రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 28, 2023

1348 : స్పెషల్ ఆర్టికల్


          నిన్న 26 తేదీ 11 రోజులు పూర్తి చేసుకున్న ఆదిపురుష్ వసూళ్ళు దేశవ్యాప్తంగా  రూ. 1.75 కోట్ల కనిష్టానికి పడిపోగా, ప్రభాస్ కొత్త సినిమాల రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లకి పెరిగింది. ప్రభాస్ సినిమాల దారి సినిమాలదే, రెమ్యూనరేషన్ల  దారి రెమ్యూనరేషన్లదే అన్నట్టు కెరీర్ రాకెట్ స్పీడుతో దూసుకు పోతోంది. హిట్ ఫ్లాపులు రెండిటినీ సమానంగా తీసుకుని కొత్త సినిమాలు కూడా సైన్ చేస్తున్నాడు. అంతేకాదు త్వరలో విడుదల కానున్న సాలార్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లో బంపర్ బిజినెస్ చేస్తోందని చెప్తున్నారు. నిన్న రెండోసారి ఆదిపురుష్ టికెట్ ధర మరింత తగ్గించి రూ. 112 లకి ఆఫర్ చేసినా, కలెక్షన్లు పెరగక పోగా, 8.06 ఆక్యుపెన్సీతో మరింత తగ్గిపోగా, నిర్మాతలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు వసూలు చేసిందని కొత్త బాక్సాఫీసు పోస్టరు విడుదల చేశారు. రూ. 100 కోట్లు పెంచి పోస్టరు వేశారని ట్రేడ్ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి.

          రోమ్ నగరం దహనమవుతూంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు- ఆదిపురుష్ మీద ఇంత రగడ జరుగుతున్నా, దర్శకుడు ఓం రౌత్ మాత్రం ప్రభాస్ ని కింగ్ గానే భావిస్తూ ఆది పురుష్ 2 తీసేందుకు ప్రభాస్ ని కలవడం కామెడీగా మారింది. ఇది విని ఆదిపురుష్ రచయిత, అభినవ వాల్మీకి మనోజ్ ముంతసిర్ శుక్లా గుండెల్లో రాయి పడేవుంటుంది. ఇక ఆదిపురుష్ పై దూషణల పర్వం డైలీ సీరియల్ నిన్నటి ఎపిసోడ్ లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాలుపంచుకున్నాడు. ఆదిపురుష్ చూసిన తర్వాత కటప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తనకు  ఇప్పుడు తెలిసిందని ట్వీట్ చేయడంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ తో సెహ్వాగ్ మీద విరుచుకుపడ్డారు. రామాయణ్’, శక్తిమాన్’, మహాభారత్ నటీనటులు ఆదిపురుష్ ని ప్రతిరోజూ దుయ్యబడుతూంటే మాత్రం ఫ్యాన్స్ సైలెంట్ గా వున్నారు.
       
ఇలా ‘ఆదిపురుష్
సృష్టిస్తున్న ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ప్రభాస్ పానిండియా బ్రాండ్ విలువ తగ్గడం లేదు. బాలీవుడ్ లో సాలార్ బిజినెస్ ఆఫర్లు ఆర్ ఆర్ ఆర్ ని మించేలా వున్నాయి. దీనికి
మరో కారణం కూడా వుంది. కేజీఎఫ్ చాప్టర్ 2’  పానిండియా ఘన విజయం విజయం తర్వాత, దర్శకుడు ప్రశాంత్ నీల్ తర్వాత ఏం అందించబోతున్నాడో చూడడానికి ప్రతి ఒక్కరూ ఉత్సుకతతో వున్నారు. 
          
ఈసారి అతను ప్రభాస్ కాంబినేషన్ తో  రావడంతో సాలార్ కి ఇంత హైప్ వచ్చింది. దీంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ నిర్మాతలకి  థియేట్రికల్ హక్కులకు సంబంధించి భారీ ఆఫర్లు అందుతున్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం, సాలార్ ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రికార్డ్-బ్రేకింగ్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌ ని కూడా అధిగమించేలా వుంది.  రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కుల ద్వారా రూ. 500 కోట్లకి పైగా భారీ మొత్తాన్ని వసూలు చేసింది.
        
సాలార్ సెప్టెంబర్ లో విడుదల కానుండగా, ఇప్పటి నుంచే సందడి చేస్తోంది. ప్రస్తుతం అత్యంత డిమాండ్ లో వున్న  రాబోయే పానిండియా మూవీ ఇదే. ఈ పెరుగుతున్న క్రేజ్ కారణంగా, మేకర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం కొన్ని క్రేజీ ఆఫర్లని పొందుతున్నారు.  ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సులభంగా రూ. 500 కోట్లని  దాటే అవకాశముందంటున్నారు.

పానిండియా స్టార్ డమ్
        ప్రభాస్ నటించిన ఈ హైపర్ యాక్షన్ ప్రశాంత్ నీల్ మార్కు సినిమా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ. 80 కోట్లకి పైగా రాబట్టిందనే విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ రూ. 200 కోట్ల రేంజిలో జరగ వచ్చని అంటున్నారు. ఇతర  రాష్ట్రాలు కూడా విపరీతమైన మొత్తాన్ని ఆర్జించగలవని భావిస్తున్నారు. ఇక కర్ణాటకకి చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాకి కన్నడలో ఏ రేంజి కలెక్షన్స్ వుంటాయో వూహించుకోవచ్చు.
         
ఆదిపురుష్ ఫ్లాపైనా ప్రభాస్ పానిండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ రాబోయే సినిమాల మీద నిర్మాతలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడడం లేదు.  సాలార్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ తో బాటు,  సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కె’, స్పోర్ట్స్ మూవీ స్పిరిట్, హారర్ కామెడీ రాజా డీలక్స్ లతో బిజీగా వున్నాడు ప్రభాస్. రానున్న మూడేళ్ళ వరకూ డేట్లు లేవు. ఇలా వుండగా, తాజాగా  మరో పెద్ద పానిండియా మూవీని ఒప్పుకున్నట్టు సమాచారం అందుతోంది. ఓ ప్రముఖ కన్నడ బ్యానర్ తో ఒప్పందం కుదిరిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కన్నడ బ్యానర్ విక్రాంత్ రోనా’, రైడర్ వంటి సినిమాలు నిర్మించింది. దీనికి ప్రభాస్ కి రూ 150 కోట్ల పారితోషికం అందుతుందని సమాచారం. ప్రాజెక్ట్-కె కి కూడా ప్రభాస్ పారితోషికం రూ. 150 కోట్లు.
       
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ –కె లోప్రభాస్ తోబాటు దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. దీని బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. రూ. 205 కోట్లు ఈ నల్గురి పారితోషికాలకే చెల్లిస్తున్నారు. ప్రభాస్ రూ. 150 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ. 20 కోట్లు, కమల్ హాసన్ రూ. 25 కోట్లు, దీపికా పడుకొనే రూ 10 కోట్లు.

       
తెలుగులో స్టార్లు నటించే సినిమాలు ఒకటి రెండు ఫ్లాపయినా కెరీర్ మీద ప్రభావం పడుతోండగా
, వరుసగా మూడు పానిండియా ఫ్లాపులు (సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్) ఇచ్చిన ప్రభాస్ కి మరిన్ని పానిండియా సినిమాలు, మరింత పారితోషికాలతో మూడు ఫ్లాపులు- ఆరు ఆఫర్లుగా కలర్ఫుల్ గా వుంది.

—సికిందర్

 (27.6.23)