రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జనవరి 2023, సోమవారం

1288 : రివ్యూ!


 

          నవరి వచ్చిందంటే హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ (నుమాయిష్) ప్రారంభమవుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖ 'మై నేషన్' పేరుతో ప్రత్యేక స్టాల్‌ ని ఏర్పాటు చేస్తుంది. ఈ స్టాల్ వినియోగదారుల్ని అమితంగా ఆకర్షిస్తూంటుంది. ఈ స్టాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ విక్రయించే ఉత్పత్తులన్నీ తెలంగాణ జైళ్ళ లోని ఖైదీలు ఉత్పత్తి చేసినవి అయివుంటాయి. ఫర్నిచర్, బెడ్‌షీట్లు, బేకరీ వస్తువులు, సబ్బులు, ఉన్నివస్త్రాలూ సహా అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరుతాయి.

         ఉత్పత్తులకి చాలా డిమాండ్‌ వుంటుందనేది తెలిసిన విషయమే. నాణ్యత విషయంలో మార్కెట్‌లో లభించే అత్యుత్తమ ఉత్పత్తులకీ తీసిపోని విధంగా ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులుంటాయి. ఇంకో ప్రత్యేకతేమిటంటే వీటి ధరలు అతి చౌకగా వుంటాయి. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులకు నిత్యం వచ్చే శాశ్వత కస్టమర్లు నిర్దిష్ట సంఖ్యలో వుండడం గమనించాల్సిన విషయం.

        నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం, తెలంగాణా జైళ్ళల్లో ఖైదీలు ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ రూ. 206 కోట్లు కాగా, తమిళనాడులో రూ. 72 కోట్లు, కేరళలో రూ. 34 కోట్లుగా వుంది. అంటే తెలంగాణా టాప్ అన్న మాట.

        అయితే దురదృష్టమేమిటంటే, విడుదలైన ఖైదీల పట్ల, వారి ఉత్పత్తుల పట్లా బయట చిన్న పరిశ్రమల వాళ్ళూ, వ్యాపారులూ అవేవో అంటరాని వస్తువులైనట్టు విసిరేసి, మాజీ ఖైదీల్ని తరిమికొట్టే అన్యాయమైన ప్రవర్తన కలిగి వుండడం. మాజీ ఖైదీకి -అతను సత్ప్రవర్తన కారణంగా విడుదలై వున్నా- ప్రభుత్వామిచ్చే సర్టిఫికేట్ బయట సమాజంలో ఎందుకూ కొరగాక పోవడం. ఇన్ని అవమానా లెదుర్కొన్న, సమాజంలో చోటే దొరకని మాజీ ఖైదీ అప్పుడేం చేయాలి?

        ఈ పరిస్థితే త్యాగరాజుది. ఇతను చేయని నేరానికి యావజ్జీవ శిక్షపడి జైలు పాలయ్యాడు. పదేళ్ళ తర్వాత సత్ప్రవర్తన కారణంగా జీవిత ఖైదు తగ్గించి విడుదల చేశారు. బయటికొస్తే కొడుకు ఒక్కడే ఆశగా మిగిలాడు. ఐదేళ్ళ క్రితమే భార్య చనిపోయింది. బస్సెక్కి వూరుకి పోతే, అక్కడ కొడుకు ఇల్లమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలిసింది. హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో రిచ్ గా సెటిలైన కొడుకు దగ్గరికి పోతే, ఆ కొడుకు కంగారు పడి అతనెవరో తెలియనట్టే నటించాడు. త్యాగరాజుకి అర్ధమైపోయింది. ఇక వెళ్ళిపోదా మనుకుంటే కోడలు ఆప్యాయంగా భోజనం పెట్టి మరీ పంపించింది. బయట కొడుకు చెప్పాడు -మళ్ళీ రాకు, నువ్వు జైలు కెళ్ళావని చెప్తే నాకు పెళ్ళి కావడంలేదు, చచ్చిపోయావని చెప్పాను- అన్నాడు.

        కొడుకు మాటలు కత్తిలా దిగినా, గుండె రాయి చేసుకుని వెళ్ళి పోయాడు. జైల్లో పాసైన డిగ్రీ సర్టిఫికేట్ వుంది. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అన్ని చోట్లా బహిష్కారమే ఎదురైంది. ఇక లాభంలేదని ఒక ఫర్నిచర్ కార్ఖానాలో మాజీ ఖైదీనని చెప్పుకోలేదు. దాంతో రెండొందలు రోజు కూలీకి కుదిరాడు. పని నచ్చి యజమాని ఇంకో యాభై పెంచాడు. ఇంకా నచ్చి, కొత్త డిజైన్ అయిడియాలుంటే చెప్పమన్నాడు. త్యాగరాజు ఒక కేన్ తో చేసిన టీపాయ్ తెచ్చి చూపించాడు. యజమాని బాగా ఇంప్రెస్ అయి డిస్ట్రిబ్యూటర్ కి చూపించి, 300 రూపాయలు ధర చెప్పాడు.

        డిస్ట్రిబ్యూటర్ దాన్ని అనుమానంగా చూశాడు. ఇది ఎగ్జిబిషన్లో అమ్ముతున్న ఖైదీలు తయారు చేసిన ఐటెమ్ కదా? నూటయాభై వస్తువు నాకు 300 కి అంటగడతావా?-  అని యజమానిని నిలదీశాడు. దీంతో యజమాని- నువ్వెవరు? ఎక్కడ్నించి వచ్చావ్?-  అని త్యాగరాజుని గద్దించాడు. తను సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీనని నిజం చెప్పేశాడు త్యాగరాజు. యజమానికి అరికాలి మంట నెత్తికెక్కి టీపాయ్ ని అవతలకి విసిరేసి, త్యాగరాజుని చితకబాది రోడ్డు మీదికి గెంటి పారేశాడు.

    ఈ ఘోర అవమానంతో రోడ్డున పడ్డ త్యాగరాజు ఇప్పుడేం చేశాడు? ఇక తనకి సమాజంలో చోటే లేదని ఖాయమైపోయింది. ఇప్పుడేం చేయాలి? ఇలాటి త్యాగరాజులెందరో వున్నారు. కొందరు శిక్షే పడకుండా ఏళ్ళకేళ్ళు జైళ్ళల్లో మగ్గి, తీరా విచారణలో నిర్దోషులుగా విడుదలైనా బయట జీవితం వుండదు. మరి కొందరు నేరస్థులు సత్ప్రవర్తన కారణం చెప్పి విడుదలై పూజలందుకుంటారు. త్యాగరాజు తీసుకున్న నిర్ణయం మాత్రం సమాజానికి, వ్యవస్థకీ చెంప పెట్టు వంటిది. ఇది మిగతా షార్ట్ ఫిలిం లోనే చూడాలి.

        35 నిమిషాల షార్ట్ ఫిలిం జైల్డ్ మాజీ ఖైదీల జీవితాలకి దర్పణం. ఈ అయిడియా, దీనికి ముగింపూ కొత్తగా వున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ గొల్లపూడి సూటిగా, స్పష్టంగా, బలంగా విషయం చెప్పేశారు. ఆలోచింపజేసే విషయం. దీనికి బాహుబలి ఫేమ్ డాక్టర్ రాయల హరిశ్చంద్ర త్యాగరాజు పాత్ర నటన ఉద్వేగభరితంగా వుంటుంది. ఆయన అనేక నాటకాల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో, సినిమాల్లో పోషించిన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందారు. సినిమాల్లో ఇప్పుడూ బిజీ సహాయ నటుడు.

        మిగిలిన తారాగణంలో లక్ష్మీకాంత్ దేవ్, అఖిల్ భనేశ్వర్, సంధ్య నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ ప్రొఫెసర్ మల్లాది గోపాలకృష్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్ర నటించారు. రచన -దర్శకత్వం సిద్ధార్థ్ గొల్లపూడి. ఈయన 9 అవర్స్  అనే వెబ్ సిరీస్ లో, విందు భోజనం అనే సినిమాలో నటించారు. ఛాయాగ్రహణం వంశీ గదాదాసు, సంగీతం రీ, కూర్పు  శ్రీ వర్కాల, నిర్మాణం క్లాసిక్ ఓటీటీ.

        సిద్ధార్థ్ మేకింగ్ పని తీరు క్వాలిటీతో వుంది. ఈ క్వాలిటీ తో 2022 ఫిలిం ఫెస్టివల్స్ లో వివిధ విభాగాల్లో మొత్తం 16 అవార్డులు గెలుచుకున్నారు. 4 భారతీయ చలన చిత్రోత్సవాలు, 4 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫెస్టివల్లో, డ్రక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డుల్ని ఈ షార్ట్ ఫిలిం గెలుచుకుంది.

        GAW & DP ఫిలిం ఫెస్టివల్ (స్కాట్లాండ్) లో ఉత్తమ షార్ట్ ఫిలింతో బాటు ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (సంగీతం) అవార్డుని గెలుచుకుంది. క్యామెల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో  ఉత్తమ తొలి షార్ట్ ఫిలిం ప్రయత్నం అవార్డుతో బాటు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌ అవార్డుల్ని గెలుచుకుంది.

        తమిళనాడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా అవార్డులు గెలుచుకుంది. సెర్బియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ మీడియం లెంగ్త్ ఫిలిం అవార్డుని గెలుచుకుంది. డా. రాయల హరిశ్చంద్ర తన నటన ద్వారా ప్రదర్శించిన అట్టడుగు జీవితాల వాస్తవికతని జ్యూరీ ఎంతో మెచ్చుకుంది. జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ షార్ట్ ఫిలింని clasc’ యాప్ ని ప్లేస్టోర్ లో డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.

—సికిందర్