రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 29, 2022

1164 : రివ్యూ!



రచన – దర్శకత్వం : కొరటాల శివ
తారాగణం : చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్, జిశ్శూ సేన్ గుప్తా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మణిశర్మ
, ఛాయాగ్రహణం :
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
విడుదల : ఏప్రెల్ 29
, 2022

***

        దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ వల్ల ఆచార్య నిర్మాణం, విడుదల ఆలస్యమై అభిమానులు అల్లాడిపోయారు. అభిమానుల్ని ఊరడించడానికి పాటలు, ట్రైలర్స్ విడుదల చేస్తూ అభయమిచ్చారు. పాటలు ఊరడించినా, చివరి ట్రైలర్ ఉస్సూరనిపించింది. ట్రైలర్ కమర్షియల్ గా లేకపోవడం అలా వుంచితే, విషయం కూడా లేక చప్పగా వుంది. అయితే ట్రైలర్ లో విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచామనీ, అది సినిమాలో రివీల్ అవుతుందనీ దర్శకుడు కొరటాల శివ విచిత్ర వివరణ. ట్రైలర్ లో విషయం లేకపోతే బుకింగ్స్ సవ్యంగా వుంటాయా అన్నది ప్రశ్న.

        నిస్సందేహంగా బుకింగ్స్ డల్ గా వున్నాయి. ట్రైలర్ చూసి విషయం లేదని పసిగట్టేశారా ప్రేక్షకులు? మెగా స్టార్ చిరంజీవి, మెగా రాక్ స్టార్ రామ్ చరణ్ తండ్రీ కొడుకులు కలిసి తొలిసారిగా వెండితెరని పావనం చేస్తూంటే ఎందుకీ పరిస్థితి? దారుణంగా 1.5, అంటూ 2 అంటూ రేటింగ్స్ ఎందుకు పడుతున్నాయి? ఇంత మెగా దురదృష్టం ఎందుకు ప్రాప్తించింది? తెలుసుకుందాం...

కథ

    మునిసిపల్ ఛైర్మన్ బసవ (సోనూసూద్) ప్రసిద్ధ ఆలయమున్న ధర్మస్థలి అనే గ్రామాన్ని రాథోడ్ (జిశ్శూ సేన్ గుప్తా) కి ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతాడు. ఈ గ్రామాన్ని పాదఘట్టం అనే ఇంకో గ్రామపు గిరిజనులు కాపాడుతూంటారు. ధర్మస్థలిని ఆక్రమించేందుకు బసవ దుర్మార్గాలు  పెరిగిపోవడంతో నక్సల్ ఆచార్య (చిరంజీవి) రంగప్రవేశం చేస్తాడు. ఆచార్యతో సిద్ధ (రామ్ చరణ్) కలుస్తాడు. ఎవరీ సిద్ధ?  ఆచార్యతో అతడికున్న సంబంధమేమిటి? వీళ్ళిద్దరూ కలిసి ధర్మస్థలిని  ఎలా కాపాడారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
    పూర్వం రావు గోపాలరావు విలన్ గా గ్రామ కక్షల సినిమాలు ఆనాటి అందరు హీరోలతో వచ్చాయి. వాటినే రీసైక్లింగ్ చేసి ఒక సమకాలీన మార్కెట్ యాస్పెక్ట్ లేని, వర్తమాన బాక్సాఫీసు ఫ్రెండ్లీ కాని, యూత్ అప్పీల్ కూడా లేని, అరిగిపోయిన పాత మూస ఫార్ములా ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇది తక్షణం బెడిసికొట్టింది.

        దేవాలయాలకి సంబంధించిన కథ మెగాస్టార్ తో వూహిస్తే హైకాన్సెప్ట్ మహోజ్వల గాథవ్వాలి నిజానికి. అంతకి తగ్గించి ఓ గ్రామం, అక్కడో గుడి, దాంతో ఓ మునిసిపల్ ఛైర్మన్ అక్రమాలనే చిన్న హీరోల స్థాయికి కథని కుదిస్తే, మెగా స్టార్ కి అన్యాయమే అవుతుంది.

        కేవలం వ్యక్తి అక్రమాలు మెగాస్టార్ కి చాలవు, పై స్థాయిలో ప్రభుత్వ/వ్యవస్థ  అక్రమాలై వుంటే సమవుజ్జీగా, లెవెల్ గేమ్ ప్లేయింగ్ గా వుంటాయి. దీనికి బదులు కథ చిన్నది కావడంతో, అదీ బలహీనంగా చెప్పడంతో,  మెగా స్టార్ కి నిజమైన బాక్సాఫీసు పని లేకుండా పోయింది...

నటనలు - సాంకేతికాలు

    ముందుగా, చిరంజీవి ఆచార్య నక్సల్ పాత్ర చాలా పేలవంగా వుందని చెప్పక తప్పదు. ఎమోషనల్ అప్పీల్ అనేదే  లేదు. పాత్ర తీరు యాంత్రికంగా, కృత్రిమంగా వుంది. కథలో విషయం లేనప్పుడు పాత్రకి బలం ఎలా వస్తుంది. పోనీ విషయం లేనప్పుడు కామెడీ, రోమాన్సులతో ఎంటర్టయిన్ చేయొచ్చు. ఇది కూడా లేదు. చిరంజీవికి హీరోయిన్ లేదు. ఒక గ్రూప్ సాంగ్, రామ్ చరణ్ తో ఇంకో సాంగ్ తప్ప ఫ్యాన్స్ కి హుషారు తెప్పించే సందర్భాలు లేవు. పేలవమైన కథా కథనాల వల్ల ఫైట్స్ కి సందర్భ బలం కూడా లేదు. రామ్ చరణ్ తో కలిసి క్లయిమాక్స్ ఫైట్ అయితే, సాగదీసి సాగదీసి సాగుతూనే వుంటుంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయేలా.

        చిరంజీవి ఫిజిక్, లుక్ ఇవి బావున్నాయి. తను ఇంత బావున్నప్పుడు తానేం డిమాండ్ చేసి తీసుకున్నాడు దర్శకుడి నుంచి? ఏమీ లేదు. కథే చిరంజీవిని డిమాండ్ చేయడం లేదు. ఎంతంటే, రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చే ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ సహన పరీక్ష పెట్టేంతగా. ఫస్టాఫ్ చిరంజీవితో ఇంత బోరు కొడుతుందని వూహించం. తను నటించిన ఏ సినిమాలోనూ ఇలా జరగలేదు. కాకపోతే బయట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి థియేటర్లో ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూ కూర్చోగలం. మంచి డైలాగులు, ఫన్నీ డైలాగులు, బలమైన డైలాగులు, మాస్ పంచ్ డైలాగులు  కూడా లేవు. ఇది ట్రైలర్స్ లోనే బయటపడింది.

        ఇక రామ్ చరణ్ ఇంటర్వెల్లో ఎంట్రీ ఇచ్చి సెకండాఫ్ నైనా కాపాడతాడనుకుంటే అదీ లేదు. పూజా హెగ్డే తో రోమాన్స్ కూడా పాతబడిన వ్యవహారమే. పూజా హెగ్డే కి ప్రాధాన్యమేమీ లేదు, పాటలు, రోమాన్స్ తప్పితే. వరసగా తనకి రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఫ్లాప్సే.

        సోనూ సూద్, జిశ్శూ సేన్ గుప్తాల విలనీ, నటనలు అవే మూస టెంప్లెట్లు. ఇతర సహాయ నటుల గురించి చెప్పుకోవడాన్నికేమీ లేదు.

        భారీగా ఖర్చు పెట్టిన ప్రొడక్షన్ విలువలు తప్పితే, మణిశర్మ సంగీతంలో పాటలు (ఓ రెండు తప్ప) కూడా వూపు తీసుకురాలేదు. రామ్ లక్ష్మణ్ ల పోరాటాలైతే సందర్భం తక్కువ సందడి ఎక్కువన్నట్టున్నాయి. కొరటాల శివ దర్శకత్వం దారుణం. కోవిడ్ కాలంలో తీశారు కాబట్టి మేకింగ్ డిస్టర్బ్ అయిందా అనుకోవడానికి లేదు. కోవిడ్ విరామాల్లో స్క్రిప్టు లోపాల మీద దృష్టి పెట్టినట్టు లేదు- రామ్ చరణ్ కొరటాల శివ సహ రచయిత!

చివరికేమిటి

    ట్రైలర్ లో విషయం లేకపోవడానికి సంబంధించి కొరటాల ఇచ్చిన వివరణ - ఉద్దేశపూర్వకంగా ట్రైలర్ లో విషయం దాచామనీ, అది సినిమాలో రివీల్ అవుతుందనీ చెప్పడం సరైంది కాదు. సినిమాలో విషయమనేదే  లేదు. ఫస్టాఫ్ కబ్జాదార్లు, సెకండాఫ్ నక్సల్ ఫ్లాష్ బ్యాకు - అని  పెట్టుకున్న స్కీములో విషయమే లేదు.

        వీటికి చూపించిన దృశ్యాలన్నీ  ఒరిజినాలిటీ లేని ఇదివరకు ఎన్నో సినిమాల్లో వచ్చేసిన టెంప్లెట్ సీన్లే. ఓ పది పాత సినిమాలు ఒకే చోట చూస్తున్నట్టు వుంటుంది. ఎక్కడా సస్పెన్స్, టెన్షన్, థ్రిల్, ఫీల్ తో కూడిన సీన్లే లేవంటే - ఈ  బిగ్ బడ్జెట్ మూవీని ఏ ధైర్యంతో తీసి వుంటారో.

        చిరంజీవి- రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దర్నీ కలిపి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల కోరిక కూడా తీరే విధంగా లేదు. ఇద్దరూ కలిసి వున్న సీన్లు కూడా పేలవంగా వున్నాయి- ఇద్దరూ కలిసి స్టెప్పు లేసిన ఓ పాటతప్ప- మినిమమ్ మల్టీ స్టారర్ కమర్షియల్ హంగులూ హంగామా లేని అనవసర హైరానా అయింది ఆచార్య.

—సికిందర్