రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

1165 : రివ్యూ!


రచన - దర్శకత్వం : విఘ్నేష్ శివన్
తారాగణం : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, రెడిన్ కింగ్స్ లే, కాలా మాస్టర్ తదితరులు.
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదీర్, విజయ్ కార్తీక్ కణ్ణన్
బ్యానర్ : రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
నిర్మాతలు : విఘ్నేష్ శివన్, ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల : ఏప్రెల్ 28, 2022
***
        మిళంలో కాతువాకుల రెండు కాదల్ (పిల్ల గాలిలో రెండు ప్రేమలు) తెలుగులో కె ఆర్ కె (కన్మణి, రాంబో, ఖతీజా) గా విడుదలైంది. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ఆకర్షించే తారాగణం. సమంత పుట్టిన రోజు ఏప్రెల్ 28 న విడుదల. ఈ శుభ సందర్భంగా ఈ ముగ్గురితో ముక్కోణపు ప్రేమ కథ ప్రాణం పోసుకుంది. ప్రాణం పోసుకున్నాక పోషించే బాధ్యత 4 సినిమాల దర్శకుడు విఘ్నేష్ శివన్ తీసుకున్నాడు.

        పాపులర్ తారాగణానికి విఘ్నేష్ పేరు తోడై మూవీకి ఓ క్రేజ్ ఏర్పడింది. కారణం అజిత్ తో ఏకే 62 యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించబోతున్నాడు. సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ తో తానే నిర్మాతగా ఇంకో నిర్మాతతో భాగస్వామ్యంలో ఈ ముక్కోణ ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించాడు. అయితే నిర్మించడానికి ఏమైనా విషయముందా, లేక ముగ్గురు పాపులర్ తారల్ని వెండి తెర మీద అటూ ఇటూ తిప్పి కేవలం గ్లామర్ షోగా మార్చేశాడా? ఇది తెలుసుకుందాం... 

కథ

పుట్టగానే రాంబో (విజయ్ సేతుపతి) తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయింది గాక తను తల్లితో వుంటే ఆమె ఆరోగ్యం చెడుతూ వుంటుంది. దీంతో దురదృష్ట జాతకుడుగా పేరు పడి మళ్ళీ తిరిగి రాకుండా ఎటో వెళ్ళిపోతాడు. పగలు క్యాబ్ నడుపుతాడు, రాత్రిళ్ళు బార్ లో బౌన్సర్ గా పని చేస్తాడు. పబ్ లో కన్మణి (నయనతార) పరిచయమై రాత్రి ప్రేమాయణం  ప్రారంభిస్తుంది. ఈ ప్రేమాయణాన్ని ఎంజాయ్ చేస్తూ వుండగా ఖతీజా (సమంత) పరిచయమై పగటి  ప్రేమాయణాన్ని ప్రారంభిస్తుంది.

        ఈ ప్రేమాయణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వుండగా పెళ్ళి మాట వస్తుంది. పెళ్ళి మాట రాగానే డిస్ససోటివ్ డిజార్డర్ అనే మానసిక రోగాన్ని నటించడం మొదలెడతాడు. ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో తేల్చుకోలేక మానసిక రోగాన్ని నటిస్తున్న రాంబోతో పెళ్ళి కథ ఏమయిందన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

రెండు గంటల 40 నిమిషాల ఎడ తెరిపిలేని టార్చర్ ఈ ట్రాయాంగులర్ లవ్. పిల్లగాలిలో రెండు ప్రేమలు కాదు, వడగాలిలో రెండు వడదెబ్బలు. ముక్కోణ ప్రేమ సినిమాలు ముల్లోకాలు నిండిపోయేంత వచ్చాయి. ఇద్దర్ని ప్రేమించిన, లేదా ఇద్దరు హీరోయిన్లు ప్రేమిస్తున్న హీరో ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడన్న సిల్లీ కథల సినిమాలతో తలపండిపోయారు ప్రేక్షకులు. ఇంకా మభ్యపెట్టబోతే శృంగభంగం తప్పదు.

        ఈ ట్రాయాంగులర్ రోమాంటిక్ కామెడీ పేరుకే. ప్రేమించడం రాకపోయినా, నవ్వించడమూ చేతగాలేదు. అసలు విజయ్ సేతుపతిలో ఏం చూసి నయనతార, సమంతలు ప్రేమిస్తారో అర్ధం గాదు. అతను మానసిక రోగాన్ని నటిస్తున్నాడని తెలుసుకోక అతడికోసం సిగపట్లకి దిగే చిల్లర వ్యవహారం కూడా అర్ధం గాదు. కేవలం ఈ ముగ్గురు స్టార్ల ని గ్లామర్ షోకి వాడుకోవడం తప్పితే మరేమీ లేదు. ఏ గ్రేడ్ స్టార్స్ కి సి గ్రేడ్ కథ అంటగట్టి సినిమా అయిందన్పించాడు దర్శకుడు. ఈ సినిమాని ఈ ముగ్గురు స్టార్లు ఎలా ఒప్పుకున్నారో ఇంకో అర్ధంగాని విషయం.

నటనలు- సాంకేతికాలు

విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే. ట్రయాంగులర్ రోమాంటిక్ కామెడీ అంటేనే బోలెడు ఫన్. ఈ ఫన్ లేని లోటు అతనెందుకు తెలుసుకో లేదో తెలీదు. కామెడీ పేరుతో సిల్లీ డైలాగులతో  మనం తెల్లబోయేట్టు చేశాడు. మానసిక వ్యాధి నటించే ఎపిసోడ్స్ తో నవ్వించక పోగా నిద్ర పుచ్చాడు. సమంతని వేధిస్తున్న వాణ్ణి కొట్టే సీనులో బీస్ట్ గా మారి పోయి ఓవరాక్షన్ చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, విషయం లేక ఆచార్య ఎంత డొల్లగా వుందో, విజయ్ సేతుపతితో కె ఆర్ కె అంత బోలుగా వుంది.

        హీరోయిన్లు నయనతార, సమంతలు గ్లామర్ షో కోసమే నిండు అందచందాలతో వున్నారు. పాత్రలేమిటో చూసుకోలేదు, నటనలు పట్టించుకోలేదు. నాయన తార  ఓ చిన్న సేల్స్ గర్ల్, సమంత నిరుద్యోగి. అయినా అంత ఖరీదైన కాస్ట్యూమ్స్ తో -  ప్రేక్షకులు నవ్విపోతే మాకేటి సిగ్గనట్టు ప్రవర్తించారు. అసలు విజయ్ సేతుపతి కోసం జుట్లు పట్టుకుని కొట్టుకునే పాత్రలకి మాన మర్యాదలేమిటన్నట్టు కూడా దర్శకుడి కంటే రెండాకులు ఎక్కువే చదివి తలంటు పోశారు ప్రేక్షకులకి.

       అనిరుధ్ రవిచందర్ ఏం పాటలిచ్చాడో అలా ఇవ్వడానికి కారణముంది. రొడ్డ కొట్టుడు సినిమాకి ఇంతకంటే తగ్గట్టు పాటలెలా ఇవ్వగలడు. పాటలిలా వున్నాయేమిటని సదరు ముగ్గురు స్టార్ల మనోభావాలు కూడా దెబ్బతిననట్టున్నాయి. కెమెరా మాన్ బాగా చూపించినందుకు మాత్రం సంతోషించి వుంటారు.

        దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా పాత మోడల్ సినిమా తీస్తూ తెలుగు తమిళ భాషల్లో నవ్వుల పాలయ్యాడు ఈ నవ్వించని సినిమాతో. వరుసగా తమిళ దర్శకులిస్తున్న అట్టర్ ఫ్లాపు సినిమాలు చూస్తూంటే ఇక తమిళ టాలెంట్ ఒకప్పటి మాటే అనుకుని సరిపెట్టుకోవాలి.

సికిందర్