రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

1301 : రివ్యూ!


 రచన -దర్శకత్వం : దర్శకుడు : రంజిత్ జయకొడి

తారాగణం : సందీప్ కిషన్విజయ్ సేతుపతిదివ్యాంశవరుణ్ సందేశ్గౌతం మీనన్అయ్యప్ప శర్మఅనసూయవరలక్ష్మీ శరత్‌ కుమార్ 
సంగీతం
 : సామ్ సిఎస్ఛాయాగ్రహణం : కిరణ్ కౌషిక్ 
నిర్మాతలు:
 భరత్ చౌదరిరామ మోహన రావు

విడుదల : ఫిబ్రవరి 3, 2023
***

        హిట్లు అనేవి లేకుండా నటిస్తూ వున్న సందీప్ కిషన్ తమిళంలో కూడా హీరోగా 5 సినిమాలు నటించాడు. మరో రెండు నటిస్తున్నాడు. ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్ లో కూడా ముఖ్యపాత్ర నటించాడు. తాజాగా తెలుగు- తమిళం ద్విభాషా చలన చిత్రంలో నటించాడు. ఇది హిందీ, మలయాళం, కన్నడలో పానిండియాగా విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటించడం ఆసక్తి రేకెత్తించింది. కొత్త తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దీన్ని పీరియెడ్ మూవీగా రూపొందించాడు. ఇదైనా సందీప్ కిషన్ కి కలిసి వచ్చిందా లేక, మళ్ళీ మొదటికొచ్చిందా తెలుసుకుందాం...

కథ

1990 లలో చిన్నప్పుడు మైఖేల్ (సందీప్ కిషన్) కత్తి పట్టుకుని తండ్రిని చంపేందుకు ముంబాయి వచ్చి గ్యాంగ్ స్టర్ గురునాథ్ (గౌతమ్ మీనన్) దృష్టిలో పడతాడు. మైఖేల్ ని చేరదీసి అనుచరుడు స్వామి (అయ్యప్ప శర్మ) పర్యవేక్షణలో వుంచుతాడు. యువకుడుగా ఎదిగిన మైఖేల్ శత్రువుల దాడి నుంచి గురునాథ్ ని కాపాడడంతో గురునాథ్ కి మరింత దగ్గరవుతాడు. ఇది చూసి గురునాథ్ కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్) అసూయ పెంచుకుంటాడు. తన మీద దాడి జరిపించిన రతన్ (అనీష్ కురువిల్లా) నీ, అతడి కూతురు తీర (దివ్యాంశ) నీ చంపమని మైఖేల్ ని ఢిల్లీకి పంపుతాడు గురునాథ్. ఢిల్లీ వెళ్ళిన మైఖేల్ తీర ని చూసి ప్రేమలో పడతాడు. దీంతో అమర్ నాథ్ రతన్ ని చంపేసి, మైకేల్ మీద కాల్పులు జరిపి లోయలోకి తోసేస్తాడు.

        అసలు మైఖేల్ తండ్రిని ఎందుకు చంపాలనుకున్నాడు? అతను జైల్లో ఎందుకు పుట్టాడు? గురునాథ్ - చారులత (అనసూయా భరద్వాజ్) లతో మైఖేల్ కున్న సంబంధమేమిటి? కన్నమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) ఎవరు? ఇంకో గ్యాంగ్ స్టర్ (విజయ్ సేతుపతి) ఎవరు? ఇంతకీ మైఖేల్ తండ్రిని చంపాడా లేదా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

1990 ల కాలంలో సెట్ చేసిన పీరియెడ్ కథ. ఫార్ములా రివెంజీ డ్రామా. ఈ కథలో మైఖేల్ కి అన్యాయం జరిగిన చిన్నప్పటి కథ తప్ప మిగిలినదంతా ఫ్లాట్ గా సాగిపోయే రక్తపాతాల యాక్షన్ కథ. చివరి 15 నిమిషాలు పేలుళ్ళ మోతే.  కేజీఎఫ్ ప్రభావం కూడా చాలా వుంది. గ్యాంగ్ స్టర్- మాఫియా సినిమాలు కమలహాసన్  నాయకుడు నుంచీ జేడీ చక్రవర్తి సత్య వరకూ అనేకం వచ్చాయి. ఆ కాలంలో జరిగిన కథల్ని అదే ఫార్ములాతో, టెంప్లెట్స్ తో అలాగే తీయడం వల్ల ఈ తరం ప్రేక్షకులకి గిట్టుబాటు అయ్యేదేమీ వుండదు. బోరు కొట్టి కూర్చుంటాయి. కాకపోతే నాయకుడు నుంచి సత్య నుంచీ పాత్రల్ని తీసుకుని, నేటి కాలానికి హీరోతో కొత్త కథ సృష్టిస్తే అదొక చెప్పుకోదగ్గ ప్రయత్నం.

        ఇందులో వినోదించడానికి, ఆనందించడానికి అలాటి కథ, పాత్రలు లేవు. యమ సీరియస్ కథకి యమ సీరియస్ పాత్రలు. పాత్రలన్నీ ఒకేలా వుంటాయి - సీరియస్ మొహాలు పెట్టుకుని దేశం కోసం సీరియస్ గా పోరాటం చేస్తున్నట్టు.  ఫస్టాఫ్ కథని సెటప్ చేస్తున్నాడు గనుక ఓపికతో చూస్తాం. ఇంటర్వెల్లో మైఖేల్ని షూట్ చేసి లోయలో పడేశాక- ఈ సెటప్ చేసిన కథతో సెకండాఫ్ గజిబిగా తయారై, రివెంజి కథ మన మీద పగ దీర్చుకుంటున్నట్టు వుంటుంది. మైఖేల్ పాత్ర సందీప్ కిషన్ తండ్రి పాత్ర మీద పగ దీర్చుకోవడానికి వచ్చాడా, లేక తనకి హిట్స్ ఇవ్వడం లేదని ప్రేక్షకుల మీదా? రెండోదే నిజం చేశాడు. 

        ప్రియురాలి ప్రేమ, తల్లితో మదర్ సెంటిమెంటు అనే బంధాల మధ్య మైఖేల్ ని భావోద్వేగభరితంగా బంధించాలన్న ప్రయత్నానికి ప్రియురాలితో ప్రేమలో పసలేదు, మదర్ తో ఫీల్ లేదు, ఫ్యామిలీ డ్రామా అసలే లేదు- కేవలం తండ్రిని చంపాలన్న కసి తప్ప. పైగా సెకండాఫ్ లో అనవసర పాత్రల హడావిడి ఒకటి. ఆలస్యంగా వచ్చే విజయ్ సేతుపతి పాత్ర కూడా కథా బలానికి తోడ్పడలేదు. సెకండాఫ్ శిరోభారం తప్ప ఏమీ లేదు. ఇలాటి కథ చేసుకుని, దీన్ని స్టయిల్ తో, టెక్నిక్ తో, అద్భుతంగా చిత్రీకరించిన శ్రమంతా వృధా అయింది.

నటనలు- సాంకేతికాలు

నటవర్గం మాత్రం మల్టీ స్టారర్ కి తక్కువ కాకుండా వున్నారు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దర్శకుడు గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయా భరద్వాజ్ ...పానిండియా ఆర్భాటం. ఒక్కరూ ఆకట్టుకునే ప్రసక్తి లేదు. గురునాథ్ గా గ్యాంగ్ స్టర్ పాత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ కెందుకో అర్ధం గాదు. ఈ పాత్ర విజయ్ సేతుపతి వేసి వుంటే యూత్ కి ఈ యమ సీరియస్ సినిమాతో హుషారొ చ్చేదేమో.

        తెర మరుగైన హీరో వరుణ్ సందేశ్ విలనీ అయినా సరదాగా చేయకుండా సైకోలా బిహేవ్ చేస్తాడు. అనసూయ కూడా సీరియస్సే. అందరూ సీరియస్సే హార్రర్ సినిమాలాగా. సందీప్ కిషన్ గెటప్ మార్చుకున్నాడు గానీ, సీరియస్ లుక్ తో నటించడానికి తగినన్ని భావోద్వేగాల్లేవు కథలో. బాగా చేసింది ఫైట్లు ఒక్కటే. ప్రేక్షకులతో తను కనెక్ట్ అవ్వాలంటే చిన్నప్పటి  ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే బలంగా వుంటే చాలదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తను లేడు, చైల్డ్ ఆర్టిస్టు వున్నాడు. ప్రస్తుత కథలో తనున్నప్పుడు, ఫ్లాష్ బ్యాక్ లోని భావోద్వేగాలు ప్రస్తుత కథలోకి వచ్చేలా అంతకంటే బలమైన కథనముండాలి.  

        కథా కథనాలు, పాత్రలు ఇలా వుంటే,, వీటిని తెరకెక్కించిన విధానం మాత్రం మహోజ్వల చిత్రరాజం అన్పించేలా వుంటుంది. కెమెరాకి  తీసుకున్న షాట్స్, లైటింగ్, కలర్ స్కీమ్ అన్నీ పీరియడ్ మూవీ జానర్ విలువలతో వున్నాయి. వీటితో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పోటీ పడింది. సందీప్ కిషన్ కి టెక్నికల్ గా గర్వించే మూవీ దక్కింది, విషయపరంగా మాత్రం హిట్ కి సుదూరంగా వుండిపోయింది.
—సికిందర్