రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 3, 2022

1166 : స్క్రీన్ ప్లే సంగతులు

    థ అందామా, స్క్రిప్టు అందామా, స్క్రీన్ ప్లే  అందామా? ఏది అంటే అందులో జోక్యాల శాతం తగ్గొచ్చు? కథ అనగానే దాని గురించి మాట్లాడే వాళ్ళు చాలాచాలా మంది వచ్చి చేరిపోతారు. అలా కాదు, ఇలా వుంటే బావుంటుంది...ఇలా కాదు వుంటే బలంగా వుంటుందని తోచింది చెప్పేస్తూంటారు. స్క్రిప్టు అనగానే ఓ మోస్తరు స్పెషలిస్టులు వచ్చి చేరతారు. చూసిన సినిమాల ఉదాహరణలు చెప్తూ స్క్రిప్టు ని అటూ ఇటూ లాగుతారు. స్క్రీన్ ప్లే అనగానే ఈ మొదటి రెండు వర్గాలు ఫిల్టరై పోయి, స్క్రీన్ ప్లే అంటే ఏమిటో బాగా తెలిసిన వాళ్ళే వర్కులో మిగులుతారు. కథ అలా కాదు ఇలా వుండాలని అన్నప్పుడు, ఏఏ అంశాలు దృష్టిలో పెట్టుకుని అంటున్నట్టు? యాక్టివ్ క్యారక్టర్? గాథ కాకుండా కథ? క్యారక్టర్ ఆర్క్? టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్? గోల్ ఎలిమెంట్స్? సీన్ టూ సీన్ సస్పెన్స్? డైనమిక్స్? మార్కెట్ యాస్పెక్ట్? ఎమోషనల్ అప్పీల్? యూత్ అప్పీల్? ... ఇంకా చాలా టూల్స్ వుంటాయి- వీటిలో ఏది లేదా ఏవేవీ దృష్టిలో పెట్టుకుని అంటారు? ఇవేవీ లేకుండా ఏదో తోచింది అనెయ్యడమే? వంద కోట్ల సినిమాకి కూడా? ఆచార్యకి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కేటగిరీ గాకుండా, కథ కేటగిరీ, స్క్రిప్టు కేటగిరీల జోక్యమే అట్టర్ ఫ్లాపు కింద మార్చేసింది. అది ఈ సినిమాలో నటించిన స్టార్లు కావచ్చు- ఇంకెవరైనా కావొచ్చు... 

(ఇంకా వుంది) 

ముందుగా కొంత ఉపోద్ఘాతం
         ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు రాసే ఆలోచన లేదు. రాయడం అవసరమని విజ్ఞప్తు లొచ్చాయి. ఆచార్య లాంటి మేజర్ మూవీ స్క్రీన్ ప్లే మంచి చెడ్డలు తెలుసుకుంటామని. ఈ మధ్య తెలుగు సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు. అదే మూసలో సినిమాలకి, అదే మూసలో స్క్రీన్ ప్లే సంగతులు రాయడం, అదే మూసని రీడర్స్ చదువుకోవడం... ఇలా రాసిందే రాయరా/చదివిందే చదవరా దారిలేని దాసరీ అన్నట్టు తయారయ్యింది. అసలు ఒక సినిమాకి రాసిన స్క్రీన్ ప్లే సంగతులు తర్వాత పది సినిమాలకి అదే పోస్టు చేస్తూ పోయినా తేడా ఏమీ రాదు.

        అసలు ఓ పది సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు చదువుకుంటే, ఆ పరిజ్ఞానంతో ఇతర సినిమాల్ని విశ్లేషించుకోవడం వచ్చేయాలి. ఇలా జరగడం లేదు. ఎన్ని స్క్రీన్ ప్లే సంగతులు చదివినా మళ్ళీ కొత్త సినిమా వస్తే దాని స్క్రీన్ ప్లే సంగతులు చదివితే గానీ దాని లోటు పాట్లు తెలుసుకోలేని పరిస్థితి ఎక్కువుంది. కాబోయే మేకర్లే కాదు, రంగంలో వున్న వాళ్ళు కూడా చాలా మందికి కొత్తగా విడుదలైన / చూసిన సినిమాల్లో  కనీసం సెకండ్ యాక్ట్ ఎక్కడ మొదలైందంటే చెప్పలేని పరిస్థితి. మళ్ళీ దాని  స్క్రీన్ ప్లే సంగతులు చదివితే గానీ తెలుసుకోలేని పరిస్థితి. ఇలావుంది నాలెడ్జి పరిస్థితి. ఓ పదేళ్ళ క్రితం బ్రిటన్ నుంచి ఒక తెలుగావిడ ఈ మెయిల్ చేసింది- మీ రివ్యూలు చదివిన పరిజ్ఞానంతో సినిమాలు చూస్తూంటే యాక్ట్స్ ని గుర్తు పట్టడం, లోపాలు తెలిసిపోవడం సులభమైపోయిందని. అప్పటికి ఈ బ్లాగు లేదు, స్క్రీన్ ప్లే సంగతులు కూడా లేవు. పత్రికల్లో రాసే రివ్యూలే!

        రివ్యూలైనా, స్క్రీన్ ప్లే సంగతులైనా ప్రేక్షకులకి / ఆసక్తిగల మేకర్స్ కి సినిమాల పట్ల అవగాహన కల్పించడానికే వున్నాయి. మన డ్యూటీ యేదో మనకి చాతనైంది చేస్తున్నాం- దీన్ని చదువరులు ఉపయోగించుకోక పోతే  ఆచార్య లాంటి మేజర్ సినిమాలు ఇంకా తీస్తూనే వుంటారు- తీస్తున్నది బ్రహ్మాండమనే భ్రమల్లో పడిపోయి. లేకి సినిమా ఎప్పుడూ లేకికి ముద్దే.

        ఒకప్పుడు వివిధ శాఖల సాంకేతిక నిపుణులు 45 మందిని ఇంటర్వ్యూలు చేసి ఆయా శాఖల పనితీరులు ఆంధ్రజ్యోతి ద్వారా మొట్టమొదటిసారిగా వెల్లడించాం. అలాగే మేకర్స్ ని కూడా ఇంటర్వ్యూలు చేసి, వాళ్ళ కొత్త సినిమా తెరవెనుక జరిగిన స్క్రీన్ ప్లే కసరత్తులు లోకానికి తెలియజేద్దామంటే ముందుకు రాని పరిస్థితి. నల్గురైదుగుర్ని అడిగి చూసి ఆ ప్రయత్నం మానుకున్నాం. హాలీవుడ్ లో, బాలీవుడ్ లో మేకర్లు, రైటర్లు వాళ్ళ సినిమాల స్క్రీన్ రైటింగ్ గురించి ఇంటర్వ్యూ లిస్తూంటారు. తెలుగులో లోపాలు బయటపడతాయని ముందుకు రాకపోతే లోపాలతోనే ఫ్లాప్ సినిమాలు తీయడం ఖాయం.

విషయానికొద్దాం
         ఆచార్య తెరవెనుక కథా కసరత్తుల గురించి ఇక్కడ అవసరం లేదు. తెర వెనుక ఎవరెవరున్నా జయాపజయాల్ని మేకరే మోయాలి. ఎంతో శ్రమచేసి తీసిన సినిమా మార్నింగ్ షో కే కుప్పకూలడమంత వెంటాడే విషాదం మరొకటుండదు. అయిందేదో ఐంది. ఇక విశ్లేషణతో కొత్త విజన్ ని చూస్తూ ముందుకు పోవడమే దారి. తెర వెనుక ఏం జరిగినా, ఫైనల్ గా తెర మీద ప్రేక్షకులకి ఏం మిగిలిందో దాని సంగతులే చూద్దాం. ఫైనల్ గా తేలిందేమిటంటే, ఓ హై కాన్సెప్ట్ కథని  రెగ్యులర్ లో- కాన్సెప్ట్ సినిమాలాగా అతి సాధారణంగా తీసేయడం. నక్సలిజానికి దైవ భక్తిని కలిపి ఎలా తీయాలన్నది సమస్యగా మారడం దర్శకుడి మాటల్లో. బేసిగ్గా చిరంజీవి పాత్రని లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేసే క్యారక్టరైజేషన్ని కథ డిమాండ్ చేస్తున్న ధోరణిని గమనించకపోవడం.

సేమ్ సైరా
‘లయన్ ఆఫ్ డెసర్ట్’
    చిరంజీవి సైరా లో కూడా పాత్ర ప్రాబ్లమే. చారిత్రికంగా ఒక అస్పష్ట ఇమేజి వున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కాని కథని తెరకెక్కించేప్పుడు, అతన్నొక స్మృతి పథంలో నిల్చి పోయే సుస్పష్ట లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం. లారెన్స్ ఆఫ్ అరేబియా’ లో పీటర్ ఓ టూల్ నటించిన లారెన్స్ చారిత్రక పాత్రనీ, ‘లయన్ ఆఫ్ డెసర్ట్’ లో ఆంథోనీ క్విన్ నటించిన ఒమర్ ముఖ్తార్ ఇంకో పాత్రనీ, కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు’ మరొక చారిత్రక పాత్రనీ స్మృతిపథంలో నిలచిపోయే లెజెండ్స్ గా సుస్పష్టంగా మనముందుంచారు వాటి దర్శకులు. అవి ఎక్కుపెట్టిన బాణాలయ్యాయి ప్రేక్షక హృదయాలకి. సైరా’ లో లాగా, ఆచార్య లో ఈ  ప్రధాన సృష్టే  జరగలేదు బాక్సాఫీసు అప్పీల్ కి.  ఇంత మల్టీ మిలియన్ బడ్జెట్ సినిమాలైన ఈ రెండిట్లో చిరంజీవి నటించిన పాత్రలతో వెండి తెరకి ఓ ఆత్మనీ, గుండె కాయనీ ఇవ్వాలని ఆలోచించలేదు.  

        ఉయ్యాలవాడని మరపురాని లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు గానీ, మధ్యలో నరసింహావతారమని మిథికల్ టచ్ ఇచ్చే విఫలయత్నం చేశారు. ఇదైనా మనస్ఫూర్తిగా చేసివుంటే  మిథికల్ క్యారక్టర్ గా దైవత్వ  ఛాయాలతో మన్ననలందుకునేది. 1974 నాటి  విప్లవకారుడి కథ  ‘అల్లూరి సీతారామ రాజు’ లో దీన్నే విజయవంతగా నిర్వహించారు పాత్రకి దైవత్వాన్ని ఆపాదించి - ‘స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా’ అంటూ కీర్తి గానాలతో. విప్లవాన్నీ, ఆధ్యాత్మికతనీ  విజయవంతంగా మిళితం చేసి అల్లూరి పాత్రని అజరామరం చేశారు. కానీ ఆచార్య లో నక్సలిజాన్ని దైవభక్తితో ఎలా కలపాలో తెలియలేదు దర్శకుడి మాటల్లో. తెలియకపోతే గూగుల్లో ఓ క్లిక్ చేసేంత దూరంలోనే వుంది సమస్త సమాచారం.

అల్లూరిలో లెజెండ్ సృష్టి

లారెన్స్ ఆఫ్ అరేబియా’
    అల్లూరి సీతారామరాజు చరిత్రని సినిమా తీస్తే ఫక్తు డ్రై సబ్జెక్టు అవుతుందని అనుకుంటూ, సినిమా తీయడానికి పదిహేడేళ్ళుగా ఎన్టీఆర్ తాత్సారం చేస్తూంటే, అప్పటికి కేవలం 34 ఏళ్ళున్న హీరో కృష్ణ, ఆ డ్రై నెస్ ని కాస్తా ధైర్యంగా భక్తిరస పారవశ్యాలతో కల్పన చేసి సస్యశ్యామలం చేసేశారు!

        అల్లూరి సీతారామ రాజు అనే విప్లవ వీరుడుకి సినిమా కోసం దైవత్వాన్ని కూడా కల్పించి నడిపిన అద్భుత సన్నివేశాలే సినిమాకి జీవం పోసి డ్రై నెస్ ని వెళ్ళగొట్టాయి. విప్లవకారుడి మత దృష్టి రాజకీయ నాయకుడి మత దృష్టిలా విభజించదు, అది కలుపుకుని పోతుంది. విప్లవకారులు ఉద్యమాలు నడపడంలో ప్రజల్ని సంఘటితం చేసే మత దృష్టి లోపిస్తే, విఫలురవుతారేమోననే అభిప్రాయం కూడా కల్గిస్తుంది ఈ సినిమా.

        విప్లవ కవిత్వంలో భావ కవిత్వానికి చోటుండదు. అయినా  ఈ సినిమాలో  ఈ రూలునే బ్రేక్ చేశారు. ఇది రచయిత త్రిపురనేని మహారథి నైపుణ్యం అనొచ్చు. ఓ వైపు సామాజికంగా అమాయక గిరిజనుల కోసం పోరాడే వీరుడిగా అల్లూరిని చూపిస్తూనే, మరో వైపు కథా శిల్పం చెడకుండా- జానర్ మర్యాద దెబ్బ తినకుండా- అల్లూరిని మహిషాసుర మర్ధిని స్తోత్రం పాడగల పారంగతుడిగానూ చిత్రించారు. విప్లవ పాత్రకి పౌరాణిక సుగంధాల న్నమాట. ఇలా మెజారిటీ ప్రజల సెంటిమెంట్సుని దృష్టిలో పెట్టుకోవడమనే మార్కెట్ యాస్పెక్ట్ ఏదైతే వుందో, దాంతో చేసిన ప్రయోగమే ఆచార్య లో లోపించింది.

లెజెండ్ లెక్కలు
        హైకాన్సెప్ట్ తరగతికి చెందిన మూవీని డిమాండ్ చేసే ఆచార్య లాంటి కథ చిరంజీవిని ఆ స్కేల్ లో లెజెండరీ క్యారక్టర్ ని కోరుతుంది. అలా వూహించే కథ చేసి వుంటారు. అది కుదర్లేదు. లెజెండ్ టైపు కథా కథనాలు బోలెడు యాక్షన్ తో, సస్పెన్స్ తో, హై కాన్ఫ్లిక్ట్ పాయింట్ తో వుంటాయి. పాత్రకి ఎన్నో కష్టాలు ఆటంకాలూ ఎదురవుతాయి. ప్రకృతి, దేవుడు, మానవ ప్రవృత్తిలకి సంబంధించి తనదైన భావజాలాన్ని ప్రకటిస్తుంది పాత్ర. ముక్కుసూటిగా నైతిక విలువల్ని, లేదా జీవిత పాఠాల్ని వెల్లడిస్తుంది. ప్రజలకి దైవంలా, అవతార పురుషుడులా ఉదాత్తంగా వుంటుంది. ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా వుంటుంది. లెజెండ్ క్యారక్టర్ యూనివర్సల్ అప్పీల్ తో వుంటుంది.

       
పక్క పటం చూస్తే, జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ లో, ఆరోహణ - అవరోహణా క్రమపు రంగుల రాట్నంలో, పాత్రల వివిధ ఉత్థాన పతన స్థాయుల్ని గమనించ వచ్చు. కుడి వైపు కింది నుంచి పైకి వెళితే మొదటిది - తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పాటుపడే ఫెయిరీ టేల్ పాత్ర, రెండవది - దీని పై స్థాయిలో పరిధి పెరిగి సమాజం కోసం పాటుపడే క్లాసిక్ పాత్ర, మూడవది - ఈ రెండిటి పై స్థాయిలో విస్తృత పరిధిలో ప్రపంచం కోసం పాటు పడే లెజెండ్ పాత్ర. ఇక నాల్గవది -  ఈ మూడిటికీ పై స్థాయిలో దేవుడికీ భక్తుడికీ అనుసంధానంగా వుండే సమున్నత మిథికల్ పాత్ర.

        చట్రం ఆరోహణా క్రమంలో ఈ నాల్గూ పాజిటివ్ పాత్రలే.  ఇక చట్రం ఎడం వైపు పై నుంచి కిందికీ దిగుతూ పోతే,  ఒక్కో మెట్టూ దిగజారుతూ నెగెటివ్ - యాంటీ హీరో పాత్రలుంటాయి. సినిమాలకి మొత్తం ఈ ఎనిమిది రకాల పాత్రలు. హాలీవుడ్ కైనా, టాలీవుడ్ కైనా, ఉండ్రాజ పల్లిలో కథలు చెప్పుకోవడానికైనా ఇంతే. సాహిత్యంలో కూడా ఇంతే.

        ఈ పాత్రల రంగుల రాట్నంలో ఆచార్య లెజెండ్ కథ మూడో మెట్టుని అధిష్టించి వుండాలి. మొదటి మెట్టులో ఫెయిరీ టెయిల్ చిత్రణ, రెండో మెట్టులో క్లాసిక్ చిత్రణా పనికి రావు. ఆచార్య కథ మతానికీ రాజ్యానికీ మధ్య సంఘర్షణతో కూడిన కథ. దేర్ విల్ బి బ్లడ్ మతానికీ పెట్టుబడికీ సంఘర్షణ. ఇందులో కథానాయకుడు డేనియల్ డే లెవీస్ పాత్ర పై స్టోరీవీల్ లో అవరోహణా క్రమంలో అట్టడుగు యాంటీ హీరో స్ఠాయికి పతనమై వుంటుంది. పెట్టుబడి దారుగా మతాన్ని మంటగలపాలని చూసి వినాశం తెచ్చుకునే పాత్ర. అటు మతాధిపతి కూడా ధనాశతో సైతానుగా మారి పతనమయ్యే పాత్ర. ఈ హై కాన్సెప్ట్ కథలో హీరో విలన్ ఇద్దరూ నాశనమవుతారు. ఇందులోంచి పాఠాలు ప్రపంచ పెట్టుబడిదారులు, మతాధిపతులు నేర్చుకోవాలి.

దేర్ విల్ బి బ్లడ్
    ఇందులో హీరోది ఆయిల్ ని కనిపెట్టి లెజెండ్ గా ఎదిగే పాత్రే. తర్వాత దురాశతో యాంటీ లెజెండ్ గా మారిపోయే పాత్ర. పాత్ర నటించిన డానియెల్ డే లెవీస్ ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డు పొందాడు. దీని స్క్రీన్ ప్లే సంగతులు బ్లాగులో పోస్టయి భద్రంగా వున్నాయి.

        ఆచార్య లో గిరిజనుల పుణ్య క్షేత్రాన్ని కబళించాలని చూసే రాజ్యపు దుర్మార్గం, దీన్నెదుర్కొనే నక్సల్ హీరో పాత్ర. ఈ స్టోరీలైన్ లోనే తేడా వుంది. దీంతో హై కాన్సెప్ట్ లెజెండ్ కి కాకుండా, లో కాన్సెప్ట్ లోకల్ హీరోకి తగ్గ కథగా తెరకెక్కింది. దీన్ని స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం....

—సికిందర్