రచన - దర్శకత్వం : గుర్మీత్ సింగ్
తారాగణం : కత్రినా కైఫ్, సిద్ధాంత్
చతుర్వేది, ఇషాన్ ఖట్టర్, జాకీ ష్రాఫ్ తదితరులు
సంగీతం : తనిష్క్ బాగ్చీ, ఛాయాగ్రహణం :
కె.యు.మోహనన్
బ్యానర్ : ఎక్సెల్ ఎంటర్టయిన్మెంట్
నిర్మాతలు : ఫర్హాన్ అఖ్తర్, రీతేష్ సిధ్వానీ
విడుదల : నవంబర్ 4, 2022
***
కథ
పంజాబ్ కి చెందిన మేజర్ (సిద్ధాంత్ చతుర్వేది), తమిళనాడుకి చెందిన గెలీలియో
అలియాస్ గుల్లూ (ఇషాన్ ఖట్టర్) లు హార్రర్ సినిమాలు చూస్తూ పెరిగి, దెయ్యాలపై ఆసక్తి పెంచుకుని ఘోస్ట్ బస్టర్స్ గా
మారాలనుకుంటారు. కానీ దెయ్యాల్ని వదిలించే వృత్తి అంతగా సాగక, తమ రాకా దేవుడ్నిసాయం అడుగుతారు. ఎక్కడో కొండని తవ్వినప్పుడు దొరికిన ఆ
విగ్రహానికి రాకా దేవుడుగా పేరు పెట్టుకుని కొలుస్తూంటారు. ఇంతలో రాకా కళ్ళలో
వెలుగు పోతుంది. రాకా కళ్ళల్లో వెలుగులు నింపడానికి కరెంటు పెట్టబోతే షాక్ కొట్టి
ఆత్మల లోకాని కెళ్ళిపోతారు.
అక్కడ చాలా ఆత్మల మధ్య రాగిణి (కత్రినా
కైఫ్) అనే దయగల ఆత్మ వుంటుంది. ఆమె ఒక డీల్ చెబుతుంది. భూమ్మీద అనేక ఆత్మలు తమకి
జరిగిన అన్యాయాలకి దుఖిస్తూ మోక్షం పొందలేక పోతున్నాయనీ,
మేజర్- గుల్లూలు ఆ అన్యాయాలు చేసిన వాళ్ళని శిక్షించి,
ఆత్మలకి విముక్తి కలిగేలా చేస్తే చాలా డబ్బు ఇస్తాననీ అంటుంది రాగిణి ఆత్మ.
తమ ఇద్దర్నీ సైన్యంలో మేజర్ గా
ఒకర్ని, గెలీలియో లాంటి సైంటిస్టుగా ఇంకొకర్నీ చూడాలన్న తమ
తండ్రుల కోరికలు తీర్చలేక పోయినందుకు- ఇంత కాలం తమని పెంచి
పోషించడానికి అయిన ఖర్చు 5 కోట్లు ఇచ్చేయాలనీ తండ్రులు డిమాండ్ చేస్తున్నందున, రాగిణి డీల్ కి ఒప్పుకుంటారు.
అయితే రాగిణి ఇచ్చే డబ్బులో కొంత
భాగాన్ని బాధిత ఆత్మల కుటుంబాలకి అందించాలి. తద్వారా ఆత్మలు సంతృప్తి చెందాకే మోక్షాన్ని పొందుతాయి. ఇదెక్కడి పీకులాట అనుకుంటూ కళ్ళు
తెరవగానే ఈ లోకంలో కొచ్చి పడతారు.
ఇక రాగిణి శిష్యులుగా డీల్ ప్రకారం, సాయం కోరే ఆత్మల ఫోన్ కాల్స్ రిసీవ్ చేసు కోవడానికి
‘ఫోన్ భూత్’ అనే కంపెనీని స్థాపిస్తారు.
రాగిణి తోడ్పాటుతో ఇది బ్రహ్మాండంగా నడుస్తూంటుంది. ఇది ‘శాస్త్ర శక్తి సోల్ ఎంటర్ప్రైజెస్’ కంపెనీని నడుపుతున్న తాంత్రికుడు ఆత్మా రామ్ (జాకీష్రాఫ్) దృష్టిలో
పడుతుంది. ఇతను ఆత్మలు మోక్షం పొందకుండా పట్టి బంధిస్తూంటాడు. దీంతో పరస్పర
వ్యతిరేక శక్తులుగా అవతరించిన రాగిణి శిష్యులూ, ఆత్మారామ్ ఇక
కొట్టుకోవడం ప్రారంభిస్తారు.
అసలు ఈ డీల్ ఇవ్వడానికి రాగిణికి
సొంత కారణముంటుంది. తను మరెవరో కాదు, దివంగత రాజు రాజా దుష్యంత్ సింగ్ తోబాటు కారు ప్రమాదంలో మరణించిన అతడి ప్రేమికురాలు. ఈ కారు
ప్రమాదం వెనుక ఎవరున్నారు? ఇది కథకి ఇంకో కోణం.
హార్రర్ కామెడీలు ఆదరణ కోల్పోయిన
కాలంలో న్యూఏజ్ హార్రర్ కామెడీ అంటూ డిఫరెంట్ మేకింగ్ తో, సరికొత్త అనుభవాన్నివ్వాలని తలపెట్టిన ప్రయత్నం
మంచిదే. అయితే ఈ ప్రయత్నం ఫస్టాఫ్ పై వివరాలతో కథని
ఎస్టాబ్లిష్ చేసేంత వరకే. సెకండాఫ్ కొస్తే
వస్తున్న చాలా సినిమాల్లో లాగే కథ కంచికి బాక్సాఫీసు బెగ్గింగ్ కి. హీరో
రొటీన్ గా యమ లోకాని కెళ్ళే కథల్లా కాకుండా ఆత్మల లోకాని కెళ్ళడం, లోక కళ్యాణం కోసం డీల్ చేపట్టడం, ఆధునిక కాలపు
పోకడలతో కొత్త కథే.
అయితే దీన్ని అడ్డుకునే
తాంత్రికుడితో సంఘర్షణ కొచ్చేసరికి సరుకు అయిపోయినట్టు సెకండాఫ్ సిల్లీగా మారింది.
జోకులతో స్టాండఫ్ కామెడీగా మారిపోయి సంఘర్షణ చెదిరి పోయింది. కేవలం రాగిణి ఆత్మని
తాంత్రికుడు సీసాలో బంధించి మాయం చేసే మలుపు తప్ప సెకండాఫ్ లో విషయం లేదు. ఇక
ముగింపు పాత రొటీనే. తాంత్రికుడ్ని చంపడానికి హీరోలు అతడి గుహలోకి ప్రవేశించడం, పని పూర్తి
చేయడం వగైరా.
దర్శకుడు కేవలం న్యూ ఏజ్ యూత్
సినిమాలాగా తీయాలని విజువల్స్ కి, స్టయిల్ కీ ఇచ్చిన
ప్రాధాన్యం కథకి పూర్తిగా ఇవ్వలేదు. విభిన్నంగా చేసిన మేకింగ్, విషయపరంగా డొల్లగా మారడంతో బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంకో కాలం తీరిన
హార్రర్ కామెడీ గా మాత్రం ఇది మిగిలింది.
ఈ
హార్రర్ కామెడీలో కత్రినా కైఫ్ కామెడీ కుదరలేదు.
ఆమె రాజుని ప్రేమించిన ప్రేమికురాలిగా హూందా తనంతోనే ఎక్కువగా వుంది. 2011
లో 'మేరే బ్రదర్ కీ దుల్హన్' లో ఆమె చేసిన కామెడీ పాత్రతోనే సూపర్ హిట్టయ్యింది. అలాటి కామెడీ ఇందులో
ఆశించలేం. న్యూ ఏజ్ యూత్ సినిమా అన్నాక యూత్ ఫుల్ గానే నటించాలి. పైగా వయసు పైబడడం
ఒకటి. ఆత్మల లోకంలో ఒక పాట కూడా డల్ గా వుంది. ఫస్టాఫ్ లో హీరోలతో రెండు మూడు
కామెడీలు- వాళ్ళ రియాక్షన్స్ తోనే పేలాయి.
యంగ్ హీరోలిద్దరూ చాలా కామెడీలు
చేశారు- అయితే ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్ లో సిట్యుయేషనల్ కామెడీలు చేయడానికి తగిన కథ
లేక, స్టాండప్ కామెడీలతో - జోకులతో లాక్కొచ్చారు. స్టాండప్
కామెడీలకి యూట్యూబ్ లో ఎక్కువ అభిమానులున్నారు. ఆ కమెడియన్లు వేరు.
ఇక జాకీష్రాఫ్ తాంత్రికుడి
దుష్టపాత్రలో సెకండాఫ్ చేయడానికేమీ లేదు. అందరి సమస్య,
సినిమా అసలు సమస్య సెకండాఫే. ఈ సినిమాకి ఒకరు కాదు, నలుగురు
సంగీత దర్శకులు చేసిన ఐదు పాటల్లో ఒకటే ఫర్వాలేదు. సాంకేతిక విలువలకి బాగా ఖర్చు
పెట్టారు పేరున్న నిర్మాతలు. నిర్మాతల్లో ఫర్హాన్ అఖ్తర్ ప్రముఖ దర్శకుడు కూడా.
వేరే దర్శకుడికి అవకాశమిచ్చి సినిమా నిర్మించినప్పుడు ఫలితమిలా వుంది.
—సికిందర్