రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, January 4, 2023

1283 : స్పెషల్ న్యూస్!


 

రోజు జనవరి 12,1968. సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన 11 వ సినిమా అసాధ్యుడు విడుదల. వెనక్కి వెళ్తే ఆ రోజు 1965 మార్చి 31. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొదటి సినిమా తేనెమనసులు విడుదల. ఇది ఉగాది విడుదలైతే అది సంక్రాంతి విడుదల. రెండూ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. అయితే కృష్ణకి సంక్రాంతి సెంటిమెంటు మొదలైంది అసాధ్యుడు విజయంతో. ఆ నాటి నుంచి సంక్రాంతికి తన సినిమా ఒకటి విడుదల అవ్వాలని నియమం పెట్టుకున్నారు. దాంతో రికార్డు బ్రేకింగ్ 30 సంక్రాంతి సినిమాలిచ్చారు. ఎన్టీఆర్ 28 సంక్రాంతి సినిమాలిస్తే తను రెండాకులు ఎక్కువే చదివి 30 ఇచ్చారు.

        క సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమాతో కూడా తలపడ్డారు- 1977 జనవరి 14 సంక్రాంతి రోజున ఎన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన దానవీర శూర కర్ణ పౌరాణికంతో కృష్ణ తన పౌరాణికం కురుక్షేత్రం ని ఎదురుపెట్టి ఢీ కొన్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణతో బాటు శోభన్ బాబు, కృష్ణం రాజు, జమునలతో మల్టీస్టారర్ గా తీసిన పౌరణికం, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ముందు నిలబడలేకపోయింది. కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు పాత్రలు తనే వేసి కృష్ణ కూడా త్రిపాత్రాభినయం చేసి వుంటే ఎన్టీఆర్ తో ఎలా వుండేదో.
          
కృష్ణ మొదటి సంక్రాంతి హిట్ 'అసాధ్యుడు' సంక్రాంతి సినిమా అంటే కుటుంబ కథతో వుండాలన్న అప్పటి నమ్మకాన్ని కూడా కాదని జేమ్స్ బాండ్ టైపు యాక్షన్ థ్రిలర్ గా నిర్మించారు. 1966 లో తను నటించిన గూఢచారి 116 ఘన విజయంతో దీనికి స్ఫూర్తి. ఇక కృష్ణ తెలుగు సినిమాలకి కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఆంధ్రా జేమ్స్ బాండ్ గా మారిపోయారు.
          
సంక్రాంతి సినిమాల బాక్సాఫీసు పరీక్షలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు ఇంకా చాలా మందే వున్నారు- అక్కినేని నాగేశ్వరరావు 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు కల్ట్ మ్యూజికల్ హిట్ తో అతి పెద్ద సంక్రాంతి హీరో అయ్యారు. ఇంకో పెద్ద హిట్, ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు 1991 సంక్రాంతికిచ్చి, పెద్ద తరహా పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు.
          
సూపర్ స్టార్ కృష్ణ గరిష్ట విడుదలల విషయానికి వస్తే దాదాపు 350 సినిమాలకి పైగా విస్తరించిన కెరీర్‌లో, 30 సినిమాలు సంక్రాంతి సినిమాలే. 1968 లో మొదటి సంక్రాంతి సినిమా  అసాధ్యుడు తర్వాత, 1969 లో శోభన్ బాబుతో కలిసి మంచి మిత్రులు’, 1973 లో కౌబాయ్ మంచి వాళ్ళకు మంచి వాడు’, 1976 లో పాడి పంటలు’, 1977 లో కురుక్షేత్రం’, 1978 లో ఇంద్రధనస్సు’, 1980 లో భలేకృష్ణుడు’, 1981 లో ఊరికి మొనగాడు’, 1983 లో బెజవాడ బెబ్బులి’, 1984 లో ఇద్దరు దొంగలు’, 1985 లో అగ్ని పర్వతం’, 1987 లో తండ్రీ కొడుకుల ఛాలెంజ్’, 1988 లో కలియుగ కర్ణుడు’, 1989 లో రాజకీయ చదరంగం’, 1990 లో ఇన్‌స్పెక్టర్ రుద్ర’, 1992 లో పరమ శివుడు’, 1993 లో పచ్చని సంసారం’, 1994 లో నంబర్ వన్’, 1995 లో అమ్మ దొంగా ...ఇలా సంక్రాంతుల సరదా సాగింది.
        
ఇక చిరంజీవి, బాలకృష్ణల విషయం తెలిసిందే. నిన్నటి వ్యాసంలో చూశాం. పోతే  10 సంక్రాంతి సినిమాలతో వెంకటేష్...ధర్మ చక్రం’, ప్రేమ’, చంటి’, కలిసుందాం రా’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్స్ ఇచ్చారు. మహేష్ బాబు 5 సినిమాలు ...ఒక్కడు’, టక్కరి దొంగ’, బిజినెస్ మేన్’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘1-నేనొక్కడినే’, రిలేరు నీకెవ్వరు’. జూనియర్ ఎన్టీఆర్ 4 సినిమాలు... నాన్నకు ప్రేమతో’, అదుర్స్’, నా అల్లుడు’, నాగ’. అల్లు అర్జున్ 2 సినిమాలు...దేశముదురు’, అల వైకుంఠపురంలో’. రామ్ చరణ్ 2 సినిమాలు... నాయక్’, ఎవడు’, వినయ విధేయ రామ. ప్రభాస్ 2 సినిమాలు...వర్షం’, యోగి’.
        
విచిత్రమేమిటంటే సంక్రాంతి టైటిల్ తో సంక్రాంతికి విడుదల కాని  సినిమా ఒకటుంది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. అక్కినేని, కృష్ణ, శ్రీదేవి, జయసుధలతో మల్టీస్టారర్. ఇది 1983 ఫిబ్రవరి 12 న సంక్రాంతి వెళ్ళిపోయాక విడుదలైంది ఊరంతా సంక్రాంతి. సంబరాలా సంకురాత్రి...ఊరంతా పిలిచిందీ... ఏడాదికో పండగాబ్రతుకంత తొలి పండగా అనే పాటతో పండగ చేసుకున్నారు.
        
ఇప్పుడు సంక్రాంతి పాటలు సంక్రాంతి సినిమాల్లో కూడా లేవు. మారణాయుధాలతో మరణ మృదంగాలు తప్ప. కృష్ణ ఏ మూహూర్తాన అసాధ్యుడు యాక్షన్ సినిమాతో తన సంక్రాంతి సినిమాల పరంపరని ప్రారంభించారో- కొత్త స్టార్ల ట్రెండ్ లో సంక్రాంతి సినిమాలంటే రక్తం కళ్ళ జూసే యాక్షన్ సినిమాలుగానే మారిపోయాయి!
***