రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఫిబ్రవరి 2023, గురువారం

1299 : స్పెషల్ ఆర్టికల్

ఠాన్ వైరల్ విజయం నేపథ్యంలో ప్రధాన స్రవంతి భారతీయ సినిమాలు హాలీవుడ్‌కి చౌకబారు నకళ్ళుగా మారడం ప్రారంభించాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుంచి కామెంట్ వచ్చింది. ప్రధాన స్రవంతి భారతీయ సినిమాలు ఒరిజినాలిటీని కోల్పోయి  హాలీవుడ్ యాక్షన్ సినిమాలకి చౌకబారు నకళ్ళుగా మారిపోయాయనీ, ఒకప్పుడు భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయనీ చెబుతూ ఆవారా’, ‘డిస్కో డాన్సర్ వంటి సినిమాల్ని ప్రస్తావించాడు. డిస్కోడాన్సర్ లోని  జిమ్మీ జిమ్మీ సాంగ్ రష్యాలో సంచలనం సృష్టించిందనీ పేర్కొన్నాడు.

ఫ్రికాకి వెళ్ళినా, అరబ్ దేశాలకెళ్ళినా భారతీయత (నేటివిటీ) కారణంగా భారతీయ ప్రధాన స్రవంతి సినిమాలు భారీ ప్రభావం చూపేవనీ, ఇప్పుడు మనం ఆ ఒరిజినాలిటీని కోల్పోయామనీ చెప్పాడు. అదే దక్షిణ సినిమాలు ఇప్పటికీ తమ మూలాల్ని మర్చిపోలేదనీ, అవి ఇప్పటికీ భారతీయ సినిమాల వలె కనిపిస్తాయనీ, కానీ చాలా హిందీ ప్రధాన స్రవంతి సినిమాలలా కన్పించవనీ, పైగా వీటిని స్వదేశంలో కూడా చిత్రీకరించడం లేదనీ, వాటిలో ఏదీ భారతీయతకి సంబంధించి వుండడం లేదనీ స్పష్టం చేశాడు.

జర్నలిస్టు అభిశార్ శర్మ కూడా ఇదే చెప్పాడు. పఠాన్ లో భారతీయత లోపించిందనీ, అదే ఒకప్పటి షోలే’, గదర్ వంటి యాక్షన్ సినిమాలకి భారతీయతే జీవం పోసిందనీ, అందుకనే వాటిని ప్రేక్షకులు పదేపదే చూసేవాళ్ళనీ, పఠాన్ ని రెండోసారి చూసే ప్రేక్షకులు వుండరనీ సమీక్షించాడు.

ఇద్దరి వ్యాఖ్యలు కరెక్టే. పఠాన్ పూర్తిగా పాశ్చాత్యీకరించిన భారతీయ ప్రధాన స్రవంతి సినిమా. మార్వెల్ సినిమాలు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, మిషన్ ఇంపాసిబుల్ వంటి హాలీవుడ్ సినిమాల్నే మళ్ళీ చూపించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. పూర్తిగా విదేశాల్లోనే జరిగే స్పై కథ. విదేశాల్లో జరిగే స్పై కథ కాబట్టి భారతీయతకి అవకాశం లేదనలేం. విదేశాల్లో యాక్షన్ కి పాల్పడుతున్న గూఢచారి హీరో (షారుఖ్), అంతర్జాతీయ విలన్ (జాన్ అబ్రహాం) కూడా భారతీయ పాత్రలే. హీరోయిన్ (దీపికా పడుకొనే) పాకిస్థానీ పాత్ర. కథా పరంగా హాలీవుడ్ సినిమాలకి అనుకరణ అంటూ విమర్శలకి గురైనా, ఆ కథలో వున్న భారతీయ పాత్రలతో భారతీయతని సమకూర్చవచ్చు. హీరోని పక్కా హిందీ మాస్ లక్షణాలున్న హీరోగా, విలన్నీ పక్కా హిందీ సినిమాల విలన్ గా చూపించి సినిమాలో భారతీయత ఫీల్ ని నింపెయ్యొచ్చు.
        
నిర్మాత ఆదిత్యా చోప్రా వై ఆర్ ఎఫ్ (యశ్ రాజ్ ఫిలిమ్స్) స్పై యూనివర్స్ సిరీస్ లో నాల్గోదిగా పఠాన్ తీశాడు. నాల్గూ పెద్ద హిట్టయ్యాయి. 2012 లో ఏక్ థా టైగర్’, 2017 లో టైగర్ జిందా హై’, 2019 లో వార్ తీశాక, 2023 లో పఠాన్ తీశాడు. ఏక్ థా టైగర్ సల్మాన్ ఖాన్ తో దర్శకుడు కబీర్ ఖాన్ తీశాడు. టైగర్ జిందా హై సల్మాన్ ఖాన్ తో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తీశాడు. రెండూ విదేశాల్లో జరిగే కథలే అయినా సల్మాన్ క్యారక్టర్ తో భారతీయత పుష్కలంగా వుంది. అతను మాస్ స్టార్ కాబట్టి, భాయ్ కూడా కాబట్టి, అలాగే కన్పించి నేటివిటీని కాపాడాడు.
        
వార్ ని హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ లతో వేరే స్కూలు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీశాడు. ఇది కూడా విదేశాల్లో జరిగే కథ. ఇందులో హాలీవుడ్ సినిమాలే తప్ప ఇండియన్ సినిమా కనిపించదు. ఇద్దరు హీరోల్లో భారతీయత కనిపించదు. వేరే స్కూలుకి చెందిన ఈ దర్శకుడే తీసిన పఠాన్ తోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మైత్రీ మూవీస్ తెలుగు నిర్మాత ఈ దర్శకుడితోనే ప్రభాస్ సినిమా తీయడానికి లైనులో పెడుతున్నారు.
        
2015 లో సల్మాన్ ఖాన్ తో దర్శకుడు కబీర్ ఖాన్ తీసిన భజరంగీ భాయిజాన్ ఇండో -పాక్ యాక్షన్ థ్రిల్లర్ లో భారతీయత గురించి తెలిసిందే. ఇది చైనాలో లిటిల్ లోలిటాస్ మంకీ గాడ్ అంకుల్ గా విడుదలై అక్కడా 8000 థియేటర్లలో అతి పెద్ద హిట్టయ్యింది. 2016 లో అమీర్ ఖాన్ తో దర్శకుడు నీతేష్ తివారీ తీసిన దంగల్ కూడా భారతీయతతో చైనాలో సైతం పెద్ద హిట్. స్పై క్యారక్టర్ జేమ్స్ బాండ్ బ్రిటిషీయుడు. హాలీవుడ్ తీసే జేమ్స్ బాండ్ సినిమాల్లో అతను అమెరికన్ కల్చర్ తో వుండడు.
         
ఆవారా (1951) వంటి రాజ్ కపూర్ సినిమాలు ఇండియన్ కల్చర్ తోనే రష్యాలో విపరీతంగా ఆకర్షించేవి. మేరా జూతా హై జపానీ, యే పటలూన్ ఇంగ్లీష్ స్థానీ, సర్ పే లాల్ టోపీ రుసీ, ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ (నా కాలి జోళ్ళు జపానీ, ఈ లాగు ఇంగ్లీష్ స్థానీ, తలకి ఎర్ర టోపీ రష్యన్, అయినా నా హృదయం హిందూస్థానీ) - అన్న రాజ్ కపూర్ పాట రష్యన్లకి పిచ్చెత్తించింది. ఇలాటి క్యారక్టర్లు కావాలి భారతీయతకి. భారతీయతకి ఏ భారత ప్రభుత్వమూ ప్రాతినిధ్యం వహించలేదు.   విదేశాల్లో ఇండియా అంటే హిందీ సినిమాలుగానే ఇప్పటికీ గుర్తింపు.
        
బి. సుభాష్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డాన్సర్ (1982) లో, జిమ్మీ జిమ్మీ జిమ్మీ...ఆజా అజా అనే హృదయం పగిలిన ప్రియురాలి పాట లాంటిది ఇప్పటికీ లేదు. ఇది డిస్కోమాస్టర్ బప్పీలహరీ అద్భుత సృష్టి. ఈ రికార్డులు చైనా, రష్యాల్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి- సినిమా సూపర్ హిట్టవడంతో బాటు.
        
గతంలో ఎప్పుడో పాశ్చాత్య సినిమాలని హిందీలో తీయలేదని కాదు. మేగ్నిఫిషెంట్ సెవెన్ (హాలీవుడ్) సెవెన్ సమురాయ్ (జపాన్) వంటి సినిమాల ఆధారంగానే షోలే (1975) తీశారు. అయినా ఇది విదేశీ సినిమాలా వుండదు. పక్కా ఇండియన్ మాస్ సినిమా. ఇది ఎంతగా ప్రేక్షకుల నరనరాన ఇంకిందో గబ్బర్ సింగ్ డైలాగులే చెప్తాయి. ఈ సినిమా మీద అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాలే జరిగాయి.
        
అనిల్ శర్మ దర్శకత్వంలో సన్నీడియోల్- అమీషా పటేల్ లు నటించిన  గదర్ (2001) ఇండో- పాక్ సీమాంతర ప్రేమ కథ. అడుగడుగునా భారతీయతతో పూర్తి స్థాయి యాక్షన్ మూవీ. షోలే నీ, గదర్ నీ పదే పదే ప్రేక్షకులు చూసేవాళ్ళు. ఇప్పుడు రెండో సారే చూడ్డం లేదు ప్రేక్షకులు. 1000 థియేటర్లలో 200 కోట్లు కలెక్షన్లు లాగేసే టార్గెట్ తోనే వుంటున్నారు. నిర్మాతలు. అదే 1000 థియేటర్లలో ప్రేక్షకులు రెండోసారి, మూడోసారి చూసేలా సినిమాలు తీస్తే 400 కోట్లు, 600 కోట్లు వస్తాయని ఆలోచించడమే లేదు. రిపీట్ ఆడియెన్స్ అన్న మాటే మర్చిపోయారు. రిపీట్ ఆడియెన్స్= భారతీయత.
—సికిందర్