దర్శకత్వం : బాబా అజ్మీ
తారాగణం : అదితీ సుబేదీ, డానీష్ హుస్సేన్,
శ్రద్ధా కౌల్, రాకేశ్ చతుర్వేది
రచన : హుస్సేన్ మీర్, సఫ్దర్ మీర్;
సంగీతం : రిపుల్ శర్మ, ఛాయాగ్రహణం : మోహిసిన్ ఖాన్ పఠాన్
నిర్మాత : బాబా అజ్మీ
విడుదల : జీ 5
*** (మళ్ళీ
తిరిగొచ్చాం. ఒక స్క్రిప్టు వర్కు గొంతు మీద వుంటే అంకితమై కూర్చున్నాం. ఎటూ
వెళ్ళే పని లేకుండా ఫోన్ చర్చల్తో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ వర్కే అయినా, ఈ సౌకర్యంతో ఒక్కోసారి మల్టీ టాస్కింగ్ కూడా కష్టమైపోతోంది. ఈ రెండు నెలల్లో
ఆన్లైన్లో మూడింట్లో ఒకటి షూటింగ్
స్క్రిప్టు పూర్తి. ఈ కరోనా కాలపు మారిన ఈ తరహా రిమోట్ రైటింగ్ అనుభవాల గురించి చెప్పుకుంటే
ఆత్మకథ రాసుకున్నట్టవుతుంది. ఉన్నబయో కిక్కులు చాలు. ఇలా కాస్త వీలు చిక్కించుకుని
అనాధలా మారిన బ్లాగుకి తిరిగొచ్చినందుకు సంతోషిద్దాం ...)
నార్త్ లో మెయిన్ స్ట్రీమ్
మీడియా, సోషల్ మీడియా రెండూ రోజువారీ కార్యక్రమంగా జాతీయ
సమగ్రతని ముక్కలు చేయడంలో ఎదురులేని బ్రాండ్ అంబాసిడర్లమని ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్న వేళ - ఓ సినిమా ఇది మతం కాదు, మతంతో
మౌఢ్యమంటూ ముందుకొస్తే అది సామరస్యానికి ఏ మాత్రం గాయం మాన్పే మందు? ఓ హిందీ ఛానెల్లో - ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో ముస్లిములు చొరబాటు దార్లుగా మారారని, ఇదెలా జరుగుతోందని- ఇది ‘బ్యూరోక్రసీ జిహాద్’ అనీ కొత్తగా పేరొకటి తగిలించి -కార్యక్రమం శుక్రవారం (అంటే ఈ రోజు) రాత్రి
ప్రసారం చేస్తామని ఎగిరెగిరి ప్రకటిస్తున్నాడు. మొన్నే బాంబే హైకోర్టు మీడియా చేసిన
‘కరోనా జిహాద్’ ప్రచారం వొట్టి బూటకమని
మొట్టి కాయేసి తీర్పు చెప్పినా విద్యా బుద్ధులు అబ్బేలా లేదు. ఇలాటి భావదారిద్ర్యపు
మీడియా ప్రభావిత ప్రజానీకంలో ఇంకా సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమంగా మిగిలి
వుందా? ఇదలా వుంచితే, ఇప్పుడున్న
పరిస్థితుల్లో ఒక ముస్లిం కుటుంబపు కథతో సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా? గత జులైలో మలయాళంలో ‘సూఫీయుమ్ సుజాతాయుమ్’, ‘ఖుదా హాఫీజ్’ టైటిల్ తో
హిందీ, ఇప్పుడు ‘మీ రఖ్సమ్’ అనే ఇంకో హిందీ వచ్చాయి. ఐతే లేటు వయసులో దర్శకుడుగా మారిన ప్రసిద్ధ
ఛాయాగ్రాహకుడు బాబా అజ్మీ, ఇప్పుడనుకుని తీసిన సినిమా కాదిది, పదేళ్ళ పాత కల. తండ్రి అయిన సుప్రసిద్ధ అభ్యుదయ కవి, బాలీవుడ్ గీత రచయిత కైఫీ అజ్మీకి నివాళిగా దీన్ని అర్పించాడు.
హైదరాబాద్ మూలాలున్న బాబా
అజ్మీ, ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఇషాన్ ఆర్యకి
అసిస్టెంట్ గా పనిచేశాడు. హైదారాబాద్ మూలాలే వున్న బాబా అజ్మీ కజిన్ ఇషాన్ ఆర్య, బాపు తీసిన ‘ముత్యాల ముగ్గు’ కి
ఛాయాగ్రహణం సమకూర్చాడు. ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాలకి ఆర్య దగ్గర అజ్మీ
పనిచేసి, బాలీవుడ్లో ‘మిస్టర్ ఇండియా’, ‘తేజాబ్’, ‘దిల్’ వంటి ప్రసిద్ధ సినిమాలకి ఛాయాగ్రాహకుడయ్యాడు.
‘మీ రఖ్సమ్’ (I Dance) తో నాట్యానికి మతం లేదని, మత మౌఢ్యమే
సంకెళ్ళని చెప్పదల్చాడు. పాత విషయమే. కళా రంగానికి సంబంధించిన ఈ పాత విషయమే కళా
రంగానికే కాకుండా, అన్య రంగాలకీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
చేరుతుందా అనేది నార్త్విష మీడియా చేతుల్లో వుంది.
‘నీకు సమాజం ఉపాధి
నిచ్చింది, నువ్వు సమాజానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే సమాజం నీ ఉపాధిని తీసేసుకుంటుంది’ అని ఈ సినిమాలో మత పెద్ద టైలర్ ని హెచ్చరిస్తాడు. స్వార్ధపు మాటలిలాగే వుంటాయి.
సమాజం కలిసి వుండడానికి మతమా ఆధారం, విత్తమా? విత్తమే సమాజపు,
దేశపు మూలాధారం, భాండాగారం. పెత్తందార్లు కులమతాలుగా సమాజాన్ని
విడగొట్టి, ఆర్ధిక రంగం నడ్డి విరిచేస్తారు. మత పిచ్చితో ధనలక్ష్మితో
రుద్ర తాండవమాడతారు.
ఉపాధినిచ్చే
సమాజం ఆత్మహత్యా సదృశంగా ఉపాధిని తీసేసుకోదు, తీసేసుకునేలా
మత మౌఢ్యం చేస్తుంది. కానీ కడుపాకలి తెలిసిన సమాజం విత్తం కోసం మౌఢ్యం నుంచి భావ
స్వాతంత్రాన్ని కోరుకుంటుంది. ఇది పవర్ఫుల్ ఆయుధం. మౌఢ్యం ఉపాధిని తీసేస్తే, భావ స్వాతంత్ర్యం ఉపాధిని కల్పిస్తుంది. ఒక ముస్లిం బాలిక భరత నాట్యం
నేర్చుకోవాలనుకోవడం ఆమె భావస్వాతంత్ర్యం. మతంతో సంబంధం లేదు. కళలనేవి సాంస్కృతిక వ్యక్తీకరణలు. ఐతే ఈ ముస్లిం సినిమాలో కోరుతున్నట్టు, మౌఢ్యం నుంచి ఈ భావస్వాతంత్ర్యపు
స్పృహ ఇప్పుడున్న పరిస్థితుల్లో నార్త్ లో యువతకి ఎంత వరకుంటుందన్నది ప్రశ్న. ఇది మెజారిటీ
మతపు ఏ సూపర్ స్టార్ సినిమానో చేయాల్సిన ప్రయత్నమేమో ఒకవేళ.
ఇలా
మౌఢ్యం వల్ల నాట్యకళే కాకుండా దాని చుట్టూ
ఇంకెన్ని జీవిత పార్శ్వాలు నేల రాలతాయో ఒక సమగ్ర దర్శనం చేయడానికి ప్రయత్నించాడు. ఇదెలా
వుందో తెలుసుకోవడానికి ముందు కథలో కెళ్దాం...
కథ
ఉత్తరప్రదేశ్ లోని మీజ్వాన్ లో సలీం
(డానీష్ హుస్సేన్) టైలర్ పని చేస్తాడు. భార్య సకినా భరత నాట్యాభిలాషని కూతురి
ద్వారా తీర్చుకోవాలని నాట్యం నేర్పుతూ హఠాన్మరణం చెందుతుంది. పదిహేనేళ్ళ స్కూలు
బాలిక మరియం (అదితీ సుబేదీ) ఎలాగైనా తల్లి కోరిక తీర్చాలని సంకల్పించుకుంటుంది.
తెలియకుండానే తల్లి పూనినట్టు నాట్యభంగిమలు పురులు విప్పు కుంటూంటాయి. తండ్రి సలీం
ప్రోత్సహిస్తాడు. ఇది తెలుసుకున్న అతడి మరదలు జెహ్రా (శ్రద్ధా కౌల్), ఆమె తల్లి (ఫరూక్ జాఫర్) తీవ్రంగా మందలిస్తారు. ‘అది
దేవదాసీల నాట్యం, దాంతో పిల్లని వేశ్యలా ఆడిస్తావా?’ అని అడ్డుపడతారు. వినకుండా మరియంని తీసికెళ్ళి డాన్స్
అకాడెమీలో చేర్పిస్తాడు సలీం.
డాన్స్ టీచర్ (సుదీప్తా సింగ్)
మరియం ప్రావీణ్యం చూసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అయితే డాన్స్ అకాడెమీ ఓనర్
జై ప్రకాష్ (రాకేష్ చతుర్వేదీ ఓం) కిది నచ్చదు. అతడికే కాదు,
ఇంకా చాలా మందికి నచ్చదు. మరదలు జెహ్రా కుటుంబం సహా బంధువర్గం తెగతెంపులు
చేసుకుంటారు. స్థానిక ముస్లిములకి పెద్ద మనిషైన హాషీం సేట్ (నసీరుద్దీన్ షా) తీవ్ర
పరిణామాలుంటాయని హెచ్చరిస్తాడు. మసీదు మౌలానా నిర్ణయం మార్చుకొమ్మని అల్టిమేటం
ఇస్తాడు. ‘పిల్ల డాన్స్ నేర్చినంత మాత్రాన అవమాన పడేంత
బలహీనమైనది కాదు ఇస్లాం’ అని సలీం కూతురికి మద్దతుగా
వుంటాడు. మసీదులో అతడి ప్రవేశం నిషేధిస్తారు. బట్టలు కుట్టించుకుంటున్న కస్టమర్లు
బట్టలు వాపసు తీసుకుంటారు. ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడతాడు. అప్పిచ్చే వాళ్లుండరు.
మాట్లాడే వాళ్ళే వుండరు. ఒంటరి అయిపోతాడు. కూతురికి మాత్రం ఇవేవీ తెలియకుండా
జాగ్రత్త పడతాడు.
ఇప్పుడు ఈ సాంఘిక బహిష్కారాన్నెదుర్కొంటున్న
సలీం కూతురి ఆశయం ఎలా నెరవేర్చాడు? ఇరు మత వర్గాల నుంచీ
అన్ని ప్రతిబంధకాలూ దాటి భరత నాట్యం నేర్చుకుని మరియం ఎలా ప్రదర్శన ఇచ్చింది? ఆ ప్రదర్శనలోనూ అడ్డుకునే ప్రయత్నాలెలా జరిగాయి? ...ఇదీ మిగతా కథ.
నటనలు – సాంకేతికాలు
తండ్రీ కూతుళ్ల ప్రధాన పాత్రలు
పోషించిన డానీష్ హుస్సేన్, అదితీ సుబేదీలదే ప్రధానంగా ఈ
ముస్లిం సోషల్ డ్రామా. టైలర్ గా డానీష్ టైలర్ అన్నట్టే వుంటాడు. ఇతనేకాదు ఇతర
ముస్లిం పాత్ర ధారులూ ఫార్ములా సినిమాల్లోలాగా కృత్రిమ వేష భాషల్లో వుండరు. అచ్చమైన
ముస్లిమీయత ఉట్టిపడుతూంటుంది. మీజ్వాన్ వూళ్ళో తామూ ఒకళ్లుగా కలిసిపోయినట్టు పాత్రధారులుంటారు.
డానీష్ మరదలు జెహ్రా పాత్రలో శ్రద్ధా కౌల్, ఆమె టీనేజి కూతురి
పాత్రలో జూహైనా ఎహసాన్, ఆవారా ఆటో డ్రైవర్ అష్ఫాక్ యువ
పాత్రలో కౌస్థభ్ శుక్లా, పలుకుబడి గల పెద్ద మనిషిగా
నసీరుద్దీ షా... ఇలా ప్రతీ ఒక్కరూ సినిమాల్లో సృష్టించి పెట్టిన మూస ముస్లిం ఇమేజికి
భిన్నంగా వాస్తవికతతో వుంటారు. ఒక్క డాన్స్ అకాడెమీ ఓనర్ గా
రాకేష్ చతుర్వేదీ ఓం, అతడి టీనేజీ కూతురు తప్ప. వీళ్ళ
పాత్రలే మూస సినిమా పోకడలతో కలుషితమయ్యాయి. ముగింపుని సైతం కలుషితం చేశాయి. కూతురు
తండ్రికి వ్యతిరేకంగా వుండే టెంప్లెట్ పాత్రగా వుంటుంది. ‘ముస్లిం
పిల్ల ఇండియన్ డాన్స్ చేస్తుందట’ అని తండ్రి అంటే, ‘ముస్లిం పిల్ల ఇండియన్ కాదా?’ అని చురక వేస్తుంది.
ఎక్కువగా
డానీష్ సంఘర్షణ పడే పాత్రగా వుంటాడు. సంయమనంతో వుండే పాత్ర.
నిండు కుండలా వుంటాడు. ఎవరితోనూ ఎదురు తిరిగి మాట్లాడడు. తను చేయాల్సింది కూల్ గా
చేసుకుపోతాడు. ఎంత నిస్సహాయత లోనూ కూతుర్ని పల్లెత్తు మాటనడు. కూతురి ఆశయంలో భార్య
కోరిక వుంది. కూతుర్ని నాట్య కారిణిని చేయడమే, తనేమైపోయినా
ఫర్వాలేదు - గంగా జమునా తెహజీబ్ ని నిలబెట్టడమే ధ్యేయంగా వుంటాడు. నసీరుద్దీన్ షా మసీదులోకి
అతన్ని రానివ్వకుండా అడ్డుకునే దృశ్యం, డాన్స్ అకాడెమీ ఓనర్
ఆడిటోరియంలో అతన్ని అడుగడుగునా అవమానించే దృశ్యాలు వంటివి కదిలిస్తాయి.
అయితే
కూతురు తనని స్కూల్లో మగపిల్లలు చీప్ గా డాన్సర్ అని వెక్కిరి
సున్నారని చెప్పినప్పుడు, అది వాళ్ళు నీతో పెంచుకుంటున్న
ఆసక్తికి తార్కాణమంటూ అనునయించడం అంత బావుండదు. కూతుర్ని ఆటవస్తువుగా భావించి
అన్నట్టుంటుంది. నీ నాట్యం విలువ వాళ్ళే తెలుసుకుంటారులే అనేస్తే పోయేది.
కూతురుగా
అదితి నటనకి కొత్త. అయినా నటనలోనూ నాట్యంలోనూ సమర్ధురాలిగా కన్పిస్తుంది మీజ్వాన్ లోనే
పుట్టి పెరిగిన తను. అయితే ఇది నాట్యం గురించి కథ అనీ నాట్యాలతో నింపేయలేదు సినిమా.
నాట్యంతో ఒకటే పాట క్లయిమాక్స్ లో వుంటుంది. ఇది సంగీతభరిత నాట్య సినిమా కాదు. నాట్యం
కోసం సమాజంతో సంఘర్షించే సినిమా. క్లయిమాక్స్ ప్రదర్శనలో భరత నాట్యానికి ‘దమ్ అలీ అలీ దమ్ - ఝనక్ ఝనక్
నాచే నటరాజ్ రే’ అనే
సూఫీ పాట అతిగానే వుంటుంది. దీనిగురించి కథాకథనాల్లో చెప్పుకుందాం. నసీరుద్దీన్ షాకి
పెద్దగా పాత్ర లేదు. రెండు మూడు సార్లు బెదిరించడానికే వుంటాడు. క్లయిమాక్స్ లో వుండడు.
రిపుల్
శర్మ సంగీతంలో మత వాసన వుండదు. నేపథ్య సంగీతంలో కూడా ఎక్కడా ముస్లిం సంగీత బాణీలివ్వలేదు.
రెండే పాటలు - ఒక మాంటేజ్ సాంగ్, ఇంకో క్లయిమాక్స్ సాంగ్ వుంటాయి.
‘సూఫీయుమ్ సుజాతాయుమ్’ లో ఆద్యంతం సూఫీ
భక్తి సంగీతమే తల వాచేలా వుంటుంది. ఇక మోహిసిన్ ఖాన్ పఠాన్ ఛాయాగ్రహణం ఫ్రెష్ లుక్
తో వుంది.
సరైన రచయితలు దొరక్క ఇంతకాలం
పట్టిందన్నాడు దర్శకుడు. దొరికిన రచయితలు హుస్సేన్ మీర్,
సఫ్దర్ మీర్ లు సినిమాటిక్ రచన చేయలేదు క్లయిమాక్స్ తప్పించి. క్లయిమాక్స్ వొక కమర్షియల్
మసాలా. వాస్తవిక సినిమాకి మసాలా ముగింపు. సంభాషణలు సినిమా డైలాగ్స్ కాకుండా, టెంప్లెట్ డైలాగులు కాకుండా, ఆయా వాస్తవిక పాత్రలు మాట్లాడినట్టుగానే
వున్నాయి. దృశ్యాలకి సింబాలిజాన్ని పొదుపుగా వాడారు.
ప్రారంభంలో మరియం పిన్ని జెహ్రా పాలు వేడి చేస్తూంటే, మాడిన వాసన వేస్తోందని అమ్మమ్మ అంటుంది. అక్కడే మరియం కూడా వుంటుంది. పాలింకా
పొంగడం లేదంటుంది జెహ్రా. అడుగంటుతుందీ - మరక అవుతుందీ - అని తిరిగి అంటుంది అమ్మమ్మ. మరక అవదని అంటుంది జెహ్రా. ఈ మాటలు మరియం నుద్దేశించే రచయితలు సింబాలిక్ గా రాసి రసాత్మకం
చేశారు. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సిట్యుయేషన్నే రెండు సార్లు అందమైన బీభత్సం చేశాడు ‘బుచ్చి నాయుడు కండ్రిగ’ దర్శకుడు యమా బంపర్ గా.
కథాకథనాలు
‘శంకరాభరణం’ లో శంకర శాస్త్రి వేశ్య కూతుర్ని ఉద్ధరించడానికి వ్యతిరేకతల్ని ఎదుర్కొంటాడు.
‘మీ రుఖ్సమ్’ లో సలీం కి శంకర శాస్త్రి
అంత స్థాయి లేదు గానీ కోరిక లున్నాయి కూతుర్నుద్ధరించాలని. ఇద్దరికీ కులం, మతం అడ్డు కాదు. అయితే సంగీతం తెలిసిన శంకర శాస్త్రి కుటుంబ డ్రామాకి పరిమితమైతే, సంగీత నాట్యాలు తెలియని సలీం సామాజికార్ధిక సంఘర్షణతో సతమతమవుతాడు. కథని ఇతడి
పాత్ర మీదుగా నడపకపోతే, కూతురి పాత్ర నాట్యం కథాకమామీషుతో రొటీన్
రొంపిలో పడుతుంది. అందుకని ఇందులో నాట్యం గురించి కన్నా ఆ నాట్యం వల్ల ఎదురయ్యే కష్టాలే
ప్రధాన కథయ్యింది. శంకరా భరణం, పాకీజా,
ఉమ్రావ్ జాన్ ల వంటి సంగీత నాట్యాల సినిమా కాలేక పోయింది. ఇప్పుడు వర్తమానం ప్రతిబింబించే
కష్టాలే అవసరం. దీంతో మత మౌఢ్యంతో బాటు సామాజికార్ధిక కోణాల్ని కూడా తట్టగల్గింది.
అయితే ఈ మెసేజులతో మీడియా ప్రచారాన్నిబద్ధలు కొట్టే శక్తి ఒక ముస్లిం సినిమాగా మాత్రం
దీనికి లేదు.
పైగా పరిష్కర్తలుగా టీనేజి యువపాత్రలు
అత్యుత్సాహం ప్రదర్శిస్తాయి (ఆటోడ్రైవర్, జెహ్రా కూతురు, డాన్స్ అకాడెమీ ఓనర్ కూతురు తదితరుల బృందం). సలీం కష్టాలకి పరిష్కారమనేది
లేకుండా వుండుంటే వర్తమాన పరిస్థితిలా వుండేది. పరిష్కారం కూతురి నాట్యాభిలాషకే వుంటే
సరిపోయేది. తండ్రి కష్టాలు చూసి పోటీ నుంచి విరమించు కుంటుంది కూతురు. ఎప్పుడైతే ఇంటి మీద రాయి పడుతుందో, వాళ్ళకి జవాబుగా
ఇక పోటీకి సిద్ధమైపోతుంది. ఈ క్లయిమాక్స్ మలుపు బావుంది పాత్రని ఎలివేట్ చేసేలా.
అయితే
అకాడెమీ ఓనర్, అతడి కూతురి పాత్రలే మరీ చోద్యంగా మూస ఫార్ములా
చేష్టలతో వుంటాయి. ఈ రెండు పాత్రలే క్లయిమాక్స్ ని సుందర బీభత్సం చేశాయి. పదహారేళ్ళ
హిందూ టీనేజి పిల్ల ఐఫోన్ తో ‘అల్లాహూ అల్లాహూ’ సూఫీ పాటల ఫ్యాన్. క్లయిమాక్స్ కోసం కావాలని ఈ అతికింపు. ఇక తండ్రి గారు ఎందుకో
రియాక్షన్లు పొడిగించుకుంటూ పోతాడు. అసలు మరియంని అకాడెమీలో నిషేధిస్తే పోయేదిగా. ఆడిటోరియం
దాకా తెచ్చుకోవడం ఎందుకు. అక్కడ సెక్యూరిటీ గార్డులకి సైగలు చేస్తూ కమర్షియల్ వీర విలనీ
ప్రదర్శించడమెందుకు. ‘డిస్కో డాన్సర్’ వంటి
సినిమాల్లో క్లయిమాక్సులు ఇలాగే వుంటాయి టెంప్లెట్ లో. హీరో సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రాం
నెగ్గకుండా విలన్ పాల్పడే టెంప్లెట్ కుట్రలు. ఆ టెంప్లెట్టే ఇక్కడా పడిపోయింది.
చివరికి మరియం నాట్యం చేస్తూంటే సెక్యూరిటీకి
ఫైనల్ సైగ చేస్తాడు అకాడెమీ ఓనర్. పాటాగి పోతుంది. నాట్యం ఆగిపోతుంది. ఇక కూతురు లేస్తుంది
ఐఫోన్ తో బీభత్సంగా. ‘దమ్ అలీ అలీ దమ్ - ఝనక్ ఝనక్ నాచే నటరాజ్ రే’ సూఫీ భక్తి ఫ్యూజన్ పాటపెట్టేసి పారేస్తుంది!
మతం చేతిలోంచి నాట్యం వెళ్ళిపోయి టీనేజర్ల చేతిలో ఇలా తయారయ్యింది.
―సికిందర్