రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, జనవరి 2023, శుక్రవారం

1286 : రివ్యూ!


దర్శకత్వం రీతేష్  దేశ్‌ముఖ్
తారాగణం : రీతేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా, జియా శంకర్, అశోక్ సరాఫ్ తదితరులు 
కథ : శివ నిర్వాణ, స్క్రీన్ ప్లే : రుషికేష్ తురై, సందీప్ పాటిల్, రీతేష్ దేశ్‌ముఖ్; సంగీతం : సౌరభ్ భలేరావ్, పాటలు : అజయ్- అతుల్;  ఛాయాగ్రహణం : భూషణ్‌ కుమార్ జైన్
బ్యానర్ : ముంబై ఫిల్మ్ కంపెనీ
నిర్మాత : జెనీలియా డిసౌజా
విడుదల : డిసెంబర్ 30,  2022
***(ఈ మూడు చుక్కలు రేటింగ్ కాదు)

        బాలీవుడ్ హీరో రీతేష్ దేశ్ ముఖ్ దర్శకుడుగా మారుతూ, భార్య- మాజీ హీరోయిన్ జెనీలియా డిసౌజా నిర్మాతగా మారుతూ, ఇద్దరూ కలిసి నటించిన మరాఠీ వేడ్ మహారాష్ట్రలో ప్రస్తుతం అతి పెద్ద హిట్. దీన్ని హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. ఇదివరకే రీతేష్ దేశ్‌ముఖ్ మరాఠీ చలన చిత్ర పరిశ్రమలో, కమర్షియల్ మాస్ సినిమాల తీరుతెన్నుల్ని రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ లో నటించి ఛేదించాడు. ఇప్పుడు దర్శకుడుగా పరిచయమవుతూ తీసిన ఈ మూడోది కూడా బ్లాక్ బస్టర్ దిశగా పయనించడం హాట్ టాపిక్ గా మారింది. పెద్దగా తారాగణ బలం కూడా లేని ఇందులో ఏఏ కమర్షియల్ ప్రయోగాలు చేశాడు? హిందీ సినిమాలతో నిండిన మరాఠీ మార్కెట్ లో మూడు రోజుల్లో 10 కోట్లు బాక్సాఫీసు అంటే సంచలనమే. ఈ ఘన విజయం గురించి వివరాల్లోకి వెళ్దాం...   

కథ

సత్య (రీతేష్ దేశ్ ముఖ్) క్రికెట్లో పేరు ప్రతిష్టలు పొందాలని కాంక్షిస్తాడు. మొదట్లో స్థానిక రైల్వేస్ క్రికెట్ జట్టుకి ఎంపిక కావాలని కోరుకుంటాడు . ఇందుకు అవసరమైన  డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నప్పుడు నిషా (జియా శంకర్) పరిచయమవుతుంది. ఈ పరిచయంలో కొన్ని అపార్థాల తర్వాత  ప్రేమలో పడతారు. ఈ ప్రేమ నచ్చని నిషా తల్లిదండ్రులు ఇద్దర్నీ విడదీస్తారు. సత్యకి తిరిగి వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయిన నిషా తిరిగి రాదు. సత్య విచారంలో మునిగిపోయి, తాగుడు మరిగి క్రికెట్ కి దూరమవుతాడు.
        
శ్రావణి (జెనీలియా దిసౌజా) సత్య పొరుగున వుంటుంది. ఈమె సత్య ప్రేమవ్యవహారం తెలియక సత్యతో ప్రేమలో పడుతుంది. తెలిశాక దూరమవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొంత కాలం తర్వాత సత్య తండ్రి ప్రోద్బలంతో సత్యని పెళ్ళి చేసుకుంటుంది. అయినా సత్య నిషా జ్ఞాపకాలతోనే జీవిస్తూ, ఏ పనీ చేయక, రైల్వేస్ లో పని చేసే శ్రావణి జీతం మీద ఆధారపడి బ్రతుకుతూంటాడు. ఒకసారి యువ టీం కోసం క్రికెట్ ప్లేయర్స్ ని ఎంపిక చేయడంలో సహాయం చేయడానికి సత్యా ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఖుషీ (ఖుషీ హజారే) పరిచయమవుతుంది. ఈమె నిషా కుమార్తె. నిషా ప్రమాదంలో చనిపోయిందని తెలుస్తుంది.

ఇప్పుడు సత్య ఏం చేశాడు? నిషా ఇక లేదని తెలుసుకుని శ్రావణిని బాధించడం మానుకుని దగ్గరయ్యాడా? మానసికంగా గాయపడ్డ శ్రావణి ఇప్పుడతణ్ణి స్వీకరించిందా? ఈ వికటించిన రిలేషన్ షిప్ లో నిషా కూతురు పోషించిన పాత్ర ఏమిటి?...ఇవీ మిగతా కథలో తెలిసే అంశాలు.

ఎలావుంది కథ

2019 లో శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య- సమంతా నటించిన తెలుగు మజిలీ కిది రీమేక్. ఇప్పటికే ఒక మిలియన్ సార్లు చూసిన కథ. ప్రేయసిని మర్చిపోలేక  వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుని అలమటించే వాడి కథలతో చాలా సినిమాలొచ్చాయి. దీన్ని రివర్స్ చేస్తూ, ప్రియుడిని మర్చిపోలేక వేరే పెళ్ళి చేసుకుని బావురుమనే ఆమెతో కూడా అన్నే సినిమాలొచ్చాయి. ఈ రెండోది శివ నిర్వాణ తీసిన నిన్నుకోరి అయితే,పై మొదటిది మజిలీ’.
        
ఈ కథలో వినోదం కంటే విషాదం పాలెక్కువ. పైగా తెలిసిన రొటీన్ కథే కావడంతో ఇంటర్వెల్ ముందు వరకూ, తర్వాత సెకండాఫ్ లో క్లయిమాక్స్ ముందు వరకూ డల్ అయిపోతుంది సినిమా కథాపరంగా తెలుగులో లాగానే. అయితే దర్శకుడిగా రీతేష్ కి తొలి ప్రయత్నమే అయినా, హీరోగా దాదాపు రెండు దశాబ్దాల అనుభవంతో ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఏ కమర్షియల్ సామగ్రితో ఎలా ప్యాకేజీ చేయాలో తెలుసు. ఒక పాటలో ఏకంగా సల్మాన్ ఖాన్ ని తీసుకువచ్చాడు, అత్యంత పాపులర్ సంగీత దర్శకులతో స్వరాల శోభ సమకూర్చాడు, మరాఠీ నేటివిటీకి మార్చడానికి స్క్రిప్టు మీద తీవ్ర కసరత్తు చేశాడు, బాలనటి టాలెంట్ ని గుర్తించి గరిష్ట స్థాయిలో వినియోగించుకున్నాడు, ఆఖరికి జెనీలియా భావప్రకటనా సామర్ధ్యంతో ప్రతీ దృశ్యం ప్రకాశించేలా చేసుకున్నాడు, ఇక భగ్న ప్రేమికుడుగా తను సరే, యాక్షన్ సీన్స్ కూడా పవర్ఫుల్ గా తీర్చిదిద్దుకున్నాడు, ఛాయాగ్రహణాన్ని టాప్ విజువల్స్ తో కళ్ళప్పగించి చూసేలా చేశాడు. ఇన్ని చేశాక సక్సెస్ ఖాయమనుకున్నాడు, అయ్యింది కూడా.

నటనలు –సాంకేతికాలు

రీతేష్ దేశ్‌ముఖ్  కబీర్ సింగ్/అర్జున్ రెడ్డి పాత్రకి ఇంకో వెర్షన్ నటించినట్టు కన్పిస్తాడు. అయితే ఇది కుదరలేదు. ముఖంలో ఆ వెర్రి (వేడ్) లేదు. పైగా తను నటిస్తూ వచ్చిన హిందీ సినిమాలు నవ్విస్తూ వుండే ఎంటర్ టైనర్లే కాబట్టి -కబీర్ సింగ్ కి, అర్జున్ రెడ్డి కి తను మారాలనుకోవడమన్నది సాధ్యమయ్యే పని కాదు. సినిమాల చరిత్రలో భగ్నప్రేమికులందరూ కబీర్ సింగ్/ అర్జున్ రెడ్డి కారు. దేవదాసులున్నారు, ప్రేమ నగర్ కళ్యాణ్  లున్నారు. తన వేడ్ (వెర్రి) పాత్ర ఈ కోవకి చెందింది. అందుకే నాగచైతన్యకి చెల్లింది. అయితే తను మహారాష్ట్ర వారసత్వానికి చెందినవాడే కావడంతో మరాఠీతనం మాత్రం పాత్రకి ఒనగూడింది.

ఇక తెలుగు సినిమాల్లో చిలిపి పాత్రల హీరోయిన్ గా తెలిసిన జెనీలియా డిసౌజా ఈ సీరియస్ పాత్రలో కట్టి పడేస్తుంది. ముఖ్యంగా మాటలు లేని మౌన దృశ్యాల్లో హావభావ ప్రకటన ఆమెలో దాగి వున్న క్యాలిబర్‌ ని అపూర్వంగా ఆవిష్కరిస్తుంది. తను సినిమా నటించినట్టు వుండదు, జీవితం జీవిస్తున్నట్టు వుంటుంది.
        
రెండో హీరోయిన్ గా జియా శంకర్ గ్లామర్ పోషణకి పనికొచ్చింది. చాలా హిందీ సినిమాల్లో నటించిన మరాఠీ సహాయ నటుడు అశోక్ సరాఫ్ చాలా కాలానికి తెరపై కొచ్చాడు. ఇక బాలనటి ఖుషీ గురించి పైనే చెప్పుకున్నాం. 
          
ఈ కథ ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్స్ తో వుంటుంది. రీతేష్ దేశ్‌ముఖ్‌కి ​​మాంటేజ్‌లు రూపొందించే కళ బాగానే వున్నట్టు అర్ధమవుతుంది. బేసురీ, వేడ్ తుజే రెండు పాటల చిత్రీకరణల్లో మాంటేజెస్,  స్లో-మో షాట్స్, అలాగే పదునైన ఎడిటింగ్ టెక్నిక్స్ తో ఫ్లాష్‌బ్యాక్స్ ని చూపించిన విధానం కట్టి పడేస్తాయి. ఇక వున్న కథని, నేపథ్య సంగీతాన్నీ మిళితం చేసిన తీరు కూడా బావుంది. పాటలు క్యాచీగా వున్నాయి.
        
అయితే ప్రత్యేకాకర్షణగా తీసుకొచ్చిన సల్మాన్ ఖాన్ ని చివర్లో చూపించడం మార్కెటింగ్ వ్యూహమే కావచ్చు. ఎండ్ టైటిల్స్ లోనే పాటలో కన్పిస్తాడు సల్మాన్. ఎండ్ టైటిల్స్ ఎవరు చూస్తారు లేచి వెళ్ళి పోతారనుకోవచ్చు- అయితే ఈ కథతో సినిమాని బోరుగా ఫీలయ్యే ప్రమాదముంది గనుక- సల్మాన్ ని చివర్లో చూపిస్తే, సల్మాన్ కోసమైనా బోరు భరిస్తూ చూస్తారని భావించి వుండొచ్చు. ఇన్ని గిమ్మిక్కులు చేస్తే ఓ బలహీన కథ బ్లాక్ బస్టర్ అయింది.

—సికిందర్