రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, October 14, 2024

1451 : రివ్యూ!

రచన –దర్శకత్వం : టీజే జ్ఞానవేల్
తారాగణం : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, రీతికా సింగ్, దుషార విజయన్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్,  ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదిర్
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్ అల్లిరాజా
విడుదల : అక్టోబర్ 10, 2024
***

2023 లో జైలర్ తో బంపర్ హిట్టిచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్- ది హంటర్ తెలుగు వెర్షన్ ఈ దసరా సందర్భంగా  తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది రజనీకాంత్ 170 వ సినిమా. సూర్యతో జై భీమ్ అనే హిట్ తీసిన టీజే జ్ఞానవేల్ దీనికి దర్శకుడు. పానిండియా మూవీగా విడుదలైన ఇందులో వివిధ భాషల నటులు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి  నటించారు. మంజూ వారియర్ హీరోయిన్. మరి ఇంత ఆకర్షణీయమైన తారాగణంతో భారీగా తెరకెక్కిన  ఈ మూవీ ఎలా వుంది? ఇందులో ఏ సామాజిక సమస్య చెప్పాలనుకున్నారు? రజనీకీ, జ్ఞానవేల్ కీ ఇది మరో హిట్టేనా? ఈ వివరాల్లోకి వెళ్దాం...

థేమిటి?

దియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీ గా ‌ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. నేరాలకి పాల్పడే ముఠాల్ని కాల్చిపారేస్తూంటాడు. మానవ హక్కుల  నాయకుడు, లాయర్ సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఇది తప్పని వాదిస్తూంటాడు. ఆదియన్ మాత్రం పద్ధతి మార్చుకోడు. ఇతడికి కేసుల్లో సాయపడే బ్యాటరీ (ఫహద్ ఫాజిల్) అనే దొంగ వుంటాడు. 

ఇలా  వుండగా, శరణ్య (దుషారా విజయన్) అనే స్కూల్ టీచర్ వుంటుంది. ఈమె గంజాయి మాఫియాలు స్కూలుని అడ్డాగా మార్చుకుని దందా చేస్తూంటే కంప్లయింట్ ఇస్తుంది. ఆ మాఫియా వ్యక్తిని ఆదియన్ ఎన్ కౌంటర్ చేసేస్తాడు. ఈ ఊదంతంతో శరణ్యకి మంచి పేరు రావడంతో చెన్నైకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటుంది.
       
ఇప్పుడు చెన్నైలో గుర్తు తెలియని దుండగుడు శరణ్యని రేప్ చేసి చంపేస్తాడు. దీంతో ఉపాధ్యాయులు
, ప్రజలూ తీవ్ర ఆందోళనకి దిగుతారు. వీళ్ళని శాంతపర్చడానికి కన్యాకుమారి నుంచి ఆదియన్ ని పిలిపించి కేసు అప్పగిస్తాడు డిజిపి (రావు రమేష్). ఆదియన్ గుణ అనే యువకుడ్ని రేపిస్టు- కిల్లర్ గా నిర్ధారించి ఎన్ కౌంటర్ చేసేస్తాడు. ఇది బెడిసి  కొడుతుంది. తాను ఎన్ కౌంటర్ చేసింది అమాయకుడ్నని తెలుకుని షాక్ అవుతాడు.
        
ఇప్పుడు ఆదియన్ పరిస్థితి ఏమిటి? గుణ ని చంపి ఓ పేద కుటుంబానికి అన్యాయం చేసిన తను దీనికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు? అసలు శరణ్య మీద అఘాయిత్యం తలపెట్టిందెవరు? దీంతో నాట్ అకాడెమీ అనే ఎడ్యుటెక్ కంపెనీ నడిపే నటరాజ్ (రానా  దగ్గుబాటి) కేం సంబంధం? ఇతను విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ భారీగా పాల్పడిన  స్కామ్ ఏమిటి? ఇతడ్ని ఆధారాలతో సహా ఆదియన్ ఎలా పట్టుకున్నాడు? ఇదీ మిగతా కథ

ఎలావుంది కథ

ప్రభుత్వం చేతిలో వుండాల్సిన విద్యారంగాన్ని కార్పొరేటీ కరణ చేసి, ప్రతీ అడ్డమైన కోర్సుకీ ఎంట్రెన్స్ టెస్టులంటూ పేద, మధ్య తరగతి విద్యార్ధులు తప్పనిసరై అప్పులు చేసి కోచింగులు తీసుకునే, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించి, భారీగా వ్యాపారం చేసుకుంటున్న ఎడ్యూటెక్ కంపెనీల వ్యవహారాన్ని కథగా తీసుకున్నాడు జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్. తన బ్రాండ్  సామాజిక సినిమాల సరసన దీన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
       
భారీ ఉద్యమాలని
, మెసేజుల్నీ ఒక ఫార్ములాగా డిమాండ్ చేసే ఇలాటి  విద్యారంగం పాత కథకి యాక్షన్ తో కూడిన  పోలీస్ ఎన్ కౌంటర్ల కథ జత చేసి, విద్యారంగం కథ పాత మూస టెంప్లెట్ లో పడిపోకుండా కాపాడడం తెలివైన పనే. దీంతో ఈ  కథనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగుతూ యూత్ అప్పీల్ కీ, మాస్ అప్పీల్ కీ న్యాయం చేసే యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో కొత్త పుంతలు తొక్కిందేమో ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి...
       
ఐతే ఇది
జైలర్ లాగా రియలిస్టిక్ గా వుండదు. రజనీ పాత్ర కూడా జైలర్లో లాగా వయ్సుకి తగ్గ, సాధారణ జీవితపు వాస్తవికతతో వుండదు.  రజనీ తన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని పూర్తి మాస్ మసాలా యాక్షన్ హీరోగానే కన్పిస్తాడు.  ఎస్పీగా  విచ్చలవిడి ఎన్ కౌంటర్ లతో ప్రారంభమై, ఓ గ్రూప్ సాంగ్ వేసుకుని, ఓ కామెడీ చేసుకుని పరిచయమవుతాడు. మరోవైపు సమాంతరంగా అమితాబ్ బచ్చన్ లాయర్ ట్రాక్ నడుస్తూంటుంది. దీనికి సమాంతరంగా టీచర్ పాత్రలో దుషారా విజయన్ ట్రాక్ వస్తూంటుంది. మధ్యమధ్యలో ఫహద్  ఫాజిల్ కామెడీ ట్రాకు. టీఛర్ హత్యతో కథ మలుపు తిరిగి ఇక రజనీ ఇన్వెస్టిగేషన్ తో పరుగులు తీస్తుంది. టీచర్ కేసులో తాను ఎన్ కౌంటర్ చేసింది అమాయకుడ్నని రజనీ తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
       
ఇక సెకండాఫ్ కూడా దాదాపు ముప్పాతిక భాగం అసలు హంతకుడెవరో తెలుసుకునే ఇన్వెస్టిగేషన్  కథ గానే మలుపులు తిరుగుతూ సాగి- ఎడ్యుటెక్ కంపెనీ ఓనర్ గా రానా తెరపైకి రావడంతో విద్యావ్యవ స్థ కథ మొదలవుతుంది. అయితే కథకి ముగింపు అతి సాధారణంగా వుండడమేగాక
,  రజనీ క్యారక్టర్ పరంగా కథలో వుండాల్సిన టర్నింగ్ కన్పించదు.
       
ఈ మద్య సెకండాఫులు తేలిపోయి ఫ్లాపవుతున్న సినిమాల్ని వరసగా చూస్తున్నాం.  కానీ ఈ మూవీ ఫస్టాఫ్
, సెకండాఫ్ ఎక్కడా పట్టుతప్పకుండా గ్రిప్పింగ్ గా వుండడం ఒక రిలీఫ్. దీనికి తగ్గట్టు పాత్ర చిత్రణలు కూడా గ్రిప్పింగ్ గా వుండుంటే –జైలర్ లాగా మరో లెవెల్లో వుండేది ఈ పానిండియా మూవీ.

నటనలేమిటి
? సాంకేతికాలేమిటి?

ఫ్యాన్స్ కోసం రజనీకాంత్ మళ్ళీ తన రెగ్యులర్ మ్యానరిజమ్స్ నే ప్రదర్శించాడు.  సిగరెట్ ఎగరేయకపోయినా,కళ్ళద్దాలు ఎగరేసి పట్టుకోవడం లాంటి ఎస్పీ స్థాయి పాత్రకి తగని గిమ్మిక్కులు చేశాడు. ఫాస్ట్ సగ్ లో మంజూవారియర్ తో మంచి కిక్ ఇచ్చాడు. అలాగే యాక్షన్ సీన్స్ కూడా తన రెగ్యులర్ బ్రాండ్ ని దృష్టిలో పెట్టుకునే చేశాడు.
       
అయితే పాత్ర పరంగా వుండాల్సిన డెప్త్ లేదు. తాను అమాయకుడ్ని ఎన్ కౌంటర్ చేశాడన్న బాధ కాసేపే వుంటుంది. హతుడి కుటుంబంతో అసలు హంతకుడ్ని పట్టుకుని మీ కొడుకు నిర్దోషి అని నిరూపిస్తానంటాడు. దీంతో ఈ ఇన్వెస్టిగేషన్ తో సాగిపోతాడు. అసలు ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసినందుకు సస్పెండ్ అవ్వాలి. ఇది జరగదు. ఇంకా ఇతడ్ని నమ్మి  అసలు  హంతకుడ్ని పట్టుకునేందుకు అనుమతిస్తాడు డిజిపి. తాను అమాయకుడ్ని చంపాడన్న అపరాధ భావంతో కూడిన పాత్ర చిత్రణ
, దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ముగింపూ వుండవు.  చివరికి ఆ కొడుకు నిర్దోషి అని నిరూపించాక, నేను చంపానన్న బాధ వుంది- ఎంక్వైరీ కొంసాగుతుంది- అని కుటుంబంతో అంటాడు. అంటే ఏంటో? తన మీద థాణె ఎంక్వైరీ వేసుకుంటాడా?
       
ఇలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా నామ్ కే వాస్తే వుంది. ఆయన  మానవ హక్కుల పోరాటం ఏం చేశాడో కన్పించదు. తనకీ రజనీకీ సఘర్షణతో కూడిన కథ వుంటుందనుకుంటే అదీ వుండదు. అయితే ఫహద్ ఫాజిల్ కామిక్ పాత్ర కొనసాగింపు
,  దానికిచ్చిక షాకింగ్ ముగింపూ బావున్నాయి. విలన్ గా రానా దగ్గుబాటి చివర్లో వచ్చే పాత్ర. రొటీన్ విలనీ, మంజూ వారియర్ కి పెద్దగా ప్రాధాన్యంలేదు గానీ, టీచర్ పాత్రలో దుషారా విజయన్ సానుభూతి పొందే ప్రయత్నంచేస్తుంది. కానీ ఆమె హత్యా దృశ్యపు మాంటేజీలు పదేపదే వేయడం అనవసరం.
       
ఇక రజనీ ఎలా మూవ్ మెంటిస్తే అలా బీజీఎం ఇచ్చి అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేశాడు అనిరుధ్ రవిచందర్. పాటల విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. కదిర్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్. ఇతర సాంకేతిక విలువలు
, యాక్షన్ దృశ్యాలు లైకా ప్రొడక్షన్స్ రేంజిలో వున్నాయి.
       
మొత్తానికి రజనీ
, జ్ఞానవేల్ లు కలిసి కమర్షియల్ సినిమాని ఓ కొత్త శైలిలో చూపించాలని చేసిన ప్రయత్నం, ఓ ఫర్వాలేదనే స్థాయిలో వుందని చెప్పుకోవచ్చు.

-సికిందర్


Saturday, October 5, 2024


 

    శ్రీ విష్ణు పోషించిన భవభూతి పాత్ర నటన ఇంద్రుడు చంద్రుడు (1989) లో కమల హాసన్ ని కాపీ కొట్టినట్టుంది. అదే పొట్ట పెరిగి, పారపళ్ళతో కనిపిస్తూ, బొంగురు గొంతుతో మాట్లాడే కమల హాసన్ నటన ఒక నీటైన అద్బుత ప్రయోగంగా హిట్టయ్యింది ఆ రోజుల్లో

రచన- దర్శకత్వం : హసిత్ గోలి
తారాగణం : శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, రవిబాబు, సునీల్, గోపరాజు రమణ  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వేదరామన్ శంకరన్, కూర్పు విప్లవ్ నిషాదం
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్
విడుదల : అక్టోబర్ 4, 2022
***

        2021- 22 లలో ఓ మూడు ఫ్లాపుల తర్వాత శ్రీవిష్ణు 2023 లో సామజవరగమన కామెడీతో ఓ హిట్టిచ్చి, తిరిగి ఓం భీమ్ బుష్ అనే ఇంకో ప్లాప్ తో  సరిపెట్టుకున్నాడు. అయితే 2021 ప్రారంభంలో రాజరాజ చోర అనే హిట్ కూడా ఇచ్చాడు. దీనికి దర్శకుడు హసిత్ గోలి. తిరిగి ఇదే దర్శకుడితో ఈవారం స్వాగ్ అనే మరో కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ తిరిగి ఓ క్లీన్ ఎంటర్ టైనర్ ని అందించిందా? దసరా సందర్భంగా దీన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చా? తెలుసుకుందాం...

కథేమిటి?

ఎస్సైగా రిటైరైన భవభూతి (శ్రీవిష్ణు) రిటైర్మెంట్  డబ్బులు రాలేదని బాధ పడుతున్న సమయంలో తనది శ్వాగణిక వంశపు వారసత్వమని, కోట్ల రూపాయల సంపద తనకి వచ్చే అవకాశముందని తెలుసుకుంటాడు. వంశవృక్ష నిలయానికి వెళ్ళి ఆ సంపదని క్లెయిమ్ చేస్తాడు. అక్కడికే అనుభూతి (రీతూ వర్మ) అదే పని మీద వస్తుంది.  శ్వాగణిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవాలంటే అవసరమైన రాగి పలక వుండాలి. అది ఈమె దగ్గర వుంటుంది. 
       
ఈ రాగి పలక భవభూతికి కాక ఈమెకెలా వచ్చింది
? భవభూతి లాగే వున్న సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు) ఎవరు? వీళ్ళిద్దరికీ సంపద దక్కకుండా చేసిన యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? 1551 ళ్ళ క్రితం మాతృస్వామ్యాన్ని స్థాపించి మగాళ్ళని తోక్కెసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ) నుంచి అధికారాన్ని లాక్కుని,  పితృ స్వామ్య వ్యవస్థని స్థాపించిన అదే వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? ఇందులో రేవతి (మీరా జాస్మిన్)  ఎవరు? చివరికి సంపద ఎవరి సొంతమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ 

స్త్రీ పురుషుల్లో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని గాకుండా అందరినీ సమానత్వంతో చూడడమే  మానవత్వమని మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. ఇది పాత బడిన- కాలం చెల్లిన  పాయింటేమీ కాదు. ఈ అసమానతల సమస్య, సంఘర్షణ  ఎక్కడైనా ఎప్పటికైనా వుండేవే. అయితే దీన్ని సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో యూత్ కోసం ఉద్దేశించాల్సింది పోయి  – యూత్ కి ఏమాత్రం కనెక్ట్ కాని పురాతన జానపద కథల కాలంలో స్థాపించి, యూత్ అప్పీల్ కీ మార్కెట్ యూస్పెక్ట్ కీ అందకుండా  చేశాడు.

జానపద పాత్రలు, సన్నివేశాలు,  సంభాషణలు, హాస్యాలూ  వగైరా ఔట్ డేటెడ్ మూవీ అన్పించేలా చేసేస్తాయి. ఇంతే గాకుండా ఏం కథ చెప్తున్నాడో అస్సలు అర్ధంగాక, కామెడీ కూడా అర్ధం గాక, అర్ధమవడానికి వీల్లేని ట్విస్టులతో, బోలెడు హడావిడీ చేసేస్తూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు! చివర్లో చెప్పిన మెసేజ్ తప్ప ఏదీ అర్ధంగాదు. దీన్ని దర్శకుడి ఓవర్ ఇండల్జెన్స్ అనాలేమూ!

        
పురాతన కాలంతో ప్రారంభమయ్యే ఫస్టాఫ్ కథ ఇదేదో కొత్త ప్రయోగంలా అన్పించి ఆసక్తి రేపుతుంది. పది నిమిషాల్లో నేటి కాలంలో కొచ్చేసరికి శ్రీవిష్ణు ఎస్సై పాత్రతో ఓవరాక్షన్ మొదలై, ఇక దర్శకుడి ఓవరాక్షన్ కూడా మొదలైపోతుంది. ఎన్నెన్నో పాత్రలు, ఏమేమో సంఘటనలు, తెర మీద ఏదీ రిజిస్టర్ కాని స్పీడుతో, ఇక కథని పట్టుకోవడం అసాధ్యమై- శ్రీవిష్ణు మరో రెండు పాత్రల ఎంట్రీతో ఇంటర్వెల్ పడుతుంది.

ఇక సెకండాఫ్ కొస్తే మళ్ళీ పురాతన కాలపు కథతో ప్రారంభమవుతుంది. ఈ సెకండాఫ్ శ్ర్రెవిష్ణు - సునీల్ ల మద్య సాగదీసిన పేలవమైన కామెడీతో సహనపరీక్ష పెడుతుంది. ఫస్టాఫ్ లో కంగాళీ కామెడీతో చేసిన హంగామా అంతా కూడా సెకండాఫ్ లో మాయమైపోయి సీరియస్ సినిమా అయిపోతుంది. కథ విషయంలో గానీ, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విషయంలో గానీ దర్శకుడికి పట్టు, అవగాహన, స్పష్టత లేక ఇదంతా జరిగింది. మళ్ళీ చివర్లో శ్రీవిష్ణు చేఠ మెసేజ్ ఇప్పించే విషయంలో మాత్రం డిసిప్లిన్ గా వున్నాడు దర్శకుడు. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ట్విస్టుతో సినిమా అదరగొడుతుందన్న శ్రీ విష్ణు స్టేట్ మెంట్ పూర్తిగా ఫెయిలైనట్టు లెక్క.

నటనలేమిటి? సాంకేతికాలేమిటి?
 శ్రీ విష్ణు పోషించిన భవభూతి పాత్ర నటన ఇంద్రుడు చంద్రుడు (1989) లో కమల హాసన్ ని కాపీ కొట్టినట్టుంది. అదే పొట్ట పెరిగి, పారపళ్ళతో కనిపిస్తూ, బొంగురు గొంతుతో మాట్లాడే కమల హాసన్ నటన ఒక నీటైన అద్బుత ప్రయోగంగా హిట్టయ్యింది ఆ రోజుల్లో. దీన్ని కాపీకొట్టిన శ్రీవిష్ణు నీట్ నెస్ బదులు వెకిలి తనంతో మెప్పించబోయాడు. ఈ గెటప్, డబ్బింగ్ ఏమాత్రం కుదర్లేదు. మిగిలిన పాత్రల అభినయం రొటీనే కాబట్టి కష్టపడే పనిలేకుండా పోయింది. అయితే ఈ పాత్రలన్నీ కూడా గందరగోళపు కథలో ఆకట్టుకునే అవకాశం లేదు..
       
మహారాణి పాత్రలో
, తర్వాత ఈ కాలంలో లింగ వివక్ష నెదుర్కొనే ఆత్మాభిమానం గల సాధారణ యువతి  పాత్రలో రీతూ వర్మ మాత్రం నీటుగా నటించింది. ఈ రెండూ సీరియస్ పాత్రలే. కంగాళీ కామెడీలో ఈమె భాగం కాలేదు. శ్రీవిష్ణు భార్య పాత్రలో మీరా జాస్మిన్ కూడా చెప్పుకోవాల్సిన నటి. ఇక సునీల్ రొటీన్. వంశ వృక్ష నిలయంలో
రవిబాబు, గోపరాజు పాతకాలపు పాత్రలు, నటన యూత్ కి అవసరం లేదు. రవి బాబుతో పరమానందయ్య శిష్యుల్లాగా వుండే నటుల హాస్యమేమీ లేదు.
       
పురాతన కాలపు సెట్స్
, వాతావరణ సృష్టి, దీనికి తగ్గ కెమెరా వర్క్ బావున్నా వీటితో సంగీతం మాత్రం పోటీపడలేదు. పాటలేమీ వర్కౌట్ కాలేదు. ఈ గజిబిజి కథకి ఎడిటింగ్ ఎలా వర్కౌట్ అయిందో ఎడిటర్ కే తెలియాలి.
       
జానపద కథల్లోంచి కథ తీసుకుని మోడరన్ కాలపు కథ చెప్పిన సినిమాలెన్నో వచ్చాయి. ఫాటల్ ఎట్రాక్షన్
, కిల్ లిస్ట్, ఏక్ హసీనా థీ, బుల్ బుల్ వంటివి. స్వగ్ లింగ వివక్ష కథని నేటి కాలంలో స్థాపించి మెసేజి ఇస్తే బాక్సాఫీసు అప్పీల్  బ్లాస్ట్ అయ్యేది.

—సికిందర్

 

Friday, September 27, 2024

1449 : రివ్యూ!

 ఈ స్థాయి బిగ్ బడ్జెట్ పానిండియా మూవీకి కొరవడింది కంటెంటే. దర్శకుడు కొరటాల శివ రైటింగ్ విభాగం ప్రొడక్షన్ విలువలతో పోటీ పడి వుండాల్సింది

రచన- దర్శకత్వం : కొరటాల శివ
తారాగణం : ఎన్టీఆర్, జాహ్నవీ కపూర్, సైఫలీ ఖాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం : ఆర్ రత్నం,ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు ; నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్
విడుదల ; సెప్టెంబర్ 27, 2024
***

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో దేవర పార్ట్ 1 ఈ రోజు అయిదు భాషల్లో పానిండియా మూవీగా రిలీజైంది. ఇందులో ఒక ప్రత్యేకాకర్షణ శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ హీరోయిన్ గా నటించడం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫలీ ఖాన్ విలన్ గా నటించడం. ఇలా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మెగా  మూవీ ఎలా వుందో చూద్దాం...

కథేమిటి?
1996 లో ఈ కథ సింగప్ప (ప్రకాష్ రాజ్) తనని కలిసిన పోలీసు అధికారులకి చెప్తాడు. 1980లలో ఇది ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో రత్నగిరి పర్వతాల్లో  ఎర్రసముద్రం కొండ మీద నాల్గు గ్రామాల కథ. ఇక్కడి ప్రజలు బ్రిటీష్ కాలంలో నౌకలు సంపద తరలించుకుపోకుండా చూస్తూ గొప్ప యోధులుగా పేరు తెచ్చుకుంటారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత తగిన గుర్తింపుకి నోచుకోక నౌకల్ని దోచుకునే పైరేట్స్ గా మారిపోతారు.
        
ఇక్కడ దేవర (ఎన్టీఆర్) ఒక గ్రామానికి అధిపతి అయితే, మరొక గ్రామానికి అధిపతి  భైర (సైఫలీ ఖాన్).  వీళ్ళిద్దరూ అక్రమ ఆయుధాల స్మగ్లర్ మురుగ (మురళీ కృష్ణ) కి  సాయపడుతూ వుంటారు. ఇతను విదేశాలనుంచి నౌకల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్న ఆయుధాలని అపహరించి అందజేస్తూంటారు. అయితే ఈ ఆయుధాలని ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకున్న దేవర, ఈ వృత్తి మానేసి చేపలు పట్టి జీవనం సాగిద్దామంటాడు. దీనికి భైర ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ శత్రువులవుతారు.
        
ఈ శత్రుత్వం ఎక్కడికి దారి తీసింది? దేవరని అడ్డు తొలగించుకోవడానికి భైర ఏం చేశాడు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన భైర లక్ష్యం ఏమిటి? ఇందులో దేవర కొడుగు వార ఎన్టీఆర్ పాత్ర ఏమిటి? ఇతడ్ని ప్రేమిస్తున్న తంగ జాహ్నవీ కపూర్ కోరిక నెరవేరిందా? ఇవీ ప్రశ్నలు. వీటితో మిగతా కథ.

ఎలా తెరకెక్కింది కథ?

సముద్రం బ్యాక్ డ్రాప్ లో పీరియెడ్ కథ ఇది. దీనికి భయం అనే కాన్సెప్ట్ చుట్టూ కథ. బ్రిటీష్ కాలంలో వీరులైన గ్రామస్తులు తర్వాత చోరులుగా మారిన యాక్షన్ కథ. అయితే పరివర్తన చెందే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు చెలరేగే సంఘర్షణ ఒక హై కాన్సెప్ట్ మూవీ స్థాయిలో వుండకపోవడం కొట్టొచ్చే లోపం. పానిండియా లెవెల్లో హై కాన్సెప్ట్ మూవీ తీశారు గానీ, దానికి జోడించిన భయం అనే కాన్సెప్ట్ కి సరైన కథ చేయడం మీద దృష్టి పెట్టలేదు. దీంతో ఇది బ్రహ్మాండమైన యాక్షన్ దృశ్యాలతో విజువల్  హంగామాగా మారింది.  ఆయుధాల కోసం సముద్రం ఎక్కితే చంపేస్తానని ప్రత్యర్ధికి భయం పుట్టించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన దేవర- ప్రత్యర్ధికి కాకపోయినా అజ్ఞాతంలో కనీసం ప్రేక్షకులకి కనిపిస్తూ హడలెత్తించాల్సింది. ఇది జరగకపోవడంతో పాత్ర చిత్రణలు, భావోద్వేగాలూ పూర్తిగా కొరవడ్డాయి. భావోద్వేగాలు లేకపోవడంతో సినిమాలో గుర్తుండిపోయే క్లాసిక్ సీన్ అనేది ఒక్కటీ లేకుండా పోయింది.
        
ఇక సెకండాఫ్ లో వచ్చే ఎన్టీఆర్ కొడుకు వర పాత్ర ఏ లక్ష్యం లేకుండా పాసివ్ గా వుండడంతో, పైగా ప్రత్యర్ధి భైర చేతిలో పావుగా మారడంతో సెకండాఫ్ కథ పూర్తిగా బలహీనపడింది. దేవరకీ, భైరకీ  మధ్య కాన్ఫ్లిక్ట్ ప్రత్యక్షంగా లేకపోవడం, వర పాసివ్ గా వుండడం ఈ రెండూ భయం అనే కాన్సెప్ట్ ని క్యాన్సిల్ చేస్తే, ఇక ఇతర ఆకర్షణలు- యాక్షన్, సాంగ్స్, రోమాన్స్ వంటివి మాత్రమే ఈ సినిమా చూసేందుకు మిగిలాయి.
        
ఫస్టాఫ్ ఎర్ర సముద్రం చరిత్ర, నాలుగు గ్రామాల్లో ప్రజల జీవనం, దేవర- వర పాత్రల స్నేహం, నౌకల మీద వీరిద్దరి దోపిడీ దృశ్యాలు, ఆయుధ పూజకి సంబంధించిన పోరాటాలు, ఆ తర్వాత వృత్తి విషయంలో దేవర- బైరల మధ్య విభేదాలు, శతృత్వం, రక్తపాతం, దీంతో దేవర అజ్ఞాత వాసంలోకి వెళ్ళడం వరుసగా వస్తాయి.
        
సెకండాఫ్ లో తండ్రికి విరుద్ధంగా పిరికి పాత్రలో ఎన్టీఆర్ వరగా, ఎంట్రీ ఇవ్వడం. ఇతడిలో మగాడ్ని చూడాలని వేగిపోయే రసిక పాత్రలో జాహ్నవీ కపూర్ తో ఓ మూడు నాలుగు సన్నివేశాలు, ఓ పాట, దేవరని అజ్ఞాతంలోంచి రప్పించి చంపాలనే భైర ఎత్తుగడలు సాగుతూ క్లైమాక్స్ కి చేరుతుంది కథ. అయితే ముగింపు దేవర, భైర రెండు పాత్రలకీ బ్యాలెన్స్ వుంచి, భాహుబలి టైపులో రెండో భాగం కోసం ఎదురు చూడమన్నారు.

నటనలేమిటిసాంకేతికాలేమిటి?
రెండు పాత్రల్లో ఎన్టీఆర్ డైనమిక్ గా కనిపిస్తాడు. దేవర పాత్రలో సీరియస్ గా, వర పాత్రలో ఫన్నీగా వుంటాడు. అయితే గుండెని పట్టి పిండేసే నటన లేకపోవడానికి పాత్రల్లో ఎమోషన్లు పలకక పోవడం కారణం. మిగతా యాక్షన్, రోమాన్స్, సాంగ్స్ వంటి హంగుల్లో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తాడు.
        
శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ తెలుగులో ఎంట్రీ సెకండాఫ్ లో మాత్రమే మూడు నాల్గు సీన్లతో అడల్ట్ రోమాన్స్ తో తేలిపోయేలా వుంది. బాలీవుడ్ నటుడు సైఫలీ ఖాన్ పాత్ర, నటన అంతంత మాత్రం. ప్రత్యర్ధి ఎన్టీఆర్ అజ్ఞాతంలో వుంటే తను చేయడానికేముంది? హీరో విలన్లు ఎదురెదురుగా కొట్టుకోవాలి. ఈ సినిమా నార్మల్ కమర్షియల్ ఫార్ములాలకి భిన్నంగా వుంది. ఇది వర్కౌట్ కాలేదు.
        
ఇక ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో వంటి పెద్ద టాలెంట్స్ వున్నారుగానీ ఎవరికీ తగిన స్పేస్ లేదు. వీళ్ళు గాక ఇంకా చాలా మంది నటీ నటులున్నారు.
        
సినిమాలో ఎమోషన్స్ లేకపోయినా, సన్నివేశాలు మీరు చూసి తీరాల్సిందే అన్నట్టు అనిరుథ్ రవిచంద్రన్ బీజీఎంతో బాణీలు సృష్టించి అదరగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే పాటల దగ్గర వర్కౌట్ కాలేదు. ఆర్ రత్నం కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సాబు సిరిల్ కల దర్శకత్వం హై క్వాలిటీతో వున్నాయి. యాక్షన్ దృశ్యాలు, నృత్యాలు మంచి ప్రొడక్షన్ విలువలతో వున్నాయి.
        
ఈ స్థాయి బిగ్ బడ్జెట్ పానిండియా మూవీకి కొరవడింది కంటెంటే. దర్శకుడు కొరటాల శివ రైటింగ్ విభాగం ప్రొడక్షన్ విలువలతో పోటీ పడి వుండాల్సింది.

--సికిందర్

 

Saturday, September 14, 2024

1448 : రివ్యూ!

ఈ కథ హత్యల  గురించి కథ కాక, ఈ  రెండు పాత్రల జీవితాల గురించి కథ అయి వుంటే పూర్తి స్థాయి క్రైమ్ కామెడీగా అలరించేది.
రచన- దర్శకత్వం : రీతేష్ రాణా
తారాగణం : శ్రీ సింహా కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా, రోహిణి తదితరులు
ఛాయాగ్రహణం : సురేష్ సారంగం,  ఎఢిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం : కాల భైరవ బ్యానర్: కాల భైరవ, నిర్మాతలు : చిరంజీవి (మైత్రీ చెర్రీ), హేమలత
మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్
***

        స్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నేటి తెలుగు సినిమా ట్రెండ్ గా సాగుతోంది. ఈ ట్రెండ్ లో వారం వారం ఇవి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిలో నిలబడేవి అతి కొన్నే. ఇలా తీస్తున్నవే క్రైమ్ కామెడీలు లేదా సస్పెన్స్ థ్రిల్లర్లు అని పొరబడి కనుమరుగయ్యేవి ఎన్నో. డబ్బు చుట్టూ లేదా హత్య చుట్టూ సాగే ఈ సినిమాలు చాలా వరకూ రొటీన్ గానే వుంటాయి. వీటికి కొత్త సబ్ జానర్లు కనిపెట్టలేక అవే లేజీగా తీస్తూ పోతున్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు సాహిత్యంలో కొత్త సబ్ జానర్ యాంటీ డిటెక్టివ్ కథలు. ఎవిరీ ఒన్ ఇన్ మై ఫ్యామిలీ కిల్డ్ సమ్ ఒన్’, గ్యాంగ్ ఆఫ్ లవర్స్ వంటి నవలలు ఈ సబ్ జానర్ లో పాపులర్ అయ్యాయి. యాంటీ డిటెక్టివ్ సబ్ జానర్ లో డిటెక్టివ్ కథల సాంప్రదాయాల్ని తారుమారు చేసి చూపిస్తారు. ఒక విధంగా ఇవి  ఫన్ పుట్టించేవిగా కూడా వుంటాయి.

    2019లో తెలుగులో మత్తు వదలరా అనే క్రైమ్ కామెడీ వచ్చి  హిట్టయ్యింది. ఇది హత్య చుట్టూ సాగే తెలుగు మార్కు పక్కా క్రైమ్ కామెడీ జానరే. అలాగే దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం విడుదలైన మత్తు వదలరా 2 కూడా క్రైమ్ కామెడీ అంటూ పొరబడి తీశారు. ఇది తేడా కొట్టింది. తేడా కొడితే సినిమా రిస్కులో పడుతుంది. జానర్ మర్యాదలకి కట్టుబడక ఫ్లాపయిన తెలుగు సినిమాలెన్నో వున్నాయి. అలాటి రిస్కులో పడింది మత్తు వదలరా 2 కూడా. ఆ తేడా ఏమిటో తెలుసుకుందాం...

కథేమిటి?
     మత్తు వదలరా లోని డెలివరీ బాయ్స్  బాబూ మోహన్  (శ్రీ సింహా), యేసు దాసు  (సత్య) ఇప్పుడు డబ్బు సంపాదన లేని ఆ జాబ్స్ వదిలేసి హై ఎమెర్జెన్సీ టీం (హీ టీం) లో స్పెషల్ ఏజెంట్స్  గా చేరతారు. ఇక్కడ కిడ్నాప్ కేసులు విజయవంతంగా సాల్వ్ చేస్తూ, పనిలో పనిగా చేతి వాటం చూపిస్తూ వుంటారు. అంటే కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయిన డబ్బులో కొంత కొట్టేస్తూ వుంటారు. డబ్బు కాదు బందీ ప్రాణాలు ముఖ్యమనే హీ టీం చీఫ్ (రోహిణి) మాటలు అవకాశంగా తీసుకుని చెలరేగుతారు. ఈ టీంలో సీనియర్ ఏజెంట్ గా నిధి (ఫరియా అబ్దుల్లా), ఆపరేషన్స్ హెడ్ గా మైకేల్ (సునీల్) వుంటారు.

అయితే ఇక్కడ కూడా చిల్లర మొత్తాలతో తృప్తి పడక పెద్ద మొత్తం లో డబ్బు కొట్టేసి సెటిలై పోవాలని ఆలోచిస్తారు బాబు, యేసులు. దీనికి తగ్గట్టుగానే ఒక రిచ్ లేడీ (ఝాన్సీ) నుంచి కిడ్నాప్ కేసు వస్తుంది. ఈమె కూతురు రియా కిడ్నాప్ కి గురయ్యింది. రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు కిడ్నాపర్స్. హీ టీం కి తెలియకుండా ఈ కేసు చేపట్టి ఆ రెండు కోట్లూ కొట్టేయలని ప్లాను వేస్తారు. అయితే కిడ్నాపయిన రియా శవ రూపంలో మీద పడడంతో  హత్య కేసులో ఇరుక్కుపోతారు.
        
ఎవరీ హత్య కేసులో ఇరికించారు? ఈ హత్యే కాదు, మరో హత్య కూడా ఎవరు చేశారు? వీటితో సినీ స్టార్ రవితేజ (వెన్నెల కిషోర్), తజస్వి తోట (అజయ్) అనే మరో వ్యక్తికేం సంబంధం? అసలు అదృశ్య హస్తం ఎవరిది? ఇదెలా నిరూపించి ఈ హత్య కేసుల్ని బాబు, యేసులు సాల్వ్ చేసి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానమే ఇక్కడ్నుంచీ సాగే మిగతా కథ.

ఎలా తెరకెక్కింది కథ

    ఇది పక్కా క్రైమ్ కామెడీ అనీ, ఇందులో కథ, లాజిక్ చూడొద్దనీ దర్శకుడి విన్నపం. దీనికెలాటి అభ్యంతరమూ వుండనవసరం లేదు. ఒక వీడియో టేప్ కోసం జరిగే అనగనగా ఒక రోజు క్రైమ్ కామెడీ లో కథ స్వల్పమే. ఈ స్వల్ప కథకి చేసిన కామెడీ కథనమే దాన్ని నిలబెట్టింది. అలాగే మత్తువదలరా 2 ఫస్టాఫ్ క్రైమ్ కామెడీ కథకి పూర్తి న్యాయమే  చేసింది. శ్రీ సింహా, సత్యల క్యారక్టరైజేషన్ తో ప్రతీ సన్నివేశం నవ్వించడం కోసమే చేసే యాక్షన్ అడ్వెంచర్స్ ఎంటర్ టైన్ చేస్తాయి. మొదటి అరగంట ఇద్దరూ హీ టీం లో కేసులు చేపట్టి డబ్బులు కొట్టేసే ట్రాకు రిపిటీషన్ గా అనిపిస్తున్నా- అరగంటలోనే కథలోకి వచ్చేసి రియా కిడ్నాప్ కేసుతో కథనాన్ని నిలబెట్టుకున్నారు. ఈ హత్యకేసులో తామే ఇరుక్కున్నలాంటి ఇంటర్వెల్ సీను పరమ రొటీనే. దీంతో సెకండాఫ్ కథ ఏమై వుంటుందో ఇక్కడే తెలిసిపోతుంది. ఈ హత్య కేసులోంచి బయటపడడమే సెకండాఫ్ కథ.
        
ఈ సెకాండాఫ్ కథతోనే వచ్చింది సమస్య. అకస్మాత్తుగా కథనం ఫస్టాఫ్ లోని కామెడీని వదిలేసి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ తో, నేరంతో సంబంధమున్న బయటపడే రకరకాల పాత్రలు చెప్పే వాటి ఫ్లాష్ బ్యాకులతో సీరియస్ అయిపోతుంది. ఈ సీరియస్ నెస్ తో, హత్యల తాలూకు వివిధ వెర్షన్లతో, డీటెయిలింగ్స్ తో మెదడుకి  అతి భారమై పోతుంది కథ.  క్రైమ్ కామెడీ జనర్ మర్యాద పూర్తిగా తప్పి- సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి మారిపోవడమే  కొట్టిన తేడా. దీన్నే సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు.
        
ఇన్ని మలుపు తిరిగి చివరికి అసలు కిల్లర్ తెలిసేటప్పటికి షాక్ వేల్యూ కూడా మిస్సయ్యింది. సెకండాఫ్ ఇన్ని ఇన్వెస్టిగేషన్లు కాదు, కిల్లర్ తాలూకు ఒకే ఒక్క ఆధారం పట్టుకుని దాంతో ప్రాణాల మీదికి తెచ్చుకునే శ్రీ సింహా, సత్యాల కామెడీ పాత్రలతో నవ్వులు ఏడ్పులు చూపిస్తూ – దీనికంటే డెలివరీ బాయ్స్ జీవితమే బెటర్ అనుకునే స్థాయికి చేరుకునే ఫన్ సృష్టించి వుంటే సమస్య వుండేది కాదు. ఈ కథ హత్యల కథ గురించి కాక, ఈ పాత్రల జీవితాల గురించి కథ అయి వుంటే పూర్తి స్థాయి క్రైమ్ కామెడీగా అలరించేది.

నటనలేమిటి? సాంకేతికాలేమిటి?

    నిస్సందేహంగా ఇది కమెడియన్ సత్య మూవీ. అతను లేకపోతే ఈ మూవీ లేదు. సెకండాఫ్ అనే కీకారణ్యంలో అక్కడక్కడా అతను చేసే కామెడీయే వూరట. అతడి టైమింగ్, ఒన్ లైనర్లు, ట్రెండీ డైలాగులు; అతడి బాడీ లాంగ్వేజి, ఎక్స్ ప్రెషన్స్ ఈ పాత్రతో అతడి కమెడియన్ కెరీర్ ని ఎక్కడికో తీసికెళ్లిపోయాయి. సత్య కోసం ఈ సినిమా చూడాలి.
        
అలాగే హీరో శ్రీ సింహా పాత్రకి తగ్గ నటనతో మరోసారి నిలబడ్డాడు. పాత్రలో స్పీడు, కొన్ని యాక్షన్ సీన్లు కలిసి వచ్చాయి. ఈ కథలో ఎమోషన్లకి స్థానం లేదు కాబట్టి పాత్ర కాస్త ఫ్లాట్ గానూ కనబడుతుంది. ఈ కథ ఈ రెండు పాత్రల గురించి కథ అయివుంటే ఈ లోపం తీరిపోయేది.
        
ఫరియా అబ్దుల్లాది పూర్తిగా యాక్షన్ పాత్ర. రోమాన్సుకి, యూత్ అప్పీల్ కీ పెద్దగా స్థానం లేదు. అలాగే హీ టీం చీఫ్ గా రోహిణీ పెద్దగా రాణించలేదు. ఇంకో హెడ్ గా సునీల్ ది ఎక్కువ మాట్లాడని పూర్తిగా సీరియస్ పాత్ర. నెగెటివ్ పాత్రలో అజయ్ ఫర్వాలేదు. అయితే సినీస్టార్ గా వెన్నెల కిషోర్ మాత్రం సత్యాతో బాటు సినిమాని కాస్త నిలబెట్టేందుకు పనికొచ్చాడు. ఇది అతడికి వినూత్న పాత్ర, వినూత్న కామెడీ కూడా.
        
సాంకేతికాల విషయానికొస్తే దర్శకుడు రీతేష్ రాణా పాక్షికంగా ఫస్టాఫ్ తో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో కథ చూడొద్దని చెప్తూనే, సెకండాఫ్ లో మెదడుకి బోలెడు పరీక్ష పెట్టె ఇన్వెస్టిగేవిటివ్ జానర్ కథలోకి వెళ్లిపోయాడు. పదేపదే మారిపోయే  ఆ క్లూలు, సాక్ష్యాలు కూడేసి విషయం తెలుసుకోవాలంటే ఇంటలిజెంట్ ప్రేక్షకులై వుండాలి. ఇది ఇలాటి ఇంటలిజెంట్ కథనాన్ని డిమాండ్ చేసే కథ కాదు. కథతో అవసరం లేని టాలెంట్ తో నష్టమే జరుగుతుంది.
        
పోతే ఇంకో ఇద్దరు హీరోలున్నారు. కెమెరా మాన్ సురేష్ సారంగం, సంగీత దర్శకుడు కాలభైరవ. ఇద్దరూ తేలిపోయే సన్నివేశాల్ని కూడా తమ ప్రభితతో నిలబెట్టారు. అలాగే దర్శకుడి ట్రెండీ టేకింగ్  కి తగ్గట్టు కార్తీకా శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా వుంది.
        
మొత్తానికి ఈ మూవీ సత్య మాస్ కామెడీ చేష్టల గురించి, మరికాస్త వెన్నెల కిషోర్ ట్రెండీ కామెడీ గురించీ చూస్తే సరిపోతుంది.

—సికిందర్

 

 

 


 

Monday, August 12, 2024

1447 : స్క్రీన్ ప్లే సంగతులు



        మెరికన్ రచయిత్రి డోన్నా టార్ట్ పదేళ్ళకో నవల రాస్తుంది. ఒక్కో నవల పదేళ్ళ పాటూ రాస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంత టైం తీసుకుని రాస్తుంది. సాహిత్యాన్ని రూపొందించాలంటే చాలా ఓపిక, పరిపూర్ణత అవసరమని భావిస్తుంది.  స్పైరల్-బౌండ్ నోట్‌బుక్స్ లో సాదా బాల్‌పాయింట్ పెన్నులతో చేతితో రాయడానికే ఇష్టపడుతుంది. ఇది ప్రతీ వాక్యం గురించీ నెమ్మదిగా, లోతుగా ఆలోచించడానికి  అవకాశం కల్పిస్తుంది. ఎరుపు, నీలం, ఆపై ఆకుపచ్చ బాల్ పాయింట్ పెన్నుల్ని ఉపయోగించి సులభంగా చదవడానికి, ఏ మార్పు చేర్పులు ఎక్కడ జరిగాయో ట్రాక్ చేయడానికీ  వీలుగా రాస్తుంది. అవసరమైనప్పుడు నోట్‌బుక్స్ పేజీల్లో ఇండెక్స్ కార్డుల్ని కూడా చేరుస్తుంది.  క్వాలిటీ కంటే క్వాంటీటీ ప్రధానమైన నెట్ యుగంలో, అదీ వేగవంతమైన పని విధానాన్ని డిమాండ్ చేస్తున్న కాలంలో, ఆమె ఈ మూడు దశాబ్దాల్లో మూడు నవలలు మాత్రమే రాసింది. ఒక్కో నవల చరిత్రలో నిలిచిపోయేలా.

            ది సీక్రెట్ హిస్టరీ (1992), ది లిటిల్ ఫ్రెండ్ (2002), గోల్డ్ ఫించ్ (2013) ఆమె రాసిన మూడు నవలలు. ది సీక్రెట్ హిస్టరీ లో ఒక హత్య కేసులో చిక్కుకున్న కాలేజీ స్టూడెంట్స్ గురించి కథ. దీన్లోని క్లిష్టమైన కథ, పాత్రల మానసిక అంతర్దృష్టృలూ, కథనపు అంతర్లీన ఇతివృత్తాలూ సృష్టించడానికీ, పాత్రల్ని అభివృద్ధి చేయడానికీ రీసెర్చితో సంవత్సరాల తరబడి గడిపింది. ఒక నమ్మదగ్గ, పాఠకులు లీనమయ్యే ప్రపంచాన్ని సృష్టించడానికి శాస్త్రీయ అధ్యయనాలూ, చారిత్రక గ్రంథాల  పరిశీలనలూ భారీ యెత్తున చేసింది. నవల ఉన్నత ప్రమాణాలకి చేరుకోవడానికి చాప్టర్లు పదేపదే తిరగ రాసింది. రాసిన ప్రతీ పదం ఒక ప్రయోజనాన్ని, మొత్తం కథనానికి వొక అర్ధాన్నీ కల్పించేలా రాసుకొచ్చింది...
       
సాహిత్యకారులు సినిమాలు చూడనవసరం లేదేమోగానీ
, సినిమా రచయితలు సాహిత్యాన్ని చదవాల్సిందే. ఇది చవకబారు సినిమాలు తీయకుండా కాపాడుతుంది. కథ కోసం సినిమాలు చూసి సినిమాలు తీస్తే డెప్త్ రాదు. దాంతో తమ కథ లోతుపాతులు తమకే తెలియక పైపైన రాసేసి పైపైన తీసేయడమే జరుగుతుంది. నవలల్ని గానీ, కథానికల్ని గానీ చదవడం వృత్తిలో భాగంగా చేసుకుంటే, కథల  లోతుపాతులు తెలుస్తాయి. ఆ కథ రాయడంలోని సృజనాత్మకత తెలుస్తుంది. విజువలైజ్ చేసుకోవడం అబ్బుతుంది.
       
ఎలాగంటే నవల్లో/కథానికలో చదివే సన్నివేశాలు
, వర్ణనలు, పాత్ర చిత్రణలు తీసుకుని మన మెదడు విజువలైజ్ చేసుకుంటూ పోతుంది. సినిమాలు చూస్తే ఈ అభ్యాసం అబ్బదు. చదివి వూహించిన దాన్నే మెదడు విజువలైజ్ చేస్తుంది (నిత్యజీవితంలో వూహించుకునేవి కూడా విజువలైజ్ చేసుకుంటుంది)- ఈ విజువల్స్ మెదడులో భాగమైన రెటీక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ ఏ ఎస్) లో రికార్డయి పోతాయి.
       
ఈ ప్రక్రియ సమగ్ర
, పరిపక్వ కల్పనా శక్తిని పెంచుతుంది. రచయితలు కథ కోసం సినిమాలు చూస్తే ఉన్న వూహా శక్తి కూడా పోతుంది మెదడుకి అభ్యాసం లేక. సాంకేతికాల కోసమో, అర్ధమైతే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కోసమో సినిమాలు చూడొచ్చు,
సినిమాలో చూసే ఏ దృశ్యమూ మెదడులోని ఆర్ ఏ ఎస్ తీసుకోదు. నిత్య జీవితంలో చూసే ఏ దృశ్యమూ తీసుకోదు. అవి జ్ఞాపకాలుగా వుండిపోతాయి. వూహించుకున్న దృశ్యాల్ని మాత్రమే  ఆర్ ఏ ఎస్ తీసుకుని సబ్ కాన్షస్ మైండ్ కి అందిస్తుంది. దీంతో సబ్ కాన్షస్ మైండ్ బలమైన కల్పనా శక్తిని డెవలప్ చేసి కాన్షస్ మైండ్ కి అందిస్తుంది. అప్పుడు కాస్త బాగా రాయగల్గుతాం.
       
ఇంకా బాగా రాయాలంటే పాషన్ ని కల్పించుకోవాలి. ఈ పాషన్ అనేది మెదడులో పుట్టదు. హృదయంలో పుడుతుంది. హృదయంలో పుట్టిన పాషన్ పాగస్ నెర్వ్ ద్వారా మెదడుకి చేరి జీవమున్న కథల్ని సృష్టిస్తుంది. హృదయంలో పాషన్ ఎలా పుడుతుంది
? చేతిలో వున్న విషయం పట్ల హృదయంలో అపారమైన ప్రేమ పుట్టించుకునప్పుడు మాత్రమే పుడుతుంది. హృదయం ప్రేమించని, హృదయం అనుమతించని  ఏ పనీ మెదడులో జీవమున్న కార్యాన్ని సృష్టించదు. లోతు పాతుల్లేకుండా పైపైన రాసేసి పైపైన తీసేసే సినిమాలన్నీ కేవలం కాన్షస్ మైండ్ తో ఆలోచించి తీసేవే- సబ్ కాన్షస్ మైండ్ తో పని పెట్టుకోకుండా. ఈ మధ్య మూడు నాలుగు కథలు విన్నప్పుడు జరిగిందిదే - కేవలం కాన్షస్ మైండ్ లోంచి వచ్చిన డెప్త్ లేని కథలవి!
        
హాలీవుడ్ లో స్క్రీన్‌ప్లేల్ని (అన్నీకాదు) సాహిత్య రూపంగా పరిగణిస్తారు. ఆ స్క్రీన్ ప్లేలు సీన్ నెంబర్లు కూడా వేయకుండా నవలా రూపంలా వుంటాయి. అందుకని చదివేటప్పుడు ఆ నిర్మాతని లేదా, స్టూడియో ఎగ్జిక్యూటివ్ ని సినిమా చూస్తున్న అనుభవానికి లోనుజేస్తాయి. ఎందుకంటే చదువుతున్నది నవలా పాఠంలా విజువలైజ్ అవుతూ వుంటుంది కాబట్టి. జేమ్స్ మొనాకో హౌ టు రీడ్ ఏ ఫిల్మ్ అనే ప్రసిద్ధ పుస్తకం రాశాడు. అంటే సినిమాని చదవడమెలా అని. సినిమాలో కళ వున్నప్పుడే ఆ సినిమాని చూడడం గాక చదవడం చేస్తాం. ఇలాటి సినిమాలు కొన్నే వుంటాయి. ఇది విజువల్ నేరేషన్ కి సంబంధించిన ప్రక్రియ, లేదా టెక్నిక్. ప్రతి ప్రేములో, సన్నివేశంలో, సీక్వెన్స్ లో దాగి వున్న లోతైన భావార్ధాల్ని  గ్రహిస్తూ, ఆ క్లిష్టమైన సినిమా భాషని డీకోడ్ చేసుకుంటూ పోవడం సినిమాని చూడడం గాక, సినిమాని చదవడమనే కొత్త అనుభవానికి లోనుజేస్తుంది.
         
ఈ పనే
మహారాజా చేసింది. ఈ పనితో బాటు పైన చెప్పుకొచ్చిందంతా పూర్తి చే సింది. దాని డెప్త్,
క్లిష్టమైన కథ, పాత్రల మానసిక అంతర్దృష్టృలూ, కథనపు అంతర్లీన ఇతివృత్తాలూ, ఒక నమ్మదగ్గ, ప్రేక్షకుల్ని లీనంజేసే కథా ప్రపంచపు సృష్టీ, పాగస్ నెర్వ్ ద్వారా హృదయమందించిన ఫాషన్ తో సబ్ కాన్షస్ మైండ్ కల్పన చేసిన సమగ్ర, పరిపక్వ కల్పనా, డస్ట్ బిన్, నాగు పాము, నకిలీ బంగారం వంటి ప్లాట్ డివైసులతో కల్పించిన సినిమా భాషా వగైరా.
       
పొరపాట్లు లేకపోలేదు
, పాత్రచిత్రణని దెబ్బతీసే పొరపాట్లు కూడా వున్నాయి. ఇంకా ఈ నాన్ లీనియర్ కథకి ఒకే గత కాలానికి సంబంధించినవి గాకుండా, వివిధ కాలాలకి సంబంధించిన మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకుల వల్ల ఏర్పడిన తికమక. ఉదాహరణకి సెకండాఫ్ లో వచ్చే ఒక కీలక దృశ్యం కొనసాగింపు సీను, ఫస్టాఫ్ లో ప్రారంభ సీనుగా వుండడం!
       
దీనివల్ల ఈ స్క్రీన్ ప్లే సంగతులు రాయడం దాదాపు డోన్నా టార్ట్ నవలలు రాసేంత పనిగా మారింది! కాకపోతే పదేళ్ళు పట్టలేదు. ముందుగా ఈ ఆర్టికల్ రెండో భాగంలో లీనియర్ కథగా మార్చి చెప్పుకున్న కథనానికి
, నాన్ లీనియర్ కథనమెలా వుందో చూద్దాం. ఇందులో రెడ్ మార్క్ చేసిన నెంబర్లు సింబాలిజమ్స్, ప్లాట్ డివైసులు. లేదా ట్రాన్సిషన్ టూల్స్ గా వుంటాయి. వీటి గురించి చివర్లో చెప్పుకుందాం...

(రేపు మూడవ భాగం)
-సికిందర్