రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, January 31, 2023

1298 : రివ్యూ!

రచన- దర్శకత్వం : శంతను బాగ్చీ
తారాగణం : సిద్ధార్థ్ మల్హోత్రా, రశ్మికా మందన్న, అవంతికా అకర్కర్, పర్మీత్ సేథీ, అవిజిత్ దత్, రజిత్ కపూర్, అశ్వథ్ భట్, జాకీర్ హుస్సేన్, మీర్ సర్వర్, కుముద్ మిశ్రా తదితరులు
సంగీతం : కేతన్ సోధా, ఛాయాగ్రహణం : బిజితేష్ డే
బ్యానర్ : ఆర్ ఎస్ విపి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్ ఎల్ పి
నిర్మాతలు : రోనీ స్క్రూ వాలా, అమర్ బుటాలా, గరీమా మెహతా 
విడుదల : జనవరి 20, 2023 (నెట్ ఫ్లిక్స్)
***
            మిషన్ మజ్నూ కొత్త దర్శకుడు శంతను బాగ్చి నుంచి స్పై థ్రిల్లర్ గా వచ్చి విడుదలకి విఫలయత్నాలు చేసింది. గత సంవత్సరం రెండు సార్లు విడుదల తేదీలు వృధా అయ్యాక, ఇక లాభం లేదని ఓటీటీలో విడుదలైంది. జనవరి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా రశ్మికా మందన్న వంటి పాపులర్ హీరో హీరోయిన్లే నటించారు. రోనీ స్క్రూవాలా అనే పెద్ద నిర్మాతే నిర్మించాడు. అయినా వెండి తెరని చవిచూడలేకపోయింది. ఇది పాకిస్తాన్లో ఒక భారతీయ గూఢచారి కథ. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది. పాటలు హిందీలోనే వున్నాయి. ముందుగా కథేమిటో చూద్దాం...  

కథ

జపాన్ మీద అమెరికా  అణుబాంబు వేసి రెండో ప్రపంచ యుద్దాన్ని పరిసమాప్తం చేశాక, ప్రపంచంలో అణ్వస్త్రాల పోటీ పెరిగింది. మనదేశం 1974 లో ఫోఖ్రాన్ లో అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించడంతో  ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. దీంతో పాకిస్థాన్ ప్రధాని జుల్ఫికరలీ భుట్టో (నిజ జీవిత పాత్ర నటించింది రజిత్ కపూర్) తీవ్ర నిర్ణయం తీసుకుంటాడు. ఐఎస్సై చీఫ్ మక్సూద్ ఆలం (నిజ జీవిత పాత్ర నటించింది శిశిర్ శర్మ) ని పిలిచి అణుపరీక్షకి రెడీ అవమంటాడు. మక్సూద్ ఆలం నెదర్లాండ్స్ లో వుంటున్న అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ (నిజ జీవిత పాత్ర నటించింది మీర్ సర్వర్) ని రప్పించి బాధ్యత అప్పగిస్తాడు. అణుపరీక్షకి అవసరమైన విడిభాగాల్ని బ్లాక్ మార్కెట్ నుంచి సమకూర్చుకుంటారు.
        
ఇలా వుండగా మన దేశంలో రా చీఫ్ ఆర్ ఎన్  కావో (నిజ జీవిత పాత్ర నటించింది పర్మీత్ సేథీ) దీన్ని పసిగడతాడు. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ (అవంతికా అకర్కర్) ఆమోదంతో పాకిస్తాన్లో ఆపరేషన్ మొదలెడతాడు. ఆల్రెడీ పాకిస్తాన్లో వుంటున్న ముగ్గురు రా ఏజెంట్లకి అణు కర్మాగారం ఎక్కడ నెలకొల్పుతున్నారో ఆరా తీయాల్సిందిగా ఆదేశిస్తాడు. ఈ సమాచారం ఇజ్రాయెల్ కి అందిస్తే ఇజ్రాయెల్ పాకిస్తాన్లో ఆ స్థావరం మీద వైమానిక దాడి జరిపి ధ్వంసం చేస్తుందని ప్లాను.
        
పాకిస్తాన్లో రహస్య ఏజెంట్లుగా వుంటున్న ముగ్గుర్లో ఒకడైన తారిక్ పేరుతో చెలామణీ అవుతున్న అమన్‌ దీప్ సింగ్ (సిద్ధార్థ్ మల్హోత్రా) టైలర్‌గా పని చేస్తూంటాడు. అతను నస్రీన్‌ (రశ్మికా మందన్న) అనే అంధురాలిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఢిల్లీలో తారిక్ హ్యాండ్లర్ శర్మ (జాకీర్ హుస్సేన్) నేతృత్వంలో మిషన్ మజ్నూ పేరుతో ఆపరేషన్ మొదలవుతుంది.
        
ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎంతకాలం కొనసాగింది, ఇరు దేశాల్లో అధికార మార్పిడితో ఏఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏ అత్యవసర పరిస్థితులేర్పడ్డాయి, వీటన్నిటినీ  తట్టుకుని తారిక్ ఈ ఆపరేషన్ని విజయవంతం చేశాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

చారిత్రక అంశాలతో స్పై థ్రిల్లర్ జానర్ కథ చెప్పాలనుకోవడం మంచిదే. కానీ చెప్పడం కూడా రావాలి. ముందుగా స్పై స్పైలాగా వుండాలి, థ్రిల్లర్ థ్రిల్లర్ లాగా వుండాలి. ఈ రెండూ లేకపోయాక చారిత్రక అంశాలతో  కేవలం డాక్యుమెంటరీ లాగా మిగిలిపోతుంది. డాక్యుమెంటరీలో విషయాలే బావున్నాయి. 1971 లో పాకిస్తాన్ మూడో సారి యుద్ధం ఓడిపోయాక, గూఢచార సంస్థ రా వ్యవస్థాపక చీఫ్ ఆర్ ఎన్ కావ్ ఈ కథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది సినిమా. కానీ రా చీఫ్ అంతటి వాడు స్పై ఆపరేషన్ కథ ఇంత పేలవంగా చెప్తాడా అన్నట్టు వుంటుంది దర్శకుడి పనితనం. 
        
కథకి పనికొచ్చే చారిత్రక ఘటనలు బావున్నంతగా కథ లేదు. కథ క్రోనాలజీ కూడా సవ్యంగా లేదు. తారిక్ భార్య నస్రీన్ 1977 లో ఐక్యరాజ్య సమితి భారత్ జరిపిన అణుపరీక్షని నిలుపుదల చేసినప్పుడు గర్భవతైతే, 1979 లో పాక్ మీద ఇజ్రాయెల్ దాడికి సమాయత్తమవుతున్నప్పుడు కూడా గర్భాన్ని మోస్తూనే వుంటుంది. కథ ముగింపులో కూడా గర్భాన్ని మోస్తూనే వుంటుంది. అదేం గర్భమో ఏమిటో అర్ధం గాదు. మదర్ సెంటి మెంటు సీన్ల కోసం ఆమె డెలివరీని సాగదీస్తూ, టైమ్ టేబుల్ ని మర్చిపోయాడు దర్శకుడు.         

1974 లో ఇండియా అణుపరీక్ష జరిపినప్పుడు పోటీగా పాక్ ప్రధాని జుల్ఫికరలీ భుట్టో రెండు చర్యలకి పాల్పడతాడు- ఒకటి, అణుపరీక్షకి ఆదేశించడంతో బాటు, అందుకు అవసరమైన నిధుల్ని లిబియా పాలకుడు కల్నల్ గడాఫీ నుంచి సేకరించడం, రెండు- ఐక్యరాజ్య సమితిలో ఇండియా అణు కార్యక్రమాల్ని నిలుపుదల చేయించడం.
        
దీంతో ప్రధాని ఇందిరా గాంధీ అసలు వాళ్ళ అణు స్థావరం ఎక్కడ నెలకొల్పుతున్నారో తెలుసుకుని పేల్చేయమని రా చీఫ్ ని ఆదేశిస్తుంది. ఆ తర్వాత 1975 లో ఎమర్జెన్సీ విధిస్తుంది. 1977 ఎన్నికల్లో ఆమె అధికారం కోల్పోయి మొరార్జీ దేశాయ్ ప్రధాని అవుతాడు. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని ఆపరేషన్ని ఆపేయమంటాడు రా చీఫ్ తో. దీనికి సమ్మతించని రా చీఫ్ రాజీనామా చేస్తాడు. ఆపరేషన్ మాత్రం అనధికారికంగా కొనసాగుతూనే వుంటుంది.
        
1977 లోనే పాక్ ప్రధాని భుట్టోని జైల్లో వేసి జనరల్ జియావుల్ హక్ నియంత అవుతాడు. మొరార్జీ దేశాయ్ కి ఫోన్లు చేసి మాట్లాడుతూంటాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. 1979 లో ఇజ్రాయెల్ పాక్ నిర్మిస్తున్న అణుస్థావరం మీద దాడికి సిద్ధమవుతున్న సమాచారమందడంతో, మొరార్జీదేశాయ్ జియావుల్ హక్ కి ఫోన్ చేసి- కహుటాలో ఏం చేస్తున్నారు మీరు. మా దగ్గర ఎవిడెన్స్ వుంది, మూసి పారెయ్యండి -  అని ఫైర్ అవుతాడు. ఈ రహస్యం ఎలా పొక్కిందని జియా అధికారులమీద చిందులేసి, అణు కార్యక్రమాలు ఆపేస్తాడు. ఆ విధంగా ఇజ్రాయెల్ దాడి కూడా తప్పుతుంది.
        
ఇలాటి చారిత్రక మలుపులతో నడిపిన కథ స్పై కథ జానర్  మర్యాదలతో వుండదు. లవ్, ఫ్యామిలీ, ప్రెగ్నెన్సీ, మదర్ సెంటిమెంటూ లాంటివి పెట్టి చెడగొట్టాడు. స్పైకి పెళ్ళాం ఏమిటి? జేమ్స్ బాండ్ కి పెళ్ళాం వుంటుందా? స్పై అనేవాడికి తన సుఖం కాదు, ప్రపంచ బాధ. చివర్లో తప్ప యాక్షన్ సీన్లు, థ్రిల్లింగ్ అడ్వెంచర్లు వుండవు. మధ్యమధ్యలో భార్య గర్భం సీన్లు కథకి అడ్డుతగులుతూ వుంటాయి. చివరి ఆస్పత్రి సీన్లో కూడా డాక్టర్ పరీక్షించి, ఇంకా డెలివరీ కావడం లేదేమిటని అనుమానించకుండా, ఫర్వా లేదు బాగానే వుందని అంటుంది. రెండేళ్ళు కాదు, ఇంకో నాల్గేళ్ళు బాగానే వుంటుంది. సీక్వెల్ తీసి  డెలివరీ చేస్తాడేమో.
        
ఇంకో విచిత్రమేమిటంటే, ఎప్పుడో 1974 లో ప్రారంభించిన ఆపరేషన్ 1979 వరకూ అణుస్థావరం కనుక్కోవడానికి కుంటి నడకన సాగుతూనే వుంటుంది. బయాలజీ, క్రోనాలజీ రెండూ కన్ఫ్యూజ్ చేస్తాయి.

నటనలు- సాంకేతికాలు

హీరో సిద్దార్థ్ మల్హోత్రా గూఢచారిలా కాక, టైలరింగ్ ని ఎంజాయ్ చేస్తున్న టైలర్ లా వుంటాడు. ఏదైనా కూపీ లాగుతున్నప్పుడు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు వుంటాయి సీన్లు. చాలా పాత సినిమా హీరోలా చాదస్తంగా కనిపిస్తాడు. కథలో పాకిస్తాన్లో టైలర్ కావచ్చు, ప్రేక్షకులకి స్ప్పైలాగా వుండాల్సిన షేడ్, డైనమిక్స్ లేక- ఎంత సోది మనిషిలా వుంటాడో, కథా నాయకుడిగా నడిపే కథ కూడా అంత సోది చెప్తున్నట్టు నడిపిస్తాడు.
        
ఇక రశ్మిక పాత్రకి అంధత్వం కథకేం పనికొచ్చిందో అర్ధం గాదు. సినిమా సాంతం గర్భాన్ని మోస్తూ వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్ లా వుంటుంది. ఏం చూసి ఈ డబుల్ ట్రబుల్ (అంధత్వం + గర్భం) పాత్ర నటించిందో ఆమెకే తెలియాలి. ఈ స్పై కథలో ఏ శత్రువు నుంచీ  ఏ ప్రమాదమూ లేకుండా ఇంటి పట్టున గ్లామర్ పోషణ చేసుకుంటూ వుంటుంది.
        
ఇక చారిత్రక పాత్రలు పోషించిన నటీనటులదే ఈ సినిమా. వాళ్ళ సీన్లు అంత వేడిని పుట్టిస్తాయి. వాళ్ళతో  డాక్యుమెంటరీ సీన్లు తీసేస్తే సినిమాలో చెప్పుకోవడానికేం లేదు. సంగీతం, ఛాయాగ్రహణం కూడా బలహీనమే. ఒక మంచి కాన్సెప్టుని వృధా చేశాడు కొత్త దర్శకుడు.
—సికిందర్