రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, December 17, 2024


 

డియర్  రీడర్స్,
       
కొన్ని అనివార్య కారణాల వల్ల- ముఖ్యంగా కొందరి స్క్రిప్టులు పరిశీలించాల్సి రావడం వల్ల- బ్లాగు ఆర్టికల్స్ కి అంతరాయం తప్పలేదు. స్క్రిప్టుల్లో విషయముంది. అయితే హీరోలు, నిర్మాతలు కోరుకుంటున్నది వేరు. అందుకని నెలల తరబడి తిరిగి చివరికి నో అన్పించుకునేకన్నా, స్క్రిప్టు గొప్పతనాలు కాసేపు పక్కనబెట్టి- హిట్టో ఫ్లాపో వారెలా కోరుకుంటున్నారో అలా తీసేసి ముందుకు సాగడమే మంచిదని చెప్పక తప్పడం లేదు. దర్శకులు పెరిగిపోయి పోటీ ఎక్కువగా వుంది. అలాగే దర్శకులకి కనీసం కొత్తగా వస్తున్న చిన్న హీరోలూ దొరకనంతగా బిజీగా వున్నారు. ఒకసారి ఓకే చెప్పిన హీరో మళ్ళీ నో చెప్పే సరికి మేకర్ల పరిస్థితి మొదటికొస్తోంది. వందమంది ప్రయత్నాలు చేస్తే ఇద్దరో ముగ్గురో అవకాశాలందుకుంటున్నారు. ఇలా రకరకాల సమస్యలున్నాయి. చూస్తే జాలేస్తోంది. చేయడానికేమీ లేదు. ఇక్కడ క్వాంటం థియరీని  పనిచేయించడం సాధ్యమేమో చూడాలి. ఎందుకంటే పదార్థం వెంటపడితే అది పరిమితం. అందరికీ పంచిపెట్టడం కుదరదు. శక్తి అనంతం. శక్తి తన అభివ్యక్తికి క్రియేటర్స్ ని కోరుకుంటుంది. అందుకని పదార్ధాన్ని అడుక్కునే బెగ్గర్స్ కాకుండా, తామే క్రియేటర్స్ గా శక్తిని ఆశ్రయిస్తే పని సులువవుతుందేమో. శక్తి దానికదే అవకాశాల్ని తెచ్చి ముందు పెడుతుంది. కానీ సింపుల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే అర్ధంగాని వాళ్ళకి ఈ క్వాంటం థియరీ ఏమర్ధమవుతుంది. అందుకని ఇలా పాట్లు పడక తప్పదు. అన్నట్టు ఒక సినిమా తీసిన దర్శకుడికి ఈ థియరీ చెప్తే ఆయన జీవితమే ఆశావహంగా మారిపోయింది!


        పోతే
, ఈ రోజునుంచి రోజుకొక బ్లాగ్ పోస్టు వుండేలా ప్రయత్నిద్దాం. దేశ విదేశాల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముందుగా ఈ రోజు అర్ధరాత్రి పుష్ప-2 స్క్రీన్ ప్లే సంగతులు. తర్వాత రేపటి నుంచి గత వారం విడుదలైన బోగన్ విల్లా’, ఫియర్ సంగతులు. తమిళంలో అజిత్ నటిస్తున్న విడామయుర్చీ హాలీవుడ్ థ్రిల్లర్ బ్రేక్ డౌన్ కి కాపీ అని వార్తలొస్తున్నాయి- ఆ బ్రేక్ డౌన్ సంగతులు, అలాగే వేర్ ది క్రాడాడ్స్ సింగ్ అనే మరో హాలీవుడ్ మూవీ సంగతులు, ఇటీవలి సినిమాల్లో భావోద్వేగాలు కరువై ఫ్లాపవుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకుని గుప్పెడు ఎమోషన్లు కావలెను అనే ఆర్టికల్ వరుసగా పోస్ట్ చేద్దాం. 
అలాగే ఒక దర్శకుడు అసంపూర్తిగా వదిలేసిన మహారాజా స్క్రీన్ ప్లే సంగతులు పూర్తి చేయమని పదేపదే కోరుతున్నారు. అది కూడా పూర్తి చేద్దాం. సెలవు.


-సికిందర్

Thursday, November 28, 2024

1359 : స్క్రీన్ ప్లే సంగతులు

        స్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్ని మాస్ సినిమాల్లాగా మాస్ సినిమా టైటిలే పెట్టి, టెంప్లెట్ లో మెకానికల్ గా తీసేస్తే ముందుగా బలయ్యేది అందులో సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ కథే. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ప్రేక్షకులు సంఘర్షణ, ఉద్రిక్తత, ఉత్కంఠ, ఊహించని మలుపులు, పాత్రకి అధిక రిస్కుతో కూడిన వేగంగా పరుగెత్తే కథనాల కోసం చూస్తారు. ఈ జానర్ బేసిక్స్ కి తోడయ్యే మేకింగ్ టెక్నిక్స్ కోసం, ఇవిచ్చే  ప్రత్యేకానుభవం కోసం కూడా చూస్తారు.  కెమెరా మూవ్ మెంట్స్, సౌండ్ ట్రాక్, ఎడిటింగ్, సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ వగైరాలన్నీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదల ప్రకారం ప్రత్యేకంగా వుంటూ సస్పెన్స్ నాణ్యతని ప్రభావితం చేస్తాయి. వీటన్నిటినీ మూస ఫార్ములా మాస్ జానర్ సినిమా వాషింగ్ మెషీన్ లో వేసి తీశారంటే, ఇక వీటి రూపు రేఖలు మటాష్ అయిపోయి మరేంటోగా తయారవుతాయి సస్పెన్స్ థ్రిల్లరనే సినిమాలు!
        
    విశ్వక్ సేన్ పాపులర్ మాస్ హీరో. మెకానిక్ రాకీ కి ముందు నటించిన 11 సినిమాల్లో ఒకే సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ - ది ఫస్ట్ కేస్ వుంది. మిగిలినవన్నీ మాస్ సినిమాలే. ఇప్పుడు రెండో సస్పెన్స్ థ్రిల్లర్ గా మెకానిక్ రాకీ పోస్ట్ మార్టం కి మన టేబుల్ పైకొచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి విడుదలైన వెంటనే స్క్రీన్ ప్లే సంగతులు రాసేస్తే సస్పెన్స్ అంతా పోతుంది. ఎక్కడికక్కడ సస్పెన్స్ విప్పకుండా భావి రచయితల పరిశీలనార్ధం స్క్రీన్ ప్లే సంగతులు రాయలేం. ఈ కారణంగానే  కాస్త హిట్టయి ఆడుతున్న అనే సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు. ఇలాగాకుండా మెకానిక్ రాకీ విడుదలైన వెంటనే పరాజయ పాలవడంతో స్క్రీన్ ప్లే సంగతులకి అడ్డంకులు తొలగిపోయీ- ఎందుకు విశ్వక్ సేన్ సినిమా పరాజయం పాలైందో తెలుసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది. హిట్ -ది ఫస్ట్ కేస్ లో మాస్ ఎలిమెంట్ల జోలికి పోకుండా సస్పెన్స్ థ్రిల్లర్ (పోలీస్ ప్రొసీజురల్) జానర్ మర్యాదల్ని చాలా వరకూ పాటించినా, అందులో ఫోరెన్సిక్ లాబ్ గురించి ప్రేక్షకులకి బోలెడు చెప్పేయ్యాలన్నట్టు చీటికీ మాటికీ ఓవరాక్షన్ వుంది. మళ్ళీ కథ వచ్చేసి ఎండ్ సస్పెన్స్ కథే. ఇదలా వుంచితే, ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ పేరుతో వచ్చిన ఈ రెండో సినిమా మాస్ మూసలో పడి విజయావకాశాల్ని మరీ ప్రశ్నార్ధకం చేసుకుంది. విశ్వక్ సేన్ ఇక తాను జడ్జి చేయలేని సస్పెన్స్ థ్రిల్లర్స్ జోలికెళ్ళకుండా, మాస్ సినిమాలు చేసుకోవడం మేలేమో అన్పించేలా తయారైంది.

1. ఫస్టాఫ్ స్ట్రక్చరేనా ఇది?

    ఇదో చిత్ర విచిత్ర స్క్రీన్ ప్లే. సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ కథ నిడివి చాలక అన్నట్టు ఫస్టాఫ్ లో మాస్ కథని అల్లి సెకండాఫ్ కి జోడించినట్టుంది. సినిమా రెండున్నర గంటల నిడివి. ఇందులో ఫస్టాఫ్ లో సర్దుబాటు చేసిన మాస్ కథలోంచి- అక్కడక్కడా ఎదురయ్యే  సెకండాఫ్ సస్పెన్స్ కథకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ని తీసుకుని -సెకండాఫ్ కి కలిపితే రెండుగంటల లోపు కల్తీ లేని సస్పెన్స్ థ్రిల్లర్ తయారైపోయే పరిస్థితి.
       
ఈ మొత్తం కథకి బిగినింగ్ విభాగం ముగిసి
, ప్లాట్ పాయింట్ 1 ఎప్పుడో ఇంటర్వెల్లో గంటా 20 నిమిషాలకి గానీ తీరిగ్గా రాదు. షార్ట్స్ ని/ రీల్స్ ని స్క్రోలింగ్ చేసే నేటి మైక్రో కంటెంట్ ప్రపంచంలో ఇంత తీరిక ఎవరికుంది? మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రీన్ ప్లే రాశారా? కథ కోసం ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టాలా? ప్లాట్ పాయింట్ 1 ఇంటర్వెల్ వరకూ రాక పోవడంతో ఫస్టాఫ్ అంతా విషయం లేనట్టుగా తయారైంది. ఇలా ఫస్టాఫ్ లో చూపించిందంతా కథే అవుతుందా, లేక ప్లాట్ పాయింట్ 1 దగ్గర (ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర) ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతమవుతుందా అన్నది ఆలోచించాలి. ఇలా కథ చెప్పడానికి ఫస్టాఫ్ అంతా ఉపోద్ఘాతమే (బిగినింగ్) సాగదీస్తే ఎంత బడ్జెట్ దుబారా అవుతుంది? స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్ట్రక్చర్ కి లోబడి లేకపోవడంతో అసలుకే ఎసరొచ్చింది. కథని ఎంత క్రియేటివ్ గా ఆలోచించినా అది స్ట్రక్చర్లో లేకపోతే 300 కోట్ల రూపాయల కంగువా కూడా బాక్సాఫీసులో కంగు తినాల్సిందే!

 2. టెంప్లెట్ తో థ్రిల్?

    ఈ గంటా 20 నిమిషాలూ రాకీ (విశ్వక్ సేన్) కార్ల మెకానిక్ గా- డ్రైవింగ్ స్కూలు ట్రైనర్ గా  ఇద్దరు హీరోయిన్లతో కొలిక్కిరాని మాస్ ఉపోద్ఘాతమే సాగుతుంది. ఇలా మాస్ అప్పీల్ కోసం కార్ల మెకానిక్ గా చూపించినప్పుడు, ఆ సీన్లు అవే వందలసార్లు చూసేసిన పాత సినిమాల్లో సీన్లలాగే వుండనవసరం లేదు. ఈ పోటీ ప్రపంచంలో అమ్మకపు సరుకులన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెకానిక్ క్యారక్టర్ని ఎందుకు అప్డేట్ చేసి వెండి తెరకి ఇంకా బాగా అమ్మకూడదు? మెకానిక్కుల్ని ఇన్స్పైర్ చేసేలా ఈ రంగంలో కూడా మిలియనీర్లుగా ఎదగ వచ్చని -హై-ఎండ్ లగ్జరీ కార్ల రిపేర్లు, కస్టమ్ మోడిఫికేషన్‌లు, క్లాసిక్ కార్ల రీస్టోరేషన్ లేదా స్పెషలైజ్డ్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్‌ మొదలైన వాటిపై దృష్టి పెట్టి కోట్లు గడిస్తున్న మెకానిక్కుల ఉదాహరణలు కోకొల్లలు. ఇలాటి ఒక మిలియనీర్ మెకానిక్ గా, స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్కుల్ని మోటివేట్ చేసేదిగా, విశ్వక్ సేన్ మాస్ పాత్రని ఎందుకు రీబూట్ చేసి రిచ్ గా చూపించకూడదు? ఇలా చేస్తే విజువల్ ప్రెజెంటేషన్స్ పూర్తిగా మార్పు చెంది మాస్ సినిమా కంటికి కొత్తగా అన్పించ వచ్చేమో?
       
ఇక్కడొక ప్రశ్న వస్తుంది. కథ ప్రకారం అతను ఆర్ధికంగా స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్ అయివుండాలి. అప్పుడే ఆ గ్యారేజీ వున్న ల్యాండ్ ని కబ్జా చేస్తున్న శక్తులతో పోరాడలేక డబ్బు చెల్లించేందుకు సిద్ధపడగలడు. అప్పుడు దీన్ని మిలియనీర్ మెకానిక్ సెటప్ కి మార్చేస్తే
, మార్కెట్ లో టాప్ పొజిషన్లో వున్న ఈ గ్యారేజీని టేకోవర్ చేయాలని చూస్తున్న ఇంకో కంపెనీ కుట్రగా వుండొచ్చు. ఐటీ, ఈడీ దాడుల ద్వారా అతడ్ని బెదిరించి టేకోవర్ చేసుకునే కుట్ర. దీంతో ల్యాండ్ కబ్జా అనే పాత వాసన, టెంప్లెట్ కథనం వదిలిపోతుంది. పాత వాసనతో, టెంప్లెట్ తో కథనంలో థ్రిల్లేమీ వుండదు!

3. మాస్ ఉపోద్ఘాతం ఇలా!

        ఈ గ్యారేజీలో రాకీ తో బాటు అతడి ఫ్రెండ్ హర్ష (వైవా హర్ష) మెకానిక్ గా వుంటాడు. ఈ గ్యారేజీని పూర్వమెప్పుడో రాకీ తాత ప్రారంభించాడు. ఈ తాత రెడ్డప్ప (విశ్వక్ సేనే!) రాయలసీమ ఫ్యాక్షనిస్టు అనే మరో పాత వాసన. దీంతో మళ్ళీ అవే పాత ఫ్యాక్షన్ సినిమా సీన్లు. ఈ తాత కొడుకైన రామకృష్ణ (నరేష్) కి గ్యారేజీ అప్పగించి పరమపదించాడు. ఈ రామకృష్ణ కాలేజీ నుంచి సస్పెండ్ అయిన కొడుకు రాకీని దద్దమ్మగా పరిగణించి గ్యారేజీ పనిలో పెట్టాడు. ఈ రాకీ కాలేజీలో ప్రియా (మీనాక్షీ చౌదరి) ని ప్రేమిస్తే, కాలేజీ నుంచి సస్పెండ్ అయిన రాకీని ప్రియ దూరం పెట్టింది. ఈ ప్రియ తండ్రి గుండె జబ్బుతో చనిపోతే, ఇంటి బాధ్యత తీసుకోవడానికి ఈమె అన్న శేఖర్ (విశ్వదేవ్ రాచకొండ) నిరాకరించాడు. ఈ శేఖర్  క్రికెట్ కలలతో వుంటూ, ఒక రోజు నగలు అమ్ముకున్నాడని ప్రియ మందలిస్తే, ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంత ట్రాజడీతో వున్న ప్రియా ఓ బిల్డర్ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ తల్లిని
, చెల్లెల్నీ  పోషించుకుంటూ, డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆ గ్యారేజీ రాకీదని తెలియక వస్తే, రాకీకి మళ్ళీ ఈమెతో లైను కలిసింది. అయితే రాకీ దీనికి ముందే మాయా (శ్రద్ధా శ్రీనాథ్) అనే ఇన్సూరెన్స్ ఏజెంటుకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు.
       
ఇలావుంటే మరోవైపు
, రంకిరెడ్డి (సునీల్) అనే గ్యాంగ్ స్టర్, రాకీ గ్యారేజీ వున్న స్థలం మీద కన్నేసి వేధిస్తున్నాడు. రాకీ తండ్రి రామకృష్ణకి తీర్ధయాత్రలకి వెళ్ళాలని కోరిక వుంది. ఈ  కోరిక తీర్చేస్తూ తీర్ధయాత్ర ప్లాన్ చేశాడు రాకీ. అయితే రామకృష్ణ ఇక్కడే చనిపోయాడు. ఈ విషయం మాయాకి చెప్పాడు  రాకీ. రంకి రెడ్డికి కట్టాల్సిన 50 లక్షల గురించి కూడా చెప్పా డు. మాయా ఇన్సూరెన్స్ పాలసీలు చెక్ చేసి, రాకీ తండ్రికి రెండు కోట్ల మేరకు పాలసీ వున్న సంగతి చెప్పింది. రాకీకి ఆశ్చర్యమేసింది. అయితే నామినీగా తన పేరుగాక రాజేష్ అనే వేరే  పేరుందని ఆమె చెప్పేసరికి షాకయ్యాడు...

    ఇదీ ఇంటర్వెల్ కి 10 నిమిషాల ముందు వరకూ సాగే ఉప్పోద్ఘాతం టూకీగా. ప్రారంభంలో రెండు సీన్లు తీసుకునే 10 నిమిషాలు తీసేస్తే ఉపోద్ఘాతం నిడివి గంట. ఇంటర్వెల్ కి ముందు పాలసీ ప్రస్తావనకి ముందు వరకూ వచ్చే ఈ ఉపోద్ఘాతమంతా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లోనే వుంటుంది. ఇదంతా ముగిసి పాలసీలో నామినీ గా వేరే పేరు  గురించి వచ్చేసరికీ మొత్తం కలిపి గంటా 20 నిమిషాలూ ఫస్టాఫ్ సాగుతుంది. అంటే గంటా 20 నిమిషాలకి ప్లాట్ పాయింట్ 1 వచ్చి అప్పుడు ఇంటర్వెల్లో కథ ప్రారంభమవుతుందన్న మాట- ఆలస్యం అమృతం విషం లాగ!

4. రెండు మంచి క్రియేషన్లు
    అనేక ఫ్లాష్ బ్యాకులుగా ఈ ఉపోద్ఘాతం ఎలా ఎందుకు ఎవరికోసం మొదలైంది? ఎలా ఎందుకనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో వుంచి, ఎవరికోసం ఉపోద్ఘాతాన్ని ఎవరు చెప్తున్నదీ చూస్తే- డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మాయాకి రాకీ చెప్తున్నాడు. ఈ ఉపోద్ఘాతం తన పుట్టుక నుంచీ ఇప్పటి వరకూ తన జీవితం గురించే. ఈ ఉపోద్ఘాతానికి (ఉపోద్ఘాతమంటే బ్యాక్ స్టోరీయే) ముందు ఓ రెండు సీన్లు వుంటాయి. ఒకటి- ఒక వర్షపు రాత్రి ఒకింట్లో ఉరేసుకుని ఎవరో ఆత్మహత్య చేసుకునే సీను. ఈ ఓపెనింగ్ సీను లేదా సంఘటన సెకండాఫ్ లో మొదలయ్యే కథకి కేంద్ర బిందువు లాంటిదని తర్వాత తెలుస్తుంది. దీని పర్యవసానంగానే రాకీకి ఓ గోల్ ఏర్పాటయ్యిందని కూడా సెకండాఫ్ లోనే తెలుస్తుంది. కాబట్టి ఈ ఓపెనింగ్ సీను సస్పెన్సుతో కూడిన ఒక మంచి హుక్ గా చెప్పుకోవచ్చు.
       
ఇక దీని తర్వాత వచ్చే రెండో సీను డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయా రాకీ గ్యారేజీకి వచ్చే సీను. ఈ సీను కూడా ఓ మంచి క్రియేషనే. ఎందుకంటే ఈ సీనులో నాలుగు విషయాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి- 1. మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం వెనుక ఆమె పన్నిన ఒక కుట్ర వుంది. ఇది సెకండాఫ్ లో రివీలవుతుంది
, 2. అప్పుడే గ్యారేజీకి ఒకతను వచ్చి గ్యారేజీ మూసేస్తారటగా అంటాడు. శుభమా అని గ్యారేజీ సీనుతో ప్రారంభిస్తూ అప్పుడే గ్యారేజీ మూసేసే మాటేమిటి? ఆలోచింపజేసే సీను. ఈ మాట అప్పటికే రంకిరెడ్డితో నలుగుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకుని అన్నది. ఇది కూడా తర్వాత రివీలవుతుంది. అయితే ఈ మాట అనడంతో ఈ గ్యారేజీకి ఏదో ప్రాబ్లం వుందని ప్రేక్షకులకి ఆసక్తి పుడుతుంది, 

3. మాయా తను ఇన్సూరెన్స్ ఏజెంటునని చెప్తుంది. అంటే ఈ రెండో సీనులోనే ఆమె పరిచయం కూడా జరిగిపోయింది. ఇన్సూరెన్స్ ఏజెంటే ఎందుకు? ఎందుకంటే రాకీని ఇన్సూరెన్స్ ఏజెంటుగానే ట్రాప్ చేయబోతోంది, 4. మాయా ఇన్సూరెన్స్ ఏజెంటునని చెప్పడంతో రాకీ ఇంట్రెస్టు చూపక, మనకి బ్యాంకుతో పని అంటాడు. ఇక్కడ మెలిక ఏమిటంటే ఆమె ఇన్సూరెన్స్ ఏజెంట్ అని రాకీకి ముందే తెలుసు. తెలియనట్టు నటించాడు. మనకి బ్యాంకుతో పని అని అనడంలో కూడా అమెకోసం అతను పన్నుతున్న ట్రాప్ వుంది. ఇది కూడా సెకండాఫ్ కథలో వరకూ మనకి తెలీదు.
       
అసలు మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం ఆమె పన్నిన కుట్రలో భాగంగానే జరిగినప్పటికీ
, అసలామెని ఇక్కడికి తన స్కెచ్ ప్రకారమే వచ్చేటట్టు చేశాడు రాకీ. అంటే రాకీని ట్రాప్ చేసే పనిపెట్టుకుని వచ్చిన మాయాకి, రాకీ వేసిన స్కెచ్ ప్రకారమే వచ్చి తనే ఇరుక్కుందని తెలీదన్న మాట1
       
మరొకటేమిటంటే
, మొదటి సీనులో చూపించిన ఆత్మహత్యకి కారకురాలు ఈ మాయే. ఇది కూడా సెకెండాఫ్ లో బయటపడుతుంది. అంటే మాయా ఆల్రెడీ ఒక బకరాని బలితీసుకుని, రెండో బకరాగా బలి చేద్దామని రాకీ దగ్గరికి వచ్చిందన్న మాట. ఒక దాని తర్వాత ఒకటి ఆమెకి కనెక్ట్ అవుతున్న ఈ రెండు సీన్లూ కథనానికి మంచి డైనమిక్స్ ని క్రియేట్ చేశాయి. ఇలా సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పనికొచ్చే ఈ ఇద్దరి గేములూ నిగూఢంగా ఇలా ఈ రెండు సీన్లలో ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. ఇందుకే ఇది మంచి క్రియేషన్ అన్నాం.

5. నిల్వ మాస్ మసాలా!

    ఇప్పుడు పై మొదటి రెండు ఇంటలిజెంట్ సీన్ల తర్వాత ఇక మొదలయ్యేదే ఉపోద్ఘాతమనే ప్రేక్షకుల పాలిట శరాఘాతం. ఫ్రిజ్ లోంచి తీసి వేడి చేసిన నిల్వ మాస్ మసాలా. దీని ప్రారంభమే తేడా కొడుతుంది. ఎలాగంటే, డ్రైవింగ్ నేర్చుకోవడానికొచ్చిన  ఆమెకి కారులో తన కథ చెప్పుకుంటూ కూర్చుంటే డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటుంది? డ్రైవింగ్ ఇలాగే నేర్పిస్తారా? ఈ అసహజ సెటప్ తేడా కొట్టింది. ఇలా తన కథ చెప్పుకోవడానికి లీడ్ ఏమిటి? బ్యాంకు పని గురించి అతను ఆందోళనగా వుంటే ఆమె అడిగితే తన కథంతా చెప్పుకొస్తాడు. ఇదీ కల్పించిన లీడ్. కారు పోతూనే వుంటుంది. ఆమె నడుపుతూనే వుంటుంది. అతను ఫ్లాష్ బ్యాకుల మీద బ్యాకులు చెప్తూనే వుంటాడు. ఇలా కారులోనే గంట స్క్రీన్ టైము గడిచాక ఫ్లాష్ బ్యాకులు చెప్పడం పూర్తయి ప్రెజెంట్ టైమ్ లోకొస్తారు.
        
మాది రాయలసీమ, మా తాత కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు... అంటూ చెప్పుకొస్తాడు. ఆ తాత కామెడీగా ఫ్యాక్షన్ దాడిలో గాయపడి హైదరాబాద్ వచ్చేయడం, ఇక్కడ గ్యారేజీ తెరిచి బ్రతికెయ్యడం, చనిపోతూ కొడుకు రామకృష్ణకి గ్యారేజీ అప్పగించడం పూర్తయ్యాక, రామకృష్ణకి రాకీ పుట్టడం దగ్గర్నుంచీ చిన్నప్పటి విశేషాలూ మొదలుకొని కాలేజీ చదువు వరకూ చెప్పుకుంటూ వస్తాడు. ఈ కాలేజీలోనే ప్రియాతో ప్రేమ, ఆమె అన్నతో బాండింగ్ వుంటాయి. ఈ అన్న శేఖర్ తో రాకీ స్నేహం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.

    ఇక్కడ ప్రశ్నేమిటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవరికి చెప్తున్నాడు? తాను స్కెచ్ వేసి ట్రాప్ చేయబోతున్న మాయా అనే ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కి చెప్తున్నాడు. అలాంటప్పుడు ఆమెకి తన తాత ముత్తాతల దగ్గర్నుంచీ చెప్పుకురావాల్సిన అవసరమేమిటి? ఆమె బ్యాంకు పని గురించి దేనికి వర్రీ అవుతున్నావో చెప్పమంది, అప్పుడు రంకిరెడ్డి అనేవాడు గ్యారేజీని కబ్జా చేస్తానని బెదిరిస్తూంటే ఆ డబ్బుకోసం బ్యాంకు లోను ప్రయత్నిస్తున్నానని చెప్తే సరిపోతుందిగా? ఆ రంకిరెడ్డితో ప్రాబ్లంకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ మాత్రమే చెప్పాలిగా? ఇది ఆమెకి కనెక్ట్ అవుతుందిగా? ఆమె చేయబోయే ఫ్రాడ్ ని పసిగట్టే బ్యాంకు పని గురించి మాట్లాడుతున్నాడుగా? సెకండాఫ్ కథలోకెళ్తే అక్కడ ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఆమె రంకిరెడ్డితో అతడి ప్రాబ్లం సహా బ్యాంకు లోను కోసం అతను ప్రయత్నించడం సీక్రెట్ గా ఆమె కనిపెడుతూనే వుందిగా?
       
అంటే ఇక్కడ రాకీ ఆమెకి ఏ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలో అది చెప్పకుండా తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడంటే
, ఇవి  అతను చెప్తున్న ఫ్లాష్ బ్యాక్స్ కావు. తన స్కెచ్ లో భాగంగా ఆమెకి చెప్పేది వుంటే రంకిరెడ్డి ఎపిసోడ్ మాత్రమే చెప్పేవాడు రాకీ. కానీ తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడు. అంటే కథకుడు జోక్యం చేసుకుని, రాకీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం ప్రేక్షకుల కవసరమని ఇలా రాకీ చేత ప్రేక్షకులకి చెప్పిస్తున్నాడు, మాయాకి కాదు. పాత్రల మధ్య కథకుడు జోక్యం చేసుకుంటే ఇంతే- కథ చెడిపోవడమే! ఇందుకే గంట పాటు ఆమెకి అవసరం లేని ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించాడు రాకీ చేత. ఇదెంత రాంగ్ కథనం! దీని వల్ల ఎంత బడ్జెట్ వృధా అయింది?

6. ఇంకా పెద్ద డ్యామేజీ!

    కథకుడు మాయాకి కాక ప్ర్క్షకులకి రాకీ ఫ్లాష్  బ్యాక్స్ చెప్పడంతో ఒక పెద్ద డ్యామేజీ కూడా జరిగిపోయింది కథకి. కాలేజీలో రాకీ సస్పెండ్ అవడంతో ప్రియా బ్రేకప్ చెప్పేసినట్టు పైన తెలుసుకున్నాం. రాకీ తండ్రి రామకృష్ణ తిట్టి, చదువు మాన్పించేసి,  గ్యారేజీ పనిలో పెట్టాడు. అలా మెకానిక్ గా మారిన రాకీ మెకానిక్స్ తో మాస్ గ్రూప్ సాంగ్ వేసుకున్నాడు. సాంగ్ తర్వాత రంకిరెడ్డి నుంచి ప్రాబ్లం మొదలయింది. తర్వాత గ్యారేజీకి అదనంగా డ్రైవింగ్ స్కూల్ ప్రారంచించాడు. రంకిరెడ్డి గ్యాంగ్ మళ్ళీ వచ్చి పడడంతో ఓ ఫైట్ సీను వేసుకున్నాడు. ఇక రాకీ నేరుగా రంకిరెడ్డి దగ్గరికెళ్ళి పోయి మళ్ళీ గ్యారేజీ జోలికొస్తే బావుండదని వార్నింగ్ ఇచ్చాడు.

ఇంతవరకూ రాకీ ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాక- ప్రియా ఏమైందని మాయా అడుగుతుంది. ఇక్కడే రాకీచేత మహా తప్పులో కాలేయిస్తాడు కథకుడు! ఈ ఫ్లాష్ బ్యాక్స్ ప్రేక్షకులకి చెప్పాలన్న అత్యుత్సాహంతో మళ్ళీ పాత్రల మధ్య జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నాడు కథకుడు! ప్రియా గురించి కూడా ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించేశాడు కథకుడు!!
       
ప్రియా జీవితం
, కుటుంబం, బిల్డర్ దగ్గర ఆమె జాబ్ చేయడం జరిగి డ్రైవింగ్ నేర్చుకోవడానికి తన గ్యారేజీకే రావడంతో తిరిగి కనెక్ట్ అయినట్టు, ప్రేమ కుదిరినట్టు, ఓ డ్యూయెట్ కూడా వేసుకున్నట్టూ చెప్పించేశాడు!
       
ఈ ఉపోద్ఘాతంలో ప్రియా గురించి రాకీ మాయాకి ఇలా చెప్పేస్తూంటే కథ వుండాలా
, కర్సై పోవాలా? ప్రియా తండ్రి మరణించాక, ఆమె అన్న శేఖర్ తో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేసి అతడి ఆత్మహత్యకి కారకురాలైన మాయకే ఇది చెప్పేస్తాడా?
       
కథకుడి అత్యుత్సాహం ఇక్కడితో ఆగలేదు- ఒక రోజు ప్రియా అన్న గురించి అడగాలని ఆమె ఇంటికెళ్ళాడు రాకీ. ఆమె లేదు. ఆమె చెల్లెల్ని అడిగితే ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళింది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించాడు. అన్న శేఖర్ కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో
, ప్రియా చిన్న ఉద్యోగంలో జాయినైంది. పని చేయకుండా తిరుగుతున్న శేఖర్ ఆమె డబ్బులు దొంగిలించాడు. తర్వాత నగలు దొంగిలించాడు. ఆమె నిలదీసి కొట్టేందుకు చెయ్యెత్తితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఈ సినిమాకి హుక్ గా వాడుకున్న ఓపెనింగ్ సీను.
       
ఇలా శేఖర్ చావుకి కారకురాలై
, ఇంకో ఎజెండాతో రాకీని ట్రాప్ చేయడానికి వచ్చిన తన ప్రత్యర్ధి- కిల్లర్ మాయకే శేఖర్ ఆత్మహత్యగురించి చెప్పేశాడు రాకీ! ప్రేక్షకులకి కథ తెలియాలని మధ్యలో జోక్యం చేసుకుని కథని పూర్తిగా డ్యామేజీ చేసేసిన కథకుడి అత్యుత్సాహం ఈ నిర్వాకంతో గానీ తీరలేదు!

ఇలా ఇక్కడే పై ఫ్లాష్ బ్యాకులో ప్రియా చెల్లెలి ద్వారా తన మిత్రుడు శేఖర్ మరణం గురించి తెలుసుకున్న రాకీకి గోల్ ఏర్పడింది. దోషిగా మయాని పట్టుకునే గోల్. ఇది రహస్యంగా వుంచి సెకండాఫ్ లో రివీల్ చేశాడు.
       
ఫ్లాష్ బ్యాక్ కొనసాగిస్తూ
, తండ్రిని తీర్ధయాత్రలకి పంపినట్టు కూడా చెప్పిన రాకీ, ఫ్లాష్ బ్యాక్స్ ముగించి - ఆ తండ్రి చనిపోయాడని చెప్తాడు. ఇలా ఉపోద్ఘాతం పూర్తవుతుంది.
       
ఇప్పుడు ప్రెజెంట్ లో కొస్తే
, ఇది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. ఇప్పుడు రాకీ తండ్రి చనిపోయాడని తెలుసుకున్న మాయా ఎలర్ట్ అవుతుంది. ఆమెకి కావాల్సిందిదే. అతడితో ఇన్సూరెన్స్ గేమ్ ఆడుకోవడానికి. ఇలా ఆమెని తన ట్రాప్ లో బిగించాడు రాకీ.
       
ఇప్పుడు గ్యారేజీ గొడవలు పెరిగిపోయి రంకిరెడ్డికి 50 లక్షలిస్తానని రాకీ చెప్పడంతో
, ఆ 50 లక్షలు ఎక్కడ్నించి తెస్తాడో తెలియని రాకీకి- తండ్రి చేసిన రెండు కోట్ల పాలసీ గురించి చెప్తుంది మాయ. కానీ నామినీగా రాకీ పేరు గాక ఎవరో రాజేష్ అని వుందని చెప్తుంది మాయా. దీంతో గంటా 20 నిమిషాల ఫస్టాఫ్ ముగిసి ఇంటర్వెల్ పడుతుంది.

7. ఫస్టాఫ్ తో ప్రాక్టికల్స్?

    ఇంత గజిబిజిగా బారెడు సాగుతూ వున్న పైన వివరించిన ఫస్టాఫ్ ని, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, చప్పున గంటలో ముగిసే స్క్రీన్ ప్లే చేస్తే ఎలా వుంటుందన్న ప్రాక్టికల్స్ కి ఇప్పుడొద్దాం. ఈ ప్రాక్టికల్స్ స్వయంగా ఎవరైనా చేసుకుని, కథనాన్ని ఇంకెలాగైనా మార్చుకుని, ఆల్టర్నేట్ వెర్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు- స్ట్రక్చర్ కి లోబడి.
       
ముందుగా బిగినింగ్ లో
, ఓపెనింగ్ ఆత్మహత్య సీను అలాగే వుంటుంది. తర్వాత గ్యారేజీలో మాయా ఎంట్రీ సీను, కంటెంట్ అలాగే వుంటాయి. తర్వాత మారుతుంది- మాయాకి డ్రైవింగ్ నేర్పుతూ, బ్యాంకు పని గురించి ఆమె అడిగితే, రంకిరెడ్డితో గొడవ గురించి మాత్రమే చెప్తాడు. ఆ పూట ఆమెకి నేర్పడం ముగిస్తాడు. డైనమిక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రియా పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో వుంటాడు. డ్రైవింగ్ నేర్పుతూ వుంటాడు. ఇక గ్యారేజీలో తండ్రి రామకృష్ణ పరిచయమవుతాడు. రాకీ ఎలా మెకానిక్ అయ్యాడో క్లుప్తంగా సంభాషణ. రంకిరెడ్డితో గొడవ గురించి సీన్లు. రాకీ డ్రైవింగ్ నేర్పుతూ మాయాతో కూడా రోమాన్స్ ప్రారంభిస్తాడు. దీంతో ప్రియాతో గొడవ. ఈ గొడవ, రంకిరెడ్డితో గొడవ ముదిరి పోతాయి- ఇంతలో రాకీ తండ్రి చనిపోతాడు. ఇప్పుడు గ్యారేజీని కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితిలో రంకిరెడ్డికి 50 లక్షలు కట్టాల్సి వచ్చేసరికి- ప్రేమలో పై చేయి కోసం - రాకీ కి హెల్ప్ చేస్తూ అతడి తండ్రి తీసుకున్న రెండు కోట్ల పాలసీ విషయం బయట పెడుతుంది మాయా. అయితే నామినీగా అతడి పేరు లేదంటుంది. దీంతో ఓ 30 నిమిషాల్లో బిగినింగ్ విభాగం (యాక్ట్ 1) ముగుస్తూ ప్లాట్ పాయింట్ 1 వస్తుందన్న మాట.
       
పైన బిగినింగ్ విభాగం బిజినెస్ నియమాల ప్రకారం చూస్తే -1. కథా నేపథ్యం ఏర్పాటు - ఇది సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యపు కథ అని తెలుస్తూనే వుంది
, 2. పాత్రల పరిచయం- ముఖ్య పాత్రలు రాకీ, అతడి తండ్రి, ప్రియా, మాయా, రంకిరెడ్డి పాత్రలు పరిచయమయ్యాయి, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన- గ్యారేజీ స్థలం కోసం రంకిరెడ్డితో గొడవలు, రాకీ తండ్రి మరణం, 4. సమస్య ఏర్పాటు - గొడవలు పరాకాష్టకి కి చేరి 50 లక్షలు కట్టాల్సి వస్తే, రెండు కోట్ల పాలసీ బయటపెట్టి మాయా హెల్ప్ చేయడం. కానీ అందులో నామినీ రాకీ కాకపోవడం.

       
ప్లాట్ పాయింట్ 1 దగ్గర పై సమస్యా ఏర్పాటులో ఆటోమేటిగ్గా రాకీకి గోల్ ఏర్పాటయ్యింది. ఎలాగైనా ఈ రెండు కోట్ల పాలసీ మొత్తాన్ని సాధించి
, రంకిరెడ్డి పీడా విరగడ చేసుకునే గోల్. ఇలా ఇక్కడే ఫస్టాఫ్ అరగంటలో బిగినింగ్ విభాగం ముగిసిపోయి, ప్రేక్షకులు ఎదురు చూసే కథ ప్రారంభమై పోయిందన్న మాట.

8. మిడిల్ -1 సంగతి?

    ఇప్పుడు కథతో ఫస్టాఫ్ మిడిల్- 1 (యాక్ట్ 2 /ఏ) లోకి ఎంటరైతే, పాలసీ డబ్బుల కోసం రాకీ సంఘర్షణ. దీనికి కావాల్సిన కథ ఈ సినిమా సెకెండాఫ్ ప్రారంభం నుంచే వుంది. దాన్ని యథాతథంగా ఇక్కడ వాడుకోవచ్చు : ఇప్పుడు పాలసీలో నామినీగా రాజేష్ పేరుని రాకేష్ గా మార్చే ఉపాయం చెప్తుంది ఇన్సూరెన్స్ ఏజెంట్ మాయా. దీని ప్రకారం మాయా, రాకీ, హర్షవర్ధన్ ని కలుస్తారు. అతను 5 లక్షలు డిమాండ్ చేస్తాడు. రాకీ ఆ 5 లక్షల కోసం ప్రయత్నిస్తూంటే, ప్రియా ఆ డబ్బు ఇచ్చి హెల్ప్ చేస్తుంది. ఆ డబ్బు తీసుకుని పేరు మార్చేస్తాడు హర్షవర్ధన్. ఇప్పుడు పోలీస్ ఇన్స్ పెక్టర్ రోడీస్ రఘు వచ్చేసి హర్షవర్ధన్ ని పట్టేసుకుంటాడు. హర్షవర్ధన్ రాకీనీ, మాయానీ పిలుస్తాడు. రోడీస్ రఘు ముగ్గుర్నీ కలిపి బ్లాక్ మెయిల్ చేస్తాడు. పాలసీ మొత్తంలో 20 శాతం, అంటే 40 లక్షలు తనకివ్వకపోతే ఫ్రాడ్ కేసులో ముగ్గుర్నీ లోపలేస్తానంటాడు. బేరసారాలాడి వారంలో ఈ డబ్బు చెల్లిస్తానంటాడు రాకీ.
       
అతను వెళ్ళిపోయాక
, మాయా- హర్షవర్ధన్-రోడీస్ రఘూ ముగ్గురూ ఇన్సూరెన్స్ స్కామ్ ముఠా అని రివీలవుతుంది. ఇదీ ఇంటర్వెల్. అంటే సినిమాలో సెకండాఫ్ లో 20 నిమిషాలకి వచ్చే ఈ ట్విస్టు వెనక్కి జరిపి ఇంటర్వెల్లో ఇచ్చామన్న మాట.

       
ఇప్పుడు రాకీ ప్రేమిస్తున్న మాయా ఒక మాయలాడి అని ప్రేక్షకులకి తెలిసింది
, రాకీకి తెలీదు. రాకీ ఎప్పుడు తెలుసుకుంటాడా అన్న ఉత్కంఠ ఏర్పడుతోంది. ఇంకా పై కథనంలో ప్రియా, మాయాలతో రోమాంటిక్ టెన్షన్ కూడా రాకీకి పెంచితే అతడికి రోమాన్స్ తో ఎమోషనల్ స్ట్రగుల్, పాలసీ డబ్బులతో ఫిజికల్ స్ట్రగుల్ కూడా ఏర్పడి పాత్రకి ఒక సమగ్రత వస్తుంది.

9. మిడిల్ -2 (యాక్ట్-2/బి)

    ఇప్పుడు సెకండాఫ్ ప్రారంభిస్తే సినిమాలో వున్నట్టుగానే మాంటేజెస్ తో మాయా-హర్షవర్ధన్-రోడీస్ రఘు త్రయం కుట్ర ఎలా పన్నారో రివీలవుతుంది. పబ్ లో ఎంజాయ్ చేయడం, కొత్త బకరా ఎవరని మాట్లాడుకోవడం, మెకానిక్ రాకీ దృష్టిలో పడడం, అతడి కోసం మయా రెక్కీ నిర్వహించడం, డ్రైవింగ్ నేర్చుకోవడానికి రాకీ దగ్గరికి వెళ్ళడం వగైరా.
        
ఈ మాంటేజెస్ తర్వాత కథలోకి వస్తే
, సినిమాలో వున్నట్టుగానే  రోడీస్ రఘు డబ్బు కోసం వొత్తిడి పెంచడం, ఈ నకిలీ ఇన్స్ పెక్టర్ని ఇంకో ఇన్స్ పెక్టర్ అనుమానించడం జరిగి, ఎందుకైనా మంచిది మ్యాటర్ క్లోజ్ చేద్దామని దుష్టత్రయం అనుకోవడం జరుగుతాయి. దీనికి రాకీ ప్రియాని పూర్తిగా మర్చిపోయి, మాయాకి కమిటై పోవడమనే రోమాంటిక్ స్టోరీ ని కలపవచ్చు.
        
ఇప్పుడు సినిమాలో ఉన్నట్టుగానే తీర్ధ యాత్రలకెళ్ళి చచ్చిపోయాడనుకున్న రాకీ తండ్రి బ్రతికి రావడమనే  ట్విస్టు వుంటుంది. పాలసీ డబ్బుల కోసం తనని చంపేసిన రాకీ మీద అతను ఫైర్ అవడం
, ఒక స్కెచ్ కోసమే ఇదంతా చేశానని రాకీ చెప్పడం వగైరా డ్రామా అంతా సినిమాలో ఉన్నట్టుగానే వుంటుంది. ఏమిటా స్కెచ్ అంటే, సినిమాలో వున్నట్టుగానే రాకీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం-
       
ఇందులో తన ప్రాణమిత్రుడు శేఖర్ ని మాయా ఎలా ట్రాప్ చేసిందీ వుంది. శేఖర్ తండ్రి చనిపోయాక  కుటుంబాన్ని పట్టించుకోకుండా శేఖర్ తిరుగుతూంటే
, ప్రియా ఉద్యోగం చేయడం, తండ్రి చనిపోయిన శేఖర్ ని ఇన్సూరెన్స్ పేరుతో మాయా ట్రాప్ చేయడం, తండ్రి తీసుకున్న పాలసీలో నామినీగా అతడి తల్లి బదులు వేరొక ఆవిడ పేరుందని చెప్పడం, పేరు మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడం, శేఖర్ ప్రియా దాచుకున్న డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వడం, ఇప్పుడు ఇన్స్ పెక్టర్ గా రోడీస్ రఘు ఎంట్రీ ఇచ్చి ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేస్తున్నందుకు బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం,శేఖర్ ప్రియా నగలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం, నగల గురించి ప్రియా మందలించేసరికి శేఖర్ ఆత్మ హత్య చేసుకోవడం వగైరా వున్నాయి.
       
ఇలా ఇప్పుడు ఓపెనింగ్ హుక్ సీనుకి అర్ధం తెలిసింది. అంటే మాయా గురించి రాకీకి ఎప్పుడో తెలుసనీ
, వాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం కోసమే స్కెచ్ వేసి మాయాని తన మీదికి తనే ప్రయోగించుకున్నాడనీ, ఇంటర్వెల్లో చెప్పిన అర్ధానికి వ్యతిరేకంగా రాకీ ఇలా అన్నీ ముందే తెలిసిన వాడిలా రివీలై ఇంకో ట్విస్ట్ ఇస్తే  క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
        
అంటే బిగినింగ్ ప్లాట్ పాయింట్ -1 లో అతడికేర్పడిన గోల్  నిజమైన గోల్ కాదన్న మాట. అదసలు నిజమైన కథ కూడా కాదన్న మాట. అదంతా - ఇంకా ఇంటర్వెల్ వరకూ కూడా- మాయాని ట్రాప్ చేయడం కోసం అతను అల్లిన కల్పిత కథే అన్న మాట. గ్రేట్ క్యారక్టర్! అసలు నిజ కథ శేఖర్ గురించిన ఈ ఫ్లాష్ బ్యాక్ తోనే. ప్రాణమిత్రుడు శేఖర్ ఆత్మహత్యకి కారణమైన మాయాని పట్టుకోవడమే అసలు గోల్! మాయాతో ప్రేమ కూడా నిజం కాదు. ఆమెని నమ్మించే ఎత్తుగడలో భాగమే అది.
        
ఇలా దీంతో స్క్రీన్ ప్లేకి సంబంధించిన అన్ని  సమస్యలూ సాల్వ్ అయి, ప్లాట్ పాయింట్ 2 కి చేరుకుని, మిడిల్ -2 ముగుస్తుంది.  

10. ఎండ్ విభాగం

    ఎండ్ విభాగం అంటే క్లయిమాక్స్ ని సినిమాలో ఉన్నదున్నట్టు తీసుకోవచ్చు. ఇందులో కథ కోసం తీసుకున్న కాన్సెప్ట్ వెల్లడవుతుంది. పెరిగిపోతున్న వివిధ సైబర్ నేరాల గురించి. వీటికి బలి అవుతున్న ప్రజల గురించి. దొరక్కుండా తప్పించుకుంటున్న మాయా అండ్ కో లాంటి సైబర్ క్రిమినల్స్ గురించి. అయితే ఈ క్లయిమాక్స్ ని సీరియస్ యాక్షన్ తో చూపించకుండా రాకీ తండ్రితో ఫన్నీ – యాక్షన్ కామెడీ చేయడం దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసుకున్న మంచి నిర్ణయం.

సినిమా కథ రాయడం చాలా సులభం. ఎందుకింత గందరగోళం చేసుకుంటారో గానీ, సినిమా కథ స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్. అందుకనే ఈజీ. ఇది గుర్తిస్తే మెకానిక్ రాకీ లాంటి ఆశాభంగాలు కలగవు. ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో ఎవరికైనా సందేహాలుంటే, లేదా సూచనలు చేయదలిస్తే, ఈ క్రింద కామెంట్ బాక్స్ వుంది, వినియోగించుకోగలరు.

—సికిందర్

Tuesday, November 19, 2024

1358 : సందేహాలు- సమాధానాలు

 

'క్కీ భాస్కర్' స్క్రీన్ ప్లే సంగతులుకి సంబంధించి 40 వరకూ స్పందనలు వచ్చాయి ఫోన్ కాల్స్ సహా. ఎక్కువ మందికి ఈ సినిమా ముగింపు నచ్చింది. కొందరు హీరో క్యారక్టరైజేషన్ ని తప్పు బట్టారు. క్లయిమాక్సులో హీరో పాత్రని పాజిటివ్ ముగింపుకి తెస్తూ, అంతలోనే నెగెటివ్ వైపుకి మళ్ళించడాన్ని ప్రశ్నించారు. అయితే ఈ ముగింపు నైతిక విలువల్ని ప్రశ్నిస్తోందన్న విషయం పట్ల ఎక్కువ మందికి ఆసక్తి లేదు. ముగింపులో హీరో తనని ఎలా జడ్జి చేస్తారని ప్రేక్షకులకి రెండు ఆప్షన్స్ ఇస్తాడు- లక్కీ బా...ర్డ్ గానా, లక్కీ భాస్కర్ గానా? అని. ఎక్కువ మందికి లక్కీ బా...ర్డ్ గానే నచ్చినట్టున్నాడు.  
        
క యాంటీ హీరో పాత్రకి శిక్ష పడాలి కదా అన్న కొందరి వాదం సరేగానీ- సోషల్ మీడియాలో చూస్తే నెగెటివిజాన్ని, విద్వేషాన్నీ, హింసావాదాన్నీ, చివరికి ఎవరైనా మరణిస్తే ఆనందాన్నీ, శాడిజాన్నీ గుప్పిస్తూ చేస్తున్న కామెంట్లు పొంగి ప్రవహిస్తున్నాయి. నైతిక విలువలు నాన్సెన్స్ అయిపోయాయి. కాబట్టి 'లక్కీ భాస్కర్' ముగింపుని ఏమనగలం. కాకపోతే హీరో మంచి వాడుగా మారినట్టు చూపిస్తూనే నెగెటివ్ వైపుకి మళ్ళించినప్పుడు- ఆ మంచి వాడుగా మారినట్టుగా చూపించిన సీన్లు నటన అనీ, ప్రేక్షకుల పట్ల చీటింగ్ అనీ గమనించాల్సి వుంటుంది. పాత్ర కథలో పాత్రల్ని చీట్ చేయొచ్చు, సినిమా చూసే ప్రేక్షకుల్ని కాదు.

Q'లక్కీ భాస్కర్ స్క్రీన్ ప్లే సంగతులు ఇన్ఫర్మేటివ్ గా వున్నాయి. అయితే కథకు పోయెటిక్ జస్టిస్  కేనా?
—ఏపీ
A : పోయెటిక్ జస్టిస్ ఇస్తే మళ్ళీ పాజిటివ్ ముగింపు అయిపోతుంది. ఇది కోరుకోలేదు కాబట్టే నెగెటివ్ ముగింపు ఇచ్చారు. నేటి ట్రెండ్ కి ఇదే హీరోయిజం అనుకున్నారు కాబట్టి. అయితే ఇంకో హీరోయిజం కూడా వుంది. హీరో ఆ స్కామ్ లో కింది నుంచీ పైవరకూ తనతో సహా ఎవరెవరైతే వున్నారో వాళ్ళందర్నీ తనతో బాటే వేసుకుని  జైలుకి వెళ్ళి పోవడం కూడా హీరోయిజమే! కలెక్టివ్ జస్టిస్ తో చాలా పెద్ద హీరోయిజం ఇది! అయితే సినిమా అనేది వ్యవస్థకి హెచ్చరికగా వుండాలనుకున్నప్పుడు మాత్రమే ఈ ముగింపు సాధ్యపడుతుంది.

Q : లక్కీ భాస్కర్ ఆర్టికల్ లో మెన్షన్ చేసిన 'శివ' తెలుగులో స్క్రీన్ ప్లే గ్రంధం, గుణ శేఖర్ 'ఒక్కడు' స్క్రీన్ ప్లే కూడా దాదాపు ఇదే ఫార్మాట్ అనుకుంటాను. ఈ మద్యే డిజిటల్లీ రీ మాస్టర్డ్ థియేట్రికల్ వెర్షన్ రీ రిలీజ్ మళ్ళీ చూసాను. హీరో గోల్ ఏంటనేది మొదటి సీన్లో చెప్పేసిన సినిమాలు, అలా చెప్పేసిన తరవాత ప్రోటోగనిస్ట్ అసలు అతని గోల్ కి సంబంధంలేని సమస్యలో పడి చివరికి తాను అనుకున్న లక్ష్యం చేరుకున్న సినిమాలు, అలాగే సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు కూడా సజెస్ట్ చేస్తూ ఆర్టికల్ రాయగలరు. 
జేడీఎస్

       A :  మీరు చెప్పిన అంశాలపై బ్లాగులో చాలా ఆర్టికల్స్ వున్నాయి వివిధ సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు రూపంలో. వీటిలో ఆశ్చర్యపర్చే క్రియేటివిటీ ఏం లేదు. కానీ తమిళ మండేలా లో హీరో యోగిబాబు గోల్ ఏర్పడే ప్లాట్ పాయింట్ 1 ఘట్టంలో వుండడు. ప్లాట్ పాయింట్ 1 దగ్గర శత్రువులైన ఇద్దరి విలన్లకి గోల్ ఏర్పడుతుంది. అదేమీ హీరోకి వ్యతిరేకంగా గోల్ కాదు. హీరోకి సంబంధమే లేదు. అతను తర్వాతెప్పుడో వీళ్ళతో ఇంటరాక్షన్ లోకొస్తాడు. ఇది కొత్తదనం, ప్రయోగం. ఈ లింక్ క్లిక్ చేసిచూడండి.
        
శివ లాగా ఒక్కడు కూడా పూర్తిగా త్రీయాక్ట్ స్ట్రక్చర్ అమలైన సినిమా. అయితే ఈ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి వుంటే ఈ రెండు సినిమాలూ ఏమై వుండేవో వూహించుకోవచ్చు. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ సిడ్ ఫీల్డ్ కనిపెట్టింది కాదు. అసలు సినిమాలంటేనే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో వుండేవి. కాకపోతే సిడ్ ఫీల్డ్ తనకి పూర్వమున్న త్రీ యాక్ట్ స్ట్రక్చర్ హీరో జర్నీలో మజిలీల్ని కుదించి సరళీకరించాడు. ఇది కథా కథనాల వేగాన్ని పెంచింది. కాబట్టి ఈ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసేదేమీ వుండదు. అసలు స్ట్రక్చర్ అంటే ఏమిటో తెలియకుండా తీసిన చాలా చిన్నా పెద్దా తెలుగు సినిమాలు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలతో అట్టర్ ఫ్లాపయ్యాయి.  దీన్ని తెలిసి స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తూ చేసిన ప్రయోగాలందామా?
        
స్ట్రక్చర్ లేకుండా తీస్తే ఆర్ట్ సినిమా. లేదా యూరోపియన్ సినిమా. ఇంకా లేదా కొన్ని రియలిస్టిక్ సినిమాలు. స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి బాగుపడలేరు. స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి మాత్రమే పాల్పడగలరు- ప్లాట్ పాయింట్ వన్ లో వుండాల్సిన మండేలా లేకపోవడం స్ట్రక్చర్ తో పాల్పడిన క్రియేటివిటీ, ప్రయోగం. ప్లాట్ పాయింట్ వన్ కల్లా హీరో గోల్ ని పూర్తి చేసుకోవడం బేబీ డ్రైవర్ లో స్ట్రక్చర్ తో పాల్పడిన క్రియేటివిటీ, ప్రయోగం. ఇలా స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడితే హిట్టవుతాయే తప్ప, స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తే కాదు.

—సికిందర్ 


Saturday, November 16, 2024

1357 : రివ్యూ!

 

 

రచన- దర్శకత్వం: శివ
తారాగణం : సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్, రేడిన్ కింగ్స్ లే, తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : వెట్రి పళనిస్వామి, యాక్షన్ : సుప్రీమ్ సుందర్
బ్యానర్స్ : స్టూడియో గ్రీన్, యూవీ క్రియెషన్స్
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
విడుదల : నవంబర్ 14, 2024
***

        2019 లో ప్రారంభించిన కంగువా 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ స్టార్ సూర్య కిది పానిండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలయింది. విశ్వాసం’, అన్నాతే వంటి మసాలా సినిమాలు తీసే శివ దీని దర్శకుడు. తెలుగులో శౌర్యం , దరువు వంటి సింమాలు తీశాడు. కంగువాని ఎపిక్ ఫాంటసీ యాక్షన్ మూవీ అన్నారు. కంగువా అంటే మాన్ విత్ ది పవర్ ఆఫ్ ఫైర్ అని అర్ధం చెప్పారు. దేశంలో 350 కోట్లతో నిర్మించిన అత్యంత ఖరీదైన చలన చిత్రంగా పేర్కొన్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియెషన్స్ వంటి పెద్ద బ్యానర్లు దీన్ని నిర్మించాయి. ఇన్ని విశేషాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మెగా మూవీ ఏ మేరకు వీటికి న్యాయం చేసింది? పూర్తి న్యాయం చేసిందా లేక న్యాయ పరీక్షకి దూరంగా వుండిపోయిందా? తెలుసుకుందాం...

కథ

    2024 లో రష్యాలోని  బయో మెడికల్ లాబ్ లో పిల్లల మెదడు పనితీరుని పెంచి సూపర్ పవర్స్ ని ప్రేరేపించే ప్రయోగాలు జరుగుతూంటాయి. ఈ ప్రయోగాల నుంచి తప్పించుకుని జెటా అనే పిల్లాడు గోవాకి చేరుకుంటాడు. గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ 95 (యోగిబాబు) అనే ఇద్దరూ కలిసి నేరస్థుల్ని వెతికి పట్టుకుని పోలీసులకి అప్పగించి డబ్బు తీసుకునే బౌంటీ హంటర్స్ గా వుంటారు. వీళ్ళకి పోటీగా ఏంజెలా (దిశా పటానీ), యాక్సిలేటర్ (రేడిన్ కింగ్ స్లే) లు వుంటారు. వీళ్ళెప్పుడూ తగాదాలు పడుతూంటారు. ఇప్పుడు రష్యా నుంచి పారిపోయి వచ్చిన జెటా ఫ్రాన్సిస్ కంటబడతాడు. జెటాని చూస్తూంటే అతడితో తనకేదో పూర్వజన్మ బంధం వున్నట్టు అన్పిస్తుంది ఫ్రాన్సిస్ కి. మరో వైపు  రష్యన్ లాబ్ కమాండర్ రేయాన్ ఆదేశాలతో ఒక దళం జెటా కోసం వెతుక్కుంటూ వచ్చేసి దాడి చేస్తారు. ఎవరీ జెటా? ఫ్రాన్సిస్ తో ఏమిటి సంబంధం?
        
కథ దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం 1070 కి వెళ్తుంది. ఇక్కడ దక్షిణ భారత ఉపఖండానికి సమీపంలో ప్రణవకోన, కపాల కోన, సాగరకోన, అరణ్యకోన, హిమకోన అనే ఐదు ద్వీపాలు వుంటాయి. ఈ ద్వీపాల్లో ఐదు తెగలకి చెందిన వంశాలు వుంటాయి. ఇక్కడ  రోమన్ సైనికులు ప్రవేశించి ప్రణవ ద్వీపాన్ని ముట్టడించడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఈ ద్వీపానికి చెందిన ఒకడి తోడ్పాటు వుంటుంది. ఈ దాడిలో వంద మంది చనిపోతారు. ఈ విషయం తెలుసుకుని ప్రణవకోన యువరాజు కంగువా (సూర్య) ద్రోహనికి పాల్పడిన  వాడ్ని తెగ ముందు ఉరి తీస్తాడు. ఇది తట్టుకోలేక వాడి భార్య కొడుకు పోరువా (2024 లో జెటా) బాధ్యత కంగువాకే అప్పజెప్పి ఆత్మాహుతి చేసుకుంటుంది.
       
ప్రణవ కోనని జయించడంలో
విఫలమవడంతో, రోమన్లు ​​పొరుగు ద్వీపానికి అధిపతి అయిన రుధిర (బాబీ డియోల్) తో పొత్తు పెట్టుకుంటారు. రుధిర ఇద్దరు కుమారులు ఇక కంగువా తెగ మీద దాడికి నాయకత్వం వహిస్తారు. ఆ కుమారులిద్దర్నీ కంగువా చంపేయడంతో రుధిర పగబడతాడు. మరో వైపు తండ్రిని చంపినందుకు పోరువా కూడా కంగువా మీద పగబడతాడు.  ఈ ఇద్దరి ప్రతీకారాల్ని కంగువా ఎలా ఎదుర్కొన్నాడు? ఇప్పుడు 2024 లో జెటాగా ఎదురైన పోరువాని రష్యన్ దళాల బారి నుంచి కంగువా కాపాడేడా? తండ్రిని చంపిన కంగువాని ఇప్పుడు జెటా క్షమించాడా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    నిజానికి పైన రాసినట్టు - ఆ కుమారులిద్దర్నీ కంగువా చంపేయడంతో రుధిర పగబడతాడు. మరో వైపు తండ్రిని చంపినందుకు పోరువా కూడా కంగువా మీద పగబడతాడు.  ఈ ఇద్దరి ప్రతీకారాల్ని కంగువా ఎలా ఎదుర్కొన్నాడు? ఇప్పుడు 2024 లో జెటాగా ఎదురైన పోరువాని రష్యన్ దళాల బారి నుంచి కంగువా కాపాడేడా? తండ్రిని చంపిన కంగువాని ఇప్పుడు జెటా క్షమించాడా? - అనే లైనులో వుండాలి ఈ కథ. లేదు కాబట్టి ఈ లైను మనం కల్పించి చెప్పుకున్నాం.
       
వందల కోట్లతో పానిండియా సినిమా తీస్తూ ఒక గజిబిజి గందరళపు కథ ఎలా తయారు చేస్తారో తెలీదు. గందరగోళం అన్పించే కాబోలు సూర్య సహా ఆర్టిస్టులందరూ సినిమా సాంతం గొంతు చించుకుని  గట్టిగా అరుస్తూనే వుంటారు. లేదా ఈ సినిమా హిట్టవ్వాలని అలా ఆర్తనాదాలు చేస్తున్నారేమో. ఈ పెడబొబ్బలు భరించలేక ... సుప్రసిద్ధ సౌండ్ ఇంజనీర్ రసూల్  పోకుట్టి ఈ
కంగువా శబ్ద కాలుష్యం గురించి ఇంస్టా గ్రామ్ లో ఇలా పోస్టు చేశాడు- నా స్నేహితుడొకరు ఈ రీ-రికార్డింగ్ మిక్సర్ క్లిప్ నాకు పంపారు ఇలాంటి పాపులర్ సినిమాల్లో ధ్వని ముద్రణ గురించి విమర్శలు రావడం నిరుత్సాహపరుస్తుంది. మా క్రాఫ్ట్, కళాత్మకత ఇలాటి లౌడ్‌నెస్ వార్‌లో చిక్కుకోవడం చూస్తే ఎవర్ని నిందించాలి? సౌండ్ ఇంజనీర్నా? లేదా అన్ని తప్పుల్నీ కప్పిపుచ్చడానికి చివరి క్షణంలో ఇలాటి ట్రిక్కులు ప్రయోగించిన వాళ్ళనా? ఇలాటివి జరక్కుండా మొహమాటం లేకుండా గట్టిగా, స్పష్టంగా చెప్పడానికి మా సోదరులకిదే సమయం. ప్రేక్షకులు తలపోటు తెచ్చుకుని బయటికి వెళ్ళిపోతే ఏ సినిమాకూ రిపీట్ వాల్యూ వుండదు!
       
అన్నట్టు ఆ సౌండ్ ఇంజనీర్ మాలీవుడ్ (కేరళ) కి చెందిన అబ్రహాం లిజోజేమ్స్. ఆర్టిస్టులు ఎందుకు అరుస్తున్నారో తెలీదు. కథలో విషయం లేదు
, పాత్రల్లో విషయం లేదు. అయినా సన్నివేశ బలం, భావోద్వేగ బలం  లేకుండా అరుపులు ఆరవడానికి అంతంత సత్తువ ఎలా వచ్చిందో తెలీదు. డబ్బింగ్ థియేటర్లో ఎన్ని మైకులు పగిలిపోయాయో తెలీదు.
        
ఫస్టాఫ్ 40 నిమిషాల పాటు గోవాలో ప్రెజెంట్ స్టోరీ మరీ ఎబ్బెట్టుగా వుంది- సూర్య, దిశా పటానీ, యోగిబాబు, రేడిన్ కింగ్ స్లేల కామెడీలతో. వరసబెట్టి కీచులాడుకునే కామెడీ ఇది. పోటీ బౌంటీ హంటర్లుగా సూర్య, దిశా పటానీల ఔట్ డేటెడ్ కీచులాటల కామెడీ 40 నిమిషాలూ సినిమాని డొల్లగా మార్చేసింది.  జెటా తప్పించుకొచ్చాక యాక్షన్ లో కొచ్చి పీరియెడ్ స్టోరీ ప్రారంభమయ్యేవరకూ కామెడీ పేరుతో తమాషాని భరించాల్సిందే.
       
తర్వాత 1070  పీరియెడ్ స్టోరీ ఐదు తెగలతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అయితే ఈ తెగల
ఆచార వ్యవహారాల్ని, జీవన విధానాన్నీ అర్థం చేసుకునే సూక్ష్మ సన్నివేశాలు లేవు. ఎవరు ఏ తెగకి చెందిన వారో గుర్తు పట్టడం కష్టమైపోతుంది. కనీసం ప్రత్యర్ధులైన కంగువా, రుధిర తెగల కుటుంబాల పరిచయాలు కూడా వుండవు. ఒక దశలో ఏ తెగ ఎవరితో ఎందుకు పోరాడుతోందో అర్ధంగాదు. అర్ధమయ్యేదేంటంటే, సొంత తెగలో కంగువా ద్రోహిని ఊరి తీశాక, అతడి కొడుకు బాధ్యత తీసుకోవడం, ఆ కొడుకు పోరువా (ప్రెజెంట్ స్టోరీలో జెటా) కంగువామీద పగబట్టడం. మరోవైపు రుధిర కుమారులిద్దరూ రోమన్ల కొమ్ముకాసి కంగువా తెగ మీద  దాడి చేయడం. అయితే ఈ భారీ యాక్షన్ దృశ్యాల తర్వాత ఇంటర్వెల్ లో ఏదైనా మలుపు వస్తుందనుకుంటే అలాటిదేమీ రాదు.  ఇంటర్వెల్‌కి ముందే కథ పట్టాలు తప్పడం మొదలవుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా కథ మరింత క్లిష్టంగా మారుతుంది. కనీసం ఇంటర్వెల్లో కేంద్రీకృత డ్రామా ఏర్పాటు చేసి వుంటే సెకండాఫ్ ఒక దారిలో పడేది.
       
సెకండాఫ్ లో పగబట్టిన కంగువా మీద పోరువా దాడులు చేయడం
, వాడ్ని మార్చడం కోసం కంగువా ప్రయత్నించడం, మరో వైపు పగబట్టిన రుధిర దాడులు చేయడం... ఈ రెండు ట్రాకులు ఒక దగ్గర కలిసి కంగువా కోసం పోరువా చేసే త్యాగంతో ఈ పీరియెడ్ స్టోరీ ముగుస్తుంది.
       
ఇక ప్రెజెంట్ స్టోరీ అంతా రష్యన్ దళం నుంచి జెటాని ఫ్రాన్సిస్ కాపాడే క్లయిమాక్స్. అయితే పీరియెడ్ స్టోరీలో కథ ఇంకా మిగిలే వుంది. రుధిర కొడుకు ప్రతీకారంతో (కార్తీ) తిరిగి రావడంతో ఫ్రాన్సిస్ తో సీక్వెల్ వుంటుందని ఒక ట్విస్ట్. అసలు ఈ సినిమా మొత్తం కన్నా ఈ సీక్వెల్ ట్విస్టే బావుంది. ఈ ట్విస్టులో రష్యన్ కమాండర్ రేయాన్ ఎవరో కాదు- పీరియెడ్ స్టోరీలో రుధిర కొడుకే (కార్తీ). ఇలా ఫ్రాన్సిస్ గా సూర్య
, రుధిర కొడుకు ఇప్పుడు రష్యన్ కమాండర్ రేయాన్ గా కార్తీల మధ్య కొత్త పోరాటానికి రంగం సిద్ధమన్నమాట. బాబీ డియోల్ తో సూర్య పోరాటం కలిగించని థ్రిల్ సూర్య-కార్తీల మధ్య సీక్వెల్ కిచ్చిన హింట్  అత్యంత థ్రిల్ పుట్టించేదిగా వుంది. ఈ మధ్య ఏ సినిమాలోనూ సీక్వెల్ కిచ్చిన హింట్ ఇంత థ్రిల్లింగ్ గా లేదు.  ఈ ట్విస్టు తప్ప సినిమా అంతా దారిలో పెట్టని కథతో గజిబిజి గందరగోళం -అదనంగా పెడబొబ్బలు!

నటనలు- సాంకేతికాలు

    సూర్య నటించిన బౌంటీ హంటర్ పాత్రలో, నటనలో దమ్ము లేదుగానీ, కంగువా నటనలో దమ్ముంది, పాత్రలో కాదు. అతను ఎన్ని నవరసాలు పలికించి తన టాలెంట్ ని ఎంత ప్రకటించినా అతడితో కథ సహకరించలేదు. యాక్షన్ దృశ్యాల్లో ఎంత విజృంభించినా అంత యాక్షన్ కీ, దాంతో దిక్కులు పిక్కటిల్లే గాండ్రింపులకీ పూనుకోవడానికి ఎక్కడికక్కడ సన్నివేశ బలం లేదు. మిగిలిన ఆర్టిస్టులకి చోటు లేకుండా ఎంత ఒన్ మాన్ షోగా నటించినా సినిమాని నిలబెట్టడం కష్టమై పోయింది.
       
విలన్ గా బాబీ డియోల్ కూడా సూర్య ఒన్ మాన్ షో బాధితుడు. ఉన్నవే కొద్ది సీన్లు
, వాటిలో సరైన పాత్ర చిత్రణ లేని క్రూరత్వంతో కూడిన నటన. హీరోయిన్ దిశా పటానీ వున్నా లేనట్టే. యోగిబాబు, రెడిన్ కింగ్ స్లేల  కామెడీ సరేసరి. జెటాగా /పోరువాగా నటించిన కుర్రాడికే తగిన కారణంతో కూడిన భావోద్వేగాలు, నటన వున్నాయి. అయితే కథలో ఈ కీలక పాత్రని ఉపయోగించుకున్న తీరు కథకి దాదాపు కాన్ఫ్లిక్ట్ లేకుండా చేసింది.  
        
సాంకేతికంగా దర్శకుడు శివ తీవ్ర కృషి చేశాడు. సౌండ్ విషయంలో తప్ప. సౌండ్ రెండు పాయింట్లు తగ్గించమని ఆదేశించినట్టు ఈ రోజు నిర్మాత చెప్పాడు. ఈ సినిమాకి సౌండ్ ఒక హాట్ టాపిక్ అయింది. రెండు పాయింట్లు తగ్గిస్తే అరుపులు ఎక్కడికి పోతాయి. ఆర్టిస్టులు అరవడానికి నోరు తెరిచినప్పుడల్లా ఎడిట్ చేస్తే సరిపోతుంది.
       
ఇక దేవిశ్రీ ప్రసాద్ సృష్టించిన సౌండ్ పొల్యూషన్ కూడా తక్కువేమీ కాదు. పాటలు బలహీనంగా
, బీజీఎం బాంబుల మోతగా వున్నాయి. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణం మాత్రం మహాద్భుతంగా వుంది. దీనికి కళాదర్శకత్వం, స్పెషల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీలు అత్యున్నతంగా తోడ్పడ్డాయి. అయితే ఇంత దృశ్య వైభవాన్ని అందుకోలేని స్థాయిలో వుండిపోయాయి దర్శకుడు శివ సమకూర్చిన కథా కథనాలు.

మినీ స్క్రీన్ ప్లే సంగతులు

    ఈ కథా కథనాల్లో సస్పెన్స్, టెంపో, డైనమిక్స్, థ్రిల్స్ అంటూ ఏవీ లేకపోవడానికి కారణం ప్రెజెంట్ స్టోరీ- పీరియెడ్ స్టోరీలలో ఏది ప్రధాన కథ, ఏది ప్రధాన కథకి సమాచార వనరు మాత్రమే అనేది తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే రాసెయ్యడమే.
       
ఫ్లాష్ బ్యాక్స్ వున్న కథలో ప్రెజెంట్ స్టోరీ ఎప్పుడూ ప్రధాన కథ అవుతుంది. కాబట్టి బిగినింగ్
, మిడిల్, ఎండ్ విభాగాలు, ప్లాట్ పాయింట్స్ ప్రధాన కథ అయిన ప్రెజెంట్ స్టోరీతోనే  వుంటాయి. ఫ్లాష్ బ్యాకుల్లో వచ్చే విషయమంతా ప్రెజెంట్ స్టోరీ నడవడానికి పనికొచ్చే పూర్వ సమాచారమే. ఇది కథ కాదు, దీనికి బిగినింగ్- మిడిల్, ఎండ్ లు, ప్లాట్ పాయింట్లు వుండనవసరం లేదు. వుండాలని ప్రయత్నిస్తే కుదరవు కూడా, పైగా ప్రెజెంట్ స్టోరీలో ఈ టూల్స్ వుండకుండా పోతాయి. దీంతో ప్రెజెంట్, పీరియెడ్ స్టోరీలు రెండూ చెడిపోతాయి. ఇదే జరిగిందిక్కడ.

            
మరొకటేమిటంటే, ప్రజెంట్ స్టోరీలో ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధి పాత్రకూడా లేకుండా పోయింది. ప్రత్యర్ధి పాత్ర ఎవరై వుంటారంటే, ఫ్రాన్సిస్ కి ప్రశ్నార్ధకంగా వున్న పిల్లవాడు జెటానే. ఇతడ్ని చూస్తే ఏదో పూర్వ అనుబంధం వున్నట్టుందని అనేస్తాడు ఫ్రాన్సిస్. ఇలా అనడం రాంగ్. స్ట్రక్చర్ మీద అవగాహన లేక ఫ్రాన్సిస్ తో ఇలా అన్పించడమే. ఇలా అనిపించినప్పుడు ఇది పునర్జన్మ కథ అని అప్పుడే లీకై పోతోంది. కథనంలో ఇంకేం సస్పెన్సు వుంటుంది? ఇలా కాక, ఒకవైపు రష్యన్ దళం జెటా కోసం దాడులు చేస్తూంటే, కౌంటర్ గా ఆ దాడుల మధ్య ఫ్రాన్సిస్ కి జెటా తన మీద దాడులు చేస్తున్నట్టు ఏవో మాంటేజెస్ మెదల వచ్చు. ఇలా మాంటేజెస్ మెదిలితే జెటా ఆటోమేటిగ్గా ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధి గా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. అప్పుడు గుర్తు లేని మాంటేజెస్ లో ఎందుకు నా మీద దాడులు చేస్తున్నాడు, ఎవరితను వంటి ప్రశ్నలతో ప్లాట్ పాయింట్ ఫన్ వస్తే, ఒక సస్పెన్స్ తో కూడిన తెలుసుకోవాలనే  గోల్ ఏర్పడుతుంది హీరో అయిన ఫ్రాన్సిస్ కి.
       
కథ కథలా నడవడానికి తగిన సమయం
, అవకాశం దానికివ్వాలి. అప్పుడే కనెక్ట్ అవుతుంది ప్రేక్షకులకి. ఇలా ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధిగా జెటా బోలెడు సందేహాలతో, సస్పెన్సుతో ఎస్టాబ్లిష్ అయ్యాక, జెటాని కాపాడ్డం గాక అతడ్ని శత్రువులా చూడ్డం మొలెడితే కథనంలో డైనమిక్స్ ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో రష్యన్ దళం ఫ్రాన్సిస్ తల బద్దలు కొట్టి జెటాని ఎత్తుకెళ్ళి పోతే, తలగిర్రున తిరిగి కిందపడ్డ ఫ్రాన్సిస్ సర్రున పూర్వజన్మ (పీరియెడ్ స్టోరీ) లోకెళ్ళి పడొచ్చు- యమగోల లో ఎన్టీఆర్ యమలోకంలో పడ్డట్టు.
       
అక్కడ జెటా పోరువాగా సర్ప్రైజింగ్ గా వుంటాడు. ఇది కూడా కథనం ఫ్లాట్ గా సాగకుండా డైనమిక్సే. ఇక్కడే ఫ్రాన్సిస్ కంగువాగా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ పోరువా  కంగువామీద పగబట్టిన కారణాన్ని ఎస్టాబ్లిష్ చేశాక ప్రెజెంట్ స్టోరీలోకి వచ్చెయ్యాలి. ఎందుకంటే జెటా ఎవరు
, ఎందుకు నా మీద దాడులు చేస్తున్నాడనే ప్లాట్ పాయింట్ 1 లో ఫ్రాన్సిస్ ప్రశ్నలకి జవాబు దిరికింది కాబట్టి, ఇంకా పీరియెడ్ స్టోరీని పొడిగించే అనుమతి లేదు.

ఫ్రాన్సిస్ కళ్ళు తెరిచి ప్రెజెంట్ స్టోరీలోకి వచ్చాక, జెటా కోసం వెతకవచ్చు. అప్పుడు జెటాతో రష్యన్ కమాండర్ రేయాన్ గా కార్తీ ఎదురైతే అది మోస్టు థ్రిల్లింగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వుంటుంది. ఇప్పుడు కథ సూర్య వర్సెస్ కార్తీ అనే ఎదురు చూడని ఇంటర్వెల్ అనే ప్లాట్ పాయింట్ తో వుంటే ప్రెజెంట్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ కెళ్తుంది. సినిమాలో చూపించినట్టు పీరియెడ్ స్టోరీ మీద ఇంటర్వెల్ పేలవంగా కాదు.

ఇప్పుడు సెకండాఫ్ స్ట్రక్చర్ జోలికి వెళ్ళడం లేదు- ఇది మినీ స్క్రీన్ ప్లే సంగతులు కాబట్టి. అయితే ఈ సెకండాఫ్ పీరియెడ్ స్టోరీలో కార్తీ రుధిర కుమారుడిగా రివీలవుతాడు. ముగింపు ట్విస్టులో సీక్వెల్ కోసం రుధిర కుమారుడే అయిన కార్తీని ఈ జన్మలో (ప్రెజెంట్ స్టోరీలో) రష్యన్ కమాండర్ రేయాన్ గా ఓపెన్ చేశారు కాబట్టి- ఈ ప్రెజెంట్ స్టోరీలో ఇంకో ప్రత్యర్ధి అయిన కమాండర్ రేయాన్ గా కార్తీని ఇంటర్వెల్ దగ్గర లాక్కొచ్చి ట్విస్టు ఇవ్వడం న్యాయం.

తీస్తున్న భారీ బడ్జెట్ కి నోట్లు తీసి లెక్కపెడుతున్నప్పుడు రాస్తున్న కథ లెక్కలు కూడా తెలియడం అవినాభావ సంబంధ న్యాయమే.

—సికిందర్