ఆర్టికల్..
పొంచి వుంది ముంచే కాలం !తెలుగు సినిమాల నిర్మాణాలు ఇప్పుడు జోరు తగ్గాయి. రాష్ట్ర విభజన పరిణామాలు, దీని కారణంగా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చే పెట్టుబడుల మందగమనం వంటి అవాంతరాలు గాకుండా, కేవలం శాటిలైట్ రైట్స్ కి తాళం పడి పోవడంతో పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల ప్రారంభోత్సవాలకి ఫుల్ స్టాప్ పడింది. ఎక్కడపడితే అక్కడ తామరతంపరలా వెలసి, పోటీలకి పోయి, ధరలతోబాటు సినిమా సాంకేతిక విలువలనీ దిగజార్చిన రికార్డింగ్, ఎడిటింగ్, డీటీఎస్, డీఐ థియేటర్లు ఇప్పుడు పనుల్లేక బోసిపోతున్నాయి. మొన్నటివరకూ గల్లీల్లో రెండు గదుల్లో రికార్డింగ్, ఎడిటింగ్ థియేటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు డి టి ఎస్, డిఐ టెక్నాలజీ థియేటర్లు సైతం వెలసి పెద్ద స్టూడియోల కార్యకలాపాలకి సవాలుగా మారాయి. ఇక విడుదలకి ముందే శాటిలైట్ హక్కులు కోట్లరూపాయలు అడ్వాన్సుగా తెచ్చుకునే పెద్ద సినిమాలు తప్ప, చిన్న సినిమాల ఉత్పత్తి తగ్గిపోవడంతో, వాటినే నమ్ముకున్న దర్శకులు, వాళ్ళ సహాయకులు, ఇతర టెక్నీషియన్లూ రోడ్డున పడ్డారు! ఇదీ ఈ ఏడాది తొలిసగంలో తెరవెనుక సీను.
ఇక తెర ముందుకొస్తే జనవరి- జూన్ నెలల ఆరు మాసాల కాలంలో షరా
మామూలుగా 50కి పైన తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇవన్నీ గత సంవత్సరం ఎప్పుడో
ప్రారంభమైన సినిమాలు కాబట్టి ఈ సంఖ్య కనబడుతోంది. ఇంకా మరెన్నో బ్యాక్ లాగ్
సినిమాలూ వచ్చే ఆర్నెల్లలో విడుదల కావొచ్చు. తాజాగా ఈ ఏడాది కొత్త సినిమాల
నిర్మాణాలు పడిపోవడంతో దీని ప్రభావం వచ్చే సంవత్సరం డిస్ట్రిబ్యూటర్ల మీద, ఎగ్జిబిటర్ల మీదా తప్పక వుంటుంది!
ఆడించుకోవడానికి సినిమాల్లేక థియేటర్లు ఏమౌతాయో ఏమో! ఇంతేకాదు, ప్రకటనల రంగం మీదా ప్రభావం పడుతుంది. పత్రికలకి, ఛానెళ్ళకి సినిమా యాడ్స్ ఆదాయం తగ్గి పోవచ్చు. ప్రారంభోత్సవాలూ ప్రెస్
మీట్లూ లేక సినిమా విలేఖరులూ ఖాళీగా కూర్చోవాలి. పీఆర్ఓలు వేరే పనులు చూసుకోవాలి.
ఇప్పటికే దినపత్రికల సినిమా పేజీల్లో
సినిమా వార్తల్లేక, వేరే కబుర్లు రాసుకోవాల్సిన పరిస్థితి. ఛానెళ్ళలోనూ
ప్రతిరోజూ వుండే సినిమా ప్రొడక్షన్
వార్తలు, ప్రెస్ మీట్ల విశేషాలూ రావడం లేదు. ఇక ఆడియో
ఫంక్షన్లు కూడా ఐపులేకుండా పోవచ్చు.
కేవలం చిన్న సినిమాలు ఆగిపోతేనే ఈ పరిస్థితి. చిన్న సిన్మాల నిర్మాతలకి
శాటిలైట్ రైట్స్ పరంగా జేబులో పడే సొమ్ముల బరువు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది.
ఛానెళ్ళు లేని కాలంలో, శాటిలైట్ హక్కుల్లేక
సినిమాలు ఆడాలంటే కేవలం ప్రేక్షకులనే నమ్ముకోవాలి. ప్రేక్షకుల కోసమే అప్పట్లో
సినిమాలు తీసేవాళ్ళు. కాబట్టి కాస్తో కూస్తో క్వాలిటీ వుండేది. శాటిలైట్ రైట్స్
మొదలయ్యాక నిర్మాణ దశలోనే భారీ అడ్వాన్సులు వచ్చేస్తూంటే- భక్తి దేవుడి మీద, చిత్తం ప్రసాదం మీదా అన్నట్టు ప్రేక్షకులు కోన్ కిస్కా అయిపోయారు. ప్రేక్షకులకోసం
సినిమాలు తీయడం మానేశారు. ‘సార్, దీనికి కోటి పెడితే ఎనభై దాకా శాటిలైట్
వస్తుంది...కోటి కూడా పెట్టనక్కరలేదు, డెబ్బై పెట్టుకుంటే ముఫై శాటిలైట్
అడ్వాన్సు వచ్చేస్తుంది..’ ఇలా చెబుతూ సినిమా
మొహమెరుగని కొత్త కొత్త వాళ్ళని నిర్మాతలుగా దింపడం అలవాటు చేసుకున్నారు తమ
స్వార్ధం కోసం దర్శకులు. ‘కోటిలో శాటిలైట్ ఎనభై దాకా
వస్తే, ఇరవయ్యే కదా రిస్కు, ఇది
సొంతంగా విడుదల చేసుకున్నా థియేటర్ల నుంచి రాకపోతుందా..’ అన్న అంచనాలేసుకుని కొత్త వాళ్ళు సినిమాలు
చుట్టేయడం మొదలెట్టారు. పెట్టుబడిలో ఇరవై శాతమే ప్రేక్షకులనుంచి ఆశించే పరిస్థితి
ఏర్పడింది.
'ఒకప్పుడు నూరు శాతం ప్రేక్షకులనుంచే రాబట్టాలని కంకణం కట్టుకుని
క్వాలిటీ కోసం ప్రయత్నించే వాళ్ళు. ఈ ఇరవై శాతాన్ని కూడా కేర్ చేసే పరిస్థితి
లేదు. ఇరవై శాతం క్వాలిటీ సినిమాని కొనే బయ్యర్ ఎవరూ రారు. నిర్మాతే సొంతంగా
విడుదల చేసుకోవాలి. ఇదే జరిగింది ఇంతకాలమూ. ఇరవై శాతం సొమ్ముల కోసం నిర్మాతయినా
ఎందుకు విడుదల చేసుకోవాలంటే, విడుదల చెయ్యకపోతే మిగతా
శాటిలైట్ సొమ్ములూ రావు గనుక !
పదేళ్ళ క్రితం ఈ శాటిలైట్ రంధి ఎక్కడికి దారితీసిందంటే,
మూడ్రోజుల్లో ఐదారు లక్షల్లో సినిమా చుట్టేసి- పది-పదిహేను లక్షలు శాటిలైట్
సొమ్ములు తెచ్చుకో వచ్చనే దాకా. ఈ సినిమాలు థియేటర్ల పరంగా ప్రేక్షకుల ముందుకే
రావు. కానీ శాటిలైట్ సొమ్ములు రావాలంటే విడుదలై నట్టు చూపించాలి. కాబట్టి పేపర్లలో
ఓ చిన్న యాడ్ వేసి, ఒక రోజు కోసం థియేటర్ మాట్లాడుకుని నాల్గాటలు
వేసుకుని ఎత్తేసే వాళ్ళు. ఈ సహకారం అందించడానికి హైదరాబాద్ నగరంలో జనం వెళ్ళని ఓ
రెండు థియేటర్లు ఉండేవి. దీని మతలబు తెలీక, ఓ ప్రముఖ పత్రికలో ఓ సినిమా విమర్శకుడు వీరావేశ
పడిపోయి, ఈ థియేటర్లలో ఆ సినిమాలు చూసేసి,
సమీక్షలు రాసి పారేశాడు కూడా!
ఎవరైనా హోటల్ పెడితే కస్టమర్లకి భోజనం పెట్టడానికి పెడతారు.
కానీ ఎవరైనా చిన్న సినిమాలు తీస్తే ప్రేక్షకులకోసం తియ్యరు! ఇదే ఇంతకాడికి
తెచ్చింది. శాటిలైట్ బూమ్ పెద్ద కుంభ కోణంలోకి తిరగబెట్టడంతో, చిన్న సినిమాలకి ఉరి బిగుసుకుంది. ప్రతి చెత్త
సినిమానీ లక్షలకి లక్షలు శాటిలైట్ బేరాలు పెంచేసి సొమ్ములు దండుకున్న కొన్ని పెద్ద
తలకాయల వ్యవహారం పొక్కడంతో, మొత్తంగా చిన్న సినిమాల
శాటిలైట్ హక్కులకి ఈ ఏడాది ప్రారంభం నుంచే బ్రేకు పడిపోయింది. ఇక చిన్న సినిమా
శాటిలైట్ హక్కులమ్ము కోవాలంటే ముందు సొంత డబ్బులతో సినిమా తీసి, అది నాల్గు వారాలు ఆడి ఫర్వాలేదని ప్రేక్షకులు
సర్టి ఫికేట్టిస్తే, అప్పుడు లక్షలేం ఖర్మ, కోటి పెడితే మరో కోటి ఇచ్చి శాటిలైట్ హక్కులు
కొనేందుకు సిద్ధంగా వున్నాయి ఛానెళ్ళు!
అంటే చిన్న సినిమా తిరిగి ప్రేక్షకుల పేషీ లోకి
వచ్చేసిందన్నమాట. ప్రేక్షకులు చూసి, కనీసం యావరేజి అని ధృవీకరిస్తే గానీ ఇంక ఆటలు సాగవన్న మాట. ఫ్లాప్ రిపోర్టు
వస్తే ఇక అంతే సంగతులు!
పరిస్థితి ఇలా ఇలా తిరగ బెట్టాక, అంత అంకిత భావంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమా
లెవరు తీస్తారు? కళ కోసం ఎలాగూ తియ్యారు, కనీసం ప్రేక్షకుల కోసం తీయడానికైనా మన సొప్పడం
లేదు. కచ్చితంగా ఫ్లాపయ్యే సినిమాలే తీస్తారు కాబట్టి. కనుక పెట్టిన మొత్తం
డబ్బులూ పోతాయి. చిన్న సినిమాల నిర్మాణాల్నికూడా ఒక కుంభకోణం గా చేసి, జేబులు నింపుకున్నాక, మళ్ళీ ఆ జేబుల్లోంచి తీసి పోగొట్టుకుందుకు
మనసొప్పదుగా?
పోనీ తెగించి క్వాలిటీ సినిమా తీద్దామన్నా, అప్పట్లో చిన్న సిన్మాలు తీసి విజయాలు సాధించిన
దాసరి నారాయ రావు ల్లాగా, కోడి రామకృష్ణ ల్లాగా
ఇప్పుడెవరున్నారు? చిన్న సినిమా అంటే ప్రేమ సినిమా అనే అర్ధం
రాసుకుని ఈ ఆర్నెల్లలో తీసిన పద్దెనిమిది ప్రేమ సిన్మాలన్నీ అడ్రసులేకుండా
పోయినవేగా? వాటికొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు,కొత్త కొత్త హీరో హీరోయిన్లందరూ ఐపులేకుండా పోయిన వాళ్ళేగా?
ఇదీ సంగతి! ఏడాదంతా పెద్ద సినిమాలు పదే విడుదలౌతాయి. వారం
వారం థియేటర్ లకి ఫీడింగ్ నిచ్చేవి, పదుల సంఖ్యలో తయారయ్యే చిన్న సినిమాలే. ఈ చిన్న
కూడా లేకపోయాక మొత్తం అన్ని సెక్టార్లలో ఫీల్డు పరిస్థితేంటో బ్రహ్మ దేవుడే
చెప్పాలి. ఫీల్డు ని వైజాగ్ కి తరలించుకోవాలన్న ఆలోచన సంగతి దేవుడెరుగు, అసలిప్పుడున్న ఫీల్డే మవుతుందని ఆలోచించాలి.
క్వాలిటీ లేని కళాకారులతో వైజాగ్ లో
పరిశ్రమ స్థాపించినా వైకుంఠంలో స్థాపించినా ఇంతకంటే ఒరిగేదేమీ వుండదు!
-సికిందర్
(ఈవారం –ఆగస్టు,2014)