రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

1300 : రివ్యూ!


 

రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్
తారాగణం : సుహాస్, టీనా శిల్ప రాజ్, శ్రీ గౌరీ ప్రియ,శీష్ విద్యార్థి, రోహిణి,  గోపరాజు రమణ తదితరులు
ఛాయాగ్రహణం : వెంకట్ శామూరి, సంగీతం (పాటలు) : శేఖర్ చంద్ర, నేపథ్య సంగీతం : కళ్యాణ్ నాయక్
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
విడుదల : ఫిబ్రవరి 3, 2023

లర్ ఫోటో’, హిట్ 2 వంటి సినిమాల్లో నటించిన వర్ధమాన హీరో సుహాస్ రైటర్ పద్మభూషన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దీన్ని తెరకెక్కించాడు. విడుదలకి ముందు పెయిడ్ ప్రీమియర్లతో నిర్మాతలు హడావిడి చేశారు. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ సినిమాతో ఈ హడావిడి బాగానే కలెక్షన్లు రాబట్టింది. ఇంత హైప్ తీసుకు రావడానికి ప్రయత్నించిన సినిమాలో అసలేముందో తెలుసుకుందాం... 

కథ
        విజయవాడలో పద్మభూషన్ (సుహాస్) అసిస్టెంట్ లైబ్రేరియన్. తల్లిదండ్రులు (ఆశీష్ విద్యార్థి- రోహిణి) అతడితో ప్రేమగా వుంటారు. భూషణ్ నవలా రచయిత కావాలన్న కోరికతో ఓ నవల రాసి అచ్చేస్తాడు. ఆ నవల ఎవరూ కొనరు. దాన్ని జనాలచేత చదివించడానికి విఫల యత్నాలు చేస్తాడు. ఇంతలో కొన్ని స్ఫర్ధలతో విడిపోయిన ధనికుడైన మేనమామ (గోపరాజు రమణ) వచ్చి భూషణ్ కి కూతుర్ని ఇస్తానంటాడు. ఎంగేజిమెంటు అనుకుంటారు. మేనమామ కూతురు సారిక (టీనా శిల్పారాజ్) భూషణ్ రాసిన తాజా నవల చదివానని చూపిస్తుంది. భూషణ్ కంగారు పడతాడు. ఆ నవల తను రాయలేదు. కానీ ఆ నవలతో తను పాపులర్ అయిపోతాడు. దీంతో మేనమామ అతడ్ని ఆకాశానికెత్తేస్తాడు. భూషణ్ కి భయం పట్టుకుంటుంది. ఆ నవల తను రాయలేదని తెలిస్తే మేనమామ ఎంగేజిమెంటు క్యాన్సిల్ చేస్తాడని భయపతాడు.
        
ఇంతకీ ఆ నవల భూషణ్ పేరు మీద ఎవరు రాశారు, ఎందుకు రాశారు? ఇది తెలుసుకున్న భూషణ్ ని కలవర పెట్టిన విషయమేమిటి? దాన్ని ఎలా హేండిల్ చేసి ఎంగేజిమెంటుని కాపాడుకున్నాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఓల్డ్ స్కూలు డ్రామాతో కూడిన కథ. నవలా రచయిత, నవలలు చదివే పాఠకులు, పాపులారిటీ అన్నవి 80 లనాటి మాట. నాన్ ఫిక్షన్ పుస్తకాలు అమ్ముడవుతున్న ఈ రోజుల్లో ఫిక్షన్ రచయిత అవడం కంటే, స్క్రిప్టు రాసుకుని విజువల్ మీడియా అయిన సినిమా ఫీల్డుకే వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తారు. ఇవ్వాళ విజయవాడలో పబ్లిషర్ల చుట్టూ కంటే టాలీవుడ్ లో తిరిగే రచయితలున్నారు. హిందీలో కూడా నవలలు రావడం లేదు, దళిత సాహిత్యం తప్ప. నవలా సాహిత్యమంతా ఇంగ్లీషు భాష హైజాక్ చేసింది. దీనికే పాఠకులున్నారు.

        
ఈ కథ ఈ రోజుల్లో తెలుగులో నవల రాయాలనుకున్న వాడిది గనుక, ఈ నవలా రచయితతో 1980ల కాలం నుంచి బయటికి రాని కథగా, పాత్రలుగా ఇది వుంటుంది. ఆ నాటి సినిమా చూస్తున్నట్టు సన్నివేశాలూ, డ్రామా వగైరా వుంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోకుండా వాళ్ళ కలల్ని అణిచేయడం తగదన్న చివర్లో ఇచ్చిన మెసేజ్ కూడా ఆ కాలానికే చెందుతుంది.
        
కథా వస్తువలా వుంచితే, రచయిత- అతడి రచన చుట్టే సాగే చివరి వరకూ కథనమంతా అన్నివర్గాల ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్నది చూడాలి. పరిమిత మార్కెట్ యాస్పెక్ట్ గల కథ ఇది. కథా నాయకుడు ఎంటర్ టైన్మెంట్ గా తొలి అడుగు అనే నవల రాయకుండా, ఇన్ఫో టైన్మెంట్ గా దేశం ఎటు పోతోంది అని నాన్ ఫిక్షన్ రాసి వుంటే, దేశం గురించిన చర్చతో ప్రేక్షకుల ఆసక్తి పెరిగే అవకాశముండేది. నవల్లో పాత్రల గురించి చర్చిస్తే ఎవరికాసక్తి వుంటుంది.
        
ఫస్టాఫ్ కథనం అచ్చేసిన నవలని అమ్ముకునే ప్రయత్నాలతో, అందులోని బాధతో సాగుతూ, మరదలితో సంబంధం అనుకున్నాక, తన పేరుతో ఇంకెవరో నవల రాసిన మలుపుతో అసలు కథకి ఆసక్తికర పునాది ఏర్పడుతుంది. అయితే ఈ డూప్ రచయితని కనుక్కునే ఈ ఆసక్తికర పాయింటుతో, గోల్ తో కథ నడపకుండా, మరదలితో ప్రేమాయణం, ఆ ప్రేమాయణంలో అసలు రచయిత తను కాదన్న గిల్టీ ఫీలింగూ వగైరాలతో కథనం పక్కదోవ పట్టి, ఇంటర్వెల్లో ఆ డూప్ రచయితని పట్టుకున్నాక- సెకండాఫ్ లో డూప్ రచయితతో, తన ఎంగేజి మెంటులోగా ఇంకో నవల రాయించే కథనమే మళ్ళీ బోరు కొట్టించే ప్రమాదంగా మారింది.
        
ఎంగేజిమెంటుకి కొత్త నవల ఆవిష్కరణ కూడా జరగాలన్న మేనమామ ఆశయాన్ని తీర్చకపోతే పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అవుతుందన్న కాన్లిక్ట్ పాయింటే అతిగా, సినిమాకి సరిపోనంత బలహీనంగా వుంటే, దీనికి డూప్ రచయితతో ఇంకో నవల రాయించే యాక్షన్ పార్టు వున్న కాన్ఫ్లిక్ట్ ని కూడా చల్లార్చేసింది. ఈ మొత్తం కథలో ప్రత్యర్థి పాత్ర లేకపోవడం పాసివ్ కథనానికి దారి తీసింది. డూప్ రచయిత రాయనని ఎదురు తిరిగే ప్రత్యర్ధి పాత్రగా మారి  వుంటే, ఎంగేజిమెంటు గురించిన సఘర్షణతో కథ బలపడేది.
        
దర్శకుడు అసలు చెప్పాలనుకున్న విషయం ముగింపులో వుంది. దీన్ని నమ్ముకునే మొత్తం కథనం చేశాడు. ఆ కథనం ఎలా వున్నా ముగింపులో చెప్పాలనుకున్న విషయమే కాపాడుతుందని అనుకున్నట్టు వుంది. దానికైనా అకస్మాత్తుగా ముక్క తెచ్చి అతికించినట్టు గాకుండా లీడ్ వుండాలి. సెకండాఫ్ లో దీనికి పునాది వేసే లీడ్ తో కథనం చేస్తూ, డూప్ రచయితతో సంఘర్షణ సృష్టించకపోవడంతో, మళ్ళీ రచనా వ్యాసంగపు కథనమే చేయడంతో, సెకండాఫ్ మరీ కాలానికి దూరంగా, 80 ల నాటి డ్రామాగా వుండిపోయింది.

నటనలు –సాంకేతికాలు

 నవలా రచయితగా తిప్పలు పడే వాస్తవ దూర పాత్రలో సుహాస్ తన సహజ ధోరణిలో నటించేశాడు. ఇది కామెడీ పాత్ర కాబట్టి అలాటి ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. తనలో లేని రచయితతో రచయితగా పాట్లుపడే పాత్రచిత్రణతో కామెడీ పుట్టించే ప్రయత్నం బాగానే చేశాడు. అయితే పాత్రగా నిలబడ్డానికి అసలు తానేం కోరుకుంటున్నాడో స్పష్టత లేదు. డూప్ రచయితని పట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలని కాసేపు, డూప్ రచయిత వల్ల వస్తున్న పాపులారిటీని ఎంజాయ్ చేయాలని కాసేపు, తను రాయకుండా డూప్ రచయితతో రాయించి మేన మామని మభ్య పెట్టి ఎంగేజి మెంటు చేసుకోవాలని  కాసేపు- ఇలా స్పష్టమైన గోల్ లేకపోవడంతో, తన పాత్ర మీదే ఆధార పడ్డ వినోదాత్మక విలువలు అంతంత మాత్రంగా వుండిపోయాయి. చివరి వరకూ అతను పాసివ్ పాత్రే. ఈ రోజుల్లో నవలా రచయితకి పాపులారిటీ రావడం, నగరమంతా పండగ చేసుకోవడం, మీడియా వాళ్ళు ఎగబడడం ఎక్కడ జరుగుతుంది. 80 లలో జరిగిందేమో. హీరోకి ఇలాటి ఫాల్స్ బిల్డప్ వర్కౌట్ కాలేదు.

హీరోయిన్ టీనా శిల్పారాజ్ ఫస్టాఫ్ లో లీడ్ తీసుకుని సెకండాఫ్ లో సెకెండ్ హీరోయిన్ శ్రీ గౌరీప్రియ రాకతో పని లేకుండా వుండి పోయింది- అప్పుడప్పుడు హీరోతో విభేదించడం తప్ప. అయితే నటించడం బాగానే నటించింది. కానీ ఏ టాలెంటూ, డబ్బూ లేదని తెలిసీ డబ్బున్న తను ఎందుకు హీరోని చేసుకోవాలనుకుంటోందో తెలీదు. రచయిత పాపులరవడం, ఆ రచయితకి కూతుర్నివ్వాలని తండ్రి నిర్ణయించడం ఎక్కడ జరుగుతుందో తెలీదు. తండ్రి తీసుకున్న ఇలాటి నిర్ణయాన్నే కూతురు శిరసావహిస్తే, అది ఈ సినిమా ముగింపులో ఇచ్చిన మెసేజికే విరుద్ధం.  
         
సెకెండ్ హీరోయిన్ శ్రీ గౌరీప్రియ చివర్లో మలుపు తిప్పే పాత్రగా  వుంటుంది. అంతవరకూ ఆమెతో కథనం సెకండాఫ్ కి భారం. హీరో తల్లిదండ్రులుగా ఆశీష్ విద్యార్థి, రోహిణీలు, హీరోయిన్ తండ్రిగా గోపరాజు రమణ ఫ్యామిలీ డ్రామాకి, సెంటి మెంట్లకి, మెలోడ్రామాకీ, మెసేజికీ పనికొచ్చిన పాత్రలు. ముగింపులో బరువైన ఎమోషనల్ సన్నివేశం వీళ్ళదే.
        
పూర్తిగా విజయవాడ లొకేషన్స్ లో చిత్రీకరణ బావుంది.  లెనిన్ రోడ్లో పుస్తకాల షాపులు చూపించారు. అలంకార్ సెంటర్లో, ఏలూరు రోడ్డులో ఇప్పుడు లేవు కాబట్టి చూపించ లేదు. అయితే విశాలాంధ్రలో హీరో పుస్తకాలు అమ్మకానికి పెట్టినట్టు చూపి వుంటే విజువల్ అప్పీల్ వుండేది. వెంకట్  శాఖమూరి ఛాయాగ్రహణం బావుంది. శేఖర్ చంద్ర సంగీతంలో పాటలు సన్నివేశపరంగా బావున్నాయి. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం కూడా బావుంది. ప్రొడక్షన్ విలువలు పరిమిత బడ్జెట్ ప్రకారం వున్నాయి. మొత్తం మీద కొత్త దర్శకుడు తెలుగు సినిమాకి తెలుగుదనం తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మెచ్చదగిందే గానీ, కమర్షియల్ సినిమాలో తెలుగు సాహిత్యం వాడకమే మరీ నేలవిడిచి సాము చేసింది.
—సికిందర్