రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జనవరి 2023, ఆదివారం

1287 : సండే స్పెషల్ రివ్యూ!


బ్రిక్ ఫేమ్ బ్రియాన్ జాన్సన్ మళ్ళీ వచ్చేశాడు. 2019 లో తీసిన హిట్ నైవ్స్ ఔట్ సీక్వెల్ తో. 2005 లో నియోనోయర్ జానర్ ని టీనేజర్స్ తో కాలేజీ మర్డర్ మిస్టరీగా ప్రయోగం చేసి విజయం సాధించిన జాన్సన్, ఆ తర్వాత నైవ్స్ ఔట్ ని ఆగథా క్రిస్టీ నవలల శైలిలో తీసి ఇంకో విజయం సాధించాడు. దీనికి సీక్వెల్ గా ఇప్పుడు గ్లాస్ ఆనియన్ : ఏ నైవ్స్ ఔట్ మిస్టరీ తీసి ఎందుకో పూర్తి స్థాయి థియేట్రికల్ విడుదల చేయలేదు.అమెరికాలో ఓ వారం థియేట్రికల్ విడుదల చేసి నెట్ ఫ్లిక్స్ కిచ్చేశాడు. నెట్ ఫ్లిక్స్ డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో తిరిగి నైవ్స్ ఔట్ ఫేమ్ మాజీ జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ అదే డిటెక్టివ్ పాత్ర కొనసాగించాడు.

సారి బెడ్జెట్ పెరిగింది, కథ కాన్వాస్ పెరిగింది, లొకేషన్ అందమైన ఐలాండ్ కి మారింది, మూడు సార్లు ఆస్కార్స్ కి నామినేట్ అయిన ఎడ్వర్డ్ నార్టన్ బిలియనీర్ పాత్రలో విచ్చేశాడు, ఒకసారి ఆస్కార్స్ కి నామినేట్ అయిన కేట్ హడ్సన్ ఫ్యాషన్ డిజైనర్ గా నటింఛింది. ఇంకా అనేక కలర్ఫుల్ ఆకర్షణలున్నాయి. మ్యాటర్ ఎలా వుంది? ఇది చూద్దాం...

ఆనియన్ మేడలో ఆగని మర్డర్లు 

కోవిడ్ మహమ్మారి ఉధృతంగా వున్న 2020 మే నెలలో, టెక్నాలజీ కంపెనీ ఆల్ఫా వ్యవస్థాపకుడు, బిలియనీర్ మైల్స్ బ్రాన్ - గ్రీస్ లో తన ప్రైవేట్ ద్వీపంలోని గ్లాస్ ఆనియన్‌ విడిదిలో, వారాంతపు రోజుల్ని ఎంజాయ్ చేయడానికి నలుగురు స్నేహితుల్ని ఆహ్వానిస్తాడు. ఆల్ఫా హెడ్ సైంటిస్ట్ లైనల్, కనెక్టికట్ గవర్నర్ డిబెల్లా, ఫ్యాషన్ డిజైనర్ బర్డీ, ఈమె అసిస్టెంట్ పెగ్, పురుష హక్కుల కార్యకర్త డ్యూక్, ఇతడి గర్ల్ ఫ్రెండ్ విస్కీ తోబాటు - ఇద్దరు అనుకోని అతిధులు- మైల్స్ మాజీ భాగస్వామిని ఆండీ, సుప్రసిద్ధ డిటెక్టివ్ బెనాయిట్ బ్లాంక్ (డేనియల్ క్రేగ్) వచ్చేస్తారు.
       
మైల్స్ ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో వుంటాడు. ఈ ఇంధనానికి క్లియర్ అని పేరు పెట్టాడు. ఇంకో వారంలో విడుదల చేయనున్న క్లియర్ తో  కంపెనీ ప్రపంచాధిపత్యాన్ని వహిస్తుందని ప్రకటిస్తాడు. సముద్ర జలాల నుంచి హైడ్రోజన్ ని తీసి దాంతో విద్యుత్ ఉత్పాదన. ఇంకా పూర్తి పరీక్షలు జరపకుండా క్లియర్ ని ప్రవేశ పెట్టడం ప్రమాదకరమని హెచ్చరిస్తాడు సైంటిస్ట్ లైనల్. ఈ విడిది భవనం గ్లాస్ ఆనియన్ కి క్లియర్ తోనే విద్యుత్ ఏర్పాటు వుందని మైల్స్ చెప్పేసరికి భయపడిపోతారు అతిధులు.         

అతిధులు 16 వ శతాబ్దపు మోనాలిసా చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి అప్పు కావాల్సివస్తే మోనాలిసాని తాకట్టు పెట్టించుకుని ఇచ్చానని అంటాడు మైల్స్. ఆహ్వానం లేకుండా వచ్చిన మాజీ పార్టనర్ ఆండీ మీద ఓ కన్నేసి వుంచుతాడు. ఈమె మైల్స్ మీద కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. అలాగే, ఆహ్వానం లేకుండా వచ్చిన డిటెక్టివ్ బ్లాంక్ ని ప్రశ్నిస్తాడు. తనకి ఆహ్వానం అందిందని చూపిస్తాడు బ్లాంక్. అది చూసి, తను ఆహ్వానం పంపిన వాళ్ళల్లో ఎవరో దీన్ని మీకు పంపి ప్రాక్టికల్ జోక్ ఆడారని అంటాడు  మైల్స్.

ఇలా అందరూ సమావేశమయ్యాక, మర్డర్ మిస్టరీ గేమ్ ఆడదామని ప్రతిపాదిస్తాడు మైల్స్. ఈ గేమ్ లో తను మర్డర్ అవుతాడు, హంతకుడెవరో అతిధులే కనుగొనాలని చెప్తాడు. అయితే ఇంకా గేమ్ ప్రారంభం కాకముందే పురుష హక్కుల కార్యకర్త డ్యూక్, మైల్స్ గ్లాసులో విస్కీ తాగి కుప్పకూలి చనిపోతాడు. భయాందోళనలకి గురైన అతిధులు అండీని అనుమానిస్తారు. చనిపోయిన డ్యూక్ పిస్టల్ మాయమవుతుంది. ఆ పిస్టల్ తో ఆండీ మీద ఎవరో కాల్పులు జరుపుతారు. డిటెక్టివ్ బ్లాంక్ వేగంగా చర్యలు తీసుకుని, ఆండీని చంపిందెవరో చెప్తానని అంటాడు...

ఏమిటీ గేమ్? కాలక్షేపంగా ఆడదామనుకున్న గేమ్ నిజ హత్యలకి దారితీయడమేమిటి? ఎవరు ఎవరితో గేమ్ ఆడుతున్నారు? ఎందుకు ఆడుతున్నారు? అసలు డిటెక్టివ్ బ్లాంక్ ఫేక్ ఆహ్వానమందుకుని రావడం నిజమేనా? అసలు ఆండీ ఎందుకొచ్చింది? దీని కంతటికీ మైల్స్ మార్కెటింగ్ చేయబోతున్న ఇంధనంతో సంబంధముందా? ఈ పజిల్ ని డిటెక్టివ్ బ్లాంక్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ...

క్రేజీ క్రేగ్ తో మరోసారి

మాజీ జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ డిటెక్టివ్ పాత్రతో మరోసారి మాస్టర్ ఇన్వెస్టిగేటర్ గా ఉర్రూతలూగిస్తాడు. నైవ్స్ ఔట్ మొదటి భాగంలోని షెర్లాక్ హోమ్స్- పైరట్ ల హైబ్రిడ్ క్యారక్టర్ని అదే మైక్రోలెవెల్లో నటిస్తాడు. అదే కామిక్ సెన్స్ ని ప్రదర్శిస్తాడు. ఇంటరాగేషన్స్ తో సినిమాని బోరుగా మార్చకుండా యాక్టివ్ క్యారక్టర్ గా వుంటాడు. ఉత్త మేధతో పజిల్స్ ని, గేమ్స్ నీ పరిష్కరించడం పరమ బోరే. మేధకి యాక్షన్ తోడయితేనే మిస్టరీకి ఊపు.  అందుకే నాకు పజిల్సూ వద్దు, గేమ్సూవద్దు. నాక్కావాల్సిందల్లా వెకేషన్. వెకేషన్లో డేంజర్, హంట్, ఛాలెంజ్, ఆఖరికి ఓ గ్రేట్ కేస్ అంటాడు. అన్నట్టు ప్రవర్తిస్తాడు. అంటే తను షెర్లాక్ హోమ్స్ + హెర్క్యూల్ పైరట్ + జేమ్స్ బాండ్ అన్నమాట.

దర్శకుడు బ్రియాన్ జాన్సన్ మాత్రం మొదటి భాగంలో క్రియేట్ చేసిన ఆగథా క్రిస్టీ మిస్టరీ జానర్ మర్యాదల్నే పోషిస్తూ క్రేగ్ ముక్కోణ పాత్రని నడిపాడు. అయితే క్లయిమాక్స్ లో క్రేగ్ లేకపోవడం కొత్త ప్రయోగం. క్లయిమాక్స్ లో హీరో లేకపోవడమేమిటి, ఇదేం సినిమా? ఇలాటి సినిమా వుంది. దొంగరాముడు (1955) లో హీరో అక్కినేని నాగేశ్వరరావు బదులు హీరోయిన్ సావిత్రితో క్లయిమక్సూ దాని ముగింపూ లేదూ, ఇదీ అలాగే.     తను వచ్చిన పని కేసు పరిష్కరించి, మిగతాది తనపని కాదని వెళ్ళిపోతాడు క్రేగ్. ఇక విలన్ని ఏం చేయాలో అది చేస్తుంది కేసులో అతడి సాయం కోరిన పాత్ర. క్రేగ్ లేకపోయినా ఈ క్లయిమాక్స్ మాత్రం అత్యంత టెర్రిఫిక్ గా వుంటుంది. పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాంగ్.

ఏమీ లేని ఫస్టాఫ్ లో చాలా వుంది

అయితే కథ ప్రారంభించడానికి తెలుగు సినిమాల్లో లాగే గంట సమయం తీసుకున్నాడు దర్శకుడు. రాత్రి ఎనిమిది గంటలకి మర్డర్ మిస్టరీ గేమ్ ప్రతిపాదనతో కథ ప్రారంభమయ్యే వరకూ ఒకరొకరుగా వచ్చే పాత్రల పరిచయాలు, క్లియర్ విద్యుత్ నేపథ్యం, రోజంతా పాత్రల సరదాలూ ప్రవర్తనలతో సరిపోతుంది. ఈ గంటసేపు కథ అందుకోక, ఏమీ జరగక ఓపికని పరీక్షిస్తుంది. గంట సేపటికి గేమ్ కొచ్చాకే కథ ప్రారంభమై ఇక ఆగదు.

సెకండాఫ్ పూర్తిగా ఫస్టాఫ్ ని తలకిందులు చేస్తుంది. కథ లేనట్టు చూపించిన ఫస్టాఫ్ లో రొటీన్ దృశ్యాల్లోని అంతరార్ధాలు ఒకటొకటే బయటపడుతూ ఉల్లిపొరలు వొలిచినట్టు ఫస్టాఫ్ లో దాచిపెట్టిన కథంతా వెల్లడి అవుతుంది. గ్లాస్ ఆనియన్ అని విడిదికి మాత్రమే పేరు పెట్టలేదు, ఆ విడిదిలో నడిచే కథ కూడా ఆనియన్ లాంటిదే. ఇది గ్రేట్ మిస్టరీ రైటింగ్ అండ్ మేకింగ్ అనాలి. ఈ ఉల్లి పొరల్ని యాక్షన్ తో విప్పుకుంటూ పోతాడు క్రేగ్.

సెకండాఫ్ లో ఆండీ పాత్ర ఫ్లాష్ బ్యాక్ మొదట వస్తుంది. ఇందులో ఆండీ పాత్ర అసలెవరో బయట పడి థ్రిల్ చేస్తుంది. ఆ తర్వాత ఫస్టాఫ్ లో విడిదిలో చూపించిన రొటీన్ దృశ్యాల వెనుక అర్ధాలు వెల్లడించే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులొస్తాయి. దీని తర్వాత విడిదిలో డ్యూక్ మరణం వెనుక కారణాలతో మినీ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. దీని తర్వాత ఆండీ మీద కాల్పులు జరగడం వెనుక విడిదిలోనే జరిగిన కథ తాలూకు మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులొస్తాయి. ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ పూర్తయి క్లయిమాక్స్ కొస్తుంది కథ.

ఈ క్లయిమాక్సులో ఉన్న ఒక్క సాక్ష్యాధారాన్నీ విలన్ నాశనం చేయడంతో- నిజమేంటో నీకు తెలియజేశాను. పోలీసులకీ కోర్టుకీ ఎవిడెన్స్ కావాలి, అది నాదగ్గర లేదు  అని బాధిత పాత్రకి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక విలన్ని శిక్షించే పని ఇంకో విధంగా చేపడుతుంది బాధిత పాత్ర. మొత్తం కలిపి ఒక సంతృప్తి కరమైన మిస్టరీ విందు.

సంక్లిష్టతని ఆశించాను. మేధని ఆశించాను. ఒక పజిల్ ని, గేమ్ నీ వూహించాను. కానీ ఇందులో ఏదీ కాదు. విషయం సంక్లిష్టత వెనుక దాగి లేదు, మైండ్ ని మెలిపెడుతూ కళ్ళముందున్న స్పష్టతలోనే దాగుంది. నిజమేంటంటే, మ్యాటర్ దేని వెనుకా దాగిలేదు అంటాడు బ్లాంక్. ఇంత సింపుల్ గా అర్ధమైపోతుంది సాలెగూడులా అల్లిన కథ.

బ్రియాన్ జాన్సన్ క్రియేటివిటీ తో తీసి మరో కమర్షియల్ విజయం సాధించాడు. అయితే థియేటర్ కి నామమాత్రం చేసి ఓటీటీలో విడుదల చేయడమే డేనియల్ క్రెగ్ అభిమానుల్ని నిరాశపరుస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో హిందీలో అందుబాటులో వుంది.

—సికిందర్

(ఈ మూవీ స్క్రీన్ ప్లే సంగతులు డిమాండ్
చేస్తోంది. రేపు కలుద్దాం)