మణిరత్నం కళ్ళకి ఎల్లలు లేవు. అనంతమైన సృజన సీమ
కనబడుతుంది ఎదరంతా... ముంబాయి నేరమయ
జగత్తు- దాని అధినాయకుడు, తమిళ సినీ రాజకీయ రంగాలు- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, శ్రీలంక
అంతర్యుద్ధం-అందులో పసి బాలిక జీవితం, కాశ్మీర్ తీవ్రవాదం- ఎదురులేని దేశభక్తి,
ఈశాన్య రాష్ట్రాల సంక్షోభం- అనంతమైన ప్రేమ శక్తి, హిందూ ముస్లిం కల్లోలం- దగాపడ్డ
జీవితాలు, పార్లమెంటరీ వ్యవస్థ - యువ నాయకత్వం, కార్పొరేట్ రంగం- కరకు నిజాలు, మహాభారతం- పురాణ పాత్రల పునఃసృష్టి, రామాయణం-
దుష్ట పాత్ర సమకాలీనం... ఇలా కొత్త కొత్త
సీమలు తన చలచిత్ర రాజాలకి రసమయ పోషకాలు.
ఒక వరసలో ఇదంతా ఇండియన్ ఫైలాసఫీయే. దటీజ్ కాల్డ్ భారతీయాత్మ. స్నేహ సౌభాతృత్వాల,
వినోద విజ్ఞానాల నిర్వచనాల సమ్మేళనాలు...
మణిరత్నం సృజనాత్మక శక్తి దాని పరిధిని ఎక్కడ్నించి ఎక్కడిదాకా విస్తరించుకుందో పై పేరా చెబుతుంది. నడిచిన, నడుస్తున్న చరిత్రని పక్కనబెట్టి సినిమా తీయడం అతడికి చేతగాదు. ఎవరైనా ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమాలే తాము తీస్తున్నామని చెప్పుకుంటే, అది శుద్ధ అబద్ధమంటాడు అకిరా కురసావా. అలా తీసి మెప్పించిన వాళ్ళు ఈ భూమ్మీద లేరంటాడు. దర్శకుడు తానుగా నమ్మి ఫీలై, తనకోసం తీసుకున్న సినిమాలే ప్రేక్షకుల్లో కొత్త ఎవేర్నెస్ ని కలిగించి నిలబడ్డాయంటాడు. మిగిలినవన్నీ చెత్త బుట్ట దాఖలయ్యా యంటాడు.
మణిరత్నం ఫీలయ్యాడంటే అది తమిళమా, తెలుగా, హిందీయా, సింహళమా చూడడు. ఎక్కడ ఏ చరిత్ర పుడితే అక్కడికి సాగిపోతాడు. తన కాల్పనిక కళా జగత్తులో మొదలంటా దాన్ని ఇమిడ్చేస్తాడు. ఒక బలమైన, రసవత్తరమైన డాక్యు డ్రామాగా మార్చేస్తాడు. చెన్నై నుంచీ చెచెన్యా దాకా ప్రేక్షక లోకం దాసోహ మవ్వాల్సిందే. టైం మ్యాగజైన్ కూడా పట్టించుకుని 100 అత్యుత్తమ చలన చిత్రాల పట్టికలో చేర్చాల్సిందే. భారత ప్రభుత్వ, తమిళనాడు- ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలేకాదు, ఫిలిం ఫేర్, ఎడిన్ బర్గ్, బెర్లిన్, జెరూసలెం, లాస్ ఏంజిలిస్, జింబాబ్వే, వెస్ట్ చెస్టర్, మాంచెస్టర్ గీంచెస్టర్ మొదలైన సవాలక్ష అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డుల కుంభవృష్టి కురవాల్సిందే. మిచిగాన్ యూనివర్సిటీ, ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లు తమతమ సిలబస్సుల్లో పాఠాలు రాసుకోవాల్సిందే.
సత్యజిత్
రే తర్వాత ఇంతలా భారతీయాత్మని ఆవిష్కరిస్తున్న దర్శకుడు తనే. ఎవర్ని ఆదర్శంగా తీసుకుని
సినిమా తీసినా, అంతిమంగా అందులో
భారతీయాత్మ ప్రతిబింబించక పోతే అస్సలొప్పుకోదు అంతర్జాతీయ సమాజం. కురసావాని మణిరత్నం ఆదర్శంగా
తీసుకున్నప్పుడు, ఇతరుల్లా ఇండియన్ సినిమా అంటే పొడి పొడి ఫారిన్ పోకడల
పేకాటగా మార్చెయ్యలేదు. ఈ పేకాటలోనే పడి కొట్టుకు పోతున్న యువదర్శకులు మణిరత్నంని ఆదర్శంగా
తీసుకుంటున్నదీ లేదు. మణిరత్నం తర్వాత మహా శూన్యం ఏర్పడే ప్రమాదం మాత్రం పొంచి
వుంది.
కురసావా మీద అచ్చయిన ఒక పుస్తకంలో, ‘కురసావా తాను రాజకీయ తత్త్వపు దర్శకుడిగా కాక, సామాజిక తత్త్వం గల దర్శకుడిగానే వుండిపోవడాని కిష్టపడతాడు’ అన్న వాక్య ముంటుంది. నిజమే, రాజకీయ తత్త్వమేమిటి? అదెక్కడ ప్రజా సమస్యల్ని నిష్పాక్షిక దృష్టితో చూస్తుందని? ఇందుకే మణిరత్నం కురసావాని ఆదర్శంగా తీసుకున్నాడు. ప్రజాసమస్యల పట్ల నిష్పాక్షిక దృష్టితో చూసే సామాజిక తత్త్వాన్ని గొప్ప మానవతా వాదంతో అలవర్చుకుని నిండుగా కన్పిస్తాడు. ఒక సారెప్పుడో ‘బొంబాయి’ తీసినప్పుడు అందులో పక్షపాతం చూపించుకుని వివాదాస్పదుడు కావడం, మరోసారి ‘గురు’ లో అవినీతికి పట్టంగట్టి హాస్యాస్పదం కావడమూ వంటి ఒకటీ రెండూ తప్పడుగుల్లేక పోలేదు.
విశాల
ప్రాతిపదికన ‘నాయకుడు’, ‘రోజా’, ‘బొంబాయి’,
‘దళపతి’, ‘దిల్సే’, ‘ఇద్దరు’, ‘అమృత’, ‘యువ’, ‘గురు’ ల్లాంటి ప్రబోధాత్మకాలు తీస్తూనే,
మళ్ళీ ‘ఘర్షణ’, ‘దొంగా దొంగా’, ‘మౌన రాగం’, ‘సఖి’, ‘గీతాంజలి’...వంటి గిలిగింతలు
కూడా పెడుతూ గిరికీలు కొట్టాడు. ఇక్కడ కూడా తన గట్ ఫీలింగ్స్ నే నమ్మాడు. మనం
వుంటాం, మన ప్రేయసి మీద మనం కవిత్వాలు రాసుకుంటే ఇతరులకి భేషుగ్గా వుంటుంది, అదే
ఇతరుల ప్రేయసుల మీద రాస్తే వీపు వాచిపోతుంది. సృజనాత్మకత ఎప్పుడూ పర్సనల్ గోడు. ‘గీతాంజలి’
ని సృజియిం చినప్పుడు అది మణిరత్నం పర్సనల్ గోడు. ఇందుకే అందరికీ- అంతమందికీ అంత బాగా
నచ్చింది.
తెలుగులో మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక మణిరత్నం ‘గీతాంజలి’. కాస్త తమిళ వాసనలు వేసినా మొత్తంగా ఇది దృశ్య వైభవాల సంగీత సౌరభం. 1989 లో ‘శివ’ తర్వాత నాగార్జున కిది మరో సంచలనాత్మక విజయం. ఆనాడే కాదు, రెండు దశాబ్దాల తర్వాతా దీనిది కాలదోషం పట్టని మనసులో మాట. శాశ్వత సత్యాలకి కాలదోషం పట్టదు. కాకపోతే పట్టించుకునే నాథులే తక్కువ. నిన్నంటూ చేజారిపోయి, రేపనేది చేతుల్లో లేకపోయాక, మిగిలేది ఈ రోజు అనే వర్తమానమే. దీన్నెలా గడిపామన్న దానిపైనే అంత్యకాలపు తృప్తి ఆధారరపడుతుంది. ఒక టీవీ ఛానెల్లో 2012 లో అప్పట్లో రాబోయే (?) ప్రళయం గురించి చర్చ పెడితే, చాలామంది ఇక జీవితంలో ఏం సాధించి ఏం లాభమనే నైరాశ్యాన్నే ప్రకటించారు. వాళ్లకి ‘ గీతాంజలి’ చూపించాలి. ఇప్పుడు మరణం ఖాయమైపోయిన ఎయిడ్స్ రోగులు కోకొల్లలుగా కన్పిస్తారు. వాళ్ళకీ ‘గీతాంజలి’ ఇచ్చే మెసేజ్ తో నమ్మకం కల్గించాలి.
ఏదో
నయంకాని గుండె జబ్బు, ఇంకో మూలగ క్యాన్సరూ అన్నవి ‘గీతాంజలి’ లో కేవలం మనల్ని
ఎప్పుడైనా చుట్టు ముట్టే అవకాశమున్న అరిష్టాలకి వాడుకున్న సింబల్సే. కాలంతోపాటు ఈ
అరిష్టాల రూపాలు మారవచ్చు. వాటికి మనమెలా రెస్పాండ్ అవ్వాలన్నది ‘గీతాంజలి’ ని
చూసి అర్ధం జేసుకోకపోతే ఈ జన్మ దండగ.
హ్యాపీగా గడపాలని కమిటైతే పచ్చిక బయళ్ళైనా, స్మశానవాటికలైనా ఒకటేనని, అల్లరల్లరిగా తిరిగే గీతాంజలి వైఖరి లోనే చెప్పాలనుకున్న విషయమంతా వుంది. స్మశానం లో సమాధులు భయాలకి గుర్తులు. సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పినట్టూ, ఈ భయాలనేవి కలుపు మొక్కల్లాంటివి. వాటికవే పెరిగిపోతాయి. పోషణా సంరక్షణా వాటికక్కర్లేదు. అలాటి వాటిని పీకి అవతల పడెయ్యడానికి ప్రయత్నించం సరికదా, ఎంతో ఆశపడి వాటిమధ్య నాటుకున్న ఆశయమనే గింజ మొలకెత్తి మహావృక్ష మయ్యేందుకూ శ్రమించం. గీతాంజలిని చూస్తే, తాను మరణిస్తున్నానని తెలిసీ, ఆ మరణమనే సమాధుల మధ్య అపరాత్రైనా తను నాటిన సంతోషాల మొక్కనే, ఆటా పాటగా పోషించుకుంటూ, వున్న జీవితాన్ని దిలాసాగా ఎంజాయ్ చేసేస్తోంది!
ఈ బ్యాక్ డ్రాప్ లోకి వస్తాడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున). సిటీలో వుండే ఇతను తనకి నయంకాని మూలగ క్యాన్సర్ సోకిందని తెలుసుకుని, శేష జీవితాన్ని శాంతంగా గడిపేందుకు ఊటీ వస్తాడు. ఇక్కడ గీతాంజలిని వైఖరిని చూశాక తనకి కొత్తలోకాలు తెర్చుకుంటాయి- ‘రేపటి గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం, ఇలాగే వుంటాను’ అనే ఈమె స్పోర్టివ్ నెస్ తో ఇక పోటీపడక తప్పని స్థితి. తీరా తను ఎప్పటి చలాకీ మనిషిగా మారేక, చూస్తే ఏముంది- ఆమె గుట్టంతా బయటపడింది! ఆమె గుండె కాయని మృత్యువు కబళించి వుంది...
రివర్స్
లో తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ అతడి గుట్టు కూడా ఈమెకి తెలిసిపోయి, పెద్ద
దుమారమే రేపుతుంది. నువ్వొద్దు వెళ్లిపొమ్మంటుంది. నువ్వెక్కడో బతికే వున్నావన్న ఆశతో
తృప్తిగా చనిపోతానంటుంది. తర్వాత్తర్వాత చూస్తే,
నీ చేతుల్లోనే చనిపోతానంటుంది. పుని స్త్రీగా తనువు చాలించాలనే ఇండియన్ సెంటిమెంటుని
ప్లే చేశా డిక్కడ మణిరత్నం- ‘రోజా’ లో సతీ అనసూయ సెంటిమెంటులాగే. ఎత్తుకున్న కథ ప్రకారమైతే
వీళ్ళిద్దరూ చనిపోవాలి. ఈ నమ్మకంతోనే ప్రేక్షకుల్ని వుంచుతాడు మణిరత్నం. కానీ ప్రేక్షకులు
అలా నమ్మినట్టుగానే ముగిస్తే అది తను ఫీలైన సినిమా ఎలా అవుతుంది? అందుకని ఆ స్టోరీ
క్లయిమాక్స్ ని మూసేశాడు. ప్లాట్ క్లయిమాక్స్ ని పైకి లాగాడు. వాళ్ళిద్దర్నీ నిక్షేపంలా
వుంచి, ఎప్పుడు ఈ లోకం వీడి పోతారో తెలీదనీ, కానీ అప్పటిదాకా ఇలా కలిసే జీవిస్తారనీ
చెప్పి ముగిస్తాడు.
సంతోషాలకే కాదు, ఆ సంతోషాల్ని కల్లోలపర్చే గాయపడ్డ ప్రేమలకి కూడా కట్టుబడి వుండాలని పరోక్షంగా చెప్పే మణిరత్నం ఎక్కడా అతికి పోడు. నటనలు, మాటలు, సెంటిమెంట్లూ చాలా మితంగానే వుంటాయి. డబ్బింగ్ కింగ్ రాజశ్రీ మాటలు రాశారు. ఊటీ అందాలూ, వీటికి పిసి శ్రీరాం హై పవర్ ఛాయాగ్రహణమూ విషయాన్నిడామినేట్ చేస్తు నట్టు వున్నా- కథా బలం, పాత్రల బలం కలిసి దానికి మ్యాచ్ అవడంతో, రసాస్వాదనకి అడ్డంకిగా వుండవు. పాత్రల్లో నాగర్జున, గిరిజలు ఆ పాత్రలకోసమే పుట్టినట్టుంటారు. నాగార్జున తల్లి దండ్రులుగా సుమిత్ర, విజయ్ చందర్ లు, నానమ్మగా రాధాబాయి కన్పిస్తారు. సినిమా ప్రారంభంలో యూనివర్సిటీ ఛాన్సెలర్ గా సీనియర్ నటి షావుకారు జానకి కన్పిస్తారు.
ఇక
సుత్తి వేలు- డిస్కో శాంతిల కామెడీ ట్రాకు మాత్రం మణిరత్నాన్ని చూసి నవ్వా లన్పించేలా
వుంటుంది. ఈ ఫెయిలైన కామెడీని ఇప్పుడు సీడీల నుంచి తొలగించి మంచి పనే చేశారు.
భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లో సి ఎల్ నరసారెడ్డి నిర్మించిన ఈ ప్రేమకావ్యానికి అందిన బహుమతులెన్నో. రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులు ఏడు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక కథా చిత్రంగా జాతీయ అవార్డు ఒకటి లభించింది. తమిళ, మళయాళ భాషల్లో అనువాదమై హిట్టయ్యింది. హిందీలో మాత్రం దీపక్ ఆనంద్ ‘యాద్ రఖేగీ దునియా’ గా ఫ్రీమేకు చేస్తే ఫ్లాపయ్యింది.
ఇప్పుడు సంగీతం విషయానికొద్దాం. వేటూరి- ఇళయరాజా- బాలసుబ్రహ్మణ్యం- జానకి- చిత్ర బృందం కలిసి సృష్టించిన ఈ మ్యూజికల్ జగత్తంతా ఆచంద్ర తారార్కమనాలి. ప్రతీపాటా స్వీట్ హిట్టే. అందులో ‘ఓం నమః’ అనే పాట చిత్రీకరణకి ప్రయోగం చేశాడు మణిరత్నం. నాగార్జున -గిరిజలని నించున్న చోటే నించో బెట్టి రౌండ్ ట్రాలీ వేసి సింగిల్ షాట్ గా తీసిన క్రియేటివిటీ చాలా సంచలనం. ఇప్పుడు చూస్తే యూ ట్యూబ్ లో ‘వేరీజ్ మై మనీ’, ‘రష్యన్ ఆర్క్’ లలాంటి సింగిల్ షాట్ సినిమాలు కన్పిస్తాయి- కానీ ఈ రెండున్నర నిమిషాలకి మించవివి!