ్గరే వచ్చింది! ఇంటర్వెల్ దగ్గర వచ్చేది ఈ  ప్రధాన మలుపు దారితీయించిన సంఘర్షణలో భాగంగా హీరోయిన్ కి ఎదురయ్యే ఒక అడ్డంకి మాత్రమే!

కథకి ప్రధాన పాత్ర ఎవరో, అది ఎదుర్కొనే ప్రధాన సమస్యే మిటో గుర్తించి  ఆ ప్రకారంగా కథకి సెటప్ (అంటే ఫస్ట్ యాక్ట్ చివర్లో వచ్చే ప్రధాన మలుపు వరకూ కథనం) ఏర్పాటు బలంగా చేసుకోకపోతే, థర్డ్ యాక్ట్ (క్లైమాక్స్)లో ఆ ప్రధాన పాత్రకి ఒక లక్ష్యమంటూ లేక,  ఈ సినిమాలో లాగే ప్రమాదంలో ఇరుక్కుని ఇంకెవరో వచ్చి రక్షించాలని పెడబొబ్బలు పెడుతుంది!
***


డైనమిక్స్ విషయానికొస్తే, ‘ఫైనల్ డెస్టినేషన్’ లో  ఏం జరుగుతుందంటే, హీరోకి ముందు జరగబోయే దుర్ఘటనలు మనో ఫలకం మీద కన్పిస్తూంటాయి. తనకున్న ఈ ప్రత్యేక శక్తిని స్వీయానుభవంతోనే గుర్తిస్తాడు. ఓసారి విమానమెక్కితే అది పేలిపోబోతోందని విజన్ పడుతుంది. దాంతో ఎలర్ట్ అయి, గోలగోల చేసి బయల్దేరబోతున్న విమానంలోంచి దూకేస్తాడు. అతడితో బాటూ మరికొందరు దూకేస్తారు. ఎగిరి వెళ్ళిన విమానం పేలిపోతుంది.

బతికామనుకుని తేలికబడ్డ వాళ్ళు ఒకక్కరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోతూంటారు. విమానం పే లిపోయినప్పుడే ఎఫ్ బి ఐ కి హీరో మీద అనుమానం వేస్తుంది. ఇతడి మానసిక శక్తుల్ని నమ్మలేక పేలుడులో ఇతడి కుట్ర ఉందేమోనని అరా తీస్తూంటారు. దీనికి తోడూ ఒకొక్కరే చనిపోతూ ఉండడంతో ఈ హత్యలు కూడా తన కుట్రని దాచడానికి హీరోయే చేస్తున్నాడని అనుమానాలు పెరిగిపోయి అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు.

ఇంతకీ ఈ మరణాలు ఎలా జరుగుతున్నాయంటే, మృత్యువు పగబట్టింది. మృత్యువు ఆయువు తీరిన కొంతమందిని ఒకే విమనంలో పోగేసి బలి తీసుకుందామనుకుంటే, ఆ మృత్యువు పెట్టిన ముహూర్తాన్ని హీరో తన ‘విజన్’ తో దెబ్బకొట్టి మరికొందరితో చావు తప్పించుకున్నాడు. ఇది ఓర్చుకోలేని మృత్యువు చావాల్సిన వాళ్ళు చావాల్సిందే అని వెంటబడి ప్రమాదాలు సృష్టిస్తోంది. హీరోకి మృత్యువు విలన్. ఇదన్నమాట సంగతి!

హీరో తన మానసిక శక్తితో మృత్యువు తప్పించుకోవడం, ఆ మృత్యువు వెన్నాడ్డం, మరోవైపు ఎఫ్ బీఐ ఏజెంట్లు వేధించడం-అనే డైనమిక్స్ తో ఈకథకి జీవంవచ్చింది. హీరోకి ద్విముఖ పోరాటం. ఉత్తమస్క్రీన్ ప్లే లక్షణంగా- మృత్యువుతో అంతర్గత మానసిక పోరాటం, ఎఫ్ బీ ఐ తో బహిర్గత భౌతిక పోరాటం. పైగా ప్రేక్షకులు ఆత్మికంగా కనెక్టయ్యే ఎంతో సైకోథెరఫీ, మరెంతో ఫిలాసఫీ!

‘మాయ’ లో హీరోయిన్ కి మానసిక శక్తి ఉందిగానీ, దానికి కథని దౌడు తీయంచే వ్యతిరేక శక్తులు లేవు. విలన్లు లేరు, అపాయాలూ లేవు-చివర్లో పూజా రహస్యం బయట పెడితే గానీ తను ఇరుక్కునే ప్రమాదం తప్ప!

పాత్రోచితానుచితాలు..
కథే  పాత్రని నడిపిస్తే అది డబ్బులు రాని ఆర్ట్ సినిమా అవుతుంది, పాత్రే కథని నడిపిస్తే డబ్బులొచ్చే కమర్షియల్ సినిమా అవుతుంది. మొదటిది బోరు కొట్టే పాసివ్ క్యారెక్టర్, రెండోది హుషారు తెప్పించే యాక్టివ్ క్యారెక్టర్. ప్రధాన పాత్రకి సంబంధించి  పట్టుకోవాల్సిన గుట్టు ఏమిటంటే, అది మనలో వుండే ఇగోకి తెరమీద కన్పించే ప్రతినిధి. మరి మన ఇగో ఎలా వుంటుంది?  చచ్చిన పాములా పాసివ్ గా వుండదు. మొండికేసి వుంటుంది. ఎవరి మాటా వినదు. గెలుపే కోరుకుంటుంది, ఓటమిని అంగీకరించదు. ఎప్పుడూ యాక్షన్ లో యాక్టివ్ గా వుంటుంది. ఐతే ఇగో మనిషికి మేలు చేయదు. దాంతో ఎన్నో  సమస్యలు, యుద్ధాలు. మరిదాన్నేం చేయాలి. వద్దంటే వదిలిపోదు, చంపుకుంటే చచ్చేది కూడా కాదు మన ఇగో. మరేం చేయాలి? అందుకే తెరమీద ఆ ఇగో (హీరో) ప్రయాణాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా రచన సాగిస్తారు తెలివైన రచయితలు, దర్శకులు. సరయిన కథల్లో ఈ కృషే జరుగుతుంది. సరయిన ఏ కథైనా ఇంతే- ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే తంతే!  బాక్సాఫీసు మంత్రం. ప్రేక్షకులకి తెలీకుండా వాళ్ళకి చేసే సైకో థెరఫీ! పైగా శాస్త్రాల ప్రకారం మనముంటున్న ఈ కలియుగం మన నుంచి యాక్షన్ నే  డిమాండ్ చేస్తోంది...

‘ మాయ’ ప్రధాన పాత్ర ఐన హీరోయిన్ సహా, మిగిలిన మూడు పాత్రలూ కథ నడిపిస్తే నడిచే పాసివ్ పాత్రలే. ఎక్కడా ప్రేక్షకుడనే వాడు తనలోని  ఇగోతో ఈ క్యారక్టర్లతో కనెక్ట్ కాలేని అసంతృప్త స్థితి!

హీరోయిన్ కి  జరగబోయేది ముందే  తెలిస్తే  ఎప్పుడూ ఒకే ఎక్స్ ప్రెషన్ తో శూన్యంలోకి చూస్తుందే  తప్ప, ఎలర్ట్ అయి నివారణా చర్యలు చేపట్టదు. ఒక జర్నలిస్టుగా ఆమెలో జర్నలిస్టు సహజాతం ఏమాత్రం వుండదు. నగల షాపు దగ్గర హత్య జరుగుతుందని తెలిసినా వూరుకుంటుంది. ఎప్పుడో ఎందుకో అటు వెళ్లి నప్పుడు చావబోయే సెక్యురిటీ గార్డు కనబడితే  గుర్తుపట్టి వెన్నాడుతుంది. ఇలా కథ నడిపితే కాకతాళీయంగా తను ఇన్వాల్వ్ అవ్వాలే తప్ప, తనే కథని చేతిలోకి తీసుకుని క్రియాశీలంగా వుండాలనుకోని పాత్ర చిత్రణతో వచ్చిన ఇబ్బంది ఇది.

ఇక హీరో నిమిత్త మాత్రుడిగా ఉండిపోతాడు. ఫ్యాషన్ డిజైనర్ గా కుర్తా జీన్స్ వేసుకుని సాత్వికుడి లుక్ తో డల్ గా ఉంటాడు. తను నిర్వహించబోయే ఫ్యాషన్ ఈవెంట్ కూడా చేనేత వస్త్రాల గురించి పెట్టుకుని యూత్ అప్పీల్ ని కాలరాస్తాడు. సినిమా ప్రారంభం లోనే ఫ్యాషన్ ఈవెంట్ కి నెలరోజులు టైం వుందని చెప్పి, దాన్ని  క్లైమాక్స్ లో ఘటనల వరకూ సాగలాగారు. అప్పటికి ఆ  ఫ్యాషన్ ఈవెంట్ అనే ఎలిమెంట్  కి కథనంలో కాలదోషం పట్టేసింది. ఇలా సినిమా మొత్తాన్ని ఆప్షన్ లాక్ తో కాకుండా టైం లాక్ తో నడపడం మరో మైనస్ పాయింట్ అయ్యింది. టైం లాక్ స్టోరీలకి తెలుగులో విజయాలు లేవు.
***
ఈ సినిమా చూస్తూ ఆటోమేటిగ్గా ‘కోకిల’ ని గుర్తు తెచ్చుకుంటాం. 1989 లో నరేష్- శోభన లతో గీతాకృష్ణ దర్శకత్వంలో ఇళయరాజా మ్యూజికల్ హిట్  ‘కోకిల’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ ని మళ్ళీ చూస్తే, ఆ డైనమిక్స్ కి గీతాకృష్ణ అనే క్రేజీ డైరెక్టర్ని మెచ్చుకోకుండా ఉండలేం.

నరేష్ కి ఒక ప్రమాదంలో కళ్ళు పోతాయి. ఆ రోజే హత్యకి గురయిన ఒకస్వామిజీ కళ్ళు నరేష్ కి అమరుస్తారు. నరేష్ కళ్ళు తెరిస్తే అతడికి కన్పించేవి స్వామీజీని హత్యచేస్తున్న వాళ్ళ దృశ్యాలే. ఒక అంతర్జాతీయ సైన్స్ పత్రికలో వచ్చిన అంశం ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నట్టు దర్శకుడు చెప్పినా, దీనికి శాస్త్రీయత లేదని తర్వాత రుజువైనా, సైన్స్ ఫిక్షన్ కి అదంతా అనవసరం. అలా అనుకుంటే ‘అవతార్’ తీయడం అసాధ్యం.

లాజిక్ అడ్డుపడని సృజనాత్మక స్వేచ్ఛ ఇది. స్వామీజీ కళ్ళు పెట్టుకున్న హీరోకి  ఆ  స్వామీజీ హంతకులే కనపడ్డం, ఇది తెలుసుకున్న పోలీసులు హీరో ద్వారా హంతకుల్ని పట్టుకోవాలను కోవడం, డాక్టర్లు వారించడం, హంతకులు హీరోని చంపాలని ప్రయత్నించడం, ప్రకృతి చికిత్సతో హీరోకి నయమైతే, హంతకుల్ని పట్టుకోవడానికి అతడ్ని గుడ్డి వాడుగానే నటించమని పోలీసులు కోరడం, అలా చివరికి హంతకులు దొరికిపోవడం...ఇవీ ఆసాంతం థ్రిల్లింగ్ గా సాగే డైనమిక్స్ కి ఉపయోగపడిన మలుపులు. మలుపు లన్నిట్లోనూ కాన్సెప్ట్ ప్రవహించింది. హీరోకి చివరంటా సంఘర్షణే. ప్రారంభంలో శోభన తో ప్రేమ దృశ్యాలు కూడా పంచ్ తో చకచకా సాగిపోతాయి.

కళ్ళతో లాజిక్ లేని సైన్స్ ఫిక్షన్ తోనే ఇంత మాయ చేస్తే, అన్ని శాస్త్రీయతలూ వున్న జరగబోయేది చూడగలిగే కళ్ళతో ఇంకెంత మాయ చేసివుండాలి! ఇతర భాషల్లో దీన్ని రీమేక్ చేస్తున్నట్టున్నారు. బాలీ వుడ్ లో మహేష్ భట్ నీ కలిశారు. రీమేకులూ తెలుగు ‘మాయ’లాగే ఉంటాయా!

-సికిందర్