రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 17, 2020

968 : రివ్యూ



రచన - దర్శకత్వం : తేజా మార్ని
తారాగణం : చైతన్య కృష్ణ, నైనా గంగూలీ, ఎస్తర్ అనిల్, ఈశ్వరీ రావు, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం : :ప్రియదర్శన్ బాలసుబ్రహణ్యం, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి
నిర్మాతలు: సందీప్ మార్ని, రత్నాజీ రావు మార్ని
విడుదల : ఆహా ఓటీటీ


        రో కొత్త దర్శకుడి కృషి ఓటీటీ లో విడుదలయ్యింది. ఇది రాజకీయ సినిమా. థియేటర్ మీద ఆశలు పెట్టుకుంటే ఇంట్లోకే వెళ్ళి హోమ్ డెలివరీ ఇవ్వాల్సిన అగత్యమేర్పడింది. ఇళ్ళల్లోనే రకరకాల సైజుల్లో హోమ్ థియేటర్లు వెలిశాయి. ఈ ప్రేక్షకులు వేరు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్రేక్షకులు. దాదాపూ మాస్ వుండరు. సింగిల్ థియేటర్ల నుంచి మల్టీ ప్లెక్సులకి, మల్టీ ప్లెక్సుల నుంచీ హోమ్ థియేటర్లకీ ప్రేక్షకుల్ని కుదించుకుంటూ వస్తున్నాయి సినిమాలు. ప్రస్తుతాని కిదొక అనివార్య పరిస్థితి, అసంతృప్తి. కొత్త దర్శకులకైతే వర్ణణాతీత బాధ. ఆనందిద్దామన్నా అది వర్చువల్ ఆనందం. తేజా మార్ని అనే మరో కొత్త దర్శకుడు ఈ బరిలోకి తన కృషితో దిగాడు. ఒక రాజకీయ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ పరిచయం, కృషీ పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. పరిశీలిద్దాం...

కథ 
      వర్షపు హోరుతో అల్లకల్లోలంగా వున్న వాతావరణంలో ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య దుర్మరణం వార్త వెలువడుతుంది. దీంతో ఆయన కుమారుడు విజయ్ వర్మ (చైతన్య కృష్ణ) కి ఉప ముఖ్యమంత్రి పదవి పార్టీ సూచిస్తే కాదని ముఖ్యమంత్రి అయిపోతాడు. ఇక తండ్రిని గొప్పగా ప్రతిష్టించుకోవాలన్న కోరికతో, నాన్న నరికిన తలలు కాదు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గుర్తుకు రావాలి. నా తండ్రి పేరు చెబితే కీర్తి ప్రతిష్టలు గుర్తుకు రావాలి. ప్రతిపక్షాలు చేసే విష ప్రచారం కాదు, పాలకులు రాసేదే చరిత్ర కావాలి అంటూ ప్రమాణ స్వీకారం చేసి, ప్రపంచంలో కెల్లా ఎత్తైన విగ్రహం తండ్రికి కట్టించేందుకు పూనుకుంటాడు. మూడువేల కోట్లు అవసరమయ్యే విగ్రహం కోసం సంక్షేమ పథకాలకి కత్తెర వేసి నిధులు సమకూరుస్తాడు.

        ఇలా వుండగా వివిధ ప్రాంతాల్లో డబ్బుల్లేక కొందరు జీవన పోరాటాలు చేస్తూంటారు. కలుషిత నీరువల్ల కిడ్నీలు పాడైన కూతురి వైద్యం కోసం కౌలు రైతు (ఈశ్వరీ రావ్)
, శిథిలమైన అనాధాశ్రమం మరమ్మత్తుల కోసం స్వాతంత్ర్య యోధుడు (శుభలేఖ సుధాకర్), వారణాసి నుంచి పారిపోయి వచ్చి స్కాలర్ షిప్ ప్రయత్నాల్లో ఒక జంట (ఈస్తర్, అంకిత్),   క్రీడారంగంలోకి ప్రవేశించే ఆశయంతో గారడీ అమ్మాయి (నైనా గంగూలీ)... ఇలా విద్యా, వైద్య, తాగునీరు, క్రీడా రంగాలకి చెందిన వర్గాలు నిధుల కొరతతో బాధలు పడుతూంటాయి. 

        ఈ నాల్గు వర్గాల జీవన పోరాటం విగ్రహంతో ముఖ్య మంత్రి స్వార్ధ ప్రయోజనాన్ని ఎలా ఎదుర్కొంది
? ఎదుర్కొందా లేదా? ఎదుర్కొకపోతే ఎందుకు ఎదుర్కొలేదు? ఇదీ మిగతా కథ. 

నటనలు – సాంకేతికాలు
       అందరూ బాగా నటించారు. రియలిస్టిక్ పాత్రలు లీనమై నటించారు. పేద తరగతి రియలిస్టిక్ పాత్రలవడం వల్ల గ్లామర్ తో పని లేకుండా పోయింది. దీంతో గ్లామర్ తో వుండే పరిమితులు అడ్డు పడలేదు. ఫ్రీ స్టయిల్ నటనలకి వీలు కుదిరింది. మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి వంటి పెద్ద పాత్ర నటించిన చైతన్య కృష్ణ, పాత్రలో పెద్దగా బలం లేకపోయినా, పాత్ర కన్పించినప్పుడల్లా ముఖ్యమంత్రి పాత్ర అనే బెరుకు లేకుండా నటించాడు. 

         ఈశ్వరీ రావ్ ఇలాటి పాత్రలకి ఒక శారద. శోక పాత్రలో ఆమెదొక ఆర్ట్ సినిమా నటన. క్రీడాకారిణిగా కాస్త స్పీడున్న పాత్రలో నైనా గంగూలీ భావోద్వేగాల్ని రగిలించే నటన. స్టూడెంట్ గా ఎస్తర్ అనిల్ అమాయకత్వాన్ని బాగా ప్రదర్శించే నటన. చాయ్ వాలాగా అంకిత్ ఇంకో బాధిత పాత్ర, స్వాతంత్ర్య యోధుడిగా శుభ లేఖ సుధాకర్, ఇద్దరూ మంచి నటులు-  చివర్లో ఒక సీనులో జర్నలిస్టుగా రోహిణి కన్పిపిస్తుంది. వాస్తవిక ధోరణిలో తీసిన సినిమాకి వాస్తవిక నటనలతో అందరూ నిలబెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నంలో ఒక వంతు కూడా తన బాధ్యతగా సినిమాని నిలబెట్టేందుకు కృషి చేయలేదు కొత్త దర్శకుడు. ఇక ఎత్తైన విగ్రహపు వూహలేల? 

        ఉద్దేశపూర్వకంగానో
, లేక కాకతాళీయంగానో గానీ ప్రారంభంలో ఒకరి తర్వాత ఒకరు ఓపెనయ్యే బాధిత పాత్రల దృశ్యాలకి నేపథ్యంలో వాటర్ థీమ్ ని కల్పించాడు కొత్త దర్శకుడు. ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య దుర్మరణంతో హోరు వర్షం, ఈశ్వరీ రావ్ తో సముద్రం, ఈస్టర్ తో వారణాసిలో గంగ, నైనా తో విశాఖలో సముద్రం, ఇవి గాక రాజమండ్రిలో గోదావరి, ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ తో కారే వర్షపు నీళ్ళు, కొద్ది సేపటికి కలెక్టర్ తో వర్షం... ఇలా ఈ జల నేపథ్యాలు సబ్ కాన్షస్ మూడ్ ని సృష్టిస్తాయి. ఈ సింబాలిజంతో ఏ రసోత్పత్తితో కాన్సెప్ట్ కొలిక్కి వస్తుందా అని ఎదురు చూస్తే, ఏమీ వుండదు. ఆ దృశ్యాలకే అవి పరిమితం. ముఖ్యమంత్రిని దుర్మరణం పాల్జేసిన ఈ వాటర్ థీమ్, చివరికి ముఖ్యమంత్రి విగ్రహాన్ని కూల్చేసే ప్రకృతి ప్రకోపమవుతుందేమో నని మన బుర్రకి అన్పిస్తుంది. కానీ మన పనికొచ్చే బుర్రకి పని పెట్టుకోవడం వేస్ట్ అని తేలుతుంది. 

        ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోరు దాదాపు పాటలే ఆక్రమిస్తాయి. ఏ బాధ పెట్టే ఘట్టం వచ్చినా ఓ పాట వచ్చేస్తుంది. బాగానే వుంటుంది. మ్యూజికల్ రియలిస్టిక్ లాగా కొత్తగా. కానీ విషయం లేని సినిమాని నటనలతో
, పాటలతో నిలబెట్ట గలరా? 

        కెమెరా పరంగా కూడా విజువల్ బలం వుంది. దీనికీ విషయం తోడ్పడలేదు. వారణాసి లాంటి పుణ్య క్షేత్రంలో పడుపు వృత్తిని పచ్చిగా చూపించ వచ్చు. అదొక వాస్తవం. కానీ కథ కేమవసరం
? ఆ నేపథ్యంలోంచి వచ్చే ఆ రాష్ట్రపు పాత్ర, ఇంకో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోరుకోవడంలో ఔచిత్యం? స్థానిక పాత్రల స్ట్రగుల్ ని చూపించే కాన్సెప్ట్ లో ఇదొక రస భంగం. ఈ రాజకీయ సామాజికార్ధిక కాన్సెప్ట్ ని తెరకెక్కించాలంటే పేపర్ న్యూస్ కటింగ్స్ చాలవు, సమకాలీన స్పృహతో వెండి తెరని మించిన గ్రాండ్ పిక్చర్ ని మైండ్ లో చూడాలి. 

కథా కథనాలు
       ఇది ఏ రాజకీయ కుటుంబపు కథో వర్షపు హోరులో ముఖ్యమంత్రి దుర్మరణంతో తెలిసిపోతుంది. అయితే కథనంతో అంటీ ముట్టనట్టు వుండిపోతుంది. ప్రశ్నించే పని చేయదు. ఇదే సమస్య. ప్రశ్న లేకపోవడంతో సినిమా అనే రెండు గంటల విలువైన సమయానికి ప్రయోజనం లేకుండా పోయింది. కాన్ఫ్లిక్ట్ లేకుండా సినిమానెలా వూహిస్తాడు ఏ కొత్త దర్శకుడైనా? కథ కూడా కదలకుండా విగ్రహంలా వున్న చోటే వుంటుందా? ప్రశ్న పుడితే కదలాలన్పిస్తుంది కథకి. పుట్టకపోతే పడుకుని వుంటుంది. కథ కదలడం లేదన్న మినిమం ఫీలింగ్ కూడా దర్శకుడికి కలక్కపోతే ఎలా? 

         రెండోది, దీన్ని విడివిడి కథల ఆంథాలజీగా చేయడం. ఆంథాలజీలు వర్కౌట్ కావని తెలిశాక కూడా. పోనీ ఈ విడివిడి కథల్లోని బాధిత పాత్రలు ఒకటై ముఖ్యమంత్రి విగ్రహ పిచ్చిని ప్రశ్నిస్తాయా అంటే అదీ లేదు. అవి వాటి మానాన అవి కథలు ముగించుకుంటాయి. స్వాతంత్ర్య యోధుడి పాత్ర కూడా ప్రశ్నించి నాల్గు దులుపుళ్ళు దులపక పోతే ఎందుకు? ఇలా వుంటే, ముఖ్యమంత్రి తన తండ్రి విగ్రహం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడ మేమిటి? ఆ బాధితుల కథలు రాసుకుని జర్నలిస్టు ముఖ్యమంత్రికి చూపిస్తే ముఖ్యమంత్రి ఫీలవడం. ప్రజా శ్రేయస్సు కాదని మూడువేల కోట్లు ధారబోసి విగ్రహం కట్టేశాక కథలు చూపించి ఏం లాభం, ఆయన ఫీలయ్యి ఏం ప్రయోజనం? 

        ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది స్ట్రక్చర్ ఛాయలు లేని మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే. అయితే మిడిల్ మాటాష్ కైనా ముగింపులో  ప్రశ్న పుట్టి  వాళ్ళూ  వీళ్లూ కొట్టుకునే మటన్ ఫ్రై లాంటి నాన్ వెజ్ ముగింపు వుంటుంది. ఇలా వెజ్ కూడా కాని ఎండు గ్రాసంలా వుండదు. దటీజ్ ది మెయిన్ ప్రాబ్లం.

సికిందర్