రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, జులై 2014, శుక్రవారం

రివ్యూ..
మాస్ మసాలా శీను!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : వి.వి.వినాయక్
తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, సమంతా, తమన్నా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, తనికెళ్ళ భరణి, రవిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్    ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు  కూర్పు: గౌతమ్ రాజు
రచన: గోపీమోహన్   మాటలు : కోన వెంకట్
బ్యానర్ : శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్       నిర్మాతలు  : బెల్లకొండ సురేష్, బెల్లంకొండ గణేష్
విడుదల : 25 జులై 2014     సెన్సార్ : ‘A’
**
మరో కొత్త యువ వారసుడు రంగప్రవేశం చేశాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ వెండితెర ఎంట్రీ కోట్లరూపాయల భారీ బడ్జెట్ ని వెదజల్లుతూ అట్టహాసంగా జరిగింది. బడాబడా సాంకేతికుల సపోర్టుతో బ్రహ్మాండమైన కమర్షియల్ పండుగని  ప్రేక్షకులకి నజరానాగా సమర్పించడానికి తీవ్ర కసరత్తు చేశారు.  భారీఎత్తున పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సృష్టించిన ఈ మాస్ కమర్షియల్ ని పక్కాగా అందించడానికి ముందువరసలో నడుంకట్టి నిలుచున్నారు టాప్ దర్శకుడు వి.వి. వినాయక్. ఆయనకి తోడుగా క్యాచీ కెమెరా వర్క్ తో ఛోటా కె.నాయుడు, హిట్ ట్యూన్స్ తో దేవీశ్రీ ప్రసాద్ నిలిచారు. ఇంకా ప్రముఖ కోరియోగ్రాఫర్లూ, యాక్షన్ డైరక్టర్లూ, ఇతర పేరున్న టెక్నీషియన్లూ అందరూ తోడై పోటాపోటీగా పనిచేశారు. మరైతే ఇన్నిహంగులూ వరించడానికి యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగా అర్హుడైన టాలెంటేనా?


ఈ యువ హీరోని పరిచయం చేయడానికి రొటీన్ కథనే ఎన్నుకున్నారు. ఎమోషనల్ సీన్లకి తావులేకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీనివాస్ కి అమెరికాలో శిక్షణ ఇప్పించి ముందు మంచి డాన్సర్ గా, ఫైటర్ గా ఎష్టాబ్లిష్ చేయడానికే  పూనుకున్నారు. నటనమీద అప్పుడే వొత్తిడి అనవసరమన్పించి,  హావభావాల ప్రద ర్శనకంటే, కామెడీతో అలా అలా నడిపించెయ్యడమే బెటరని నిర్ణయించుకున్నట్టుంది. 

కథేంటి?
రొటీన్ కథ అని ముందే చెప్పుకున్నాం. ఒకానొక వూళ్ళో మామ నరసింహా (ప్రకాష్ రాజ్ ) తో కలిసి బాగా అప్పులు చేసి తీర్చలేక అతన్తో పారిపోయి రైలెక్కేస్తాడు శీను (బెల్లంకొండ శ్రీనివాస్). చెన్నై వెళ్తున్నామనుకుని హైదరాబాద్ లో దిగుతారు. ఆటోవాలా (వెన్నెల కిషోర్) ఈ అమాయకుల్ని ఇదే చెన్నై అని నమ్మిస్తూ నాయుడు (రఘుబాబు) అనే హోటల్ యజమానికి అప్పగిస్తాడు. నాయుడు తన గ్యాంగ్ తో కలిసి వీళ్ళని దోచేద్దా మానుకుంటే ఏమీ వుండదు. ఇలా వుండగా ట్రాఫిక్ లో శీను అంజలి (సమంతా) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె భాయ్ (ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం) అనే ఒక గ్యాంగ్ లీడర్ కూతురు. ఇంకోరోజు సాక్షాత్తూ భాయ్ ని చూసి అతను అచ్చం తన మామ నరసింహా లాగే ఉండడంతో, ఓ ప్లానేస్తాడు. మామని భాయ్ లాగా  తిప్పుతూ భాయ్ చేయాల్సిన బిజినెస్ ని కొట్టేస్తూంటాడు. మరో వైపు షార్జాలో వుండే భాయ్ పార్టనర్ (ప్రదీప్ రావత్) కొడుకు రోహిత్ తో అంజలికి పెళ్లి కుదుర్తుంది. త్వరలో రోహిత్ ఇక్కడికి రాబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శీను తనే రోహిత్ అని నమ్మిస్తూ అంజలికి దగ్గరవుతాడు.

ఇలా వుంటే, మామ నరసింహం తో కలిసి శీను ఆడుతున్న నాటకం భాయ్ కి తెలిసి పోతుంది. ఏనాడో చనిపోయాడ నుకున్న నరసింహం బతికే వుండడం భాయ్ ని కంగారు పెడుతుంది. వెంటనే నరసింహం –శీను లిద్దర్నీ చంపెయ్యమని ఆర్డరేసి కూతురి పెళ్లి చేయడానికి ఆమెని తీసుకుని షార్జా వెళ్లి పోతాడు భాయ్.
ఇప్పుడు శీను ఈ హత్యా ప్రయత్నం నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు నరసింహం గతం ఏమిటో తెలుసుకుని షార్జా వెళ్లి భాయ్ పనిబట్టి, అంజలిని తన సొంతం ఎలా చేసుకున్నాడన్నది ఇక్కడ్నించీ సాగే సెకండాఫ్ కథ!
కామెంట్!
అనేక సార్లు చూసి వున్న రొటీన్ ఫార్ములా కథే. కాకపోతే నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండడంతో కళ్ళప్పగించి చూసేలా చేస్తుంది. మరీ బాగా పేలే పంచ్ డైలాగులు లేవుగానీ, ఉన్నంతలో కమేడియన్ల చేత సాఫ్ట్ కామెడీని పండించగలిగారు. భాయ్ అనుచరుడుగా బ్రహ్మానందం పోషించిన డింపుల్ పాత్ర రొటీన్ గా సెకండాఫ్ లో రాకుండా ఫస్టాఫ్ నుంచే వుంటుంది. ఒకేలా వున్న నరసింహం, భాయ్ లతో తికమక పెట్టే సన్నివేశాల్లో బ్రహ్మానందం హాస్యం కొన్ని చోట్ల బాగా పేలింది. షార్జా పార్టనర్ అనుచరుడి పాత్రలో రవిబాబు ఇంకో వెర్రిబాగులవాడి కామెడీని పండించాడు. రఘుబాబు, వెన్నెల కిషోర్, వేణు తదితర హాస్యబృందం ప్రేక్షకుల్ని వినోద పరచడానికి ఉన్న పాత్రల పరిధిమేరకు కృషి చేశారు. అయితే మొత్తంగా చూస్తే సినిమాలో కామెడీ ఉండాల్సిన రేంజిలో మాత్రం లేదు.
ఇక ద్విపాత్రాభినయంలో ప్రకాష్ రాజ్ సన్నివేశాల బలం పెంచుతాడు. ప్రదీప్ రావత్  గెటప్ అతడి కరకు విలనిజాన్ని పండించడానికి అడ్డుపడింది. గడ్డం మీసాల తీరు సాఫ్ట్ నేచర్ ని వ్యక్తీకరించడంతో వచ్చిన సమస్య ఇది!

ఇక కొత్త హీరో శ్రీనివాస్ గురించి ముందే చెప్పుకున్నాం. ఈ సినిమా ఇతడికి ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి ఎంసెట్ రాయడం లాంటిది అనుకుంటే ఇందులో ఇతను ఉత్తీర్ణుడైనట్టే. తర్వాత వచ్చే సినిమాల్లో ఇతను డాన్సులూ పోరాటాలతో బాటు, తన నటనాభినివేశాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వుంటుంది. లేకపోతే కార్డ్ బోర్డు నటుడిగా ఫేడవుట్ అయిపోయే ప్రమాదముంది.
హీరోయిన్ సమంతా గ్లామర్ కోషెంట్ కోసం ఉపయోగపడింది. అయితే మరీ ‘దూకుడు’, ‘ఆటోనగర్ సూర్య’ ల్లో లాగా సెకండాఫ్ లో కథలోంచి మాయమైపోకుండా ఆద్యంతం ఉంటూ రక్షించింది. మొదటి పాటలో ఐటం గర్ల్ గా వచ్చిపోయే తమన్నా మరో కమర్షియల్ దినుసు!

ఏ సిల్వర్ స్క్రీన్ అయితే నిండుగా కన్నులపండువగా వెలిగిపోతుందో- అది ఛోటా కె.నాయుడు కెమెరా వర్క్ కి నిదర్శనంగా గుర్తుపట్ట వచ్చు- అని గతంలో ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న సందర్భంగా ఈ సమీక్షకుడికి వెల్లడించిన ఛోటా కె. నాయుడు మరోసారి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ సినిమా ఆయనెందుకు టాప్ డీ ఓ పీ నో అడుగడుగునా నిరూపిస్తుంది- పాటల చిత్రీకరణలో మరీనూ!

పాటలతో దేవీశ్రీ ప్రసాద్ దీన్నో మ్యూజిక్ ఫెస్టివల్ గా మార్చేశారు. పాటలు, పోరాటాలు, కాసింత కామెడీ ఈ భారీ కమర్షియల్ ని వినోదించడానికి పోటీపడ్డాయి. అయితే, ఇందరు టాప్ కళాకారులతో భారీ హంగులతో రూపొందిన  ఈ సినిమాకి వెనకబడిపోయింది స్క్రిప్ట్ ఒక్కటే! ఇంతమంది పెద్ద తారాగణం,  పేరున్న టెక్నీషియన్లూ అందరూ పోటాపోటీగా పనిచేసి సినిమాని నిలబెట్టడానికి విపరీతంగా కృషిచేస్తే, స్క్రిప్టు బాధ్యతలు తీసుకున్న రచయితలు  మాత్రం ఈ పోటీలో భాగం కాలేకపోయారు. రచయితలు  కోన వెంకట్- గోపీ మోహన్ లు  అరిగిపోయిన మూసలోంచి బయటికి రావడానికి ససేమిరా అంటున్నారు! అదిసరే, స్క్రీన్ ప్లే నిర్వహణలోనూ పెద్ద పొరపాట్లు చేస్తున్నారు!

దర్శకుడు వినాయక్ ఈ మూస కథకి  తనదైన చిత్రీకరణతో నవ్యత సాధించడానికి చేసిన కృషి కూడా తెరమీద కన్పిస్తుంది- మొత్తం మీద బెల్లంకొండ వారసుడికి సేఫ్ పాసేజ్ కల్పించి ముందుకు నెట్టారు!

 స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లేలో సమయం వృధా చేయకుండా కథనంలో రావాల్సిన మలుపుల్ని, కొన్ని ప్రధాన పాత్రల షేడ్స్ ని, మరికొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ నీ  వెంటవెంటనే బాగానే ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ప్రధాన సమస్య- భాయ్ పాత్ర తనకో డబుల్ (నరసింహం) ఉన్నాడని తెలుసుకుని హీరోతో సహా మిత్రబృందాన్నంతటినీ సజీవ దహనానికి ఆర్డరేసి,  హీరోయిన్ తో షార్జా పారిపోయే ఘట్టం- ఇది ఇంటర్వెల్లో వస్తుంది. అంటే ఫస్ట్ యాక్ట్ ఇక్కడి దాకా సాగి  ముగిసిందన్నమాట.

నిజానికి సినిమా ప్రారంభమైన అరగంట లోపే, శీను హైదరాబాద్ లో తన మామ లాగే వున్న భాయ్ ని చూసి, మామతో భాయ్ లా గేమ్ ఆడ్డం ప్రారంభించినప్పుడే, సమస్య ఇక్కడే పుట్టి కథ సెకండ్ యాక్ట్ లో పడిందనుకుంటాం. ఇది చాలా మంచి ఎత్తుగడ. క్యారక్టర్ కలర్ ఫుల్ గా  ఎప్పుడు కన్పిస్తుందంటే, ఇలాటి సాహసాలకి తెగించి సంఘటన సృష్టించినప్పుడే! ఆ సంఘటన ప్రత్యర్ధికి ఇంకా తెలీయకుండా, ఆడియెన్స్ కి తెలిసిపోతున్నప్పుడే. దీంతో ఉత్కంఠ, ఏమవుతుందో నన్న సస్పెన్సూ ఏర్పడతాయి. What is character but the determination of incident? And what is incident but the illumination of character?- అని హెన్రీ జేమ్స్ అంటాడని దివంగత సిడ్ ఫీల్డ్ అనేక సార్లు పేర్కొన్నాడు!

పాత్రని ఆవిష్కరించడానికి తగిన సంఘటనల కోసం అన్వేషణ సాగుతుంది- అంటారు డా. వల్లంపాటి వెంకట  సుబ్బయ్య కూడా- తన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన గ్రంథం ‘కథా శిల్పం’లో. అంతే గాక పాత్ర ఎవరికి  ప్రాతిధ్యం వహిస్తోంది? –అన్నది కూడా ముఖ్యమే నంటారు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్ళకుండా స్థూలంగా చెప్పుకుంటే, ప్రతీ మనిషీ ఒక గుంపుకి చెందివ వాడై ఉంటాడు. మన దేశంలో మతం, కులం, భాష, ప్రాంతం మనుషుల్ని గుంపులుగా విభజించాయి....ఇవి కాకుండా వర్గ తారతమ్యాలూ, ఉద్యోగమూ, సామాజిక స్థాయీ, లింగ బేధమూ, వయస్సూ సైతం మనుషుల్ని గుంపులుగా విభజిస్తాయి..వీటిలో ఏ గుంపుకు చెందిన మనిషైనా తనకి తెలీకుండా ఆ గుంపు భావజాలానికి లోనవుతాడు...ఇలా గుంపు భావజాలానికి ప్రాతినిధ్యం వహించేలాగా కథలో చిత్రించిన పాత్రల్ని ప్రాతినిధ్య పాత్రలంటారు..వీరు గుంపుకు నమూనాలు, మచ్చు తునకలు...ఇంగ్లీషులో చెప్పాలంటే ‘టైప్స్’... కథా సాహిత్యంలో ఈ నమూనా ప్రాతినిధ్య పాత్రలే చాలా ఎక్కువ ఉంటాయని వివరించుకొస్తారు సుబ్బయ్య.

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే, ఈసినిమా కథలో తర్వాత బయట పడే ఒక ఉదంతం వుంది. ఈ ఉదంతమే ఈ కథంతా పుట్టడానికి కారణం. ఈ ఉదంతం లేకపోతే కథే లేదు, సినిమా కూడా లేదు . ఇది అంతర్గతం గా ( హిడెన్ ట్రూత్ గా ) ఉంటూ, ఇంటర్వెల్ మలుపు తర్వాత బయట పడుతుంది. కథలో ఒక  హిడెన్ ట్రూత్ అంటూ ఉన్నాక, దాన్ని పక్కన పెట్టేసి,   పైపైన పాత్రలతో ఎంత ఆటాడించినా అది వెలవెల బోతూనే వుంటుంది. ఇదే జరిగిందిక్కడ. ఈ సినిమా సెకండాఫ్ దెబ్బతినిపోవడానికి ఇదే కారణం.

ఇరవై ఏళ్ల  క్రితం నల్లగొండ జిల్లాలో ఫ్లోరీన్ బాధితుల సమస్య తీసుకుని, దాని పరిష్కారాన్ని విలన్ చేత భంగ పరచిన ఫ్లాష్ బ్యాక్ ఈ కథలో వుంది. నరసింహం ఆ వూళ్ళో మోతుబరి. ఫ్లోరీన్ సమస్య తీర్చడానికి మంచి నీటి ప్లాంటు కోసం ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో తను పాతిక కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంటాడు. అందులో పది  కోట్లు ప్రజలనుంచి సేకరిస్తాడు. ఈ డబ్బు మీద కన్నేసిన తమ్ముడు (తర్వాత భాయ్ గా మారాడు) అన్న నరసింహం కుటుంబం మీద దాడి చేసి, ఆ డబ్బుతో, ఐదేళ్ళ అన్నకూతురు అంజలి తో పారిపోతాడు. అంజలిని ఎందుకు చంపలేదంటే, ఇంకో ఇరవై ఏళ్ల  తర్వాత తండ్రి ఆస్తి ఆమెకే వస్తుందని! లోకానికి మాత్రం అన్న తన కుటుంబాన్నీ, సెక్యూరిటీ పోలీసుల్నీ  చంపేసి డబ్బుతో పారిపోయినట్టు చిత్రిస్తాడు. లోకం మంచోడైన అన్నని అసహ్యించు కుంటుంది. అయితే తను చంపేశాడనుకున్న అన్న ప్రాణాలతో బయట పట్టాడన్న నిజం ఈ తమ్ముడికి తెలీదు. అలా బద్నాం అయిన అన్న వేరే వూరికి పారిపోయి బతికాడు. అక్కడే శీను దొరికి అతన్ని పెంచుకున్నాడు తమ్ముడేమో ఆ పాతిక కోట్లతో ఇప్పుడు వందలకోట్లకి ఎదిగి భాయ్ గా దందాలు చేస్తున్నాడు.
ఇదీ జరిగిన విషయం!
ఇదిశీను అడిగితే చెప్పుకొస్తాడు నరసింహం. శీను సంగతేమో గానీ,  మనలాంటి సామాన్య ప్రేక్షకులకి వెంటనే ఇప్పుడిన్నేళ్ళకి ఫ్లోరీన్ సమస్య తీరని పీడితులు ఇంకెంతమంది పెరిగిపోయి  యాతన పడుతున్నారో కదా- అని సినిమాలో మనకి తాజా పరిస్థితి చూపించకున్నా,  ఆ హృదయవిదారక దృశ్యాలు  కళ్ళముందు కదలాడతాయి...ఇది నిజంగా కథాత్మని ఆవిష్కరించే సన్నివేశం!

హీరోకి ఈ కథాత్మంతా అవసరం లేదు, అరంగేట్రం హీరో మీద అంత హెవీ కథ భారం మోపదల్చుకోలేదు మేము- అని ఆర్గ్యూ చేస్తే, అలాంటప్పుడు ఈ ఫ్లాష్ బ్యాకే పెట్టివుండాల్సింది కాదు. సినిమా అరగంటలోపు ఇచ్చిన మలుపుతో-దాన్నే ‘ప్రధాన సమస్య’ గా- పాయింటుగా చేసుకుని- (నిజానికే ఇదే కథాంశమని మనకి అన్పించినట్టు పైన చెప్పుకున్నాం) శీను కాకతాళీయంగా మామలాగే వున్న భాయ్ ని చూశాడు, మామని ఉపయోగించుకుని డబ్బు సంపాదనకి గేమ్ ప్లే చేశాడు, మరో వైపు డబుల్ ధమాకాగా భాయ్ కూతుర్నే లవ్ చేసిపారేశాడు, ఇది భాయ్ తెలుసుకోగానే భాయ్ ని మాయం చేసి మామనే డైరెక్టుగా భాయ్ గా ప్రవేశపెట్టాడు...ఇలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీగా చేసుకుంటూ పోతే సరిపోయేది.
***
కానీ ఫ్లాష్ బ్యాక్ విన్న శీను సిల్లీగా మామని నిర్దోషిగా నిరూపిస్తా-అని పాతసినిమా డైలాగే  కొడతాడు. మామ నరసింహం కూడా స్వార్ధ పరుడుగా కన్పించే చిత్రణ ఇది...ఎలాగంటే, ఎంతసేపూ అతడికి తాను నిర్దోషి అని లోకానికి నిరూపించుకోవాలన్న సొంత యావే తప్ప, అసలానాడు తాను  డబ్బు ఖర్చుపెట్టి ఆదుకోబోయిన ఫ్లోరీన్ పీడితులు అన్యాయమైపోయారన్న విశాల దృక్పథంతో బాధే వుండదు!

ఈ ఫ్లాష్ బ్యాక్ రివీలయ్యాక స్టోరీ పాయింటు అసలు ఫస్టాఫ్ లో మామతో శీను ప్రారంభించిన గేము కాదనీ, ఇంటర్వెల్లో భాయ్ హీరోయిన్ తో పారిపోవడం కూడా కాదనీ, ఫ్లాష్ బ్యాక్ లో వీటికంటే తీవ్ర సమస్య వున్నాక,  హీరో రియాక్ట్ అయి దానిమీదే ఉద్యుక్తుడవ్వాలనీ అన్పిస్తుంది ఎవరికైనా.

భాయ్ హీరోయిన్ తో పారిపోయి శీనుకీ, మామకి అన్యాయం చేసి మామకీ అసలు శత్రువే కాదనీ, ఆనాడు ఫ్లోరిన్ బాధితులకి అన్యాయం చేసిన సమాజ శత్రువనీ శీనుకి అవగాహన కలగాలి. కలిగితే పాత్ర ఎదిగి క్యారక్టర్ గ్రోత్ కన్పించేది. పాత్ర అలా పైకిలేచి కథలో వున్న మొనాటనీ ని ఛేదించుకుంటూ పోయేది. శీను కేవలం మామ చెపితే వినడం కాదు, తానూ ఆ ఊళ్ళు తిరిగి ఇప్పటి పరిస్థితిని (ఫ్లోరీన్ బాధితుల్ని) కళ్ళారా గాంచి చలించిపోవాలి. అంతవరకూ తనకోసమే జులాయిగా బతికిన అతను, ఈ పరిస్థతి చూశాక ఎవరికోసం బతకాలో, ఏ ‘గుంపు’కి ప్రాతినిథ్యం వహించాలో బాధ్యత తెలుసుకుని, పెద్ద టర్న్ తీసుకోవాలి! అప్పుడతను ప్రేక్షకుల ప్రేమకి అనివార్యంగా పాత్రుడయ్యే వాడు!

ఒక సుప్రసిద్ధ అమెరికన్ పత్రికా సంపాదకుడు- ఓ కథ నాల్గు పేజీలు  చదివితే, ఈ రచయిత మనుషుల్ని ప్రేమించే రకమో కాదో తెలిసి పోతుందనీ, మనుషుల్ని ప్రేమించని రచయిత రచన  పాఠకుల్ని ఆకట్టుకోదనీ అంటాడు..ఇదే కన్పిస్తోందీ సినిమాలో.
***
.

 contd...