రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 23, 2025

1365 : రివ్యూ!


  

దర్శకత్వం : ఎం.సి. జితిన్
తారాగణం : నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్, అఖిలా భార్గవన్, మెరీన్ ఫిలిప్, పూజా మోహన్రాజ్, మనోహన్ జాయ్, జననీ రామ్, సరస్వతీ మీనన్, హెజ్జా మెహెక్, దీపక్ పెరంబోల్, కొట్టాయం రమేష్, సిద్ధార్థ్ భరతన్ తదితరులు.
స్క్రీన్ ప్లే :  అతుల్ రామచంద్రన్, లిబిన్ టి.బి.
సంగీతం : క్రిస్టో జేవియర్, చాయాగ్రహణం : శరణ్ వేలాయుధన్ నాయర్, కూర్పు : చమన్ చాక్కో
బ్యానర్స్ : ఏవీఏ ప్రొడక్షన్స్, హేపీ అవర్స్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ఏవీ అనూప్,షైజూ ఖలీద్, సమీర్ తాహిర్
స్ట్రీమింగ్ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
***
      లయాళ దర్శకుడు ఎం. సి. జితిన్ 2018 లో నాన్సెన్స్ అనే నాన్సెన్సికల్ సినిమా తీసి మళ్ళీ అవకాశం కోసం ఆరేళ్ళూ నిరీక్షించి, 2024 లో సూక్ష్మదర్శిని తీసి వార్తల కెక్కాడు. సినిమా తీయగల క్రియేటివిటీ ఎవరి స్థాయిలో వాళ్ళకి అందరికీ వుంటుంది. క్రాఫ్ట్ ఎందరి కుంటుంది? క్రాఫ్ తో ఇంటలిజెంట్ రైటింగ్, ఇంటలిజెంట్ మేకింగ్ అన్నవి ఎందరికి తెలుసు? సినిమా తీస్తే ఎవరైనా కొత్తగా వచ్చే మేకర్లు అందులోంచి  నేర్చుకునేలా వుండాలా వద్దా? ప్రేక్షకులకి కొత్త అనుభూతినివ్వాలా వద్దా? మరెందుకు తీయడం? ఇలాటి ఆలోచనల్ని రేకెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళం నుంచి వచ్చి హిట్టయ్యింది. ఇది ఎన్ని విధాలా ప్రత్యేకమో చూస్తే, వచ్చీ రావడంతోనే డొనాల్డ్ ట్రంప్ వంద ఆర్డర్ల మీద సంతకాలు పెట్టేసి సంచలనం రేపినంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రతీ ఆర్డరు మీద ట్రంప్ సంతకంలాగే, ప్రతీ సీను మీదా బల్లగుద్ది దర్శకుడు పెట్టిన సంతకమే. సీన్లని ఆమోదిస్తూ చూసుకుంటూ పోవడమే.  పోతున్న కొద్దీ ఈ కింది కథ ద్వారా బయటపడే షాకింగ్ నిజాలెన్నో... బ్రేకింగ్ న్యూసు లెన్నో... ఈ సారి దర్శకుడి నాన్సెన్స్ మాత్రం కాకుండా!

కథ

    కేరళలోని ఓ పట్టణానికి దూరంగా సబర్బన్ ఏరియాలో ప్రియదర్శిని అలియాస్ ప్రియా (నజ్రియా నజీమ్) ఉద్యోగి అయిన భర్త ఆంథోనీ (దీపక్ పెరంబోల్) తో, కూతురు (హెజ్జా మెహక్) తో వుంటుంది. ఇంటి దగ్గర బోరు కొట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటుంది. పొరుగున స్టెఫీ (మెరీన్ ఫిలిప్) అనే ఫ్రెండ్ వుంటుంది. ప్రశాంత వాతావరణంలో జీవితం గడుస్తూంటుంది. ఇంతలో బేకరీ నడుపుతున్న మాన్యూయేల్ (బాసిల్ జోసెఫ్) అనే అతను తల్లి గ్రేస్ (మనోహరీ జాయ్ గ్రేసీ) తో వచ్చి ఎదురింట్లో దిగుతాడు. అతడి ప్రవర్తన విచిత్రంగా వుండడంతో ప్రియా కనిపెడుతూంటుంది. అతను ఉడుంని పట్టి తీసికెళ్ళి బీఫ్ అని చెప్పి ఫ్రెండ్స్ కి వండి పెడితే ప్రియాకి అతడి మీద అనుమానాలు పెరిగిపోతాయి. కిచెన్ లో కిటికీ లోంచి అతడింటి వైపు చూస్తూ అన్నీ కనిపెడుతూంటుంది.

మాన్యూయేల్ తల్లి గ్రేస్ ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడు చూసినా ఎటో చూస్తూ కూర్చుని వుంటుంది. ఒకరోజామె ఇంట్లో కనపడదు. ఎటెళ్ళిపోయిందో నని కంగారుపడి వెతికి తీసుకొస్తాడు మాన్యూయేల్. ఇతడి మామ రాయ్ (కొట్టాయం రమేష్), మరో బంధువు న్యూరో సర్జన్ డాక్టర్ జాన్‌ (సిద్ధార్థ్ భరతన్) ఇందుకు తోడ్పడతారు. ఆమెకి అల్జీమర్స్ (మతిమరుపు) వుందని నిర్ధారణ అవుతుంది. అయితే ఆమె తన రోజువారీ పనులు సమర్ధవంతంగా నిర్వర్తించడం, ఇరుగుపొరుగుతో కలిసి మెలసి వుండడం చూస్తూంటే, ఆమె అల్జీమర్స్ వ్యాధి పీడితురాలని నమ్మకం కలగదు ప్రియాకి. ఇంతలో మళ్ళీ కనిపించకుండా పోతుంది గ్రేస్.
        
ఇది తెలుసుకుని న్యూజీలాండ్ లో వుంటున్న మాన్యూయేల్ సోదరి డయానా (జననీ రామ్) వచ్చేస్తుంది. పోలీసు సెర్చింగ్ లో గ్రేస్ ఎక్కడా దొరకదు. తల్లి కనిపించడం లేదన్న ఆందోళన ఏ కోశానా లేని మాన్యూయేల్, డయానాల ప్రవర్తన ప్రియాకి మరిన్ని అనుమానాలని పెంచుతుంది. ఇంతలో వున్నట్టుండి డయానా తిరిగి న్యూజీలాండ్ కి బయల్దేరుతూంటే, ప్రియా తనని పరిచయం చేసుకుని డయానా ఫోన్ నంబర్ అడిగి తీసుకుంటుంది.
        
డయానా వెళ్ళిపోయాక పోలీసులకి గ్రేస్ దొరుకుతుంది. ప్రియా డయానాకి కాల్ చేస్తే అవుటాఫ్ రీచ్ మెసేజ్ మలయాళంలో విన్పించేసరికి ప్రియా ఆలోచనలో పడుతుంది. డయానా న్యూజీలాండ్ వెళ్ళిపోతే మెసేజ్ మలయాళంలో విన్పించడమేమిటి? మళ్ళీ తర్వాత ఎసెమ్మెస్ వస్తుంది. దీంతో డయానా సెల్ ఫోన్ డయానా దగ్గర లేదని, మాన్యూయేల్ దగ్గర వుందనీ, అతనే డయానాలాగా మెసేజులిస్తున్నాడనీ అర్ధమవుతుంది ప్రియాకి.
        
ఏమిటీ దీనర్ధం? డయానా ఏమైంది? డయానాలాగా మాన్యూయేల్ ఎందుకు నటిస్తున్నాడు? ఆసలతను ఏం చేయబోతున్నాడు? లేదా ఈ పాటికి చేసేశాడా? ఈ వేధించే అనుమానాలతో ప్రియా కనుక్కున్న అసలు నిజాలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

    ఆనర్ కిల్లింగ్స్ బయటి ప్రపంచంలో కత్తులు కటార్లతో, నడిబజార్లో బరితెగించి భీకరంగా జరుగుతూంటాయి. నార్త్ లో ఖాఫ్ పంచాయత్ లలో నైతే  తుపాకీ గుళ్ళతో ఠపీమని జరుగుతాయి. సినిమాలో గుట్టుగా, నీటుగా జరుగుతాయి. ఇదే షాకింగ్ గా వుంటుంది.  'మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్' లో లాంటి పెద్దావిడ (మిషెల్ ఫీఫర్)  మలయాళ సినిమాలోకి దిగి వస్తే?ఆనర్ కిల్లింగ్ ప్లానింగ్ ఎంత ఇంటలిజెంట్ గా, ఇంటలెక్చువల్ గా వుంటుంది?  దీనికి ఈ 'సూక్ష్మదర్శిని' యే సమాధానం.
       
ఈ కథకి ప్రధానంగా కావాల్సింది సస్పెన్స్ థ్రిల్లర్ వాతావరణం పెల్లుబికే మార్మికమైన లొకేషన్. ఈ మార్మికమైన లొకేషన్ బాగా కుదిరి కథకి డెప్త్ ని తీసుకు వచ్చింది. లొకేషన్ లో సింక్ అవని కథ పైపైనే చప్పగా వుండిపోతుంది. లొకేషనే కాదు
, కెమెరా, బీజీఎం, ఎడిటింగ్ మొదలైన సాంకేతికాలు కూడా పరస్పరం సింక్ అయి ఒక అత్యుత్తమ క్రాఫ్ట్ ని ప్రదర్శించాయి. చాలా సినిమాల్లో కనిపించనిది ఈ క్రాఫ్టే. పట్టణానికి దూరంగా వుండే సెమీ రూరల్ పరిసరాలు, అక్కడ తక్కువ జనాభాతో, దాదాపు నిర్మానుష్యంగా వుండే వీధులు, నిశ్శబ్దంగా వుండే ఇళ్ళూ... ఇళ్ళ మధ్య ఎత్తు తక్కువ గల కాంపౌండ్ గోడలు, ఇలా వొక సన్నిహిత సమాజాన్ని తెలియజేసే లొకేషన్.  
       
కాంట్రాస్ట్ గా ఈ సన్నిహిత సమాజంలో ఒక కుటుంబం చాప కింద నీరులా పారించే కుట్ర.
ఇది తెలుసుకోవాలన్న కుతూహలంతో కొన్ని సాహసాలు చేసే హీరోయిన్ పాత్ర ప్రియా. ప్రియమణి నటించిన భామాకలాపం అనే ఓటీటీ మూవీలో ఆమెది ఇతరుల ఇళ్ళల్లో, వ్యవహారాల్లో తలదూర్చి విషయాలు తెలుసుకోనిదే నిద్రపట్టని బలహీనత. ప్రియాది ఈ వోయూరిజం కాదు గానీ, ఎదురింట్లో దిగిన మాన్యూయేల్ వింత ప్రవర్తనే ఆమెని అతడింట్లోకి తొంగి చూసే అలవాటుని కల్పించింది. ఇందుకు కిచెన్ కిటికీలోంచి కనిపెడుతున్నా, ఈ కిటికీ లోంచి కనిపెట్టడమన్నది ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ రేర్ విండో మూవీని తలపించినా,రేర్ విండో లో లాగా ఆ కిటికీయే అన్ని విషయాలకీ సాక్ష్యం కాదు. అప్పుడప్పుడు ప్రియా మాన్యూయేల్ ఇంట్లోకి జొరబడి కూడా విషయాలు తెలుసుకుంటూ వుంటుంది. చాలా సూక్ష్మ విషయాలు కనిపెడుతూ వాటి అర్ధాలు తీస్తూంటుంది. అవసరమైతే యాక్షన్లోకి సైతం దిగి రహస్యాల్ని చేదించేందుకు సాహసాలు చేస్తూంటుంది.
        
మాన్యూయేల్ ఏం చేస్తూంటాడో దొరక్కుండా చేస్తూంటాడు. ఇదంతా ఎలుకా పిల్లి చెలగాటంలా వుంటుంది. సింబాలిక్ గా, ప్రారంభంలో ఏం చేస్తున్నాడా అని ఆమె చూస్తూంటే, పిల్లిలా వచ్చి అక్కడున్న  పిల్లిని ఫెడీమని కొట్టి వెళ్ళగొడతాడు. ఆ పిల్లి ప్రియా అయితే, ఎలుక తాను అన్నమాట.
       
సస్పెన్స్ థ్రిల్లర్ల ఇంకా వదలని జాడ్యమేమిటంటే
, ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యకి వివిధ అనుమానితుల్ని చూపిస్తూ, ఎవరు హంతకుడనేది హీరో లేదా హీరోయిన్ తేల్చే ఎండ్ సస్పెన్స్  మూసలో పడే, కాలం చెల్లిన, ఫ్లాపు గ్యారంటీ కథలు. ఈ కథ ఇలా కాదు.
మాన్యూయేల్ అతడి బంధువులూ ఏదో ప్లాను మాట్లాడుకుంటూ వుంటారు. ఆ ప్లాను ప్రకారం ఏం చేస్తూంటారో మాత్రం  చూపించరు. ప్రేక్షకుల్లాగే ఏం చేస్తున్నారో తెలుసుకునే కుతూహలంతో ప్రియా ప్రవర్తన. అసలేం జరుగుతోందీ తెలుసుకోవాలన్న కుతూహలమే సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూంటుంది. అంటే నేరమే జరగినట్టు లేదు  కాబట్టి ఆ నేరం తాలూకు చివర్లో రివీల్ చేసే రొటీన్ ఎండ్ సస్పెన్స్ కథని ఏ మాత్రం ఫీల్ కాం.
       
కేవలం అసలేం జరుగుతోందీ
, ఎందుకు జరుగుతోందీ  కుతూహలం రేకెత్తించే సీన్ టు సీన్ సస్పెన్స్ మాత్రమే విజయవంతంగా ప్లే అయిందిక్కడ. చివరికి షాకింగ్ గా కుట్రదారులూ, వాళ్ళు తెలివిగా చేసిన అనర్ కిల్లింగ్ తాలూకు హత్యా షాకింగ్ గా బయటపడి పోతాయి. అంటే ఫ్లాపయ్యే ఎండ్ సస్పెన్స్ కథలకి విరుగుడు అన్న మాట ఈ సీన్ టు సీన్ సస్పెన్స్ కథనం. ఈ విధానం హాలీవుడ్ లో 1958 లోనే ప్రారంభమయ్యింది. కానీ మన సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎండ్ సస్పెన్స్ కథలేనన్న సుడిగుండంలోనే వుంటున్నాయింకా.
       
ఈ అనర్ కిల్లింగ్ కథలో హింస కూడా కనపడదు.
గ్రాఫిక్ హింస లేదా రక్తపాతం మీద ఆధారపడకుండా సస్పెన్స్ ని, ఎమోషనల్ టెన్షన్ నీ ప్రధానాంశంగా చేసుకుని తెరకెక్కించారీ కథ. క్రూరత్వం కంటే. మాన్యుయేల్ వింత ప్రవర్తన ద్వారా, అతడి మైండ్ గేముల ద్వారా ప్రేక్షకులు  టెన్షన్ నీ, భయాన్నీ అనుభవించాలన్న ప్రణాళికతో చేసిన మైక్రో లెవెల్ మేకింగ్ ఇది. మైక్రో లెవెల్ మేకింగ్ ఎప్పుడూ హిట్టే.

దర్శకుడు జితిన్, రచయితలు అతుల్ రామచంద్రన్, లిబిన్ లు  సస్పెన్స్ థ్రిల్లర్ లంటే లో- బడ్జెట్ చవకబారు సినిమాలు కాదనీ, ఉత్తమ చిత్రాల ప్రమాణాలతో 14 కోట్లు వెచ్చించి, 50 కోట్లు ఆర్జించే కళా రూపాలుగానూ తీర్చి దిద్దవచ్చనీ దీంతో నిరూపించారు. 

నటనలు- సాంకేతికాలు

    ప్రియదర్శిని పాత్రలో నజ్రియాకి పూర్తి  క్రెడిట్ ఇవ్వాలి. ఆమెది పొరలు పొరలుగా బయల్పడే క్యారెక్టర్. సగటు యువతి జిజ్ఞాస, నిజాన్ని వెలికి తీయాలన్న ప్రబల కాంక్ష ఆమె పాత్రకి చోదక శక్తులు. ఇలాటి పాత్రని అర్ధం జేసుకుని, అందులో ఒదిగి కనబర్చిన నటనకి ఆమెకి టాప్ మార్కులు పడతాయి. మాన్యూయేల్ గా నటించిన బాసిల్ విషయానికొస్తే, హాస్య పాత్రలేస్తూ వుండిన ఇతను సీరియస్ కిల్లర్ పాత్ర నీటుగా నటించి ప్రధానాకర్షణగా నిలబడ్డాడు. ఇతడి తల్లిగా నటించిన మనోహరీ జాయ్ గ్రేసీ పాత్రకున్న షేడ్స్ తో గుబులు పుట్టిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అఖిలా భార్గవన్, మెరీన్ ఫిలిప్, పూజా మోహన్రాజ్, మనోహన్ జాయ్, జననీ రామ్, సరస్వతీ మీనన్, హెజ్జా మెహెక్ లు నటించిన ఆడ పాత్రలే ఎక్కువ. ఒక విధంగా ఇది లేడీస్ స్పెషల్ థ్రిల్లర్. ఈ యూఎస్పీతో మన దేశంలో ఇంకే సినిమా రాలేదు.

పాటలు లేని ఈ సినిమాకి  క్రిస్టో జేవియర్ బిజీఎం బలం చెప్పుకోదగ్గది. అలాగే తక్కువ లైటింగ్ తో శరణ్ వేలాయుధన్ నాయర్ ఛాయాగ్రహణం, కథని చెక్కడంలో (క్రాఫ్ట్) పూర్తిగా తోడ్పడిన చమన్ చాక్కో కూర్పు, ఇతర ప్రొడక్షన్ విలువలూ మూవీని ఎన్ని సార్లైనా చూసేలా పనితనం చూపించాయి.

—సికిందర్