రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, July 12, 2016

సాంకేతికం!

Add caption
     ఇవ్వాళ్ళ  ఫ్యాషన్ టెక్నాలజీ క్యాట్ వాక్ లతో వొయ్యారాలు పోతూ ఎలక్ట్రానిక్  మీడియాని కూడా ఎంటర్ టైన్ చేస్తోంది. అది దానికదే ఒక కొత్త పరిశ్రమగా మనగల్గితే మంచిదే. కానీ సినిమా రంగంలో కూడా జొరబడి కాస్ట్యూమర్ల వృత్తినే ప్రశ్నార్ధకం చేయడం ప్రారంభమైంది. ఫ్యాషన్ డిజైనర్  కోర్సులు చేసి నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, దివినుంచి దిగివచ్చిన అద్భుత వ్యక్తులుగా కన్పించి అంతలోనే అదృశ్య మైపోతున్నారు. ఈ కాస్తా హనీమూన్ చాలు కాస్ట్యూమర్లకి చుక్కలు చూపించడానికి. ఇలా ప్రాక్టికల్ అనుభవం లేకుండా డిజైన్లు  సజెస్ట్ చేసే కన్సల్టెంట్స్ లా చెలామణి కావడం ఫ్యాషన్ డిజైనర్ల వృత్తికే కాకుండా, కాస్ట్యూమర్ల  భృతికీ మంచిది కాదనే వాళ్ళూ వున్నారు. అలాటి వాళ్ళల్లో పిల్లా రవికుమార్ ఒకరు. ఈయన ఇంకో గమ్మత్తు చెప్పారు -

      ‘హీరోలకి పబ్స్ లో పరిచయమై స్నేహాలు పెంచుకుంటున్న కొందరు హఠాత్తుగా ఓ రోజున ఆ హీరోలకే కాస్ట్యూమర్లుగా అవతారమెత్తేస్తున్నారు. దీనికి వాళ్ళు స్టైలిష్ గా పెట్టుకున్న పేరు ‘స్టయిలిస్ట్’ అని!” 

        దట్సిట్. అంటే కాస్ట్యూమర్లూ కనుమరుగవుతున్నారు, ఫ్యాషన్ డిజైనర్లూ అదృశ్యమవుతున్నారు... ఇక స్టయిలిస్ట్ ల కాలం వచ్చేసిందన్న మాట!

        అసలు చరిత్రలో మొట్ట మొదటి కాస్ట్యూమర్ ఎవరని అడిగితే -  సినిమా,  దానికంటే ముందు నాటకం, దానికీ ముందు నాట్యమూ ఉండేవన్నారు. అయితే నాట్యం దగ్గర్నుంచే మొట్ట మొదటి కాస్ట్యూమర్  పుట్టాడా అంటే కాదన్నారు రవికుమార్.  కొంత తర్జన భర్జన జరిగాక, మరింకా పూర్వ కాలంలో తోలుబొమ్మలాటల దగ్గర తొలి కాస్ట్యూమర్  పుట్టాడన్నారు. రిఫరెన్సులు కూడా లేని నాటి పురాతన కాలంలో పురాణ పాత్రలకి  పకడ్బందీగా వూహించి ఆహార్యం నిర్ణయించినవాడే చరిత్రలో మొట్ట మొదటి కాస్ట్యూమర్ అని తేల్చారు రవికుమార్! 

        అలాగే తెలుగు కాస్ట్యూమర్లు  పిఠాపురం నుంచే వెళ్ళారని ఇంకో రహస్యం విప్పారు. అప్పట్లో పిఠాపురం రాజావారు మద్రాసు సినిమా కంపెనీలకి దర్జీలని - అంటే- టైలర్స్ ని వెంట బెట్టు కెళ్ళి ‘వీడు కుడతాడు, వీణ్ణి కాస్ట్యూమర్ గా పెట్టుకో!’  -  అని హుకూం జారీ చేసే వారన్నారు రవికుమార్. 

        రవికుమార్ పిఠాపురం వాసియే. అయితే రాజా వారితో ఏ సంబంధమూ లేదు. రాజావారి హయాం తర్వాత 1995 లో హైదరాబాద్ చేరుకుని ‘మేజర్ చంద్ర కాంత్’ కి కాస్ట్యూమ్స్  అసిస్టెంట్ గా పనిచేశారు. రెండేళ్ళు తిరిగేసరి కల్లా 1997 లో ‘ప్రేమించుకుందాం రా’ కి కాస్ట్యూమర్ గా ప్రమోటయి, హీరో వెంకటేష్ కి పర్సనల్ కాస్ట్యూమర్  గా ఎనిమిదేళ్ళూ  కొనసాగారు. ‘మనసంతా నువ్వే’ నుంచీ  ఎంఎస్ రాజు అన్ని సినిమాలకీ, ‘ఆర్య’ నుంచీ దిల్ రాజు అన్ని సినిమాలకీ, పూరీ జగన్నాథ్ తో అనేక సినిమాలకీ పని చేస్తూ వస్తున్నారు.  

        అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయనీ బాధ పడ్డారు. స్టార్లు బ్రాండ్ల మీద  మోజు పెంచుకుని విదేశాలనుంచి కాస్ట్యూమ్స్ తెప్పించుకోవడం, ఇద్దరు ముగ్గురు ప్రముఖ దర్శకుల భార్యలు కాస్ట్యూమ్స్ డిజైనర్లుగా రంగ ప్రవేశం చేయడం, దీనికి తోడు  కొత్తగా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు చేసిన ఔత్సాహికుల సందడీ, మళ్ళీ వీటికి తోడూ పాటలకి ప్యాకేజీ  పద్ధతీ, వచ్చేసి చాలా స్ట్రగుల్ చేస్తున్నామన్నారు.

        ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ లాంటి వారికి పాటల ప్యాకేజీ ఇవ్వడంతో, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే రూపొందిస్తున్నారని అన్నారు రవికుమార్.

        ‘మన కల్చర్ వేరే కల్చర్ చేతుల్లోకి వెళ్లిపోయాక జరుగుతున్న పరిణామాలివి. మన కల్చర్ లో వుంటే ట్రేడిషనల్ గా మన కాస్ట్యూమ్స్ వుంటాయి. శేఖర్ కమ్ముల, వంశీ లాంటి దర్శకులు ట్రేడిషన్ ని  కాపాడుతున్నారనాలి’ అని అభిప్రాయపడ్డారు.

        ప్రధానంగా స్టార్ల కాస్ట్యూమ్స్  ప్రేక్షకుల దృష్టి నాకర్షిం చాలంటే  వాళ్ళు పోషించే క్యారక్టర్లు బావుండాలన్నారు రవికుమార్. ‘ఆరెంజ్’ లో రాం చరణ్ అంత  మంచి దుస్తులు ధరించినా ఆ పాత్ర బావుండక పోవడం వల్ల  ప్రేక్షకులు ఆ కాస్ట్యూమ్స్ నీ పట్టించుకో లేదన్నారు. ‘బృందావనం’ లో కాజల్ అగర్వాల్ పోషించిన సాంప్రదాయ పాత్రకి కుట్టిన హాఫ్ శారీలు  మంచి క్రేజ్ సృష్టించాయన్నారు. రిఫరెన్స్ లేకుండా కాస్ట్యూమ్స్ తయారు చేయలేమనీ, రిఫరెన్సుల్ని మోడిఫై చేసి మల్చుకుంటామనీ కొన్ని నమూనాల్ని లాప్ టాప్ లో చూపించారు. 

        కాస్ట్యూమ్స్ పాత్రల  బయోడేటాయేనని వివరిస్తూ, ‘బొమ్మరిల్లు’ లో పాత్రలకి తగ్గట్టుగా అతి లేకుండా తాను డిజైన్ చేసిన సింపుల్ దుస్తుల గురించి సభల్లో కూడా గొప్పగా చెప్పుకున్నారని సంతోష పడ్డారు. 

        మరి ఆ సభల్లో మీ పేరు కూడా ప్రస్తావించే వాళ్ళా అనడిగినప్పుడు- లేదన్నారు బాధగా. దటీజ్ ది  ప్రాబ్లం. కాస్ట్యూమర్లు, మేకప్ మాన్ లులాంటి కళాకారుల్ని కూడా సభలు పెట్టి ఎందుకు సన్మానించరని  అడిగితే, విషాదంగా నవ్వి వూరుకున్నారు రవికుమార్. 

        ఇక దర్శకుడుగా మారబోతున్నాడు తను. ఈ సడెన్ టర్నింగ్ ఎందు కిచ్చుకున్నారంటే, అసలు 1995 లో వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని- పరిస్థితుల కారణంగా ఇలా అయిపోయానన్నారు. లాప్ టాప్ లో ఇంగ్లీషులో సిద్ధం చేసుకున్న స్క్రిప్టు, నోటు పుస్తకాల్లో మంచి చేతి వ్రాతతో ఇంగ్లీషులోనే రాసుకున్న నోట్సూ చూపించారు. ఇక్కడ ఒకటి అర్ధమైంది. ఎవరైనా ఆసక్తి పెంచుకున్న రంగంలో ఢక్కా మొక్కీలు ఎన్నైనా తింటూ అలాగే కొనసాగగల్గితే, విద్యార్హతలతో సంబంధం లేకుండా భాష లొచ్చేస్తాయేమో నన్పిస్తుంది టెన్త్  వరకే చదివిన రవికుమార్ ని చూస్తే!

-సికిందర్
(ఏప్రెల్ 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక)