రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 27, 2018

611 : స్పెషల్ ఆర్టికల్



   ఇది ఇన్పుట్స్ ప్రపంచం.  ఎందుకు ఇన్ పుట్స్ ప్రపంచం? ఇవ్వాళ  ప్రపంచం అందరికీ తెలిసిపోతోంది. ఎలా తెలిసిపోతోంది? అరచేతిలో స్మార్ట్స్ ఫోన్ల ద్వారా కూడా తెలిసిపోతోంది. ఐతే ఏం చేయాలి? సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి. ఏ సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి? హాలీవుడ్ నుంచీ టాలీవుడ్ దాకా, ఇంకేమైనా వుంటే మూసీ పక్కన వుండే డెక్కన్ వుడ్ దాకా అందరూ గ్లోబలీకరణ చెందాలి. చెందకపోతే  ఏమవుతుంది? కాలం కంటే,  ప్రేక్షకులకంటే వెనుక బడితాయి స్క్రిప్టులు. తుపాకీ రాముడికైనా ప్రపంచజ్ఞానముంటుంది. వాడి వ్యాఖ్యానాల కంటే అన్యాయంగా కనపడతాయి స్క్రిప్టులు. అట్టర్ ఫ్లాపయిన భారీ జవాన్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు లాంటి  అవే మూస కథలు అలాగే రాస్తారు. నాల్గు మూస సినిమాలు చూసి ఒక మూస కథ  అల్లే పాత మేస్త్రీలుగా  మిగిలిపోతారు...

        మూస ఎందుకు పనికిరాదు? ప్రపంచం మూసుకుని వున్న రోజుల్లో అవతలి విషయాలు తెలిసేవి కావు ప్రేక్షకులకి. అప్పుడా వచ్చే ఫార్ములా కథలు, మూస పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వాళ్ళ వినోదానికి సరిపోయేవి. ఇప్పుడు ప్రపంచం తెర్చుకున్నాక ఎన్నో కొత్త కొత్త విషయాలు – వాస్తవంగా ప్రపంచం అబ్బురపరుస్తున్న విధమూ  ఎప్పుటికప్పుడు తెలిసిపోతున్నాయి. వీటి ముందు ప్రపంచంలోకి చూడని ఫార్ములా కథలు, మూస  పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వెలవెలబోతున్నాయి. ఇప్పటి సినిమా రచయిత / దర్శకుడు ఇది గ్రహించక, సినిమా అంటే ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,  వెంకటేష్ సినిమాలే, కథలే, పాత్రలే అనుకుంటూ వాటి వైపే చూస్తూ, వాటిలోంచే తీస్తూ, తరం మారిన ప్రేక్షకులకి దూరంగా దయనీయంగా మిగిలిపోతున్నాడు. 

          సొంత వూహలతో, ఆ వూహల్నికూడా పాత సినిమాలతో ధృవీకరించుకుని, ఇవ్వాళ  తోచిందల్లా స్క్రిప్టులు రాసుకునే కాలం కాదు. బయటి ప్రపంచంలోకి చూస్తేనే గానీ  ఇవ్వాళ్టి ప్రపంచంతో సంబంధం ముండే కాలీన స్క్రిప్టులు రాని అగత్యమేర్పడింది. ఒకప్పుడు హాలీవుడ్ లో క్రిమినల్స్ , గ్యాంగ్ స్టర్స్ సినిమాలు రాయాలంటే అలాటి పాత సినిమాలవైపే చూసి రా సేవారు. ఇలా పాత సినిమాలని చూసి కాదని, ఇవ్వాళ్టి ప్రపంచపు రియలిస్టిక్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ పాత్రలతో రాయాలని వొత్తిడి వచ్చినప్పుడు.....ఆ జానర్ సినిమాల్లో కొత్తదనం ప్రారంభమయింది. 

          ఐడియాలు కొత్తగా రావడం లేదని కాదు. వాటికి కొత్త కథనాలే  రావడంలేదు. కొత్త ఐడియాలకే కాదు, ఎలాటి ఐడియాల కైనా కొత్త కథనాలు రావాలంటే ఇప్పుడు ఇన్పుట్స్ చాలా అవసరం. ఇన్పుట్స్ కి మొట్ట మొదట చూడాల్సింది ఇవ్వాళ్టి మార్కెట్ యాస్పెక్ట్ నే తప్ప, అప్పుడే క్రియేటివ్ యాస్పెక్ట్ కాదు. ఫలానా ఈ ఐడియాకి నేటి మార్కెట్ కి తగ్గట్టు ఏఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలో నిర్ణయించినప్పుడే అలాటి ఇన్పుట్స్ తీసుకోవాలి. సినిమా కథంటే మొదట మార్కెట్టే, ఆ తర్వాతే  క్రియేటివిటీ. 

          ఈ ఇన్పుట్స్ తీసుకోవడానికి కమర్షియల్ దృక్పథం వుండాలి. కమర్షియల్ సినిమాలు కాకుండా వాస్తవిక, సమాంతర సినిమాలే రాయాలనుకుంటే కమర్షియల్ ఇన్పుట్స్ తీసుకోకూడదు. ఆ వాస్తవిక దృక్పథంతో అలాటి వార్తల్లోంచో సినిమాల్లోంచో ఇన్పుట్స్  తీసుకోవాలి. ఇవ్వాళ్ళ తెలంగాణాలో  ఔత్సాహిక దర్శకులు విపరీతంగా దూసుకొచ్చేస్తున్నారు.  వీళ్ళు ఒక దగ్గరే ఆగిపోతున్నారు. కానీ అక్కడ ఆగిపోవడానికి తెలంగాణాలో ఇంకా బి.  నరసింగ రావు, గౌతం ఘోష్ సినిమాల కాలం కాదు.  తెలంగాణా ఉద్యమకాలంలోనే ఉద్యమ సినిమా లెవరూ చూడలేదు. తరం మారింది. తెలంగాణాలో కూడా ఈ తరానికి ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్ వుండే ఎంటర్ టైనర్లు కావాలి. 

          కానీ తెలంగాణా వైపు నుంచి వచ్చే ఔత్సాహిక దర్శకులు షార్ట్ ఫిలిమ్సో, వరల్డ్ మూవీసో అంటూ మోజు పెంచుకుంటున్నారు. దీనికి కమర్షియల్ సినిమాల ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేదు. ఈ ఇన్పుట్స్ కమర్షియల్ సినిమాలు తీయడానికి ఏమాత్రం పనికి రావు. టాలీవుడ్ వరల్డ్ మూవీస్ ఉత్పత్తి చెయ్యదు. ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాలే ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణా నుంచి టాప్ డైరెక్టర్లు చాలా మందే వున్నారు. సురేంద్ర రెడ్డి, హరీష్ శంకర్, దశరథ్, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, ఎన్. శంకర్, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, హను రాఘవ 
పూడి వీళ్ళంతా వరల్డ్ మూవీస్ చూసి కమర్షియల్ డైరెక్టర్లు కాలేదు. ఇద్దరు ముగ్గురు షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ కమర్షియల్ సినిమాలకి పనిచేసి వచ్చిన వాళ్ళే. తెలంగాణా నుంచి ఇంకో రాబోతున్న దర్శకుడు  వేణు ఊడుగుల కూడా కమర్షియల్ దర్శకుల దగ్గర పనిచేసిన వాడే.   ఇప్పుడు తెలంగాణా ఔత్సాహిక దర్శకులకి తాము  కూడా ఇలా  టాప్ దర్శకులవ్వాలనే కలలుంటే,  అవి వరల్డ్ మూవీస్ ఇన్పుట్స్ తో నేరవేరవు. అలాగని తెలంగాణా జీవితపు వాస్తవిక కథా చిత్రాలు తీయాలనుకుంటే వరల్డ్ మూవీస్  అధ్యయనం చేసుకోవచ్చు. కానీ అలాటి తెలంగాణా జీవితపు వాస్తవిక కథా  చిత్రాలకి ఇప్పుడు మార్కెట్ ఎక్కడిది? పైన చెప్పుకున్నట్టు ఎకనమిక్స్ లేదా రోమాంటిక్సే. ఈ ఔత్సాహిక దర్శకులు టాప్ తెలంగాణా దర్శకుల్లాగా ఎదగాలనుకుంటే అది మంచి ఆలోచనే. అప్పుడేం చేయాలంటే, ఇదే బ్లాగులోనే  కొన్ని వ్యాసాల్లో రాసినట్టు,  వరల్డ్ మూవీస్ కి ధడాలున తలుపులు మూసి పారేసి,  హాలీవుడ్ మూవీస్ మాత్రమే చూసుకోవాలి. ఆ ఇన్పుట్స్  మాత్రమే తీసుకోవాలి. 

          ఇక్కడ కూడా తప్పులో కాలేసే వీలుంది. మళ్ళీ హాలీవుడ్ సినిమాలనగానే కొందరు పాత మేధావులకి అదే ‘క్లాసాబ్లాంకా’, అదే ‘రోమన్ హాలిడే’, అదే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ లే తప్ప,  ఇక హాలీవుడ్డే  లేదన్నట్టు వుంటారు. నేటి తెలుగు సినిమాలతో సంబంధం లేని వీళ్ళ రికమెండేషన్ల కి, ఉపన్యాసాలకి దూరంగా వుంటూ, గత ఇరవై ఏళ్లుగా వస్తున్న హాలీవుడ్ సినిమాలని ఇన్పుట్స్ గా తీసుకుంటే ప్రయోజన ముంటుంది.

          ఎందుకు హాలీవుడ్ ని తీసుకోవాలంటే, అవి కమర్షియల్ సినిమాల త్రీయాక్ట్  స్ట్రక్చర్ లో వుంటాయి. వరల్డ్ మూవీస్ కి,  ఆ మాటకొస్తే ఒకప్పుడు వచ్చిన భారతీయ కళాత్మక సినిమాలకీ స్ట్రక్చర్ అనేది వుండదు. స్ట్రక్చర్ అంటే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లు. స్ట్రక్చర్  లేకపోవడమంటే మిడిల్ లేకపోవడం. అంతే గాక ప్రధాన పాత్రలు యాక్టివ్ పాత్రలుగా వుండవు, పాసివ్ గా వుంటాయి. ఇంకా చెప్పుకుంటే,  ప్రధాన పాత్ర కథ నడపదు, కథే ప్రధాన పాత్రని నడుపుతుంది. ఇన్ని వరల్డ్ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఈ పాటికి ఈ సాంకేతిక తేడాలు గమనించే వుండాలి. మిడిల్ మిస్సయిన సినిమా కమర్షియల్ గా ఆడదు. వరల్డ్ మూవీస్ కీ, కమర్షియల్ సినిమాలకీ సాంకేతికంగా ఈ తేడా తెలిసిన తెలుగు ఔత్సాహిక దర్శకుడు / రచయిత ఛస్తే వరల్డ్ మూవీస్ చూడడు. ఈ వ్యాసకర్త కూడా వాటి జోలికి పోవడం లేదు.

          తెలంగాణా ఔత్సాహిక దర్శకుల ఇన్పుట్స్ విశేషాలు చెప్పుకున్నాక, అసలు ఇన్పుట్స్  అంటే ఏమిటి? సినిమాలేనా? ఇంకా ఏమైనా వున్నాయా?  ఇది రేపు తెలుసుకుందాం...


సికిందర్