రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, జనవరి 2023, గురువారం

1285 : స్పెషల్ న్యూస్!


థియేటర్ యాజమాన్యాలు సినిమా హాళ్ళలో బయటి ఆహారాన్ని అనుమతించ కూడదనే సుప్రీం కోర్టు తీర్పు మల్టీప్లెక్స్ కంపెనీలకి పెద్ద ఉపశమనమే. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పుతో సమస్య చుట్టూ వున్న అస్పష్టత తొలగిందని మల్టీప్లెక్స్ గ్రూపులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కాశ్మీర్ లో ప్రారంభమయిన ఈ తినుబండారాల రగడ ఢిల్లీలో కొలిక్కి వచ్చింది. మల్టీప్లెక్సులు తినుబండారాలనబడే ఫుడ్ అండ్ బెవరేజీ (ఎఫ్ బి) విక్రయాల ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్నాయి. టికెట్ రేట్ల కంటే ఎఫ్ బి ధరలు రెట్టింపు వున్నా భరిస్తున్నారు ప్రేక్షకులు.

        సినిమా హాలు అనేది హాలు యజమాని ప్రైవేటు ఆస్తి కాబట్టి, ఆహార విక్రయానికి సంబంధించిన నిబంధనల్ని నిర్దేశించే హక్కు యజమానికి వున్నందున, వారి సొంత ఆహార పానీయాలని విక్రయించే హక్కు వారికి వుందని, జనవరి 3 తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రేక్షకులకిది తప్పనిసరేం కాదనీ, ఇష్టం లేకపోతే వాటిని కొనుగోలు చేయనవ
సరం లేదనీ స్పష్టం చేసింది.
        
బంగారం అమ్మినట్టు 30 గ్రాములు (మూడు తులాలు) పాప్ కార్న్ 100 రూపాయలకి అమ్మే మల్టీప్లెక్సుల ధరాపాతంపై వినియోగదారులు కోర్టు కెక్కలేదు. మల్టీప్లెక్స్ కంపెనీల మొత్తం రాబడిలో 25 నుంచి 35 శాతం వాటా ఎఫ్ బీదే. లాభాల్లో 45 శాతం వాటా ఎఫ్ బీదే. వినియోగదారులు ధరలపై కాక, బయటి ఆహారాన్ని అనుమతించాలని  వివిధ రాష్ట్రాల్లో చాలా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటినీ కూడా క్లబ్ చేసి విచారించింది సుప్రీం కోర్టు.
        
అయితే థియేటర్లలో ఎక్కువ ధరలకి పాప్ కార్న్ అమ్మడం అనేది థియేటర్ యజమానులకీ, సినిమా ప్రేక్షకులకీ మధ్య నలుగుతున్న వివాదమే. చాలా మంది ఇప్పటికీ సినిమాహాళ్ళలో, ముఖ్యంగా టాప్ మల్టీప్లెక్సుల్లో ఖరీదైన ఆహారానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వున్నారు. ప్రస్తుతం టాప్ మల్టీప్లెక్సుల్లో పాప్‌కార్న్ టబ్ ధర 350 నుంచి 450 రూపాయలుంది. దీనికి 150 నుంచి 350 మధ్య వుండే కూల్ డ్రింక్ ని కలిపితే, ఇద్దరు వ్యక్తులకు పన్నులతో కలిపి రూ. 1,000 కి తక్కువ కాకుండా నడ్డివిరిచే వడ్డన!
        
టాప్ మల్టీప్లెక్సులు పీవీఆర్, ఐనాక్స్ కంపెనీలు తమ మొత్తం  రాబడిలో 25 నుంచి 35 శాతంగా వుంటున్న ఎఫ్ బి వాటాని ఇంకో మూడు శాతం పెంచే దిశగా యోచిస్తున్నాయి. 2020 ఆర్దిక సంవత్సరంలో పీవీఆర్ ఎఫ్ బి అమ్మకాల ద్వారా రూ. 960 కోట్లు ఆర్జించింది. ఇది మునుపటి సంవత్సరం రూ. 858 కోట్లుగా వుంది. ఐనాక్స్ 2019 లో రూ. 436 కోట్లు, 2020లో రూ. 497 కోట్లు ఆర్జించింది. ఇలావుండగా గత సంవత్సరం ద్రవ్యోల్బణ వొత్తిడి కారణంగా 10-20 శాతం వరకూ ధరల్ని పెంచాయి కూడా.

అసలు ప్రేక్షకుల సినిమా వీక్షణానుభవాన్ని మధురానుభూతిగా మల్చడానికి అయ్యే ఖర్చులో థియేటర్ నిర్మించడానికి భారీ మొత్తంలో మూలధనం, విద్యుత్ ఖర్చులతో పాటు, అద్దె ఖర్చులు, సిబ్బంది ఖర్చులూ వుంటున్నాయి. థియేటర్ నడపడానికి నిర్ణీత వ్యయం భారీగా వుంటుంది. వ్యాపారంలో సాధారణ అస్థిరత కారణంగా, ఏ సినిమాలు ఆడతాయో, ఏ సినిమాలు ఆడవో అన్నదానిపై ఆధారపడి ఆదాయ సముపార్జన వుంటుంది. పైగా ఎఫ్ బి అమ్మకాలకి సినిమాలకొచ్చే వ్యక్తులు మాత్రమే వినియోగదారులు.

థియేటర్‌ని నడపడం అనేది ప్రత్యేకంగా లాభదాయకమైన వ్యాపారం కాదనేది ఈ కంపెనీల అభిప్రాయం. అందువల్ల ఎఫ్ బి అందించే వ్యాపారం మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. కంపెనీలకి భారీగా వ్యయమయ్యేది సినిమాలపైనే. బాక్సాఫీసు వసూళ్ళలో 42-45 శాతం వరకూ నిర్మాతలకి లేదా పంపిణీ దారులకి చెల్లించాల్సి వుంటుంది. అందువల్ల సినిమా ప్రదర్శనా రంగం ఆహార పానీయాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై చాలా ఆధారపడి వుందని, టిక్కెట్ అమ్మకాలు మాత్రమే నిర్వహణ ఖర్చుల్ని కవర్ చేయవనీ అంటున్నారు.

సినిమా హాళ్ళు పది సంవత్సరాల క్రితంతో పోల్చినప్పుడు ఎఫ్ బి సెగ్మెంట్ లో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్నాయనీ, సినిమా హాళ్ళలో బయటి ఆహారాన్ని అనుమతించినట్లయితే ఈ పెట్టుబడి అంతటికీ అర్ధం వుండదనీ విశ్లేషిస్తున్నారు.

నిజమే, హోటల్ కెళ్ళినప్పుడు అక్కడి ఫుడ్డే తింటున్నప్పుడు, సినిమాకెళ్తే అక్కడి స్నాక్స్ తినడానికి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఫీలవడమెందుకు? కోర్టుల కెక్కడమెందుకు? మహేష్ బాబు కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్లో 120 రూపాయలకి రెండు ఇడ్లీలు తినడానికి అభ్యంతరం చెప్పడం లేదుగా?

ఇదంతా కాశ్మీర్లో మొదలైంది

2018 లో థియేటర్లలోకి సినిమా ప్రేక్షకులు సొంతంగా ఆహారం, నీరు తీసుకెళ్ళ డాన్ని నిషేధించరాదని జమ్మూ కాశ్మీర్  హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు జులై 18న ఆదేశాలు ఈ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాఋ. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తి  పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం,  జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని  తోసిపుచ్చింది. జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు తీర్పుని సమర్థిస్తే, ఇక ప్రేక్షకులు థియేటర్ లో నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగుతారని, జిలేబీ తిని వేళ్ళని సీటుకి తుడుస్తారనీ, తందూరీ చికెన్ ఆరగించి ఎముకలు సీట్లో వేస్తారనీ... ఇదంతా ఎవరు క్లీన్ చేయాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చురకలేశారు.
        
సినిమా హాలు అనేది హాలు యజమాని ప్రైవేటు ఆస్తి కాబట్టి, ఆహార విక్రయానికి సంబంధించిన నిబంధనల్ని నిర్దేశించే హక్కు యజమానికి వున్నందున, వారి సొంత ఆహార పానీయాలని విక్రయించే హక్కు వారికి వుందని పేర్కొంటూ ధర్మాసనం ఈ వివాదానికి తెరదించింది.
        
దాదాపూ 1970 ల వరకూ సినిమా హాళ్ళల్లో పొగత్రాగుట నిషేధం కాదు. లేడీస్ కి అస్సలు అభ్యంతరం కాదు. అదొక సమస్యే కాదు. థియేటర్ నిండా ఆ పొగ మేఘాల్లోనే సినిమాలు చూసి ఆనందించేవారు. సినిమాల్లో కూడా యదేచ్ఛగా పొగత్రాగే దృశ్యాల చిత్రీకరణ వుండేది. రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ లో సర్కస్ కొచ్చిన ఆఫీసర్లు పక్కన భార్యల్ని కూర్చోబెట్టుకుని జల్సాగా పొగత్రాగుతూ సర్కస్ ని తిలకించే దృశ్యం వుంటుంది. ప్రోగ్రాముల్లో కూడా ఇదే తంతు. నాటి బాలీవుడ్ గీత రచయిత ఆనంద్ బక్షీ అయితే ఇంకో అడుగు ముందుకేశారు. విదేశంలో ఇచ్చిన ఒక మ్యూజికల్ ప్రోగ్రాంలో ప్రేక్షకుల ముందు రాయల్ గా విస్కీ సేవిస్తూ పాట పాడిన వీడియో యూట్యూబ్ లో వుంది. 
        
ఆ స్వేచ్ఛ ఇప్పుడు తినుబండారాల విషయంలో కూడా లేదు. అసలు సినిమాకెళ్తే ఎందుకు తినాలన్నది ప్రశ్న. తినకుండా సినిమాలు చూడలేరా?
—సికిందర్