రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఏప్రిల్ 2022, గురువారం

1163 : టిప్స్


 

    థా నడక (పేసింగ్) గురించి మాట్లాడేప్పుడు తెలుగు సినిమాల్లో వుంటున్న స్పీడుగా కదిలే సీన్ల పేసింగ్ దేనికి పనికొస్తోంది? గంటన్నరకి ఇంటర్వెల్ వరకూ కథలోకే వెళ్ళదు బిగినింగ్ ఉపోద్ఘాతపు పేసింగ్. బిగినింగ్ తో అంతసేపూ కాలహరణ చేయడం పేసింగ్ అన్పించుకుంటుందా? తెలుగు సినిమాలు ఆడే థియేటర్లలో ప్రేక్షకుల మొహాలు లైటింగ్ తో వెలిగిపోతూంటాయి. ఏమిటా అంటే స్మార్ట్ ఫోన్ల లైటింగ్. తెరమీద ఓపికని పరీక్షించే ఫస్టాఫ్ ని కట్ చేసి, సెకండాఫ్ చూసుకునే రిమోట్ లేదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూంటారు. మేకర్లకి ఈ మేకింగ్ ఫాల్టు పట్టదు. ఫస్టాఫ్ చకచకా రన్ చేసి బ్రహ్మాండంగా మెప్పించామనుకుంటారు. రన్ చేసింది ఉపోద్ఘాతమే తప్ప కథ కాదని తెలుసుకోరు. ఈ రన్ చూసి  థియేటర్లలో  ప్రేక్షకుల  పరిస్థితేమిటో తొంగి చూసి తెలుసుకోవడం వుండదు.

        2. కమర్షియల్ సినిమా అనే పదార్ధం- ఇంటలెక్చువల్ అనే పదం రెండూ ఒక  ఒరలో ఇముడుతాయా? ఇంటలెక్చువల్స్  కమర్షియల్ సినిమాలు తీసెంత కింది స్థాయిలో వుండరు. వాళ్ళ సినిమాలు పై స్థాయికి చెందినవి. తలపండిన మేధావులు చూసేవి. కమర్షియల్ సినిమా అర్ధవంతంగా వుండాలంటే కేవలం అది ఇంటలిజెంట్ రైటింగ్ ని డిమాండ్ చేస్తుంది. ఇంటలిజెంట్ రైటింగ్ కి ఇంటలెక్చువల్  అయి తీరాల్సిన పని లేదు. ఏవేవో సినిమా పుస్తకాలు చదివేసి మెదడుని బాధ పెట్టుకోనవసరం లేదు. ఉన్న కమర్షియల్ సినిమా క్రాఫ్ట్ నీ, క్రియేటివిటీనీ కంటెంట్ పరంగా అర్ధవంతంగా ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి స్థాపించగల సామర్ధ్యం వుంటే సరిపోతుంది.  మయూరి,  కంచెఇలాటి ఇంటలిజెంట్ రైటింగ్స్ తో విజయవంతమైన కమర్షియల్ సినిమాలు. ఇంటలిజెంట్ అయివుంటే చాలు, ఇంటలెక్చువల్ అవనవసరంలేదు కమర్షియల్ సినిమాలకి. 

        3. కాలపరీక్షకి తట్టుకు నిలబడింది ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ళ నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో ఫిలిం రీళ్ళతో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు కథనాన్ని రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్ళే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ళ నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వెన్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే!

        4. స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్యా స్థాపనా జరిగిపోతే, చప్పున అరగంట- ముప్పావు గంట లోపు కథ పాయింటు కొచ్చేసే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షణాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్ళివెళ్ళి  ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి -  క్లయిమాక్స్ కొచ్చేస్తుంది కథ!  

        5. నిజంగా మిడిల్ అనేది ఓ కీకారణ్యం. ఎటు వైపు ప్రయాణించాలో తెలీదు. ఎప్పుడు? రూట్ మ్యాప్ లేనప్పుడు. దాంతో కంపార్ట్ మెంటలైజ్ చేసుకోనప్పుడు. ప్లాట్  పాయింట్- 1 విలువని గుర్తించకపోతే, లేదా ప్లాట్ పాయింట్ -1 ముందే ఏర్పడిపోయిందన్న స్పృహే  లేకపోతే, మిడిల్ నిజంగా కీకారణ్యంలాగే కన్పించి ఎటు వైపు వెళ్ళాలో తెలియకుండా చేస్తుంది. బెంగాల్ టైగర్లో సినిమా ప్రారంభమైన పదినిమిషాల్లోనే చక్కగా బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ -1 ఏర్పాటయితే, పెళ్ళి చూపులప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఫేమస్ కాదని హీరోని తిరస్కరించడంతో హీరోకి గోల్ ఏర్పడి మిడిల్ సంఘర్షణ ప్రారంభమైతే, ఇది గుర్తించకుండా ఇంటర్వెల్లో వచ్చిన టర్నింగే  కథకి మలుపు అనుకుని, వేరే పగాప్రతీకారాల కథ ఎత్తుకున్నారు. సైజ్ జీరోఇంటర్వెల్ దగ్గర ఆలస్యంగా ప్లాట్ పాయింట్ -1 ఏర్పడి బరువు తగ్గాలని నిశ్చయించుకున్న హీరోయిన్ నిఇంటర్వెల్ తర్వాత ఆ సమస్యతో సంఘర్షించక, బోగస్ హెల్త్ సెంటర్ మీద పోరాటానికి ఒడిగట్టే హీరోయిన్ గా మార్చేశారు. మిడిల్ తో ఇంత కన్ఫ్యూజన్ అన్నమాట! అదీ పెద్ద బడ్జెట్ సినిమాలకి!

          6. సినాప్సిస్ అంటే కథా సంగ్రహం లేదా క్లుప్తంగా కథ.  దీని రచనకి హాలీవుడ్ లో కొన్ని మార్గదర్శకాలున్నాయి. సినాప్సిస్ -4 సైజు పేజీల్లో వుండాలి. ఒక పేజీకి మించి వుంటే డబుల్ స్పేస్ లో, ఒక పేజీ మాత్రమే  వుంటే సింగిల్ స్పేస్ లో టైపు చేయాల్సి వుంటుంది. లెఫ్ట్ ఎలైన్ మెంట్  వుండాలి. వర్డ్ డీ ఫాల్ట్ మార్జిన్స్ ని మార్చకూడదు. పేరాలో మొదటి లైను అర ఇంచు ఇండెంట్ వుండాలి. ఫాంట్  టైమ్స్ న్యూ రోమన్ 12 పాయింట్ వుండాలి. పాత్రల పేర్లు మొదటిసారి  ప్రస్తావించినప్పుడు వాటిని కేపిటల్ లెటర్స్ లో వుంచాలి. పేజీ నంబర్లు హెడర్ కుడి వైపు వేయాలి. సినాప్సిస్ అని టైటిల్ కింద డబుల్ స్పేస్ ఇచ్చి టైప్ చేయాలి. దీనికింద నాల్గు స్పేస్ లిచ్చి సినాప్సిస్ ని టైప్ చేయాలి. ఇలా ఇంకా చాలా నిర్దుష్ట  సాంకేతికాంశాలతో ముడిపడి వుంటుంది వ్యవహారం. స్క్రీన్ ప్లే స్క్రిప్టుకి కూడా ఇలాటి మార్గదర్శకాలు అనేకం వుంటాయి. వీటిలో ఒక్కటి తప్పినా స్క్రీన్ ప్లేని, లేదా సినాప్సిస్ నీ అవెంత బాగున్నా, మొదటే తిప్పికొట్టేస్తారు. వాటి సృష్టి కర్తని హీనంగా చూస్తారు. ఇది మనకి వర్తించేది కాదు.

        7. తెలుగు సిన్మాప్సిస్ - టైపింగ్ లో సినాప్సిస్ బదులు సిన్మాప్సిస్  అని పడిపోయింది! ఇదేదో బాగానే వున్నట్టుంది. కొన్ని పదాలు ముద్రారాక్షసాల వల్ల కాయిన్ అయిపోతాయి. ఇక నుంచి తెలుగు సినిమాలకి సిన్మాప్సిస్ అనే అందాం. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ బాక్సులో తెలియజేయండి. రెండు లైకులు కొట్టి, సబ్ స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. షేర్ చేయండి.

        8. తెలుగు సిన్మాప్సిస్ లు హాలీవుడ్ టైపులో వున్నట్టు రెండు మూడు పేజీల్లో సంక్షిప్తంగా వుంటే పనికిరావు. హాలీవుడ్ లో నిర్మాతలో,  ఏజెంట్లో ముందు సంక్షిప్త సిన్మాప్సిస్ లు చదివి నిర్ణయం తీసుకుంటారు. మన దగ్గర ఈ మధ్య నిర్మాతలు, హీరోల మేనేజర్లు ముందు సిన్మాప్సిస్ లు పంపమనడం ఎక్కువైంది. అలా మేకర్లు సినాప్సిస్ లు పంపిస్తే ఎటుపోతున్నాయో తెలీదు. రెస్పాన్స్ వుండదు. చదివారో లేదో కూడా తెలీదు. తెలుగులో కథ వినడానికి కొంత టైమిచ్చే సాంప్రదాయం పోయి, సిన్మాప్సిస్ లు అడుగుతున్నారు. కొందరు ఇంగ్లీషులో అడుగుతారు. మేకర్ల కోసం ఇవి రాసి పెడితే వృధా అవుతున్నాయి. తెలుగుకి ఈ హాలీవుడ్ లో పంపే సిన్మాప్సిస్ లాంటివి పనికి రావని తేలుతోంది.

        9. తెలుగులో నిర్మాతలకో, హీరోలకో మౌఖికంగా కథ చెప్పడమే పనికొచ్చే పద్ధతి. అందుకని మేకర్స్ కథ చెప్పడానికి తమ కోసం తాము సిన్మాప్సిస్ లు తయారు చేసుకోవడం ముఖ్యమవుతోంది. ఈ సిన్మాప్సిస్ రెండు మూడు పేజీల్లో వుంటే సరిపోదు. గంట పాటు కథ చెప్పగల్గే నన్ని పేజీల్లో వుండాలి. ఈ పేజీలు డిటిపిలో 30 పైనే  వుండొచ్చు. ఏడు వేల పదాలు. మేకర్స్ వాళ్ళ కథతో సంప్రదించినప్పుడు ముందు ఐడియాని నిర్మించి, సిన్మాప్సిస్  రాయాలంటే 30 రోజుల పైనే పడుతోంది. స్టోరీ సిట్టింగ్స్ సంగతి తర్వాత, ముందు సిన్మాప్సిస్ సిట్టింగ్స్ తప్పదు.

        10. ఇక్కడ సిన్మాప్సిస్ అంటే టూకీగా కథ అనుకుని రాసుకుంటే సరిపోదు. మొత్తం రెండు- రెండున్నర గంటల పాటూ సాగే కథ వివరంగా అనుకోవాలి. ఎక్కడెక్కడైతే ఆ వివరం రీసెర్చి కోరుతుందో ఆ రీసెర్చినంతా చేయాలి. ఇలా ఆ సవివరమైన కథని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో కూర్చోబెడుతూ, బిగినింగ్ మిడిల్ ఎండ్ విడివిడి విభాగాలతో ఒక పెద్ద కథ లాగా సిన్మాప్సిస్ రాయాలి. అంటే సిన్మాప్సిస్ అంటే మొత్తం ఆ కథకి స్క్రీన్ ప్లే అన్నట్టే. ఇదే రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది.

        11. అన్నీ చోట్లా గంట టైమివ్వక పోవచ్చు నిర్మాతలు, హీరోలు. అరగంటలో చెప్పమనొచ్చు, 10 నిమిషాలే అనొచ్చు. కాబట్టి అదే పెద్ద కథని గంట- అరగంట- 10 నిమిషాల్లో చెప్పే పద్ధతిని కూడా ఈ బ్లాగులోనే వివరించాం (ఇంతకీ కథెలా చెప్పాలి?). కాబట్టి గంట సిన్మాప్సిస్ ఆధారంగా అరగంట, 10 నిమిషాలు వుండే మినీ సిన్మాప్సిస్ లు కూడా తయారు చేసుకోవచ్చు.

        12. సమస్య ఎక్కడొచ్చిందంటే, హీరో లెవరూ ఖాళీగా లేరు. నిన్న మొన్నొచ్చిన కొత్త హీరోలు కూడా ఖాళీగా లేరు. కథలు వినే మాటే లేదు. మేకర్స్ అందరికీ పేరున్న హీరోలే కావాలి. మేకర్స్ సంఖ్య హీరోల సంఖ్యకి పది రెట్లుంది. ఒక హీరో చుట్టూ పది మంది కథ చెప్పడం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఆ హీరోలకి రెండేళ్ళూ ఖాళీ లేదు. తమ నంబర్ ఎప్పుడొస్తుందో తెలీదు. వదిలెయ్యండి, కొత్త వాళ్ళతో చిన్న సినిమాలు తీసుకోండంటే- చిన్నతనం ఫీలవడం. దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ లాంటి దర్శకులు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలే తీశారు- వాళ్ళకి లేని చిన్నతనం ఇప్పటి మేకర్స్ కెందుకు? చిన్నవి తీసి సక్సెస్ చేసుకుంటే పెద్ద హీరోలనుంచి ఫోన్లు అవే వస్తాయి. ఏడాదికి రెండు మూడు చిన్నవి తీసుకుంటూ వుంటే ప్రేక్షకుల్లో, మార్కెట్లో  పేరు నలుగుతూ వుంటుంది కనీసం. పేరు నలగడం, సర్క్యులేషన్ లో వుండడం చాలా ముఖ్యం- పేరున్న హీరోల కోసం ప్రయత్నిస్తూ ఐపు లేకుండా పోవడం కంటే.
       
 సరే, ఇక నెక్స్ట్ స్క్రీన్ ప్లే టిప్స్ విత్ పుచ్చకాయ జ్యూస్ తో మళ్ళీ కలుద్దాం!

—సికిందర్