రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, December 26, 2022

1276 : రివ్యూ!


రచన - దర్శకత్వం: అశ్విన్ శరవణన్
తారాగణం: నయనతార, హనియా నఫీసా, వినయ్ రాయ్, సత్య రాజ్, అనుపమ్ ఖేర్, తదితరులు
సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం : మణికంఠన్ కృష్ణమాచారి
బ్యానర్స్ : రౌడీ పిక్చర్స్, యూవీ కాన్సెప్ట్స్
నిర్మాత   : విఘ్నేష్ శివన్

        లేడీ సూపర్ స్టార్ (అని టైటిల్స్ లో వేశారు) నయనతార 2019 నుంచి మూడే తెలుగు సినిమాల్లో నటించింది- సైరా నరసింహా రెడ్డి, ఆరడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్. తమిళంలో అడపాదడపా నటిస్తోంది. ప్రయోగాత్మకాలు కూడా నటించింది. అయితే 2015 లో ఆమె నటించిన హార్రర్ మాయ దేశవ్యాప్తంగా చర్చకి దారి తీసింది. ఇది తెలుగులో మయూరి గా విడుదలైంది. దీని కథాకథనాలు, మేకింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించాయి. హార్రర్ అంత కళాత్మకంగా తీయడం మన దేశంలో జరగలేదు. 10 కోట్ల బడ్జెట్ కి రెండు భాషల్లో 45 కోట్లు వసూలు చేసింది. ఇది 24 ఏళ్ళ దర్శకుడు అశ్విన్ శరవణన్ సాధించిన అపూర్వ విజయం. తర్వాత తాప్సీతో గేమ్ ఓవర్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తీశాడు. తిరిగి ఇప్పుడు నయనతారతో కనెక్ట్ అనే హార్రర్. ఇది హాలీవుడ్ క్లాసిక్ ఎక్సార్సిస్ట్ నుంచి స్పూర్తి పొందిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, దీనికి కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యాన్ని జోడించినట్టు చెప్పాడు. మరి ఇది తను తీసిన మయూరికి కనీసం దగ్గరి ప్రమాణాలతో వుందా లేదా చూద్దాం...

కథ

    డాక్టర్ జోసెఫ్ (వినయ్ రాయ్), సుసాన్ (నయనతార), అమ్ము (హనియా నఫీసా) ఒక కుటుంబం. అమ్ముకి సంగీతం పట్ల ఆసక్తి. ఆమెకి లండన్ హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్లో సీటు వస్తుంది. కానీ ఇంత చిన్న వయసులో పంపడానికి సుసాన్ ఒప్పుకోదు. ఇది జరిగిన మర్నాడే కోవిడ్ 19 దృష్ట్యా లాక్ డౌన్ విధిస్తుంది ప్రభుత్వం. దీంతో సుసాన్, అమ్ము ఇంట్లో బందీలైపోతారు. నగరంలో వేరే చోట సుసాన్ తండ్రి ఆర్థర్ (సత్యరాజ్) వుంటాడు. డాక్టర్ జోసెఫ్ కోవిడ్ డ్యూటీతో హాస్పిటల్లో బిజీ అయిపోతాడు. అతను కోవిడ్ సోకి మరణిస్తాడు. సుసాన్ దుఖంతో వుంటుంది. అమ్ము తట్టుకోలేక పోతుంది. అయితే ఇద్దరికీ కోవిడ్ సోకి క్వారంటైన్ లో వుంటారు. అమ్ముకి తండ్రి ఆత్మతో మాట్లాడాలన్పించి ఆన్ లైన్లో వూయిజా బోర్డు ని ఆశ్రయిస్తుంది. దాంతో దుష్టాత్మ ఆమెనావహిస్తుంది. దీంతో భయపడిపోయిన సుసాన్ లాక్ డౌన్ సమయంలో కూతుర్ని ఎలా కాపాడుకుందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఓ బాలికకి దుష్టాత్మ ఆవహించడం, దాన్ని భూత వైద్యుడు వదిలించడం వంటి ఎక్సార్సిస్ట్ కోవలోనే వుంది కథ. ఇలాటి కథతోనే గత నెల తెలుగులో  మసూద చూశాం. ప్రస్తుత కథ కి లాక్ డౌన్ నేపథ్యం. దీంతో ఎక్కడున్న పాత్రలు అక్కడుండి పోయి- ఆన్ లైన్లో (వీడియో కాల్స్) ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వుంటారు. ఇలాగే సాగుతుంది మొత్తం కథ, ముంబాయి నుంచి ఆల్ లైన్లో భూత వైద్యం సహా. ఇదొక కొత్త క్రియేటివ్ ఐడియా కథనానికి. అయితే దీని నిర్మాణం లాక్ డౌన్ కాలంలో జరగలేదు.
        
2020 లాక్ డౌన్ సమయంలో మొత్తం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ అన్నీ రిమోట్ గానే, ఆన్ లైన్ లో జరిపి మలయాళంలో సీయూ సూన్ అనే థ్రిల్లర్ని చాలా ప్రయోగాత్మకంగా తీశాడు దర్శకుడు మహేష్ నారాయణన్. తీసి ఓటీటీలో విడుదల చేసి- లాక్ డౌన్ ఏదీ సినిమాల్ని ఆపలేదని రుజువు చేశాడు.
        
సీయూ సూన్’ చేతిలో వున్న స్మార్ట్ ఫోన్స్లాప్ టాప్స్డెస్క్ టాప్స్ వంటి అప్లికేషన్సే  కథలు చెప్పేందుకు మాధ్యమాలు కావచ్చని చెప్పింది. ఇంత కాలం కథల్ని వీటి స్క్రీన్స్ పై చూసేందుకు’ ఇవి మాధ్యమాలుగా వున్నాయిఇప్పుడు కథల్ని చెప్పేందుకు’ ఈ స్క్రీన్స్ మాధ్యమాలవుతాయి. ఆనాడు మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రేమికుల మధ్య కేవలం ఉత్తరాలతో ప్రయోగాత్మకంగా ‘దూరం’ అనే నవల విజయవంతంగా నడిపారు. ఉత్తరాల్లోనే ఆ కథ ప్రవహిస్తూంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లోలాప్ టాప్స్ లోడెస్క్ టాప్స్ లోఇంకా సీసీ కెమెరాల్లోటీవీలో కథ పరుగెత్తుతూంటే ఎలా వుంటుంది? ఈ అనుభవమే సీయూ సూన్ ఇన్నోవేటివ్ అయిడియా.
        
దీనికి ఇంకో రూపం కనెక్ట్. దీని కథ కోసం ఎక్సార్సిస్ట్ ఐడియా తీసుకుని, వూయిజా బోర్డు గేమ్ ని జోడించాడు దర్శకుడు. ఆత్మలతో మాట్లాడే ఈ గేమ్ వికటించి దుష్టాత్మ పట్టుకునే కథ. వూయిజా బోర్డు గేమ్ కథలతో హాలీవుడ్ నంచి 2014 లో, 2016 లో రెండు సినిమా లొచ్చాయి.
        
అయితే ఐడియా, టెక్నికల్ అంశాలు రెండూ బావుండి, కథ విషయంలోనే కుంటుపడింది. మయూరి ప్రమాణాలు మృగ్యమయ్యాయి. హార్రర్ సినిమా హార్రర్ లా వుండక ఏడ్పులతో వుంటే ట్రాజడీ సినిమా అన్పించుకుంటుంది. నయనతార పాత్ర ఏడుస్తూనే వుంటే, హార్రర్ తో థ్రిల్ ఏముంటుంది. కూతురికి పట్టిన హార్రర్ ని ఎదుర్కోవడానికి థ్రిల్స్ కి పాల్పడితేనే హార్రర్- థ్రిల్ నువ్వా నేనా అన్నట్టుంటాయి. దీనికి బదులు పాసివ్ క్యారక్టర్ గా ఏడ్పులతో మదర్ సెంటిమెంటుని రగిలించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. భూతవైద్యుడు దుష్టాత్మని వదిలించే క్లయిమాక్స్ హార్రర్ లో కూడా నయనతార ఏడ్పులు మనల్ని హార్రర్ని అనుభవించకుండా చేశాయి. ఇలా కథ వొక శోక సాగరంలా మారింది.

నటనలు – సాంకేతికాలు

    నటనలు భావోద్వేగ రహితంగా వుండడం ఇంకో లోపం. నయన తార సహా అందరూ ఫ్లాట్ క్యారక్టర్స్ ని ఏ ఫీలూ ప్రదర్శించకుండా పొడిపొడిగా నటించేశారు. నయనతార ఏడ్పు ఒక ఫీలే. కథకి అవసరం లేని ఆమె ఫీలు అది. హార్రర్ తో భయం, సస్పెన్స్ ఫీలై, కూతుర్ని కాపాడుకునే  థ్రిల్స్  కి పాల్పడి వుంటే అప్పుడామెలో భావోద్వేగాలు పలికేవి. ఆమెకో గోల్, ఆ గోల్ కోసం పోరాటమనే సరైన దారిలో నటన వుండేది.
        
కూతురి పాత్ర వేసిన హనియా నఫీసాలో మంచి టాలెంటే వుంది. దుష్టాత్మ పీడితురాలిగా బాధ, ఆక్రోశం బాగా నటించింది. మంచం వూగిపోతున్న ఎక్సార్సిస్ట్ ఐకానిక్ సీను దర్శకుడు క్లయిమాక్స్ లో వాడుకున్నాడు. ఇక్కడ నఫీసాకి  నయనతార (ఏడ్పు) అడ్డుపడక పోతే, తన మీదున్న సీనుతో బలంగా ఆకట్టుకునేది. ఇక నయనతార తండ్రి పాత్ర వేసిన సత్యరాజ్, ముంబాయి భూత వైద్యుడు ఫాదర్ ఆగస్టీన్ పాత్ర వేసిన అనుపమ్ ఖేర్ వీడియో కాల్స్ లో నటన కనబర్చారు.
        
సినిమాలో చెప్పుకోదగ్గవి రెండున్నాయి- సంగీతం, ఛాయాగ్రహణం. రెండూ టాప్ సౌండ్ ఎఫెక్ట్స్ సహా. రెండు మూడు హార్రర్ బిట్స్ నిజంగానే భయపెడతాయి. థియేటర్లకి  దూరమవుతున్న ప్రేక్షకులకి థియేటర్ అనుభవాన్నివడానికే ఎఫెక్ట్స్ ని సాధ్యమైనంత బలంగా వాడుకున్నట్టు చెప్పాడు దర్శకుడు. అయితే ఎఫెక్ట్స్ తో బాటు కథ కూడా కనెక్ట్ అయితేనే థియేటర్స్ కి వెళ్ళడం గురించి ఆలోచిస్తారు ప్రేక్షకులు.

—సికిందర్  

Sunday, December 25, 2022

1275 : సండే స్పెషల్ రివ్యూ!


 

క్రిస్మస్ హాలీడే సినిమాలు ప్రేక్షకుల్ని వూపిరి సలపనీయకుండా చేస్తూంటాయి. ఇవి ఏడాదికి ఒకసారే వస్తూంటాయి కాబట్టి ఇవి చూడడంలో తలమునకలై వుంటారు అమెరికన్లు. మన దేశంలో క్రిస్మస్ కి విడుదలయ్యే సినిమాలు బాలీవుడ్ నుంచి అయితే 83 అనే స్పోర్ట్స్ సినిమా విడుదలవుతుంది. టాలీవుడ్ నుంచైతే శ్యామ్ సింఘ రాయ్ అనే కమర్షియల్ విడుదలవుతుంది. ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి సర్కస్’, టాలీవుడ్ నుంచి ధమాకా’, 18 పేజెస్ వంటి రెగ్యులర్ సినిమాలే విడుదలయ్యాయి. వీటికి క్రిస్మస్ తో ఏ సంబంధమూ వుండదు.

        తెలుగులో ఒకప్పుడు టీవీల్లో కరుణామయుడు లేదా రాజాధిరాజు క్రైస్తవ భక్తి సినిమాలు  ప్రసారమయ్యేవి. హాలీవుడ్ క్రిస్మస్ సినిమాలు చూసే అలవాటు క్రైస్తవులు ఎక్కువ వుండే కేరళ, గోవా వంటి రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లేదు. హాలీవుడ్ క్రిస్మస్ సినిమాలంటే క్రైస్తవ భక్తి సినిమాలు కాదు. క్రిస్మస్ తాత కొన్ని సినిమాల్లో కన్పిస్తాడేమో గానీ, ఏసుక్రీస్తు అస్సలు కన్పించడు. హాలీవుడ్ క్రిస్మస్ సినిమాలంటే క్రిస్మస్ పండగ రోజుల్లో జరిగే ప్యూర్ ఫ్యామిలీ, రోమాంటిక్ కామెడీలు. పూర్తి స్థాయిలో నవ్వించడమే వీటి పని. క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈ సినిమాలకి అంత డిమాండ్ వుంటుంది. ఇవి నవ్వించడమే గాకుండా, క్రిస్మస్ జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేస్తాయి, ఇతరులతో మానవీయంగా వ్యవహరించేలా చేస్తాయి. క్రిస్మస్ రోజుల్లో టీవీ ఛానెల్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్  క్రిస్మస్ సినిమాల్ని కుమ్ముతాయి. ఈసారి కొంచెం తేడాగా మర్డర్ మిస్టరీ కూడా తీశారు.

హూ కిల్డ్ శాంటా?’ అని క్రిస్మస్ తాత హత్య గురించి హాస్య ప్రహసనం తీశారు. పిల్లలకి బహుమతులు పంచే క్రిస్మస్ తాతని చంపే మతి మాలిన వాడెవడు? వీడిగురించి తెలుసుకోవాలంటే నెట్ ఫ్లిక్స్ లో చూడాలి. అయితే నెట్ ఫ్లిక్స్ దీన్ని మన దేశ భాషల్లో విడుదల చేయలేదు. సబ్ టైటిల్స్ తో ఇంగ్లీషులో వుంది. ఇదెలా నవ్విస్తుందో పరిశీలిద్దాం...

అనుమానితులు కొందరే- అధికారులెందరో!

పోలీస్ డిటెక్టివ్ టెర్రీ సియాటిల్ కి క్రిస్మస్ అంటే పరమ బోరు. ఇంటి దగ్గరే పిజ్జా తింటూ యాక్షన్ సినిమాలు చూస్తూ బద్ధకంగా గడపాలను కుంటాడు. ఈ క్రిస్మస్ కి పిజ్జా ఆరగిస్తూ ఎక్కడిదో పాత వీడియో కేసెట్ వేసుకుని డై హార్డ్ మూవీని రాజసంగా  ఆస్వాదిస్తూంటే, మాజీ భార్య రోండా నుంచి ఫోన్ వస్తుంది. నగర మేయర్ పామర్ సిటీ హాల్లో ఓ కార్యాక్రమం ఏర్పాటు చేసిందని రోండా అంటుంది. ఆ కార్యక్రమంలో అనాధ పిల్లలకి క్రిస్మస్ తాత శాంటా బహుమతులు పంచుతాడని చెప్తుంది. అతడికి సెక్యూరిటీ అవసరమని, మేయర్ పామర్ కొత్త ట్రైనీగా చేరిన జేసన్ ని సెక్యూరిటీగా పంపుతోందనీ సమాచారమిస్తుంది.
        
అయితే తెల్లారే కార్యక్రమం వుండగా రాత్రే శాంటా శవ రూపంలో వుంటాడు. సిటీ హాల్లోనే  క్యాండీ కేన్ గుండెల్లో గుచ్చుకుని కింద పడుంటాడు. తామంతా వుండగా లైట్లు ఆరిపోయి చీకటైందనీ, లైట్లు వచ్చేసరికి శాంటా వేషం వేసిన బ్లేజ్ ఇలా వున్నాడనీ అక్కడున్న వాళ్ళు అంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ డిటెక్టివ్ టెర్రీ, అనాధ పిల్లలకి బహుమతులు పంచడం ఏ వెధవకి నచ్చలేదని అడుగుతాడు. గుండెల్లో గుచ్చుకున్న క్యాండీ  కేన్ చీకి వున్నట్టు కన్పిస్తోందనీ, చంపిన వాడు క్యాండీ కేన్ ని చీకి, రుచి నాస్వాదించి మరీ పొడిచి చంపి వుంటాడనీ అంటారు. శాంటాకి సెక్యూరిటీగా వచ్చిన  కొత్త ట్రైనీ జేసన్ ఏమీ తెలియని అమాయకుడిలా వుంటాడు.       
        
మేయర్ పామర్ వచ్చేసి తెల్లారేకల్లా హంతకుడ్ని పట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తన పదవి వూడుతుందని, తెల్లారి అనాధ పిల్లలకి బహుమతులిచ్చే కార్యక్రమం కూడా యధావిధిగా జరగాలనీ ఆదేశిస్తుంది. మాయా అనే ఇంకో ట్రైనీని పిలిపించి టెర్రీ కప్పగిస్తుంది. టెర్రీ యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభిస్తాడు. అనుమానితులు ఈ హత్యని సీరియస్ గా తీసుకోకుండా శవం మీద జోకు లేసుకుంటూ వుంటారు. శవమైన శాంటా వేషం వేసిన బ్లేజ్ కీ, అనుమానితుల్లో ఒకడైన స్పోర్ట్స్ న్యూస్ యాంకర్ జిమ్ కీ కొన్ని స్పర్ధ లున్నాయి. టెర్రీ ప్రశ్నిస్తే, తను బ్లేజ్ కి 9 మిలియన్ డాలర్లు బాకీ పడిన మాట నిజమేననీ, అయితే తన ఎక్కౌంట్లో గానీ, లాకర్లో గానీ డాలరు కూడా లేదనీ అంటాడు. నువ్వు నగ్నంగా మారితే నీ ఎక్కౌంటు, లాకరు డాలరు కూడా లేక నగ్నంగా వున్నాయని నమ్ముతానంతాడు టెర్రీ. వెంటనే జిమ్ బట్టలూడ దీసుకుంటాడు.
        
బ్లేజ్ అసిస్టెంట్ మియా ని ప్రశ్నిస్తాడు టెర్రీ. తనని బ్లేజ్ వేధింపులకి గురిచేసే వాడని అంటుంది మియా. అయితే తను చంప లేదంటుంది. డోనాని ప్రశ్నిస్తాడు టెర్రీ. ఈమె  రెస్టారెంట్ ఓనర్. బ్లేజ్ తో రెస్టారెంట్ అమ్మకం డీల్ కుదరలేదనీ, బ్లేజ్ వెళ్ళిపోయి తన  రెస్టారెంట్ ఎదుటే కొత్త రెస్టారెంట్ తెరిచే పనుల్లో వున్నాడనీ, అయితే అతడి హత్యతో తనకే సంబంధం లేదనీ అంటుంది డోనా.
        
మరి ఎవరు చంపారు? కొత్త ట్రైనీ మాయా ఏదో హడావిడి చేస్తుంది. ఇంకో ట్రైనీ జేసన్ గందరగోళంలో వుంటాడు. చచ్చి పడున్న బ్లేజ్ అప్పుడప్పుడు కళ్ళు తెరిచి జరుగుతున్నది చూసి నవ్వుతూంటాడు. తెల్లారబోతోంది, టైం లేదు. టెర్రీ దర్యాప్తు తీవ్రతరం చేస్తాడు. ఇక లాభం లేదని ఇంకో కొత్త ట్రైనీ డేవిడ్సన్ ని దింపుతుంది మేయర్. ఇతనొచ్చి ఒక ఝలక్ ఇవ్వడంతో మొత్తం మిస్టరీ వీడిపోతుంది. ఏమిటా ఝలక్? ఎలా ఇచ్చాడు? ఎందుకిచ్చాడుఇవి తెరమీద చూడాల్సిందే.

మైండ్ లెస్ కామెడీ

ఏ మాత్రం లాజిక్ లేని మైండ్ లెస్ కామెడీ ఇది. శవం కళ్ళు తెర్చి నవ్వడం సహా. మర్డర్ మిస్టరీని దాని సహజ ధోరణిలో తీస్తే అది క్రిస్మస్ మూవీ అవదు. మర్డర్ ని కూడా కామెడీ తో ఎంటర్ టైన్ చేయాల్సిందే. అయితే ఈ ఆబ్సర్డ్ కామెడీ మరీ ఎక్కువైతే వెగటు పుట్టిస్తుంది. అందుకని గంట నిడివితోనే ఈ మూవీ వుంటుంది. ముగింపు ఒక సర్ప్రైజ్.         

ఇందులో నటీనటులందరూ టీవీ నుంచి వచ్చిన వాళ్ళే. దర్శకురాలు లారా మర్ఫీ నల్గురు రచయితలతో కలిసి ఇంకో ప్రయోగం చేసింది. ట్రైనీలుగా నటించిన ఇద్దరు నటులకి కథ చెప్పకుండా, సీను పేపర్లు ఇవ్వకుండా, నటిస్తున్న ఇతర నటీనటులతో సీనుని అర్ధం జేసుకుని నటించమంది. అందుకే ట్రైనీ మాయా ఏదో హడావిడీ చేస్తూ కన్పిస్తుంది, ట్రైనీ జేసన్ గందరగోళంగా వుంటాడు. ఇలా ఇదో కామెడీ క్రియేటయ్యింది. ఈ ప్రక్రియని ఇంప్రోవైజ్డ్ యాక్టింగ్ అంటారనీ, ఇది పురాతన కాలం నుంచీ నాటకాల్లో వుందనీ, తర్వాత టీవీ షోలలో ప్రవేశించిందనీ సెలవిచ్చారు. ఇలా హూకిల్డ్ శాంటా ప్రయోగాత్మక క్రిస్మస్ కామెడీ అయింది. మర్డర్ విల్లీ మర్డర్ మిస్టరీస్ సిరీస్ లో ఇది రెండోది.

—సికిందర్

 

Saturday, December 24, 2022

1274 : రివ్యూ!

స్క్రీన్ ప్లే - దర్శకత్వం:  ల్నాటి సూర్య ప్రతాప్
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, నుపమా పరమేశ్వరన్, అజయ్ తదితరులు  
కథ: సుకుమార్, మాటలు : శ్రీకాంత్ విస్సా, సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం : ఎ వసంత్, సమర్పణ : అల్లు అరవింద్, బ్యానర్స్ : జిఎ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: బన్నీ వాస్
విడుదల : డిసెంబర్ 23, 2022 
***

        సుకుమార్ రైటింగ్స్ సపరేట్ సెక్షన్ సినిమా వచ్చింది. సుకుమార్ రాస్తే ఏడేళ్ళ క్రితం కుమారి 21 ఎఫ్ హిట్ తీసిన దర్శకుడు సూర్యప్రతాప్, ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి 18 పేజెస్ తో వచ్చాడు. కార్తికేయ 2 తో సక్సెస్ మీద వున్న హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తో జతకట్టి (సినిమాలో ముగింపులో తప్ప జత కట్టడం వుండదు) ప్రేమ కథతో వచ్చాడు. సుకుమార్ ప్రేమ కథ రాస్తే అది రాడికల్ గా వుంటుందని ప్రతీతి. ఇప్పుడు కూడా ఈ రాడికల్ గా రాసిన ఈ ప్రేమ కథ అల్లు అరవింద్ సమర్పణలో ఏ విధంగా తెరకెక్కిందో చూద్దాం.

కథ

హైదరాబాద్ లో సిద్ధార్థ్ (నిఖిల్) సాఫ్ట్ వేర్ కంపెనీలో యూత్ కి రిలేషన్ షిప్ యాప్ డెవలపర్ గా పని చేస్తూంటాడు. ప్రేమించిన ప్రీతి బ్రేకప్ చెప్పి వేరే బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవడంతో దెబ్బతిని తాగుడు, తిరుగుడు పన్లు చేస్తూంటే ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ విజయనగరం జిల్లాలో నందిని (అనుపమ) కి చెందింది. ఆమె రాసుకున్న డైరీ చదివితే, ఆమె డిజిటల్ ప్రపంచానికి దూరంగా వుండాలనుకుని ఫోన్ కూడా వుంచుకోదనీ, మనుషులతో ముఖా ముఖీ మాట్లాడడానికే ఇష్ట పడుతుందనీ వగైరా వగైరా చాలా విషయాలు చదువుతూ ప్రేమలో పడిపోతాడు. 2019 నాటి ఆ డైరీలో 18 పేజీలే రాసి అసంపూర్ణంగా వుండడంతో ఆమెని కలుసుకోవాలని ఆమె వూరెళ్తాడు.
        
అక్కడ రెండేళ్ళ క్రితం ఆమె హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో చనిపోయిందని నాయనమ్మ చెప్తుంది. తాతగారిచ్చిన కవరు హైదరాబాద్ లో వెంకట్రావుకి అందజేయడానికి వెళ్ళి మరణించింది. దీంతో తన ప్రేమ బలంతో ఆమె బ్రతికే వుందని నమ్మిన సిద్ధార్థ్ ఆమెని వెతకడం ప్రారంభిస్తాడు. ఆమె దొరికిందా? యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ కవరులో ఏముంది? నిజాలేమిటి, అబద్ధాలేమిటి? తెలుసుకుని ఏం చేశాడు సిద్ధార్థ్? ఇవి తెలియాలంటే 19 వ పేజీనుంచి సుకుమార్ నింపిన కథ వెండి తెరమీద చూడాలి.

ఎలావుంది కథ   

పరస్పరం చూసుకోకుండా ఉత్తరాల ద్వారానో, ఆన్ లైన్లోనో ప్రేమించుకునే కోవకి చెందిన కథ. అయితే ఇందులో సుకుమార్ బ్రాండ్ రాడికల్ ప్రేమికుల పాత్రల్లేవు. ప్రేమ కథ జానర్నే రాడికలైజ్ చేశారు. సగం వరకూ ప్రేమ కథగా సాగుతున్న విషయాన్ని అకస్మాత్తుగా క్రైమ్ ఎలిమెంట్ తో సస్పెన్స్- ఇన్వెస్టిగేటివ్ - థ్రిల్లర్ లాగా మార్చేయడంతో ప్రేమకథ ఆవిరైపోయింది. ప్రేమకథని క్రైమ్ తో చెప్పాలనుకుంటే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హిట్టయిన నితిన్ - నిత్యా మీనన్ లు నటించిన 'ఇష్క్' (2012) లాగా వుండొచ్చు కథ. క్రైమ్ ఎలిమెంట్ తోనే 'ఇష్క్' లో ప్రేమకథ బలపడిన విషయం గమనించాలి.
        
'18 పేజెస్' లో నిఖిల్ పాత్ర కూడా అలా వుండాల్సింది కాదు. యూత్ కోసం రిలేషన్ షిప్ యాప్ డెవలపర్ గా వుంటున్న అతడి పాత్ర చిత్రణ రెండు విధాలా కనెక్ట్ కాలేదు. ఓ డైరీ దొరికితే అది చదివేయడమన్నది ఏ రకమైన రిలేషన్ షిప్ మర్యాదో తెలియదు. అలాగే డైరీ చదివి ప్రేమలో పడిపోవడం కూడా. డైరీని ఆమెకి చేరేయకుండా, లేదా భద్రంగా పెట్టేయకుండా మానసిక చాంచల్యానికి పాల్పడినప్పుడే వృత్తిపరంగా, వ్యక్తిత్వపరంగా, పాత్ర చిత్రణ పలచన బారిపోయింది.
        
ఆమె ఫోను వాడదని తెలుసుకుని ఫోను వాడక పోవడం, ఆమె భేల్ పూరీలో రెండు చుక్కలు నిమ్మరసం వేసుకుంటుందని చదివి తానూ అలాగే చేసి ఎంజాయ్ చేయడం, పేజీపేజీకి ఆమెని వూహించుకుని పాటలు పాడడం మానసిక వ్యభిచారమో, లేకపోతే ఒక కథలో దాస్తొయెవ్‌స్కీ చెప్పినట్టు సైకో లక్షణమో అయివుండాలి తప్ప, యూత్ కి రిలేషన్ షిప్  యాప్ డెవలపర్ క్యారక్టర్ లా అన్పించదు. ఇతను యాప్ డెవలప్ చేస్తే ఎలా వుంటుందో వూహించ వచ్చు.
        
ఎందుకు ప్రేమిస్తున్నాడో అతడి ఫీల్ ని ఆడియెన్స్ ఫీల్ కాలేక పోవడం ఈ ప్రేమ కథని బోనులో నించోబెట్టింది. అతడిదో దారైతే ఆడియెన్స్ దో దారి. ఆమె ప్రేమ కోసమే ఆమె వూరికెళ్ళడం కూడా కన్విన్సింగ్ గా వుండదు. ఆమెని కలిసి, నీ డైరీ చదివి నీతో ప్రేమలో పడ్డానంటే- ఆ డైరీ లాక్కుని ఆమె కొడితే ఏం చేస్తాడు. అతను రిపోర్టర్ అయివుంటే వృత్తిపరమైన ఆసక్తితోనో, డ్యూటీ అనుకునో డైరీని అందించాలని ప్రయత్నించవచ్చు- అదికూడా చదివి ప్రేమించకుండా.

    'మెసేజ్ ఇన్ ఏ బాటిల్' (నాగార్జునతో పూరీ జగన్నాథ్ 'శివమణి') లో మాజీ రిపోర్టర్ రాబిన్ రైట్ కి బీచిలో కొట్టుకు వచ్చిన బాటిల్లో ప్రేమ లేఖ దొరికినప్పుడు, కేథరిన్ అనే యువతి రాసిన ఆ లేఖ చదివి కొలీగ్స్ కి చూపిస్తే, కొలీగ్స్ ఆమెకి చెప్పకుండా ప్రచురిస్తారు. దీనికి స్పందనగా అనేక జవాబులొస్తాయి. ఒక జవాబు ఆకర్షించి అది రాసిన టైప్ రైటర్ నీ, నోట్ ప్యాడ్ నీ ట్రాక్ చేసి, ఎక్కడో ఒంటరిగా జీవిస్తున్న కెవిన్ కాస్ట్నర్  గురించి చెబితే, రాబిన్ రైట్ అక్కడికెళ్ళి అతడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పరస్పరం ప్రేమలో పడతారు. కేథరిన్ చనిపోవడం ఆమె చేసిన క్షమించరాని తప్పుగా ఫీలవుతూంటాడు కాస్ట్నర్.
        
బీచిలో బాటిల్లో లెటర్ కొట్టుకు వచ్చిందంటే అదెవరో ప్రపంచానికి తెలియాలని పంపిన సందేశం అన్పించింది కాబట్టే మాజీ రిపోర్టర్ గా చదివింది రాబిన్ రైట్. తను ఇప్పుడు రిపోర్టర్ కాదు కాబట్టి కొలీగ్స్ కిచ్చేసింది. కొలీగ్స్ దాన్ని ప్రచురించి, కూపీలాగి కాస్ట్నర్ గురించి చెప్తే, రాబిన్ రైట్ కి తనలోని రిపోర్టర్ అతడ్ని కలుసుకునేలా చేసింది తప్ప ప్రేమలో పడి వెళ్ళలేదు, వెళ్ళాక ప్రేమలో పడింది. ఇదీ పాత్రచిత్రణ. ఇది నికోలస్ స్పార్క్స్ నవలకాధారం. నికోలస్ స్పార్క్స్ ప్రేమ నవలలు ఎన్నో హిట్ సినిమాలుగా వచ్చాయి.
        
నిఖిల్ పాత్రతో ప్రేమ కథ ఇలా వుంటే, క్రైమ్ ఎలిమెంట్ కి దారితీసే అనుపమ పాత్ర కథ ఇంతే అసహజంగా వుంది. ఆమె తాత ఎక్కడో హైదరాబాద్ లో వెంకట్రావుకి కవరు  కొరియర్ లో పంపకుండా మనవరాలికిచ్చి అంతదూరం పంపడమేమిటి? కథ కోసం అన్నట్టు వుంది. నిఖిల్ ఆమెకోసం వెళ్ళినప్పుడు, రెండేళ్ళ క్రితం యాక్సిడెంట్ లో చనిపోయిందని అంటుంది నాయనమ్మ. చనిపోతే డెడ్ బాడీ ఏమైంది? ఈ విషయం కథ కోసం దాట వేశారు. డెడ్ బాడీ తెచ్చుకోకుండా నాయనమ్మ ఎలా వుంటుంది?

    నిఖిల్ పోలీస్ స్టేషన్ కెళ్ళి యాక్సిడెంట్ కేసు గురించి తెలుసుకుంటే వెంటనే కథ అయిపోతుంది. అందుకని ఎక్కడెక్కడో 'ఇన్వెస్టిగేట్' చేస్తూంటాడు. రియల్ ఎస్టేట్ కుంభకోణానికి సంబంధించిన  ఆ కవరులో విషయం కూడా సహజంగా వుండదు. నిఖిల్ తో ప్రేమ కథ, అనుపమతో క్రైమ్ ఎలిమెంట్ రెండూ ఏ ఫీలూ పుట్టించని అసహజ, అసాధ్య  చిత్రణలయ్యాక, ముగింపు మాత్రం కదిలించేదిగా వుంటుంది.
        
డైరీ దొరికిన ప్రారంభం, కదిలించే ముగింపూ రెండూ తీసుకుని మధ్యలో 1996 లో అజిత్ నటించిన 'కాదల్ కొట్టై' (తెలుగులో ప్రేమ లేఖ') లాగా కథ చేసుకుని వుంటే సుకుమార్ రైటింగ్స్ కి బావుండేది.

నటనలు- సాంకేతికాలు
నిఖిల్ గ్లామర్ పరంగా, నటనాపరంగా బెస్ట్ అవుట్ పుట్టిచ్చాడని చెప్పొచ్చు. అయితే బాడీ షేపు అక్కడక్కడా హెచ్చు తగ్గులుగా వుంటుంది. అంతటా ఒకే షేపులో వుండాల్సింది. ఒకే షేపులో వుండరనే అవతార్ 3,4 సీక్వెల్స్ ఒకే సారి గబగబా షూట్ చేస్తున్నాడు జేమ్స్ కామెరూన్. ఇక నిఖిల్ పాత్రకి మొదట్లో బ్రేకప్ ఎపిసోడ్ కూడా కనెక్ట్ కాలేదు. ఎవరో అమ్మాయిని చూపించి బ్రేకప్ అంటే ఆడియెన్స్ ఏమీ ఫీలవ్వరు. పోతే పోయిందనుకుంటారు. పైగా ఇది ఎలాగూ బ్రేకప్ అయ్యే ప్రేమని ముందే తెలుస్తుంది. ఆ అమ్మాయి రశ్మికనో, పూజా హెగ్డేనో లాంటి హీరోయిన్ అయివుంటే, నిఖిల్ తో బాటు ఆడియెన్స్ కూడా ఆ బ్రేకప్ బాగా ఫీలయ్యి బాధపడుతూ వుంటారు. యూత్ అప్పీల్ డైనమిక్స్. ముగింపు సీను మాత్రం నిఖిల్ కి ఆణిముత్యం లాంటిది.
        
అనుపమ గ్లామర్, నటన కూడా విజువల్స్ కి వన్నె తెస్తాయి. మంచి నటి. పాత్ర కూడా మంచిదే, కాకపోతే కథకుడు సరిగ్గా నడపలేదు. తాత ఎటు పోయాడో, నాయనమ్మ ఎటు పోయిందో కూడా పట్టనట్టు వుంటుంది. తర్వాత నిఖిల్ కొలీగ్ భాగ్యగా తెలంగాణా క్యారక్టర్ వేసిన ఆర్టిస్టు చెప్పుకోదగ్గది.
        
చాలా హైలైట్ ఏమిటంటే గోపీ సుందర్ సంగీతంలోని పాటలు, వాటికి కెమెరామాన్ వసంత్ చిత్రీకరణ, శ్రీకాంత్ విస్సా మాటలు. మాటలు లేని ముగింపు సన్నివేశం దర్శకుడు సూర్యప్రతాప్ మేధస్సుకి అద్దం పడుతుంది. ఏ ప్రేమ సినిమాలోనూ చూడని ముగింపు దృశ్యం క్లాసిక్ దృశ్యాల లిస్టులో చేరిపోతుంది.
        
చివరిగా, ఏదో వొక ప్రేమ కథలా ఒప్పించే ప్రయత్నం చేస్తూ సాగుతున్న సినిమాని మధ్యకి విరిచి, సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడేసినట్టు, క్రైమ్ కథ తెచ్చి అతికించడంతో, ఒకలా మొదలై ఇంకోలా ముగిసిన సినిమాగా ఇది గుర్తుంటుంది. ముగింపు వెంటాడుతూంటే మాత్రం పోనీలే అని చూసిన అక్రమాల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం. 

—సికిందర్ 

 

Friday, December 23, 2022

1273 : రివ్యూ!


దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
తారాగణం : రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రా లోకేష్, తులసి, రాజశ్రీ నాయర్ తదితరులు
కథ స్క్రీన్ ప్లే మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం : బీమ్స్ సిసిరోలియో ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్స్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

నిర్మాతలు : టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్  
విడుదల : డిసెంబర్ 23, 2022
***
        మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  గత ఖిలాడీ’, రామారావు ఆన్ డ్యూటీ రెండూ ఫ్లాప్ అవడంతో అసహనంగా వున్నారు. మాస్ మహారాజా కావడంతో ఆప్షన్స్ ఎక్కువ వుండవు. అవే మాస్ సినిమాలు అలాగే నటించాలి. ఈడియట్ నాటి ముద్రపడిన క్యారక్టరైజేషన్, యాక్టింగ్ కొనసాగిస్తూ పోవాలి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఇమేజి చట్రంలో ఇరుక్కున్నాడని అనుకునే వాళ్ళు. ఇదే పరిస్థితి రవితేజది. కాబట్టి ఇప్పుడు తాజా ధమాకా ని వేరే ఆశలేం పెట్టుకోకుండా చూడాలి. ఈసారి అలా చూస్తే ఎలా వుంటుంది? ఫ్యాన్స్ కి ఓకేనా? దర్శకుడు నక్కిన త్రినాధరావు మాస్ మహారాజాకి హిట్ ఇచ్చినట్టేనా? ఇవి తెలుసుకుందాం...

కథ  
వైజాగ్ లో నంద గోపాల చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) ఓ కంపెనీ బాస్. కంపెనీకి కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ)ని సీఈఓ గా నియమించాలని నిర్ణయిస్తాడు. ఇది నచ్చని కంపెనీలో వ్యతిరేకులు జెపి (జయరాం) తో కలిసి కుట్ర చేస్తారు. జెపికి కొడుకుని సీఈఓ చేయాలని పథకం. ఇంకోవైపు మధ్యతరగతికి చెందిన స్వామి(రవితేజ) వుంటాడు. ఇతడికి తండ్రి వాసుదేవరావు (తనికెళ్ళ భరణి), తల్లి దేవకి (తులసి), చెల్లెలు (రాజశ్రీ నాయర్) వుంటారు. స్వామికి చేస్తున్న ఉద్యోగం పోవడంతో చెల్లెలి పెళ్ళి సమస్య అవుతుంది. ఇతను చెల్లెలి ఫ్రెండ్ పావని (శ్రీలీల) ని ప్రేమిస్తూంటాడు. పావని తండ్రి (రావు రమేష్) కి స్వామి నచ్చడు. దీంతో ఒకేలా వున్న స్వామి, ఆనంద్ లని పరీక్షించి ఎవర్ని చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటుంది. ఇంతలో జెపి కుట్ర అమలుకావడంతో ఆనంద్ ప్రమాదంలో పడతాడు. ఆనంద్ ని కాపాడేందుకు స్వామి రావడంతో జెపి, శ్రీలీల సహా అందరూ వూహించని షాక్ కి లోనవుతారు.
        
ఏమిటా షాక్? దేని గురించి? ఆనంద్, స్వామిలకి సంబంధించిన రహస్యమేమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? జెపి కుట్రని స్వామి ఎలా ఎదుర్కొన్నాడు? అసలు తనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా ధమాకా ఏమిటో చూడాల్సిందే. 

ఎలావుంది కథ 

రవితేజ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ వున్న కథ. లేనిదల్లా కథే. కథ బదులు కామెడీలు, పాటలూ వస్తూంటాయి. ఫ్యాన్స్ అదృష్టం బావుండి మధ్య మధ్యలో వచ్చే కామెడీలూ పాటలూ బావుండడంతో, పాటలకి మాస్ మహారాజా విరగదీసి డాన్సులు చేయడంతో, పక్కన అందమైన శ్రీలీల వుండడంతో ఫుల్ ఖుష్ అవుతారు.  
        
ఫ్యాన్స్ కాని వాళ్ళకి ఇంటర్వెల్లో రవితేజ ద్విపాత్రాభినయానికి సంబంధించి ట్విస్టు రావడంతో, అది మంచి కమర్షియల్ ధమాకాలా అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో ధమాకా ఏమీ వుండదు. చిచ్చుబుడ్డి ఇంటర్వెల్లోనే పేలిపోవడంతో సెకండాఫ్ సైలెంట్ గా వుండిపోతుంది.  సైన్స్ ప్రకారం చూసినా పేలిన చిచ్చుబుడ్డి ప్రకంపన లుంటాయి. కానీ ప్రకంపనలు లేకపోవడంతో విలన్ కూడా వీక్ అయిపోయాడు. ఆ ప్రకంపనలు సెకండాఫ్ లో వుండి వుంటే, మరో చిచ్చుబుడ్డి చివర్లో పేలివుంటే డబుల్ ధమాకాగా వుండేది.

ఫస్టాఫ్ లో స్వామి పాత్రలో రవితేజ ఉద్యోగం పోవడంతో మాస్ తిరుగుళ్ళు తిరగడం, హీరోయిన్ శ్రీలీలని రౌడీల బారినుంచి కాపాడడం, సాంగ్, సాంగ్ తర్వాత శ్రీలీలతో లవ్ ట్రాక్, మరోవైపు కంపెనీ మీద కుట్రతో సీన్లు, ఆనంద్ పాత్రలో రవితేజని స్వామి అనుకుని శ్రీలీల ప్రేమించడం, కన్ఫ్యూజ్ కామెడీ, మరో సాంగ్... ఇలా రెగ్యులర్ టెంప్లెట్ లో కొత్తదనం లేని కథనంతో సాగుతూ, పైన చెప్పుకున్న ధమాకాతో ఇంటర్వెల్ పడుతుంది.

ఇక సెకండాఫ్ లో సమస్యేమిటంటే, ఇంటర్వెల్ ధమాకాతో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం తెలిశాక, సెకండాఫ్ లో ఇక స్వామి పాత్రతోనే నడపాల్సి వచ్చింది. చాలా సింపుల్ గా ఆలోచిస్తే, ద్విపాత్రాభినయం రహస్యం విలన్లకి తెలియకుండా, ప్రేక్షకులకి మాత్రమే తెలిసి వుంటే, సెకండాఫ్ లో ద్విపాత్రాభినయం కంటిన్యూ అయి విలన్లతో కన్ఫ్యూజింగ్ గేమ్ గా కథంటూ వుండేది. ఇలా చేయకపోవడంతో, చేయడానికేమీ లేక, కామెడీలూ పాటలతో భర్తీ చేశారు. ముగింపు కూడా కుదర్లేదు.

నటనలు –సాంకేతికాలు

ఫ్యాన్స్ కి, మాస్ ప్రేక్షకులకి నచ్చే అదే వెటకారం, నటన, కామెడీలతో మార్పులేకుండా ఇమేజి చట్రంలో ఎంటర్ టైన్ చేశాడు రవితేజ. ఇంత పెద్ద స్టార్ కి ఎమోషనల్ బ్యాగేజీ లేని పాత్రచిత్రణ, కథా కథనాలు సరిపెట్టడం కూడా ఇందుకే. రామ్- లక్ష్మణ్, వెంకట్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ అంత హైపర్ నటనతో వున్న రవితేజని అందుకోలేదు. ఒక గ్రౌండ్ లో, ఒక యార్డులో సెట్ చేసిన ఫైట్ సీన్లు మాస్ మహారాజానీ కట్టేశాయి. ఛేజింగ్స్ తో మూవ్ మెంట్లో యాక్షన్ సీన్స్ వుండి వుంటే రవితేజ హైపర్ యాక్షన్ కి జోడు గుర్రంలా వుండేది.
        
అన్ని పాటలకి చేసిన డాన్సులు, రెండు పాత్రలపట్ల చూపిన వేరియేషన్స్ కమర్షియల్ విలువలకి తగ్గట్టున్నాయి. పాత్రల పరంగా కష్టపడి నటించాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్ శ్రీలీల కేవలం ప్రేమ కోసం వుండే గ్లామర్ పాత్ర, నటన. రావురమేష్, పక్కన హైపర్ ఆది చేసే కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. తనికెళ్ళ రొటీనే. కానీ ఫోన్ తీసుకుని ఇంటర్వెల్లో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం ఇతర పాత్రలకి టాంటాం చేయడంతో సెకండాఫ్ విషయం లేకుండా పోయింది. శివ లాంటి సినిమాకి రచయిత అయిన తను- ఇలా చెయ్యకయ్యా బాబూ, సెకండావ్ కొంప కొల్లేరవుతుందని ఈ సినిమా రైటర్ కి చెప్పి వుండాల్సింది.
        
కాస్ట్యూమ్స్, సెట్స్, ఔట్ డోర్స్ ప్రొడక్షన్ విలువలతో అత్యంత రిచ్ గా, కలర్ఫుల్ గా వున్నాయి. కార్తీక్ ఘట్టమేని కెమెరా వర్క్ కనువిందు చేస్తుంది. బీమ్స్ సంగీతంలో పాటలు, నేపథ్య సంగీతం ఇంకో హైలైట్. దర్శకుడు త్రినాధరావు దర్శకత్వం బాగానే వుందిగానీ, ఇంకెన్ని సినిమాలు అవే మూస కథలతో తీస్తారనేది ప్రశ్న.

—సికిందర్